close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కెమెరా... యాక్షన్‌...‘షార్ట్‌’కట్‌!

సాగదీయడం ఉండదు. అంతా ఇరగదీయడమే! కాఫీ అందుకోగానే కథ మొదలవుతుంది. చివరి చుక్కకు వచ్చేసరికి శుభంకార్డు పడిపోతుంది. ప్రతి డైలాగులో పంచు. ప్రతి ఫ్రేములో మెరుపు. టైటిల్‌ సూపరు. సందేశం అదుర్స్‌. అందుకే, లఘు చిత్రాలకు అంత ఆదరణ. ఫిల్మ్‌నగర్‌ వెళ్లడానిక్కూడా షార్ట్‌ఫిల్మే...షార్ట్‌కట్‌!

క్యాంపస్‌ క్యాంటీన్‌లో ఫ్రెండ్స్‌ కోసం ఎదురుచూస్తున్నప్పుడూ, క్లాస్‌రూమ్‌లో పాఠం పరమబోర్‌గా అనిపిస్తున్నప్పుడూ, చదువుకునీ చదువుకునీ బుర్ర వేడెక్కినప్పుడూ, ప్రాజెక్టు మధ్యలో కంప్యూటర్‌ హ్యాంగైనప్పుడూ ...ఇన్‌స్టంట్‌ కిక్కు అవసరం అవుతుంది. ఎనర్జీ డ్రింకు లాంటి ఆ ఆరోగ్యకరమైన వినోదమే...షార్ట్‌ఫిల్మ్‌, ముద్దుగా షార్టీ!

షార్ట్‌ఫిల్మ్‌ స్టోరీలన్నీ యువత చుట్టే తిరుగుతాయి. క్యాంపస్‌ ప్రేమలూ, ఆఫీసు ఆకర్షణలూ, బస్‌స్టాపు కవ్వింపులూ, పక్కింటి అమ్మాయి పలకరింపులూ, లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌లూ, బ్రేకప్‌లూ, ప్యాకప్‌లూ - చాలా చిత్రాలకు ఇతివృత్తాలు. ఆ సంభాషణలూ అంతే. ఏ కాఫీడే కబుర్లనో ‘కట్‌ అండ్‌ పేస్ట్‌’ చేసినట్టు ఉంటాయి. ఎందుకంటే, షార్ట్‌ఫిల్మ్‌ రూపకర్తలంతా పాతికేళ్లు కూడా నిండని యువతీ యువకులే. ఏ ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరంలోనో ఉంటారు. లేదంటే, ఏ ఐబీఎమ్‌ ఆఫీసులోనో ట్రైనీలుగా పనిచేస్తుంటారు. రెండూ కాకపోతే, అన్నీ వదిలేసుకొచ్చిన సినిమా పిచ్చోళ్లయి ఉంటారు.

సినిమా సమ్మోహనం. కెమెరా మంత్రదండం. వెండితెర బంగారు కల. ‘ఒక్క ఛాన్స్‌’ కోసం ఆవురావురుమనే వాళ్లు వేలమంది. ఆ లేత మొహాలకు లెజెండ్ల దర్శనం దొరకదు, సెలెబ్రిటీల కటాక్షం లభించదు. అలా అని, కలల రెక్కల్ని తుంచేసుకోలేరు. బతుకు లక్ష్యాల్ని చంపేసుకోలేరు. ఆ బాపతు వాళ్లనంతా షార్ట్‌ఫిల్మ్‌ ‘మైహూ నా...’ అని ఆలింగనం చేసుకుంటుంది. ఇక, స్టూడియోల ముందు పడిగాపులుండవు. బొమ్మలో దమ్ముంటే పెద్ద డైరెక్టరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఆ మధ్య దర్శకుడు పూరి జగన్నాథ్‌...యూట్యూబులో ‘పెళ్లితో జరభద్రం’ అనే షార్ట్‌ఫిల్మ్‌ చూశాడు. అందులో, భద్రం పాత్ర వేసిన కుర్రాడిలో మెరుపును గమనించాడు. వెంటనే సెల్‌ఫోన్‌ అందుకుని, ‘వివరాలు పంపించు. నా కొత్త సినిమాలో అవకాశం ఇస్తా’ అని మెసేజ్‌ పెట్టాడు. భద్రంబాబు ఆ ఎస్సెమ్మెస్‌ను భద్రంగా సేవ్‌ చేసుకున్నాడు. రామ్‌గోపాల్‌ వర్మ ‘ఐస్‌క్రీమ్‌’ సినిమా కోసం వందలకొద్దీ షార్ట్‌ఫిల్మ్స్‌ చూశాడు. ఎన్నో వడపోతల తర్వాత తేజస్వి అనే అమ్మాయిని హీరోయిన్‌గా ఎంచుకున్నాడు. అలా...కాలక్షేపానికి చూసేవారూ, సత్తా చాటుకోడానికి తీసేవారూ, నైపుణ్యాన్ని గాలించేవారూ...అంతా కలసి షార్ట్‌ఫిల్మ్‌ను సూపర్‌హిట్‌ చేస్తున్నారు.

