close
కృష్ణమ్మ పిలుస్తోంది!

కృష్ణమ్మ పిలుస్తోంది! 

ముగ్గురు మూర్తులూ ముమ్మూర్తులా నదిలా మారి గలగలా పారే పౌరాణిక గాథలూ...బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించే దివ్య ముహూర్తమిదేనంటూ పౌరోహితుల పంచాంగం లెక్కలూ...ముత్తాత పేరేమిటి, తాతగారి వేలువిడిచిన మేనత్త గోత్రమేమిటంటూ పిండప్రదానాల కోసం మూడుతరాల్నీ తలుచుకునే మునిమనవల కుతూహలాలూ...పుష్కరాల పన్నెండురోజులూ కృష్ణాతీరాలు ఎక్కడెక్కడి తెలుగువారినో దండలా గుదిగుచ్చే దారాలు!

త్తరం వైపు నుంచి ఓ రాజహంస వచ్చింది. వయ్యారంగా అడుగులేస్తూ...తనకంటే వయ్యారంగా ప్రవహిస్తున్న ఓ నదీమతల్లిని చేరుకుంది. ఆ పవిత్ర స్నానంతో...వెండిపాత్రను బంగారపు ద్రావకంలో అద్దినట్టు కొత్త మెరుపేదో వచ్చిందా రాయంచకు.
ఆ హంస...గంగానది!
ఆ పవిత్ర తీర్థం...కృష్ణానది!
అందరి పాపాల్నీ ప్రక్షాళన చేసే గంగమ్మ...తన మురికిని వదిలించుకోడానికి మాత్రం, హంసలా వచ్చి కృష్ణానదిలో స్నానమాడుతుందని ఓ నమ్మకం. పుష్కర సమయంలో అయితే, ఆ పన్నెండు రోజులూ గంగమ్మ నివాసం కృష్ణలోనేనంటారు. కాబట్టే, కృష్ణలో మునకలేస్తే గంగాస్నానమంత ఫలమని చెబుతారు. ఒక్క గంగేనా, సర్వతీర్థాల సారం కృష్ణమ్మ, సకల దేవతల స్థావరం కృష్ణాతీరం!

నమామి సుకృతం శ్రేణిం కృష్ణవేణిం తరంగిణీం
యద్వీక్షణం కోటి జన్మకృత దుష్కర్మ శిక్షణం
- కృష్ణా తరంగాల్ని చూసినా చాలు, కోటి జన్మల పాపాలు హరించుకుపోతాయట. ఇక కృష్ణలో పుష్కర స్నానంచేస్తే...ఓ అశ్వమేధయాగం చేసినంత ఘనత, లక్ష గోదానాల పుణ్యం.

