close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బన్నీ... బాక్సాఫీస్‌ రేసుగుర్రం!

బన్నీ... బాక్సాఫీస్‌ రేసుగుర్రం!

అల్లు అర్జున్‌... కటౌట్లూ, కలెక్షన్ల గురించి మాట్లాడడు. రికార్డులూ, రివార్డుల ప్రస్తావన తీసుకురాడు. ఇమేజ్‌ చట్రంలో ఇరుక్కుని సినిమాలు తీయడు. తాతలూ, చరిత్రల గొప్పల డప్పులు కొట్టడు. అతడికి తెలిసిందల్లా మంచి సినిమాలు చేస్తూ పోవడమే... అవే బన్నీని బాక్సాఫీసు రేసుగుర్రంలా మార్చాయి. దక్షిణ భారతానికి స్టైలిష్‌ స్టార్‌ని చేశాయి. సోషల్‌ మీడియా సంచలనంగా తీర్చిదిద్దాయి. రంగుల పరిశ్రమలో కింగులా నిలబెట్టాయి. ఆ సెలెబ్రిటీ మేలి ముసుగుని కాసేపు పక్కనపెట్టి చూస్తే అర్జున్‌ అచ్చంగా మన వీధిలో కుర్రాడే..!

‘నువ్వు ఒకప్పటిలా లేవు, కొన్నాళ్లుగా చాలా సీరియస్‌గా తయారయ్యావు’... ఈ మధ్యే చరణ్‌ నాతో అన్న మాట. విని చాలా ఆశ్చర్యమేసింది. నిజంగా అంతలా మారానా అనుకున్నా. దాని గురించి ఆలోచించడం మొదలుపెడితే, ‘ఇప్పుడు కొత్తగా మారడమేంటీ ఎప్పట్నుంచో మారుతూనే ఉన్నా కదా’ అనిపించింది. పగలూ రాత్రీ కష్టపడి చదివినా 35 మార్కులు దాటేవి కాదు, అలాంటిది పదో తరగతి తొలిప్రయత్నంలోనే పాసయ్యా... నా జీవితంలో మొదటి మార్పు. సినిమాల్లో నటిస్తానని కలలో కూడా అనుకోలేదు, ప్రస్తుతం హీరోగా ఈ స్థాయిలో ఉన్నా... వూహించని మార్పు. తెల్లవారు జామున నాలుగింటి వరకూ పార్టీల్లో మునిగితేలేవాణ్ణి, ఇప్పుడు కుటుంబాన్ని వదిలి కాలు బయట పెట్టడానికి పదిసార్లు ఆలోచిస్తున్నా... అవసరమైన మార్పు. ఎనిమిది మంది కజిన్స్‌లో నాకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటే చాలని తపించేవాణ్ణి, ఇప్పుడు కోట్లాది మంది గుండెల్లో చోటు సంపాదించుకున్నా... జీవితకాలానికి సరిపడా మార్పు. ఈ మార్పుల ప్రయాణం ముప్పయ్యేళ్ల క్రితం చెన్నైలో మొదలైంది.

