close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కనిపించని... నాలుగో సింహం!

కనిపించని... నాలుగో సింహం!

వీధిలో నడుస్తున్నా, ఆఫీసులో పనిచేస్తున్నా, మాల్‌లో షాపింగ్‌ చేస్తున్నా, గుళ్లొ పూజకు కూర్చున్నా... ఎక్కడున్నా సీసీ కెమెరా కళ్లు మనల్ని గమనిస్తూనే ఉంటాయి. ఆ నిఘా నేత్రం నుంచి ఎవరూ తప్పించుకోలేరు.హైదరాబాద్‌లోని సిద్దియంబర్‌ బజార్‌. రాత్రి పదకొండు గంటల సమయం. ఓ టైర్ల వ్యాపారి ఎప్పటిలాగానే దుకాణానికి తాళమేసి స్కూటరు ఎక్కాడు. కొద్దిదూరం వెళ్లగానే..ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా బండికి అడ్డొచ్చాడు. దీంతో అతడు కిందపడిపోయాడు. ఆ అగంతకుడు వ్యాపారి చేతిలోని డబ్బు సంచీ లాక్కుని, అదే స్కూటరు మీద పారిపోయాడు. ఆ సంచిలో పన్నెండు లక్షల రూపాయల నగదు ఉంది. ‘నగరం నడిబొడ్డున దోపిడి’ - అంటూ టెలివిజన్‌ ఛానళ్లు హోరెత్తించాయి.
ఆ దొంగ దొరికాడా?
ఆ దోపిడి ఎవరి పని?

* * *

మాదాపూర్‌లో పనిచేస్తున్న ఓ ఐటీ ఉద్యోగిని మాల్‌లో షాపింగ్‌ ముగించుకుని హాస్టలుకు బయల్దేరింది. ఎంతసేపు నిలుచున్నా ఒక్క బస్సూ రాలేదు. అంతలోనే ఓ ఖరీదైన వాహనం ఆమె ముందు ఆగింది. యాభై రూపాయలు ఇస్తే, హాస్టలు దగ్గర దించేస్తానన్నాడు చోదకుడు. మరో ఆలోచన లేకుండా ఎక్కేసింది. అప్పటికే అందులో ఇద్దరున్నారు. వాహనాన్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. దురుద్దేశాన్ని పసిగట్టి, బెంగళూరులోని స్నేహితుడికి ఫోన్‌ చేసిందా అమ్మాయి. మాట్లాడేలోపు దుండగులు ఫోన్‌ లాగేసుకున్నారు. వరుస అత్యాచారాలతో నరకం చూపించారు. ప్రమాదాన్ని వూహించిన మిత్రుడు, హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తెల్లారేసరికి ఆ యువతిని రోడ్డు మీద వదిలేసి వెళ్లారా దుండగులు. అందులో ఏ ఒక్కరి వివరాలూ చెప్పలేకపోయిందా యువతి. వాహనం నంబరు కూడా గుర్తులేదామెకు.

పోలీసులు ఎలా పరిశోధించారు?
దుర్మార్గులు చట్టానికి చిక్కారా, లేదా?

* * *

పాతబస్తీలో ఓ వ్యాపారవేత్త తనయుడు కనిపించకుండా పోయాడు. డబ్బు కోసం ఎవరో కిడ్నాప్‌ చేశారని తల్లిదండ్రుల ఫిర్యాదు. అంతకుమించి ఎలాంటి ఆధారమూ లేదు. అంతలోనే ఆ కుర్రాడు శవమై కనిపించాడు.

అసలేం జరిగింది?

ఎవరీ అఘాయిత్యానికి పాల్పడ్డారు?

