close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
లాలి పరమానంద... నిద్ర 'గోవిందా’!

లాలి పరమానంద... నిద్ర 'గోవిందా’!

చీకటి రాకాసిలా దూసుకొస్తుంది. నిశ్శబ్దం పిశాచ భాషలో శాపనార్థాలు పెడుతుంది. ఆలోచనలు కొరివి దెయ్యాలై పళ్లికిలిస్తాయి. ఎంత ప్రయత్నించినా నిద్రపట్టదు! నిద్రలేమి తీవ్ర సమస్య. అంతకుమించిన మానసిక హింస. ఆ రెప్పచాటు సంక్షోభం నుంచి బయటపడాల్సిన సమయం వచ్చింది.

ప్రత్యేకంగా పడకగదులున్నాయి. విశాలమైన పడకలున్నాయి. మెత్తని పరుపులున్నాయి. వెచ్చని దుప్పట్లున్నాయి. ఖరీదైన ఎయిర్‌ కండిషనర్లున్నాయి. కానీ...నిద్రే ఉండటం లేదు. పదీపదిహేనేళ్లతో పోలిస్తే సంపాదనలు పెరిగాయి. సంపదలు పెరిగాయి. జీవన ప్రమాణాలు పెరిగాయి. కానీ ...నిద్రే బాగా తగ్గిపోయింది. ఎనిమిదిన్నర గంటల సగటు నిద్ర కాస్తా, ఐదారు గంటలకు పడిపోయింది. దీనికి, అనేక కారణాలు.

కొందరికి, నిద్రపట్టడం లేదు.
కళ్లుమూసుకుంటే చాలు...వృత్తి ఉద్యోగాల్లోని డెడ్‌లైన్లు చావు హెచ్చరికల్లా వణికిస్తాయి. వాయిదా తేదీ దగ్గరపడుతోందంటూ అప్పుల అంకెలు రంకెలేస్తాయి. అభద్రతలూ ఆత్మన్యూనతలూ ప్రేమరాహిత్యాలూ కలలై కలవరపెడతాయి. ఒకటనేమిటి, ఆధునిక జీవితంలోని జాడ్యాలన్నీ చేతులుకలిపి బంగారం లాంటి నిద్రను బలితీసుకుంటున్నాయి. నలభై దాటినవారిలో నలభైశాతం మందీ అరవై దాటినవారిలో ఎనభైశాతం మందీ నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. గ్రామీణ భారతంతో పోలిస్తే నగరాల్లో సమస్య మరింత తీవ్రం.

కొందరికి, నిద్రంటే పట్టడం లేదు...
నిద్రను ఓ అవసరంగా గుర్తించరు. రోజూ ఏడెనిమిది గంటలైనా పడుకోవాలన్న స్పృహే ఉండదు. పనీపాటా లేనివాళ్లే తినితొంగుంటారన్న దురభిప్రాయం ఒకటి. నిద్రపోకపోవడం హీరోయిజమై కూర్చుంది. వ్యక్తిత్వవికాస పుస్తకాల్లో ‘కంటి మీద కునుకులేకుండా శ్రమించాడు’, ‘లక్ష్యాన్ని చేరుకునేదాకా రెప్పవాల్చలేదు’ తరహా రెచ్చగొట్టే పదజాలమొకటి. ‘జీవితంలో మూడోవంతు సమయం నిద్రకే సరిపోతోంది’ అని భారంగా నిట్టూర్చేవాళ్లకూ కొదవ లేదు. వెధవనిద్ర లేకపోతే...ఆ ఏడెనిమిది గంటల్ని కూడా నాలుగు రాళ్లు సంపాదించుకోడానికో, నాలుగు కెరీర్‌ నిచ్చెన మెట్లు ఎక్కడానికో వాడుకోవచ్చన్న కక్కుర్తి.

