close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నీలోనూ... ఓ బుద్ధుడు!

విజయానికి పొంగిపోతాం. అపజయానికి కుంగిపోతాం. ఆనందం ఆకాశానికెత్తేస్తుంది. విషాదం పాతాళానికి తొక్కేస్తుంది. భావోద్వేగాలు... మనిషిని మరబొమ్మను చేసి ఆడిస్తాయి. ఆ ఉచ్చులోంచి తప్పించుకుంటే...ఎవరైనా బుద్ధుడు కావచ్చు. బుద్ధుడు - ఓ వ్యక్తి పేరు కాదు, హోదా అసలే కాదు. ఓ మానసిక స్థితి (మే 21న బుద్ధజయంతి).
తడి మొహంలో ఎంత తేజస్సు! ఆ వెలుగులు నా మీదా ప్రసరించాలి. అతడి కళ్లలో ఎంత నిశ్చలత్వం! ఆ నిశ్చలత నన్నూ ఆవరించాలి. అతడి నవ్వులో ఎంత స్వచ్ఛత! ఆ దరహాసాన్ని నేనూ ధరించాలి. అతడిలా అనురాగద్వేషాల్నీ, ఆనందవిషాదాల్నీ, జయాపజయాల్నీ, కలిమిలేముల్నీ...సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞత నాకుండాలి.నాలో సమబుద్ధి రావాలి. నేనొక బుద్ధుడు కావాలి.

* * *

ఒక్క ముద్దు. ఒకే ముద్దు. ముద్దుగారే రాహులుడికి ముత్యమంత ముద్దివ్వాలి. ఆ ఒక్క కోరికా తీరితే, నిశ్చింతగా నిష్క్రమించవచ్చు. కానీ, ఎలా? ఆ పసివాడు అమ్మ యశోధర ఆలింగనంలో ఆదమరచి నిద్రపోతున్నాడే.

... బిడ్డను ముద్దాడే అవకాశం కోసం, సిద్ధార్థుడు చాలా సేపట్నుంచీ ఎదురుచూస్తున్నాడు. అంతలోనే యశోధర అటువైపు తిరిగింది. ‘ఇదే మంచి తరుణం. నా చిట్టి తండ్రిని ఎత్తుకుంటాను. మనసారా ముద్దులు కురిపిస్తాను’ అని సంబరపడ్డాడు సిద్ధార్థుడు. ఎందుకో యశోధర నిద్రలోనే ఉలిక్కిపడింది, బిడ్డను దగ్గరికి హత్తుకుంది. పసివాడ్ని ఏ బ్రహ్మరాక్షసో ఎత్తుకుపోతున్నట్టు కలొచ్చిందో ఏమో! సిద్ధార్థుడిలో మళ్లీ నిరాశ. కాసేపటికే ఇంకో అవకాశం. ఉక్కపోతగా అనిపించినట్టుంది, రాహులుడు అమ్మ ఆలింగనం నుంచి దూరంగా జరిగాడు. క్షణమైనా ఆలస్యం చేయకుండా, సిద్ధార్థుడు చేయి చాపాడు. హఠాత్తుగా అమ్మ గుర్తొచ్చినట్టుందా పసివాడికి. గువ్వపిల్ల గూటికి చేరినట్టు, తల్లి గుండెల మధ్య తలదూర్చాడు. ప్చ్‌...మళ్లీ ఎదురుచూపు.

సిద్ధార్థుడు రాహులుడివైపే చూస్తున్నాడు. పెద్దపెద్ద కళ్లూ, ఉంగరాల జుత్తూ...అచ్చంగా తన ప్రతిబింబంలా అనిపిస్తున్నాడు. ఎందుకో సిద్ధార్థుడికి తన బాల్యం గుర్తుకొచ్చింది...అమ్మ మాయాదేవి స్వప్నం, పుట్టబోయే బిడ్డ సర్వసంగ పరిత్యాగి అవుతాడని జోతిష్కులు వూహించడం, తన జననం, అమ్మ మరణం, సవతితల్లి ఒడిలో పెరగడం, నాన్న బంగారు పంజరంలో చిలకను చేయడం, యశోధరతో పెళ్లి, రాహులుడి పుట్టుక, ప్రపంచాన్ని చూడాలన్న తన బలీయమైన ఆకాంక్ష - ఎన్ని మలుపులు, ఎన్ని తలపులు!