అలా మొదలైంది...
లఘుచిత్రాలు తెలుగు పరిశ్రమకు కత్తిలాంటి నటుల్ని కానుకగా ఇచ్చాయి. ‘హ్యాట్రిక్‌ హీరో’ రాజ్‌తరుణ్‌ నిన్నమొన్నటిదాకా ‘యూట్యూబ్‌’ స్టారే. యాభై దాకా షార్ట్‌ఫిల్మ్స్‌ తీశాడు. ఆతర్వాత అనుకోకుండా ‘ఉయ్యాలా జంపాలా’లో స్క్రీన్‌ప్లే రాయడానికి కుదురుకున్నాడు. కుర్రాడిలోని మెటీరియల్‌ని నాగార్జున గుర్తించాడు. ‘నువ్వే హీరోగా ఎందుకు చేయకూడదు?’ అని ప్రోత్సహించాడు. అంతే, రాజ్‌తరుణ్‌ నుదుటి మీద స్టోరీలైన్‌ మారిపోయింది. రెజీనా సినిమా ప్రయాణంలోనూ షార్ట్‌ఫిల్మ్‌ మజిలీ ఉంది. ‘కానల్‌ నీర్‌’ అనే తమిళ లఘుచిత్రంలో నటించిందా తార. పావని గంగిరెడ్డి, పూజిత, పటమటలంక నవీన్‌, ఐశ్వర్య గోరక్‌...ఇలా ఇప్పుడిప్పుడే పెద్దతెర మీద నిలదొక్కుకుంటున్నవారి జాబితా పెద్దదే. నవీన్‌ అనే కుర్రాడికైతే షార్ట్‌ఫిల్మ్‌ మెగాస్టారన్న పేరుంది. దాదాపు వంద లఘుచిత్రాల్లో నటించాడు. బోలెడంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇంజినీరింగ్‌ కెరీర్‌ను పక్కనపెట్టేసి ఇటుపక్కకి వచ్చాడు. ‘వింధ్యామారుతం’ షార్ట్‌ఫిల్మ్‌ ద్వారా పరిచయమైన పావని ‘సైజ్‌జీరో’లో అనుష్క పక్కన మంచి పాత్రే కొట్టేసింది. ‘ఉప్మాతినేసింది’లో నటించాక పూజిత కెరీర్‌ జీడిపప్పు ఉప్మాలా ఘుమఘుమలాడుతోంది. ‘హ్యాపీ ఎండింగ్‌’ ఐశ్వర్య ‘దేనికైనా రెడీ’, ‘శివమ్‌’లలో తళుక్కున మెరిసింది.

‘షార్ట్‌’ మెరుపులు!

క్కా వినోదం, అచ్చమైన ప్రేమ, చిక్కని ఆధ్యాత్మికత, చక్కని సందేశం...తెలుగు షార్ట్‌ఫిల్మ్స్‌లో నవరసాలకు కొదవే లేదు. లఘు చిత్రానికి ప్రచారాన్ని తెచ్చిపెట్టడంలో సినిమా టైటిల్‌దే పెద్ద పాత్ర. అందమైన హీరోయిన్‌ ఉండటం అన్నది అదనపు ఆకర్షణ. మొత్తానికి మంచి లఘుచిత్రాన్ని తెలుగు వీక్షకులు ఎప్పుడూ నిరాశపరచరు. క్లిక్కులిచ్చి ఆశీర్వదిస్తూనే ఉంటారు. ఆన్‌లైన్‌లో ఆదరణ పొందుతున్న కొన్ని చిత్రాల పరిచయం...