కృష్ణావతరణ...
కృష్ణ ఉద్భవించిన తీరు గంగావతరణను తలపించే మనోజ్ఞ ఘట్టం. చాక్షుస మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్యాద్రి మీద యాగాన్ని తలపెట్టాడు. ముక్కోటి దేవతలూ అతిథులుగా వచ్చారు. సప్తర్షులు రుత్వికుల స్థానంలో కూర్చున్నారు. శివకేశవులే స్వయంగా యాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. సుముహూర్తం సమీపించింది. అయినా బ్రహ్మదేవుడి ఇల్లాలి జాడ లేదు. సరస్వతమ్మ ఎక్కడికెళ్లిందో తెలియదు. ఎప్పుడొస్తుందో తెలియదు. యజ్ఞాన్ని ధర్మపత్నీ సమేతంగానే నిర్వహించాలి. బ్రహ్మదేవుడికి ఏం చేయాలో తోచలేదు. మహాకార్యాన్ని ఆపడం అరిష్టం. వాయిదా వేయడం ఇంకా అశుభం. దేవతలు ఓ సూచన చేశారు. రెండోభార్య గాయత్రీదేవిని సరస్వతి స్థానంలో కూర్చోబెట్టి ఆరంభించేద్దామన్నారు. సృష్టికర్తకు సబబుగానే తోచింది. గణపతి పూజతో యాగం మొదలైంది. అంతలోనే, సరస్వతీదేవి వచ్చింది. ‘నా స్థానంలో మరొకరా?’ అంటూ పలుకుచల్లని తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. ‘పొండి..మీరంతా నదీనదాలై ప్రవహించండి’ అని దేవతలకు శాపం పెట్టింది. అంతే! బ్రహ్మ కకుద్మతిగా మారాడు. మిగతా దేవతలు...భీమా, వర్ణ, తుంగభద్ర...ఇలా తలో పేరుతో ప్రవహించారు. విష్ణుమూర్తి కృష్ణగా మారితే, శివుడు వేణిగా అవతరించాడు. కృష్ణలో సంగమించే తొలినది...వేణి! కృష్ణో కృష్ణ తనుస్సాక్షాత్‌, వేణ్యా దేవో మహేశ్వరః...కృష్ణలో కృష్ణస్వరూపం, వేణిలో ఈశ్వరాంశ! అలా, హరిహరులు ఒక్కటై ప్రవహించి ‘శివాయ విష్ణురూపాయ...’ అన్న సత్యాన్ని చాటిచెప్పారు. ఆతర్వాత, కకుద్మతి వచ్చిచేరింది. కృష్ణ ముగ్గురు మూర్తులకూ మారుపేరైంది. మిగతా దేవతలు కూడా...ఉపనదులై ఏదో ఓ ప్రాంతంలో సవినయంగా సంగమించారు. అందుకే, కృష్ణలో స్నానం చేస్తే ముక్కోటిదేవతలకూ మొక్కినట్టేనంటారు. స్కాందపురాణంలోని సహ్యాద్రిఖండంలో ఉందీ గాథ.

మరో ఐతిహ్యం ప్రకారం...ద్వాపరయుగం అంతరించే రోజు దగ్గర పడింది. కలిపురుషుడి ప్రభావం మెల్లగా మొదలైపోయింది. మనిషిలో పెరుగుతున్న స్వార్థాన్నీ, హింసా ప్రవృత్తినీ చూసి మహర్షులు కలవరపడ్డారు. ఆ మనోమాలిన్యాల్ని కడిగేసే పుణ్యతీర్థాన్ని ప్రసాదించమని పరమశివుడిని వేడుకున్నారు. గంగాధరుడు ఓ నదీకన్యను సృష్టించి భూమి మీదికి వదిలాడు. ‘ఈ కృష్ణ పాపపంకిలాన్ని తొలగిస్తుంది’ అని ఆనతిచ్చాడు. మహర్షులు పరమానందభరితులు అయ్యారు. కృష్ణ అంటే..హరించేది అన్న నిగూఢార్థమూ ఉంది.

