close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
హ్యాపీ జబర్దస్త్‌ డే

హ్యాపీ జబర్దస్త్‌ డే
ఖతర్నాక్‌ హాస్య దినోత్సవం!

హాయిగా నవ్వుకుని ఎంతకాలమైందీ, పడీపడీ నవ్వి ఎన్నేళ్లయిందీ? - బతుకు పరుగులో పడో, జీవితంలోని ఒత్తిళ్లతో చిత్తయిపోయో నవ్వడం మరచిపోతున్న జనానికి ఈటీవీ ‘జబర్దస్త్‌’ - పకపకల పాఠశాల. ఆ ఖతర్నాక్‌ కామెడీ షో...నవ్వంటే చచ్చేంత లవ్వు పుట్టించింది. ఏడాదికొకసారి, మే ఒకటో తేదీన వచ్చే హాస్యదినోత్సవం, తెలుగువారికి మాత్రం వారోత్సవం, గురువారోత్సవం!

‘డాక్టరుగారూ! గాభరా గాభరాగా ఉంటోంది. అన్నం సయించదు. నిద్రపట్టదు. తొక్కలో జీవితం, ఎప్పుడూ ఇంత దరిద్రంగా లేద్సార్‌’ - గోడెళ్లబోసుకున్నాడు రోగి. డాక్టరు రక్తపోటు పరీక్షించాడు. బరువు చూశాడు. అన్నీ అయ్యాక...మందుచీటీ రాసిచ్చాడు. రోగి కాగితం పట్టుకుని మెడికల్‌ షాపులన్నీ తిరిగాడు. చీటీ అటూ ఇటూ తిప్పి తిరిగిచ్చేవారే కానీ...ఉందని చెప్పరూ లేదనీ అనరు. అప్పటికే చీకటి పడిపోయింది. ‘బాబ్బాబూ! పుణ్యం ఉంటుంది. ఈ మందెక్కడ దొరుకుతుందో చెప్పు. వూరంతా తిరిగినా ఉపయోగం లేకుండా పోయింది’ - మళ్లీ మొదటి దుకాణానికే వెళ్లి బతిమాలాడు.‘ఓనా పులిహోరా! ముందు, ఈ మందు చీటీలో ఏముందో చదువు. నీకే అర్థమౌతుంది. ఇవాళ గురువారం. సరిగ్గా తొమ్మిదీ ఇరవై అయ్యింది. తిన్నగా ఇంటికెళ్లిపో. పది నిమిషాలకు మించి ఒక్క సెకెను ఎక్కువైనా డాక్టరుగారిచ్చిన డోసు మిస్సయి పోతుంది’ హెచ్చరించాడు మెడికల్‌ షాపాయన. డాక్టరు రాసింది మందోమాకో కాదు.
ఆర్‌ఎక్స్‌ -
ఈటీవీలో...
జబర్దస్త్‌ ప్రతి గురువారం, రాత్రి తొమ్మిదిన్నరకి.

* * *

హాస్యం బతకాలంటే, హాస్యగాళ్లు బతకాలి. కాదుకాదు, సమాజమే బతికించుకోవాలి. అయినా, వాళ్లేం శ్రీనాథ కవిసార్వభౌములా? హంసతూలికా తల్పాలూ, కస్తూరి తాంబూలాలూ డిమాండ్‌ చేయడానికి. ఒట్టి అల్పసంతోషులు! కడుపునిండితే చాలు కడుపుబ్బా నవ్వించేస్తారు. జోకుల మీద జోకులు పేలుస్తారు. పంచుల మీద పంచులు పంచుతారు. మంచి హాస్యం మటన్‌ బిర్యానీ వాసన లాంటిది. పరుగుపరుగున పబ్లిక్‌లోకెళ్లిపోతుంది. ఇంకేముంది, టన్నులకొద్దీ... నికర జాతీయ హాస్యోత్పత్తి!

