close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పోరాట పాఠాలు... మరచిపోతున్నాం!

పోరాట పాఠాలు... మరచిపోతున్నాం!

1857... మే 11, ఉదయం.
మీరట్‌లో ఓ సిపాయిదళం సైనికాధికారుల ఆదేశాల్ని ధిక్కరించింది. కట్టలుతెంచుకున్న ప్రవాహంలా యమునను దాటి దిల్లీ నగరంలో ప్రవేశించింది. ఆ పదఘట్టనలు రాజధాని అంతటా ప్రతిధ్వనించాయి. వడివడిగా అడుగులేస్తూ సిపాయిల దండు ఎర్రకోట వైపు నడిచింది. మొగల్‌ చక్రవర్తి రెండో బహదూర్‌షాను కలసి, తమకు నాయకత్వం వహించమని అడిగింది. ఆ ఆవేశాన్ని చూసి వృద్ధపాలకుడు కదిలిపోయాడు. భయాల్ని పక్కనపెట్టి బాధ్యతలు స్వీకరించాడు. ఆగస్టు తొలివారం నాటికి ఆ పొంగు ఉద్యమ స్థాయికి చేరింది. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం అనగానే ఏ ఒకరిద్దరు సంస్థానాధీశుల పేర్లో గుర్తుకొస్తాయి. వాళ్లంతా తెల్లవారి కారణంగా నష్టపోయినవారే. ఆస్తులు లాక్కున్నారని ఒకరూ, దత్తతను ఆమోదించలేదని ఒకరూ, చేజారిన అధికారాన్ని దక్కించుకోవచ్చని ఒకరూ ఉద్యమంలోకి వచ్చినవారే. ఓ సమష్టి లక్ష్యంతో బరిలోకి దిగింది మాత్రం...సామాన్య జనమే! ఎందుకంటే, పరాయి పాలనలోని సెగ ముందుగా మధ్యతరగతినే తాకింది. ధరలు మండిపోయాయి. కరవు రాజ్యమేలింది. ఉపాధి అవకాశాలూ అంతంతమాత్రమే. ఆ బాధలన్నీ పంటి బిగువున దాచుకున్నా, భారతీయుల విషయంలో తెల్లవారి వివక్షను మాత్రం ఎంతోకాలం భరించలేకపోయారు. విముక్తి అనివార్యమన్న నిర్ణయానికొచ్చారు. ఆ కలను నిజం చేసుకునే ప్రయత్నంలో...ఓ దశలో అతివాదుల్ని నమ్మారు, ఓ దశలో మితవాదులకు మద్దతిచ్చారు. ఆతర్వాత గాంధేయవాదానికి గుండెల్లో చోటిచ్చారు. మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ను తమ నాయకుడిగా ఆమోదించారు. ఆయన ఏ పిలుపునిచ్చినా స్పందించారు. త్యాగాలకూ సిద్ధపడ్డారు. పందొమ్మిది వందలా నలభై ఏడో సంవత్సరం, పంద్రాగస్టు నాటికి స్వాతంత్య్రం సాధించుకున్నారు. అదో అర్ధరాత్రి అరుణోదయం!

పాఠ్య పుస్తకాల్లో ఆ పోరాటాల చరిత్రను చదువుతుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. సామాన్యుల త్యాగాల గాథల్ని తలుచుకుంటే గుండె ఉప్పొంగుతుంది. అంతలోనే ఏదో అసంతృప్తి. పెద్దల త్యాగ ఫలాల్ని ఏ గద్దలో తన్నుకుపోతున్న బాధ. అలనాటి పోరాట స్ఫూర్తి అడుగంటి పోయిందన్న ఆవేదన. స్వాతంత్య్ర ఉద్యమానికి వూపిరిపోసిన సామాన్యుడే నేడెందుకు ఉసూరుమంటున్నాడన్న నిస్పృహ.