నిద్రలోకి జా..రి...తే!
నిద్ర అవసరమేమిటో, నిద్ర లేనప్పుడే తెలుస్తుంది. తిన్నామా లేదా అన్నది పట్టించుకోం. దిండూ దుప్పటీ వెతుక్కోం. పగలారాత్రా అన్నది అప్రస్తుతమైపోతుంది. చేతిలో కారు స్టీరింగ్‌ ఉందా, కళ్లముందు లాప్‌టాప్‌ పనిచేస్తోందా అన్నది పట్టదు. బాసు గుడ్లురిమి చూస్తున్నాడా, సహోద్యోగులు గుసగుసలాడుతున్నారా అన్నదీ పట్టించుకోం. వెనకాముందూ ఆలోచించకుండా, కనురెప్పలు వాటంతట అవే మూతబడి పోతాయంతే! ప్రకృతికి ఉదయాస్తమానాల్లా...మనిషికి నిద్రా మేలుకొలుపూ! ఆ చక్రం తిరుగుతూనే ఉండాలి. ఆగిందా...గోవిందా!


ఆఫీసు కునుకు...

నిద్రలేమి ఉత్పత్తి వ్యవస్థనూ ప్రభావితం చేస్తోంది. ప్రతి పదిమంది ఉద్యోగుల్లో ఒకరు...నిద్ర కరవైన కారణంగా, విధులకు గైరుహాజరు కావడమో, ఆలస్యంగా రావడమో జరుగుతోందని ఓ అంతర్జాతీయ అధ్యయనం చెబుతోంది. వచ్చినా, కునుకుపాట్లు పడుతుంటారు కాబట్టి...ఉత్పాదకతా తక్కువే. దీనివల్ల, ఆయా కంపెనీల ఉత్పత్తి పదిహేను నుంచి ఇరవైశాతం దాకా పడిపోతోందని అంచనా. ఆ మత్తును పోగొట్టడానికే కావచ్చు, గూగుల్‌ లాంటి సంస్థలు ‘కునుకు గదులు’ ఏర్పాటు చేస్తున్నాయి. కార్ఖానాల్లో సంభవించే ప్రమాదాల్లో చాలా వరకూ నిద్రలేమి వల్ల జరిగేవే.


‘తొలి’ రాత్రి!

కొత్తచోటికి వెళ్లినప్పుడు ఓపట్టాన నిద్ర పట్టదు. చెప్పలేని బెరుకు. అర్థంలేని భయం. ఆ మానసిక స్థితికి కారణాలు మన మూలాల్లోనే ఉన్నాయి. సంచార జీవనం సాగించే రోజుల్లో... క్షణక్షణం అభద్రతే. ఏ క్రూరమృగాలో రావచ్చు. ఏ ఆటవికులో చుట్టుముట్టవచ్చు. అందుకే, ఆ అప్రమత్తత. మనిషి అప్పటి మనోస్థితి నుంచి ఇంకా బయటపడలేదు. కాబట్టే, కొత్తచోటంటే అంత బెరుకు. మరుసటి రోజు మళ్లీ అదే చోట పడుకుంటే మాత్రం...ఆ పరిసరాలు పరిచయం ఉన్నట్టే అనిపిస్తాయి. హాయిగా నిద్రపడుతుంది. దీన్నే ‘ఫస్ట్‌ నైట్‌ ఓన్లీ ఎఫెక్ట్‌’ అంటారు నిపుణులు.


బిడ్డ ఆదమరచి నిద్రపోయే ఆ కాస్త సమయంలోనే అమ్మ వంటింటి వ్యవహారాలన్నీ చక్కబెట్టుకున్నట్టు...మనం నిద్రలోకి జారుకున్న ఆ ఎనిమిది గంటల వ్యవధిలోనే శరీరం ముఖ్యమైన బాధ్యతల్ని పూర్తిచేసుకుంటుంది. మెదడు తాజా సంఘటనలన్నీ వడపోసి పనికొచ్చే విషయాల్ని మాత్రమే జాగ్రత్తపరుస్తుంది. జీర్ణవ్యవస్థ అరిగించే పనిని వేగవంతం చేస్తుంది. చర్మం చిన్నాచితకా మరమ్మతుల్ని పూర్తిచేస్తుంది. నిద్రపోతున్నప్పుడే శరీరంలో ప్రొటీన్ల అదనపు ఉత్పత్తి జరుగుతుంది. రోగాల్ని తట్టుకునే సత్తువ వాటి ద్వారానే వస్తుంది.