ఇంట్లో గొడవలుండవు. ఆఫీసులో రాజకీయాలుండవు. కాలేజీ క్యాంపస్‌లో ఒత్తిడి ఉండదు. ఎంత ఆరోగ్యం! ఎంత ఆహ్లాదం! ఎంత ఆనందం! దేశం ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలకు హాస్యమే పరిష్కారం! మనకేమో నవ్వంటే చులకన. నవ్వాలంటే నామోషీ. పోషించేవాళ్లు లేకా ఆదరించేవాళ్లు కానరాకా...హాస్యం బిక్కుబిక్కుమంటోంది.సరిగ్గా అలాంటి పరిస్థితుల్లో...ఏ తెలుగు సినిమాలోనో అయితేనా, హీరో గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తాడు. ‘ఆముదం తాగిన మొహాలు అదేపనిగా పళ్లికిలిస్తున్నాయి. ఏడుపుగొట్టు మనుషులు ఎడాపెడా నవ్వేస్తున్నారు. ఎవర్ని, నేనెవర్ని?’ అని ఆవేశంగా ప్రశ్నిస్తాడు. డాల్బీ సౌండ్‌ సిస్టమ్‌లో సమాధానం ... ‘నువ్వు జబర్దస్త్‌వి...హాస్యానికే చక్కిలిగిలిపెట్టే ఖతర్నాక్‌ కామెడీషోవి’

* * *

ఆ సమయానికి...ఏ ఛానల్‌ తిప్పినా ఏతమేసి తోడినట్టు...ఏడుపులూ పెడబొబ్బల సీరియళ్లే! ఆ గుండె కోతకు మలాము పూత పూయాలనుకుంది ఈటీవీ. బాధ్యత మల్లెమాల ప్రొడక్షన్స్‌ అధినేత శ్యాంప్రసాదరెడ్డికి అప్పగించింది. ఏదో కార్యక్రమంలో...తూగుతూ వాగుతూ తాగుబోతు రమేష్‌ చేసిన స్కిట్టు చూశారాయన. నిడివి రెండు నిమిషాలే అయినా, నాన్‌స్టాప్‌గా నవ్వించింది. అంతే, ‘స్కిట్టు ఫార్ములా అయితే సూపర్‌హిట్టు’ అన్న నిర్ణయానికొచ్చారు. ఆయన కూతురు దీప్తిరెడ్డి కూడా హాస్యాభిమానే. ‘ఎ డే వితవుట్‌ లాఫ్టర్‌...ఈజ్‌ ఎ డే వేస్టెడ్‌’... ఆమెకిష్టమైన కొటేషన్‌. నవ్వించడం మహా సీరియస్‌ వ్యాపారమని దీప్తికి తెలుసు. అయినా సరే, సంతోషంగా ముందుకొచ్చారు. అండగా ‘ఈనాడు టెలివిజన్‌’ ఉందన్న మొండిధైర్యం! అప్పటికే ఈటీవీ ‘పోపుల పెట్టె’ పేరుతో జంధ్యాలతో హాస్యపు తిరగమోత ఇప్పించింది. ఈసారి, ఇంకాస్త ఘనంగా ఇంకొన్ని వంటకాలతో నవ్వుల భోజనం వడ్డించాలని నిర్ణయించింది.
ఆ కార్యక్రమానికి ఏ పేరు పెట్టాలి? అన్నది సుదీర్ఘమైన చర్చ.‘కిరాక్‌’ - ఎవరో సలహా ఇచ్చారు.
ఎవరికీ నచ్చలేదు.
‘కెవ్వు కేక’ - మరెవరో సూచించారు.
కొందరికే నచ్చింది.
ఏవేవో పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి - ప్చ్‌, ఫర్వాలేదు, ఓ మోస్తరు, అబ్బే తేలిపోయింది...వగైరా వగైరా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఎంతకీ టైటిలు ఖరారు కావడం లేదు. అంతలోనే..వేడివేడి చాయ్‌ వచ్చింది.
కప్పులోని చాయ్‌ సిప్పుచేస్తూ ....
‘జబర్దస్త్‌’ ... అరిచారెవరో.
‘ఖతర్నాక్‌ కామెడీ షో’.. ట్యాగ్‌లైన్‌ అందించారు మరెవరో. చప్పట్లే చప్పట్లు!

పౌరాణిక సినిమాల్లో లాగా డుమ్‌... డుమ్‌...డుమ్‌.. అంటూ ఆకాశంలోంచి దేవతలు డ్రమ్స్‌ వాయించలేదు కానీ, మరో రౌండు చాయ్‌ కోసం కప్పులు గణగణమన్నాయి. ‘ఏడిపించడం సులభం. ఒక అత్త, ఒక కోడలు, ఒక గ్లిజరిన్‌ సీసా - ఈ మాత్రం సరంజామా సరిపోతుంది. నవ్వించడమే కష్టం. మళ్లీ మళ్లీ నవ్వించడం ఇంకా ఇంకా కష్టం. బాగా ఆలోచించుకోండి’ - ఓ సందేహాల్రావు గొణిగాడు. ‘కష్టమే. నువ్వు టీమ్‌లో ఉంటే...’ ఎట్నుంచో ఠక్కున జవాబు. పంచ్‌ పేలింది. అంతా నవ్వారు.