ఈ రెండూ కాకుండా, ఇంకో కథా ప్రచారంలో ఉంది. మహాప్రళయం యావత్‌ జీవరాశినీ మింగేసింది. బ్రహ్మదేవుడు మరొక్కమారు సృష్టికార్యాన్ని ఆరంభించాడు. పునరపి జననం, పునరపి మరణం. ఆ బొమ్మలాట బ్రహ్మతాతకు కొత్తకాదు. అంతలోనే, ‘మనిషి స్వార్థపరుడు. విషయలోలుడు. చేతులారా కష్టాల్ని కొనితెచ్చుకుంటున్నాడు. అతడిలోని అజ్ఞానాన్ని తొలగించే మార్గమేలేదా?’ అన్న సందేహం కలిగింది చతుర్ముఖుడికి. నివృత్తి చేయమంటూ సృష్టిస్థితిలయ కారకుడైన మహావిష్ణువును ఆశ్రయించాడు. ఆ సమస్యకు పరిష్కారంగా, తన అరచేతిలో ఓ జలరాశిని సృష్టించాడు విష్ణుమూర్తి. ‘ఈ నీటిని చిలకరించుకున్నా చాలు. అజ్ఞానాంధకారం అంతరిస్తుంది’ అని ముక్కోటి దేవతలకూ కృష్ణాజలాల మహత్యాన్ని వివరించాడు. ఆ ప్రవాహాన్ని భూలోకంలో ఎక్కడ ప్రతిష్ఠించాలనే విషయంలో త్రిమూర్తులూ ఓ నిర్ణయానికి రాలేకపోయారు. ఓ చోట మహాపర్వతంలా స్థిరంగా తపస్సు చేసుకుంటున్న సహ్యముని కనిపించాడు. విష్ణువు ఆ భక్తుడిని కటాక్షించాడు. ఆరాధ్యదైవం కళ్లముందు కనిపించగానే ముని పరవశించాడు. ‘కేశవా...నారాయణా..మధుసూదనా...నా జన్మ ధన్యమైంది. ఈ జీవితానికో అర్థాన్నీ పరమార్థాన్నీ ప్రసాదించు’ అని వేడుకున్నాడు. ‘నువ్వు పర్వతరూపాన్ని ధరించి ఓ మహానదికి జన్మస్థానంగా మారబోతున్నావు. నీ జన్మ చరితార్థం అవుతుంది’ అని శ్రీహరి ఆనతిచ్చాడు. అలా, సహ్యమునే సహ్యాద్రిగా అవతరించాడు. ఆ శిఖరం మీద మహావిష్ణువు శ్వేత అశ్వత్థవృక్షంగా వెలిశాడు. ఆ వృక్ష అంతర్భాగం నుంచే కృష్ణాప్రవాహం మొదలైంది. విష్ణుమూర్తి అంశ కాబట్టి కృష్ణగా జగద్విఖ్యాతమైంది.

నల్లరేగడి మీద మజిలీ మొదలైంది కాబట్టి, మట్టి స్వభావాన్ని బట్టి ‘కృష్ణ’ అన్న పేరొచ్చిందనీ చెబుతారు. కృష్ణవేణి ప్రవాహరీతి...విరిబోణిని తలపించేలా ఉంటుంది. కృష్ణ, భీమానదులు కలిసే ప్రదేశం...కోమలాంగి కొప్పునకు చుట్టుకున్న పూలమాలను గుర్తుకు తెస్తుంది. ఆ రూపానికి తగ్గట్టే ‘కృష్ణవేణి’ అనే... కాసులపేరులాంటి అందమైన పేరొచ్చిందని కూడా అంటారు. ఏది నిజమో, ఎంత నిజమో ఎవరు చెబుతారు? అయినా, కృష్ణమ్మ ఇప్పటిదా? సృష్టి ఆరంభానికి ముందే పుట్టిందని బ్రహ్మాండపురాణం చెబుతోంది. 9,81,080 సంవత్సరాల నాటిదని పద్మపురాణం వివరిస్తోంది. ‘సదా నిరామయాం, కృష్ణాం మందగాం మందగామినీం..’ అంటూ మహాభారతంలో వ్యాసభగవానుడు కూడా కొనియాడాడు.

కథా తరంగాలు..
వరుణలోక వాసిని అయిన కృష్ణ...మహారాష్ట్రలోని సహ్యాద్రిలో పుట్టి...కన్నడిగుల ఇంట కస్తూరి తిలకం దిద్దుకుని ...తెలంగాణలో కుడికాలు మోపి...ఆంధ్రరాష్ట్ర తొలి రాజధాని ప్రాంతం నుంచి ఆంధ్రుల ప్రజా రాజధాని మీదుగా బిరబిరా పరుగులిడుతూ...బంగారు పంటలు పండిస్తూ, మురిపాల ముత్యాలు దొరలిస్తూ...హంసలదీవి దగ్గర సముద్రుడితో సంగమించేదాకా ఆ పద్నాలుగు వందల కిలోమీటర్ల ప్రస్థానం...మనిషికో మానవతా పాఠం. ఆ జలరాశి లక్షల ఎకరాల నేలను సస్యశ్యామలం చేసింది, వేల గ్రామాల గొంతులు తడిపింది, అనేక పరిశ్రమలకు ఆధారంగా నిలిచింది, ఎన్నెన్నో జలచరాలకు ఆవాసమైంది. ఆ ఒడ్డున వెలసిన తీర్థాలు అనేకం. అందులో వైష్ణవ ఆలయాలున్నాయి, శైవక్షేత్రాలూ ఉన్నాయి. ఏ శివుడో, విష్ణువో భక్తులకు కలలో కనిపించి కృష్ణాతీరంలో కోవెల నిర్మించమంటూ కోరికోరి కట్టించుకున్న గుడులెన్నో! విష్ణుమూర్తికి కృష్ణానివాసం పాలకడలిలో పవళించినంత సౌఖ్యాన్ని ఇస్తుంది కాబోలు. పరమశివుడికి వెన్నెల రాత్రుల్లో ఆ ఇసుకతిన్నెలు వెండికొండను గుర్తుచేస్తాయేమో మరి. అందుకే అంత కృష్ణాభిమానం! ఆ ఒడ్డున సిద్ధ పురుషుల సమాధులూ అనేకం. నరపతులూ గజపతులూ ఏనుగెత్తు సంపదనిస్తామన్నా...‘కృష్ణాతీరంలో ఆశ్రమం కట్టుకోడానికి కాస్తంత జాగా ఇస్తే చాలు’ అంటూ నిధితో పోలిస్తే కృష్ణమ్మ సన్నిధే సుఖమని భావించిన సాధుసంతులు ఎంతోమంది!