బిడ్డ కోరకకోరక ఓ కోరిక కోరాడు. బయటి ప్రపంచాన్ని చూడాలని ముచ్చటపడ్డాడు. ఆ చిన్నపాటి విన్నపాన్నీ కాదంటే చిన్నబుచ్చుకుంటాడనేమో...శాక్యప్రభువు శుద్ధోదనుడు ఘనంగా ఏర్పాట్లు చేశాడు. నగరాన్ని అందంగా అలంకరించాడు. యువరాజు వెళ్లే దార్లో పూలబాట వేయించాడు. కూడళ్లలో బంగారు తోరణాలు కట్టించాడు. అప్సరసలతో స్వాగత నృత్యాలు చేయించాడు. ఇదంతా చూశాక, సిద్ధార్థుడిలో ఐహిక భోగాల పట్ల మమకారం పెరగాలి - ఇదీ శుద్ధోదనుడి తలంపు. ఎందుకైనా మంచిదని, తనకు విశ్వాసపాత్రుడైన చెన్నుడినే సారథిగా పంపాడు. రథం కదిలింది. సిద్ధార్థుడిలో ఆలోచనలూ కదిలాయి. తండ్రి తలచింది ఒకటి. కొడుకు చూసింది మరొకటి.

అనారోగ్యం.
వృద్ధాప్యం.
మృత్యువు.
ఆ సుకుమారుడిని కదిలించాయి. మనిషికి ఎందుకిన్ని దుఃఖాలు? వాటినుంచి బయటపడే దారేలేదా? ఏ మహానుభావుడూ కనిపెట్టలేదా? అదేకనుక తెలిస్తే, ప్రపంచంలో బాధలే ఉండవు. ఆ సత్యాన్వేషణ కోసం సర్వస్వాన్నీ పరిత్యజించాలని నిశ్చయించుకున్నాడు. రాజ్యాన్ని కాదనుకుని, భార్యాపిల్లల్ని వద్దనుకుని...ఇల్లొదిలి వెళ్లాలనుకున్నవాడు, ఎంత సేపని ఎదురుచూస్తాడు. అందులోనూ తెల్లారబోతోంది. బిడ్డను ముద్దాడాలన్న కోరికను చంపుకుని, గడప దాటాడు. రాహులుడు...అంటే బంధనం. మమకారపు సంకెళ్లు తెంచుకున్నాడు సిద్ధార్థుడు. అదే...
మ..హా..భి..ని..ష్క్ర..మ..ణం!సత్యశోధన...
వేలమైళ్లు నడిచాడు. అరణ్యాలు తిరిగాడు. సాధువుల్ని ఆశ్రయించాడు. సిద్ధుల్ని శరణు జొచ్చాడు. ఎక్కడా సమాధానం దొరకలేదు. హేతువుకు నిలబడని సిద్ధాంతాలూ, ఆడంబరాలకు నిలయమైన ఆధ్యాత్మిక కేంద్రాలూ, అహానికి ప్రతిరూపమైన గురువులూ, పాపపుణ్యాల కథలూ, స్వర్గనరకాల గాథలూ...అతడ్ని సంతృప్తిపరచలేదు. ఇది కాదు. ఇంకేదో ఉంది. ఆ పరమసత్యాన్ని తెలుసుకోవాలన్న అంతర్మథనం మొదలైంది. సాధన తీవ్రతరమైంది. ఆ తపస్సు తమస్సును తొలగించింది. బోధివృక్షం నీడలో సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. ఆ సారాన్ని శిష్యులకు బోధించాడు. అది...

ధ..ర్మ..చ..క్ర..ప..రి..వ..ర్త..నం!
మనోజయమే మహాజయం! మనసును గెలిచినవాడే అసలైన విజేత.
మనిషి..
మనసు...
ఈ రెండింటి చుట్టే బుద్ధుడి బోధనలన్నీ తిరుగుతాయి. అప్పటిదాకా అందరూ మనిషిని అజ్ఞాని అనో, అల్పుడనో చిన్నబుచ్చినవారే. తొలిసారిగా బుద్ధుడు మనిషికో గుర్తింపునిచ్చాడు. మానవుడు సకల శక్తిమంతుడనీ, సర్వస్వతంత్రుడనీ కితాబు ఇచ్చాడు. ఆకాశంలోంచో ఇంకో వైపు నుంచో అతడ్ని ఏ దైవశక్తో నడిపించడం లేదనీ, ఆతరహా రిమోట్‌కంట్రోల్‌ వ్యవస్థ సృష్టిలోనే లేదనీ కుండబద్దలు కొట్టాడు. ఎవర్నో గుడ్డిగా నమ్మాల్సిన పన్లేదంటాడు. ‘గురువులైనా, బోధకులైనా మార్గసూచి లాంటివారే. మీ దారేమిటో చెబుతారంతే. మీ ప్రయాణం మీరే చేయాలి. మీ కష్టనష్టాలు మీరే భరించాలి. మీకు తెలియాల్సిన పరమ సత్యాన్ని మీరే అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి’ - ఆ మాటల్లో ఎంత భోళాతనం, ఎంత నిజాయతీ.

