close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అమిర్‌...వాల్ల ఆరాధ్యదైవం!

ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌లో భాగంగా ఉన్న ఉజ్బెకిస్తాన్‌ రాజధాని నగరమే తాష్కెంట్‌... తాష్కెంట్‌ అంటే రాతి నగరం అని అర్థమట. ‘వరల్డ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌’ ఆధ్వర్యంలో మేం ఆ నగరాన్ని అధ్యయనం చేసేందుకు వెళ్లాం. సిటీ ప్యాలెస్‌ హోటల్లో మాకు బస ఏర్పాటుచేశారు. అక్కడ కాసేపు సేదతీరి, తాష్కెంట్‌ నగరాన్ని చూడ్డానికి వెళ్లాం. దీన్ని పడిలేచిన కెరటంలా చెప్పవచ్చు. 13వ శతాబ్దంలో చంఘీజ్‌ఖాన్‌ దాడి కారణంగా ఈ ప్రాంతం పూర్తిగా ధ్వంసమైంది. సిల్కురోడ్డు పుణ్యమా అని వ్యాపారం ద్వారా మళ్లీ నిలదొక్కుకుంది. ఆపై 1865లో రష్యన్లు దీన్ని ఆక్రమించారు. తరవాత సోవియట్‌ యూనియన్‌లో భాగంగా మారి అభివృద్ధి మార్గాన ప్రయాణించి, ప్రస్తుతం స్వయంగా పురోగమిస్తోంది.

తాష్కెంట్‌ నగరంలో ఆధునిక భవనాలతోపాటు పురాతన, చారిత్రక కట్టడాలెన్నో ఉన్నాయి. ఆ నగరంలో అణువణువునా ఇస్లామిక్‌ సంస్కృతి ప్రతిబింబిస్తుంటుంది. మసీదులూ మదరసాలూ ఎక్కువ. అక్కడి ప్రజలు ఎంతో అందంగా ఉన్నారు. ముఖ్యంగా వాళ్లు తమ సంప్రదాయాల్ని ప్రతిబింబించే దుస్తుల్నే ధరిస్తారు. ముందుగా పంట పొలాల్ని చూడ్డానికి వెళ్లాం. అక్కడ వ్యక్తిగతంగా ఎవరికీ భూములు ఉండవు. సహకార సంఘాల యాజమాన్యంలోనే భూములను ప్రజలు సేద్యం చేస్తుంటారు. తరవాత ఇండిపెండెన్స్‌ స్క్వేర్‌కు వెళ్లాం. ఆ ప్రదేశం అందమైన ఫౌంటెయిన్లూ ఉద్యానవనాలతో తీర్చిదిద్దినట్లుగా ఉంది. అక్కడ ఉన్న ఓ మాతృమూర్తి విగ్రహమూ బంగారువర్ణంలోని ఓ పెద్ద గ్లోబూ మమ్మల్ని ఆకట్టుకున్నాయి. అక్కడి నుంచి అమిర్‌ తైమూర్‌ స్క్వేర్‌కు వెళ్లాం. చక్కని ప్రణాళికతో తీర్చిదిద్దడంవల్ల ఈ నగరంలోని అన్ని ప్రదేశాలూ ఈ కూడలితో ముడిపడి ఉంటాయి. ఉజ్బెకిస్తాన్‌ చారిత్రక వైభవానికీ ఆధునిక అందాలకీ మూల కారకుడే అమిర్‌ తైమూర్‌. ఆయన చంఘిజ్‌ఖాన్‌ వారసుడు. అమిర్‌ని అక్కడివాళ్లు ఇప్పటికీ ఆరాధిస్తారు. అందుకే ఆయన గుర్తుగా అమిర్‌ తైమూర్‌ మాన్యుమెంట్‌ పార్కూ, మ్యూజియమూ కనిపిస్తాయి.