వైవా

క్లిక్కులు : 75 లక్షలు +
కాలేజీ విద్యార్థులకు సంబంధించిన ఇతివృత్తం. ప్రాక్టికల్‌ ఎగ్జామినర్‌ ప్రశ్నలకు విద్యార్థులు ఇచ్చే వింతవింత సమాధానాలు నవ్వు తెప్పిస్తాయి. ఎగ్జామినర్‌గా హర్ష హావభావాలు ఆకట్టుకుంటాయి.

బ్లూ ఫిల్మ్‌

క్లిక్కులు : కోటి +
శీర్షికను చూడగానే ఇదేదో ‘నీలి’ గోల అనుకుంటాం. కానీ, ఓ మంచి సందేశంతో తీసిన లఘుచిత్రం ఇది. నీటి పొదుపు అవసరాన్ని దర్శకుడు చాలా సూటిగా చెప్పాడు.

సైలెంట్‌ మెలోడీ

క్లిక్కులు : 37 లక్షలు +
మామూలు యువకుడితో బధిర యువతి ప్రేమే ఇతివృత్తం. డ్రాయింగ్‌షీట్‌ మీద రాతలతో అటు అబ్బాయీ ఇటు అమ్మాయీ భావాల్ని పంచుకుంటారు. యువ హీరో సందీప్‌కిషన్‌ నిర్మించాడు దీన్ని.

వై నాట్‌ ఎ గర్ల్‌

క్లిక్కులు : 4 లక్షలు +
అంతా అబ్బాయే పుడతాడు... అని బల్లగుద్ది చెప్పేస్తుంటే, ఆ అమ్మ మనసు విలవిల్లాడిపోతుంది. కడుపులో ఉన్నదేమో పండంటి ఆడబిడ్డ. ‘ఆడపిల్లల్ని కాపాడండి’ అన్న సందేశంతో తెరకెక్కించిన ఈ షార్ట్‌ఫిల్మ్‌లో సినీనటుడు నందు ప్రధాన పాత్ర పోషించాడు.

మధురం

క్లిక్కులు : 18 లక్షలు +
ఒక అబ్బాయీ, ఒక అమ్మాయీ. ఇద్దరి మధ్యా ఓ గంట పాటూ జరిగిన సంభాషణే ఈ లఘుచిత్రం. ఆ సంభాషణ వీక్షకుల హృదయాల్ని సుతిమెత్తగా మీటుతుంది. పాత జ్ఞాపకాల్ని నెమరేసుకునేలా చేస్తుంది. 

హాఫ్‌ గర్ల్‌ఫ్రెండ్‌

క్లిక్కులు : 14 లక్షలు +
కర్మ సిద్ధాంతాన్ని ఆధునిక జీవితానికి అన్వయిస్తూ చేసిన చక్కని ప్రయోగం. విలువ లేకుండా పోతున్న విలువల గురించీ, నీరుగారిపోతున్న నైతికత గురించీ...సున్నితంగా హెచ్చరించారు.

ఉప్మా తినేసింది

క్లిక్కులు : 11 లక్షలు +
ఆధునిక జీవితపు కథ ఇది. చిన్నాచితకా కారణాలతో బంధాలు ఎలా బీటలువారుతున్నాయో కళ్లకు కట్టింది. తాను ఇష్టంగా వండుకున్న ఉప్మాను శుభ్రంగా తినేసిందన్న కోపంతో సహజీవనం చేస్తున్న అమ్మాయికి బ్రేకప్‌ చెప్పేస్తాడో అబ్బాయి.

వింధ్యామారుతం

క్లిక్కులు : 8 లక్షలు +
ఇదో యువ దర్శకుడి కథ. సినిమా అనే రంగుల ప్రపంచంలో మన నీడ కూడా మనకు పంచరంగుల్లో దర్శనమిస్తుందంటూ...ఆ వర్ణ ప్రపంచాన్ని హృద్యంగా ఆవిష్కరించారు. 

షార్ట్‌ఫిల్మ్‌ హీరోలకు పెద్దగా ఆదాయం ఉండదు. హీరోయిన్లకు మాత్రం మంచి పారితోషికాలు అందుతాయి. రోజుకు పాతికవేల దాకా తీసుకుంటున్న తారామణులూ ఉన్నారు. లఘుచిత్రాల నిర్మాణం ఖరీదైపోడానికి ఆ భారీ రెమ్యూనరేషన్లే కారణమని మెటికలు విరుస్తున్నవారూ లేకపోలేదు. షార్ట్‌ఫిల్మ్‌ దర్శకుడు శ్రీకాంత్‌రెడ్డికి ఈ మధ్యే ఓ పెద్ద బ్యానర్‌ నుంచి అవకాశం వచ్చింది. స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా మొదలైపోయింది. ‘త్వరలోనే వివరాలు చెబుతా. నా సినిమా అందర్నీ ఆశ్చర్యపరచాలి. కొందరినైనా ప్రభావితం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగమే ఇదంతా’ అంటాడా యువకుడు.

