close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రయ్‌... రయ్‌... రియో!

రయ్‌... రయ్‌... రియో!

206 దేశాలు... 10,500కు పైగా ఆటగాళ్లు... 77వేల కోట్ల రూపాయల బడ్జెటü... 17రోజుల ప్రపంచ క్రీడా సంగ్రామం... ప్రతి ఒక్కరికీ ఒకటే లక్ష్యం - ఒలింపిక్‌ పతకం. ఆరు గ్రాముల పసిడి కూడా నిండని ఆ పతకం కోసం ఎన్నో ప్రభుత్వాలు వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఎందరో అథ్లెట్లుజీవితాలను ధారపోస్తున్నారు. భారత్‌లాంటి దేశాల్లో, ఒక్క పతకానికే అభిమానులు ఆటగాళ్లని జీవితాంతం నెత్తిన పెట్టుకుంటున్నారు. అంత ప్రాధాన్యమున్న ఆ విశ్వ క్రీడా సంరంభానికి సర్వం సిద్ధమైంది. మొత్తం 42 క్రీడాంశాల్లో ఎవరి గూటికెన్ని పతకాలు చేరుతాయో అని యావత్‌ ప్రపంచం ఎదురు చూస్తోంది.

తేదీ: ఆగస్టు 5, 2016
వేదిక: బ్రెజిల్‌లోని రియో డీ జనీరో నగరం, మారకానా స్టేడియం
సమయం: రాత్రి 8గం.(స్థానిక కాలమానం)
ఒలింపిక్‌ జ్యోతి వెలుగుతుంది. అథ్లెట్ల కవాతు మొదలవుతుంది. జాతీయ జెండాలు రెపరెపలాడుతాయి. అంబరాన్నంటే సంబరాల సాక్షిగా 31వ ఒలింపిక్‌ మహా సంగ్రామానికి తెరలేస్తుంది. పోటీ పడే దేశాలూ, పాల్గొనే క్రీడాకారులూ, సత్తా చాటాల్సిన విభాగాలూ... అన్ని విధాలుగా ప్రపంచంలో ఇదే అతిపెద్ద ఆటల పోటీ. మొత్తంగా 206 దేశాల నుంచి పదివేల ఐదువందల మందికి పైగా ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 28 క్రీడల్లో 306 విభాగాల్లో పోటీలు జరుగుతాయి. భారత్‌ నుంచి ఈసారి అత్యధికంగా 120 మంది మహిళలూ పురుషులూ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. 15 క్రీడల్లో 66 విభాగాల్లో మన అథ్లెట్లు బరిలో దిగుతారు.

గతంతో పోలిస్తే ఆటగాళ్ల సంఖ్యతో పాటు వాళ్లపైన ఉన్న ఆశలూ ఎక్కువే. రియోలో వీలైనన్ని పతకాలతో తమ ఉనికిని చాటుకోవాలని భారత్‌ ఉరకలేస్తుంటే, అగ్రరాజ్యం అమెరికాను కంగు తినిపించి పసిడి వేటలో దూసుకెళ్లాలని చైనా ఉత్సాహ పడుతోంది. కనీవినీ ఎరుగుని రీతిలో పోటీల్ని నిర్వహించి ప్రపంచానికి తమ శక్తిసామర్థ్యాల రుచి చూపించాలని బ్రెజిల్‌ ఎదురుచూస్తోంది. ఒక్క పతకాన్నైనా పట్టుకొచ్చి చరిత్రలో నిలిచిపోవాలని కొందరూ, వీలైనన్ని పతకాలు సాధించి చరిత్ర సృష్టించాలని ఇంకొందరూ ఆరాటపడుతున్నారు. ఎన్నో ఏళ్ల కలలూ, కష్టాల భవితవ్యం క్షణాల వ్యవధిలో తేలిపోతుంది. ఆటగాళ్ల శక్తిసామర్థ్యాలకూ, అభిమానుల భావోద్వేగాలకూ, ప్రపంచ దేశాల ఆత్మగౌరవాలకూ అతిపెద్ద పరీక్షే ఒలింపిక్స్‌. ఆ మహా సంగ్రామంలో అణువణువునా ఎన్నెన్నో ప్రత్యేకతలు..!

