close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కాలేజ్‌ డ్రాపవుట్‌... కానీ నాటౌట్‌!

కాలేజ్‌ డ్రాపవుట్‌... కానీ నాటౌట్‌!

గ్రాడ్యుయేషన్‌ గౌను తొడుక్కోవాలన్న కోరిక ఉండదు. స్టేజీ మీద పట్టా కాగితం పుచ్చుకుంటూ ఫొటో తీయించుకోవాలన్న ఆరాటం కనిపించదు. పేరుపక్కన మూడక్షరాలు చూసుకోవాలన్న ముచ్చటే లేదు. ఒకటే లక్ష్యం - వ్యాపారాన్ని ప్రారంభించడం. ‘స్టార్టప్‌’ వీరుల్లో ‘డ్రాపవుట్‌ ఎంట్రప్రెన్యూర్స్‌’ చాలామందే ఉన్నారు.

క్యాంపస్‌ క్యాంటీన్‌ -
‘ఉస్తాద్‌! తీన్‌ చాయ్‌’ మొదటివాడి ఆర్డరు.
‘చార్‌ సమోసా..గరమ్‌’ రెండోవాడి జోడింపు.
‘కూల్‌డ్రింక్‌ పిలావో యార్‌’ మూడోవాడి ముచ్చట.
‘రేయ్‌, మనం బిజినెస్‌ గురించి మాట్లాడుకోడానికొచ్చామా, తిని తేన్చడానికొచ్చామా! ఇడియట్స్‌’ - నాలుగోవాడి గద్దింపు.
‘ఓకే ఓకే. సబ్జెక్ట్‌లోకి వద్దాం...’ మొదటివాడే మళ్లీ అందుకున్నాడు. తనే సమన్వయ బాధ్యతా తీసుకున్నాడు.
‘ఐడియా’ అనగానే...
‘సిద్ధంగా ఉంది’ అని జవాబిచ్చారంతా.
‘పెట్టుబడి’ మాట పూర్తికాకముందే...
‘వాడి మమ్మీడాడీ సరేనన్నారు. నాకైతే పార్ట్‌టైమ్‌ జాబ్‌ సేవింగ్స్‌ ఉన్నాయి. వీడెక్కడో అప్పుచేస్తున్నాడనుకుంటా...’ అందరి తరఫునా ఒకడే వకాల్తా పుచ్చుకున్నాడు.
‘ఇంకేమిటి సమస్య’...
‘క్యాంపస్‌! అదే పెద్ద సమస్య. ప్రాజెక్టులూ అసైన్‌మెంట్లూ సెమిస్టర్‌ పరీక్షలూ...క్షణం తీరిక ఉండటం లేదు. చారాణా చదువుకు బారాణా కష్టం. ఏం బాగాలేదు. ఫోకస్‌ కుదరట్లేదు’ - ముక్తకంఠంతో చెప్పారు.
‘ఏం చేద్దాం?’- సమన్వయకర్త రెట్టించాడు.
‘డ్రాపైపోదాం’ - అంతే గట్టిగా జవాబు.
‘గ్రేట్‌ ఐడియా’ - కేక్‌ కోసుకుని కేకలేశారు. కోక్‌ పొంగించి కేరింతలు కొట్టారు.
డ్రాపైపోయేది...బిజినెస్‌ నుంచి కాదు, క్యాంపస్‌ నుంచి.
‘క్యాంపస్‌ దాటితే చదువాగిపోతుందంతే!
కానీ ఐడియా ఆగితే గుండాగిపోతుంది...’
డ్రాపవుట్‌ ఎంట్రప్రెన్యూర్స్‌ పాపులర్‌ డైలాగ్‌!