* * *

ఈ మూడు కేసుల్లోనూ సీసీ కెమెరాలే పోలీసులకు దుండగుల ఆచూకీ చెప్పాయి, నేర పరిశోధనను నిర్విఘ్నంగా ముందుకు నడిపించాయి. సిద్దియంబర్‌ బజార్‌ దోపిడి గుట్టు ఒకట్రెండు రోజుల్లో వీడిపోయింది. పొరుగు దుకాణంలో పనిచేస్తున్న యువకుడే అపరాధి. జల్సాలకు అలవాటు పడిపోయి...డబ్బు కోసం ఆ కుట్రపన్నాడు. అంత పక్కాగా నేర ప్రణాళిక రచించినవాడు, వీధుల్లో సీసీ కెమెరాలు ఉంటాయన్న విషయాన్ని మాత్రం గుర్తించలేకపోయాడు.వ్యాపారవేత్త తనయుడి కిడ్నాప్‌ కూడా తెలిసినవారి పనే. ఇక్కడా, డబ్బు కోసమే ఘాతుకానికి పాల్పడ్డారు. ఆ కుర్రాడిని కిడ్నాపర్లు తీసుకెళ్తున్న దృశ్యం ఇరవైరెండు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. దీంతో నేరం జరిగిన క్రమాన్ని పోలీసులు సులభంగానే గ్రహించారు.

ఐటీ ఉద్యోగిని కేసు పోలీసులకు సవాలుగా నిలిచింది. ఎవరో తెలియదు, ఏ వాహనంలో వచ్చారో తెలియదు. బాధితురాలు చెప్పిన సమయాన్ని బట్టి చూస్తే, ఓ పాఠశాల సీసీ కెమెరాలో ఓ వాహనం కదలికలు కనిపించాయి. అవీ అస్పష్టంగానే ఉన్నాయి. స్పష్టత కోసం ‘ఇమేజ్‌ ఎన్‌హ్యాన్స్‌మెంట్‌ టెక్నాలజీ’ని ఉపయోగించుకున్నారు. అయినా, వాహనం నంబరు ప్లేటును గుర్తించలేకపోయారు. లోగో తప్ప మరేమీ కనిపించలేదు. ఆ బ్రాండు వాహనాల్ని ఉపయోగిస్తున్న డెబ్భై ఏడుమంది జాబితా తీస్తేగానీ, యజమాని ఎవరో తెలియలేదు. అతడు ఓ ట్రావెల్‌ ఏజెన్సీకి అద్దెకిచ్చాడు. ఆ బండిని నడిపే డ్రైవరు ఘాతుకమే ఇది.

...ఇవే కాదు, నగర ప్రాంతాల్లో నూటికి డెబ్భైశాతం కేసుల్ని క్లోజ్డ్‌ సర్క్యూట్‌ కెమెరాలే పరిష్కరిస్తున్నాయి. సీసీ కెమెరా వందమంది పోలీసులకు సరిసాటిగా నిలుస్తోంది.

దిల్‌సుఖ్‌నగర్‌ ఘటనతో..
మూడేళ్లక్రితం దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన పేలుళ్లు తెలుగు ప్రజల్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. నేర పరిశోధన బృందాలు ఎంత ప్రయత్నించినా చిన్న ఆచూకీ కూడా దొరకలేదు. సీసీ కెమెరాల్ని పరిశీలిస్తే ఏదైనా ఆధారం లభిస్తుందని భావించారు. కానీ, ఆ సమయానికి చాలా కెమెరాలు పనిచేయలేదు. పనిచేస్తున్నవాటి నాణ్యతా అంతంతమాత్రమే. ప్రయత్నించగా ప్రయత్నించగా ఓ బట్టల దుకాణంలోని ఫుటేజీ కొంతమేర పనికొచ్చింది. పేలుడుకు ముందు అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఓ వ్యక్తిని గుర్తించారు. పోలికల్ని బట్టి అతడు ఇండియన్‌ ముజాహిదీన్‌ తీవ్రవాదని తేలిపోయింది. దీంతో, పరిశోధనలో పురోగతి వచ్చింది. అప్పుడే, సీసీ కెమెరాల అవసరం పోలీసులకు మరింత తెలియవచ్చింది. రోజూ కనీసం ఓ వందమంది రాకపోకలు సాగించే ప్రతి వ్యాపార సంస్థ దగ్గరా సీసీ కెమెరా ఏర్పాటు చేసితీరాలన్న చట్టమూ ఆ తర్వాత తీసుకొచ్చిందే.

