close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘నయా’ మాల్‌... కిరాణా కొట్టు!

‘నయా’ మాల్‌... కిరాణా కొట్టు!

సూపర్‌ మార్కెట్లు వచ్చేశాయి, మూతబడటం ఖాయమని అనుకున్నారు. మాల్స్‌ ప్రవేశించాయి, మనుగడ అసాధ్యమని జోస్యం చెప్పారు. ఇ-కామర్స్‌ వృద్ధిచెందుతోంది, ఇక తట్టుకోలేదని తేల్చేశారు. అయినా సరే, కిరాణాకొట్టు నిలిచింది, గెలిచింది. కాలం నేర్పిన పాఠాల్ని ఒంటబట్టించుకుని, కొత్తకొత్త అవతారాలు ఎత్తుతోంది.‘కిరాణాకొట్టు పని గోవిందా! ...మాల్స్‌ వచ్చేశాయి.
హైపర్‌మార్కెట్లు పెరిగిపోతున్నాయి.
ఆన్‌లైన్‌షాపింగ్‌ వూపందుకుంటోంది.
ఇంకేముంది, దుకాణం కట్టేయాల్సిందే’
- అని బల్లగుద్ది చెప్పినవాళ్లంతా బెంచీ ఎక్కి నిలబడాల్సిందే! లేకపోతే...కిరాణాకొట్టును పట్టుకుని అంతమాట అంటారా! ప్రతి భారతీయుడి తొలి షాపింగ్‌ అనుభవం కిరాణా కొట్టుతోనే మొదలవుతుంది. చిన్నప్పుడు కొట్టంటే రుచుల స్వర్గం! చిటికెనవేలు పట్టుకునో, భుజానికి ఎక్కించుకునో నాన్న గడపదాటగానే...గుక్కపెట్టి ఏడుస్తున్నవాడు కూడా ఠక్కున ఆపేస్తాడు. ఆ అడుగులు కిరాణాకొట్టు వైపే పడతాయన్న నమ్మకం. ఏదో ఒకటి కొనిపెట్టకపోడన్న ధైర్యం. ఆ అల్లరికి నాన్న కస్సుబుస్సులాడినా, కొట్టు యజమాని కబుర్లతో చల్లబరుస్తాడు. ‘బిడ్డని కోపగించుకోవద్దు బేటా! చిన్నప్పుడు నువ్వూ అంతేగా! బోలెడన్ని బిస్కెట్లు కావాలంటూ నాన్నగార్ని ఎంత సతాయించేవాడివో...’ అంటూ ఫ్లాష్‌బ్యాక్‌లోకి తీసుకెళ్తాడు. ఆ మాటల్లో ఎంతోకొంత ప్రేమ ఉంటుంది, కొద్దోగొప్పో లౌక్యమూ ఉంటుంది. అది తరాల అనుబంధం. ఇక్కడో తిరుగులేని వ్యాపార రహస్యమూ ఉంది. ఇప్పుడిప్పుడే బహుళజాతి సంస్థలు ప్రయోగిస్తున్న ‘క్యాచ్‌ దెమ్‌ యంగ్‌’ వ్యూహాన్ని కిరాణాకొట్టు పెద్దమనిషి ఎప్పుడో అమలు చేశాడు. నేటి చాక్లెట్‌ కస్టమర్లే, రేపటి ఉప్పూపప్పూ కొనుగోలుదారులు!

కిరాణా వ్యాపారం యుగాలనాటిది. ప్రపంచంలో తొలి వ్యాపార ఆవిష్కరణ కిరాణాకొట్టే కావచ్చు. మనిషి అవసరాల్లోంచే ‘వ్యాపారం’ అన్న ఆలోచన పుట్టింది. నా దగ్గర ఉన్న వస్తువు నీకిస్తా, నీదగ్గర ఉన్న వస్తువు నాకివ్వు - అన్న సూత్రం మీద మొదలైన వస్తుమార్పిడి వ్యవస్థ ఎంతోకాలం మనలేకపోయింది. అక్కడ ఇద్దరూ వినియోగదారులే. అమ్మకందారు అంటూ ఉండడు. ఆతర్వాత, వినిమయ మాధ్యమంగా కరెన్సీ వచ్చింది. ఇక్కడ మాత్రం ఓ కొనుగోలుదారుడు ఉంటాడు, ఓ అమ్మకందారుడూ ఉంటాడు. ఆ లావాదేవీతో పాటే లాభం, నష్టం, బేరం, అప్పు...వగైరా పదజాలం పుట్టుకొచ్చింది. గుప్తుల కాలంలో, చిల్లర దుకాణాలు చెల్లించే పన్నులతో ఖజానా కళకళలాడేదంటారు.

రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ ప్రకారం దేశంలో దాదాపు ఐదుకోట్ల కిరాణాకొట్లున్నాయి. మాల్‌ సంస్కృతి వచ్చాక కూడా, ఆన్‌లైన్‌ కొనుగోళ్లు పెరిగాక కూడా...గ్రామీణ మార్కెట్లో కిరాణాకొట్టుదే ఆధిపత్యం. మొత్తంగా చిల్లర వ్యాపారంలో ఎనభైశాతం దాని గుప్పిట్లోనే ఉంది. ఎంత మారుమూల ప్రాంతమైనా, గడపదాటి ఓ నాలుగు అడుగులు వేయగానే ఒకటో రెండో కొట్లు కనిపించితీరతాయి. అత్యవసరమైన సరుకులన్నీ ఆ చిన్న దుకాణంలోనే దొరుకుతాయి. ఎవరే వస్తువు పేరు చెప్పినా, క్షణాల్లో అరలోంచి తీసి ఇవ్వాలనుకుంటాడు కొట్టు యజమాని. ‘లేదు’ అనడానికి అతడికి మనసొప్పదు. అలా చెప్పడమంటే, దుకాణం దాకా వచ్చిన ఖాతాదారుడిని చిన్నబుచ్చినట్టే అని భావిస్తాడు.

ఇక విశ్వసనీయతకైతే తిరుగులేదు. ‘‘ఓసారి మా వీధిలోని కిరాణాకొట్టులో పచారీ సామాన్లు కొని ఆదరాబాదరాగా ఇంట్లో పడేసి ఆఫీసుకెళ్లాను. రాత్రి ఇంటికి వచ్చేసరికి గేటు దగ్గర కొట్టు యజమాని ఎదురుచూస్తున్నాడు. ఎందుకబ్బా! కొంపదీసి డబ్బివ్వడం మరచిపోయానా? అనుకున్నా. ‘పొద్దున్న మీరు, పొరపాటున ఐదొందల రూపాయలకు బదులు వేయి రూపాయల నోటిచ్చారు...’ అంటూ ఐదొందల కాగితం చేతిలో పెట్టాడు. ఈ కాలంలో కూడా ఇంత నిజాయతీపరులు ఉంటారా అనిపించింది’’ అంటారు హిమాయత్‌నగర్‌లో ఉంటున్న కేంద్రప్రభుత్వ ఉద్యోగి రామలక్ష్మణ్‌. ఆ అనుభవాన్ని ఆయన తన బ్లాగులో రాసుకున్నారు కూడా. ‘‘ఓరోజు దుకాణం నుంచి సరుకు తెచ్చుకున్న పది నిమిషాల్లోపే కొట్టు యజమాని ఆయాసపడుతూ వచ్చాడు. అమ్మా! మీకు పంపిన సరుకులో బెస్ట్‌ బిఫోర్‌ యూజ్‌....తేదీ అయిపోయిన కూల్‌డ్రింక్‌ సీసా ఒకటుంది. అది ఇచ్చేయండి. ఇదిగో తాజా స్టాక్‌. కొత్త కుర్రాడు తెలియక ఇచ్చేశాడు. ఏమీ అనుకోకండి’ అని క్షమాపణ అడిగాడు...’’అంటూ కిరాణాకొట్టుతో ముడిపడిన ఓ జ్ఞాపకాన్ని నెమరేసుకుంటారు గృహిణి రాజ్యలక్ష్మి.