అందరికంటే వెనకే
నేను కళ్లు తెరిచిందీ, పద్దెనిమిదేళ్ల వరకూ పెరిగిందీ చెన్నైలోనే. తాతగారు స్టార్‌ కమెడియన్‌, నాన్నగారు స్టార్‌ ప్రొడ్యూసర్‌, మావయ్య స్టార్‌ హీరో... ఇంత మంది స్టార్ల మధ్య పెరిగినా, నా బాల్యం చాలా మామూలుగా గడిచింది. హైదరాబాద్‌లో పెరిగుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో కానీ, చెన్నైలో మాత్రం మమ్మల్ని అక్కడ స్థిరపడ్డ అందరు తెలుగు వాళ్లలో ఒకరిగానే చూసేవారు. మా కుటుంబానికి సినిమాలకు సంబంధించి ఏదో వ్యాపారం ఉందన్న సంగతి మాత్రమే చుట్టుపక్కలవాళ్లకి తెలుసు. అంతకుమించి నాన్నగారూ, మావయ్య స్థాయి గురించిన ప్రస్తావన వచ్చేది కాదు. మేం ముగ్గురం అన్నదమ్ములం, నాన్న ఇద్దరు చెల్లెళ్ల పిల్లలు ఐదుగురు... మొత్తం ఎనిమిది మంది కజిన్స్‌ చాలా దగ్గరగా పెరిగాం. అందరం అక్కడే పద్మశేషాద్రి స్కూల్లో చదువుకున్నాం. కారులో మేమంతా కలిసి స్కూల్‌కి వెళ్తుంటే అదో మినీ బస్సులా ఉండేది. చిరంజీవిగారి పెద్దమ్మాయీ నేనూ ఒకే తరగతి. ఇద్దరికీ వయసులో నెలరోజులే తేడా. మా ఇద్దరి వ్యవహార శైలిలోనూ కొన్ని పోలికలుండేవి. దాంతో చాలామంది మేం కవలలం అనుకునేవారు. చదువులో వాళ్లందరితో పోలిస్తే నేనే చాలా వీక్‌. కష్టపడి చదివేవాణ్ణి కానీ మార్కులు మాత్రం వచ్చేవి కాదు. కొంతమందికి అలానే ఉంటుందిలే అని నాకు నేనే సర్దిచెప్పుకునేవాణ్ణి. కానీ సమస్యంతా స్కూల్లో, వీధిలో మిగతా పిల్లలతో పోల్చినప్పుడే వచ్చేది. చుట్టూ అందరూ టాపర్సే ఉండటంతో కాస్త ఒత్తిడిగా అనిపించేది.


ఫేస్‌బుక్‌ ఫ్యాన్స్‌

ఫేస్‌బుక్‌లో కోటి మంది అభిమానుల్ని సంపాదించుకున్న తొలి దక్షిణాది హీరోని నేనే కావడం నా అదృష్టం. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటక అభిమానుల వల్లే ఆ మైలురాయి సాధ్యమైంది. ‘ఆర్య’ తరవాత బెంగళూరు, కేరళ కుర్రాళ్లు నన్ను ఆదరించడం మొదలుపెట్టారు. సినిమాకైతే భాష కావాలి కానీ డాన్సులూ, ఫైట్లూ, స్టయిల్‌కి భాషతో పనిలేదు. యువత ఎక్కడైనా వాటిని ఇష్టపడుతుంది. నాలో వాళ్లకు నచ్చిన అంశాలు అవేనన్నది నా నమ్మకం. ఏదేమైనా సినిమాల మధ్యలో సామాజిక వేదికల ద్వారా అభిమానులతో టచ్‌లో ఉండటం ఆనందమే.


తెలీకుండా తొలి సినిమా

నాన్నా, మావయ్యల సినిమాలు ఎంత హిట్టయినా ఆ ప్రభావం మాకు తెలిసేది కాదు. ఎక్కువగా ప్రివ్యూ థియేటర్‌లోనే సినిమా చూసేవాళ్లం. దానివల్ల ప్రేక్షకుల మధ్య కూర్చొని కేరింతలు కొట్టే అనుభవాన్ని కోల్పోయాం. అప్పుడప్పుడూ వంద రోజుల వేడుకలూ, ఇతర ఫంక్షన్లకూ వెళ్లినప్పుడు మాత్రం ‘చిరూ మేనియా’ ఎలా ఉంటుందో అర్థమయ్యేది. అప్పట్లో మావయ్య సినిమా షూటింగ్‌లు ఎక్కువగా వూటీ, కొడైకెనాల్‌ ప్రాంతాల్లో జరిగేవి. సెలవులొస్తే కచ్చితంగా మావయ్య దగ్గరికి వెళ్లిపోయేవాణ్ణి. నాకు గుర్తుండీ మొదట ‘పసివాడి ప్రాణం’ షూటింగ్‌ చూశా. జీవితంలో తొలిసారి మంచుని చూశా కాబట్టి ఆ షూటింగ్‌ని మరిచిపోలేదు. ‘విజేత’ సినిమా షూటింగ్‌ చూడ్డానికి వెళ్తే ఓ చిన్న పిల్లోడి పాత్ర అవసరమై అప్పటికప్పుడు నాపైన కూడా ఒకట్రెండు సన్నివేశాలు తీశారు. వూహ తెలీని వయసులో అలా తొలిసినిమాలో నటించేశా.


