close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మీరూ కావచ్చు... ఆరోగ్య విజేత!

మీరూ కావచ్చు... ఆరోగ్య విజేత!

మీరు - అంటే మీ అలవాట్లే. మీరు ఆరోగ్యంగా ఉన్నారంటే మీకు ఆరోగ్యకరమైన అలవాట్లు ఉన్నట్టే. మీ ఆరోగ్యం గాడితప్పిందంటే మీ అలవాట్లూ పక్కదారిపట్టాయని అర్థం. పరిపూర్ణ ఆరోగ్యవంతుల అలవాట్లనూ ఆలోచనా విధానాలనూ అర్థంచేసుకుంటే, జీవితంలో భాగం చేసుకోగలిగితే ఎవరైనా కావచ్చు ఆరోగ్య విజేత.

శావాదం, భవిష్యత్తు పట్ల స్పష్టత, శక్తిసామర్థ్యాల మీద నమ్మకం, ఎదుటి వ్యక్తుల్ని అంచనా వేసే శక్తి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి.http://archives.eenadu.net/04-10-2016/Magzines/10cover1b.jpg
- ‘సెవెన్‌ హ్యాబిట్స్‌ ఆఫ్‌...’ రచయిత స్టీఫెన్‌ కవే వివరించిన ప్రభావశీల వ్యక్తుల గుణగణాల్లో కొన్ని.

పెట్టుబడుల విషయంలో ఉద్వేగాలుండవు, ప్రమాదకరమైన రిస్క్‌ తీసుకోరు, ప్రతి పైసానూ గౌరవిస్తారు, మంద మనస్తత్వంతో కొనుగోళ్లు చేయరు.
- ‘రిచ్‌డాడ్‌; పూర్‌డాడ్‌’ రచయిత రాబర్ట్‌ కియోసాకీ ఆర్థిక విజేతల్లో గుర్తించిన ప్రత్యేకతల్లో మచ్చుకు నాలుగైదు.

ఆర్థికంగా ఘన విజయం సాధించినవారు - ఆర్థిక విజేత. వృత్తి ఉద్యోగాల్లో అత్యున్నత స్థానానికి చేరినవారు - కెరీర్‌ విజేత. ఈ రెండు విజయాల్నీ శాసించగలిగేంత శక్తిమంతమైంది - ఆరోగ్య విజయం. ఆ ఇద్దరికంటే కూడా, ఆరోగ్య విజేతే అసలు సిసలు విజేత. ఆ ఇద్దరికీ ఉన్నట్టే, ఆరోగ్య విజేతకూ కొన్ని ప్రత్యేక అలవాట్లు ఉంటాయి. అతడి ఆలోచనా ధోరణిలో ఎంతోకొంత వైవిధ్యం కనిపిస్తుంది.

మనుషుల్ని వర్గీకరించాల్సి వస్తే, ఆర్థిక కోణం నుంచే చూస్తాం. సంపన్నులూ-పేదలూ అనే విభజిస్తాం. ఉన్నవారికీ లేనివారికీ మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయనే ఆందోళన చెందుతాం. నిజానికి, సమాజాన్ని ఆరోగ్య కోణంలోంచీ విభజించాలి. ఆరోగ్యవంతులకూ అనారోగ్యవంతులకూ మధ్య తెలియని ఓ అగాథం ఏర్పడుతోంది. దాన్నే ‘హెల్త్‌ గ్యాప్‌’ అంటున్నారు నిపుణులు. ఆరోగ్యపరమైన సమస్య...క్రమంగా ఆర్థిక సమస్యగా మారిపోతుంది. అదెలా అంటే, ముందు ఓ మనిషి ఆరోగ్యపరంగా దెబ్బతింటాడు. దీంతో మందుల బిల్లులూ, డాక్టర్ల ఫీజులూ, శస్త్రచికిత్సల ఖర్చులూ తడిసి మోపెడవుతాయి. అలా అతడు ఆర్థికంగా దెబ్బతింటాడు.

