close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆలంబన

ఆలంబన
- వలివేటి నాగచంద్రావతి

గేటుకి వేసిన బోల్టు తప్పించి తలుపులు తెరుచుకుని లోపలికి వెళ్ళాను. పెద్ద డాబా ఇల్లది. చుట్టూ విశాలమైన ఆవరణ. అక్కడక్కడా నందివర్ధనం నూరువరహాల్లాంటి పూలగుబుర్లు. ప్రహరీగోడ పక్కనే నిండా కాయలతో ఓ జామచెట్టు, కాయల్లేని కొబ్బరిచెట్టొకటీ.

సింహద్వారం ముందున్న వరండా మెట్లెక్కాను. తలుపులు మూసున్నాయ్‌. ‘తడుదునా’ అనుకోబోయేంతలో నా ప్రమేయం లేకుండానే తలుపులు తెరుచుకున్నాయ్‌. తెరుచుకోవటంతోపాటు ‘‘ఎవరూ?’’ అన్న గద్దింపు. గద్దింపుతోపాటు గుమ్మంలో ప్రత్యక్షమైన ఓ వయసు మళ్ళుతోన్న పూర్వసువాసిని.

స్టన్నయ్యాను. పొద్దు వాలుతోన్న అపురూప సౌందర్యం. యవ్వనంలో గొప్ప అందగత్తె అయి ఉండాలి.

‘‘ఎవర్నువ్వు? ఏం కావాలి?’’ శూలాలు విసుర్తున్నట్టు దూసుకొచ్చాయి ప్రశ్నలు నామీదికి.

‘అబ్బ! గొంతులో అంత కటువుతనం అవసరమా?’ ‘‘నమస్కారం’’ మర్యాదగా చేతులు జోడించాను. ‘‘ఈ పక్క గాంధీ హైస్కూలులో టీచరు పోస్టింగిచ్చారండీ నాకు. మీ ఇల్లు స్కూలుకు దగ్గర్లో ఉంది- అద్దెకు గదేమయినా ఇస్తారేమో అడుగుదామని వచ్చానండీ’’ పరిచయాన్నీ అవసరాన్నీ వినమ్రంగా విన్నవించాన్నేను.

‘‘అస్సలివ్వను. నా ఇంట్లో గది అద్దెకిస్తానని ఏ దరిద్రప్పీనుగ చెప్పింది నీకు? చెప్పు... పాతేసి ఉప్పు పాతర వేస్తాను వెధవల్ని. నేనంటే ఆటయిపోయింది వెధవలకి’’ అరిచేస్తోందావిడ- ఎవరో చాటుగా ఉండి నన్ను లోపలికి పంపించినట్టు.

దడుచుకున్నాను. ‘ఆకారానికీ స్వభావానికీ పోలికే లేనట్టుందే.’ మరింకే అవకాశాన్నీ నాకివ్వకుండా ధడాలున తలుపులు కూడా మూసేసుకున్నదావిడ ‘‘గేటు తలుపు బోల్టు వేసి వెళ్ళు’’ అని ఆజ్ఞాపిస్తూ.

వెనక్కి తిరగబోతూ నిట్టూర్చాను. అది పులిపంజా నుంచి తప్పించుకున్నాననిపిస్తున్నందుకో, గది దొరకని ఆశాభంగానికో తెలీదు.

గేటువైపు నడవబోతూ చెవులకు అలికిడి తగిలి మెడ అటుగా తిప్పాను. కుడివైపు ప్రహరీ పక్కనున్న జామచెట్టు మీద ఇద్దరు పిల్లలు చప్పుడు కాకుండా కాయలు తెంపి బయటకు విసుర్తున్నారు. రోడ్డుమీంచి ఇంకొన్ని పిల్లల కంఠాలు గుసగుసగా ‘‘అదిగో, ఆ కొమ్మ గుబుర్లో పండు కాయుంది. ఇదిగో నీ కాలు పక్క పంగలో కాయ దోరగా ఉంది చూడు’’ అంటూ వీళ్ళకి సలహాలూ సూచనలూ ఇస్తున్నారు.