నిద్రలో రెండు దశలు. మొదటిది కనుగుడ్ల కదలిక తక్కువగా ఉండే దశ (నాన్‌ - రెమ్‌...ర్యాపిడ్‌ ఐ మూమెంట్‌), రెండోది కదలిక ఎక్కువగా ఉండే దశ (రెమ్‌). నిద్ర మొదలుపెట్టగానే ‘నాన్‌ రెమ్‌’ దశ మొదలవుతుంది. అందులో మళ్లీ ఓ నాలుగు దశలు. ఒకటోది...అటు నిద్రా కాని, ఇటు మెలకువా కాని దశ. మాటలు లీలగా వినిపిస్తుంటాయి. శబ్దాలు స్పష్టాస్పష్టంగా చెవిన పడుతుంటాయి. ఎవరైనా బిగ్గరగా పిలిస్తే ఇట్టే లేచిపోతాం. రెండోది...ఇంతకంటే కాస్త లోతైన దశ. నిద్రమత్తు మరింత పెరుగుతుంది. మూడోది...గాఢ నిద్ర. కలలు కనేది ఈ దశలోనే. నిద్రలో నడిచే అలవాటు ఉన్నవాళ్లు...కళ్లుమూసుకునే షికార్లు కొట్టేది కూడా ఈస్థాయిలోనే. కొందరికైతే కలవరింతలూ వస్తుంటాయి. నాలుగోదశ...అతిగాఢ నిద్ర. ఆతర్వాత మళ్లీ ‘రెమ్‌’! అంటే, కనుగుడ్లు చురుగ్గా కదులుతూ ఉంటాయి. నిద్రలో గాఢత తక్కువ. ఈ చక్రం పూర్తికావడానికి గంటన్నర నుంచి రెండుగంటలు పడుతుంది. ప్రతి ఎనిమిది గంటల నిద్రలో ఇలాంటి చక్రాలు నాలుగైనా ఉంటాయి.


నిద్రమాత్రలు!

అంతర్జాతీయంగా నిద్రమాత్రల వ్యాపారం అంతకంతకూ పెరిగిపోతోంది. ఆ విలువ ఏటా రూ.లక్ష కోట్ల పైమాటే. మన దేశంలో నూటికి ఐదు నుంచి ఎనిమిది శాతం మంది నిద్రమాత్రల్ని ఉపయోగిస్తారని అంచనా. మందుబిళ్లలు నిద్రలేమి సమస్యను శాశ్వతంగా పరిష్కరించలేవు, ఆ పూటకు అవసరమైన కృతకమైన మత్తును అందిస్తాయంతే. సాధారణ నిద్ర తర్వాత చాలా తాజాగా అనిపిస్తుంది. కానీ, నిద్రమాత్ర మింగితే... ఆ మత్తు మేల్కొన్న తర్వాత కూడా వెంటాడుతూనే ఉంటుంది. వైద్యుల సిఫార్సు ఉంటే తప్పించి నిద్రమాత్రలు వాడటానికి వీల్లేదు. కాలేయ, మూత్రపిండ రుగ్మతలున్నవారూ ఇతర వైద్య సమస్యలతో బాధపడుతున్నవారూ మరింత జాగ్రత్తగా ఉండాలి. తాత్కాలికంగా...తలనొప్పి, విరేచనాలు, జ్ఞాపకశక్తి మందగించడం తదితర దుష్ప్రభావాలూ ఉన్నాయి. మరీ ఎక్కువకాలం నిద్రమాత్రలు వాడితే....కండరాల బలహీనత రావచ్చు.