http://archives.eenadu.net/04-10-2016/Magzines/10cover1a.jpg

ఒకవైపు ఆరోగ్య సమస్యలు.
మరోవైపు ఆర్థిక సమస్యలు.
ఆ జంటపోట్ల దెబ్బకి బుర్ర పనిచేయడం మానేస్తుంది. ఏకాగ్రత లోపిస్తుంది. పన్లో తప్పులు జరుగుతాయి. కొత్తగా ఆలోచించే ఓపిక ఉండదు. వరుసగా సెలవులు పెట్టక తప్పని పరిస్థితి. వీటన్నిటి కారణంగా వృత్తి ఉద్యోగాల పరుగులో వెనుకబడిపోతాడు. మూడోవైపు నుంచీ..కెరీర్‌ సమస్యలు మొదలు.

అంటే, జీవితంలో పరిపూర్ణ విజేతగా నిలవాలంటే ఆరోగ్యమే మొదటి మెట్టు. నిజంగానే తొలి మెట్టే! సంపాదన అనే మెట్టు ఎక్కాకో, కెరీర్‌ సోపానాన్ని అధిరోహించాకో...తీరిగ్గా ఆరోగ్య భాగ్యాన్ని సంపాదించు కోవచ్చుగా! - అనుకోవడమూ సరికాదు. ఆర్థిక విజేతలంతా ఆరోగ్య విజేతలు కాలేరు.అంటే, ఆర్థిక సంపన్నుడు కూడా ఆరోగ్యం విషయంలో పరమదరిద్రుడు కావచ్చు. ఒక్క సంతకంతో వంద జీవితాల్ని శాసించే అధికారి, తన శరీరం మీద తనకు నియంత్రణలేని దుర్బలుడు కావచ్చు. డబ్బు సంపాదించడమే పరిపూర్ణ విజయం కాదు, కెరీర్‌లో ఉన్నత స్థానాలకు చేరుకోవడంతోనే గెలుపు ద్వారాలు తెరుచుకున్నట్టు కాదు.

సంపద + ఆరోగ్యం, కెరీర్‌ + ఆరోగ్యం
...ఇలా దేనికైనా ఆరోగ్యం తోడవ్వాలి.
ఆరోగ్యమేం భాగ్యలక్ష్మి బంపర్‌ లాటరీ కాదు. ఎవర్ని పడితే వాళ్లను వరించడానికి. యాదృచ్ఛిక ఆరోగ్యవంతులూ యాదృచ్ఛిక అనారోగ్యవంతులూ ఉండరు. ఆరోగ్యంగా ఉండాలనుకునేవారూ, ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించేవారూ మాత్రమే ఆరోగ్యంగా ఉంటారు, అంతిమంగా ఆరోగ్య విజేతలు అనిపించుకుంటారు.


మొహమాటమే ఉండదు!