జెన్‌ కథలు

బౌద్ధంలో ధ్యానం ప్రధానం. ధ్యానం అన్న సంస్కృత పదం చైనా వెళ్లేసరికి 'ఛాన్‌’గా స్థిరపడింది. జెన్‌ బౌద్ధం క్రమశిక్షణకు విలువ ఇస్తుంది. నిరాడంబరతను గౌరవిస్తుంది. చిన్నచిన్న కథల ద్వారా బుద్ధుడి బోధనల్ని ప్రచారం చేస్తుంది. ఓ మెరుపుతో ఆ చిన్న కథ ముగుస్తుంది. అందులోనే గొప్ప నీతి ఉంటుంది. కొన్ని కథలు అర్థమై కానట్టు ఉంటాయి. ఆ అస్పష్టత కూడా... ఆలోచన ద్వారా మనలో స్పష్టత పెంచడానికే!

గాలి-జెండా

 

జెండా గాల్లో కదులుతోంది. ఆ వైపు చూస్తూ ఇద్దరు బౌద్ధ భిక్షువులు వాదించుకుంటున్నారు. మొదటి భిక్షువు - అక్కడ జెండా కదుల్తున్నట్టుగా ఉంది. నిజానికి కదుల్తోంది గాలే.రెండో భిక్షువు - కాదు కాదు. అక్కడ కదుల్తున్నది జెండాయే.
గాలి, కాదు జెండా. జెండా, కాదు గాలి.ఇద్దరూ, పరిష్కారం కోసం జెన్‌ గురువు దగ్గరికెళ్లారు. ‘ఇద్దరి వాదనా సరికాదు. కదుల్తున్నది జెండా కాదు, గాలీ కాదు. అక్కడ కదుల్తున్నది మనసే’

మనసు గురించి మాట్లాడుతున్నప్పుడు..అతనో చేయితిరిగిన మానసిక నిపుణుడే. ఇంటికప్పు సరిగా లేకపోతే, వాననీళ్లు ఇల్లంతా కారినట్టు...ఆలోచనల్లో లోపం ఉన్నప్పుడే మనసులోకి చెడు ప్రవేశిస్తుందంటాడు. ఉత్తమ ఆలోచనాపరుడిని ఏ కామమూ ఏమీ చేయలేదని చెబుతాడు. దుఃఖమే సకల సమస్యలకూ కారణమని తీర్మానించాడు. అలా అని, దుఃఖానికి దూరంగా ఏ అడవులకో పారిపొమ్మని బుద్ధుడెప్పుడూ చెప్పలేదు. వైద్యుడు రోగిలోని వ్యాధి లక్షణాల్ని కనిపెట్టి మందిచ్చినట్టు...మనలోని దుఃఖాన్ని మనమే గుర్తించి, కారణాల్ని విశ్లేషించుకుని, పరిష్కారాన్ని కనుగొనాలని మాత్రమే సలహా ఇస్తాడు. దుఃఖమంటే...రోజువారీ జీవితంలో మనం అనుభవించే కష్టాలో కన్నీళ్లొ కాదు. యద్‌ అనిచ్చం తమ్‌ దుఃఖం - ఏది అశాశ్వతమో అదే దుఃఖం. సంపదలు అశాశ్వతం, అధికారాలు అశాశ్వతం, యవ్వనం అశాశ్వతం! వాటి కోసం వెంపర్లాటే దుఃఖానికి కారణం. లేకపోతే లేదన్న దుఃఖం, ఉంటే కరిగిపోతుందన్న దుఃఖం. దుఃఖాన్ని నివారించడానికి దార్లున్నాయి. అష్టాంగ మార్గమే అందుకు పరిష్కారం. బుద్ధుడు ప్రతిపాదించిన ఎనిమిది కోణాల వికాస యాత్ర ఇది. సమ్యక దృష్టి...సృష్టిలో ఏదీ శాశ్వతం కాదన్న దృక్కోణాన్ని అలవరచుకోవాలి. సమ్యక సంకల్పం... నైతిక విలువలకు భంగం కలిగించని కోరికల్నే కోరుకోవాలి. సమ్యక వాక్కు..సరైన మాటే మాట్లాడాలి. సమ్యక కర్మ.. మంచి పనులే చేయాలి. సమ్యక జీవనం...ధర్మానికి కట్టుబడిన జీవన విధానాన్నే అనుసరించాలి. సమ్యక ప్రయత్నం...మనసునూ శరీరాన్నీ దారితప్పనీయని ఆలోచనా విధానాన్ని పెంపొందించుకోవాలి. సమ్యక స్మృతి...ఏం చేసినా, ఏం ఆలోచిస్తున్నా పైన చెప్పిన అన్ని సమ్యక మార్గాలనూ దృష్టిలో ఉంచుకోవాలి. సమ్యక సమాధి...జ్ఞానసముపార్జన కోసం ఏకాగ్రతతో ధ్యానం చేయాలి. ఇందులో అర్థం కానిదేం లేదు. మార్మికమైన అంశాల్లేవు. సాధించలేని లక్ష్యాలూ లేవు. గణితశాస్త్ర ఉపాధ్యాయుడు, నల్లబల్ల మీద మెట్లుమెట్లుగా లెక్క చెప్పినట్టు ఉంటుంది బుద్ధుడి పద్ధతి.