రజనీకాంత్‌ చెప్పారు!

సారి చెన్నైలో ఓ మాల్‌కి సుకుమార్‌తో కలిసి వెళ్లా. అప్పుడక్కడ ‘రోబో’ షూటింగ్‌ జరుగుతోంది. ఆ సినిమా కెమెరామన్‌ రత్నవేలు ‘ఆర్య’ సినిమాకీ పనిచేశాడు. అతడిని కలిసి మాట్లాడాం. రజనీకాంత్‌గారిని కలవాలని ఉన్నా, మళ్లీ నేను అల్లు అరవింద్‌గారి అబ్బాయినని గుర్తు చేసి మాటలు కలపడం ఎందుకులే అనిపించి బయల్దేరా. ఇంతలో ఎవరో పరుగెత్తుకుంటూ వచ్చి ‘మిమ్మల్ని రజనీకాంత్‌గారు రమ్మంటున్నారు’ అని చెప్పారు. నేనూ సుకుమార్‌ వెళ్లి కలిశాం. నేను సినిమాలు చేస్తున్న విషయం ఆయనకు తెలుసో లేదో అనుకున్నా. కానీ ఆయన ‘సినిమాలు బాగా చేస్తున్నావయ్యా. అమ్మాయిల్లో నీకు మంచి ఫాలోయింగ్‌ ఉంది, తక్కువ సినిమాలతోనే చాలా క్రేజ్‌ సంపాదించుకున్నావు’ అనేసరికి షాకయ్యా. క్రేజ్‌కి పర్యాయపదంలా నిలిచే రజనీకాంత్‌ నా ఫాలోయింగ్‌ గురించి ప్రస్తావించడం ఎప్పటికీ మరచిపోలేను.


పదోతరగతి పాసైపోయా!

సినిమాలూ, షూటింగులూ చూస్తూ పెరిగినా ఆ రంగంలోకి వెళ్లాలన్న ఆలోచన ఏరోజూ రాలేదు. స్కూల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడ నేర్చుకోవాలన్న నిబంధన ఉండటంతో నేను జిమ్నాస్టిక్స్‌ నేర్చుకున్నా. ఖాళీ దొరికితే మావయ్య పిల్లలందరితో సరదాగా డాన్స్‌ చేయించేవాళ్లు. మిగతా వాళ్లకంటే బాగా చేయాలనే తపనతో కొంతా, జిమ్నాస్టిక్స్‌ నేర్చుకోవడంతో శరీరం ఫిట్‌గా మారడం వల్ల ఇంకొంతా డాన్స్‌ దానంతటదే వచ్చేసింది. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు కొన్నాళ్లు పియానో నేర్చుకున్నా. ఎలాగూ అత్తెసరు మార్కులే వచ్చేవి కాబట్టి భవిష్యత్తులో పియానో టీచరైనా అవ్వొచ్చనుకునేవాణ్ణి. పదో తరగతికి వచ్చేసరికి టెన్షన్‌ మొదలు. కజిన్స్‌ ర్యాంకుల కోసం పోటీ పడుతుంటే నేను పాస్‌ మార్కుల వెంట పరుగెత్తా. ఎవరూ చెప్పకపోయినా నా అంతట నేనే కష్టపడి చదివా. అనుకున్నట్లుగానే పదో తరగతి పాసయ్యా. అప్పుడు నా స్థాయికి అది చాలా పెద్ద విజయం. ఓ లక్ష్యం కోసం కష్టపడితే అదెప్పటికీ వృథాగా పోదు అనే పాఠం నాకప్పుడే అర్థమైంది.