http://archives.eenadu.net/04-10-2016/Magzines/10cover1c.jpg

‘ఓ ఐదువేలు కావాల్రా, ఫస్టుకు ఇచ్చేస్తాలే?’ అని మిత్రుడు అడగ్గానే, మొహమాటపడిపోయి వెంటనే సర్దేస్తాడు. ‘చేతిలో బోలెడంత పనుంది సార్‌, ఈ నాలుగు ఫైళ్లూ చూసిపెట్టరూ?’ అని సహోద్యోగి బతిమాలగానే, కిమ్మనకుండా సీట్లో సర్దుకు కూర్చుంటాడు. కానీ...‘అల్లుడుగారూ! ఇంకో లడ్డూ వేసుకోండి’ అంటూ అత్తగారు కొసరికొసరి వడ్డించినా కచ్చితంగా కాదనేస్తాడు. ‘వేడివేడి అన్నంలోకి కొత్తావకాయ కలుపుకోవచ్చుగా’ అని శ్రీమతి గోము చేసినా నిర్మొహమాటంగా వద్దనేస్తాడు. ‘ఏం ఫర్వాలేదు బ్రదర్‌. ఓ పెగ్గు వేసుకో’ అని దోస్తులు పీకపట్టుకుని బెదిరించినా చెదరడూ బెదరడూ! ఆరోగ్య విజేత తిండి విషయంలో, అలవాట్ల విషయంలో మొహమాటాలకు తావివ్వడు. ఏ క్లైంటునో కలవడానికి వెళ్లినప్పుడు చాయ్‌ ఆఫరు చేసినా సుతిమెత్తగా వద్దనేస్తాడు. అయినా, ఒత్తిడి చేస్తే ‘సర్‌! నేను రోజుకు ఎనిమిది నుంచి పదిమంది క్లైంట్లను కలుస్తాను. దాదాపుగా అందరూ టీ ఆఫరు చేస్తారు. తేరగా వచ్చిందని తాగాననుకోండి...వేడివేడిగా గొంతులో దిగిపోతుంటే హాయిగానే అనిపిస్తుంది. కప్పు టీలో అరకప్పు చిక్కని పాలు ఉంటాయి, రెండు చెంచాల చక్కెర ఉంటుంది. ఆ ప్రకారం, ఎంతలేదన్నా యాభై కెలోరీలు. ఎనిమిది కప్పులకు నాలుగు వందల కెలోరీలు. ఆదివారాలూ సెలవురోజులూ మినహాయిస్తే...నెలకు పదివేల కెలోరీలు! ఆ అదనపు శక్తిని ఎలా కరిగించుకోవాలో మీరే చెప్పండి’ అని సుతిమెత్తగా సమాధానం ఇస్తాడు. ఒక కిలో బరువు పెరగడానికి ఏడువేల కెలోరీలు సరిపోతాయి. అంటే, ఒక్క టీ అలవాటుతోనే నెలకు ఒకటిన్నర కిలోల మూట నెత్తిన పడిపోతుంది. ఆ బరువును దించుకోడానికి ఎంత కష్టపడాలీ! ‘అంత రిస్కు అవసరమా?’ అంటాడు ఆరోగ్య విజేత. నిజమే, కాఫీలూ టీలూ వద్దంటే పోయేదేం లేదు, పిడికెడు కెలోరీలు తప్ప!

http://archives.eenadu.net/04-10-2016/Magzines/10cover1d.jpg


‘మైండ్‌ మ్యాపింగ్‌’ మహామంత్రం

http://archives.eenadu.net/04-10-2016/Magzines/10cover1e.jpg

రంలేని నాలుకదేముంది, ఎటైనా తిరుగుతుంది. ఎన్ని విన్యాసాలైనా చేస్తుంది. కమ్మని రుచుల్ని తలుచుకోగానే తడితడైపోతుంది. ఇష్టమైన వంటకం కనిపించగానే ఇరగదీయమని ఆర్డరేస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం నుంచి అనారోగ్యకరమైన తిండివైపు ప్లేటు ఫిరాయించేస్తుంది. అంతే, పళ్లెం నిండా వడ్డించుకుని పకపకా నమిలేస్తాం. ఆ కుట్రలో కంటికీ ముక్కుకూ కూడా వాటా ఉంది. జిలేబీ పిండిలో చిలకరించిన కేసరి రంగు కళ్లు తిప్పుకోనివ్వదు. చికెన్‌ బిర్యానీలో గుప్పించిన డబుల్‌మసాలా ముక్కుపుటాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ‘ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య విజేత ఎలా స్పందిస్తారు? ’ అన్న ప్రశ్నకు పరిశోధకులకు జవాబు దొరికింది. చికెన్‌ అనగానే...మనందరికీ ఎర్రగా కాలిన కోడికాలు గుర్తుకొస్తుంది. ఐస్‌క్రీమ్‌ అనగానే చల్లచల్లగా తీయతీయగా నోట్లోకి జారిపోయే సుతిమెత్తని పదార్థమేదో కళ్లముందు మెదుల్తుంది. ఆరోగ్య విజేత ‘మైండ్‌ మ్యాప్‌’ మాత్రం మరోలా ఉంటుంది. మనం సినిమా థియేటర్లో కాలక్షేపానికి తినిపడేసే ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ను తలుచుకోగానే విజేత బుర్రలో ‘100’ మెరుస్తుంది. అదేం కోహ్లీ తాజా స్కోరు కాదు. ఫ్రెంచిఫ్రైస్‌ కెలోరీల విలువ. ఏ సహోద్యోగో వచ్చి ‘ప్రమోషన్‌ వచ్చిందండీ!’ అంటూ మిఠాయి డబ్బా ముందుపెట్టగానే, మనమైతే పెద్ద పీసు ఏదా అని చూస్తాం. ఆరోగ్య విజేత ఆ వూరింపులకు లొంగకుండా, ‘కనీసం రెండొందల యాభై’ అనుకుంటారు. అది కిలో మిఠాయి ధర కాదు, ఒక్కో ముక్కలోని కెలోరీల పరిమాణం. ఎవరికైనా పిజ్జా అనగానే బన్ను ముక్కల మధ్య రకరకాల పదార్థాల్ని కుక్కేసిన ‘కలర్‌ఫుల్‌ పిక్చర్‌’ కనిపిస్తుంది. ఆరోగ్య విజేత మాత్రం...ఆ బలిసిన బన్ను ఆకారంలో వూబకాయుడి విశ్వరూపాన్ని చూస్తారు. ఆహార పదార్థాన్ని ఆహారపదార్థంలా కాకుండా, దాని అంతర్‌ రూపాన్ని దర్శించడం ఆరోగ్యవీరుల ప్రత్యేకత. లోపలేముందో ఆలోచించకుండా లోనికి తోసేసుకుంటే...పొట్టకూ చెత్తబుట్టకూ తేడా ఏం ఉంటుంది?