దేశ రాజధాని దిల్లీని దాదాపు రెండు లక్షల సీసీ కెమెరాలు పహరా కాస్తున్నాయి. అందులో, ప్రభుత్వం ఏర్పాటు చేసినవి యాభైవేల దాకా ఉండవచ్చు. అక్కడి సర్కారు ‘ఐస్‌ అండ్‌ ఇయర్స్‌ స్కీమ్‌’ ద్వారా ప్రజా భాగస్వామ్యంలో సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. కర్ణాటక ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల తరహాలో చట్టం తీసుకువచ్చే యోచనలో ఉంది. రాజధాని నిర్మాణం వూపందుకోవడం, సచివాలయం తరలింపు తదితర పరిణామాల నేపథ్యంలో విజయవాడ నగరం శాంతిభద్రతల పరంగా మరింత సున్నిత ప్రాంతంగా మారింది. దీంతో విజయవాడ పోలీసులు ‘ఇ-నేత్ర’ పేరుతో మహాత్మాగాంధీరోడ్‌, బీసెంట్‌రోడ్‌, వన్‌టౌన్‌, సత్యనారాయణపురం తదితర ప్రధాన కూడళ్లలో రెండొందల పైచిలుకు సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. గత ఎనిమిది నెలల్లో సీసీ కెమెరాల ఆధారంగా నూట ఇరవై అయిదు కేసుల్ని ఛేదించినట్టూ, కోటి రూపాయల దాకా సొత్తును స్వాధీనం చేసుకున్నట్టూ విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ ప్రకటించారు.పహరా హుషార్‌...
సీసీ కెమెరా ఖాకీల ప్రధాన ఆయుధంగా మారింది. నేరాల నియంత్రణ, పరిశోధన, ట్రాఫిక్‌ నిర్వహణ - ఈ మూడు బాధ్యతలూ కెమెరా చుట్టే తిరుగుతున్నాయి. సీసీ కెమెరాలు నేరాల్ని నియంత్రించలేవు. మహా అయితే, దోషుల్ని పట్టుకోడానికే పనికొస్తాయంతే...అన్న విమర్శ ఉంది. సీనియర్‌ పోలీసు అధికారులు ఆ వాదనతో ఏకీభవించడం లేదు. ‘అలా అనుకోడానికి వీల్లేదు. కరడుగట్టిన ప్రతి నేరస్తుడూ దోపిడీకో, దొంగతనానికో, సంఘ విద్రోహక చర్యకో పాల్పడే ముందు, తప్పకుండా అక్కడికొస్తాడు. పరిసరాల్ని గమనిస్తాడు. మనసులోనే ఓ ప్రణాళిక సిద్ధం చేసుకుంటాడు. పోలీసు వ్యవస్థ కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే, రెక్కీ దశలోనే క్రిమినల్స్‌ కదలికల్ని పసిగట్టవచ్చు’ అంటారు ఆంధ్రప్రదేశ్‌ నేర పరిశోధన విభాగంలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి. ఆసుపత్రులూ, దుకాణాలూ, మాల్స్‌లో సీసీ కెమెరాల వాడకం పెరిగాక... కొనుగోలుదారుల్లా వెళ్లి బంగారం కొట్లలోనో బట్టల షాపుల్లోనో చేతివాటం చూపే ముఠాలు దాదాపుగా నియంత్రణలోకి వచ్చాయి. చెయిన్‌ స్నాచింగ్‌ కేసుల తీవ్రత కొంతమేర తగ్గింది. ఆసుపత్రుల్లోంచి పసిపిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠాలకు అడ్డుకట్టపడింది. ఆకతాయిల ఆగడాలూ మునుపట్లా లేవు. ఈమధ్య ఓ పోలీసు అధికారి కొడుకు....తప్పతాగిన మత్తులో స్నేహితులతో కలసి వీధుల్లోని దుకాణాలకు నిప్పుపెట్టాడు. సీసీ కెమెరా రికార్డుల ఆధారంగా ఆ కుర్రాడిని అరెస్టు చేశారు. డబ్బును రెట్టింపు చేస్తానంటూ ఓ వ్యాపారవేత్తను బురిడీ కొట్టించిన దొంగబాబా వ్యవహారం కూడా సీసీ కెమెరా సాయంతోనే బయటపడింది. కెమెరాల నిఘా పెరిగాక, హైదరాబాద్‌లో నేర తీవ్రత తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. విజయవాడ పోలీసులు కూడా సీసీ కెమెరాల ప్రభావాన్ని అంగీకరిస్తున్నారు.