పేరు తర్వాత

క్యోటోలోని ఓ ఆశ్రమం. అక్కడ కీచూ అనే బౌద్ధ గురువు ఉంటాడు. ఆయన్ని దర్శించుకోడానికి క్యోటో గవర్నరు వెళ్లాడు. ఆయన పేరు కిటగాకీ. బయట ఉన్న శిష్యుడి చేతికి ‘కిటగాకీ, క్యోటో గవర్నరు’ అని రాసున్న విజిటింగ్‌కార్డు ఇచ్చి పంపాడు.
‘ఎవరితను? నాతో ఏం పని? వెళ్లిపొమ్మని చెప్పండి’ అని ఆదేశించాడు గురువు.
ఈసారి, విజిటింగ్‌కార్డు మీద ‘కిటగాకీ, క్యోటో గవర్నరు’ అని ఉన్న చోట...క్యోటో గవర్నరు అన్న హోదాను కొట్టేసి...మళ్లీ పంపాడు. గురువుగారి నుంచి అనుమతి లభించింది.

జీవితమే సందేశం..
బుద్ధుడు చెప్పింది తక్కువ. ఆచరణాత్మకంగా బోధించిందే ఎక్కువ. ఆయన నడచిన దారి, పలికిన పలుకు, చూపిన పరిష్కారం, ఇచ్చిన జవాబు...ప్రతీదీ ఓ సందేశమే. ఓసారి ఏదో గ్రామం గుండా వెళ్తున్నాడు. ఆ సమయానికి వూళ్లొ పంటల పండగ జరుగుతోంది. భిక్ష కోసం భరద్వాజుడనే రైతు ఇంటి ముందు నిలబడ్డాడు. ‘అడుక్కోడానికి సిగ్గుగా లేదూ! నన్ను చూడు. పొలం దున్ని, విత్తు నాటి, ఆ పంటనే తింటాను. నువ్వూ నాలా కష్టపడొచ్చుగా’ అని భరద్వాజుడు ఎగతాళి చేశాడు. ‘నేనూ వ్యవసాయదారుడినే. విశ్వాసమనే విత్తు నాటతాను. సత్కర్మలనే నీళ్లు చల్లుతాను. వినయం, వివేకం నా నాగలి. మనసే పగ్గం. ధర్మం నా చేతికర్ర. శ్రమ నా ఎద్దు. భ్రమలనే కలుపుమొక్కల్ని తీస్తాను. నిర్వాణమే...నా పంట’ - అన్నాడు బుద్ధుడు. ఆ సమాధానం ఆధునిక జీవితంలోని అనేకానేక సమస్యలకు పరిష్కారం. ముందు నీ మీద నీకు విశ్వాసం ఉండాలి. నిత్యం మంచి పనులు చేయాలి. ఎంత ఎదిగినా వినయం, వివేకం చాలా అవసరం. పగ్గమేసి లాగినట్టు మనసును నియంత్రించగలిగితే తిరుగేలేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ ధర్మాన్ని వీడకూడదన్న హెచ్చరికా ఉంది. ఎన్ని గొప్ప గుణాలున్నా ...శ్రమించే తత్వం లేకపోతే, అవన్నీ బూడిదపాలే. నిర్వాణం...దుఃఖానికి అతీతమైన మహోన్నత స్థితి. ఆ స్థాయికి చేరుకుంటే, నీలోని బుద్ధుడు మేల్కొన్నట్టే. నువ్వు తథాగతుడివి అయినట్టే.