ఓ హాస్య కార్యక్రమానికి ఇంతకు మించిన శుభశకునం ఏం ఉంటుంది? అప్పటి నుంచి ఇప్పటిదాకా...నవ్వులే నవ్వులు! చేసిన స్కిట్టు చేయకుండా, వేసిన జోకు వేయకుండా, పడిన పంచు పడకుండా...దాదాపు నూట డెబ్భై ఎపిసోడ్లు! హాస్యానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారింది జబర్దస్త్‌. ఈ మూడేళ్లలో...ఎన్ని గుండెలకు కొత్త సత్తువ వచ్చిందో, ఎంతమంది ఒంట్లో హైబీపీ నార్మలైపోయిందో, ఎన్ని ఇళ్లలో పెడమొహం పెళ్లాంమొగుళ్లు పక్కపక్కన కూర్చుని పకపకా నవ్వుకుంటున్నారో, ఎన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీల ఉద్యోగులు డెడ్‌లైన్ల ఒత్తిడి మధ్య...కాస్తంత ‘నవ్వుల బ్రేక్‌’ తీసుకుంటున్నారో, ఎన్ని శరీరాల్లో రోగనిరోధక శక్తి భారీగా పెరిగిందో, మొత్తంగా ఎన్ని కోట్లమంది తెలుగువారిలో ఫీల్‌గుడ్‌ హార్మోను ‘ఎండార్ఫిన్‌’ డ్రమ్ములకొద్దీ వూరిందో - ఎవరు చెబుతారు? జబర్దస్త్‌కు రికార్డులు సృష్టించడమే తెలుసు. రాసిపెట్టుకోవడం, దాచి పెట్టుకోవడం తెలియదు.

* * *

నవ్వించేవాడంటే ఎప్పుడూ చులకనే. జోకరు వెధవన్న బేవార్సు బిరుదొకటి.
‘ఎవడ్రా! ఆ మాటన్నది. మీ చెవుల్లో నాలుగు జోకులు చెప్పా, మీ గుండెల్లో నాలుగు పంచులు పేల్చా. మీ పొట్ట చెక్కలైపోనూ...’ అంటూ జబర్దస్త్‌ హాస్యద్వేషుల నోళ్లు మూయించింది. చదువులతో పన్లేదు. అనుభవం అక్కర్లేదు. సినిమాల్లో ఇరగదీసి ఉండాలన్న నిబంధన లేదు. నవ్వించడం తెలిస్తే చాలని ప్రకటించింది. అయినా, అవకాశం ఇచ్చేవాళ్లు లేక...కార్యక్రమాల్లో కరివేపాకుల్లా మిగిలిపోయారు కానీ, తెలుగుగడ్డ మీద కమెడియన్లకు కొదవేం ఉంది. ప్రోత్సహిస్తే ప్రతి పోరగాడూ బ్రహ్మానందమే.‘జబర్దస్త్‌’ కోసం ఆర్టిస్టులు కావాలట! - ఒకరి నుంచి ఒకరికి సమాచారం పాకిపోయింది. అదృష్టాన్ని పరీక్షించుకోడానికి నవ్వుబాయ్స్‌ అంతా కౌబాయ్స్‌లా ఆశల గుర్రమెక్కేసి హైద్రాబాద్‌లో దిగిపోయారు. వేణు, ధన్‌రాజ్‌, చంద్ర, రాఘవ...వగైరా వగైరా, అప్పటికే సినిమా ఫంక్షన్లలో, చిన్నాచితకా పార్టీల్లో స్కిట్లు వేసుకుంటూ బతుకు సర్కస్‌ ఫీట్లు చేస్తున్నారు. మిగిలినవాళ్లంతా ఇండస్ట్రీకి కొత్త. వచ్చినవాళ్లను వచ్చినట్టు వడపోయగా...ఆఖరికి ఆరేడు టీమ్స్‌ తయారయ్యాయి. అన్నపూర్ణ స్టూడియోస్‌లో సెట్టు రెడీ అయిపోయింది. షూటింగ్‌ మొదలైంది. పెద్దలంతా వచ్చారు. చుట్టూ గంభీర వాతావరణం. విరేచనాలు పట్టుకున్న రేడియోజాకీ పాత్రలో చంటి స్టేజీ మీదికొచ్చాడు. ఫలానా పాట వినిపించమనో, ఫలానా కబుర్లు చెప్పమనో ప్రేక్షకుల నుంచి ఒకటే ఫోన్లు. మరో వైపు...చంటి బాధ చంటిది. ఏ క్షణం కూష్మాండం బద్దలైపోతుందో అన్నంత టెన్షన్‌. ఓ లైట్‌బాయ్‌ నోటికి చేయి అడ్డం పెట్టుకుని నవ్వాపుకునే ప్రయత్నం చేశాడు. సాధ్యం కాలేదు. ఉక్కిరిబిక్కిరైపోతూ నేలమీదే దొర్లేశాడు. ఓ అసిస్టెంట్‌ డైరెక్టరు ఏదో పనున్నట్టు బయటికెళ్లి పడీపడీ నవ్వేశాడు. డైరెక్టరూ, కెమెరామెన్లూ, సెక్యూరిటీ గార్డులూ...హోదాల్లేవు, ప్రొటోకాల్స్‌ లేవు. హాస్యం ముందు అంతా సమానమే. షూటింగ్‌ స్పాట్‌ లాఫ్టర్స్‌క్లబ్‌ అయిపోయింది.