* * *

అంతకుముందు...
నేపథ్యాలన్నీ ఒకటే, మధ్యతరగతో ఎగువ మధ్యతరగతో. వయసులన్నీ సమానమే, అటూ ఇటూ ఇరవై. చదువులన్నీ ఓ సెమిస్టర్‌ అటోయిటో, ఇంజినీరింగే.
రితేష్‌ అగర్వాల్‌...
అచ్చమైన మార్వాడీ కుర్రాడు. నాన్న ఉద్యోగి. అమ్మ గృహిణి. పదో తరగతి మంచి మార్కులతో పాసయ్యాడు. ఇంటర్‌లో అంతకంటే ఎక్కువే వచ్చాయి. ఆతర్వాత? అంతా ఇంజినీరింగ్‌ చేయమని సలహా ఇచ్చారు. అప్పటికే రితేష్‌ ‘ఎన్‌సైక్లోపిడియా ఆఫ్‌ ఇండియన్‌ ఇంజినీరింగ్‌ కాలేజెస్‌’ పేరుతో ఓ పుస్తకం తీసుకొచ్చాడు. ఏం రాసినా, ఏం చేసినా...మనసంతా బిజినెస్‌ మీదే. దీంతో, దిల్లీలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ అండ్‌ ఫైనాన్స్‌లో చేరాడు. చాలా పేరున్న సంస్థ కాబట్టి, క్యాంపస్‌ నియామకం ఖాయం. జీతం నెలకు లక్ష రూపాయలైనా ఉంటుంది. ఇంకేముంది, చక్కని అమ్మాయిని చూసి పెళ్లి చేద్దామనుకుంది అమ్మ. ఓ ఏడాది రెండేళ్ల జీతం పోగేసి మంచి ఫ్లాటు బుక్‌ చేద్దామనుకున్నాడు నాన్న. రెండూ జరగలేదు.
కారణం...డ్రాపవుట్‌!

రాహుల్‌ యాదవ్‌...

ఆ కుర్రాడి తీరే అంత. ఏం చేసినా కుండబద్దలు కొట్టినట్టే ఉంటుంది. కొన్నిసార్లు గుండె బద్దలు కొట్టినట్టూ ఉంటుంది. చిన్నప్పట్నుంచీ చదువుల్లో ఓమోస్తరు. ముప్ఫైమంది విద్యార్థులున్న తరగతిలో ఏ ఇరవై ఒకటో స్థానమో. ‘ఒట్టి మొద్దుబుర్ర...’ అని ఓసారి మేనమామ ఎగతాళి చేశాడు. దీంతో, పట్టుదల పెరిగింది. కసితో చదివాడు. అప్పట్నుంచీ అన్నింట్లోనూ ఫస్టే! కంప్యూటర్‌ ముందు కూర్చున్నాడా...మంత్రదండం చేతిలో ఉన్న మాయలఫకీరే! అద్భుతాలు చేసేస్తాడు. అలాంటి కుర్రాడు ముంబయి ఐఐటీలో కాకుండా ఇంకెక్కడుంటాడు? ఓసారి కాలక్షేపానికి దగ్గర్లోని పిజ్జాదుకాణం వెబ్‌సైట్‌ని హ్యాక్‌ చేశాడు. ‘మీ వెబ్‌సైట్‌లో లోపాలున్నాయి. వెంటనే సరిచేసుకోండి’ అంటూ దుకాణం వాళ్లకో నివేదిక ఇచ్చాడు. ఆ పరిజ్ఞానానికి ముచ్చటపడి ఓ మూడువేలు చేతిలో పెట్టారు కూడా. ఆతర్వాత, ముంబయి ఐఐటీ పాత ప్రశ్నాపత్రాల్ని జవాబులతో సహా ఇస్తూ ఎగ్జామ్‌బాబా.కామ్‌ పేరుతో ఓ వెబ్‌సైట్‌ రూపొందించాడు. చిన్నాచితకా ప్రయోగాలు ఎలా ఉన్నా, ‘ఎంతకాలమని అరిగిపోయిన పాఠాల్నే మళ్లీ మళ్లీ వల్లెవేసుకోవాలి?’ - అన్న ఆలోచన రాగానే, ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాడు.

ఇంకేముంది...‘డ్రాపవుట్‌’! కునాల్‌ షా...