ఒకానొక సందర్భంలో, బుద్ధుడు రెండు రాజ్యాల సరిహద్దు వెంట వెళ్తున్నాడు. అక్కడో చెరువు ఉంది. ఆ గట్టు ఎవరికి చెందాలనే విషయంలో చాలాకాలం నుంచీ వివాదం నడుస్తోంది. ఏదో ఒకటి తేల్చుకోవాలన్న పంతం పెరిగింది. ఇరు దేశాల సేనలూ మోహరించాయి. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ‘మీరిద్దరూ ఈ గట్టుకోసం కొట్లాడుకుంటున్నారు కదూ’ అడిగాడు బుద్ధుడు. ‘అవును’ అని చెప్పారు. ‘గట్టు అంటే మట్టేగా!’ రెట్టించాడు. ‘అంతేగా..’ పెదవి విరిచారు. ‘ఎందుకూ పనికిరాని మట్టికోసం రక్తాన్ని చిందించుకుంటారా? శవాల దిబ్బలు మట్టికుప్ప పాటి విలువ చేయవా?’ బుద్ధుడి ప్రశ్న ఆలోచింపజేసింది. ఇరువర్గాలూ వెనక్కి తగ్గాయి. నిజమే, చాలా సార్లు మనం ఎంతో విలువైనవిగా భావించేవి...ఎందుకూ పనికిరానివై ఉంటాయి. మనం పనికిరానివని నిర్లక్ష్యం చేసేవాటిలో విలువైనవీ ఉంటాయి. వివేకవంతులు ఏ వస్తువునైనా మనిషినైనా...పైపై మెరుగుల్ని బట్టి కాకుండా...సహజగుణాన్ని బట్టే బేరీజువేస్తారు. ఎంత విలువైన పాఠం!జీవన సూత్రాలు...
బుద్ధుడి బోధనల్లో చాలావరకూ సామాన్యుల్ని ఉద్దేశించినవే. నిత్య జీవితంతో ముడిపడినవే. ‘మహామంగళ స్తుతం’లో ఎలాంటి జీవన విధానాన్ని అనుసరించాలో చెప్పాడు. మూర్ఖుల సహవాసం వద్దంటాడు. గౌరవించాల్సిన వ్యక్తులకు గౌరవం ఇవ్వమంటాడు. నివాసానికి చక్కని పరిసరాలు అవసరమని అంటాడు. ఉపాధిని ఎంచుకుంటున్నప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించమంటాడు. నీకు ఇష్టమైన పనినీ, చికాకు కలిగించని వృత్తినీ స్వీకరించమంటాడు. జీవితంలో క్రమశిక్షణ చాలా అవసరమని చెబుతాడు. గౌరవం, వినమ్రత, సంతృప్తి, కృతజ్ఞత...వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా, జీవితానికి అర్థమే లేదంటాడు. చాలా చాలా సాధన తర్వాతో, అపార జీవితానుభవం తర్వాతో ఏదైనా సత్యాన్ని తెలుసుకున్నా...అది అచ్చంగా తెప్పలాంటిదేనంటాడు. ఒడ్డుకు చేరేవరకే దాంతో పని. ఆతర్వాత కూడా నెత్తినపెట్టుకుని నడుస్తానంటే...నీ ఖర్మ! - అని మందలిస్తాడు. వివేకవంతుడు ఆ సత్యాన్ని ఆధారంగా చేసుకుని కొంతదూరం వెళ్తాడు. అక్కడ, అంతకంటే ఉన్నతమైన మరో సత్యాన్ని తెలుసుకుంటాడు. అట్నుంచి ఇంకేదో పరమసత్యం దిశగా ప్రయాణం మొదలుపెడతాడు. ‘మనిషిలో ఆశావాదం ముఖ్యం. నిరాశావాదం కూడదు’ - అని వ్యక్తిత్వ వికాస నిపుణులు పదేపదే చెబుతుంటారు. కానీ బుద్ధుడు. ఆశావాదం వద్దూ, నిరాశావాదమూ వద్దు. వాస్తవికవాదం ఉండాలి - అంటాడు. ప్రపంచాన్ని వాస్తవిక దృక్పథంతో చూసినప్పుడు...గెలుపు ఓటముల్ని కూడా అంతే వాస్తవిక దృష్టితో చూస్తాడు. విజయాన్ని మహాద్భుతమైన విషయంగా ఏం భావించడు. వైఫల్యాన్ని శాపమనో, పాపమనో అసహ్యించుకోడు. జయాపజయాల్ని సమానంగా చూడగలిగితే...ఇక సమస్యేం ఉంది. బుద్ధత్వానికి దగ్గరగా ఉన్నట్టే.