ప్రశ్నే పునాది
అప్పటిదాకా జరిగిన ఉద్యమాల తీరు వేరు. మహాత్ముడి పంథా వేరు. గాంధీజీ నాయకత్వం పోరాట వ్యూహాన్నే మార్చేసింది. మహజర్లు సమర్పించడమే తెలిసిన ప్రజలకు ఆయన ప్రశ్నించడం అలవాటు చేశారు. చంపారన్‌ నీలిమందు రైతులకు ‘ఎందుకు పండించాలి?’ అని నిలదీయడం నేర్పారు. అహ్మదాబాద్‌ మిల్లు కార్మికులకు ‘బోనస్‌ ఎందుకివ్వరు?’ అని అడగడం నేర్పారు. ఖేడా కర్షకులకు ‘శిస్తులెందుకు కట్టాలి?’ అని గొంతెత్తడం నేర్పారు. ఆ మూడు ఘట్టాల్లోనూ విజయం ప్రజలదే, కాదుకాదు...ప్రశ్నదే! భారత స్వాతంత్య్ర పోరాటమే ఓ పెద్ద ప్రశ్నోపనిషత్తు!

ప్రశ్న...ఉద్యమానికి ఆయువుపట్టు. ప్రశ్నే పది తూటాల పెట్టు. ప్రస్తుత సమాజంలో పౌరుడు ప్రశ్నించడం మరచిపోయాడు. గతుకుల రోడ్ల మీదైనా ప్రయాణిస్తాడు కానీ, ఆ నాసిరకం పనుల్ని ఏ సమాచార హక్కు చట్టం ద్వారానో ప్రశ్నించాలని అనుకోడు. సర్కారీ కార్యాలయాల్లో దస్త్రాల్ని కదిలించడానికి ఎన్ని చేతులైనా తడుపుతాడు కానీ, కాస్త చొరవ తీసుకుని అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేసే సాహసం చేయడు. ఆన్‌లైన్‌లో గంటలకొద్దీ చాటింగ్‌ చేసుకోడానికి సమయం దొరుకుతుంది కానీ, వ్యవస్థను కదిలించగలిగే ఓ ఇ-పిటిషన్‌ మీద సంతకం చేయడానికి మనసు ఒప్పదు. జనహితమే లక్ష్యంగా రాజ్యాంగం ప్రసాదించిన...ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కూడా పక్కదారిపడుతున్నాయి.ఉద్యమ సమయంలో...బందరు పట్టణానికి చెందిన తోట నర్సయ్య పదిహేనుమంది పోలీసులు చుట్టుముట్టినా ‘భారత్‌ మాతాకీ జై’ నినాదాన్ని ఆపలేదు, నోరు మూయలేదు. అదీ దేశాభిమానమంటే! మనమేమో...కాసిన్ని ప్రయోజనాల కోసం, కాస్తంత తలనొప్పిని తప్పించుకోవడం కోసం శాశ్వతంగా నోటికి తాళాలు వేసుకుంటున్నాం. ప్రశ్నించాల్సిన సమయంలో మౌనంగా ఉండటం...విద్వేషాల్ని పెంచే విషోపన్యాసాల కంటే ప్రమాదకరం.

త్యాగాల పోరాటం...
ప్రజా భాగస్వామ్యం లేనిదే, జన చైతన్యం పెరగనిదే స్వాతంత్య్రం అసాధ్యమని గాంధీజీ భావించారు. ఆయన చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. తల్లిదండ్రులు మరో ఆలోచన లేకుండా పిల్లల్ని సర్కారీ బడులు మాన్పించారు. భవిష్యత్తు గురించి భయపడకుండా కాలేజీ విద్యార్థులు ఆంగ్ల విద్యాసంస్థల్ని వదిలిపెట్టారు. లాభనష్టాల్ని బేరీజువేసుకోకుండా పౌరులు వృత్తి ఉద్యోగాల్ని వదులుకున్నారు. అందులో...రెండు చేతులా సంపాదిస్తున్న టంగుటూరి ప్రకాశం, చక్రవర్తుల రాజగోపాలాచారి లాంటి దిగ్గజాలైన న్యాయవాదులే కాదు, చాలీచాలని జీతాలతో పొట్టపోసుకుంటున్న గ్రామాధికారుల్లాంటి చిరుద్యోగులూ ఉన్నారు. మధ్యతరగతిలో సహజంగానే కొంత అభద్రత ఉంటుంది. ఒక్క అడుగు వేయాలన్నా వందసార్లు ఆలోచిస్తారు. ఉద్యమ సమయంలో ఆ వూగిసలాట మచ్చుకైనా కనిపించలేదు. సంకెళ్లు తెంచుకోవాలన్న బలమైన ఆకాంక్షలోంచి వచ్చిన తెగువ అది.