టీచర్ని నేను. ఎలాంటి సమయమైతేనేమీ అల్లరినీ, ఆకతాయితనాన్నీ సహించగలనా. శబ్దం కాకుండా అటు నడిచాను. నన్ను చూసి గోడమీదికి దూకి పారిపోవాలని చూస్తున్న ఆ పిల్లగాళ్ళ కాలరొకటీ చెయ్యొకటీ ఒడుపుగా దొరకబుచ్చుకుని జాగ్రత్తగా కిందికి దింపాను. బయట నుంచున్న పిల్లలు కాళ్ళకి బుద్ధి చెప్పే ఉంటారు.

ఇక అలవాటైన నా ధోరణిలో బిత్తరిచూపులు చూస్తున్న వాళ్ళిద్దరికీ పాఠం మొదలుపెట్టాను. ‘‘ఏమిటర్రా, మీరు చేస్తున్న పనీ. తప్పు కాదూ, చదువుకుంటున్న పిల్లలేనా మీరు? మీక్కావాలంటే ఆంటీనడిగి కోసుకోవాలిగానీ ఇలా గోడలు దూకొచ్చా?’’ అన్నాను మందలింపుగా.

పన్నెండో పద్నాలుగో ఏళ్ళుంటాయి వాళ్ళకి. స్టూడెంటు పిల్లలకిమల్లే యూనిఫాంలో ఉన్నారు. ‘‘ఆ ముసలమ్మ రాక్షసండీ, అడిగినా కోసుకోనివ్వదు. కొడుతుంది కూడా’’ భయంభయంగా అన్నాడొకడు.

‘‘తప్పు. పెద్దవాళ్ళనలా అమర్యాదగా మాట్లాడొచ్చా? ఆవిడ చెట్టు, ఆవిడ ఇష్టం. మంచిగా అడగాలి. ఒప్పించి కోసుకోవాలి. అంతేగానీ, ఇదికాదు పద్ధతి. ఆంటీకి సారీ చెప్పండి, వెళ్ళండి’’ బలవంతంగా నడిపించబోయాను.

ఓహ్‌ ఏదో అయింది. ఒక్క గుంజుతో నా చేతులు విడిపించుకుని ఒక్క పరుగున గేటు దాటేశారా పిల్లపిడుగులు. చేసేదేముంది, నేనూ అటే అడుగులు వేశాను.

‘‘ఒక్క గది సరిపోతుందా నీకు?’’

ఉలికిపాటుగా వెనక్కి తిరిగాను. వరండాలో నిలబడుందా వృద్ధ క్లియోపాత్రా.

***

కాస్త వెనకా ముందాడాను గానీ, గది చూశాక వద్దనాలనిపించలేదు. గది విశాలంగా ఉంది. దక్షిణం వైపు కిటికీలు. నీళ్ళ కొరత లేదు. బాత్‌రూమ్‌ నీట్‌గా ఉంది. అంతా బానే ఉందిగానీ అదేమిటో సుందరమ్మగారింట్లో అద్దెకి దిగానంటేనే స్కూల్లోనూ వూర్లోనూ అంతా ‘ఎంత ధైర్యం’ అంటూ ముక్కున వేలేసుకోవటమే! ఎందుకలాగ?

కొంచెం కోపిష్టి మనిషిలా ఉంది, అందుకా?

‘‘అర్థమవుతుందిలేమ్మా, నాల్రోజులాగు’’ అంది పాలబూత్‌ నడిపే తాయారమ్మ.

‘‘మనుషులంటే పగ ఆవిడకి’’ మా స్కూల్‌ వాచ్‌మేన్‌ రంగయ్య అభిప్రాయం.

‘‘ఆవిడ నోరుందే అది చాలా పవర్‌ఫుల్‌. శాపనార్థాలు మొదలుపెట్టిందంటే సహస్రం దాటాల్సిందే’’ నా కొలీగ్‌ అనుభవాలు.

కాస్త బెరుకనిపించింది కానీ, ‘చూద్దాం నా మీద ప్రసన్నత ఎన్నాళ్ళుంటుందో అన్నాళ్ళే ఉందాం. ముందే పారిపోవటం ఎందుకు?’ అంది నా మొండితనం.

