close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆవిష్కరణ తలకిందులైతే...

ఆవిష్కరణ తలకిందులైతే...
రివర్స్‌ ఇన్నోవేషన్‌!

ఏ ఆవిష్కరణ అయినా...సంపన్న దేశాల నుంచి వర్ధమాన దేశాలకే ఎందుకు ప్రవహించాలి, మూడో ప్రపంచం నుంచి మొదటి ప్రపంచం వైపుగా ఎందుకు వెళ్లకూడదు? అదే జరుగుతోందిప్పుడు. రివర్స్‌ ఇన్నొవేషన్‌...‘పై నుంచే కిందికి’ సంప్రదాయాన్ని తిరగరాస్తోంది.

విజయ్‌ గోవిందరాజన్‌...సుప్రసిద్ధ మేనేజ్‌మెంట్‌ గురువు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో పాఠాలు చెబుతారు. పరీక్షలకూ ఉపన్యాసాలకూ దూరంగా కొద్దిరోజులు కార్పొరేట్‌ రంగంలో పనిచేయాలని భావించారు. జనరల్‌ ఎలక్ట్రిక్స్‌ (జీయీ) ఆయన ప్రతిపాదనను స్వాగతించింది. ఆ సమయానికి జీయీ భారత్‌ సహా మూడో ప్రపంచ దేశాల్లో వ్యాధి నిర్ధారణ పరికరాల వ్యాపారం చేస్తోంది. వాటి ధరలు ఎక్కువ. గిరాకీ అంతంతమాత్రమే. మార్కెట్‌ వాటా పెంచుకోడానికి నానా కష్టాలూ పడుతోంది. ఎలాగైనా సమస్య నుంచి గట్టెక్కించమని గోవిందరాజన్‌ను కోరింది.

సరిగ్గా అప్పుడే, భారత్‌లో సంపాదనలు పెరిగాయి. ప్రజల జీవనశైలిలో మార్పులు వచ్చాయి. వూబకాయాలూ అధిక రక్తపోట్లూ జనాన్ని చుట్టుముట్టేశాయి. దీంతో, చిన్నాచితకా వైద్యశాలలు అనేకం పుట్టుకొచ్చాయి. వాటిలో ఏ ఒక్కదానికి కూడా, ఖరీదైన వ్యాధి నిర్ధారణ యంత్రాల్ని కొనుక్కునే స్తోమత లేదు. ఫలితంగా, జీయీ ఆ పరిణామాన్ని ఏరకంగానూ ఉపయోగించుకోలేక పోయింది. గోవిందరాజన్‌ లోపాన్ని గుర్తించారు. అవే పరికరాల్ని, అదే నాణ్యతతో, అంతకంటే చవగ్గా తయారు చేయమని పరిశోధకుల్ని పురమాయించారు. ఆ ప్రయత్నం ఫలించింది. జీయీ చౌకరకం పరికరాలకు గిరాకీ పెరిగింది. ‘ఉన్న మార్కెట్లో వాటా పెంచుకునే ప్రయత్నం చేయడం కంటే, కొత్త మార్కెట్‌ను సృష్టించుకోవడమే తెలివైన పని’ అంటారు గోవిందరాజన్‌.

కొత్త మార్కెట్‌ను సృష్టించుకోవాలంటే...కొత్త తలుపులు తెరుచుకోవాలి.
ఇన్నొవేషనో, రివర్స్‌ ఇన్నొవేషనో జరగాలి.
ఇన్నొవేషన్‌ అంటే...ఆవిష్కరణ.
ఒక వస్తువునో, టెక్నాలజీనో, ప్రక్రియనో సృష్టించడం.

సాధారణంగా ఇదంతా సంపన్న దేశాల్లో జరుగుతుంది. ఎందుకంటే, వాళ్లకు డబ్బు ఉంటుంది, కొత్తదనం పట్ల మక్కువ ఉంటుంది, ప్రపంచం మీద ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలన్న తపన ఉంటుంది. కాబట్టే, వందమంది నోబెల్‌ విజేతల చిట్టా తీస్తే, అందులో తొంభైమంది సంపన్న దేశాలవారే.