 


10వేల గదులూ... 60 వేల భోజనాలు

  రిత్రలో తొలిసారి దక్షిణ అమెరికా ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తోంది. పదిహేడు రోజుల పాటు బ్రెజిల్‌లోని రియో డీ జనీరోలోని 33 స్టేడియంలతో పాటు ఇతర నగరాల్లోని మరో నాలుగు వేదికల్లో పోటీలు జరగనున్నాయి. దీనికోసం ఎక్కడా లేనంత భారీ ఒలింపిక్‌ గ్రామాన్ని రియో నగరంలో బ్రెజిల్‌ నిర్మించింది. లక్షా ముప్ఫయ్‌ వేల మంది వలంటీర్లు అక్కడ సేవలందించనున్నారు. 85వేల మంది సైనికులూ, పోలీసులూ దాని భద్రత బాధ్యతలు చూసుకుంటున్నారు.

* పోటీల కోసం కట్టిన ఒలింపిక్‌ విలేజ్‌లో 17,500 మంచాలూ, ఆరు వేల టీవీలూ ఏర్పాటు చేయడంతో పాటు 31 బహుళ అంతస్తుల భవనాల్లో దాదాపు పదివేల గదులనూ నిర్మించారు. ఆటగాళ్లూ, వాళ్లతో వచ్చిన సిబ్బంది కోసం రోజూ 60వేల భోజనాలను ఒలింపిక్‌ సమాఖ్య సిద్ధం చేయించనుంది. ఒక్క ఒలింపిక్‌ గ్రామ నిర్మాణానికే 51వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చయింది.

* ఒలింపిక్‌ గ్రామంలో భాగంగా పదుల సంఖ్యలో ఉద్యానవనాలూ, ఈత కొలనులూ, రెస్టరెంట్లూ, రోడ్లతో ఓ చిన్నపాటి నగరాన్నే ఏడేళ్లలో నిర్మించారు. పోటీలు పూర్తయ్యాక ప్రభుత్వం వీటిని లగ్జరీ అపార్టుమెంట్లుగా మార్చి అమ్మనుంది.

* పది మంది శరణార్థులతో కూడిన ఓ బృందం తొలిసారి ఈ ఒలింపిక్స్‌లో పోటీ పడనుంది. ఏ జట్టుకూ చెందని వీళ్లు ఒలింపిక్‌ సమాఖ్య జెండా కిందే అథ్లెటిక్స్‌, జూడో, స్విమ్మింగ్‌ విభాగాల్లో పాల్గొంటున్నారు.

* 112ఏళ్ల తరవాత గోల్ఫ్‌ ఒలింపిక్స్‌లో పునరాగమనం చేస్తోంది. రగ్బీసెవన్స్‌ తొలిసారి అడుగుపెట్టింది.


రియోలో ప్రత్యేకతలు

ఒలింపిక్‌ టార్చ్‌: ప్రపంచంలో అతిపెద్ద క్రీడా సంరంభం ఒలింపిక్స్‌ జ్యోతి ప్రజ్వలనతోనే మొదలవుతుంది. ఆ ఘట్టానికి ప్రాణం పోసే రియో ఒలింపిక్‌ టార్చ్‌లోనూ ఎన్నో ప్రత్యేకతలున్నాయి. నాలుగు భాగాలుండే టార్చ్‌లో పైన బంగారు వర్ణంలో మెరిసిపోయే భాగం ఆకాశానికీ, స్వర్ణ పతకానికీ సంకేతం. దాని కింద హరిత వర్ణం రియోలోని సహజమైన ప్రకృతి సంపదకూ, పచ్చటి పర్వతాలకూ గుర్తు. ఆ కిందనుండే నీలి భాగం రియో సముద్ర తీరానికి సూచిక. ఆఖరున ఉన్న భాగం రియోలో బాగా ప్రాచుర్యం పొందిన ఓ పాదచారుల మార్గాన్ని(ఫుట్‌పాత్‌) సూచిస్తుంది.

మస్కట్‌: ఒలింపిక్స్‌ అధికారిక మస్కట్‌ పేరు వినిషియస్‌. బ్రెజిల్‌లో బాగా పేరున్న ఓ కవి పేరునే ప్రజల ఓటింగ్‌ ద్వారా దీనికి పెట్టారు. పిల్లీ, కోతీ, కుక్క లాంటి ప్రాణులతో పాటు వివిధ పక్షుల కలయికలా కనిపించే ఈ బొమ్మ బ్రెజిల్‌లోని జీవవైవిధ్యానికి ప్రతీక. అన్ని జంతువుల్లోని శక్తిసామర్థ్యాలూ కలిసున్న ఆటగాళ్లే విజేతలవుతారన్న విషయాన్నీ సూచిస్తూ దీన్ని రూపొందించారు.