ఇన్సోమ్నియా (నిద్రపట్టకపోవడం), హైపర్‌సోమ్నియా (అతినిద్ర), స్లీప్‌ టెర్రర్‌ (నిద్రలో ఉలిక్కిపడటం)...ఇలా నిద్రతో ముడిపడిన సమస్యలు అనేకం. ఇందులో చాలావరకూ మానసికమైనవే. నిద్ర లేకపోతే, అసలు నిద్రేరాకపోతే?...అన్న ప్రశ్నకు సమాధానం - ‘మరణం’ అయినా కావచ్చు. నిద్రలేమి మనుషుల్ని నేరుగా చంపదు. కానీ గుండె, మెదడు తదితర వ్యవస్థలకు ‘సుపారీ’ ఇచ్చి ఆరోగ్యం మీద దాడి చేయిస్తుంది. ఫ్యాటల్‌ ఫెమిలియల్‌ ఇన్సోమ్నియా...దీర్ఘకాలిక నిద్రలేమి రుగ్మత. ఈ ఇబ్బంది ఉన్నవాళ్లకి నెలల తరబడి నిద్రపట్టదు. చికిత్స తీసుకోకపోతే, ఏడాది రెండేళ్లలోపే మరణానికి చేరువయ్యే ప్రమాదం ఉంది.

రాత్రి చిక్కిపోతోంది...
పగలంతా పనిచేయడం, రాత్రికి నిద్రపోవడం - ప్రకృతి నియమం. పశుపక్ష్యాదులు కూడా తెల్లారేలోపు ఆహార సేకరణకు బయల్దేరతాయి. చీకటిపడే సమయానికి మళ్లీ గూటికి చేరుకుంటాయి. చీకటికీ నిద్రకూ ప్రత్యక్ష సంబంధం ఉంది. చీకటి పడగానే, ప్రకృతి మనిషి నిద్రకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తుంది. ఎయిర్‌ కండిషనర్‌ ఆన్‌ చేసినట్టు చల్లగాలినిస్తుంది. కంటి మీద వెలుతురు పడకుండా...చంద్రుడనే బెడ్‌ల్యాంప్‌ను వెలిగిస్తుంది. ‘ష్‌...’ అని హెచ్చరించినట్టు చుట్టూ నిశ్శబ్దం! నిద్రను ప్రేరేపించే ‘మెలటొనిన్‌’ హార్మోను రాత్రిపూటే ఉత్పత్తి అవుతుంది. కాబట్టే, రాత్రి నిద్ర అంత గాఢంగా ఉంటుంది. మనిషి కూడా నిన్నమొన్నటి దాకా పగలు పనిచేశాడు, రాత్రి విశ్రాంతి తీసుకున్నాడు. టెక్నాలజీ వెంట పరుగులు తీసే క్రమంలో.. మెల్లగా దారితప్పాడు. ఆన్‌లైన్‌ కబుర్లూ, సెల్‌ఫోన్‌ ముచ్చట్లూ, బ్లాగింగ్‌ బాతాఖానీ...కాలక్షేపానికి రాత్రే కావాల్సి వచ్చింది. మిడ్‌నైట్‌ బిర్యానీ, మిడ్‌నైట్‌ షాపింగ్‌, మిడ్‌నైట్‌ మూవీస్‌...వినోదానికీ రాత్రే అవసరమైంది. పని ఒత్తిడితోనో పరమబద్ధకంతోనో పగటిపూట వాయిదా వేసుకున్న పనులన్నీ రాత్రికి ముందేసుకుంటాడు.అర్ధరాత్రి దాటాక మంచం ఎక్కుతాడు. మహా అయితే, ఏ మూడునాలుగు గంటలో నిద్ర, అదీ కలత నిద్రే. అలారమ్‌ మోతతో ఉలిక్కిపడి మేల్కొంటాడు. మళ్లీ ఉరుకు, అదే పరుగు. నిద్రలో లేని నాణ్యత, జీవితంలో మాత్రం ఎలా వస్తుంది?