లండన్‌లో ప్రతి పౌరుడూ గడప దాటింది మొదలు, మళ్లీ ఇంటికి చేరుకునేదాకా దాదాపు నాలుగువందల సార్లు సీసీ కెమెరా కళ్లల్లో పడతాడు. శాంతిభద్రతల నిర్వహణ అక్కడ అంత పక్కాగా ఉంటుంది. బంజారాహిల్స్‌లో నిర్మాణంలో ఉన్న ‘ట్విన్‌ టవర్స్‌’లోనూ ఇలాంటి వ్యవస్థే రూపుదిద్దుకుంటోంది. కాలనీల్లోని సీసీ కెమెరాల దృశ్యాలు దగ్గర్లోని కమ్యూనిటీ హాలులో కనిపిస్తాయి. కమ్యూనిటీ హాలు నుంచి సంబంధిత పోలీసు స్టేషన్‌కూ, అట్నుంచి సంబంధిత జోన్‌ ఉన్నతాధికారికీ, అట్నుంచి కమిషనర్‌ కార్యాలయానికీ వాటిని అనుసంధానం చేస్తారు. అలా...మొత్తంగా నగరంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా పోలీసులకు తెలిసిపోతుంది. ఈ ప్రయత్నంలో కాలనీ సంఘాల్ని భాగస్వాముల్ని చేస్తున్నారు. ‘సేఫ్‌ కాలనీ స్కీమ్‌’ పేరుతో ప్రతి కాలనీ నిఘానేత్రం పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఇంటింటా...
నేరాలు పెరిగిపోతున్నాయి. ఘోరాలకు అంతే లేకుండా పోయింది. కాపలా సిబ్బందిని నమ్మే పరిస్థితి లేదు. పనిమనుషుల్ని కూడా అనుమానించాల్సిన రోజులు. ఆఫీసు నుంచి ఇంటికి తిరిగొచ్చే సమయానికి...తాళాలు విరిగిపడి ఉండవచ్చు, బీరువా బద్దలైపోయి ఉండవచ్చు. ఒంటరి వయోధికులు రక్తపు మడుగులో పడి ఉండవచ్చు. ఆ ఉత్పాతాల నుంచి తప్పించుకోడానికి...మధ్యతరగతి నుంచి సంపన్నుల వరకూ ఎవరికివారు సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. దోపిడీలూ దొంగతనాల నుంచి తమనూ తమ ఆస్తులనూ కాపాడుకోవడం ఒక కోణమైతే, బిడ్డల సంరక్షణ మరో కోణం! పిల్లల్ని ఏ ఆయాల దయాదాక్షిణ్యాలకో వదిలి వెళ్లే తల్లిదండ్రులు సెల్‌ఫోన్లకూ లాప్‌టాప్‌లకూ సీసీ కెమెరాల్ని అనుసంధానించుకుంటున్నారు. లేదంటే, ఇంటికొచ్చాక ఆ రికార్డుల్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ‘కొద్దిరోజుల క్రితం మా పాప ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. నేను ఆఫీసుకు బయల్దేరితే చాలు, వద్దు మమ్మీ, వెళ్లొద్దు మమ్మీ...అంటూ కాళ్ల చుట్టూ అల్లుకుపోయేది. మొహంలో మునుపటి కళ పోయింది. ఎప్పుడూ పరధ్యానంగా ఉండేది. సహోద్యోగి సలహాతో సీసీ కెమెరా పెట్టించాను. ఆ ఆయా ఒక్కరోజు కూడా పాపను ప్రేమగా చూసుకున్న దాఖలాల్లేవు. కాస్త అల్లరి చేస్తే చాలు, గొడ్డును బాదినట్టు బాదేది. పాపకోసం పెట్టిన బిస్కెట్లన్నీ దాచేసుకునేది. ఓరోజైతే హాల్లో కూర్చుని మద్యం తాగింది. ఆ దృశ్యాలన్నీ చూసి తట్టుకోలేకపోయాను’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు ప్రైవేటు సంస్థ ఉద్యోగిని హేమ.