విషయాన్ని సూటిగా, సుత్తిలేకుండా చెప్పడానికి ‘షార్ట్‌ఫిల్మ్‌’ను మించిన మాధ్యమం లేదు. కాబట్టే, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా ఈ బాటే పట్టాడు. బన్నీ నిర్మించిన లఘుచిత్రం పేరు...అయామ్‌ దట్‌ ఛేంజ్‌. సుకుమార్‌ దర్శకత్వం వహించాడు. బాధ్యత లేకుండా, కూల్‌డ్రింక్‌ డబ్బాల్ని రోడ్డు మీద పడేస్తాం. ట్రాఫిక్‌ నిబంధనల్ని తుంగలో తొక్కే®, కానిస్టేబుల్‌కు లంచం ఇవ్వజూపుతాం. మనందరి భద్రత కోసం ఏర్పాటు చేసిన స్కానర్లను దాటేసుకునెళ్లి ఘనకార్యం చేసినట్టు పొంగిపోతాం. ‘తప్పు! చాలా తప్పు!! మన బాధ్యత మనం నిర్వర్తించడం కూడా దేశభక్తే. ఐయామ్‌ ద ఛేంజ్‌, బీ ద ఛేంజ్‌’ అన్న విషయాన్ని సూటిగా చెప్పిన లఘుచిత్రం ఇది. ‘ప్రస్థానం’ లాంటి మంచి సినిమాని అందించిన దేవ కట్టా ‘డయింగ్‌ టు బీ మీ’ పేరుతో మహిళల ఆర్థిక స్వాతంత్య్రం మీద ఓ చిత్రం తీశాడు. పాప్‌ సింగర్‌ స్మితది ఇందులో ప్రధాన పాత్ర. ‘రన్‌ రాజా రన్‌’ అనే షార్ట్‌ఫిల్మ్‌తో ఓ వినోద ఛానల్‌ నిర్వహించిన పోటీల్లో బహుమతి సాధించిన సుజీత్‌ సైన్‌...అదే పేరుతో శర్వానంద్‌ హీరోగా పూర్తినిడివి సినిమా తీశాడు. అది సూపర్‌హిట్‌ అయ్యింది. ప్రభాస్‌ తదుపరి చిత్రం సుజీత్‌తోనే అని ప్రచారం.