భావోద్వేగాలకు బహుదూరం

http://archives.eenadu.net/04-10-2016/Magzines/10cover1f.jpg

బాధల భోషాణం ... వూబకాయానికి మూడు ప్రధాన కారణాలు. ఒకటి, వ్యాయామం లేకపోవడం. రెండు, జంకూ గొంకూ లేకుండా తినే జంక్‌ఫుడ్‌. మూడోదీ ప్రధానమైందీ...ఆహారంతో భావోద్వేగ అనుబంధం. ఆహార లక్ష్యం...తాత్కాలికంగా అయితే శక్తినివ్వడం, దీర్ఘకాలికంగా అయితే పోషక విలువలు అందించడం. అంతే, అంతకు మించి ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. కానీ మనం తిండికి అర్థంలేని ప్రాధాన్యం ఇస్తాం. రుచుల కోసం వెంపర్లాడతాం, జిహ్వచాపల్యం తీర్చుకోడానికి జీవితాల్నే పణంగా పెడతాం.

తిండియావ తెలివైన శత్రువు. మనసు బలహీనపడేకొద్దీ మరింత బలపడుతుంది. కొన్నిసార్లు మన వైఫల్యాల్నీ బాధల్నీ తాత్కాలికంగా మరచిపోడానికి, మనసును తిండి మీదికి మళ్లించుకుంటాం. అదోరకమైన పలాయనవాదం. తిండి వేరు, ఒత్తిడి వేరు. తిండి వేరు, ఆనందం వేరు. తిండి వేరు, కాలక్షేపం వేరు. తిండి వేరు, అతిథి మర్యాదలు వేరు. ప్రతిదానికీ తిండితో ముడిపెడితే మిగిలేది బరువు బండే! ఆ విషయంలో ఆరోగ్య విజేతకు చాలా స్పష్టత ఉంటుంది. అతడి దృష్టిలో భోజనం పూర్తిగా వ్యక్తిగతం. తిండి విషయంలో మనసు మాట వినడు. బుద్ధి చెప్పినట్టే నడుచుకుంటాడు. మనసు నోటికి ఏది రుచిగా ఉంటుందో చెబుతుంది. బుద్ధి శరీరానికి ఏది మంచిదో బోధిస్తుంది. వూబకాయులంతా దాదాపుగా మనసు వలలో పడినవాళ్లే. ఉద్వేగపరమైన ఆకలి హఠాత్తుగా పుట్టి హఠాత్తుగా మాయం అవుతుంది. ఆ నిమిషానికి గుండె దిటవు చేసుకుంటే, ఒడ్డున పడ్డట్టే. ఆ స్థితప్రజ్ఞత ఆరోగ్య విజేతలో అపారం.