కిరాణాకొట్టుకో ప్రత్యేకత ఉంది. ఎంతమంది ఖాతాదారులు ఉంటే, అంతమందితోనూ దుకాణం యజమానికి నేరుగా పరిచయాలుంటాయి. చాలా సందర్భాల్లో అది పరిచయానికి మించిన స్నేహమో, పేరుపెట్టి పిలిచేంత చనువో అయినా కావచ్చు. ఎవరికి ఏ బ్రాండు టీపొడి నచ్చుతుందో, ఎవరింటికి ఎన్ని కిలోల బియ్యం అవసరమో, అందులో ఎవరికి ఏ రకం ఇష్టమో ఠక్కున చెప్పేయగలరు, పేరుపెట్టి అడక్కపోయినా ఇచ్చేయగలరు. ‘అన్నా! ఏదో ఓ షాంపూ ప్యాకెట్‌ ఇచ్చెయ్‌’ అంటే, ‘మమ్మీ ఫలానా బ్రాండే వాడతారు బాబూ, అదే తీసుకెళ్లు’ అని చేతిలో పెడతాడు. ఎంత చేయితిరిగిన డేటాసైన్స్‌ నిపుణులైనా అంత సమర్థంగా కస్టమర్ల అభిరుచుల్ని విశ్లేషించలేరు.

కిరాణాకొట్టులో అప్పు అతి సాధారణం. ఈ ఫస్టుకో, వచ్చే ఫస్టుకో తిరిగి ఇచ్చే వెసులుబాటు ఎప్పుడూ ఉంటుంది. ఆ నమ్మకాన్ని నిలుపుకున్నంత కాలం...పచారీ సరుకులకు ఢోకా ఉండదు. ఏ బహుళజాతి సంస్థలూ, ఏ ఆన్‌లైన్‌ దిగ్గజాలూ కల్పించని సౌకర్యం ఇది. డెబిట్‌కార్డు అడగరు, క్రెడిట్‌ హిస్టరీ చూడరు. పూచీకత్తు సమస్యా ఉండదు. నోటి మాటతో పని జరిగిపోతుంది. సరుకులో లోపాలుంటే, సేవల్లో నాణ్యత లోపిస్తే, ఎవర్ని అడగాలి? అన్న ప్రశ్న కొనుగోలుదారుడిని వేధిస్తూనే ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ‘నేనున్నాను...’ అని ధైర్యంగా చెబుతాడు కొట్టు యజమాని. ఈ శ్రద్ధాసక్తులూ ఆదరాభిమానాలే కిరాణాకొట్టుకు తిరుగులేని బలం. భారతీయ కిరాణాకొట్ల విజయరహస్యాన్ని తెలుసుకోడానికి బహుళజాతి సంస్థలు అనేక అధ్యయనాలు చేశాయి. ‘సూపర్‌ మార్కెట్లతోనో, హైపర్‌ మార్కెట్లతోనో పోలిస్తే పొద్దున్నే తెరవడం...దాదాపు అర్ధరాత్రి దాకా అందుబాటులో ఉండటం వీటి విజయానికో ప్రధాన కారణం’ అని ఓ అంతర్జాతీయ సంస్థ నివేదిక తేల్చిచెప్పింది. చాలా సందర్భాల్లో ఆ కుటుంబానికి ఇల్లే దుకాణం, దుకాణమే ఇల్లు.కొత్తకొత్తగా...
ఉప్పల్‌లోని మణికంఠ స్టోర్స్‌ రూపురేఖలే మారిపోయాయి. మునుపట్లా, దుకాణం చీకటి కొట్టమేం కాదిప్పుడు. దేదీప్యమానంగా లైట్లు వెలుగుతుంటాయి. ఎల్‌సీడీ తెర మీద సరుకుల ధరలూ, డిస్కౌంట్ల వివరాలూ కనబడుతూ ఉంటాయి. దుకాణంలోకి దుమ్మూధూళీ రాకుండా అద్దాల గోడలు కట్టించాడు యజమాని మణి. చాలా సరుకుల్ని కొనుగోలుదారులే తీసుకునేలా అరలు ఏర్పాటు చేశాడు. ఫోన్‌ చేస్తే చాలు ఇంటికే సరుకు చేరవేస్తాడు. పక్కనే ఉన్న కియోస్క్‌ సాయంతో...ఖాతాదారులు రిఫ్రిజిరేటర్ల నుంచి పుస్తకాల దాకా నచ్చిన వస్తువుల్ని ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసుకోవచ్చు. మణికంఠ మాత్రమే కాదు, భారతదేశంలోని కొన్ని వేల దుకాణాలు కిరాణా.02 వెర్షన్‌లోకి మారిపోతున్నాయి.