కృష్ణా నీటికి మనసుల్ని మార్చే శక్తీ ఉందంటారు. ఓసారి ఒకానొక తురుష్క పాలకుడికి నేటి మహబూబ్‌నగర్‌జిల్లాలోని ఓ సంస్థానాధీశుడి మీద కోపం వచ్చింది. సమయానికి కప్పం కట్టకపోతే సైన్యాన్ని పంపాల్సి వస్తుందని హూంకరించాడు. ‘వరుస కరవులు ఖజానాను ఖాళీ చేశాయి జహాపనా!’ అని బతిమాలినా వినిపించుకోలేదు నవాబు. ముఖ్యకేంద్రం నుంచి పటాలం బయల్దేరింది. చీకటిపడిపోవడంతో సైన్యం కృష్ణాతీరంలో గుడారాలు వేసుకుంది. అసలే దప్పికగొన్న ప్రాణాలు. ఆ నీళ్లతో కడుపునింపుకున్నారు. ఆ మహత్తే కావచ్చు. అప్పటిదాకా సంపదల్ని ఎలా కొల్లగొట్టాలా, ప్రజల్ని ఎలా హింసించాలా అని ఆలోచించినవాళ్లు కాస్తా... ‘నిజమే కదా! నిన్న మొన్నటిదాకా పంటల్లేవు. ప్రజలు పన్నులెలా కడతారు, పాలకుడు కప్పమెలా చెల్లిస్తాడు? ఆ అమాయకుల మీద దాడి న్యాయం అనిపించుకోదు. అల్లా క్షమించడు’ అంటూ బాధపడిపోయారు. ప్రభువు ఆదేశాన్ని పక్కనపెట్టి, తిరుగు ప్రయాణం అయ్యారు. పూర్వం పరశురాముడు కూడా కృష్ణాజలాల్ని తీర్థంగా స్వీకరించి...తనలోని క్రోధాగ్నిని చల్లబరుచుకున్నట్టు ఐతిహ్యాలు చెబుతున్నాయి. కృష్ణ, మలాపహరిణి నదులు సంగమించే చోట...భార్గవరాముడు ఘోరతపస్సు చేసి, క్షత్రియ సంతతిని నాశనం చేసిన పాపాన్ని వదిలించుకున్నాడట.