పతకం: విజేతలకిచ్చే పతకాలకు ఓవైపు విజయానికి ప్రతీకగా భావించే గ్రీకు దేవత నైకీ బొమ్మ, మరోవైపు గ్రీస్‌లో విజేతలకు అందించే లారెల్‌ ఆకులను ముద్రించారు. వాటి మధ్యలో రియో ఒలింపిక్స్‌ లోగో ఉంటుంది.

లోగో: రియో ఒలింపిక్స్‌ లోగోలో ముగ్గురు వ్యక్తులు చేతులు కలుపుతున్నట్లు కనిపిస్తుంది. అందరం కలిసి పోటీల్ని విజయవంతం చేద్దాం అనే అర్థం ఇందులో దాగుంది. లోగోలోని పసుపు రంగు సూర్యుడినీ, బ్రెజిల్‌ వాసుల సుహృద్భావాన్నీ సూచిస్తుంది. ఆకుపచ్చ రంగు అడవులకూ, సానుకూల ఆలోచనా ధోరణికీ ప్రతీక. నీలం నీటికీ, ప్రజల పారదర్శక స్వభావానికీ గుర్తు.


భారత్‌ ఖాతాలో ఎన్నో!

  బీజింగ్‌లో మూడు, లండన్‌లో ఆరు, మరి రియోలో..? చాలా రోజులుగా భారత క్రీడాభిమానుల్ని ఆకర్షిస్తోన్న ప్రశ్న ఇది. 125కోట్ల మంది ఆశల్ని మోస్తూ 120మంది పతకాల వేటకు బయల్దేరారు. అంతకు ముందుతో పోలిస్తే గత ఒలింపిక్స్‌లో అత్యధికంగా భారత్‌ ఆరు పతకాలు సాధించింది. ఈసారి ఆ సంఖ్య రెట్టింపయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నది నిపుణుల మాట.

గన్ను పేలొచ్చు!: హాకీ తరవాత భారత్‌కు తొలి స్వర్ణం లభించింది షూటింగ్‌లోనే. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో అభినవ్‌ బింద్రా తొలిసారి పసిడికి గురిపెట్టాడు. గత ఒలింపిక్స్‌లో హైదరాబాదీ షూటర్‌ గగన్‌ నారంగ్‌ కాంస్యం నెగ్గాడు. వీళ్లిద్దరితో పాటు జితురాయ్‌ కూడా షూటింగ్‌లో పతకానికి ఫేవరెట్‌. మహిళల విభాగంలో అపూర్వి చండేలా కూడా కొంతకాలంగా మంచి విజయాలు సాధిస్తూ రియో బెర్తు సొంతం చేసుకుంది. మొత్తం పన్నెండు మంది క్రీడాకారులు అర్హత సాధించిన షూటింగ్‌ విభాగంలో ఒకటికన్నా ఎక్కువ పతకాలు గెలిచే అవకాశాలు పుష్కలం.

పట్టర పట్టు!: గత రెండు ఒలింపిక్స్‌లోనూ భారత్‌ పతకాలు సాధించిన పోటీల్లో రెజ్లింగ్‌ ఒకటి. 2008, 2012లో పతకాలు సాధించిన సుశీల్‌ కుమార్‌ ఈసారి పోటీలకు దూరమైనా గత ఒలింపిక్స్‌లో కాంస్యాన్ని సొంతం చేసుకున్న యోగేశ్వర్‌ దత్‌ ప్రస్తుతం ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకున్న నర్సింగ్‌ యాదవ్‌, మహిళల విభాగంలో వినేష్‌ పొగట్‌లు కూడా పతకాలు తేగల సమర్థులే. మొత్తం ఎనిమిది మంది బరిలోకి దిగనున్న కుస్తీ బృందంలో ఒక్క పతకమైతే ఖాయమన్నది అంచనా.