నిద్రా రాక్షసాలు...
సర్వశ్రేష్ఠ్‌గుప్తా శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓ కంపెనీలో ఎనలిస్ట్‌. ప్రాజెక్టులూ ప్రజెంటేషన్లూ డెడ్‌లైన్లూ అంటూ..వారంరోజులు కంటిమీద కునుకులేకుండా పనిచేశాడు. రాత్రీపగలూ ఆఫీసులోనే ఉన్నాడు. ఓ తెల్లవారు జామున భారత్‌లోని కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి కాసేపట్లో నివాసానికి బయల్దేరుతున్నట్టు చెప్పాడు. తెల్లారేసరికి...శవమై కనిపించాడు. పై అంతస్తు మీది నుంచి పడటం వల్ల, తలకు బలంగా గాయాలై చనిపోయాడని పోలీసులు నిర్ధరించారు. తగినంత నిద్రలేకపోతే...మెదడు ఆలోచించడానికి మొరాయిస్తుంది. మంచిచెడుల విచక్షణ సన్నగిల్లిపోతుంది. సరిగ్గా అలాంటి మానసిక స్థితిలోనే సర్వశ్రేష్ఠ్‌ పైనుంచి దూకేసి ఉండవచ్చు. పని తర్వాతే ఏదైనా...అంటూ నిద్రకు చిట్టచివరి స్థానమిచ్చే ఆధునిక జీవులకు ఈ ఉదంతం తీవ్ర హెచ్చరిక!

నిద్రకు ప్రత్యామ్నాయం లేదు. నిద్రపోవాల్సిన సమయంలో నిద్రపోవాల్సిందే. నిద్రను అధిగమించడానికి దొడ్డిదార్లు లేవు. నిద్ర విలాసమో సుఖమో కాదు. అవసరం, అత్యవసరం. నిద్రకు కేటాయించాల్సిన సమయాన్ని నిద్రకే వదిలిపెట్టాలి. అందులోకి వృత్తి ఉద్యోగాల చొరబాట్లూ, విందూవినోదాల కబ్జాలూ వద్దేవద్దు.


పాపం పసివాళ్లు!

నిద్రలేమి బాల్యాన్నీ వదిలిపెట్టడం లేదు. టీవీ, ఇంటర్నెట్‌, వీడియోగేమ్స్‌, చదువుల ఒత్తిడి పసివాళ్లను నిద్రకు దూరం చేస్తున్నాయి. పెద్దలకంటే పిల్లలకే నిద్ర అవసరం ఎక్కువ. బాల్యం నేర్చుకునే వయసు. ఆ నేర్చుకున్నవన్నీ మెదడులో నిక్షిప్తమైపోవాలంటే...తగినంత నిద్ర ఉండాల్సిందే. లేకపోతే, వికాసం మందగిస్తుంది. ఎదిగే పిల్లల్లో ‘గ్రోత్‌ హార్మోన్‌’ స్రవించేది కూడా నిద్రలోనే. కంటినిండా కునుకు కరవైనప్పుడు పెద్దలు కప్పను మింగిన పాముల్లా మత్తుగా ఉంటారు. అదే పిల్లల్లో అయితే, అవసరానికి మించిన చురుకుదనం కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా పెంకిఘటాల్లా తయారవుతారు. పిల్లలు ఎవరి పక్కన పడుకుంటే, వాళ్లతోనే అనుబంధం బలపడుతుందని కూడా ఓ అధ్యయనం చెబుతోంది. అది అమ్మ కావచ్చు, నాన్నా కావచ్చు.