జీవాత్మ, పరమాత్మ; ద్వైతం, అద్వైతం - వగైరా వగైరా బరువైన సిద్ధాంతాల్ని బుర్రలోకి అప్‌లోడ్‌ చేసుకుంటూ డిగ్రీ ముగించాడు. ఫిలాసఫీ చదివితే జీవితానికో స్పష్టత వస్తుందని కునాల్‌ అభిప్రాయం. ఆతర్వాత, ఎంబీయేలో చేరాడు. కునాల్‌ది వ్యాపార కుటుంబం. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచనా తనకుంది. క్లాసులు మొదలై, ఆరు నెలలు గడిచినా...ఆ కబుర్లూ ఈ కబుర్లే తప్ప అసలు విషయం చెప్పరే. వ్యాపారం ఎలా ప్రారంభించాలో నేర్పించరు, ఖాతాదారుడితో ఎలా మాట్లాడాలో బోధించరు. కొత్త ఐడియాల్ని ఎలా సృష్టించుకోవాలో విప్పిచెప్పరు. ‘ఆ మాత్రం దానికి సంవత్సరాల తరబడి క్యాంపస్‌కే అంకితమైపోవడం అవసరమా?’ అనిపించింది.
మరు నిమిషం... డ్రాపవుట్‌!


అంతర్జాతీయ ‘డ్రాపవుట్స్‌’!

ట్టా కాగితం పట్టుకోకుండానే...క్యాంపస్‌కు గుడ్‌బై చెప్పిన అంతర్జాతీయ వ్యాపారవేత్తల సంఖ్య తక్కువేం కాదు. పేరుపక్కన రెండుమూడు అక్షరాలు కోల్పోతున్నామన్న బాధ ఎంతోకొంత ఉన్నా...తమ పేరే ఓ బ్రాండ్‌గా మారడంతో మహదానందంగా ఉన్నారు ఆ దిగ్గజాలు.


 ఆతర్వాత...

తపన ఒకే స్థాయిలో, శ్రమ అంతే పరిమాణంలో, ఎత్తుపల్లాలు సమానమే. ఫలితాలు...దాదాపుగా ఒకటే.
రితేష్‌కు ప్రయాణాలంటే ప్రాణం. ఏ కాస్త ఖాళీ దొరికినా ఎక్కడో ఓచోటికి చెక్కేస్తాడు. కానీ, ఎక్కడ దిగాలన్నది ప్రశ్న. బంధువుల ఇంటికెళ్తే అదో గోల. కనీసం టీవీలో మనకు నచ్చిన ఛానల్‌ చూసుకునే అవకాశం ఉండదు. రిమోట్‌ వాళ్లచేతిలోనే ఉంటుంది. ఏ లాడ్జీలోనో దిగాలంటే భయం. కంపుకొట్టే టాయిలెట్లూ, మురికిపట్టిన మంచాలూ, లైటు తీయగానే రక్తాన్ని కూల్‌డ్రింక్‌లా తాగేసే నల్లులూ...యాక్‌! తలుచుకోగానే కంపరమెత్తిపోతుంది. ఆ సమస్యకు తానే పరిష్కారం కనుక్కోవాలని అనుకున్నాడు. శుభ్రమైన దుప్పట్లు, వైఫై సౌకర్యం, కమ్మని బ్రేక్‌ఫాస్ట్‌...తదితర ముప్ఫై సౌకర్యాలతో ఓ జాబితా తయారు చేశాడు. అవన్నీ తూచా తప్పక ఉండేలా ఓమోస్తరు నగరాల్లోని లాడ్జీలతో ఒప్పందం చేసుకున్నాడు. వసతుల్ని బట్టి గ్రేడింగ్‌ ఇస్తూ...అద్దెల్నీ ఖరారు చేశాడు. ఓయో రూమ్స్‌ ముద్ర ఉంటే, ఇంకో ఆలోచన లేకుండా దిగిపోవచ్చన్న భరోసా కల్పించాడు. ఆన్‌లైన్‌ బుకింగ్‌కు ఆదరణ పెరిగింది. పెట్టుబడులూ వెల్లువెత్తాయి. ఆ వార్త అన్ని దినపత్రికల్లోనూ వచ్చింది. కొడుకు దిల్లీలో బుద్ధిగా చదువుకుంటున్నాడని భ్రమపడుతున్న తండ్రికి అదో షాకు! ఆ రాత్రికే రైలు ఎక్కాడు. కొడుకు కనిపించగానే చడామడా తిట్టేశాడు. నోరెత్తకుండా నాన్నని తన ఆఫీసుకు తీసుకెళ్లాడు రితేష్‌. ‘ఫర్వాలేదు, పెద్దగానే ఉంది’...పుత్రోత్సాహంతో తండ్రి గుండె ఉప్పొంగింది. మనసులో ఏమూలనో ‘ఆ పట్టా కూడా చేతికొచ్చుంటే....’ అన్న అసంతృప్తి.