* * *

జబర్దస్త్‌ ...నవ్వును నవరత్నఖచిత సింహాసనం మీద కూర్చోబెట్టింది. జోకులేసేవాడికి ఢోకాలేదని తేల్చిచెప్పింది. కామెడీకి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమంత గ్లామర్‌ తీసుకొచ్చింది. ఏదో ఓరోజు విదేశాలకెళ్తామని నవ్వులాటక్కూడా అనుకోనివాళ్లు ...కేవలం నవ్వించడానికే ప్రపంచమంతా చుట్టొస్తున్నారు. అమెరికాలోని ఓ వేదిక మీద ‘రాకింగ్‌ రాకేశ్‌...రాకింగ్‌ రాకేశ్‌’ అంటూ వందలమంది స్వాగతం పలుకుతుంటే, రాకేశ్‌ కళ్లెంబడి నీళ్లొచ్చేశాయి. ఎక్కడి కాలిఫోర్నియా, ఏమౌతారా ప్రవాసులంతా! హాస్యానుబంధమది, జబర్దస్త్‌ బంధుత్వమది. ‘జబర్దస్త్‌ ...దేవుడు నాకిచ్చిన బంపరాఫర్‌’ అని సగర్వంగా చెబుతాడు ‘రాకింగ్‌’ రాకేశ్‌! జబర్దస్త్‌ బృందంలోని ప్రతి కళాకారుడికీ ఇలాంటి అనుభవాలున్నాయి.‘కిరాక్‌’ రామ్‌ప్రసాద్‌ ఉరఫ్‌ ఆర్పీ వెండితెర డైరెక్టరుగా వెలిగిపోదామని నెల్లూరు నుంచి వచ్చాడు. చాలామంది డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడు. అంతరాత్మను చంపుకుని ఘోస్టు రైటరుగానూ వర్క్‌ చేశాడు. కలలు బ్రేకైపోతున్న సమయంలో జబర్దస్త్‌ బ్రేకిచ్చింది. జబర్దస్త్‌ టీమ్‌లీడర్‌ హోదాలో...మొదటిసారి విమానం ఎక్కినప్పుడైతే నిజంగానే భయమేసిందట! విమానం కూలిపోతుందనో, హైజాక్‌ అవుతుందనో కాదు. పక్కనంతా సూటూబూటూ పెద్దమనుషులు. తనని వాళ్ల మధ్య కూర్చోనిస్తారా? అని. ఎందుకొచ్చిన గొడవ, దిగిపోదామనుకున్నాడు. అంతలోనే, పక్కసీటు పెద్దాయన ‘నువ్వు ఆర్పీ కదూ...కిరాక్‌ ఆర్పీ...జబర్దస్త్‌ ఆర్పీ’ అంటూ చేయి కలిపాడు. అప్పుడు కానీ, మనవాడికి కాన్ఫిడెన్స్‌ రాలేదు. దీవార్‌ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌లా ‘మేరే పాస్‌ జబర్దస్త్‌ హై’ అని మనసులోనే డైలాగ్‌ చెప్పుకున్నాడు.

భలే చాన్సులే...