ఓ చిన్నారిని...కుటుంబంలోని పెద్ద మనిషే నానా హింసలకు గురిచేసేవాడు. లైంగికంగా వేధించేవాడు. నోరెత్తితే చంపేస్తానని బెదిరించాడు కూడా. భద్రత కోసం ఇంట్లో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలో ఆ అకృత్యాలన్నీ నమోదయ్యాయి. కీచకుడికి ఆ విషయం తెలియకపోవచ్చు. తెలిసినా, తన మీద ఎవరు ఫిర్యాదుచేస్తారన్న ధీమా కావచ్చు. ఓసారి కెమెరాకు ఏదో సమస్య వస్తే నిపుణుడిని పిలిపించారు. ఆ ఉద్యోగి పాత రికార్డుల్ని పరిశీలిస్తున్నప్పుడు...అకృత్యాలన్నీ బయటపడ్డాయి. నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి ఉదంతాలు అనేకం.

సీసీ కెమెరాలు ఇ-కాపలాదారుల్లా, ఇ-శునకాల్లా ఇంటిని పహరా కాస్తున్నాయి. దేశంలో ఏటా పదిలక్షల సీసీ కెమెరాలు అమ్ముడవుతున్నట్టు ఓ అంచనా. ‘నా పరిధిలోని దుకాణాల్లోనే రోజుకు నాలుగైదు దాకా పోతున్నాయి’ అంటారు సీసీ కెమెరాల నిపుణుడు అసీమ్‌.

కొత్త టెక్నాలజీ...
క్లోజ్డ్ సర్క్యూట్‌ కెమెరాల్లో శక్తిమంతమైన రకాలు వస్తున్నాయి. వంద వాహనాలు రాకపోకలు సాగిస్తున్న కూడలిలోంచి కూడా ఒక బైకునో, కారునో ఎంచుకుని... ఆ నంబరు ప్లేటును చూడటం అసాధ్యమేం కాదిప్పుడు. ఏ ప్రమాదాలకో కారణమైన వాహనం కనిపించగానే సంబంధిత అధికారులకు హెచ్చరికలు వెళ్లిపోతాయి. ఈమధ్య హైదరాబాద్‌లో ఓ సెల్‌ఫోన్‌ దొంగల ముఠా హల్‌చల్‌ చేసింది. సొంతవాహనాలు తెచ్చుకోకుండా, ఏ నగరంలో కాలుపెడితే ఆ నగరంలో ఆన్‌లైన్‌ ద్వారా పాత బైకుల్ని కొనడం ఆ ముఠా విధానం. ఇక్కడా ఆ పద్ధతినే అనుసరించారు. ప్యారడైజ్‌ చౌరస్తాలోని సీసీ కెమెరాలో ఆ ముఠా కదలికలు నమోదయ్యాయి. ఆ వాహనాల నంబర్లను బట్టి..వాటిని విక్రయించిన వ్యక్తుల్ని సంప్రదించారు. ఆ సమాచారం ఆధారంగా అరెస్టులు జరిగిపోయాయి. చాలా నగరాల్లో ట్రాఫిక్‌ పోలీసులు మునుపట్లా...కూడళ్ల దగ్గర కాపుకాసి సిగ్నల్‌ జంపింగ్‌, ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన కేసుల్ని నమోదు చేయడం లేదు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని సీసీ తెరల ముందు కూర్చుని వాహనాల్ని పరిశీలిస్తున్నారు. ఉల్లంఘనల్ని కెమెరాలే గుర్తిస్తున్నాయి. అక్కడి నుంచే చలానాలు వెళ్లిపోతాయి.