ఇక, రివర్స్‌ ఇన్నొవేషన్‌ ...
పూర్తిగా కొత్తపదం. ఇప్పటిదాకా పెద్దగా వినిపించని మాట. సంపన్న దేశాలవారు...మూడో ప్రపంచ దేశాల మార్కెట్‌ మీద పట్టు సాధించడానికి అవసరమైతే తమ ఆలోచనల్నీ, ఆవిష్కరణల్నీ, ప్రక్రియల్నీ తలకిందులుగా మార్చేసుకోవడమే రివర్స్‌ ఇన్నొవేషన్‌. పనికొస్తుందనిపిస్తే, అహాన్ని పక్కనపెట్టి మూడో ప్రపంచ దేశం నుంచి ఎంతోకొంత నేర్చుకోవడమూ అందులో భాగమే.

ఎందుకీ ‘రివర్స్‌’...
ప్రపంచ జనాభాలో ఎనభై అయిదు శాతం మంది మూడో ప్రపంచ దేశాల్లో ఉన్నారు. అమెరికా లాంటి చోట్ల మార్కెట్‌ చిన్నది, కొనుగోలుదారులు తక్కువ. చేస్తేగీస్తే, భారీగానే ఖర్చుచేస్తారు. భారత్‌లో అందుకు విరుద్ధ వాతావరణం ఉంది. మార్కెట్‌ పెద్దది. కొనుగోలుదారులూ ఎక్కువే. కానీ కొనుగోలు శక్తి తక్కువ. సునాయాసంగా లక్ష రూపాయలు ఖర్చుచేసే ఒక అమెరికన్‌ వినియోగదారుడితో...కనాకష్టంగా తలో పదివేలు ఖర్చుచేయగలిగిన పదిమంది భారతీయులు సమానం. ఒక అమెరికన్‌ కొనుగోలుదారుడిని పట్టుకోవడం కష్టమే. ఎందుకంటే, తన సామర్థ్యానికి సరిపడినంత మేరా అప్పటికే కొనేసి ఉంటాడు. కొత్తగా కొనడానికి ఏమీ ఉండదు. ఉన్నా చాలా పరిమితంగానే. ఆ ప్రకారంగా ...అతడి నుంచి మార్కెట్‌ భారీగా ఆశించాల్సిందేం ఉండదు. అదే భారతీయుడి విషయానికొస్తే...ఇంకా, అతన్లోని వినియోగదారుడు పూర్తిస్థాయిలో విజృంభించలేదు. టెక్నాలజీతోనో, సేవలతోనో, ఉత్పత్తులతోనో వూరించగలిగితే...వ్యాపారమే వ్యాపారం! ఆ కారణంగానే...నిన్నమొన్నటి వరకూ పేద దేశాలతో వ్యాపారం అసలు వ్యాపారమే కాదని తేలిగ్గా తీసుకున్న సంస్థలే... మార్కెట్‌ను విస్తరించుకోడానికి మూడో ప్రపంచ దేశాలవైపు ముచ్చటగా అడుగులేస్తున్నాయి. గతంలో అయితే, ఏ అమెరికా ప్రజల కోసమో తయారు చేసిన ఉత్పత్తుల్నే యథాతథంగా భారత్‌లాంటి దేశాల మీదికి వదిలేసి చేతులు దులుపుకునేవి. మహా అయితే, ఫీచర్స్‌ కుదించేసి ధర కూడా కాస్త తగ్గించేవి. పేద దేశాలవాళ్లు తక్కువ ధరలో, తక్కువ నాణ్యతతో సర్దుకుపోతారన్న భ్రమ బలంగా ఉండేది. అది అబద్ధమని తేలిపోయింది. వాళ్లూ సాధారణ ధరలో అసాధారణ నాణ్యతను ఆశిస్తారని అర్థమైపోయింది. దీంతో, బహుళజాతి సంస్థలు దిగుమతి వ్యవహారాల్ని పక్కనపెట్టి రివర్స్‌ ఇన్నొవేషన్‌ మీద దృష్టి సారిస్తున్నాయి.