రాహుల్‌ యాదవ్‌ పెట్టేబేడా సర్దుకుని క్యాంపస్‌ నుంచి బయటికైతే వచ్చేశాడు కానీ, అద్దెకొంప దొరకడం గగనమైపోయింది. ఆ అసహనంలోంచే అద్భుతమైన ఐడియా పుట్టింది. హౌసింగ్‌.కామ్‌ ప్రారంభమైంది. అద్దె ఇళ్లూ, సొంతిళ్ల కొనుగోళ్లూ అమ్మకాలకు సంబంధించి అదో వేదిక. పోటీ సంస్థలు ఐదారేళ్లుగా సాధించలేని క్లిక్కుల్ని, హౌసింగ్‌.కామ్‌ పుట్టీపుట్టగానే సొంతం చేసుకుంది. దిగ్గజాల్లాంటి సంస్థలు అందులో పెట్టుబడులు పెట్టాయి. అమాంతంగా రాహుల్‌ కోటీశ్వరుడు అయిపోయాడు. ఫోర్బ్స్‌ లాంటి అంతర్జాతీయ పత్రికల్లో కథనాలు వస్తున్న సమయానికి కూడా రాహుల్‌ వాళ్లింట్లో తను కాలేజీ నుంచి బయటికొచ్చినట్టు తెలియదు. ‘దేవుడే కాపాడాడు, మా వాళ్లెవరూ ఫోర్బ్స్‌ చదవరు, పొరపాటునైనా పేపర్లో బిజినెస్‌ పేజీ తిప్పేయరు’ అంటాడు. తానే స్థాపించిన సంస్థలో రాహుల్‌ ఎక్కువకాలం నిలబడలేదు. ఇన్వెస్టర్లతో గొడవలొచ్చి తెగతెంపులు చేసుకున్నాడు.

కునాల్‌ క్యాంపస్‌ దాటగానే, అనుభవం కోసం ఓ కంపెనీలో మార్కెటింగ్‌ మేనేజరుగా చేరాడు. క్లైంట్లతో ఓపిగ్గా మాట్లాడాలి, లౌక్యంగా ఒప్పించాలి, నైపుణ్యంతో మెప్పించాలి! ఎడతెరిపిలేని ఆ సంభాషణల ద్వారా మనిషి స్వభావం అర్థమైపోయింది. ఎంతవారలైనా కాంత దాసులే అన్నట్టు - ఉన్నవాళ్లయినా లేనివాళ్లయినా ‘ఉచితం’ అన్న మాట వినిపించగానే ఉరుకులు పెట్టేస్తారు. ఆఫరు ఉందంటే, నిర్ణయం మార్చుకోడానికైనా సిద్ధపడతారు. మనిషిలోని ఆ బలహీనతనే వ్యాపార ఆలోచనగా తీర్చిదిద్దుకున్నాడు. ఫ్రీఛార్జ్‌.కామ్‌ అలా ప్రాణంపోసుకున్నదే. పది రూపాయలు రీఛార్జి చేయించుకుంటే, ఇంకాస్త టాక్‌టైమ్‌ ఫ్రీ! మార్కెట్లో అదో సంచలనమై కూర్చుంది. గత ఏడాది స్నాప్‌డీల్‌ ఆ వ్యాపారాన్ని భారీ మొత్తానికి కొనుక్కుంది.