మహానగరాలు ఉగ్రవాదుల అడ్డాలుగా మారుతున్నాయి. లక్షల జనాభాలోంచి ఆ ఒకట్రెండు చీడపురుగుల్ని గుర్తించడం దాదాపుగా అసాధ్యం. ఎవరికి తెలుసు, ఆ ముష్కర మూకలు అసెంబ్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ ఉండవచ్చు, ట్యాంక్‌బండ్‌ దగ్గరే తిష్టవేసి ఉండవచ్చు. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు, ముందే అప్‌లోడ్‌ చేసిన ఛాయాచిత్రాల్ని బట్టి సీసీ కెమెరాలు విద్రోహుల్ని గుర్తిస్తున్నాయి. అనుమానాస్పద వ్యక్తులు కనిపించగానే...నిఘా వ్యవస్థకు సమాచారాన్ని చేరవేస్తున్నాయి. కాకపోతే, సదరు వ్యక్తుల రూపురేఖలు...సీసీ కెమెరాలో ఫీడ్‌ అయిన ఛాయాచిత్రాన్ని నూటికినూరుశాతం పోలి ఉండాలి. ఏ కాస్త తేడా ఉన్నా, గుర్తించడం అసాధ్యం. ఈ లోపాన్ని సరిదిద్దే చర్యలూ చేపట్టారు. సీసీ కెమెరాకు కృత్రిమ మేధస్సును జోడించే ప్రయత్నం విజయవంతమైతే, కెమెరా దృష్టిసారిస్తే చాలు ఆధార్‌నంబరు, పాన్‌ తదితర వివరాలతో సహా వ్యక్తి చరిత్ర అంతా తెరమీద కనిపిస్తుంది. ఒక్కో కెమెరా వందమందికి కాదు, లక్షమంది పోలీసులకు సమానం అవుతుంది.ఎక్కడైనా, ఎప్పుడైనా...
సమాజం ఎదుర్కొంటున్న అనేకానేక తీవ్ర సమస్యలకు సీసీ కెమెరాల్లో పరిష్కారం లభిస్తోంది. పబ్లిక్‌ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంటోంది. అందులోనూ కొన్ని విద్యాసంస్థలు నూటికి నూరుశాతం ఫలితాల్ని సాధించాలన్న ఆరాటంలో అడ్డదార్లు తొక్కుతున్నాయి. మాస్‌ కాపీయింగ్‌నూ ప్రోత్సహిస్తున్నాయి. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ఆ కక్కుర్తి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. గతంలో నూటికి నూరుశాతం ఫలితాలు సాధించిన పాఠశాలలు కూడా...సీసీ కెమెరా పర్యవేక్షణ వచ్చాక బొక్కబోర్లా పడుతున్నాయి. అక్రమ మైనింగ్‌కు హద్దూ అదుపూ లేకుండా పోయింది. తవ్వుకున్నవాళ్లకు తవ్వుకున్నంత అన్నట్టుగా ఉంది వ్యవహారం. గనులశాఖ ఉన్నతాధికారుల నుంచి భద్రతా సిబ్బంది దాకా...ఆ పాపం తలా పిడికెడు! ఆ దొడ్డిదారి తవ్వకాలకు అడ్డుకట్ట వేయడానికి గనుల పరిసరాల్లో సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో, ప్రతి కదలికా రికార్డయిపోతుంది. పోలీసు స్టేషన్లూ, జైళ్లలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు గతంలోనే హెచ్చరించింది. ఆర్టీసీ బస్సుల్లోనూ సీసీ కెమెరాలు ఉండితీరాలని కూడా అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. గుజరాత్‌లో కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ కూడా సీసీ కెమెరాల కనుసన్నల్లోనే జరుగుతోంది. అక్రమాలకు ఆస్కారం ఉన్న ప్రతిచోటా...వాటిని ఏర్పాటు చేస్తే, ఆ కళ్లే అవినీతి తోడేళ్ల పనిపడతాయి.