క్షణక్షణముల్‌...వినియోగదారుడి అభిరుచులు. ఏ నిమిషానికి ఏమైనా జరిగిపోవచ్చు. ఏదో ఓరోజు ఆ ఇరుకిరుకు కొట్టు మొహం మొత్తిపోవచ్చు. కొనుగోలుదారుడిగా తనకంటూ కొన్ని సౌకర్యాలూ విలాసాలూ కావాలని అనిపించవచ్చు. అదే జరిగితే? - ఆ వూహే కిరాణాకొట్టు యజమానిని భయపెట్టింది. నిన్నమొన్నటిదాకా ఉన్న పరిస్థితులు వేరు. ఆ వాతావరణమూ వేరు. కిరాణా వ్యాపారులు ‘చిన్ని నా కొట్టే శ్రీరామరక్ష’ అనుకునేవారు. విస్తరణ గురించీ ప్రచారం గురించీ పెద్దగా ఆలోచించేవారు కాదు. బహుళజాతి సంస్థల ప్రవేశంతో చిల్లర వ్యాపారంలో పెను కుదుపు వచ్చింది. అందులోనూ మాల్స్‌ తళుకులూ, హైపర్‌మార్కెట్ల బెళుకులూ పట్టణ వినియోగదారుల్ని ఆకట్టుకోసాగాయి. కాస్త ఖరీదే అయినా, అదో కొత్త అనుభవం. ఒకటో తారీకు రాగానే సరుకుల చీటీ పట్టుకుని దుకాణానికొచ్చేవాళ్లు కాస్తా ...మాల్స్‌ ఎస్కలేటర్లు ఎక్కడం మొదలుపెట్టారు. కళ్లముందే కొద్దికొద్దిగా ఖాతాదారులు జారిపోతుంటే, ఎవరు మాత్రం నిమ్మళంగా ఉంటారు. అందులోనూ, పోటీదారుడు మహాశక్తిమంతుడు, వ్యూహాల్లో ఆరితేరినవాడు. టక్కుటమార విద్యలన్నీ తెగ తెలిసినవాడు. ఆ దాడిని జీర్ణించుకునేలోపే ‘ఆన్‌లైన్‌’ హంగామా! మనుగడకోసం పోరాటంలో కిరాణాకొట్టు చాలా పాఠాలే నేర్చుకుంది. కాస్త ఆలస్యంగానే అయినా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే పని మొదలుపెట్టింది. ఓ బ్రాండ్‌గా నిరూపించుకోవాలన్నది తాజా ప్రయత్నం. ‘మణికంఠ’ అలాంటి లక్షలకొద్దీ దుకాణాలకు ప్రతినిధి.మార్పు తీర్పు...
సంచి పట్టుకుని కొట్టుదాకా వెళ్లాల్సిన పన్లేదు. బరువంతా భుజానికెత్తుకుని తిరిగిరావాల్సిన అవసరమూ లేదు. ఒక్క క్లిక్కు చాలు. ఒకట్రెండు గంటల్లో సరుకు ఇంటికి వచ్చేస్తుంది. ఇ-కామర్స్‌ కొనుగోలుదారుల్ని కాలు కదపనీయడం లేదు. ఇంటర్నెట్‌ వినియోగం, స్మార్ట్‌ఫోన్ల హంగామా ఆ ధోరణికి మరింత వూపునిచ్చాయి. ఆన్‌లైన్‌లో నిత్యావసరాల అమ్మకాలు ఏటా రెండు నుంచి ఐదుశాతం చొప్పున పెరుగుతున్నాయి. అంటే, ఆ మేరకు పట్టణ కిరాణాకొట్లు వ్యాపారాన్ని కోల్పోతున్నట్టే. ఆ గండం నుంచి గట్టెక్కడానికి ఓమోస్తరు దుకాణాలూ ఆన్‌లైన్‌ బాట పడుతున్నాయి. తమకంటూ ఓ వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసుకుంటున్నాయి. దీంతో, మన ఇంటి పక్కనున్న వెంకటేశ్వర కిరాణా దుకాణం, మన వీధిచివర ఉన్న శ్రీనివాసా జనరల్‌స్టోర్స్‌ కూడా గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో కనబడుతున్నాయి. వాటికంటూ ఫేస్‌బుక్‌ పేజీలూ పుట్టుకొస్తున్నాయి. గోడాడీ ఆన్‌లైన్‌స్టోర్‌, నౌఫ్లోట్స్‌ లాంటి సంస్థలు చిన్నాచితకా దుకాణాలకు వెబ్‌సైట్ల నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తున్నాయి. అందుకయ్యే ఖర్చు కూడా తక్కువే. దీంతో, చాలామంది కిరాణా వ్యాపారులు ఆన్‌లైన్‌ ఉనికి కోసం ఆరాటపడుతున్నారు.