ఒక్కోరోజూ గడిచేకొద్దీ నాకవగతమవుతోంది- అందరూ అన్నట్టు సుందరమ్మగారి ప్రకృతిలో విపరీతమేదో ఉందని. విద్యా సంవత్సరం మొదటి రోజులు. ఉదయం పనట్టే ఉండేది కాదు. తోచక సుందరమ్మగారిని గమనిస్తూ ఉండేదాన్ని. సైకాలజీ నాకిష్టమైన సబ్జెక్టు.

పొద్దున్నే లేవటం ఆలస్యం... పాల ప్యాకెట్‌ తెచ్చే అమ్మాయితో తగాదా మొదలు- ఆలస్యమైందనో, లేకపోతే చీకట్నే వచ్చి నిద్ర పాడుచేసిందనో. కూరలమ్మి సరేసరి- రోజూ జగడమే. గమ్మత్తేమిటంటే కోప్పడ్డానికి ఆవిడకి మనుషులే అక్కర్లేదు - బాదం చెట్టు మీద గోలచేసే కాకులు, కిటికీ రెక్కల మీద వాలి కిచకిచమంటూ సందడి చేసే పిచ్చుకలు... దండెంమీద బట్టలు ఎగరగొట్టే హోరుగాలి... అన్నీ ఆవిడ ఆగ్రహానికి ఆజ్యం పోసేవే.

ఎందుకావిడకి లోకమంటే అంత కసి, ద్వేషం? ఈ సందేహానికి అనుకోకుండా సమాధానం దొరికింది.

ఆరోజు పొద్దున్నే నా గదికి వచ్చింది పాలమ్మాయి ‘‘ఎన్ని కేకలేసినా లెగట్లేదా అమ్మగారు, ఏమిటో కనుక్కోండి టీచరమ్మా’’ అని కంగారుగా అంటూ.

నేను వెళ్ళి తలుపుతట్టి చూశాను. ఉహూ. సుందరమ్మగారి పడగ్గదికీ నా గదికీ మధ్యనున్న తలుపు గడియ బలంగా లేకపోవటం మంచిదయింది. గట్టిగా తోస్తే విరిగిపడింది. లోపలికి వెళ్ళాం.

సుందరమ్మగారు పేలిపోయే జ్వరంతో ఒళ్ళు తెలీకుండా మూలుగుతోంది. పాపం, మొహం తుడిచి, కాఫీ తాగించాక కళ్ళు విప్పింది కాస్త.

ఆస్పత్రికి వెళదాం అంటే- తల అడ్డంగా వూపింది. మరేం చేయను? నా దగ్గరున్న ట్యాబ్‌లెట్‌ ఏదోవేసి జావ కాచి పట్టించాను. ఆరోజు స్కూలుకి సెలవుపెట్టి ఆవిడ దగ్గరే ఉండిపోయాను. మూసిన కన్ను తెరవట్లేదావిడ. పగలు గడిచింది. సుందరమ్మగారికలాగే ఉంది. పాలమ్మాయిని సాయం ఉండమంటే ‘‘చంటిబిడ్డ ఉన్నదమ్మా, మా ఆయన వూరుకోడు’’ అంది.

నాకా రాత్రి ఎంత భయంకరంగా గడిచిందో చెప్పలేను. సుందరమ్మగారు జ్వర తీవ్రతలో ఒకటే కలవరింతలు. ‘జ్యోతీ, నన్ను వదిలి వెళ్ళకమ్మా’ అని ఏడుస్తుందోసారి. ‘నన్ను ముట్టుకోకండి’ అరుస్తుందోసారి. గుండెలు కరిగేలా కుములుతుందింకోసారి.

పండుటాకులా పడున్న ఆమెపట్ల జాలితో సానుభూతితో మనసు కరిగిపోయింది నాకు. ‘పాపం, పైకి పెద్దపులిలా గర్జిస్తుంది కానీ గతంలో ఎన్ని కష్టాలనుభవించిందో!’

ఎలాగో తెల్లవారింది. నేను నా గదికొచ్చి కాఫీ పెడుతున్నాను. సుందరమ్మగారి గదిలోంచి ఎవరిదో కొత్త గొంతు. ఎవరు చెప్మా, బంధువులా స్నేహితులా? ఎవరైతేనేమి ఇంకొకరున్నారంటేనే తేలిగ్గా అనిపించింది నాకు. బరువు దించుకుందామని కాదు, పంచుకుందామని.