తొలిజీతం రూ.3500
నేను ఇంటర్‌కి వచ్చేసరికి దేశంలో కంప్యూటర్‌ బూమ్‌ పెరిగింది. నాక్కూడా యానిమేషన్‌ నేర్చుకోవాలనిపించి చదువుకుంటూనే ఓ ఇన్‌స్టిట్యూట్‌లో చేరా. ఇంటర్‌ పూర్తయ్యేసరికి యానిమేషన్‌లో కొంత పట్టు వచ్చింది. భవిష్యత్తులో ఆ రంగానికి తిరుగులేదనిపించి విదేశాలకు వెళ్లి పూర్తి స్థాయిలో యానిమేషన్‌ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నా. సోమాజీగూడలో శ్రీవెన్‌ మల్టీటెక్‌ అనే యానిమేషన్‌ సంస్థలో ఆర్నెల్లు అప్రెంటీస్‌గా పనిచేశా. అప్పుడు నా జీతం రూ.3500. అదే నా తొలి సంపాదన కూడా. అక్కడే దర్శకుడు మారుతి నాకు పరిచయమమ్యారు. అప్రెంటీస్‌గా పనిచేస్తున్నప్పుడే ఓసారి ‘డాడీ’ షూటింగ్‌లో ఉన్న చిరంజీవిగారి దగ్గర నుంచి పిలుపొస్తే వెళ్లా. డాన్స్‌ నేర్చుకునే ఓ పదిహేడేళ్ల కుర్రాడితో ఒకట్రెండు సన్నివేశాలు ఆ సినిమా కోసం అవసరమైతే ఆ పాత్ర నాతో చేయించారు. సరదాగా అనిపించి నటించా కానీ తరవాత ఆ సినిమా గురించి మరచిపోయా. కొన్నాళ్లకు కెనడా వెళ్లి యానిమేషన్‌ కోర్సు నేర్చుకుందామని అప్లికేషన్‌ పెట్టా.

మొదటి సినిమా ఆగిపోయింది!
కెనడా వెళ్తే యానిమేటర్‌గా భవిష్యత్తు దాదాపు ఖాయమైనట్టే. ఈలోపు సరదాగా ఓ సినిమా చేస్తే జీవితాంతం గుర్తుండిపోతుంది కదా అనిపించింది. తెలిసిన వాళ్ల ద్వారా ఆ అవకాశం కూడా వచ్చింది. మూడు నెలల్లో సినిమా పూర్తిచేసి కెనడా వెళ్లిపోవచ్చు అనుకున్నా. కానీ ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్టు మొదలుకాకముందే ఆగిపోయింది. తొలి సినిమా అలా ముగిసిపోవడం నచ్చలేదు. అప్పట్నుంచే సినిమాల గురించి సీరియస్‌గా ఆలోచించడం మొదలుపెట్టా. ‘యానిమేటర్‌గా కెరీర్‌ ప్రారంభిస్తే నేనో స్థాయికి రావడానికి కనీసం ఇరవయ్యేళ్లు పడుతుంది. సినిమాల్లో తాతయ్యా, నాన్నా కష్టపడి ఒక మార్గం సిద్ధం చేశారు. దాన్ని దాటుకొని వేరే రంగంలోకి వెళ్లడం కరెక్టు కాదేమో, ముందు ఓ సినిమా చేద్దాం, క్లిక్‌ అవకపోతే అప్పుడు ఆలోచిద్దాం’ అని నాకు నేనే సర్దిచెప్పుకున్నా. అదే విషయం నాన్నకు చెప్పా. ఆయన ముంబైలో కిశోర్‌ నమిత్‌కపూర్‌ యాక్టింగ్‌ స్కూల్‌కి పంపించారు. జనవరి నుంచి మే వరకూ కోర్సు చేసొస్తే, జూన్‌లో ‘గంగోత్రి’ అవకాశం వచ్చింది. అప్పటికే నాన్నా, అశ్వినీదత్‌, రాఘవేంద్రరావుగార్ల మధ్య ఆ సినిమా చర్చ జరుగుతోంది. చిరంజీవిగారికి కూడా కథ నచ్చింది. ‘కచ్చితంగా బన్నీ చేయాలి, వందో సినిమా కాబట్టి ఎలాగైనా రాఘవేంద్రరావుగారే హిట్‌ చేసుకుంటారు’ అని సరదాగా మావయ్య అనేవారు. అలా పద్దెనిమిదేళ్ల వయసులో నా తొలిసినిమా, దర్శకుడి వందో సినిమా ‘గంగోత్రి’ మొదలైంది.