వైవిధ్యంగా...
ఒక హీరో, ఒక హీరోయిన్‌, ఒక విలన్‌, నాలుగు డ్యూయెట్లు, ఆరు ఫైట్లు...భారీ పతాక సన్నివేశంతో శుభం కార్డు - ఇలాంటి పాత చింతకాయ ఫార్ములాతో విసిగిపోయిన ప్రేక్షకులకు షార్ట్‌ఫిల్మ్‌ అనేది...వేసవిలో చల్లచల్లని కుండమజ్జిగ, చలికాలంలో వేడివేడి ఇరానీ చాయ్‌, వర్షాకాలంలో వెచ్చవెచ్చని మొక్కజొన్న పొత్తు. కథల్లో వేళ్లూ కాళ్లూ పెట్టడానికి స్టార్‌ హీరోలుండరు, మసాలా గుప్పించకపోతే మనుగడకష్టమని హెచ్చరించే బాక్సాఫీసు పండితులుండరు. థియేటర్లు దొరకవన్న భయమే ఉండదు. చూసేది కూడా ఎంతోకొంత అభిరుచి ఉన్న వీక్షకులే కాబట్టి...నేలబారుగా ఆలోచించాల్సిన పన్లేదు. ఆ మాత్రం స్వేచ్ఛ ఉండబట్టే, లఘుచిత్ర దర్శకులు వైవిధ్యమైన ఇతివృత్తాల్ని ఎంచుకుంటున్నారు. ‘ది గాడ్‌ మస్ట్‌ బి క్రేజీ’నే తీసుకోండి. చనిపోయిన మనిషిని దేవుడు ఇంటర్వ్యూ చేస్తే, ఆ తప్పుల్ని ఇంకోసారి చేయొద్దని హెచ్చరించి భూమ్మీదికి పంపిస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచనతో తీసిన చిత్రమిది. దర్శకుడు మణిరత్నం ప్రశంసల్ని కూడా అందుకుంది. ఓ షార్ట్‌ఫిల్మ్‌ అయితే, మొదట్నుంచి చివరి దాకా...సెల్‌ఫోన్‌ చుట్టే తిరుగుతుంది. కొత్తగా పెళ్లయిన ఓ యువకుడు పెళ్లాంతో శృంగారాన్ని సెల్‌ఫోన్‌లో రికార్డు చేసుకుంటాడు. అంతలోనే మొబైల్‌ కనిపించకుండా పోతుంది. ఫోను కోసం వెతుకులాటా, పడకగది జీవితం బజారు పాలైందన్న బాధా...భలేగా చిత్రించారు. మొత్తానికి ‘మేరా మొబైల్‌ గూమ్‌గయా’ యూట్యూబ్‌ను గుమ్మెత్తించింది. ఉత్తరమే ఇతివృత్తంగా తీసిన మరో షార్టీ ’లెటర్‌’. ఓ ఉత్తరం ఒక జీవితంలో ఎలా వెలుగులు నింపిందో, మరో జీవితాన్ని ఎలా చీకటిపాలు చేసిందో...మూడంటే మూడు పాత్రలతో ఆసక్తికరంగా చూపించాడు దర్శకుడు. అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శితమైన సునీత్‌కుమార్‌ అల్లాడి ‘ది హౌస్‌’ అవినీతి మీద ఎక్కుపెట్టిన బాణం. ఓ రిటైర్డ్‌ ఉద్యోగి గ్రాట్యుటీ డబ్బు కోసం సాగించిన పోరాటాన్ని గుండెలు మండిపోయేలా తీశాడు దర్శకుడు. అల్లాడి సింగపూర్‌లో ఓ కంపెనీకి అధినేత. లఘుచిత్రాల మీద ప్రేమతో డైరెక్టరు అవతారం ఎత్తాడు. ఖాళీ దొరకగానే భుజానికి కెమెరా వేసుకుని తెలుగు గడ్డ మీద వాలిపోతాడు. అన్నట్టు, షార్ట్‌ఫిల్మ్‌ కెమెరా ప్రయోగాలకూ వేదిక అవుతోంది. ఫణీంద్ర నర్సెట్టి ఐఫోన్‌తో ‘బ్యాక్‌ స్పేస్‌’ తీశాడు. ఆ లఘుచిత్రాన్ని చూసి రామ్‌గోపాల్‌వర్మ ‘హాలీవుడ్‌ రేంజిలో ఉంది’ అని మెచ్చుకున్నాడట. జయశంకర్‌ ‘గాడ్‌ మస్ట్‌ బి క్రేజీ’ని వన్‌ప్లస్‌ ఫోన్‌తో షూట్‌ చేశాడు.