బర్దస్త్‌ వెండితెరకు బంగారు బాట! ఒకప్పుడు, ఫొటోలు పట్టుకుని ప్రొడ్యూసర్ల ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఫలానా యాక్టింగ్‌ స్కూల్లో కోర్సు చేశామనో, ఫలానా సినిమాలో కనిపించామనో చెప్పుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు, ‘జై జబర్దస్త్‌’ అంటే చాలు. ఛాన్సు వచ్చేసినట్టే. నిజానికి, ఆ మాట చెప్పాల్సిన అవసరమూ లేదు. మనిషిని చూడగానే గుర్తుపట్టేస్తారు. ఆ ఎపిసోడ్‌ సూపర్‌, ఈ పంచు అదిరింది...అంటూ ఆకాశానికెత్తేస్తారు. అందులో కొంత స్వార్థమూ ఉంది. జబర్దస్త్‌ హాస్య యూనివర్సిటీ నుంచి వచ్చినవాళ్లు అట్టే టేకులు తీసుకోరు. ఇట్టే సీను ఓకే చేసుకుంటారు. ఒకట్రెండు జబర్దస్త్‌ మొహాలుంటే, మిగతా రసాలు మొరాయించినా హాస్యం గట్టెక్కిస్తుంది. మినిమమ్‌ గ్యారెంటీ! అవసరమైనంత హాస్యం లేకపోతే...బొమ్మయినా, బతుకైనా - అట్టర్‌ఫ్లాపే! ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే...సినిమా హండ్రెడ్‌ డేస్‌, జీవితం హండ్రెడ్‌ ఇయర్స్‌!

‘అదిరే’ అభిని చూస్తే హార్డ్‌కోర్‌ హాస్యనటుడనే అనుకుంటారంతా. ఆ మాట నిజమే కానీ, తనో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కూడా. అయినా అనుమానమొస్తే, అన్నపూర్ణా స్టూడియోస్‌కు వెళ్లి చూడొచ్చు. షూటింగ్‌లో ఏ మాత్రం ఖాళీ దొరికినా, లాప్‌టాప్‌ ముందేసుకుని కూర్చుంటాడు. ‘వర్క్‌ ఫ్రమ్‌ సెట్స్‌’ బాగా వర్కవుట్‌ అవుతోంది. ‘హాయిగా ఉద్యోగం చేసుకోకుండా ఈ స్కిట్టుల గొడవేంట్రా’ అని నాన్నగారు రోజూ తిట్టేవారట. ఓసారి ఏదో ఫంక్షన్‌లో ‘నలుగుర్నీ నవ్వించాలంటే ఎంత అదృష్టం ఉండాలి! ఎంత మంచి కొడుకును కన్నావ్‌!’ అంటూ బంధువులంతా ఆకాశానికి ఎత్తేసరికి అభిప్రాయం మార్చుకున్నారు పితాశ్రీ. పుత్రుని కనుగొని ‘జబర్దస్త్‌’ అని పొగడగ...పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతీ!‘రచ్చ’రవి జీవితం ఒకప్పుడు రచ్చబండే! మార్కెటింగ్‌ చేశాడు. వాషింగ్‌ మెషీన్ల మెకానిక్‌గా పనిచేశాడు. అసిస్టెంట్‌ డైరెక్టరు అవతారం ఎత్తాడు. ఏం చేస్తున్నా, ఎన్ని కష్టాలున్నా నవ్వడం మరచిపోలేదు. నవ్వించడం మానలేదు. ఆ అర్హతే జబర్దస్త్‌లో అవకాశమిచ్చింది. ఎవరు ఏ మంచి కార్యక్రమానికి పిల్చినా కాదనడు తను. ఓసారి మానసిక వికలాంగుల పాఠశాలకు వెళ్లాడు. వయసు పెరిగినా, మనసు ఎదగని ఆ పిల్లలు కూడా రవిని గుర్తుపట్టారు. నోట్లోంచి చొంగకారుతున్నా పట్టించుకోకుండా... సైగలతో జబర్దస్త్‌ ఎపిసోడ్లు గుర్తు చేసుకున్నారు. ఆత్మీయుల్లా చుట్టుముట్టేశారు. ముద్దులు కురిపించారు. ‘నా ఒంటికి అంటుతున్న ఎంగిలి...ఆ క్షణానికి అత్తరు పన్నీరులా అనిపించింది’ - ఉద్వేగంగా చెబుతాడు రవి.