...జాతీయ స్థాయిలో పోటీపడి దక్కించుకున్న సీటును, గడ్డిపోచలా వదిలేయాలంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి? ఒక్కసారి కాలుపెడితే జన్మధన్యమైపోయినట్టేనని ఎంతోమంది తపించిపోయే విద్యాసంస్థకు తడబడకుండా ‘తలాక్‌’ ఇవ్వాలంటే ఎంత ఆత్మవిశ్వాసం అవసరం? క్యాంపస్‌ను కాదనుకుని బయటికెళ్లిపోయే కలల బేహారులకు ప్రతినిధులు వీళ్లు. ‘డ్రాపవుట్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌’కు బ్రాండ్‌ అంబాసిడర్లూ వీళ్లే. పట్టా ముఖ్యమా, లక్ష్యాన్ని సాధించితీరాలన్న పట్టుదల ముఖ్యమా - అన్న ప్రశ్న వచ్చినప్పుడు లక్ష్యంవైపే మొగ్గుచూపుతోంది యువత. ఆ ప్రయత్నంలో ఎదురయ్యే కష్టనష్టాలకూ సిద్ధపడుతోంది.

వీలైనంత తొందరగా....
చాలా సందర్భాల్లో విశ్వవిద్యాలయ పట్టా ...మనవికాని ప్రత్యేకతల్ని ఆపాదించి పెడుతుంది. మనకున్న బలాన్ని భూతద్దంలోంచి చూపెడుతుంది. ఆ మత్తులో కష్టపడటం మానేస్తాం. ఆలోచించడం ఆపేస్తాం. అందుకే, చాలామంది ఐఐటీలూ ఐఐఎమ్‌ల పట్టభద్రులు మార్కెట్లో ఘోరంగా దెబ్బతింటారు. ఆర్భాటంగా రంగంలో దిగినా, ఏడాదిరెండేళ్లకే భ్రమలు బద్దలైపోతాయి. షట్టరు దించేసి ఏదో ఓ ఉద్యోగాన్ని వెతుక్కుంటారు. అదే...డ్రాపవుట్స్‌ అయితే ఒకటే దారి. చావో, రేవో. ప్లాన్‌-బి ఉండదు. సర్వశక్తులూ ఒడ్డి పోరాడతారు. అనుకున్నది సాధిస్తారు. కాబట్టే, డ్రాపవుట్స్‌లోనే సక్సెస్‌రేటు ఎక్కువని నిపుణుల విశ్లేషణ.

కలల్ని నిజం చేసుకునే పని, ఎంత తొందరగా మొదలుపెడితే అంత ప్రయోజనం. ఓడిపోతే, గెలిచే ప్రయత్నం చేయవచ్చు. మళ్లీ ఓడిపోతే, మళ్లీ ప్రయత్నించవచ్చు. ఒక ఐడియా వర్కవుట్‌ కాకపోతే, మరో ఐడియా. ఇంకో ఐడియా బెడిసికొడితే, దాని జేజమ్మలాంటి ఐడియా. ఎందుకంటే బోలెడంత వయసు ఉంటుంది. ప్రయోగాలకు చేతినిండా సమయం ఉంటుంది. తొలి ప్రయత్నాల్లోనే గెలిచామా, అదీ మంచిదే. భవిష్యత్తులో అంతకంటే పెద్ద విజయాలకు గురిపెట్టవచ్చు. వయసు చిన్నదే కాబట్టి, పెళ్లి-సంపాదన-బాధ్యతలు వగైరా ఒత్తిళ్లుండవు. జీవితంతో తీరిగ్గా ఆడుకోవచ్చు.