పంచ్‌మే పరమాత్మా...
పంచు డైలాగులూ, పొయిటిక్‌ ఎక్స్‌ప్రెషన్లూ పెద్ద సినిమాలకేనా...షార్ట్‌ఫిల్మ్స్‌లోనూ హార్ట్‌టచింగ్‌ సంభాషణలుంటాయి - అని ధీమాగా చెబుతున్నారు ‘లఘు’ దర్శకులు. ‘ఆ అమ్మాయిని చూస్తుంటే మాటలు కూడా నా మాట వినడం లేదు’ - అని వాపోతాడో హీరో. ‘గుండుసూది తగిలి గూడ్సు బండి ఆగిపోయినట్టు ఆగిపోతున్నా తనని చూడగానే’ అంటూ గోడెళ్లబోసుకుంటాడో ప్రేమికుడు. ‘జీవితమే తనదైనప్పుడు, ఎన్ని రోజులైతే ఏంటీ, ఎన్ని సంవత్సరాలైతే ఏంటీ’ - అంటూ ఆజన్మాంతం ఎదురుచూడటానికి సిద్ధపడతాడో మజ్నూ. ‘గెలిస్తే జ్ఞాపకాలూ ఓడిపోతే అనుభవాలూ మిగుల్తాయ్‌. కానీ గెలుస్తామో ఓడిపోతామో తెలియని ప్రేమలో మాత్రం కన్నీళ్లే మిగుల్తాయి’ తరహా గుండెలు పిండే డైలాగులైతే బోలెడన్ని. ‘ఈజీగా వచ్చే అమ్మాయిలు ఎర్లీగా వెళ్లిపోతారు. కష్టంగా పడే అమ్మాయిలు కలకాలం నిలుస్తారు’ తరహా నవతరం ప్రేమ సూత్రాల్నీ ఆల్చిప్పల్లా ఏరుకోవచ్చు. ‘అందంగా ఉన్నావని లవ్‌ చేయలేదు. ప్రేమించాకే అందంగా కనిపిస్తున్నావ్‌’ - వగైరా డైలాగులతో త్రివిక్రమ్‌ను తలపించే విక్రమ కుమారులకూ కొదవలేదు. ‘పడితే పగలబడి నవ్వుతుంది. ఎదిగితే వెక్కివెక్కి ఏడుస్తుంది...ఇదే సొసైటీ’ - అనాలంటే ఎంత జీవితాన్ని చూసుండాలి? ‘కరుణాకరన్‌ సినిమాలోని ఏంజిల్స్‌ లాంటి హీరోయిన్లంతా పూరి జగన్నాథ్‌ సినిమాల్లోని హీరోల్లాంటి పోకిరీలకే పడిపోతారేంట్రా’ అంటూ ఓ లఘుచిత్ర పాత్ర బుర్రగోక్కుంటుంది కూడా. పేర్లూ అంతే. పెద్ద సినిమాలకు ఏ మాత్రం తీసిపోవు. అందులోనూ చాలా వరకూ యూత్‌తో కనెక్ట్‌ అయిపోయే టైటిల్సే. ‘జావా వర్సెస్‌ డాట్‌నెట్‌’, ‘కుమార్‌ 21 ఎమ్‌’, ‘త్రిషకి పెళ్లి చూపులు’, ‘నాదో చిన్న లవ్‌ స్టోరీ’, ‘పడేసావే’, ‘ఫస్ట్‌కిస్‌’...ఇలా పేరు వినగానే క్లిక్‌ చేయాలన్నంత కిక్కు వచ్చేస్తుంది. పోస్టర్‌ డిజైనింగ్‌లోనూ మనవాళ్లు ఏమాత్రం తగ్గడంలేదు. ప్రోమోలూ, టీజర్లూ, ట్రైలర్లూ, ఫస్ట్‌ లుక్కులూ...వీక్షకుల్ని వూరించడానికి అవసరమైన వూరగాయ దినుసులన్నీ షార్ట్‌ఫిల్మ్‌ డైరెక్టర్ల దగ్గర సిద్ధంగా ఉంటాయి. కొన్ని లఘుచిత్రాల్లో డ్యూయెట్లూ పెడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, పెద్ద సినిమా ఫ్యామిలీప్యాక్‌ బిర్యానీ అయితే, లఘుచిత్రం మిఠాయివాలా రుచి చూడ్డానికిచ్చే జిలేబీ ముక్క.

ఒక టికెట్‌, రెండు సినిమాలు!
- జయశంకర్‌, లఘుచిత్ర రూపకర్త

‘లఘుచిత్రాల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత అటు ప్రభుత్వం మీదా, ఇటు వీక్షకుల మీదా ఉంది. షార్ట్‌ఫిల్మ్స్‌ పనితనంలో పెద్ద చిత్రాలకు దీటుగా ఉంటున్నాయి. అందులోనూ గంట నిడివి షార్ట్‌ఫిల్మ్స్‌ను...ఒక టికెట్‌కు రెండు సినిమాలు ఫార్ములాతో థియేటర్లలో విడుదల చేయవచ్చు. ఇంటర్వెల్‌కు ముందు ఒకటీ, తర్వాత ఒకటీ చూపించవచ్చు. తమిళ, మళయాల పరిశ్రమల్లో నిర్మాతలూ దర్శకులూ షార్ట్‌ఫిల్మ్స్‌ను బాగా ప్రోత్సహిస్తున్నారు. బలం ఉంటే మంచి పారితోషికాలు ఇచ్చి పూర్తి నిడివి చిత్రాలుగా తీస్తున్నారు’ అంటాడు జయశంకర్‌. తీసింది నాలుగే షార్ట్‌ఫిల్మ్స్‌ అయినా...చెప్పుకోదగ్గ తెలుగు లఘుచిత్రాల జాబితా తయారు చేస్తే అందులో జయశంకర్‌ నాలుగు చిత్రాలకూ స్థానం లభించి తీరుతుంది. రామ్‌గోపాల్‌వర్మ, సుకుమార్‌, దాసరి, త్రివిక్రమ్‌...ఇలా దిగ్గజాలతో ‘శెభాష్‌’ అనిపించుకున్నాడు. ఒకరికి టేకింగ్‌ నచ్చితే, ఒకరికి డైలాగ్స్‌ నచ్చాయి. ఇంకొకరికి విభిన్న కోణాన్ని ఎంచుకున్న తీరు నచ్చింది. సినిమాల మీద ప్రేమతో ఐబీఎమ్‌లో ఉద్యోగాన్ని వదులుకుని వచ్చిన ఈ యువకుడు లఘుచిత్రాల నుంచి పెద్దచిత్రాలకు లంఘించడానికి సిద్ధం అవుతున్నాడు.