అప్పటిదాకా సినిమాల్లో చిన్నాచితకా వేషాలు వేస్తున్న ‘రాకెట్‌’ రాఘవ జీవితమైతే జబర్దస్త్‌తో శ్రీహరికోట రాకెట్టే! ఓసారి రాఘవ ఎవర్నో పలకరించడానికి రెయిన్‌బో పిల్లల ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడో పసివాడు లాప్‌టాప్‌ చూస్తూ హాయిగా నవ్వేసుకుంటున్నాడు. ‘ఏదో కార్టూన్‌ నెట్‌వర్క్‌ అయి ఉంటుంది’ అనుకున్నాడు. వెళ్లి చూస్తే జబర్దస్త్‌! ‘మా బాబుకు క్యాన్సర్‌. బాగా ముదిరింది. ఎన్నాళ్లు బతుకుతాడో చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు. బతికినంత కాలం నవ్వుతూ బతకాలని మా కోరిక. ఏ మందులూ ఇవ్వని ఉపశమనం జబర్దస్త్‌ ఇస్తోంది’ అని చెప్పారు తల్లిదండ్రులు. ఉందోలేదో తెలియని అమృతం కంటే, జబర్దస్త్‌లో పొంగిపొర్లే హాస్యామృతమే విలువైంది!‘కొత్త ఇల్లూ, కొత్త కారూ, రోజుకో కొత్త గెటప్పూ, లైఫంటే నీదేరా’ అని ఆకాశానికెత్తేస్తుంటారు ‘గెటప్‌ శ్రీను’ ఫ్రెండ్సంతా. ఆ మాట అక్షరాలా నిజం. ఆ గెటప్పుల కోసం శీను మామూలుగా కష్టపడడు. ఖాళీ దొరికితే చాలు మనుషుల్నీ మాటల్నీ హావభావాల్నీ అర్థం చేసుకోడానికి బస్టాండ్ల వెంబడీ రైల్వేస్టేషన్ల వెంబడీ తిరుగుతుంటాడు. అక్కడ కూడా ‘రేయ్‌...జబర్దస్త్‌ శీను’ అంటూ వెంటబడే అభిమానులూ ఉంటారు. అదీ పవర్‌ ఆఫ్‌ హాస్యం, పవర్‌ ఆఫ్‌ జబర్దస్త్‌.

రామ్‌ప్రసాద్‌..పంచులేయడంలో ఫస్టు! ‘హలో ఆర్పీ! నీ వాయిస్‌ ఎందుకో బ్రేక్‌ అవుతోంది...’ అని ఎవరైనా అన్నారనుకోండి, ‘బ్రేకైతే, ఫెవికాల్‌తో అతికించుకో. మళ్లీ చేస్తాలే, పెట్టెయ్‌’ అని అప్పటికప్పుడు ఓ పంచు ఇచ్చేస్తాడు. కాబట్టే, జబర్దస్త్‌ అభిమానుల్లో ‘ఆటోపంచ్‌’ రామ్‌ప్రసాద్‌గా పాపులర్‌ అయ్యాడు. ఆమధ్య ప్రసాద్‌, వైజాగ్‌లో చిన్నప్పుడు చదువుకున్న విజ్ఞానభారతి స్కూల్‌కి వెళ్లాడు. చూడగానే ‘హాయ్‌! జబర్దస్త్‌ రామ్‌ప్రసాద్‌’ అని పలకరించింది చిన్నప్పటి టీచరు. ‘మేడమ్‌! నేను ఫలానా సంవత్సరం మీదగ్గర చదువుకున్నా, ఫలానా బెంచీలో కూర్చునేవాణ్ని...’ ఇలా చాలా చాలా ఆనవాళ్లు చెప్పినా ఆమె గుర్తుపట్టలేకపోయింది. ‘అదంతా ఎందుకులే కానీ, నాకు నువ్వు జబర్దస్త్‌ రామ్‌ప్రసాద్‌గానే ఇష్టం. అలానే గుర్తుపెట్టుకుంటా’ అని చెప్పేసింది టీచరమ్మ. తనకే కాదు, చాలామంది హాస్య కళాకారులకు జబర్దస్త్‌ ‘ఆధార్‌’ లాంటి ఓ గుర్తింపు. అప్పారావు బాబాయ్‌కి... ముప్ఫైఏళ్ల నట జీవితం ఇవ్వని సెలెబ్రిటీ హోదాను జబర్దస్త్‌ ఇచ్చింది. దెబ్బకు ఆయన వయసు సగానికి సగం పడిపోయింది. నవ్వుల టానిక్‌ మహత్యమిది!‘ఎవరైనా భయంతో పనిచేస్తారు, భక్తితో పనిచేస్తారు. చమ్మక్‌ చంద్ర మాత్రం ‘నేను కసితో జబర్దస్త్‌లో నటిస్తా’ అంటాడు. ఆ కసి....జీవితంలోని వైఫల్యాల నుంచి వచ్చింది. సరిగ్గా ఆ సమయంలోనే జబర్దస్త్‌ నుంచి పిలుపు వచ్చింది. మొదటి స్కిట్టు చేస్తున్నప్పుడే ‘ఈ కార్యక్రమం బతికితే, నేను బతుకుతా. నాతో పాటూ ఎంతోమంది కమెడియన్లూ బతుకుతారు’ అని తీర్మానం చేసుకున్నాడు. ఆకాశంలోంచి హాస్యదేవతలు ‘తథాస్తు’ అన్నట్టున్నారు. ఆ మాట నిజమే అయ్యింది. జబర్దస్త్‌ వందలాది కళాకారులను పరిచయం చేసింది. కొందరు ఉన్నారు, కొందరు వెళ్లారు, కొందరు వెళ్లి మళ్లీ వచ్చారు. తెర మీద మెరిసేది ఏ కొద్దిమందో. అందాల యాంకర్లు...అనసూయ, రేష్మీ చిరునవ్వులతో దర్శనమిస్తారు. జడ్జీలు...నాగబాబు, రోజా హాయిగా హాస్యాన్ని ఆస్వాదిస్తూ కనిపిస్తారు. తెర వెనుక నిపుణులు మాత్రం, రెండొందల పైమాటే. తొమ్మిది కెమెరాలతో ఆన్‌లైన్‌ యూనిట్‌ నిరంతరాయంగా పనిచేస్తుంది. మేకప్‌ డిపార్ట్‌మెంటూ, సెట్స్‌ డిపార్ట్‌మెంటూ, కాస్ట్యూమ్స్‌ టీమ్‌, ఆడియో సపోర్ట్‌ టీమ్‌, గ్రాఫిక్స్‌ నిపుణులూ...అదో పెద్ద సైన్యం.