అదే ప్రజ ఇప్పుడెందుకిలా ప్రవర్తిస్తోంది? చిన్నచిన్న విషయాల్లోనూ ఎందుకింత సంకుచితంగా ఆలోచిస్తోంది? అంతెందుకు, ప్రధాని మోదీ ఎగువ మధ్యతరగతి ప్రజల్ని ఓ చిన్న కోరిక కోరారు. అలా అని, అలనాటి సామాన్యుల్లా చదువుల్ని వదులుకోమని చెప్పలేదు. లక్షలకొద్దీ సంపాదనలకు నీళ్లొదలమనీ అనలేదు. ఇన్నేళ్లలో జీవన ప్రమాణాలు పెరిగాయి. ఆదాయాలూ అధికం అయ్యాయి. అయినా, ప్రభుత్వం ఇస్తున్న వంటగ్యాసు రాయితీని వాడుకోవడం భావ్యం కాదు. స్వచ్ఛందంగా వదిలిపెట్టుకోమని విన్నవించారు. నిజమే, బలహీనుడో వికలాంగుడో అయితే వూతకర్ర కావాలి, అవసరమైతే ప్రభుత్వమే ఆ ఆసరా ఇవ్వాలి. పరిపూర్ణ ఆరోగ్యవంతులకు ఎవరి సాయమో ఎందుకు? ఎవరైనా ఉదారంగా ఇచ్చినా, నిర్లజ్జగా పుచ్చేసుకుంటే అది వైకల్యమే, మనో వైకల్యం! కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌ సబ్సిడీ కోసం ఏటా ప్రతి కుటుంబం మీదా ఐదువేల రూపాయల వరకూ వెచ్చిస్తోంది. అంటే, నెలకు నాలుగైదువందలు! పేదలకో దిగువ మధ్యతరగతికో అయితే, ఎంతోకొంత వూరటనిచ్చే మొత్తమే. నెలనెలా డెబ్భై ఎనభైవేలు కళ్ల జూసే నయా సంపన్న వర్గానికి ఆ ఐదొందల నోటు లెక్కలోకి కూడా రాదు. మహా అయితే, రెండు మల్టీప్లెక్స్‌ టికెట్లతో సమానమది. అయినా సరే వదులుకోడానికి వూగిసలాడుతున్నారు. వార్షికాదాయం పదిలక్షలకు మించిన వారిలో మూడుశాతం మందే ఇప్పటిదాకా సబ్సిడీని వదిలిపెట్టుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అది కూడా త్యాగమో దానమో కాదు. పౌరుడిగా కనీస కర్తవ్యం. మనది కానిది అనుభవిస్తున్నామంటే, మరొకరికి దక్కాల్సింది బలవంతంగా లాగేసుకుంటున్నామని అర్థం. త్యాగధనుల వారసులుగా మనకది తగనిపని!

గాంధీజీ పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష లేదన్నారు. ఉపవాసం, ప్రార్థన...ఇలా మనసును శుద్ధి చేసుకోడానికి మార్గాలు అనేకం సూచించారు. సంపాదనలో కొంత శాతాన్ని ఆదాయపన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లించడం పౌరులుగా మన కర్తవ్యం. పొరపాటునో ఉద్దేశపూర్వకంగానో చెల్లించకపోతే అందుకు బాధపడాలి. ఆ ఎగవేతకు పశ్చాత్తాపపడాలి. తప్పును సరిదిద్దుకునే మార్గమేదైనా ఉందేమో ఆలోచించాలి. మన దగ్గర అలాంటి ప్రయత్నమే లేదు. పౌర బాధ్యతగా పన్ను చెల్లించడాన్ని కూడా ‘మహాత్యాగం’గానే భావిస్తాం. ఎవరికో భిక్షమేసినట్టు భ్రమపడతాం. ఆదాయ వెల్లడి పథకాల ద్వారా తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. దేశంలో చలామణిలో ఉన్న డబ్బులో డెబ్భై అయిదుశాతానికిపైగా నల్లధనమే! అయినా సరే, అరశాతం ఎగవేతదారులు కూడా ఆ ప్రకటనకు స్పందించ లేదు. నిజమే, నిద్రపోతున్నవారిని లేపగలం. నిద్ర నటించేవారిని మేల్కొలపడం ఎవరితరం!