ఇంకో కప్పు కాఫీ కలిపి తీసుకువెళ్ళాను. సుందరమ్మగారి మంచానికి కాస్త దగ్గరగా నిలబడి ఉన్నారాయన. మా తాతగారి వయసుంటుంది. చూడంగానే గౌరవం కలిగేలా ఉన్నారు.

నేనిచ్చిన కాఫీ కప్పందుకుంటూ ‘‘నా పేరు నందగోపాలమ్మా. ఆయుర్వేద వైద్యుణ్ణి. సుందరి శరీరతత్వం నాకు తెలుసు. మందిచ్చిపోదామని వచ్చాను’’ అన్నారాయన సాదాగా.

‘సుందరి!’ నా లోలోపల ఎంత ఆశ్చర్యమో!

‘‘నీకు పేపరు వేసే కుర్రాడు చెప్పాట్ట- నాకు బాగాలేదని’’ నీరసంగా అంటోంది సుందరమ్మగారు- నాక్కలగబోయే సందేహానికి సమాధానంగా.

ఆయన నా చేతికి కొన్ని కాయితం పొట్లాలిచ్చారు. ఎలా వాడాలో చెప్పారు. నా దగ్గర సెల్‌ ఉందేమో కనుక్కున్నారు. తన నంబరు రాసిచ్చారు ‘‘సాయంత్రానికల్లా తగ్గిపోతుంది. తగ్గకపోతే నాకు ఫోను చేయి’’ అని చెప్పి వెళ్ళిపోయారాయన.

కాకితో కబురందగానే రెక్కలు కట్టుకు వాలే అనుబంధం. శరీరతత్వం తెలిసినంత దగ్గరితనం అయినా, అంత ఉదాసీనం... ఎవరాయన, ఏమవుతారు?- ఎన్ని ప్రశ్నలో. కానీ, సుందరమ్మగారిని అడిగే తాహతా నాకు?

***

ఆరోజు సోమవారం. సుందరమ్మగారు యథాస్థితికి వచ్చేశారు. ఆవిడ సంగతేమోగానీ ఇరవైనాలుగ్గంటలూ నేనుపడ్డ టెన్షన్‌ నుంచి రిలీజ్‌ చేసి సుఖాంతంగా ముగించినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలనిపించింది.

ఆ సాయంత్రం శివాలయానికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకు వస్తూండగా మండపం మెట్లమీద కూర్చుని కనిపించారు నందగోపాలుగారు.

దగ్గరగా వెళ్ళి నమస్కరించాను. ‘‘సుందరమ్మగారి జ్వరం తగ్గిపోయిందండీ’’ అన్నాను నేను కూర్చుంటూ.

‘‘నీ దగ్గర్నుంచి ఫోన్‌ రాకపోతే అదే అనుకున్నాను’’ అన్నారాయన చిరునవ్వుతో.

‘‘మొన్నరాత్రి ఆవిడ పరిస్థితికి చాలా గాభరాపడ్డాను. ఈ సంగతి చుట్టుపక్కలవాళ్ళకి చెప్పినా ఒక్కరూ తొంగిచూడలేదు.’’

‘‘వూ’’ నేను సంభాషణ తెంపలేదు, పొడిగించాను. ‘‘సుందరిగారి గురించి శ్రద్ధ తీసుకున్నది మీరొక్కరే డాక్టరుగారూ. మీకామె చాలా కాలంగా తెలుసుననుకుంటాను. అన్యధా భావించనంటే ఒక్క మాట అడుగుతాను. ఎందుకావిడ ప్రతివాళ్ళూ తన ప్రత్యర్థులేనన్నట్టు పోరాటానికి సిద్ధమవుతుంది? ఎందుకంత అశాంతిగా అసహనంగా కనిపిస్తుంది?’’ అని.