నిద్రలేమితో ముందుగా రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. ఇంకేముంది, సింహద్వారాన్ని బద్దలుకొట్టినట్టే. శత్రువు మన మీద సగం విజయం సాధించినట్టే. మిగతా క్యాన్సర్‌ బాధితులతో పోలిస్తే, నిద్రలేమితో బాధపడుతున్నవారిలో...వ్యాధి మరింత వేగంగా విస్తరించినట్టు ఓ అధ్యయన సారాంశం. నిద్రతో ముడిపడిన మెలటొనిన్‌ హార్మోను కొరత రొమ్ము, ప్రొస్టేట్‌ క్యాన్సర్లకు దారితీస్తుంది. దీర్ఘకాలిక నిద్రలేమితో...గుండెపోటు, పక్షవాతం, మధుమేహం, వూబకాయం తదితర సమస్యలకు సంబంధం ఉన్నట్టు అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ స్లీప్‌ మెడిసిన్‌ వెల్లడించింది. ఆరోగ్యానికి పోషక విలువలు ఎంత ముఖ్యమో నిద్రా అంతే అవసరం. ఆరోగ్యానికి ధూమపానం ఎంత ప్రమాదకరమో నిద్రలేమి అంతకంటే ప్రాణాంతకం. గుండెపోటుకు గురైనవారిలో దాదాపు అరవైమూడు శాతం మంది నిద్రలేమితో ఇబ్బందిపడుతున్నట్టు ఓ నివేదిక చెబుతోంది. నిద్ర సమస్యలున్న వారిలో, గుండె రుగ్మతలు రావడానికి రెండున్నర రెట్లు ఆస్కారం ఎక్కువ. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే, కంటినిండా నిద్ర ఉండాల్సిందే. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకునే వాహన చోదకుల్లో 34 శాతం దాకా...కునుకు కరవైనవారే.

మనం మంచి నిద్రలో ఉన్నప్పుడు...ఆకలిని పెంచే ఘ్రెలిన్‌ అనే హార్మోను వూరుతుంది. కాబట్టే, నిద్రలేచాక బాగా ఆకలేస్తుంది. అరకొర నిద్ర ఆకలిని చంపేస్తుంది. అతిగా తినడమే కాదు, అసలు తినకపోవడం కూడా వూబకాయానికి ఓ కారణమే. శరీరానికి అభద్రత పెరిగిపోయి, కొవ్వురూపంలో శక్తిని పోగేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఒరెక్సిన్‌ అనే న్యూరోట్రాన్స్‌మిటర్‌ ఉత్పత్తి కూడా నిద్రలో ఉన్నప్పుడే జరుగుతుంది. మనలో పేరుకుపోయిన అదనపు శక్తిని కరిగించే చిట్కా దీనికి తెలుసు. నిద్రలేదంటే, ఒరెక్సిన్‌ కూడా లేనట్టే, ఎంతోకొంత బరువు పెరిగినట్టే. నిద్రలేమి మనో స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా తిండికి సంబంధించిన వూరింపులకు ఇట్టే లొంగిపోతాం. అనారోగ్యకరమని తెలిసినా...చిరుతిళ్లను తోలుతిత్తిలోకి తోసేసుకుంటాం. దీంతో వూబకాయం దాడి చేసేస్తుంది. యూనివర్సిటీ ఆఫ్‌ చికాగో నిపుణుల అధ్యయనంలో ఈ విషయం తేలింది.

ఒకే వయసులోని మహిళల్ని పరిశీలిస్తే, నిద్రలేమితో బాధపడుతున్నవారిలోనే అకాల వార్ధక్యాన్ని సూచించే ముడతలు నలభైశాతం దాకా అధికంగా కనిపించాయట. నిద్రలేమి అల్జీమర్స్‌కూ దారితీయవచ్చు. మనం నిద్రలో ఉన్నప్పుడే అల్జీమర్స్‌కు కారణమైన పదార్థాల్ని చీపురుతో శుభ్రంగా వూడ్చినట్టు ఖాళీ చేసేస్తుంది మెదడు. నిద్ర కరవైందా ఆ చెత్తంతా అలానే పేరుకుపోతుంది.

 


మీ స్కోరు

0-9 అయితే...
మీరు నిద్రలేమితో బాధపడుతున్నారు. మీ శారీరక, మానసిక ఆరోగ్యం మీదా అది ప్రభావం చూపుతోంది. సమస్య ఏ తీవ్ర రుగ్మతలవైపో దారితీసేలోపు...నిపుణుడిని సంప్రదించడం మంచిది.