దొంగ పాఠం

దొంగ తన కొడుక్కి చోరవిద్యలో పాఠాలు నేర్పాలనుకున్నాడు. ఒక రోజు తనవెంట దొంగతనానికి తీసుకెళ్లాడు. ఇద్దరూ ఓ ఇంటికెళ్లారు. లోపల ఎవరో పడుకున్నారు. కొక్కేనికి చొక్కా వేలాడుతోంది. చొక్కా జేబులో డబ్బు ఉంది. ‘అలికిడి లేకుండా వెళ్లి తీసుకురా?’ ఆదేశించాడు తండ్రి. కొడుకు ఆ పనిమీదే ఉండగా..తండ్రి చల్లగా జారుకున్నాడు. తలుపుకు గొళ్లెం పెట్టి మరీ ఇంటికెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత కొడుకు వచ్చాడు. ‘ఎంతపని చేశావు నాన్నా! దీపం వెలుగుతున్న గదిలో దొంగతనం చేయమని ఎవరైనా చెబుతారా? సొంతబిడ్డనని కూడా చూడకుండా, గొళ్లెం వేసి మరీ వచ్చావు కదూ? తప్పించుకోవడం మీదే దృష్టిపెట్టాను కాబట్టి, బయటపడ్డాను. లేకపోతేనా..’ చిన్నబుచ్చుకున్నాడు కొడుకు. ‘దొంగతనంలో అదే తొలి పాఠం’ బోధించాడు తండ్రి.

ఏం ఉంది?

‘గురువుగారూ! నా గుప్పెట్లో ఓ పిట్ట ఉంది. అది బతికుందా, చనిపోయిందా?’ - అని అడిగాడు.
‘బతికి ఉంది...’అని చెబితే చంపేద్దామన్న ఆలోచన. ‘చచ్చిపోయింది’ అంటే ‘బతికే ఉందిగా’ - అని నిలదీద్దామని పన్నాగం.
‘నీ ప్రశ్నకు సమాధానం నీ చేతుల్లోనే ఉంది’ - గురూజీ జవాబు. 

మౌనంగానే...

వృద్ధుడు రోజూ వచ్చి బుద్ధుడి విగ్రహానికి నమస్కరించేవాడు. ఆతర్వాత కాసేపు ధ్యానం చేసి వెళ్లిపోయేవాడు. ‘మీరు ఎన్నో ఏళ్ల నుంచీ బుద్ధుడిని ప్రార్థిస్తున్నారు కదా! ఆయన మీతో ఏమైనా చెప్పారా?’ అని అడిగాడో వ్యక్తి.
‘బుద్ధుడు ఎప్పుడూ ఏమీ చెప్పడు. అన్నీ వింటాడు’ - జవాబిచ్చాడు వృద్ధుడు.
‘అయితే, మీరు బుద్ధుడితో ఏం చెబుతుంటారు?’
‘నేను ఎప్పుడూ ఏమీ చెప్పను. అన్నీ వింటాను’- అన్నాడు వృద్ధుడు.