నాకేసి దీర్ఘంగా చూశారాయన. ‘‘ప్రతి కన్నీటిచుక్క వెనకా భరించలేని బాధా, విపరీతమైన మానసిక క్షోభా ఉంటాయ్‌. చేతికానితనంతో వచ్చే ఆగ్రహం వెనుక కర్కశమైన అణచివేత, తీవ్ర ఆశాభంగం ఉంటాయ్‌- ఇది నా ఉద్దేశ్యం. వీటన్నిటికీ గురి అయిన నిర్భాగ్యురాలు సుందరి.

పొద్దు వాటారుతూ చీకట్లు మిగిలిస్తున్న సంధ్యాసమయం. గుడి అంతటా నూనె దీపాల వెలుగులు. ఆధ్యాత్మికతతో కూడిన వైరాగ్యాన్ని తలపిస్తూ సన్నగా వినవస్తున్న మంత్రోచ్ఛాటన. వీటిమధ్య వినిపించారాయన జీవితం వంచించిన ఓ అబల కథ...ఇప్పటి సుందరమ్మ ఒకనాటి సుందరి. సువర్ణసుందరి. నిజంగానే బంగారుబొమ్మ. ‘శాపవశాత్తూ నా కడుపున పుట్టిందీ దేవకన్య’- అని మురిసిపోయేది తల్లి. ‘పోటీలకు వెళ్ళని ప్రపంచ సుందరివి నువ్వు’- అని పొగిడేవాళ్ళు స్నేహితురాళ్ళు.

అంతటి అందాలభరిణకి ఆయుర్వేదం నేర్చుకున్న ఏ పక్కింటి సామాన్యమైన కుర్రాడో- ‘ప్రేమిస్తున్నాను. గుండెల్లో పెట్టుకుంటాను’ అంటే మాత్రం, ‘సరే’ననే ఖర్మేమిటి? ఏ ఆధునిక రాకుమారుడో, పంచకల్యాణి లాంటి అందమైన కారెక్కి వచ్చి తనని చేపడతాడని కలలు కనటంలో తప్పేమిటి?ఆ అద్భుతమైన అవకాశం ఓరోజు రానేవచ్చింది. ఆ ప్రాంతంలో ఇండస్ట్రీ స్థాపించిన ఓ పారిశ్రామికవేత్త నుంచి ఓ ఆఫరు - ‘మా కుమారుడికి మీ కుమార్తెనివ్వటం మీకంగీకారమైతే ఫలాన రోజున నిశ్చితార్థానికి తరలి రాగలమని.’

వారి దగ్గరే పనిచేస్తున్న ఓ గుమాస్తా సుందరి తండ్రి. ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అదృష్టం గుమ్మం దగ్గరకొస్తే కాదనటమా... ఎంత మాట. సుందరి నొసలు పైకెగిరేయి ‘ఇదీ, నా విలువ’ అన్నట్టు.

నిశ్చితార్థం వేళదాకా ఆ గర్వమలాగే నిలిచిపోయింది కూడా. ఉంగరం తొడగబోయేముందు చూసింది పెళ్ళికొడుకుని- ‘ఇతనా, తనక్కాబోయే వరుడు? నల్లగా, లావుగా మూడొంతులు వెనక్కిపోయిన జుట్టుతో, ముందుకొస్తున్న బొజ్జతో... తల్లీ తండ్రీ పెళ్ళిచూపుల మాట ఎత్తనీయకుండా దాటవేసింది ఇందుకా - ?’ మూర్ఛపోయింది సుందరి.

ఏం లాభం, సమయం మించిపోయింది. ఎవరూ ఆ అమ్మాయి గోడు వినిపించుకోలేదు. కాదంటే నూతిలో దూకుతానన్నది తల్లి. విషం తాగుతానన్నాడు తండ్రి. సగటు ఆడపిల్ల సుందరి. పెళ్ళయిపోయింది.

నరకం మొదలైంది. వికారంగా ఉన్నా అహంకారానికి తక్కువలేదు భర్తకి. తిరస్కారంగా జవాబిచ్చేది సుందరి. శాడిస్టయ్యేవాడు భర్త. ఆ పామూ ముంగిసల కాపురం కూడా ఎన్నాళ్ళొ సాగలేదు. జ్యోతి పుట్టిన మూణ్ణెల్లకే కారు యాక్సిడెంటులో పోయాడతను. సామరస్యంగా మెలగని సుందరికి స్వల్పంగా భరణం ఇచ్చి ఇంట్లోంచి పంపేశారు భర్త తరఫువారు.