కెమెరాల్ని మింగేస్తూ...
సీసీ కెమెరాలు సంచలనాలకూ కారణం అవుతున్నాయి. ఓ ఆలయంలోకి సాక్షాత్తూ షిర్డీసాయి నడిచి వస్తున్న దృశ్యం కెమెరాలో నమోదైనట్టు జనం కథలు కథలుగా చెప్పుకున్నారు. మరోచోట ఫుటేజీలో తెల్లచీర కట్టుకుని, జుట్టు విరబోసుకున్న మోహినీ పిశాచం కనిపించినట్టు యూట్యూబ్‌లో వీడియోలు ప్రత్యక్షం అయ్యాయి. ఎవరో బాబా వేషం వేసుకుని వచ్చి ఉద్దేశపూర్వకంగానే కెమెరా ముందు నడిచినట్టు ఆలయ నిర్వాహకులు గుర్తించారు. ఆ పిశాచం వ్యవహారం కట్టుకథేనని హేతువాద సంఘాలు తేల్చాయి. విద్యుద్దీపాల నీడలే అలా భ్రమింపజేశాయని గుర్తించారు. మనిషి ఎప్పుడూ టెక్నాలజీ కంటే ఓ అడుగు ముందే ఉంటాడు. చోరాగ్రేసరులు దొంగతనం ముగించుకుని వెళ్తూవెళ్తూ కెమెరాల్ని కూడా ఎత్తుకెళ్తున్న సందర్భాలున్నాయి. ముందే తలకి హెల్మెట్‌ పెట్టుకునో, కెమెరా మీద టూత్‌పేస్ట్‌ పూసేసో... శుభ్రంగా పనికానిస్తున్న దొంగలూ ఉన్నారు. దిల్లీ డ్రగ్స్‌ ముఠా అయితే తెలివిమీరిపోయింది. చీకటి వ్యాపారానికి చిరునామా లాంటి ఓ కాలనీలో అడుగడుగుకో సీసీ కెమెరా ఏర్పాటు చేసింది. దీంతో ఖాకీల కదలికలు ఇట్టే తెలిసిపోయేవి. అలా చాలా కాలం పాటూ తప్పించుకున్నారు. దొంగల సీసీ కెమెరా వ్యవహారం కాస్తా, పోలీసుల సీసీ కెమెరాకు ఎక్కాక కానీ...డొంక కదల్లేదు.బ్రాండెడ్‌ దుకాణాల ట్రెయిల్‌రూమ్స్‌లో, సినిమా థియేటర్ల వాష్‌రూమ్స్‌లో దొంగచాటుగా సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేస్తున్న ప్రబుద్ధులూ ఉన్నారు. గతంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ‘నిర్భయ’ తరహా కఠిన చట్టాన్ని తీసుకొస్తే కానీ, టెక్నాలజీని దుర్వినియోగం చేసేవారి పనిపట్టలేం. కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు...పరిసరాల్ని ఒకటికి రెండుసార్లు గమనించాలన్నది మన పరిధిలో ఉన్న పరిష్కారం.

* * *

తననెవరూ గమనించడం లేదన్న ఆలోచనే మనిషిని రాక్షసుడిని చేస్తుంది. ఇక ముసుగు తీసేస్తాడు. కోరలు పెంచేస్తాడు. పోలీసు వ్యవస్థ అతనికా ఆస్కారం ఇవ్వకూడదు. ‘జాగ్రత్త! నీ నెత్తిన సీసీ కెమెరా ఉంది. నీ ప్రతి కదలికనూ అది గమనిస్తోంది’ అన్న హెచ్చరిక చాలు, మనిషిలోని అపరిచితుడు ముడుచుకుపోడానికి. ఆ బూచి ఉన్నంత కాలం అతడిలోని దుర్మార్గుడు...బిరడా బిగించిన భూతమే!


మీ ఇంటికి... కెమెరా కాపలా!

హైదరాబాద్‌, విజయవాడ తదితర నగరాల్లో శాంతిభద్రతలు ప్రధాన సమస్యగా మారుతున్నాయి. దీంతో, చాలామంది సీసీ కెమెరాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇదేం, జాతి శునకాన్ని పోషించినంత ఖరీదైన వ్యవహారమేం కాదిప్పుడు.


రకాలు ...

బుల్లెట్‌, డోమ్‌, పీటీజెడ్‌ తదితర మోడళ్లు ఉన్నాయి.


ప్రత్యేకతలు ...

నేల మీద పడిన సూదిని కూడా జూమ్‌ చేసి చూడగలిగేంత శక్తిమంతమైన కెమెరాలు ఉన్నాయి. నైట్‌ విజన్‌ సౌకర్యంతో...చిమ్మ చీకట్లోనూ స్పష్టంగా వీడియో రికార్డు అవుతుంది. సౌరశక్తితో పనిచేసే కెమెరాలూ వస్తున్నాయి. మోషన్‌ రికార్డింగ్‌ సౌలభ్యం ఉంటే, గదిలో ఏదైనా కదలిక ఉన్నప్పుడు మాత్రమే రికార్డింగ్‌ జరుగుతుంది.


ఇంటర్నెట్‌ అనుసంధానం ...

సీసీ కెమెరాల్ని ఇంటర్నెట్‌తో అనుసంధానిస్తే...సెల్‌ఫోన్‌లోనో, ల్యాప్‌టాప్‌లోనో, ఆఫీసులోని డెస్క్‌టాప్‌లోనో సీసీ కెమెరా దృశ్యాల్ని పరికించే అవకాశం ఉంటుంది. అవసరం అయితే ప్రమాద హెచ్చరికలూ చేయవచ్చు. స్పీకర్‌ ద్వారా ఆ మాటలు ఇంట్లో వారికి వినిపిస్తాయి.