జీవితంలో తిండి పాత్ర ఎంత, బట్టల విలువ ఏమిటి? అన్న ప్రశ్నకూ బుద్ధుడు జవాబు చెప్పాడు. ఆహారాన్ని రుచి కోసమో, కాలక్షేపం కోసమో, విలాసం కోసమో తీసుకోకూడదని హెచ్చరిస్తాడు. ధార్మిక జీవితాన్ని గడపడానికి అవసరమైన శక్తిని ఇచ్చే పదార్థంగానే భావించాలంటాడు. వస్త్రాల విషయంలోనూ ఆడంబరాల్ని నిరసించాడు. తథాగతుడు మనుషుల్ని తప్పుపట్టడు. దేనికైనా పరిస్థితులే ప్రధాన కారణమని అంటాడు. సమాజంలో అశాంతికి పేదరికమే మూలమంటాడు. ధర్మమార్గంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని గృహస్తులకు బోధించాడు. తాగుడు, చెడు సాంగత్యం, జూదం, సోమరితనం...దారిద్య్రానికి కారణమని స్పష్టంచేశాడు.

స్నేహితుల గురించి కూడా గౌతముడు సూచనలు చేశాడు. ఎలాంటి దురలవాట్లూ లేనివారినే మిత్రులుగా ఎంచుకోమన్నాడు. సహయాత్రికుడిగా తన కంటే ఉత్తముడో, తనతో సమానమైన వ్యక్తో దొరికినప్పుడే కలసి ప్రయాణించమంటాడు. లేకపోతే, ఒంటరిగానే వెళ్లమంటాడు.

బుద్ధుడు హేతువు ముందు నిలబడని ఏ ఆచారాన్నీ ఆమోదించలేదు. ఫలానా తీర్థంలో మునిగితే పుణ్యం వస్తుందన్న నమ్మకాన్నీ నిరసించాడు. ఎవరో బాహుకానదిలో స్నానంచేస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని చెప్పినప్పుడు...‘అబద్ధాలు ఆడవద్దు. జీవహింస చేయవద్దు. దొంగతనాల జోలికే వెళ్లవద్దు. దురాశను దరిచేరనీయవద్దు. అప్పుడు...నీ ఇంటి ముందున్న బావే పవిత్ర నదీజలంతో సమానం’ అని జవాబిచ్చాడు. పాపం, పుణ్యం - అన్న మాటల్ని గౌతముడు ఆమోదించిన దాఖలాల్లేవు. ఆ స్థానంలో అజ్ఞానం, జ్ఞానం అన్న పదాల్ని విరివిగా వాడాడు. మనిషి అజ్ఞానంతోనే తప్పులు చేస్తాడు. అజ్ఞానంతోనే దారితప్పుతాడు. అట్నుంచి జ్ఞానం దిశగా ప్రయాణమే నిర్వాణయాత్ర. అదే బుద్ధత్వం. బుద్ధుడు ప్రేమకు అపార ప్రాధాన్యం ఇచ్చాడు. ‘ఈ లోకంలో పగతో పగ ఎప్పుడూ చల్లారదు. మైత్రితోనే పగ సమసిపోతుంది. క్రోధాన్ని ప్రేమతో, చెడును మంచితో జయించు. లోభిని దానంతో, అసత్యవాదిని సత్యంతో జయించు’ అని హితవుపలికాడు. హింసతో, అశాంతితో కొట్టుమిట్టాడుతున్న వర్తమాన సమాజం కళ్లకద్దుకోవాల్సిన మహాసత్యమిది.క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలోనే...వేల సంవత్సరాలకు సరిపడా ఆధ్యాత్మిక సంపదను సిద్ధంచేశాడు శాక్యముని. నాలుగున్నర దశాబ్దాల పాటూ తన ఆలోచనల్ని విశ్వమంతా విస్తరించాడు. రక్తపిపాసులైన పాలకుల్ని శాంతికాముకుల్ని చేశాడు. బలులతో క్రతువులతో విసిగిపోయిన ప్రజల్లో ప్రేమనూ సహనగుణాన్నీ పెంపొందించాడు. ఎనభై ఏళ్ల వయసులో..వందలమంది భిక్షువుల సమక్షంలో....కుసినార గ్రామంలో తుదిశ్వాస విడిచాడు బుద్ధుడు. అదే

‘‘ ర్హులకు చేసే దానం...సారవంతమైన నేలలో విత్తనాలు చల్లడం లాంటిది. దానివల్ల సమృద్ధిగా ఫలితాలు వస్తాయి. కామమోహ పీడితులకు చేసే దానం...చవిటి నేలలో విత్తనం వేసినట్టే’’