తిరుగులేని జీవనశైలి

http://archives.eenadu.net/04-10-2016/Magzines/10cover1g.jpg

రోగ్య విజేత దినచర్య తెల్లవారుజామునే మొదలైపోతుంది. జాగింగ్‌, వాకింగ్‌, టెన్నిస్‌ ...కనీసం ఓ గంట ఏదో ఓ మంచి వ్యాపకానికి కేటాయిస్తారు. ఆ సమయం కేవలం తనకోసమే. ఆటలోని ఆనందాన్ని అనుభవిస్తారు. నడకలోని ఏకాంతాన్ని ఆస్వాదిస్తారు. వినాలనిపిస్తే సంగీతం వింటారు. నెమరేసుకోవాలనిపిస్తే జ్ఞాపకాల్ని నెమరేసుకుంటారు. తెలతెలవారుతున్న దృశ్యాన్ని చూస్తూ, పక్షుల కిలకిలరావాల్ని వింటూ, స్వచ్ఛమైన గాలిని గుండెనిండా పీల్చుకుంటూ అడుగులు ముందుకేస్తారు. ఒకటిరెండు అంతస్తులున్నప్పుడు...లిఫ్టు కోసం ఎదురుచూడరు. అరకిలోమీటరో పావుకిలోమీటరో వెళ్లాల్సి వచ్చినప్పుడు వాహనం బయటికి తీయరు. బ్రేక్‌ఫాస్ట్‌ చేశాకే గడప దాటతారు. వేళకి భోంచేస్తారు. కంటినిండా నిద్రపోతారు. ఆఫీసులో ఫైలు అందుకోడానికి సహాయకుడిని పిలవరు, ఇంట్లో మంచినీళ్ల కోసం ఇంకెవర్నో కేకేయరు. బరువును నియంత్రణలో ఉంచుకుంటారు. బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ) అనే లక్ష్మణరేఖను అధిగమించరు. ఎప్పుడైనా ఓ కిలోనో అరకిలోనో పెరిగినట్టు తేలినా గాభరా పడిపోరు. బెంగపెట్టుకుని తిండి మానేయరు. భోజన విధానంలో తేడాలేమైనా ఉంటే సరిచేసుకుంటారు. నెలకో రెండు నెలలకో బరువు అదే సర్దుకుంటుంది. పుట్టినరోజునాడు పొద్దున్నే గుడికి వెళ్లినా వెళ్లకపోయినా...కుటుంబ వైద్యుడిని మాత్రం సంప్రదిస్తారు. ముఖ్యమైన వైద్య పరీక్షలన్నీ చేయించుకుంటారు. ఆ నివేదికల ఆధారంగా ఆరోగ్య ప్రణాళిక రచించుకుంటారు. దురలవాట్లను దరిదాపుల్లోకి కూడా రానివ్వరు.