హాకీలో మళ్లీ...: జాతీయ క్రీడ హాకీకి ఒలింపిక్స్‌లోనూ తిరుగులేని రికార్డుంది. భారత్‌ అత్యధికంగా ఎనిమిది స్వర్ణాలు నెగ్గింది హాకీలోనే. కానీ అదంతా 36ఏళ్ల కిందటి మాట. 1980 ఒలింపిక్స్‌ తరవాత హాకీ జట్టు పెద్దగా రాణించలేదు. కానీ ఇటీవల ఛాంపియన్స్‌ ట్రొఫీలో దిగ్గజ జట్లను మట్టికరిపించి భారత బృందం రజతం గెలిచింది. అందరు ఆటగాళ్లూ మంచి ఫామ్‌లో ఉండటంతో ఈసారి భారత్‌కు పతకం సాధించే అవకాశాలున్నాయి. 36ఏళ్ల తరవాత ఈసారి మహిళల హాకీ జట్టు కూడా పునరాగమనం చేయనుండటం విశేషం.

ఒకటి గ్యారంటీ: సైనా, జ్వాలా, కిదాంబి శ్రీకాంత్‌, పీవీ సింధూ, సుమీత్‌ రెడ్డి... ఇలా ఈసారి బ్యాడ్మింటన్‌లో భారత ఆశల పల్లకీ మోస్తోంది ఎక్కువమంది తెలుగు తేజాలే కావడం విశేషం. వీళ్లు కాకుండా అశ్వినీ పొన్నప్ప, మనూ ఆత్రిలతో కలిపి మొత్తం ఏడుగురు సభ్యుల బ్యాడ్మింటన్‌ బృందం రియో బరిలో దిగింది. గత ఒలింపిక్స్‌లో సైనా కాంస్యం గెలవడం, గతంలో ప్రపంచ స్థాయి టోర్నీలలో శ్రీకాంత్‌ సంచలనాలు సృష్టించడంతో వీళ్లపైన అంచనాలు ఎక్కువయ్యాయి.

పతకాలకు పంచ్‌: గత రెండు ఒలింపిక్స్‌లోనూ బాక్సింగ్‌లో భారత్‌ పతకాలకు పంచ్‌ విసిరింది. 2008లో విజేందర్‌, 2012లో మేరీ కోమ్‌ కాంస్యాలను గెలిచారు. ఈసారి శివ తాపా, వికాస్‌ కృష్ణన్‌ వాళ్ల వారసత్వాన్ని కొనసాగించొచ్చని అంచనా. వీళ్లతో పాటు మరో బాక్సర్‌ మనోజ్‌ కుమార్‌ రియో రింగ్‌లో అడుగుపెట్టనున్నాడు.

గురి కుదరాలి: ఆర్చరీలో మనవాళ్లు ఇప్పటిదాకా ఒక్క ఒలింపిక్‌ పతకమూ గెలవకపోయినా, ఈసారి భారత బృందంపైన ఆశలు మాత్రం భారీగానే ఉన్నాయి. మహిళా ఆర్చర్లు దీపికా కుమారి, బాంబేలా దేవి, లక్ష్మీ రాణిలు ప్రపంచస్థాయి టోర్నీల్లో స్థిరంగా రాణిస్తూ ఉండటమే దానికి కారణం. వీళ్లు ముగ్గురూ వ్యక్తిగత విభాగాలతో పాటు జట్టుగానూ పతకానికి గురిపెట్టనున్నారు. పురుషుల విభాగంలో అతాను దాస్‌ బరిలో నిలిచినా, మహిళల బృందంపైనే అంచనాలు ఎక్కువ.


విశ్వక్రీడల్లో విశేషాలు

  భారత్‌కు తొలి ఒలింపిక్‌ పతకాన్ని అందించిన నార్మన్‌ ప్రిచర్డ్‌ ఆంగ్లో ఇండియన్‌. అతడు తమ దేశస్థుడే అని బ్రిటన్‌ చెప్పుకుంటున్నా, ఒలింపిక్‌ సమాఖ్య రికార్డుల్లో మాత్రం ప్రిచర్డ్‌ భారతీయుడనే నమోదై ఉంటుంది.