‘‘స్వార్థపరుల్నీ మొండివాళ్లనీ బడాయి మనుషుల్నీ తగాదా స్వభావం ఉన్నవాళ్లనీ ... దూరం చేసుకోవాల్సి వచ్చినప్పుడు బాధపడాల్సిన అవసరమే లేదు. అలాంటి పరిస్థితే వస్తే ఒంటరిగా బతకడమే మేలు’’

‘‘అవసరమైతేనే మాట్లాడు. లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకూ సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి. నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తారట్లాడతాయి’’

‘‘సత్యమే సర్వోన్నతమైంది. నిర్భయంగా సత్యాన్ని పలుకు. అయితే ఆ సత్యాన్ని ప్రేమగా, నేర్పుగా చెప్పాలి. మర్యాదగా, హుందాగా మాట్లాడాలి’’

‘‘నిజాయతీ లేకపోతే కలిగే నష్టాలు ఇవీ... సోమరితనం పెరిగి దరిద్రుడు అవుతాడు. దరిద్రం వల్ల అప్రతిష్ఠపాలు అవుతాడు. అప్రతిష్ఠ కారణంగా ఆత్మవిశ్వాసం లోపించి స్థిరత్వాన్ని కోల్పోతాడు. వీటన్నిటి వల్లా నిత్యం ఆందోళనతో బతుకుతాడు.’’

‘‘జీవితం అంటేనే పోరాటం. అలాంటప్పుడు, స్వార్థం కోసమో అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేస్తావు? ఆ పోరాడేదేదో ధర్మం కోసం పోరాడు, జనం కోసం పోరాడు.’’

‘‘తేనెటీగ పువ్వును కానీ, రంగును కానీ, పరిమళాన్ని కానీ పాడు చేయకుండా మకరందాన్ని తీసుకున్నట్టు...బుద్ధిమంతుడు సమాజానికి ఎలాంటి హానీ చేయకుండా తన బతుకు తాను బతుకుతాడు’’

మ..హా..ప..రి..ని..ర్వా..ణం!
గౌతముడి అంతిమ సందేశం ...
‘జనం గుడ్డులోని పిల్లల్లా ఇరుకిరుకుగా బతుకుతున్న సమయంలో, నేను అజ్ఞానమనే పెంకును బద్దలు చేశాను. సర్వోన్నతమైన బుద్ధ సత్యాన్ని ప్రపంచానికి చాటాను. నాతో సహా సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు. ధర్మం మాత్రమే చిరస్థాయిగా నిలుస్తుంది. మీరంతా ఆ ధర్మ మార్గంలోనే నడవండి’

* * *

ప్రపంచంలో అందరికంటే ఆనందంగా ఉన్న వ్యక్తి ఎవరు? అన్న ప్రశ్న తలెత్తింది. విశ్వకుబేరుల జాబితాను పరిశీలించారు. వాళ్లేం అనుకున్నంత ఆనందంగా లేరు. అత్యంత ప్రభావశీల వ్యక్తులుగా పేరు తెచ్చుకున్నవారి జీవితాల్ని అధ్యయనం చేశారు. వాళ్లకీ ఏవో చింతలూ చికాకులూ. మేధావుల మీద దృష్టిసారించారు, సెలెబ్రిటీల్ని పలకరించారు. అన్వేషణ హిమాలయాల దాకా వెళ్లింది. ఒంటిమీద కాషాయంతో, చేతిలో భిక్షాపాత్రతో ధ్యానముద్రలో ఉన్న ఓ బౌద్ధ సన్యాసిలో ఆ ఆనంద స్వరూపుడు కనిపించాడు. అతని పేరు మాథ్యూ రికార్డ్‌. న్యూరాలజిస్టులూ, సైకాలజిస్టులతో కూడిన బృందం ఆయన మీద అనేక పరిశోధనలు చేసింది. ఆధునిక వైద్య పరికరాలతో మెదడు పనితీరును విశ్లేషించింది. సర్వకాల సర్వావస్థల్లోనూ అతడిలో ఆనందం ఉరకలేస్తూ ఉంటుందని తేలింది. ‘మీ ఆనందానికి కారణం ఏమిటి? మీ మనసులో ఏదైనా మహత్తు ఉందా?’ - అని ప్రశ్నించారు.
మాథ్యూ సమాధానం... ‘నాలో బుద్ధుడున్నాడు!’

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.