మమకారాల్ని జయించి...
మనసు కొన్ని ఉద్వేగాల్ని వదులుకోలేదు. ఆ బలహీనతను గెలవాలంటే, అంతకు వేయిరెట్లు శక్తిమంతమైన భావన ఏదో మనసులో పుట్టాలి. స్వాతంత్య్ర పోరాట సమయంలో జరిగింది అదే. అప్పటిదాకా జనం, మహా నాజూగ్గా కనిపించే సీమ వస్త్రాల్ని ఎగబడి కొనేవారు. మురిపెంగా ధరించేవారు. ఆ మోజంతా స్వాతంత్య్ర ఆకాంక్ష ముందు దిగదుడుపే అయ్యింది. జాతిపిత విదేశీ వస్త్రాల్ని బహిష్కరించమంటూ పిలుపునివ్వడమే ఆలస్యం. ఇంట్లోని బట్టలన్నీ తీసుకెళ్లి వీధుల్లో కుప్పలుగా పోశారు. చెత్తను తగలబెట్టినట్టు తగలబెట్టేశారు. ఆ మంటల్లో బ్రిటిష్‌ సార్వభౌమత్వమూ బుగ్గిపాలవుతున్నట్టు వూహించుకున్నారు. అదేం క్షణికావేశం కాదు. ఆతర్వాత కూడా ఎవరూ బ్రిటన్‌ నుంచి వచ్చిన సరుకుల్ని కొనలేదు. ఆ దెబ్బతో విదేశీ వస్త్రాల దిగుమతి సగానికిపైగా పడిపోయింది. రూ.121 కోట్ల విలువైన దిగుమతులు అరవై కోట్లకు తగ్గిపోయాయి. ఆ సహాయ నిరాకరణ తెల్లదొరల్ని కూడా తెల్లబోయేలా చేసింది. మన తాతముత్తాతలు తృణప్రాయంగా భావించిన ఆ ‘విదేశీ’ సరుకే, మనల్ని మాత్రం మరబొమ్మల్ని చేసి ఆడిస్తోంది. భారతీయులు కాస్తంత ‘ఫారిన్‌’ మోజు తగ్గించుకుని, నాణ్యతా ప్రమాణాలున్న దేశీయ ఉత్పత్తుల్ని ప్రోత్సహించగలిగితే...అనేకానేక చిన్నాపెద్దా పరిశ్రమలు హాయిగా వూపిరిపీల్చుకుంటాయి. మనం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయీ మన దేశంలోనే ఉంటుంది, మరో పరిశ్రమ ఏర్పాటుకు మూలధనంగానూ పనికొస్తుంది. అమెరికాలో అంకుర సంస్థల్ని స్థాపిస్తున్న ప్రతి వందమందిలో, పదిహేనుమంది భారతీయులే. ఆ ప్రయత్నమేదో సొంతగడ్డమీద చేస్తే ఎంత బావుండు!

బంగారం ముఖ్యమా, బంగారం లాంటి స్వేచ్ఛ ముఖ్యమా...అన్న సందేహం తలెత్తినప్పుడు ‘స్వేచ్ఛే’ అని తల ఎత్తుకుని మరీ జవాబిచ్చారు అలనాటి భారతీయులు. జాతీయ నేతలు జోలెపట్టి ఉద్యమానికి సాయం అందించమని అడిగినప్పుడు - బంగారమంటే ప్రాణమిచ్చే ఆ మధ్యతరగతి మహిళే...గాజుల్నీ, గొలుసుల్నీ, దుద్దుల్నీ, ముక్కెరల్నీ...ఒకటేమిటి, ఒంటిమీది నగలన్నీ ఒలిచి ఇచ్చేసింది. అలా అని వాళ్లెవరూ సంపన్నులు కాదు, ఎవరి ఇనప్పెట్టెల్లోనూ ఏడువారాల నగలేం మూలగడం లేదు. ‘ఏదో ఒకరోజు దేశానికి స్వాతంత్య్రం వచ్చితీరుతుంది. మన బతుకులు అన్యాయమైపోయినా, మన పిల్లలూ ఆ పిల్లల పిల్లలూ అయినా సుఖపడతారు’ అన్న భవిష్యత్తు దృష్టే మధ్యతరగతిని ఆ దిశగా ప్రోత్సహించింది.