* 1912లో చివరిసారిగా పూర్తిస్థాయి బంగారు పతకాలను అందించారు. ఆ తరవాత నుంచి వెండి పతకాలకు బంగారు పూత వేసి ఇస్తున్నారు.
* రెండు కాళ్లూ లేకపోయినా ఒలింపిక్స్‌ పరుగు పందెంలో పోటీ పడ్డ ఏకైక వ్యక్తి దక్షిణాఫ్రికా రన్నర్‌ ఆస్కార్‌ పిస్టోరియిస్‌.
* ఒకే ఒలింపిక్స్‌లో మూడు వేర్వేరు విభాగాల్లో పతకాలు అందుకున్న ఒకేఒక్కడు అమెరికా క్రీడాకారుడు ఫ్రాంక్‌ కుగ్లర్‌. వెయిట్‌ లిఫ్టింగ్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌, రెజ్లింగ్‌లలో 1904లో మొత్తం నాలుగు పతకాలు గెలిచాడు.
* దేశ జనాభాకూ, ఇప్పటి వరకూ ఆ దేశం సాధించిన పతకాలకూ మధ్య నిష్పత్తిని బట్టి చూస్తే జాబితాలో భారత్‌దే ఆఖరి స్థానం. 125కోట్ల జనాభాలో ఇప్పటివరకూ సాధించింది 26పతకాలే. అంటే సగటున 5కోట్ల మందికి ఒక పతకం.
* అమెరికా ఇప్పటిదాకా అందరికంటే ఎక్కువగా 2399 ఒలింపిక్‌ పతకాలు ఖాతాలో వేసుకుంది. మరోపక్క పదహారు సార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న లెటన్‌స్టిన్‌ దేశం ఒక్కటంటే ఒక్క పతకం కూడా గెలవలేదు.
* ప్రతి ఒలింపిక్స్‌లోనూ కనీసం ఒక్క బంగారు పతకం గెలిచిన ఏకైక దేశం ఇంగ్లండ్‌.
* 1900 ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో భాగంగా ఒకే ఒక్కసారి క్రికెట్‌ మ్యాచ్‌ జరిగింది. మొదట నాలుగు జట్లు పాల్గొన్నా, రెండు తప్పుకోవడంతో ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌ ఏకైక మ్యాచ్‌ ఆడాయి. ఇంగ్లండ్‌ గెలిచింది.
* 1912 ఒలింపిక్స్‌ కుస్తీ పోటీల సెమీఫైనల్లో రష్యా ఆటగాడు మార్టిన్‌ క్లీన్‌కి అతడి ప్రత్యర్థి ఆల్ఫ్రెడ్‌ని మట్టి కరిపించడానికి 11గంటల 40 నిమిషాల పాటు ఏకధాటిగా పోరాడాల్సి వచ్చింది. ఆ మ్యాచ్‌ తరవాత అలసట కారణంగా మరుసటి రోజు జరిగిన ఫైనల్‌లో పాల్గొనలేక బంగారు పతకాన్ని ఉదారంగా వదులుకున్నాడు మార్టిన్‌.


రికార్డుల మోత

వందేళ్ల పైబడ్డ ఒలింపిక్స్‌ చరిత్రలో భారత్‌ అతికష్టమ్మీద 9 ఒలింపిక్‌ స్వర్ణ పతకాలు సాధిస్తే, అమెరికా స్విమ్మర్‌ మైఖెల్‌ ఫెల్ప్స్‌ ఒక్కడే ఇప్పటిదాకా 18 స్వర్ణ పతకాలు గెలుచుకున్నాడు. అలాంటి కళ్లు చెదిరే రికార్డులు విశ్వ క్రీడల్లో చాలా ఉన్నాయి.