అవసరమైతే, పాత అనుభవాల్ని రబ్బరుతో శుభ్రంగా తుడిచేసుకుని...తాజాగా కొత్త పోరాటాన్ని మొదలుపెట్టొచ్చు, హౌసింగ్‌.కామ్‌ రాహుల్‌లా. ఆ యువకుడు మహా ముక్కుసూటి మనిషి. ఆ స్వభావం తప్పనీ అనుకోడు. కానీ ఎదుటివాళ్లు తప్పుగా భావించే ప్రమాదం ఉంది. దీంతో ఇన్వెస్టర్లతో గొడవలొచ్చాయి. రాహుల్‌ బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చేశాడు కూడా. అదే, నడివయసులో అయితే....అంత ధైర్యం ఎవరూ చేయలేరు. రాజీపడుతూ సర్దుకుపోతూ మనసులోనే కుమిలిపోతూ బలవంతంగా బతికేస్తారు. ‘కేవలం చదువుకోడానికి అయితే, క్యాంపస్‌ దాకా ఎందుకూ? ఇంటర్నెట్‌ చాలు’ అంటాడు ‘యాడ్‌ పుషప్‌’ వ్యవస్థాపకుడు అంకిత్‌ ఒబెరాయ్‌. ఎంబీయే ఫస్ట్‌ సెమిస్టర్‌లోనే దుకాణం కట్టేశాడీ కుర్రాడు. ఇదంతా ‘డ్రాపవుట్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌’కు ఒక వైపే. మరో కోణమూ ఉంది.

వీలైతే, పట్టా వచ్చాకే...
ఎవరో ఒకరికి రూమ్మేట్‌గా ఉండాల్సిన వయసులో ఓ పదిమందికో పాతికమందికో సీయీవో కావడం గొప్పే. అమ్మో నాన్నో ఇచ్చే పాకెట్‌ మనీతో నెలంతా నెట్టుకురావాల్సిన దశలో స్వహస్తాలతో జీతాల చెక్కులివ్వడం గర్వకారణమే. ఇలాంటి ప్రత్యేకతలు వేయి ఉండొచ్చుగాక. ఎంత కత్తులకైనా ‘డ్రాపవుట్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌’...కత్తిమీద సామే!

పట్టాలేనివారికే పట్టా విలువ తెలుస్తుంది. పేరు పక్కన ఆ రెండుమూడక్షరాలు లేని వెలితి జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. గ్రాడ్యుయేషన్‌ డ్రస్సులో ఫొటో తీయించుకున్నవాళ్లని చూసిన ప్రతిసారీ...మనసులో ఏదో కోల్పోయిన భావన. అది పెరిగిపెద్దయి ఆత్మన్యూనతగా మారినా మారవచ్చు. ఆమధ్య హైదరాబాద్‌లో ఓ యువకుడు చాలా కష్టపడి ఓ మొబైల్‌ అప్లికేషన్‌ రూపొందించాడు. అది సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టిస్తుందని వూహించాడు. అలా ఏం జరగలేదు. మార్కెట్లో ఆ యాప్‌ ఘోరంగా విఫలమైంది. ఆ నిస్పృహలో ఆత్మహత్య చేసుకున్నాడు. అద్భుతంగా అనిపించిన ప్రతి ఐడియా పేలితీరుతుందన్న భరోసా ఏం లేదు. పేలేవన్నీ గొప్ప ఐడియాలే కానక్కర్లేదు. కాలం కలసి రావాలి. అదృష్టం తోడవ్వాలి. ‘పరిస్థితులు అనుకూలించకపోతే?’ అన్న పెద్ద ప్రశ్న ఉండనే ఉంది. అదే పట్టభద్రుడైతే ఏదైనా ఉద్యోగం వెతుక్కుంటాడు. కనీసం డిగ్రీ కూడా లేనివాడికి కొలువు ఎవరిస్తారు? ‘ఏమాత్రం అనుభవం లేదు. ఒక్క పట్టా కూడా లేదు. నిన్ను నమ్మి అంత పెట్టుబడి ఎలా పెట్టమంటావ్‌?’ అన్న ఏంజిల్‌ ఇన్వెస్టర్ల ప్రశ్నకి డ్రాపవుట్స్‌ దగ్గర జవాబు ఉండకపోవచ్చు. ఏంజిల్‌ ఇన్వెస్టర్లూ, వెంచర్‌ క్యాపిటలిస్టుల దాకా ఎందుకు, అమ్మానాన్నలు మాత్రం ఎందుకు నమ్మాలి? పదిహేడేళ్ల వయసులో, చదువు మానేసి...‘సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెట్టాలనుంది, పెట్టుబడి డబ్బు సర్దుతారా డాడీ’ అని కౌమారమైనా దాటని కొడుకు అడుగుతుంటే, వరుణ్‌శూర్‌ తండ్రికి నిజంగానే కోపం వచ్చేసింది. ‘పెట్టుబడి అంటే పాకెట్‌ మనీ అనుకున్నావా?’ అని రంకెలేశారు. అయినా, వరుణ్‌ పట్టు వీడలేదు. సొంతంగా ఓ ప్రాజెక్టు పూర్తిచేసి, ఆ డబ్బుతో ‘కయాకో’ పేరుతో సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ పెట్టాడు. చాలామంది డ్రాపవుట్‌ü్సకు ఇంటి నుంచే సమస్యలు మొదలవుతాయి. కన్నవారి కలలకూ సొంత స్వప్నాలకూ మధ్య పెద్ద అగాథమే ఉంటుంది. ఆ సమస్యల్నీ సంక్షోభాల్నీ దాటుకుని ముందుకెళ్తేనే...గెలుపు మలుపు!