తేలిగ్గా గాలి పీల్చుకుంది సుందరి. భర్త లేకపోవటం విషాదమనిపించలేదు. పుట్టింటివాళ్ళని కూడా దగ్గరికి రానివ్వలేదు. ‘నా కూతురు చాలు నాకు, మరెవరూ అక్కర్లేదు’ అనేది మొండిగా.

తన చిన్ననాటి చిత్తరువులా ఉన్న కూతురంటే ప్రాణం సుందరికి. ఆ బిడ్డని చూసుకుంటూ గడిచిన కాలంలోని చేదుని మరిచిపోయి బతుకుమీద మళ్ళీ ఆశలు పెంచుకుంది. కూతురే లోకంగా బతకటం మొదలుపెట్టింది.

ఒక్కోసారి మితిమీరిన తీపి వెగటవుతుంది. తల్లి కురిపించే ప్రేమని అడ్వాంటేజ్‌గా తీసుకుని అతిగా స్వేచ్ఛకి అలవాటుపడిపోయిన జ్యోతి ఒకరోజున ఇంటినుంచి బయటకు వెళ్ళి మరి తిరిగిరాలేదు. ఏమయిందో తెలీదు.

పిచ్చిదయిపోయింది సుందరి. ఏడ్చే ఆమె వెనుక లోకుల హేళనలు. ఉన్న వూరు వదిలిపెట్టేసింది. ఇక్కడకు వచ్చేసింది. అత్తవారు భరణంలో భాగంగా ఇచ్చిన ఇల్లది. తను పుట్టిన వూరు కూడా ఇదే.

జ్యోతి ఆమె ఆశల మీద కొట్టిన దెబ్బ ప్రభావం ఆమె మానసికస్థితిని పూర్తిగా మార్చేసింది. సౌమ్యత పోయింది. అందరికీ కంటగింపయింది.

ఆనాటి అందాలరాశి... ఈనాటి ముళ్ళపొద సుందరమ్మ’’ ముగించి నిట్టూర్చాడు డాక్టరుగారు.

‘‘ఆ అమ్మాయి పేరు ఏమిటన్నారూ- జ్యోతా?’’ హఠాత్తుగా అడిగాను లేస్తూ.

‘‘అవును’’ అంటూ ఆశ్చర్యంగా చూశారాయన.

భారమైన మనసుతో ఇంటికి తిరిగివచ్చాను. గుమ్మంలోనే ఉంది సుందరమ్మగారు. ‘‘ఆడపిల్లవి ఇంత చీకటిపడేదాకా షికార్లు చేసొస్తావా? ఇలాంటివి నా ఇంట్లో కుదరవమ్మాయ్‌’’ చిటపటలాడ్తూ స్వాగతిస్తున్న ఆమెను అభిమానంగా చూశాను.

***

‘‘జ్యోతి నాకు తెలుసు.’’

పైకి తోడుతున్న నూతిలో చేదని తుళ్ళిపడి వదిలేసింది సుందరమ్మగారు. మొహంలో విపరీతమైన ఆందోళన. క్షణాల్లో నుదుటిమీద చెమట బిందువులు చేరటం చూశాన్నేను.

‘‘జ్యోతెవరు? ఎవరో నాకు తెలీదు’’ గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయిందావిడ. గమ్మునయిపోయాను. నేను స్కూలుకు వెళ్ళేదాకా నా గది ముందర చాలాసార్లు తచ్చాడటం గమనించాన్నేను. ఆ సాయంత్రం స్కూలు నుంచి వచ్చి నూతి దగ్గర కాళ్ళు కడుక్కుంటూంటే ఏదో పని ఉన్నట్టొచ్చి ‘‘జ్యోతెవరు?’’ అంది యథాలాపంగా అడిగినట్టు.

‘‘మా ఇంటి దగ్గర పిల్లలకి ట్యూషన్లు చెబుతూండేది.’’ నాకు తెలుసు- పొద్దుట్నుంచీ ఆ మాట నన్నడగాలని ఎంత ఆత్రపడుతున్నదో.