* ఒలింపిక్స్‌లో స్విమ్మింగ్‌ అనగానే మొదట గుర్తొచ్చే పేరు మైఖెల్‌ ఫెల్ప్స్‌. మొత్తం 18స్వర్ణాలతో కలిపి ఇప్పటిదాకా 22 ఒలింపిక్‌ పతకాలను గెలిచిన ఫెల్ప్స్‌ వరసగా ఐదోసారి పోటీల్లో పాల్గొంటున్నాడు. ఒకే ఒలింపిక్స్‌లో అత్యధిక స్వర్ణాలు (8, బీజింగ్‌లో) సాధించిన రికార్డూ అతడిదే.
* మహిళల్లో అత్యధిక ఒలింపిక్‌ పతకాలు సోవియట్‌ యూనియన్‌కి చెందిన లారిసా లాటినినా పేరిట ఉన్నాయి. 1956-1964 మధ్య జిమ్నాస్టిక్స్‌లో 18పతకాలు సాధించిన లారిసా రికార్డుని 48ఏళ్ల తరవాత ఫెల్ప్స్‌ అధిగమించాడు.
* ఉసేన్‌ బోల్ట్‌... 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో 100మీ, 200మీ, 4 ్ల 100మీ విభాగాల్లో మూడు ప్రపంచ రికార్డులూ, మూడు ఒలింపిక్‌ రికార్డులూ నెలకొల్పి స్వర్ణాలు గెలిచాడు. 2012లోనూ ఆయా విభాగాల్లో స్వర్ణాలు గెలిచి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.
* భారత హాకీ జట్టు 1928-1956 మధ్య వరసగా ఆరుసార్లు స్వర్ణ పతకం సాధించింది. ఒలింపిక్స్‌లో ఆ రికార్డు మరే జట్టుకూ లేదు. భారత్‌ తరఫున తొలి పతకం సాధించిన మహిళ, వెయిట్‌ లిఫ్టర్‌ కరణం మల్లీశ్వరి(2000).
* అత్యధికంగా పదిసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న రికార్డు కెనెడాకు చెందిన ఈక్వెస్ట్రియిన్‌ క్రీడాకారుడు ఇయాన్‌ మిల్లర్‌ పేరిట ఉంది. ఆరవై ఐదేళ్ల వయసులో 2012 ఒలింపిక్స్‌లో ఆఖరుసారి పాల్గొన్నాడు. భారత్‌ తరఫున ఎక్కువసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఆటగాడిగా లియాండర్‌ పేస్‌ (7సార్లు) ఈ ఏడాది రికార్డు సృష్టించనున్నాడు.
* స్వీడన్‌ షూటర్‌ ఆస్కార్‌ స్వాన్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్న అత్యంత పెద్ద వయస్కుడు. 1920లో 72ఏళ్ల వయసులో షూటింగ్‌లో అతడు రజతం సాధించాడు. ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన వయోధికుడు కూడా స్వానే(1912లో, 64ఏళ్ల వయసులో). పదేళ్ల వయసులో ఒలింపిక్స్‌లో పాల్గొని పతకం గెలిచిన గ్రీక్‌ జిమ్నాస్ట్‌ దిమిత్రియోస్‌ లాండ్రస్‌, ఆ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడు.


కష్టాలను దాటి రియోకి...

ఒలింపిక్‌ పతకం విలువేంటో నాలుగో స్థానంలో నిలిచిన వాళ్లు బాగా చెబుతారు. అదే ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం ఎంత విలువైందో కొందరు అథ్లెట్లు అంతకంటే అద్భుతంగా వివరిస్తారు. అందరూ మైదానం లోపల పోరాడితే, వీళ్లు బయట కూడా అనేక సమస్యలను దాటుకుని ఈ ఏడాది అత్యున్నత పోటీలకు అర్హత సాధించారు.

చిరుతలా వచ్చి: ద్యుతి చంద్‌... ప్రస్తుతం దేశంలో అత్యంత వేగవంతమైన అమ్మాయి. పేద చేనేత కుటుంబంలో పుట్టి అనేక సవాళ్లను దాటుకుని అంతర్జాతీయ స్ప్రింటర్‌గా ఎదిగింది. కానీ శరీరంలో పురుష హార్మోన్లు అధికంగా ఉన్నాయన్న కారణంతో కొంతకాలం పోటీలకు దూరమైంది. చాలామంది ఆపరేషన్‌ చేయించుకోమనీ, పరుగుని వదిలి పెళ్లి చేసుకోమనీ సలహా ఇచ్చారు. కానీ అథ్లెట్‌ కదా... పోరాటానికే సిద్ధపడింది. తన నిషేధాన్ని సవాలు చేస్తూ క్రీడల ఆర్బిట్రేషన్‌ కోర్టులో కేసు వేసింది. తీర్పు ఆమెకు అనుకూలంగా రావడంతో మళ్లీ మైదానంలోకి చిరుతలా వచ్చి జాతీయ రికార్డు బద్దలు కొట్టింది. కజక్‌స్థాన్‌లో జరిగిన క్వాలిఫయర్‌లో ఒలింపిక్‌ ప్రమాణాల్ని సగర్వంగా అందుకుని, భారత ప్రజల ఆశల పల్లకీ మోస్తూ రియో విమానమెక్కింది.