ట్రాక్టర్ల తయారీ సంస్థ జాన్‌డీర్‌కు అమెరికాలో మంచి పేరుంది. భారత్‌కు వచ్చేసరికి ఆ అంచనా ఘోరంగా దెబ్బతింది. కారణం...అవే ట్రాక్టర్లను భారతీయులకూ అంటగట్టాలనుకోవడం. అమెరికా రహదార్లు వేరు, మన రహదార్లు వేరు. వాళ్లవి సువిశాలం, మనవేమో ఇరుకిరుకు. అక్కడ కమతాలు పెద్దవి, ఇక్కడ మరీ చిన్నవి. లోపం అర్థమైపోగానే, ‘రివర్స్‌ ఇన్నొవేషన్‌’ మీద దృష్టి సారించిందా సంస్థ. అమెరికా బుర్రను పక్కనపెట్టి, భారతీయ హృదయంతో ఆలోచించింది. సందుగొందుల్లోనూ సులభంగా మలుపు తిరిగేలా ట్రాక్టర్లను రీడిజైన్‌ చేసింది. అమెరికన్లు ఆజానుబాహులు. ఆ ప్రకారమే డ్రైవరు సీటు ఉండేది. ఆ ఏర్పాటు అటు పొడుగూ ఇటు పొట్టీ కాని భారతీయులకు అసౌకర్యంగా అనిపించేది. ఆ లోపాన్నీ సవరించుకుంది. మెల్లగా భారతీయులు ఆ ఉత్పత్తుల్ని ఆమోదించడం మొదలుపెట్టారు. చివరికొచ్చేసరికి...భారతీయ జాన్‌డీర్‌ ట్రాక్టరు అమెరికన్‌ డిజైన్‌కు పూర్తి తలకిందులుగా తయారైంది. అవసరమైతే, ఓ పెనుమార్పు కోసం పాత అస్తిత్వాన్ని కోల్పోవడమూ రివర్స్‌ ఇన్నొవేషనే.

ప్రొక్టర్‌ అండ్‌ గాంబుల్‌...మహిళలు రుతుక్రమ సమయంలో వాడే ప్యాడ్లనూ తయారు చేస్తుంది. అమెరికా లాంటి సంపన్న మార్కెట్లలో విక్రయాలు బాగానే ఉన్నా...మూడో ప్రపంచ దేశాల్లో మాత్రం, సరుకు అమ్ముకోడానికి చాలా ఇబ్బంది పడింది. ఓ దశలో చిన్నాచితకా కంపెనీలు కూడా దూసుకెళ్లిపోయాయి. మార్కెటింగ్‌ను శక్తిమంతం చేసినా, ప్రకటనల్ని హోరెత్తించినా అమ్మకాలు అంతంతమాత్రమే. ఎంత ఆలోచించినా పరిష్కారం కనిపించలేదు. దీంతో ఆ కంపెనీ వ్యూహకర్తలు ‘రివర్స్‌ ఇన్నొవేషన్‌’ మార్గాన్ని ఎంచుకున్నారు. మూడో ప్రపంచ దేశాల్లో టాయిలెట్ల కొరత తీవ్రంగా ఉంటుంది. మహిళలకైతే మరీ ఇబ్బంది. గడప దాటితే మళ్లీ ఇంటికొచ్చేదాకా ప్యాడ్లు మార్చుకునే వీలుండదు. అంటే, అమెరికన్‌ మహిళలతో పోలిస్తే చాలా ఎక్కువ సేపు ధరిస్తారు. కాబట్టి, నాణ్యత మరింత పెంచాలి. ఇంట్లోనూ ఇరుకిరుకు గదులే. దుర్వాసనను అరికట్టే అదనపు సౌకర్యం కూడా ఉండాలి. అమెరికన్‌ నమూనాలో ఆ వెసులుబాటు తక్కువ. మహిళల ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమే కావడంతో ధర విషయంలోనూ రాజీ పడాల్సిందే. ఇన్ని రకాలుగా రివర్స్‌ ఇన్నొవేషన్‌ జరిగాక...పీ అండ్‌ జీ తన ఉత్పత్తిని పునరావిష్కరించింది.

గ్లోబల్‌ నాణ్యత + లోకల్‌ వ్యాపారం= గ్లోకలైజేషన్‌. పర్వతంలా పైపైకి ఎగబాకడం...పాతబడ్డ వ్యాపార సూత్రం. మైదానంలా మార్కెట్‌ను విస్తరించడం...రివర్స్‌ ఇన్నొవేషన్‌ వినూత్న కోణం.