* * *

సినిమా స్టార్లు లేరు. భారీ సెట్టింగుల్లేవు. నిపుణులు వండివార్చిన స్క్రిప్టుల్లేవు. జాతీయ ఛానళ్ల నుంచి అరువుతెచ్చుకున్న ఫార్ములాల్లేవు. ఉన్నదల్లా...హాస్యమే. స్వచ్ఛమైన, అచ్చమైన హాస్యం! ‘ఏడువారాల నగలిస్తాం, ఏడువారాల నగలిస్తాం’ అని చెబితే ఏమో అనుకున్నా, ఏడువారాలు కాగానే...మా ఆవిడ ఒంటిమీది నగలన్నీ తీసుకెళ్లిపోయారు పుట్టింటివాళ్లు’ అని ఘొల్లుమంటుందో భర్త పాత్ర. ‘సిటీలో చిన్న పనుందోయ్‌. చీకటి పడిపోయింది. ఈ పూటకి మీ ఇంట్లో తలదాచుకుంటా’ అంటూ టెంటేసే ప్రయత్నం చేసిన మొండి అతిథికి, ‘ఎవరొద్దన్నారూ! ఆ బీరువాలో తల దా...చు....కు...ని వెళ్లండి! రేప్పొద్దునొచ్చి తీసుకెళ్దురుగానీ’ అని రిటార్టు ఇస్తాడో గృహస్తు. ‘ఈరోజు మన పెళ్లి రోజు. ఎక్కడికైనా తీసుకెళ్లండీ!’ అని ప్రేమగా బతిమాలుతుందో ఇల్లాలు. ‘ఎక్కడికి తీసుకెళ్లమంటావ్‌ బంగారం!’ అంతకంటే గోముగా అడుగుతాడు భర్త. ‘ఎక్కడికైనా సరే, నేనెప్పుడూ వెళ్లని చోటికి’ మురిపెంగా ఆర్డరేస్తుంది శ్రీమతి. ‘అయితే, వంటింట్లోకి తీసుకెళ్తా రా...’ అని పంచ్‌ వేస్తాడు పతిదేవుడు.

అప్పుల మీద అప్పులు చేసి బ్యాంకుల్ని ముంచేసే బడా బాబులూ, ఎత్తు పెంచుతామనో లావు తగ్గిస్తామనో తప్పుడు వాగ్దానాలు చేసే నకిలీ డాక్టర్లూ, అమాయకుల్ని మాటలతో ప్రలోభపెట్టే దొంగ స్వాములూ, కక్షలూ కార్పణ్యాలతో ప్రాణాలు తీసుకునే ఫ్యాక్షనిస్టులూ... ఎవర్నీ వదిలిపెట్టదు. తిట్టాల్సినవాళ్లని తిడుతుంది. హెచ్చరించాల్సినవాళ్లని హెచ్చరిస్తుంది. నవ్వుల చక్కెరలో అద్దిన చేదు మాత్రల్లాంటివి జబర్దస్త్‌ స్కిట్లు.