అందుకే... స్నేహ!

స్నేహతో పరిచయం, ప్రేమా, పెళ్లీ నా జీవితాన్ని సగం మార్చాయి. మా అబ్బాయి అయాన్‌ పుట్టుక నా జీవన శైలిని పూర్తిగా మార్చేసింది. స్నేహ నాకు కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా పరిచయం. తొలిచూపులోనే ఆమెలోని హుందాతనం నచ్చింది. ఏ పని ఎంత వరకూ చేయాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో తనకు బాగా తెలుసు. పెళ్లికి ముందు వరకూ జెట్‌ స్పీడ్‌లో దూసుకెళ్లేవాణ్ణి. కానీ తన రాకతో నా వేగానికి కాస్త బ్రేకులు పడ్డాయి. వ్యక్తిగత విషయాలకు సంబంధించి తను చాలా సలహాలిస్తుంటుంది. సినిమాల విషయంలో మాత్రం అస్సలు కల్పించుకోదు. ఇక అయాన్‌... మొదట ఓ ఐదారు నెలలు వాడిని ఎత్తుకోవాలంటే భయమేసేది. వాడి మెడ కాస్త గట్టిపడ్డాక, పాకడం నేర్చుకున్నాక వాడితో ఆడుకోవడం మొదలుపెట్టా. రెండు వారాల క్రితమే వాడికి రెండేళ్లొచ్చాయి. వాడి వయసుతో పాటే నా బాధ్యతా పెరుగుతోంది.


అంచనాలు మించిన ‘ఆర్య’
‘గంగోత్రి’ చేస్తున్నప్పుడు రాఘవేంద్రరావుగారు యాక్షన్‌ అనకముందే డైలాగులు చెప్పేవాణ్ణి. కెమెరామన్‌ వచ్చి చెప్పే వరకూ హీరో అంటే ఎండ తగలకుండా గొడుగు పెట్టుకోవాలన్న విషయం కూడా తెలీదు. రాఘవేంద్రరావుగారి వల్ల నాలుగైదు టేకులకే షాట్‌ ఓకే అయ్యేది. హమ్మయ్య... నాకు నటించడం వచ్చేసిందని మురిసిపోయేవాణ్ణి. కానీ రెండో సినిమా ‘ఆర్య’తో నటనలో నా స్థాయేంటో అర్థమైంది. అందులో కొన్ని సన్నివేశాలకు ముప్ఫయ్‌ టేకులు కూడా పట్టేవి. నిజానికి రెండున్నర కోట్లలో ఆ సినిమా పూర్తి చేయాలని అనుకున్నాం. కానీ బడ్జెట్‌ నాలుగు కోట్లు దాటింది. కనీసం ఆరు కోట్లు వ్యాపారం చేసినా చాలనుకున్నా. అంచనాలకు అందని రీతిలో పద్దెనిమిది కోట్లు వసూలు చేసింది. ఆ సినిమా... ప్రేమ కథల్లో ఓ కొత్త ట్రెండ్‌కు పునాది వేసింది. నేను పరిశ్రమలో కొనసాగొచ్చనే భరోసానిచ్చింది


నా కుటుంబం

నాకు వూహ తెలిసినప్పట్నుంచీ నాన్న బిజీగానే ఉండేవారు. దాంతో అమ్మకే చాలా దగ్గరయ్యా. ఇంటర్‌ వరకూ ఏ చిన్న విషయమైనా తనతో పంచుకునేవాణ్ణి. నన్ను అన్ని విషయాల్లో బాగా ప్రభావితం చేసిన వ్యక్తి నాన్న. గడప దగ్గరే సినిమాని వదిలి వచ్చేవారు. ఆయన నోటి నుంచి ‘ఇంత కష్టపడ్డా’ అనే మాట నేనెప్పుడూ వినలేదు. కానీ ఆయనెంత కష్టపడ్డారో నాకు తెలుసు. వ్యక్తిగతంగా, వృత్తి పరంగా అన్ని విషయాల్లో ఆయనే నాకు స్ఫూర్తి. తమ్ముడు శిరీష్‌ నేనూ పద్దెనిమిదేళ్ల పాటు ఒకే గదిలో ఉంటూ పెరిగాం. తనతో నేను ఎక్కువగా సమకాలీన అంశాల గురించి మాట్లాడతా. అన్నయ్య వెంకటేష్‌ వయసులో నాకంటే చాలా పెద్ద. మాతో ఆయన మాటలూ, వ్యవహార శైలీ కాస్త పెద్దరికంగానే ఉంటాయి. ఇంట్లో అందరూ నన్ను బన్నీ అనే పిలుస్తారు. ఇప్పుడు బయట కూడా అందరికీ అదే అలవాటైంది.