పైసా వసూల్‌!
కథలో దమ్ముంటే, దర్శకత్వంలో నైపుణ్యం జొప్పిస్తే...షార్ట్‌ఫిల్మ్‌తోనూ డబ్బు సంపాదించుకోవచ్చు. యూట్యూబ్‌లో ఓ వేయిమంది చూశారంటే .. మూడు నుంచి ఏడు డాలర్ల దాకా మన ఖాతాలో పడిపోయినట్టే. నిజానికి, కొన్ని లఘు చిత్రాలు లక్షల క్లిక్కుల లెక్కల్నీ దాటేశాయి. షార్ట్‌ఫిల్మ్‌ల మీద ప్రేమతో లక్షణమైన కొలువుల్నీ లక్షల జీతాల్నీ వదిలేసుకుంటున్నవారు చాలామందే ఉన్నారు. అజయ్‌ ఇజ్జాడ సంగతే తీసుకోండి. తను చిన్నప్పటి నుంచీ చురుకైన విద్యార్థి. ఎనభైశాతం మార్కులతో ఇంజినీరింగ్‌ పాసయ్యాడు. వెంటనే గూగుల్‌లో ఉద్యోగం వచ్చేసింది. నెల జీతం లక్ష. అందరూ, ‘లక్షా...’ అన్న ఆశ్చర్యం నుంచి తేరుకునేలోపే, మరో షాకిచ్చాడు. ‘జీతం కోసం జీవితంతో రాజీపడలేను. రాజీనామా చేస్తున్నా’ అని ప్రకటించాడు. ఇంకో నిబిడాశ్చర్యం. చకచకా స్క్రిప్టులు సిద్ధం చేసుకుని, షార్ట్‌ఫిల్మ్‌ మేకర్‌గా మారిపోయాడు.

షార్ట్‌ఫిల్మ్‌ రూపకర్తల దగ్గర డబ్బున్నా లేకపోయినా...మెదడులో ఆలోచన, చేతిలో కెమెరా, గుండెల్లో తపన ..పుష్కలంగా ఉంటాయి! ఆ నిజాయతీని అర్థం చేసుకునే, పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ప్రొడ్యూసర్లు ముందుకొస్తున్నారు. యూట్యూబ్‌ ఛానళ్లు కూడా షార్ట్‌ఫిల్మ్స్‌ను ప్రోత్సహిస్తున్నాయి. ఓ లఘుచిత్రం తీయాలంటే....ఐదు వేల నుంచి ఐదు లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఐక్యూలిక్స్‌, తెలుగువన్‌, రన్‌వే రీల్‌, మిస్టర్‌ ప్రొడక్షన్స్‌ తదితర సంస్థలు స్క్రిప్టు నచ్చితే పెట్టుబడులు పెడతాయి. మెల్లమెల్లగా షార్ట్‌ఫిల్మ్‌...ఓ పరిశ్రమగా రూపాంతరం చెందుతోంది. రోజుకు సగటున పదీపదిహేను షార్ట్‌ఫిల్మ్స్‌ అప్‌లోడ్‌ కావడం...భవిష్యత్తు బంగారమే అనడానికి ఓ చిన్న సంకేతం.