‘‘ఇప్పుడు?’’

‘‘చచ్చిపోయింది. కాన్పులో సుస్తీ చేసి’’ సన్నగా వణికింది నా కంఠం.

శరవేగంగా లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది సుందరమ్మగారు- మాటా మంతీ లేకుండా.

దీపాలుపెట్టే వేళ తులసికోట దగ్గర దీపం వెలిగిస్తుంటే చూశాను- మంకెన పువ్వుల్లా ఎర్రగా తడిగా ఉన్నాయ్‌ ఆవిడ కళ్ళు.

***

‘‘లీవు వేకెన్సీలో వచ్చానిక్కడికి. అది పూర్తయింది. రెండు రోజుల్లో వెళ్ళిపోతున్నానిక్కణ్ణుంచి. సామానూ అదీ ఎక్కువుంటుందని అన్నయ్య వచ్చాడు నాకు సాయంగా.’’

వెంట కావేరి కూడా ఉంది. పదేళ్ళుంటాయ్‌ దానికి. వందనంగా ఉంటుంది. చెప్పిన పనులు చక్కగా చేస్తుంది. అది మా అంట్లగిన్నెలు తోమి, బోర్లిస్తుంటే సుందరమ్మగారు పరీక్షగా చూస్తున్నారు. చెప్పాను- ‘‘జ్యోతి కూతురు. తల్లి చచ్చిపోయాక మా పనిమనిషి పెంచింది దీన్ని. ఆ పనీ ఈ పనీ చేసిపెడుతూ మా ఇంట్లోనే ఉంటోంది’’ అని.

తనక్కాదన్నట్టు తల తిప్పుకున్నదావిడ.

వెళ్ళే సమయం దగ్గరపడింది. సుందరమ్మగారు బయటకు మొహం చూపించట్లేదు. నేనే వెళ్ళాను- సెలవు తీసుకుందామని.

గోడకానుకుని ఎటో చూస్తూ కూర్చున్నదావిడ. ముఖంలో ఎంతో ఘర్షణపడిన ఛాయలు.

‘‘వెళ్ళొస్తానాంటీ’’

హఠాత్తుగా లేచి నా చేతులందుకుంది సుందరమ్మగారు. ‘‘కావేరిని నా దగ్గర ఉండనీ టీచర్‌.’’

కావేరి చేతిని ఆవిడ చేతికందించి తృప్తిగా బయలుదేరాను నేను.

స్టేషన్లో మా కోసమే ఎదురుచూస్తున్నారు నందగోపాల్‌గారు. ఆయన కళ్ళల్లో నామీద అభిమానంతోపాటు సన్నని అనుమానరేఖ.

ఏమీ మాట్లాడకుండానే క్షణాలు గడిచాయి. గంట కొట్టారు. రైలు దూరంగా కనిపిస్తోంది.

‘‘కావేరి ఎవరు, నిజం చెప్పండి టీచర్‌’’ అడిగారాయన.

‘‘మీకెందుకా అనుమానం. తను జ్యోతి కూతురే’’ అన్నాను.

చాలా రిలీఫ్‌ కనిపించిందాయన మొహంలో. నా తలపై చేయుంచారు ఆప్యాయంగా.బండి ఆగింది. ఎక్కి కూర్చున్నాం. రెక్క వాలింది. రైలు కదిలింది.

దూరమవుతున్న డాక్టరుగారిని చూస్తూ అనుకున్నాను- ‘క్షమించండి డాక్టరుగారూ, కావేరి- జ్యోతి కూతురు కాకపోవచ్చును. కానీ, జ్యోతిలా వంచించబడి ప్రాణాలు పోగొట్టుకున్న ఓ నిర్భాగ్యురాలి బిడ్డే తను. అనృతదోషం నాకంటితే అంటనీగాక. నా అన్న మమకారం కోసం ఆక్రోశిస్తున్న ఓ గుండెకు వూరటా, ఓ అనాథకు ఆసరా కలిగించాను. ఆ తృప్తి చాలు నాకు. ఇది మీక్కూడా తెలీటం నాకిష్టం లేదు. సారీ డాక్టర్‌.’’

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.