స్టార్‌నని అప్పుడు తెలిసింది
‘ఆర్య’ విడుదలయ్యాక ఓసారి ఏదో పనిమీద చెన్నై వెళ్లా. ఎయిర్‌పోర్టులో ఓ ఐదొందల మంది స్కూలు పిల్లలు ఎవరికో స్వాగతం పలకడానికి లైన్లో నిల్చొని ఉన్నారు. అంతమంది లోపలికి ఎలా వచ్చారా అని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డా. ఇంతలో ఒకమ్మాయి తన ఫ్రెండ్‌కి చెవిలో ఏదో చెప్పింది. క్షణాల్లో ఒకరికొకరు నన్ను చూపించుకుంటూ ఏదో చెప్పుకున్నారు. ఉన్నట్టుండీ అందరూ కలిసి ‘ఆర్య’ అని అరుస్తూ నా వైపు పరుగెత్తారు. అక్కడున్న సెక్యూరిటీకి విషయం అర్థం కాక నేనే ఏదో చేశాననుకొని నన్ను చుట్టుముట్టేశారు. వాళ్లంతా చెన్నైలోని తెలుగు స్కూల్లో చదువుతున్న పిల్లలని తరవాత తెలిసింది. సెక్యూరిటీ కూడా విషయం తెలుసుకొని నటులు ఇలా మామూలుగా తిరక్కూడదని చెప్పి పంపించారు. జీవితంలో తొలిసారి నేనో స్టార్‌నని అనిపించిన సందర్భం అదే. ‘ఆర్య’ తరవాత వరసగా అవకాశాలు వచ్చేస్తాయి అనుకున్నా. ఎందుకో తెలీదు కానీ ఆర్నెల్ల వరకూ ఒక్కరు కూడా నన్ను సినిమా చేయమని అడగలేదు. ఎందుకు రావట్లేదన్న ఆశ్చర్యం, ఎంతకీ రావట్లేదన్న నిరాశా బాగా వేధించాయి. చివరికి వినాయక్‌గారు నాతో సినిమా తీయడానికి ఆసక్తి చూపించడంతో ‘బన్నీ’ మొదలైంది. ఆ సినిమా విజయం నేను ‘వన్‌టైం వండర్‌’ని కాదని రుజువు చేసింది.


అలా చేయడం నచ్చట్లేదు

చిరంజీవిగారి పేరు చెప్పగానే బ్లడ్‌ బ్యాంక్‌, అమలగారి పేరు చెప్పగానే బ్లూక్రాస్‌ గుర్తొచ్చినట్టే అల్లు అర్జున్‌ పేరు చెప్పగానే ఏదో ఒక రంగంలో నేను వేసిన ముద్ర గుర్తురావాలి. ఇప్పటికే దానికోసం ఓ రంగంలో గ్రౌండ్‌వర్క్‌ చేస్తున్నా.

జీవితంలో నన్ను చాలా ప్రభావితం చేసిన వ్యక్తి చిరంజీవిగారు. ఓ సాధారణ వ్యక్తిగా, సూపర్‌ హీరోగా ఆయనలో రెండు కోణాలు దగ్గరగా చూశా. మొదట్లో నా కథలు ఆయనా వినేవారు. చాలా రోజుల తరవాత ‘సరైనోడు’ కథ విన్నారు.