మనం తినే ఆహారానికి మన ఆలోచనల్ని ప్రభావితం చేసే శక్తి ఉంది. అలాంటప్పుడు, ఆహారంలో భాగమైన నీటికి మాత్రం మంచిచెడుల్ని ప్రేరేపించే గుణం లేకుండా ఎలా ఉంటుంది? అందులోనూ, మనిషి శరీరంలో అరవై శాతానికిపైగా నీళ్లే. కృష్ణా పరివాహక ప్రాంత ప్రజల విషయంలో అవి కృష్ణా జలాలే! పంచామృతంలో...నెయ్యి, తేనె, పాలు, పెరుగు, ఫలాలు ఉన్నట్టు...కృష్ణా నీటిలో ప్రేమగుణం అపారం, కళాభిరుచి అనంతం! ఆత్మాభిమానం అంతర్లీనం! కాబట్టే, ఆ ఒడ్డున ఎంతోమంది కవులూ రచయితలూ జన్మించారు. పోరాటయోధుల పురిటిగడ్డ ఈ ప్రాంతం. కృష్ణా తీరంలో...రఘునాథుడనే పాలకుడు శత్రువుల తలల్ని తెగనరుకుతుంటే, అతడి రాణుల కన్నీళ్లు కాటుకతో కలసి ప్రవహించడం వల్లే కృష్ణ నల్లబారిపోయిందని రామరాజభూషణుడు ఓ కావ్యంలో వర్ణిస్తాడు. ఇక పల్నాటి వీరత్వం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది! ఆ గడ్డమీద కోడిపుంజులైనా కొదమ సింహాలే! నల్లగొండ బిడ్డల పోరాట పటిమ మాత్రం సామాన్యమైందా? రజాకర్ల దౌర్జన్యాలనూ దొరల పెత్తనాలనూ ధైర్యంగా ఎదిరించారు, ప్రాణాలకు తెగించి పోరాడారు.

 

ఆ రూపం అపురూపం..
కృష్ణమ్మ కళ్లు తన ప్రవాహంలోని మీనాలతో పోటీపడతాయట. కృష్ణమ్మ మేనిఛాయ సూర్యోదయ సమయంలో నీటి బిందువులా మెరిసిపోతుందట. ఆ కేశాలు తుమ్మెదల గుంపును తలపించేంత ఒత్తుగా ఉంటాయట. ‘దివ్యమూర్తిం, సులోచనాం...’ అంటూ స్కాందపురాణం కృష్ణవేణి సౌందర్యాన్ని వర్ణించింది. తెలుగు కవులకు ఆమె అందచందాలు అద్భుత కవితావస్తువులు. కృష్ణాతరంగాల్లో కోటి భావాల్ని వెతుక్కుంటారు. ఆ గలగలలది నిర్నిద్రాగానమంటారు విశ్వనాథవారు. రేయింబవళ్లూ ఆ సుస్వరాలు వినిపిస్తూనే ఉంటాయట! వేటూరి సుందరరామమూర్తి ఓ అడుగు ముందుకేసి.. ఆ తరంగాలు ఫలానా రాగంలో ఉంటాయని తేల్చిచెప్పారు, ‘కృష్ణాతరంగాల సారంగరాగాలు’ అంటూ! శ్రీనాథుడే పాపం! కృష్ణాతీరంలోని గొడ్డుపల్లిలో కౌలుసేద్యం చేసి చేతులు కాల్చుకున్నాడు. ‘కృష్ణవేణమ్మ గొనిపోయె నింత ఫలము...ఎట్లు చెల్లింతు టంకంబులేడునూర్లు’ అని బాధపడిపోయాడు. కవి అన్నవాడు నవరసాల్నీ రాయడమే కాదు, అనుభవించాలి కూడా! అప్పుడే ఆ రచనకు నిండుదనం. అందుకేనేమో, కస్తూరి ఘుమఘుమలూ కాంతా పరిష్వంగాలూ మాత్రమే తెలిసిన కవిసార్వభౌముడికి కష్టనష్టాలనూ రుచి చూపింది కృష్ణ.