ప్రపంచంలోని అతిపెద్ద బంగారం మార్కెట్లలో మనదీ ఒకటి. హద్దూ అదుపూలేని కొనుగోళ్ల కారణంగా భారత్‌ ఏటా వేయి టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా, మన విదేశీ మారక నిల్వలు భారీగా ఖర్చయిపోతున్నాయి. రూపాయి బక్కచిక్కిపోతోంది. విదేశాలు మన సరుకుల్నీ సేవల్నీ చవగ్గా కొట్టేస్తున్నాయి. దీనివల్ల ఆర్థిక వ్యవస్థకు చాలా నష్టం! భారతీయుల బీరువాల్లో ఇరవైవేల టన్నుల బంగారం వృథాగా పడున్నట్టు ఆర్థికనిపుణుల అంచనా. సామాన్యులు పచ్చలోహపు వ్యామోహాన్ని కాస్త తగ్గించుకుని...ఆ మొత్తాన్ని మరో రూపంలో మదుపు చేస్తే మార్కెట్‌ పుంజుకుంటుంది, మౌలిక వనరులు మెరుగుపడతాయి. నాలుగు పరిశ్రమలు వస్తాయి. నలుగురికి ఉపాధి లభిస్తుంది. బంగారంతో పోలిస్తే (మహా అయితే ఏడెనిమిది శాతం) స్టాక్‌ మార్కెట్‌ మీద పెట్టుబడులే దీర్ఘకాలంలో మంచి రాబడిని (దాదాపు పదిహేను శాతం) ఇస్తాయని గత అనుభవాలూ చెబుతున్నాయి. ఓ దశలో సాక్షాత్తూ ఆర్థిక మంత్రిత్వశాఖే ‘బంగారం మీద మోజు తగ్గించుకోండి మహాప్రభో!’ అంటూ గడ్డం పట్టుకుని బతిమాలుకున్నా...మధ్యతరగతి పెడచెవిన పెట్టింది. మన ఆనందాలు మనకు ఎక్కువే. మన నమ్మకాలు మనకు విలువైనవే. కానీ, అవేవీ దేశం కంటే ఎక్కువ కాదు, దేశ ప్రగతికి ప్రతిబంధకం కాకూడదు. వ్యవస్థకు కష్టాలో నష్టాలో తెచ్చిపెట్టకూడదు. దేశం కోసం ఒంటిమీది నగలన్నీ ఒలిచి ఇచ్చిన తరం నుంచి మనం వారసత్వంగా అందుకున్న స్ఫూర్తి ఇదేనా!