10-18 అయితే...
మీకు కొంతమేర నిద్ర సమస్య ఉందని అర్థమౌతూనే ఉంది. జీవనశైలిలో అవసరమైన మార్పులు చేసుకోండి. నిద్రకు భంగం కలిగించే ఆహారాన్నీ అలవాట్లనూ దరిదాపుల్లోకి కూడా రానివ్వకండి.

19-27 అయితే...
మీరు హాయిగానే నిద్రపోతున్నారు. అయినా, అప్పుడప్పుడూ చిన్నచిన్న అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి. ధ్యానం, యోగా తదితర మార్గాల ద్వారా మరింత నాణ్యమైన నిద్రను సొంతం చేసుకోండి.

28-36 అయితే...
నిద్రాదేవి పరిపూర్ణ కటాక్షం మీకు లభించింది. ఇదే మార్గంలో ప్రయాణించండి. మీ ఆత్మీయులకూ నిద్ర ప్రాధాన్యాన్ని తెలియజెప్పండి. శుభరాత్రి!


నిద్రలేమితో ముడిపడిన మనో రుగ్మతలు చాలానే ఉన్నాయి. రోజూ ఓ గంట నిద్ర తగ్గినా దీర్ఘకాలంలో మానసిక సమస్యలకు పద్నాలుగు శాతం ఆస్కారం ఎక్కువ. నిద్రలేమితో బాధపడుతున్నారంటే, డిప్రెషన్‌తోనూ ఇబ్బంది పడుతున్నారని అర్థం. జ్ఞాపకశక్తి కూడా తక్కువగానే ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. దేనికైనా వెంటనే స్పందించలేరు. చిన్నచిన్న విషయాలకూ చికాకు పడుతుంటారు. నిద్రపోవాల్సిన సమయంలో నిద్రపోవడం లేదంటే..నిద్రపోకూడని సమయంలో నిద్ర ముంచుకొచ్చే ప్రమాదమూ ఉంటుంది. దీంతో, ఆఫీసు సీట్లో కూర్చుని కునుకుపాట్లు పడతారు. ముఖ్యమైన సమావేశాల్లో తలవాలుస్తారు. ఫలితంగా..ఎన్ని తెలివితేటలున్నా, ఎంత అంకితభావం ఉన్నా ‘మొద్దుబుర్ర’గా ముద్రపడిపోతుంది. కుటుంబ జీవితంలోనూ ఆటుపోట్లు తప్పవు. తగినంత సమయం కేటాయించకపోవడం వల్ల...ఆలూమగల మధ్య అగాథం ఏర్పడుతుంది.స్నేహితులతో సంబంధాలు తెగిపోతాయి. చురుకైన సామాజిక జీవితమూ ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే నిద్రలేమితో బాధపడుతున్నవాళ్లు ...మద్యం మత్తులో తూగుతున్నవాళ్లతో సమానం. ఇద్దరిదీ ఒకే మానసిక స్థితి.

ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లను నిద్ర అడ్డుకుంటుంది. దీంతో, మనసుకు హాయిగా అనిపిస్తుంది. రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. ఏడు నుంచి ఎనిమిది గంటల కలతలేని నిద్ర...మిగతా పదహారు గంటల్లో ప్రతి నిమిషాన్నీ ప్రతి సెకెనునూ నాణ్యంగా ఖర్చు చేసేందుకు సాయపడుతుంది. ఎనిమిది గంటల గాఢ నిద్ర తర్వాత పొందే ఆనందమే వేరు! కళ్లలో కాంతి, చర్మంలో నిగారింపు, మొహంలో ప్రశాంతత, మొత్తంగా శరీరానికంతా కొత్తశక్తి వచ్చినట్టు ఉంటుంది.