‘ఇప్పటికీ మా వ్యాపారంలో తొంభైశాతం ఆఫ్‌లైన్‌లోనే జరుగుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్‌ ఆర్డర్లనూ ప్రోత్సహిస్తాం’ అంటారు సికింద్రాబాద్‌ మండీ పరిసరాల్లో కిరాణా వ్యాపారం నిర్వహిస్తున్న రాజ్‌గుప్తా. మొబైల్‌ అప్లికేషన్లు ఇ-కామర్స్‌ను వూపేస్తున్నాయి. కొన్ని సంస్థలైతే ‘యాప్‌ ఓన్లీ’ అంటూ మొబైల్‌ యాప్‌ ద్వారా మాత్రమే లావాదేవీలు జరుపుతున్నాయి. కారణం, వినియోగదారుడు డెస్క్‌టాప్‌ లేదా ల్యాప్‌టాప్‌ ముందు కంటే, సెల్‌ఫోన్‌ సమక్షంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. కిరాణా దుకాణాలు ఆ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. వీటి కోసం, గుడ్‌బాక్స్‌ తదితర సంస్థలు అప్లికేషన్లను రూపొందిస్తున్నాయి. సదరు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు. కిరాణాకొట్టుకు నేరుగా సరుకుల చిట్టా పంపవచ్చు. చెల్లింపులూ జరపవచ్చు. కస్టమర్‌తో ‘ఛాట్‌’ చేసుకునే సౌకర్యం కూడా ఉంటుంది. ప్రస్తుతం ఈ సేవలు బెంగళూరు, పుణె నగరాల్లోనే ఉన్నా త్వరలో విస్తరణ ఉంటుందని చెబుతున్నారు వ్యవస్థాపకులు.రవాణారంగంలో...ఉబర్‌, ఓలా లాంటిది, అద్దెగదుల వ్యాపారంలో ఓయోరూమ్స్‌ లాంటిది... చిల్లర వ్యాపారంలో ఆరామ్‌షాప్‌. ఈ సంస్థ దేశవ్యాప్తంగా మూడువేలకుపైగా దుకాణాలతో కలసి పనిచేస్తోంది. ఖాతాదారుడు ఆరామ్‌షాప్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, తాను ఉంటున్న ప్రాంతం పేరు టైప్‌ చేస్తాడు. వెంటనే, పరిసరాల్లోని కిరాణాకొట్ల వివరాలన్నీ వస్తాయి. అందులో తనకి దగ్గరగా ఉన్న దుకాణాన్ని ఎంచుకుని, అవసరమైన సరుకులన్నీ ఆర్డరు ఇవ్వవచ్చు. ఓ అరగంటలో డెలివరీ జరిగిపోతుంది. మాల్స్‌కు దీటుగా ఆఫర్లూ డిస్కౌంట్లూ ఉంటాయి. దీనివల్ల, కిరాణాకొట్టు యజమాని ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ నిర్వహించుకోవాల్సిన అవసరమే ఉండదు. అంటే, ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థలకు అందుబాటులోకి వచ్చిన సమస్త సాంకేతిక సౌకర్యాలూ కిరాణాకొట్ల అమ్ములపొదిలోనూ ఉన్నాయిప్పుడు.