నేనే..నా ప్రపంచం!
నేను వేరు, నా దేశం వేరు; నేను వేరు, నా ప్రభుత్వం వేరు; దేశం చెడిపోయినా నేను బాగుపడాలి, ప్రభుత్వం నష్టపోయినా నేను సొమ్ముచేసుకోవాలి - ఈ తరహా ద్వైదీభావం చాలా ప్రమాదకరం. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో సామాన్య ప్రజలు కలలో కూడా ఇలా ఆలోచించలేదు. తామే దేశమనుకున్నారు, దేశమే తామని భావించారు. తెల్లవాళ్లు దేశాన్ని కొల్లగొడుతుంటే కుతకుతా ఉడికిపోయారు. ‘ఇది మా దేశం. మేమే పాలించుకుంటాం, మీరిక దయచేయండి’ - అని నినదించారు. సరిగ్గా డెబ్భై నాలుగేళ్ల నాటి క్విట్‌ ఇండియా ఉద్యమంలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాలు ఏర్పాటు అయ్యాయి. మిడ్నాపూర్‌ ప్రాంతంలోని ప్రజా ప్రభుత్వం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు చరిత్రకారుడు బిపన్‌ చంద్ర తన పుస్తకంలో. ఆ జన సర్కార్లు విద్యారంగానికి పుష్కలంగా నిధులు కేటాయించాయి. తగాదాల్ని సత్వరంగా పరిష్కరించడానికి పెద్దమనుషుల ఆధ్వర్యంలో కోర్టుల్ని ఏర్పాటు చేశాయి. కరవు కాటకాల్లో...మధ్యతరగతి ప్రజలు తమ ఇళ్లలోని మిగులు ధాన్యాన్ని పేదలతో పంచుకున్నారు. మద్యపాన నిషేధాన్ని కచ్చితంగా అమలు చేశారు. అగ్రవర్ణాలవారు దళితుల్ని విందులకు ఆహ్వానించారు. ఎవరికివారు తమ దగ్గరున్న పుస్తకాల్ని ఇచ్చి గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. బలమైన ప్రజా భాగస్వామ్యం ఉంటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో, అన్నీ జరిగాయి. ‘మనం’ అన్న భావనలోని మహత్తే అది! ఆ అద్వైతం స్వాతంత్య్రం తర్వాత మెల్లగా కనుమరుగైపోతోంది. ‘నా...’ అన్న స్వార్థం బలపడుతోంది. ప్రజాస్వామ్యానికి పునాది లాంటి ఎన్నికల్ని కూడా జనం తేలిగ్గా తీసుకుంటున్నారు. పోలింగ్‌ తేదీని అచ్చమైన సెలవు దినంగా భావిస్తున్నారు. ఆ నిర్లిప్తత వల్లే, కనాకష్టంగా నూటికి డెబ్భైశాతం నమోదైనా ‘భారీ పోలింగ్‌’ అని మురిసిపోవాల్సిన దుస్థితి వచ్చింది! గత సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌ అరవై ఆరు శాతం పైచిలుకు మాత్రమే. ముప్ఫై ఒక్కశాతం ఓట్లను సొంతం చేసుకున్న పార్టీలు అతిపెద్ద రాజకీయ పక్షాలుగా పాలన చేపడుతున్నాయి. భవిష్యత్తులో, ఏ పదిశాతం ఓట్లు వచ్చినవాళ్లొ వందకోట్ల ప్రజల్ని పాలించినా పాలించవచ్చు. దీనివల్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి బలహీనపడుతుంది. ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించవు. సమర్థులనే విజయం వరిస్తుందన్న భరోసా ఉండదు. దొడ్డిదారి రాజకీయాలు పెరిగిపోతాయి. బలహీనమైన ప్రభుత్వాలు ఏర్పడతాయి. నాయకుడి సమయమంతా పీఠాన్ని నిలబెట్టుకోడానికే సరిపోతుంది. నిర్ణయాల్లో దార్శనికత ఉండదు. ఏపని చేసినా సంకుచిత రాజకీయ దృష్టితోనే, ఏ నిర్ణయం తీసుకున్నా ఓటర్లను వలలో వేసుకోడానికే. జనానికి పథకాల గాలం వేయాలంటే, ఖజానాలో నిధులు పుష్కలంగా ఉండాలి. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి ఆదాయాన్ని పెంచే తీరికా ఓపికా పాలకులకు ఉండదు. తక్షణం కనకవర్షం కురిసిపోవాలంతే. ఇంకేముంది, పంచభూతాల్ని చవగ్గా అమ్మేస్తారు. అక్రమ నిర్మాణాల్ని సక్రమం చేసేస్తారు. మద్యం దందాకు అండగా నిలుస్తారు. ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తున్నపనినే... అప్పట్లో బ్రిటిష్‌ సర్కారూ చేసింది. సారా వ్యాపారాన్ని పెంచి పోషించింది. షేక్‌స్పియర్‌, అలెగ్జాండర్‌ మొదలైన మద్యపాన ప్రియుల చిత్రాలతో ప్రకటనల్ని హోరెత్తించింది. అయినా, పప్పులు ఉడకలేదు. ప్రజలు మద్యం వలలో పడలేదు. దుకాణాలు మూసేయాలంటూ హర్తాళ్లు చేశారు. ఆ మనోస్థైర్యంలో పదోవంతు కూడా లేదిప్పుడు. ఏ పంద్రాగస్టునాడో దుకాణాన్ని మూసేసినా, సందుగొందుల్లోంచి సరుకు ఇవ్వకపోతారా అన్న ఆశతో ఓ పాతికయాభైమంది అయినా గుమిగూడతారు! మత్తు కోసం ఆరాటంలో...దుకాణం తెరిచి తీరాల్సిందే అంటూ ‘గాంధేయమార్గం’లో ధర్నాలు చేసినా చేస్తారు. మద్యం ఓ వ్యసనం కానేకాదిప్పుడు. సామాజిక అలవాటుగా మారిపోయింది. కాదుకాదు, మార్చేశారు!