ఎక్కడ బిగించాలి ...

చాలా ఇళ్లలో సీసీ కెమెరాలు ఉంటాయి కానీ, బిగించాల్సిన చోట బిగించకపోవడం వల్ల...ఇంట్లోకి ప్రవేశించేవారి రూపురేఖలు అస్పష్టంగా రికార్డు అవుతాయి. దీనివల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు. కరవలేని కుక్కను ఇంటికి కాపలా పెట్టినట్టే ఉంటుంది వ్యవహారం. తలుపు తెరుచుకుని లోపలికి ప్రవేశించే వ్యక్తి మొహం స్పష్టంగా కనిపించేలా, కెమెరాను ఏర్పాటు చేయడం ఉత్తమం.


ఇంట్లో ఎన్ని...

న్ని కెమెరాల్ని అయినా, ఒకే నెట్‌వర్క్‌తో సమన్వయం చేసుకోవచ్చు. రెండు పడకగదుల ఇంటికి అయితే... సింహద్వారం వద్ద ఒకటి, డ్రాయింగ్‌రూమ్‌లో ఒకటి సరిపోతాయి. విలువైన సామగ్రి ఉన్న గదిలోనూ ఓ కెమెరా ఉండటం మంచిది. పడక గదుల్ని ఆ పరిధి నుంచి మినహాయిస్తేనే మేలు.


ధరలు ఇలా ఉంటాయి...

కెమెరా, హార్డ్‌డిస్క్‌, మానిటర్‌...తదితరాల సామర్థ్యాల్ని బట్టి ధర మారుతూ ఉంటుంది. పదిహేను వేల నుంచి పాతిక వేలలో నాణ్యమైన సీసీ కెమెరాను బిగించుకోవచ్చు.


కొన్ని జాగ్రత్తలు...

దొంగలు ముందుగా సీసీ కెమెరాల్ని లక్ష్యం చేసుకుంటున్నారు. కనెక్షన్లు కత్తిరించేస్తున్నారు. కాబట్టి, వైర్‌లెస్‌ టెక్నాలజీని ఎంచుకోవడం సురక్షితం. వీలైతే, ఎక్కువ నాణ్యత కలిగిన చిన్నచిన్న కెమెరాల్ని బిగించడమే మేలు. అపార్ట్‌మెంట్లూ, కాలనీ సంఘాల కోసం కొంటున్నప్పుడు స్థానిక పోలీసుల్ని సంప్రదించాలి. హైదరాబాద్‌ నగర పోలీసులు ఆ విషయంలో సాంకేతిక సలహాల్ని ఇస్తున్నారు.నేరాలు తగ్గాయి
- మహేందర్‌రెడ్డి
హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌

సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజా-ప్రభుత్వ భాగస్వామ్యం హైదరాబాద్‌లో విజయవంతమైంది. గత ఏడాది హత్యలూ, దోపిడీలూ, దొంగతనాలూ తదితర తీవ్ర నేరాలు పద్నాలుగు శాతం తగ్గాయి. ఈ ఏడాది గణాంకాలు అంతకంటే మెరుగ్గా ఉన్నాయి. తప్పుచేస్తే దొరికిపోతాం, దొరకడమే కాదు సీసీ కెమెరా ఆధారాలతో శిక్ష పడటమూ ఖాయం...అన్న భయం నేరస్తుల్లో మొదలైంది. ప్రజల చొరవతో దీన్నో ప్రజా ఉద్యమంగా తీసుకొస్తున్నాం. ఇప్పటికే కాలనీలూ చౌరస్తాల్లోని దాదాపు పదివేల కెమెరాలు పోలీసు స్టేషన్లతో అనుసంధానం అయ్యాయి. నిరంతరాయంగా పనిచేస్తాయి కాబట్టి, ప్రతి కెమెరా వందమంది పోలీసులతో సమానం. రానున్న రెండేళ్లలో దాదాపు లక్ష కెమెరాలు అందుబాటులోకి రానున్నాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.