* కజిన్స్‌ అందర్లోకీ చరణ్‌ క్లోజ్‌. సినిమాలు తప్ప మిగతా అన్ని విషయాలూ మాట్లాడుకుంటాం. నా గురించి ఏదైనా నిర్మొహమాటంగా చెప్పే తొలి వ్యక్తి అతడే. ఓపిక ఎక్కువ. నేను మా అబ్బాయిని పదినిమిషాలకు మించి ఆడించలేనేమో. కానీ చెర్రీ గంటసేపైనా విసుగులేకుండా ఆడిస్తాడు.

* చెన్నైలో ఉన్నప్పట్నుంచీ నాకు స్టయిల్‌గా కనిపించడం అలవాటు. మైకెల్‌ జాక్సన్‌ లాంటివాళ్ల మ్యూజిక్‌ వీడియోలూ ఎక్కువగా చూసేవాణ్ణి. వాటి ప్రభావం నా దుస్తుల ఎంపికలో స్పష్టంగా కనిపిస్తుంది. సినిమాల కోసమనే కాదు, ఇంట్లో ఉన్నా ట్రెండీగా కనిపించడానికే ఇష్టపడతా.

* పర్సనాలిటీ డవలప్‌మెంట్‌, కరప్షన్‌, పెళ్లి... ఇలా భిన్నమైన అంశాలకు సంబంధించిన పుస్తకాలను చదువుతుంటా. ఇంటీరియర్‌ డిజైనింగ్‌ అంటే ఆసక్తి. ఫొటోగ్రఫీపైనా పట్టుంది.

* సెవనప్‌, ఓఎల్‌ఎక్స్‌, కోల్‌గేట్‌ లాంటి కొన్ని ప్రకటనల్లో నటించా. నా తత్వానికి దగ్గరగా ఉండే బ్రాండ్ల ప్రచారానికే ఇష్టపడతా తప్ప నాకు తెలీనీ, నేను ఉపయోగించని వాటి గురించి మాట్లాడటం ఇష్టముండదు.

* ‘టెర్రరిజం’, ‘రేప్‌’... ఈ మధ్య కాలంలో నన్ను కలవరపెడుతున్న పదాలివి. వాటికి వ్యతిరేకంగా నావంతుగా ఏదైనా చేయాలని అనిపిస్తుంటుంది. టీవీ చానెళ్లలో పేరొందిన రాజకీయ నాయకులను కార్టూన్లుగా, బఫూన్లుగా చూపించి జోకులు వేయడం కూడా అస్సలు నచ్చదు.

‘రేసుగుర్రం’లో ‘దేవుడా’, ‘రుద్రమదేవి’లో ‘గమ్మునుండవాయ్‌’ లాంటి పదాలు నేను పలికిన విధానం ద్వారా చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ‘దేవుడా’ పదం కాస్త భిన్నంగా ఉంటుందని నేనే అలా పలికేవాణ్ణి. రాష్ట్ర విభజనకు ముందు కేసీఆర్‌గారి ప్రసంగాలను చూసేవాణ్ణి. వాటిలో ఆయన ఎక్కువగా ‘గమ్మునుండవాయ్‌’ అని అంటుండేవారు. ‘రుద్రమదేవి’లో నా వూతపదానికి ఆయనే స్ఫూర్తి.

* నాకు ఓ పదివేల కోట్ల ఆస్తున్నా, అట్టర్‌ ఫ్లాప్‌ హీరో అన్న పేరుంటే ఆ డబ్బుకీ, నాకూ విలువలేదు. అందుకే సినిమాలో నా మొదటి ప్రాధాన్యం పేరుకే. ఓ మూడేళ్ల క్రితం వరకూ నా పారితోషికం గురించి కూడా పెద్దగా ఆలోచించేవాణ్ణి కాదు. కానీ ఆర్థిక క్రమశిక్షణ జీవితానికి చాలా అవసరమనిపించి ఈ మధ్య ఆ విషయంపైనా దృష్టి పెడుతున్నా.