వీడితే... వీరతాడే!

థీల్‌ ఫెలోషిప్‌ - డ్రాపవుట్‌ ఎంట్రప్రెన్యూర్స్‌కు అండగా నిలుస్తుంది. అయితే, దరఖాస్తుదారు వయసు ఇరవై రెండేళ్లలోపు ఉండాలి. ఏదైనా ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో చదువుతూ ఉండాలి. ఎంట్రప్రెన్యూర్‌ అవతారం కోసం క్యాంపస్‌ నుంచి బయటికి రావడానికి సిద్ధంగా ఉండాలి. ఇదీ అర్హత. సరే నంటే....లక్ష డాలర్లు ఖాతాలో పడిపోతాయి. ఏటా అంతర్జాతీయంగా పాతికమంది ‘డ్రాపవుట్స్‌’కు అవకాశం దక్కుతుంది. ఎంపికైనవారికి మెంటారింగ్‌, నెట్‌వర్కింగ్‌ సదుపాయాలూ ఉంటాయి. ఓయో రూమ్స్‌ రితేష్‌ అగర్వాల్‌ ఈ ఫెలోషిప్‌ను స్వీకరించాడు. ఇప్పటిదాకా దీన్ని అందుకున్నవారి సంఖ్య దాదాపు వంద. వాళ్లంతా...తమ కొత్త సహచరులతో ఆలోచనల్నీ అనుభవాల్నీ పంచుకోడానికి సిద్ధంగా ఉంటారు. పేపాల్‌ సహ వ్యవస్థా్థపకుడు పీటర్‌ థీల్‌ దీన్ని ఏర్పాటు చేశాడు.

‘మనిషి ఎదుగుదలలో చదువు పాత్ర యాభైశాతం, అనుభవం పాత్ర యాభైశాతం. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా ఆ వికాసం అసంపూర్ణమే’ అన్న అభిప్రాయమూ లేకపోలేదు. క్యాంపస్‌ చదువు ఓ కమ్మని జ్ఞాపకం. జయాపజయాలు ఎలా ఉన్నా...తీరిగ్గా వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆల్బమ్‌లా గతాన్ని గుర్తుచేస్తుంది. ఆమేరకు డ్రాపవుట్స్‌ నష్టపోయినట్టే. ‘నిజమే, క్యాంపస్‌ నుంచి అర్ధంతరంగా వెళ్లిపోతే చాలానే కోల్పోతాం. క్యాంటీన్‌ కబుర్లు ఉండవు. క్లాసులకు బంక్‌కొట్టి సినిమాకెళ్లడాలు ఉండవు, ఫ్రెండ్స్‌తో అర్ధరాత్రి దాకా ముచ్చట్లుండవు. అవన్నీ...మనం సాధించే విజయం ముందు గోరంతే’ అంటాడు ‘యాడ్‌పుష్‌అప్‌’ అంకిత్‌ ఒబెరాయ్‌. ‘ఆ సమయానికి, ఓ వ్యాపారాన్ని ప్రాక్టికల్‌గా నిర్వహించడం ఎలా అన్నది తెలుసుకోవడమే నా లక్ష్యం. కాబట్టే ఎంబీయే మధ్యలోనే ఆపేశాను. అలా అని అందర్నీ నాలానే చేయమని చెప్పను. అంతిమంగా, ఎవరి ఆలోచన వారిదే, ఎవరి నిర్ణయం వాళ్లే తీసుకోవాలి’ అంటాడా యువకుడు.