మనసారా ఆరగింపులు

http://archives.eenadu.net/04-10-2016/Magzines/10cover1j.jpg

రోగ్య విజేత పళ్లెంలో ఏం ఉంటాయి? - అని ఎవరైనా అడిగితే కాసిన్ని మొలకలూ, కాస్తంత గోధుమగడ్డి, ఒకట్రెండు పచ్చి కాకరకాయలు, చిన్న గిన్నెలో తురిమిన క్యారెట్‌ ... ఇలాంటి పదార్థాలేవో ఉంటాయని పళ్లికిలిస్తూ చెబుతాం. కానే కాదు, ఏ పరిపూర్ణ ఆరోగ్యవంతుడూ రుచీపచీలేని తిండితో రోజులు నెట్టుకురాలేడు. కడుపు కాల్చుకుని శరీరాన్ని హింసించుకోడు. వడలూ, పూరీలూ, గులాబ్‌జామ్‌లూ...నచ్చినవన్నీ రుచి చూస్తాడు. నిజంగానే ‘రుచి’ చూస్తాడు. మనందర్లా కడుపులో కుక్కేసుకోడు. ఎందుకంటే, నాలుక మీద పదివేల దాకా రుచికి సంబంధించిన గ్రంథులు ఉంటాయి. ఒకటో రెండో అయితే ఏమార్చవచ్చు. పదివేల కళ్లు కప్పడం అసాధ్యం. ఎప్పుడో ఓసారి అయినా రుచుల విందు ఉండాల్సిందే. ‘డైటింగ్‌’ అన్న మాటను అతడు నమ్మడు. ‘ఈటింగ్‌ రైట్‌’ సూత్రాన్నే పాటిస్తాడు. ‘డైటింగ్‌’ ఏం తినకూడదో చెబుతుంది. ఆ మాట వినిపించగానే శరీరం ఓ రకమైన అభద్రతకు గురవుతుంది. దీంతో, ఎందుకైనా మంచిదని ఆహారాన్ని కొవ్వు రూపంలో భద్రపరుచుకునే ప్రయత్నం చేస్తుంది. అది మరింత ప్రమాదకరం. ‘ఈటింగ్‌ రైట్‌’ ఏం తినాలో చెబుతుంది. ఆ తినేదేదో సంతోషంగా తింటాం. అనగనగా కథల్లో ‘ఎక్కడికైనా వెళ్లు కానీ, ఉత్తర దిక్కు గదిలోకి మాత్రం వెళ్లొద్ద’ని చెబుతాడు జ్యోతిష్కుడు. రాకుమారుడు మాత్రం ఠంచనుగా ఉత్తరం వైపే బయల్దేరతాడు. వద్దని చెప్పిన దాని గురించే మనసు ఆలోచిస్తుంది. జిలేబీ తినొద్దంటే...జిలేబీనే గుర్తుకొస్తుంది. మిర్చీబజ్జీలు నిషిద్ధమంటే...కాళ్లు అటువైపే లాక్కెళ్తాయి. ఆరోగ్య విజేత దగ్గర ఆ పప్పులేం ఉడకవు. తనది ‘పాజిటివ్‌’ వ్యూహం.

http://archives.eenadu.net/04-10-2016/Magzines/10cover1i.jpg


అచ్చమైన ‘ఆడిటర్‌’

http://archives.eenadu.net/04-10-2016/Magzines/10cover1h.jpg

మెదడు ఆడిటర్‌ లాంటిది. మాటల్ని నమ్మదు. అంకెల్ని విశ్వసిస్తుంది. కాబట్టే, ఆరోగ్య విజేతలు అట్నుంచి నరుక్కొస్తారు. 21-2 ఒకటో సూత్రం. ప్రతి ఇరవై ఒక్క భోజనాల తర్వాత వచ్చే ఒక భోజనానికి నియమాలేం ఉండవు. మితంగానే అయినా, ఇష్టమైనవన్నీ తింటారు. ఉదరుడికి అదో విందు భోజనం అన్నమాట. 80-20 మరో సూత్రం. జపాన్‌లోని ఓ తెగవాళ్ల సగటు ఆయుఃప్రమాణం వంద. ఆ విజయానికి కారణం...వాళ్లు పాటించే ఆహార నిష్పత్తే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎనభైశాతానికి మించి పొట్ట నిండకుండా జాగ్రత్తపడతారు. ఆ పరిధిని మించి తినడం మహాపాపమని వాళ్ల నమ్మకం. అదే ఆ జాతిని ‘శతమానం భవతి’వైపు నడిపిస్తోంది. 5-4-3-2-1 ఇంకో సూత్రం. ఇదో ఆహార అవరోహణ క్రమం. ముందు సలాడ్స్‌తోనూ సూప్‌తోనూ భోజనం మొదలవుతుంది. ఇవన్నీ తక్కువ కెలోరీలు ఉన్న పదార్థాలు. ఎంతైనా తీసుకోవచ్చు. ఆతర్వాత, కొద్ది మోతాదులో కెలోరీలు ఉన్న రుచుల్ని పరిమితంగా ఆస్వాదిస్తారు. చివరికి, కెలోరీల కొండల్లాంటి రుచులు. వాటి వంతు వచ్చేసరికి కడుపు నిండిపోతుంది. ఒకట్రెండు ముద్దలకే జీవుడు ఎర్రలైటు చూపిస్తాడు. అయినా పొట్ట పోరుపెడితే, ‘కాగ్‌’లా కట్టడిచేస్తారు ఆరోగ్య విజేత.