ప్రణాళికలు వేసుకోను
‘బన్నీ’ తరవాత ఓ యూత్‌ఫుల్‌ సినిమా చేయాలనిపించి ‘హ్యాపీ’ చేశా. ఏదైనా కొత్తగా ప్రయత్నిద్దాం అనిపించి ‘దేశముదురు’ కోసం జుట్టు పెంచడంతో పాటు తొలిసారి టాలీవుడ్‌కి ‘సిక్స్‌ ప్యాక్‌’ బాడీని పరిచయం చేశా. మరో కుటుంబ కథా చిత్రం చేయాలనిపించి ‘పరుగు’, భిన్నమైన పాత్రలో కనిపించాలని ‘ఆర్య2’, మంచి కథ కాబట్టి పూర్తి స్థాయి పాత్ర కాకపోయినా ఫర్వాలేదనిపించి ‘వేదం’, తరవాత ‘జులాయి’, ‘రేసుగుర్రం’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘రుద్రమదేవి’... ఇలా పదమూడేళ్లలో పదిహేను సినిమాలు చేశా. ‘సరైనోడు’ నా పదహారో చిత్రం. పూర్తిగా మాస్‌ ప్రేక్షకుల కోసం నేనెప్పుడూ సినిమా చేయలేదు. ఆ లోటుని ఈ చిత్రం భర్తీ చేస్తుంది. కెరీర్‌ ఇలానే ఉండాలీ అంటూ ఏ రోజూ ప్రణాళిక వేసుకోలేదు. నా సినిమాల్లోంచి ఒక్క ఫొటో చూసినా చాలు, అది ఏ సినిమాలోదో ప్రేక్షకులు చెప్పేయగలగాలి. ఆ ఒక్క లక్ష్యంతో పనిచేస్తూ వచ్చా. ‘వేదం’, ‘రుద్రమదేవి’... ఈ రెండూ నాకు కాస్త ప్రత్యేకం. ‘వేదం’లో పాత్ర నచ్చి నేనే కావాలని ఆ సినిమాలో నటించా. ‘రుద్రమదేవి’ మన చరిత్రను తెలిపే సినిమా. డబ్బుల్లేక ఆ సినిమా షూటింగ్‌ వాయిదా పడుతూ వచ్చింది. అలాంటి సినిమా కోసం నా వంతుగా ఏదైనా చేయాలనిపించి పారితోషికం తీసుకోకుండా నటించా. ఆ సినిమా, నా పాత్రా ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

సినిమాలకు సంబంధించి ప్రణాళికలు లేకపోయినా, జీవితంలో మాత్రం కొన్ని లక్ష్యాలున్నాయి. ఒకటి... దక్షిణాదిలో ఓ ఐకానిక్‌ హీరోగా మారాలి. రెండు... ప్రభుత్వం నుంచి ఏదైనా మంచి గుర్తింపు ఉన్న అవార్డు అందుకోవాలి. మూడు... ట్రెండ్‌ బ్రేకింగ్‌ సినిమాలు కనీసం ఒక ఐదు చేయాలి. నాలుగు... ప్రతి సంవత్సరం ఇచ్చే రకరకాల పురస్కారాల్లో నా సినిమా ముద్ర కూడా కనిపించాలి. ఐదు... ఏదైనా ఓ రంగంలో సేవా సంస్థను ఏర్పాటు చేసి దానికి ఐరాస లాంటి అంతర్జాతీయ సంస్థల గుర్తింపు తీసుకురావాలి. చాలా ఏళ్లుగా నా ఆలోచనలూ, అడుగులూ ఆ వైపే సాగుతున్నాయి.

కష్టపడి సంపాదించిన వంద రూపాయల్నీ, జీవితంలో విలువైన మూడు గంటల సమయాన్నీ కొన్ని లక్షల మంది ప్రేక్షకులు నాకోసం ఖర్చు చేస్తున్నారు. ఆ డబ్బునీ, వాళ్ల సమయాన్నీ వృథా చేశానన్న పేరు నాకు రాకూడదంటే కచ్చితంగా మంచి సినిమాలే చేయాలి. ఆ ఆలోచనే ఇన్నాళ్లూ నన్ను నడిపించింది. ఇకపైనా నడిపిస్తుంది.

- శరత్‌ కుమార్‌ బెహరా

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.