మధ్యేమార్గం...
స్టార్టప్‌ కోసం క్యాంపస్‌ సన్యాసం స్వీకరిస్తున్న విద్యార్థుల సంఖ్య పెరిగిపోతుండటంతో...చాలా విద్యాసంస్థలు ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ స్వాప్నికులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ‘ఏం ఫర్వాలేదు. వెళ్లండి. మీవంతు ప్రయత్నం చేయండి. అన్నీ అనుకున్నట్టు జరిగితే, మంచిదే! ఎక్కడైనా తేడావస్తే, నిర్మొహమాటంగా వెనక్కి వచ్చేయండి. మళ్లీ ఇక్కడే మీ చదువు కొనసాగించండి’ - అంటున్నాయి. ఖరగ్‌పూర్‌ ఐఐటీ ఈ పథకానికి ‘టెంపరరీ విత్‌డ్రాయల్‌ ప్రోగ్రామ్‌’ అని పేరు పెట్టింది. ఐఐటీ దిల్లీ రెండు సెమిస్టర్ల వరకూ వెసులుబాటు కల్పిస్తోంది. అయితే, మెంటార్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసరు ఈ విషయంలో బలంగా సిఫార్సు చేయాలి. ఎన్‌ఐఐటీ తిరుచ్చి...నాలుగేళ్ల ఇంజినీరింగ్‌ను ఆరేళ్లలో పూర్తిచేసుకునే అవకాశం ఇస్తోంది. రెండేళ్ల సమయాన్ని కలలకు కేటాయించుకోవచ్చు. ‘న్యూస్‌ ఇన్‌ షార్ట్స్‌’ మొబైల్‌ అప్లికేషన్‌ ఆవిష్కర్త దీపిత్‌ కూడా...మొబైల్‌ యాప్స్‌ వూపందుకుంటున్న సమయంలో క్యాంపస్‌ నుంచి బయటికెళ్లినవాడే. ఎంత పెద్ద వార్తనైనా, ఎంత సంక్లిష్టమైన పరిణామాన్ని అయినా...కట్టె-కొట్టె-తెచ్చె అన్నట్టుగా అరవై పదాల్లో వివరిస్తుందా యాప్‌. జనానికి ఆ ప్రయోగం భలేగా నచ్చేసింది. లక్షలమంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వ్యాపారం ఓ దారికి వచ్చేశాక ...మళ్లీ క్యాంపస్‌కు వెళ్లిపోయి కంప్యూటర్స్‌లో మాస్టర్స్‌ మీద దృష్టిసారించాడు దీపిత్‌.

పట్టాకు పట్టా.
వ్యాపారానికి వ్యాపారం.
విన్‌-విన్‌ ఆఫర్‌...అంటే ఇదే.

* * *

ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితా...
మొత్తం వందమందిలో..ముప్ఫైమంది డ్రాపవుట్‌ ఎంట్రప్రెన్యూర్లే!
నిజమే.
అంటే, డెబ్భైమందికి యూనివర్సిటీ డిగ్రీలు ఉన్నట్టేగా!
ఇదీ నిజమే.
రెండింట్లో, ఏ నిజం మనల్ని బలంగా ఆకర్షించిందన్న దానిమీదే...‘డ్రాపవుట్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌’ విషయంలో మన అభిప్రాయం ఆధారపడి ఉంటుంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.