 

నాయకత్వమేదీ...
ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా... ధారాసనా ఉప్పుకేంద్రం దగ్గర రెండువేలమంది స్వచ్ఛంద సేవకులు సమావేశం అయ్యారు. అంతకు పదిరెట్ల మంది పోలీసులు అప్పటికే సిద్ధంగా ఉన్నారు. హఠాత్తుగా ఇనుపమొనలున్న లాఠీలు పైకి లేచాయి. వందలమంది సత్యాగ్రాహుల తలలు పగిలాయి. కాళ్లూచేతులూ విరిగాయి. రక్తం ప్రవహించింది. అయినా శాంతిమంత్రాన్ని వదల్లేదు. ఆరునూరైనా అహింసా మార్గంలోనే నడవమని బోధించిన నాయకుడి మీద తిరుగులేని విశ్వాసమది! ‘తన చుట్టూ ఉన్న సామాన్యుల్ని కూడా వీరులుగా, ధీరులుగా తీర్చిదిద్దగల అతీంద్రియశక్తి గాంధీజీలో ఉంది’ అనేవారు గోపాలకృష్ణ గోఖలే. మహాత్ముడెప్పుడూ దుందుడుకు నిర్ణయాలు తీసుకోలేదు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చాక కూడా, ఏడాది సమయాన్ని భారతదేశంలో నెలకొన్న పరిస్థితుల మీద అధ్యయనానికే కేటాయించారు. ఆ లోతైన అవగాహన కారణంగానే, స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీజీ వ్యూహాలెప్పుడూ గురితప్పలేదు. పరిస్థితి చేజారిపోతున్నట్టు ఏ కాస్త అనుమానం వచ్చినా కార్యక్రమాన్ని అర్ధంతరంగా ఆపేసేవారు బాపూ. ఆ పరిణతి నేటి నాయకుల్లో కనిపించడం లేదు. కాబట్టే, పాలకుల నిర్ణయాలు అనేక సందర్భాల్లో ప్రజాగ్రహానికి గురవుతున్నాయి, న్యాయస్థానాల ముందు నిలబడలేకపోతున్నాయి. చాలా పథకాలు ప్రారంభోత్సవాలకే పరిమితం అవుతున్నాయి.

వ్యక్తిగత విరోధాల్నీ సైద్ధాంతిక వైరుధ్యాల్నీ ఒకే గాటన కట్టలేం. లాలా లజ్‌పతిరాయ్‌ అంటే భగత్‌సింగ్‌కు చాలా అభిమానం. చివరి రోజుల్లో లజ్‌పతిరాయ్‌ మత రాజకీయాలవైపు మొగ్గు చూపిన తీరు ఆయన్ని బాధించింది. తన వైఖరిని తెలుపుతూ కరపత్రాలు ముద్రించినా, ఎక్కడా లజ్‌పతిరాయ్‌ పేరు ప్రస్తావించలేదు. ‘జస్ట్‌ ఫర్‌ ఎ హ్యాండ్‌ఫుల్‌ ఆఫ్‌ సిల్వర్‌ హి లెఫ్ట్‌ అజ్‌...’ పిడికెడు వెండి కోసం బంగారంలాంటి మా ప్రేమను దూరం చేసుకున్నారాయన - అంటూ పరోక్షంగా ఓ ఆంగ్ల కవితను ఉటంకించారంతే! అంత హుందాగా ఉండేవా వ్యక్తీకరణలు. నేటి రాజకీయ విమర్శల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? కొన్నిసార్లు ఆ నేలబారు భాష ఉన్నతోన్నతమైన చట్టసభలోనూ మురుగునీరై ప్రవహిస్తోంది.
పాలకుల ముందైనా, ప్రజల ముందైనా రెండే మార్గాలు...
చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుని...
చరిత్ర సృష్టించడం.
చరిత్రను పూర్తిగా విస్మరించి...
చరిత్రలో కలసిపోవడం.
ఆ ఎంపికే...రేపటి చరిత్ర పుస్తకాల్లో మన స్థానాన్ని నిర్ణయిస్తుంది!