అనుబంధాలకు పెద్దపీట

http://archives.eenadu.net/04-10-2016/Magzines/10cover1l.jpg

మానవ సంబంధాలకూ శారీరక, మానసిక ఆరోగ్యానికీ ప్రత్యక్ష సంబంధం ఉంది. ఆరోగ్య విజేత అనుబంధాల మనిషై ఉంటాడు. జీవిత భాగస్వామిని ప్రేమిస్తాడు, పిల్లలంటే ప్రాణమిస్తాడు. బంధుమిత్రుల్ని ఆదరిస్తాడు. అతిథుల్ని మర్యాదలతో ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. ఇరుగుపొరుగువారితో స్నేహంగా ఉంటాడు. సహోద్యోగులను గౌరవిస్తాడు. నేనూ నా ఇల్లూ నా కుటుంబం .. అన్న ఇరుకిరుకు చట్రంలోనే బందీ అయిపోకుండా, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు. రక్తదాన శిబిరాలు నిర్వహిస్తాడు. శుభకార్యాలకూ చావులకూ తప్పకుండా హాజరవుతాడు. కుటుంబ జీవితానికీ వృత్తి జీవితానికీ మధ్య చక్కని సమతౌల్యం పాటిస్తాడు. ఏ సమయంలో దేనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని దానికి ఇస్తాడు. చురుకైన సామాజిక జీవితాన్ని గడుపుతున్నవారిని ఒత్తిడి, నిస్పృహ తదితర సమస్యలు ఏమీ చేయలేవని అనేక అధ్యయనాలు నిరూపించాయి. మిగిలినవారితో పోలిస్తే విడాకుల కారణంగానో, స్నేహితులు లేకపోవడం వల్లో ...ఒంటరితనంతో బాధపడుతున్నవారే మద్యం, ధూమపానం తదితర దురలవాట్లకు తలవంచే ఆస్కారం ఎక్కువని కూడా నిపుణులు నిర్ధరించారు. ఆరోగ్య విజేతకు ఆ దుస్థితి ఎప్పుడూ రాదు. ఎందుకంటే, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మద్దతుగా నిలవడానికి బోలెడంత మంది సిద్ధంగా ఉంటారు. ఏ దురలవాటు చాటునో తలదాచుకోవాల్సిన అగత్యం రానేరాదు. ఆరోగ్య విజేతలో క్షమాగుణమూ ఎక్కువే. ఎదుటి మనిషిని యథాతథంగా ఆమోదించినప్పుడు ...అపోహలకూ భయాలకూ తావే ఉండదు. అతడు చక్కని హాస్యప్రియుడు కూడా. నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. అలా ఆరోగ్య విజేత...అనుబంధాల విజేత అవుతాడు, కెరీర్‌ వీరుడిగానూ పేరు తెచ్చుకుంటాడు.