ఐడియా బజార్‌...
‘షార్ట్‌’ బ్యాచ్‌కు సమయస్ఫూర్తి ఎక్కువ. సమయానికి తగు చిత్రాలు తీసేయగలరు. పెద్దతెర మీద బాహుబలి విడుదల కావడమే తరువాయి, ‘లఘు’బలి యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేసింది. కట్టప్ప బాహుబలిని ఫలానా కారణంతోనే చంపాడన్న ఓ వింత లాజిక్‌తో ప్రేక్షకుల్ని భలేగా ఆకట్టుకుంది. ఆమిర్‌ఖాన్‌ పీకే చిత్రం గ్రహాంతరవాసి పాత్ర ద్వారా మతం పేరుతో జరుగుతున్న వ్యాపారాల్ని ఎండగడితే...లఘుచిత్రంలో అచ్చంగా అలాంటి గ్రహాంతరవాసితోనే వాతావరణ కాలుష్యం గురించి చెప్పించారు. చేతన్‌భగత్‌ ‘హాఫ్‌ గర్ల్‌ఫ్రెండ్‌’ పుస్తకం మార్కెట్‌ను వూపేస్తున్న సమయానికే ఇక్కడ అదే పేరుతో ఓ ప్రేమకథా చిత్రం వెలువడింది.

వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌ బ్రియన్‌లారా తోనూ ‘సెభాష్‌’ అనిపించుకున్న తెలుగు షార్ట్‌ఫిల్మ్‌ ఒకటుంది. తెలుగంటే తెలియని లారాకు తెలుగు లఘుచిత్రం నచ్చడం వింతగానే ఉంటుంది. బధిర యువతిలో చిగురించిన ఆ ప్రేమ కథ పేరు ‘సైలెంట్‌ మెలోడీ’. ఈ షార్ట్‌ఫిల్మ్‌ను ట్రినిడాడ్‌లోని తనింట్లో కూర్చుని చూశాననీ, అద్భుతంగా అనిపించిందనీ లారా ట్వీట్‌ చేశాడు.

పుణె ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, ముంబై ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌ ఫర్‌ షార్ట్‌ఫిల్మ్స్‌ తదితర వేదికలు లఘుచిత్రాల్ని బహుమతులతో ప్రోత్సహిస్తున్నాయి. తెలుగు భాషకు సంబంధించినంత వరకూ అపుడపుడూ పోటీలంటూ జరుగుతున్నా...వ్వవస్థీకృతంగా చేస్తున్నది తక్కువే. అప్పట్లో మంచు విష్ణు నిర్వహించిన పోటీలకు మంచి స్పందన వచ్చింది. పూరి ఇచ్చిన పిలుపునకూ చాలామందే స్పందించారు. షార్ట్‌ఫిల్మ్‌ పేరు పల్లెల దాకా వెళ్లింది కూడా అప్పుడే.

‘అర్థంపర్థం లేని విషయాలతో కాకుండా, బలమున్న చిత్రాలు తీస్తే మంచి గుర్తింపు వస్తుంది. అందులోనూ ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోడానికి అవకాశం ఎక్కువ. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ ప్రతిభ నచ్చితే పెద్ద చిత్రాలూ వెతుక్కుంటూ వస్తాయి. తమను తాము నిరూపించుకోడానికి ఇదో మంచి వేదిక’ అంటాడు సినీ రచయిత సత్యానంద్‌. ‘లఘు చిత్రాలు బావున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఉన్నాయి. భవిష్యత్తు అంతా ఇంటర్నెట్‌దే. అంటే, యూట్యూబ్‌దే. అంటే, షార్ట్‌ఫిల్మ్‌దే’ అని భరోసా ఇస్తాడు దర్శకుడు సుకుమార్‌. త్వరలోనే ఓ ఆన్‌లైన్‌ థియేటర్‌ ఏర్పాటు చేయబోతున్నట్టు రామ్‌గోపాల్‌వర్మ ఈమధ్యే ట్వీట్‌ చేశాడు. ఆ ఆర్‌జీవీ టాకీస్‌లో తాను తీసినవే కాదు, తనకు నచ్చినవీ అప్‌లోడ్‌ చేస్తానని అంటున్నాడు. షార్టీలను ప్రేమించేవాళ్లంతా ఘనంగా పార్టీ చేసుకోవాల్సిన కబురే.

పార్టీ ఎక్కడ, ఎప్పుడు, ఏం తీసుకుంటారు, వెజ్జా, నాన్‌వెజ్జా? - అన్నది మీ ఇష్టం. ఏదైనా నంజుకోడానికే. అసలు సిసలు విందు మాత్రం, తాజాగా అప్‌లోడ్‌ అయిన...వేడివేడి షార్ట్‌ఫిల్మే!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.