కృష్ణమ్మకు జేజే
పంటలిచ్చి కడుపునింపే తల్లికి, నీళ్లిచ్చి గొంతు తడిపే దేవతకు...పన్నెండేళ్లకోసారి జరిగే మాతృవందన కార్యక్రమమే పుష్కరం. కృష్ణానదికి పుష్కరాలంటే, తెలుగు జాతికంతా ఓ పెద్ద పండగ. కనీసం కోటిమంది పుష్కర స్నానాలు చేస్తారని అంచనా. ఎంతెత్తుకు ఎదిగినా, గువ్వలా ఒదిగిపోయి.. ఒళ్లొ వాలిపోతున్న బిడ్డల్ని చూసి కృష్ణమ్మ ఎంత మురిసిపోతుందో! ఆతల్లి తన బిడ్డలకు ఉగ్గుపాలతో నేర్పే పాఠం - పంచుకోవడం! పరివాహక ప్రాంతాల్లోని పచ్చని పంటలూ, ఖరీదైన భూములూ ఆ మాతృమూర్తి పంచి ఇచ్చిన పప్పుబెల్లాలే. ‘అచ్చంగా మాది అమ్మ పోలికే’ అని చాటుకోడానికైనా ఆ పన్నెండు రోజులూ బట్టలో, బత్యాలో, భోజనమో...మనకున్నదేదో నలుగురితో పంచుకోవాలి. ఎక్కడో మహారాష్ట్రలో పుట్టిన కృష్ణ...తెలుగువారు ఏమౌతారని ఇంతదూరం వచ్చింది? ఈ గడ్డమీదే, హంసలదీవి దగ్గర అవతారాన్ని చాలించింది? అదే రుణానుబంధం అంటే. ఆ తల్లి సంస్కారానికి వారసులుగా...ఆ ఇసుకతిన్నెల మీద కూర్చుని...‘భరతవర్షే, భరతఖండే, కృష్ణాతీరే ...’ అంటూ సంకల్పం చెప్పుకోవాలి. మూడుతరాల పెద్దల పేర్లనీ నెమరేసుకోవాలి. ఆ విషయంలోనూ కృష్ణమ్మే ఆదర్శం. తన పుట్టింటి ఆనవాళ్లు ప్రపంచానికి తెలిసేలా ‘సహ్యజ’ అని పేరుపెట్టుకుంది. మూలాల్ని గుర్తుంచుకోవడం, మూలపురుషుల్ని స్మరించుకోవడం కనీస బాధ్యతని గుర్తుచేసింది.

కృష్ణమ్మ తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్ని వాగుల్ని ప్రేమగా వాటేసుకుంది, ఎన్ని వంకల్ని వంకపెట్టకుండా దగ్గరికి తీసుకుంది, ఎన్ని ఉపనదుల్ని సగౌరవంగా తనలో ఇముడ్చుకుంది. ‘ఇంద్రకీలాచలమ్మెంత యెత్తో అంతలోతు నీ గుండె...’ అంటారు దాశరథి కృష్ణమాచార్య. ఆ ఔదార్యాన్నీ, ఆ సహజీవన సౌందర్యాన్నీ మనమూ అలవరచుకోవాలి. నాలుగువేదాలూ వేలాది రుక్కుల రూపంలో చెప్పిన విషయాన్నే కృష్ణవేణి ఆచరించి చూపింది. కాబట్టే, ‘సర్వవేదమయం సాక్షాద్బ్రహ్మ విష్ణు శివాత్మకం...’ అని కొనియాడాయి పురాణాలు.

పుష్కరం అంటే ‘పరిపూర్ణం’ అన్న అర్థమూ ఉంది. జీవన ప్రవాహం నదిలా నలుగురికీ ఉపయోగపడినప్పుడే...మనిషి పుట్టుకకు పరిపూర్ణత. నదిని మనం తలుచుకున్నట్టు, మనల్ని జనం తలుచుకుంటారు.
ఇదే, పుష్కర పరమార్థం.
ఇదే, కృష్ణమ్మ సందేశం.

 


కృష్ణావతారం

 