వరోధాలు వస్తుంటాయి. వైఫల్యాలు ఎదురవుతూ ఉంటాయి. కుట్రలూ కుతంత్రాలూ పోరాటాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తుంటాయి. అయినా సరే, సహనాన్ని కోల్పోకూడదు. సహనాన్ని కోల్పోతే విజయాన్ని కోల్పోయినట్టే.

- మహాత్మా గాందీ

స్వాతంత్య్రాన్నీ సార్వభౌమత్వాన్నీ కాపాడాల్సిన కర్తవ్యం సైనికులది మాత్రమే కాదు. ఆ బాధ్యత మన మీదా ఉంది. ఆ శత్రువు కంచెకు అవతలే ఉండాలని లేదు. లోపలా ఉండవచ్చు. పారా హుషార్‌!

- లాల్‌ బహదూర్‌ శాస్త్రి

గొప్పగొప్ప కలలు కనవచ్చు. ఉన్నతమైన ఆశయాలు ఉండవచ్చు. విలువైన మానవ వనరులు సమకూర్చుకోవచ్చు. శాంతి కరవైన చోట అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే.

- జవహర్‌లాల్‌ నెహ్రూ

స్వేచ్ఛ అనేది ధైర్యంలోంచి వస్తుంది. ధైర్యం అనేది ఒకరు ఇద్దరుగా, ఇద్దరు నలుగురిగా, నలుగురు పదిమందిగా...చేతులు కలిపే సమష్టి భావన నుంచి వస్తుంది. బలమైన సరిహద్దు కంటే...బలమైన సైన్యంతోనే, మనోబలం ఉన్న ప్రజలతోనే ఏ జాతికైనా భద్రత.

- బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌

విప్లవం అంటే అన్ని సందర్భాల్లోనూ రక్తంతో తడిసి ముద్దయిపోయే పోరాటాలే కానక్కర్లేదు. బాంబులూ తుపాకుల మోతలు వినిపించాల్సిన పన్లేదు. అన్యాయం, వివక్ష ఆధారంగా ఏర్పడిన వ్యవస్థను మార్చడానికి జరిగే ఏ పోరాటమైనా విప్లవమే.

- భగత్‌సింగ్‌

నా దృష్టిలో రాజీపడటాన్ని మించిన నేరం లేదు. అది విలువల విషయంలో కావచ్చు, స్వేచ్ఛ విషయంలో కావచ్చు. అన్యాయంతోనో అక్రమంతోనో అయినా కావచ్చు. భవిష్యత్తు పట్ల నమ్మకాన్ని కోల్పోయినప్పుడే రాజీపడాలన్న ఆలోచన వస్తుంది. ఆ పరిస్థితి ఎప్పుడూ తెచ్చుకోకూడదు.

- సుభాష్‌ చంద్రబోస్‌

నిజమైన నాయకుడు అధికారం కోసం ఆరాటపడడు. అంతిమ అధికారం ప్రజల చేతుల్లోంచి జారిపోకుండా కాపలా కాస్తాడు.

- జయప్రకాశ్‌ నారాయణ్‌

పౌరుడైనా పాలకుడైనా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది - మన మంచితనం ఎప్పుడూ మన బలహీనత కాకూడదు. మనం చేస్తున్న పని మీద నమ్మకం, ఆ నమ్మకాన్ని నిజం చేసుకోగల శక్తి ... ఏ విజయానికైనా ఈ రెండూ అవసరం.

- సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.