అక్కడి వీధులన్నీ ఎంతో విశాలంగా ఉద్యానవనాలతో నిండి ఉన్నాయి. వీధుల్లో ఎక్కడ చూసినా కళాఖండాలు కొలువుతీరి ఉన్నాయి. తాష్కెంట్‌లో ప్రతి ఒక్కరూ ఇష్టపడి కొనుగోలు చేసేవి హస్తకళాకృతులే. ఇక్కడ ఉన్న చోర్సు బజార్‌ మధ్య ఆసియాలోకెల్లా పురాతనమైనదీ పెద్దదీ అని చెప్పాలి. గత రెండువేల సంవత్సరాలుగా ఇది ఉందట. 1980లలో దీన్ని పునర్నిర్మించారు. ఏడు పెద్ద డోమ్‌లు నిర్మించి అందులో దుకాణాలను ఏర్పరిచారు.

సమర్‌ఖండ్‌లో...
ఆ తరవాత సమర్‌ఖండ్‌కు బయలుదేరాం. ఇది ఉజ్బెకిస్తాన్‌లో మరో ప్రసిద్ధ నగరం. ఈ ప్రయాణంలో బుల్లెట్‌ రైల్లో కేవలం రెండున్నర గంటల్లో 800 కిలోమీటర్లు ప్రయాణించాం. ఇక్కడ ఆర్ట్‌ థియేటర్లు చూశాక అమిర్‌తైమూర్‌ను ఖననం చేసిన మాసోలియంనూ ఆయన విగ్రహాన్నీ సందర్శించాం. ఆయన మాసోలియం చూడగానే కాబూల్‌, దిల్లీ, ఆగ్రాల్లో మొఘల్‌ చక్రవర్తుల సమాధులే గుర్తుకొచ్చాయి. అక్కడనుంచి తాష్కెంట్‌కు తిరిగివచ్చాం. మర్నాడు మూడు గంటలు ప్రయాణించి టియాన్‌షాన్‌ పర్వత శ్రేణిలోని చిమ్‌గాన్‌ పర్వతాల దగ్గరకు వెళ్లాం. ఈ పర్వతశ్రేణిలో అత్యంత ఎత్తైన 5500 మీటర్ల శిఖరాన్ని రోప్‌వే ద్వారా చేరుకున్నాం. అక్కడి నుంచి తాష్కెంట్‌ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి సిల్కురోడ్డు ద్వారా హిందూఖుష్‌ పర్వతాలకు ప్రయాణించవచ్చు. ఈ మార్గం ద్వారానే అప్ఘనిస్తాన్‌, ఖజకిస్తాన్‌... తదితర భూభాగాలకు ప్రధాన మార్గాలు ఉన్నాయి. ఈ సిల్కురోడ్డులో ప్రయాణించడం ఓ మరపురాని అనుభూతిని అందిస్తుంది.

చార్‌వాక్‌ కొలను!
అక్కడ సందర్శించినవాటిల్లో చెప్పుకోదగ్గ మరో ప్రాంతం చార్‌వాక్‌ లేక్‌. చుట్టూ పర్వతాలతో అందాలన్నీ మూటగట్టినట్లుగా ఉన్న మంచినీటి కొలను అది. పర్యటకులు సేదతీరేందుకు ఇది చక్కని ప్రదేశం. ఓ సహాయకుడి ఆధ్వర్యంలో ఎత్తైన పర్వతశిఖరం నుంచి మొత్తం సరస్సు అంతా ఎగురుతూ పారాచూట్‌తో చుట్టి రావడం మర్చిపోలేని అనుభూతినిస్తుంది. తరవాతిరోజు తాష్కెంట్‌లోని లాల్‌బహదూర్‌ వీధికి వెళ్లాం. తాష్కెంట్‌ నగర పర్యటనలో ఉండగా అక్కడే గుండెనొప్పితో తుది శ్వాస విడిచారు శాస్త్రి. అప్పట్లో ఆయన మరణం అక్కడి ప్రజలకు తీరని వేదన మిగిల్చింది. అందుకే ఆయన విగ్రహాన్ని ఏర్పాటుచేయడంతోబాటు ఆ వీధికి లాల్‌బహదూర్‌ శాస్త్రి పేరు పెట్టారు. ఆయన పేరుతో ఓ పాఠశాలను నెలకొల్పి భారతీయులపట్ల తమ ప్రేమాభిమానాలను చాటుకున్నారు. మేం శాస్త్రి విగ్రహానికి నివాళులర్పించి, ఆయన పేరుతో ఉన్న స్కూలుని కూడా సందర్శించి, మా ఏడు రోజుల పర్యటనను పూర్తి చేసుకుని తిరిగివచ్చాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.