  పేరు: కృష్ణానది
పుట్టింది : పడమటి కనుమలలోని మహాబలేశ్వర్‌ వద్ద సముద్ర మట్టానికి 470 అడుగుల ఎత్తులో (మహారాష్ట్ర).
సముద్రంలో కలిసేది : హంసలదీవి దగ్గర బంగాళాఖాతంలో (ఆంధ్రప్రదేశ్‌).
సమాదరించే రాష్ట్రాలు : మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌
సమాగమించే ప్రవాహాలు : వెన్నవాగు, కాళిగంగ, వర్ణానది, పంచగంగ, ధూద్‌గంగ, ఘటప్రభ, మలప్రభ, భీమా, తుంగభద్ర, మూసీ, దిండివాగు, పాలేరు, మున్నేరు, కొండవీటి వాగు.. ఇలా ఎన్నో!
ప్రధాన ప్రాజెక్టులు : హిప్పరగి, ఆలమట్టి, నారాయణపూర్‌, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జునసాగర్‌, పులిచింతల, ప్రకాశం బ్యారేజి.
పుణ్యక్షేత్రాలు : మహారాష్ట్రలోని జన్మస్థానం మొదలు హంసలదీవిలోని వేణుగోపాలస్వామి ఆలయం దాకా...రెండొందల వరకూ!
పరివాహక ప్రాంతం : 2.58 లక్షల చదరపు కిలోమీటర్లు.
తెలుగు రాష్ట్రాల వాటా 29.45 శాతం.


ఏటా పండగే! 

నం పన్నెండేళ్లకోసారి పుష్కరాల పేరుతో కృష్ణమ్మను తలుచుకుంటాం. మహారాష్ట్రీయులు మాత్రం...ఏడాదికోసారి ఆ తల్లికి ఉత్సవాలు జరుపుతారు. కృష్ణ జన్మస్థానమైన మహాబలేశ్వరానికి దిగువన...కృష్ణాతీరంలో కొలువైన పట్టణం వాయి. ఇది వంద ఆలయాల గ్రామం. ఇక్కడ కృష్ణకు ఏడు ఘాట్లు ఉన్నాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి మొదలు పౌర్ణమి దాకా...కృష్ణా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆటపాటల మధ్య అమ్మవారి విగ్రహాన్ని వూరేగిస్తారు. దీనివెనకో గాథ ఉంది. అఫ్జల్‌ఖాన్‌ అనే తురుష్క సేనాని శివాజీ మీదికి దాడికొచ్చాడట. ఆ విషయం తెలిసి, ఇక్కడి పూజారి శెందేశాస్త్రి శివరాజును కంటికిరెప్పలా కాచుకోమని కృష్ణమ్మను వేడుకున్నాడట. పోరాటంలో శివాజీ ఘనవిజయం సాధించాడు. అలా, జలకృష్ణ...జయకృష్ణగానూ పేరుతెచ్చుకుంది.


‘కృష్ణ’ లీలాతరంగిణి! 

నారాయణతీర్థుడిని మనిషిగా బతికించి, కవిగా జన్మనిచ్చిన ఘనత కృష్ణానదిదే. ఓ కథనం ప్రకారం...ఆయన భార్య పుట్టిల్లు కృష్ణానదికి అవతల ఉన్న గింజుపల్లి. ఓసారి అత్తారింటికి వెళ్లడానికి కృష్ణానదిని దాటుతుండగా...ఉద్ధృతంగా వరద వచ్చింది. ఇంకేముంది, మృత్యువుకు ఆమడదూరంలో ఉన్నట్టే. ఏం చేయాలో తోచని పరిస్థితి. ‘సన్యాసం తీసుకుని ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతానని కృష్ణమ్మకు మాటివ్వు. ఆ తల్లే నీకు దారి చూపుతుంది’ అంటూ ఓ దివ్యవాణి వినిపించింది. ‘అమ్మా! కరుణించు...’ అని వేడుకున్నాడు. కృష్ణ అనుగ్రహించింది. గండం గడిచిపోయింది. ఆయన ‘కృష్ణలీలా తరంగిణి’ అనే ప్రసిద్ధ కావ్యాన్ని రచించాడు. కృష్ణా తీరంలో ఇసుక తిన్నెలమీద సేదతీరుతూ ‘కృష్ణం కలయ సఖీ సుందరం...’ అని తన్మయంగా పాడుకుంటూ ఉంటే, చిన్నికృష్ణయ్య బొజ్జమీద నిలబడి తకధిమి, తకధిమి అంటూ నాట్యం చేసేవాడట!


 

(ఫొటోలు: శ్రీనివాస పట్నాయక్‌, సంపత్‌)

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.