‘ఎరుక’తో ఆహార నిర్ణయాలు

http://archives.eenadu.net/04-10-2016/Magzines/10cover1m.jpg

ఏం తినాలి, ఏం తినకూడదు, ఎప్పుడు తినాలి, ఏం వండుకోవాలి.. ఇలా ప్రతి ఒక్కరూ ఆహారానికి సంబంధించి రోజుకు ఎన్ని నిర్ణయాలు తీసుకుంటారో తెలుసా? పది..కాదు, పన్నెండు...కాదు, ఇరవై...కానే కాదు. మొత్తం రెండొందలు. అందులో తొంభైశాతం దాకా అనాలోచితంగా తీసుకునే నిర్ణయాలే. థియేటర్‌లోకి వెళ్తూ పాప్‌కార్న్‌ కొంటాం. ఇరానీ హోటల్లో చాయ్‌కి ఆర్డరు ఇస్తున్న ప్రతిసారీ సమోసాలూ చెబుతాం. సాయంత్రం కాగానే ఏ జంతికల డబ్బా వైపో మనసు మళ్లుతుంది. ఇదంతా ఆకలితో తినే తిండి కాదు, అనాలోచితమైన తిండి. మొత్తంగా అదనపు మోతే. ఆరోగ్య విజేతకు ఈ ప్రలోభాల సంగతి బాగా తెలుసు. ప్రతి ముద్దా ఎరుకతో తింటాడు. ‘నేను తింటున్నాను....నేను నములుతున్నాను...నేను మింగుతున్నాను...’ అన్న స్పృహ నూటికి నూరుశాతం ఉంటుంది. మిగిలిన రోజులన్నీ ఒక ఎత్తు. వారాంతాలు మరో ఎత్తు. ఆరు రోజులూ పొట్ట కట్టేసుకున్నవారు కూడా ఆదివారం విజృంభించేస్తారు. ప్రతి వారాంతంలో నగర జీవి ఒంట్లో పదిహేను వందల కెలోరీలు అదనంగా పేరుకుపోతున్నాయని అంచనా. అలా నలభై ఎనిమిది వారాలకు లెక్కతీస్తే .. 72 వేల కెలోరీలు అవుతాయి. అంటే.... దాదాపు పదికిలోల బరువు పెరిగినట్టే. ఆరోగ్య విజేత కూడా వారాంతాల్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తాడు. కానీ కడుపునింపే ఆహారంతో కాదు..మనసు నింపే వ్యాపకాలతో - మంచి పుస్తకం చదువుతూనో, ఇష్టమైన సంగీతాన్ని వింటూనో, నచ్చిన సినిమా చూస్తూనో, ఏ పచ్చని ప్రకృతి మధ్యో, ఏ చల్లని ఏటి గట్టునో.


http://archives.eenadu.net/04-10-2016/Magzines/10cover1n.jpg

ఓ వృద్ధురాలు చీకటిపడే సమయానికి వీధిలో ఏదో వెతుకుతోంది? అటుగా వెళ్తున్నవాళ్లు ‘అవ్వా! ఏం చేస్తున్నావ్‌?’ అని అడిగారు. ‘సూది పోయింది నాయనా! వెతుకుతున్నా..’ అని చెప్పింది. ‘ఎక్కడ పడిపోయింది, ఎలా పడిపోయింది?’ అని కుతూహలంగా అడిగారు. ‘అబ్బే! వీధిలో పడిపోలేదు. ఇంట్లోనే ఎక్కడో పడుంటుంది’ అని చెప్పింది. ‘ఇంట్లో పడిపోతే ఇక్కడెందుకు వెతుకుతున్నావ్‌?’ అని విసుగ్గా అడిగారు. ‘ఇంట్లో చీకటిగా ఉంది నాయనా! ఏమీ కనిపించదు. వీధిలో ఇంకా చీకటిపడలేదుగా! మసగ్గానే అయినా కనిపిస్తోంది’ అని జవాబిచ్చింది అవ్వ. అచ్చంగా మనం చేస్తున్నదీ అదే.
ఆరోగ్యాన్ని కోల్పోయేది ఒక చోట.
వెతుక్కునేది ఇంకోచోట.
మన ఆరోగ్యం మనలోనే ఉంది, మన అలవాట్లలోనే ఉంది. దాన్ని ఏ స్లిమ్‌నెస్‌ సెంటర్లలోనో, బెరియాట్రిక్‌ సర్జరీల్లోనో, కృత్రిమమైన చికిత్సా పద్ధతుల్లోనో వెతుక్కోవాల్సిన పన్లేదు.

ఆహారం, వ్యాయామం, జీవనశైలి...ఆరోగ్యవంతుల అలవాట్లన్నీ ఈ మూడూ అంశాల చుట్టే తిరుగుతాయి. జన్మతః వచ్చేది లక్షణం. అదే పనిని పదేపదే చేయడం వల్ల జీవితంలో భాగమైపోయేది అలవాటు. ఓ కొత్త అలవాటును భాగం చేసుకోడానికి 21 రోజులు పడుతుందని మానసిక నిపుణులు చెబుతారు. ఇరవై రెండో రోజు నుంచీ మెదడు దాన్ని ముఖ్యమైన బాధ్యతల జాబితాలో చేర్చుకుంటుంది.
ఇరవై ఒకటికి కూడా తొలి అడుగు ఒకటే...
ఈ నిమిషమే ఓ మంచి నిర్ణయం తీసుకోండి.
ఆరోగ్య విజేతగా నిలవండి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.