నిదురపోరా తమ్ముడా...
వయసును బట్టి నిద్ర లెక్కలు మారతాయి. మూడు నెలల నుంచి ఏడాదిలోపు పసిపిల్లలకు, పన్నెండు నుంచి పదిహేడు గంటల నిద్ర అవసరం. ఏడాది మొదలు ఐదేళ్ల వరకూ, పది నుంచి పద్నాలుగు గంటలు నిద్రపోవాల్సిందే. పదమూడేళ్లలోపు పిల్లలు, పది నుంచి పదకొండు గంటలు పడుకోవాలి. కౌమారంలో తొమ్మిది నుంచి పది గంటల నిద్ర తప్పనిసరి. ఆతర్వాత, కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల సమయాన్ని నిద్రకు కేటాయించాలి. శరీరతత్వాన్ని బట్టి కూడా ఈ లెక్కలు మారవచ్చు.

మధ్యాహ్నం ఏం తిన్నా, రాత్రిపూట మాత్రం సుఖనిద్రనిచ్చే ఆహారాన్నే తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారంలోని కాల్షియం ఎముకల్ని బలంగా ఉంచడమే కాదు, గాఢమైన నిద్రకూ కారణం అవుతుంది. నిద్రకు ఒకటిరెండు గంటలముందు...కాఫీటీల జోలికి వెళ్లకపోవడం మంచిది. మిఠాయిలూ తినకూడదు. రోజూ ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. చాలామంది మంచానికి ఎదురుగా గోడ గడియారం వేలాడదీసుకుంటారు. దీనివల్ల త్వరగా నిద్రపోవాలనో, త్వరగా మేల్కొనాలనో...మనమీద ఒత్తిడి పెరగడం తప్పించి మరో ఉపయోగం ఉండదు. పడకగదిలో టెలివిజన్‌ పీక నొక్కేయడమే మంచిది. ఫోన్ల గోల వద్దేవద్దు. అయితే చిన్న మినహాయింపు.. కాసేపు బాగా ఆత్మీయులైనవారితో మనసు విప్పి మాట్లాడుకోవడం మంచిదే. దీనివల్ల ఒత్తిడి తగ్గిపోయి సుఖనిద్ర వరిస్తుంది. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసినా హాయిగా అనిపిస్తుంది. చక్కని సంగీతం, ఉత్తమ సాహిత్యం నిద్రానగరికి రాచమార్గాలు. ఓ పావుగంట ధ్యానానికి కేటాయించడం మరీ మంచిది. అధిక బరువును వదిలించుకోవడం ద్వారా కూడా నిద్రకు దగ్గర కావచ్చని నిపుణులు చెబుతున్నారు. నిద్రకు వ్యాయామంతో సంబంధం ఉంది. రోజూ ఓ నలభై అయిదు నిమిషాల కసరత్తు...నిద్రలో నాణ్యతను పెంచుతుంది. కాబట్టే, ఇటాలియన్లు ‘బెడ్‌ ఈజ్‌ ఎ మెడిసిన్‌’ అంటారు.

* * *

జపాన్‌లో...సంప్రదాయ టీవేడుకల్లో పాల్గొనేముందు, సమురాయ్‌ యుద్ధవీరులు ఖడ్గాన్ని గడప బయటే ఉంచేవారు. తమలోని అహాన్ని ప్రతీకాత్మకంగా వదిలిపెట్టడం అన్నమాట.

పడకగదిలోకి వెళ్తున్నప్పుడు మనమూ అలానే వ్యవహరించాలి. చింతలూ చికాకులూ ఒత్తిళ్లూ భయాలూ అభద్రతలూ - అన్నింటినీ మూటగట్టి గది బయటే వదిలిపెట్టాలి. పడకగదేం ‘వార్‌రూమ్‌’ కాదు, సమస్యలకు పరిష్కారాల్ని ఆలోచించుకోడానికి. పడకగదేం బోర్డ్‌రూమ్‌ కాదు, మేధోమథ¿నాలు చేయడానికి. కన్ఫెషన్‌రూమ్‌ కూడా కాదు, గతాన్ని తలుచుకుని పశ్చాత్తాప పడటానికి. ఆ వ్యవహారాలకు పగలు పన్నెండు గంటల సమయం ఉంది.
రాత్రి మాత్రం...
మీ..దే.
ని..ద్ర..దే!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.