యూట్యూబ్‌ లోనూ...

యూట్యూబ్‌లో జబర్దస్త్‌ వీక్షకుల సంఖ్య భారీగా ఉంటోంది. కొత్త ఎపిసోడ్‌ అప్‌లోడ్‌ అయిన మూడు నాలుగు రోజుల్లోనే కనీసం రెండు లక్షల క్లిక్కులు పడతాయి. కొన్ని జబర్దస్త్‌ ఎపిసోడ్స్‌ అయితే 30 లక్షల క్లిక్కులను దాటేశాయి. ప్రతి అప్‌లోడ్‌కూ బోలెడన్ని కామెంట్లు కూడా. ప్రపంచం నలుమూలలా జబర్దస్త్‌ వీరాభిమానులున్నారు. అందులో కొందరికి భాషా తెలియకపోవచ్చు. హాస్యం సార్వజనీన భాష. కొన్ని ప్రాంతాల్లో సీడీలు చేసి అమ్ముతున్నారు కూడా. ‘జబర్దస్త్‌ జోక్స్‌’ పేరుతో పుస్తకాలు వస్తున్నాయి. కాలేజీ ఫంక్షన్లలో అయితే జబర్దస్త్‌కు పేరడీగా స్కిట్లూ చేస్తున్నారు.

జబర్దస్త్‌లో కనిపించే పాత్రలన్నీ మనవే. కాదు కాదు మనమే. ‘బ్రదరూ! నీ జీవితమే ఓ జబర్దస్త్‌. నవ్వాలంటే సుఖాలే ఉండక్కర్లేదు, విజయాలే రానక్కర్లేదు, బ్యాంకు బ్యాలెన్సులే మూలగక్కర్లేదు. కష్టాల్లోనూ కామెడీని చూడాలి. బాధల్లోంచీ బ్రహ్మాండమైన హాస్యాన్ని పిండుకోవాలి. లేకపోతే, బతుకంతా ఏడుపులూ పెడబొబ్బలతోనే సరిపోతుంది’ అన్న సందేశాన్ని రకరకాల పాత్రల ద్వారా బోధిస్తోంది. మనం జీవితాల్లో కోల్పోతున్నదీ, జబర్దస్త్‌లో దొరుకుతున్నదీ...అదే, ఆ హాస్యమే! కాబట్టే, రేటింగుల గండపెండేరం. కాబట్టే, పకపకల పట్టాభిషేకం. కాబట్టే, వన్‌ ప్లస్‌ వన్‌ ఆఫరు కింద ‘ఎక్‌స్ట్రా జబర్దస్త్‌’!

* * *

‘దెబ్బకు తగ్గుండాలే, మళ్లీ వచ్చావెందుకూ?’ - అనుమానంగా అడిగాడు డాక్టరు.
‘గురువారం వరకూ పర్లేదు. రాత్రి హాయిగా నిద్రపట్టేస్తుంది. మిగిలిన్రోజులు ఏం చేయమంటారు? జబర్దస్త్‌ రాదుగా!’- దిగాలుగా చెప్పాడు రోగి.
‘అయితే, ఓ టాబ్లెట్‌ రాసిస్తా. మిగతా రోజులకూ పనికొస్తుంది’ - చీటీ చేతిలో పెట్టి, ఓ సలహా ఇచ్చాడు డాక్టరు.
‘మందులషాపుకెళ్లొద్దు. ఆ పక్కనున్న ఎలక్ట్రానిక్స్‌ షోరూమ్‌కు వెళ్లు. ఇదేం, మింగే టాబ్లెట్‌ కాదు. చూసే టాబ్లెట్‌. ఇక, జబర్దస్త్‌ నీ బ్యాగులో ఉన్నట్టే. రోగాల టాబ్లెట్లన్నీ బ్యాగులోంచి తీసి పడెయ్‌. వాటి అవసరం చచ్చినా రాదు’. హాస్యం పరమౌషధం.

అలోపతి...హోమియోపతి... ఇంకా -
జబర్దస్తోపతి!
నో సైడ్‌ ఎఫెక్ట్స్‌, నో ఎక్స్‌పైరీ డేట్స్‌.
ఓన్లీ కామెడీ, ఖతర్నాక్‌ కామెడీ!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.