‘రివర్స్‌’ ఐడియా...
గొప్పగొప్ప ఐడియాలన్నీ అగ్రదేశాల నుంచే చిన్నాచితకా దేశాలకు వస్తాయి. ఐన్‌స్టీన్‌ సిద్ధాంతమైనా, డాప్లర్‌ ఎఫెక్ట్‌ అయినా, న్యూటన్‌ లా అయినా, ఆర్కిమెడిస్‌ సూత్రమైనా వాళ్లవే. ఆధునిక వైద్య విధానాల్నీ అక్కడి నుంచే దిగుమతి చేసుకున్నాం. మూడో ప్రపంచ దేశాలకు అనేక పరిమితులు ఉంటాయి. టెక్నాలజీ అంతంతమాత్రమే. నిధులకు ఎప్పుడూ కొరతే. సేవల కోసం వరుసలో నిలబడినవాళ్లేమో లెక్కలేనంత మంది. వేగంగా స్పందించకపోతే పనులు జరగవు. అంటే...తక్కువ నిధులతో, తక్కువ టెక్నాలజీతో, ఎక్కువ వేగాన్ని అందుకోవాల్సిందే. ఈ ఒత్తిడి భారత్‌ లాంటి దేశాలకు ఓ కొత్త ఆలోచనా ధోరణిని ఇస్తోంది, వినూత్నమైన ఆవిష్కరణలకు ఆసరా అవుతోంది. నారాయణ హృదయాలయ వ్యవస్థాపకుడు డాక్టర్‌ దేవిశెట్టి ఖరీదైన హృద్రోగ చికిత్సల్ని కూడా చౌక ధరల్లో అందిస్తున్నారు. అమెరికాలో వసూలు చేసే ఛార్జీలలో ఐదు శాతం కంటే తక్కువ ధరకే ఇదంతా సాధ్యం అవుతోంది. తమిళనాడులోని అరవింద్‌ నేత్ర వైద్యశాల కూడా అంతే. అతి తక్కువ ఖర్చుతో, అతి తక్కువమంది సిబ్బందితో గరిష్ఠ సంఖ్యలో నేత్ర శస్త్రచికిత్సలు చేస్తోంది. అందుకు అవసరమైన అన్ని పరికరాల్నీ సొంతంగా తయారు చేసుకుంటోందా సంస్థ. దీనివల్ల ముడిసరుకు ధర తగ్గుతోంది. ఆపరేషన్‌ థియేటర్‌లోనూ... ఏమాత్రం కాలం వృథా కాకుండా తక్కువ సమయంలో, తక్కువ కదలికలతో, ఎక్కువ పని జరిగేలా... ప్రత్యేక విధానాన్ని రూపొందించుకుంది. దీనివల్ల ప్రతి వైద్యుడూ బయటి నిపుణుల కంటే ఎక్కువ శస్త్రచికిత్సలు చేస్తున్నాడు. అచ్చంగా ఇదే నమూనాని శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓ స్వచ్ఛందసేవా వైద్యశాల అచ్చుగుద్దినట్టు అనుసరిస్తోందిప్పుడు. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ విద్యార్థులకు అరవింద్‌ నమూనా ఓ కేస్‌స్టడీ కూడా.

బంగ్లాదేశ్‌ గ్రామీణ బ్యాంకు ద్వారా మహ్మద్‌ యూనస్‌ బ్యాంకింగ్‌కు కొత్త నిర్వచనం చెప్పారు. బ్యాంకింగ్‌ సంస్థలు సంపన్నులకు ఆర్థిక సేవలు అందించడానికే తహతహలాడుతుంటాయి. నిరుపేదల్ని అస్సలు పట్టించుకోవు. ఇలా గిరిగీసుకుని వ్యాపారం చేయడం వల్ల, చాలానే నష్టపోయాయి. అగ్రశ్రేణి బ్యాంకులు పేద ఖాతాదారుల్ని కూడా ఆకట్టుకోగలిగితే ఎన్ని అద్భుతాలు చేయవచ్చో యూనస్‌ నిరూపించారు. ఆయన వ్యూహాల్నే అమెరికన్‌ బ్యాంకులు న్యూయార్క్‌ పరిసరాల్లోని సామాన్యుల కోసం ఉపయోగిస్తున్నాయి. బంగ్లాలో యూనస్‌ ఆవిష్కరించిన మైక్రోఫైనాన్స్‌ పద్ధతిని యథాతథంగా అమలు చేస్తున్నాయి. అదే గతంలో అయితే... ఏ కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్నా, ఏ చిన్న చిట్కాను ఒంటబట్టించుకోవాలన్నా మనం అమెరికాకు పరుగులు తీయాల్సి వచ్చేది. ఇప్పుడు అమెరికన్లే మూడో ప్రపంచానికి వరుసలు కడుతున్నారు.

‘రివర్స్‌’ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌...
భారత్‌ టు అమెరికా వయా సింగపూర్‌! ఏ యువ ఎంట్రప్రెన్యూర్‌ బిజినెస్‌ ప్లాన్‌లో అయినా...ఇలాంటి ప్రణాళికేదో ఉండి తీరుతుంది. గతంలో చాలా భారతీయ స్టార్టప్స్‌ తమ ప్రధాన కార్యాలయాన్ని వ్యూహాత్మకంగా అమెరికాలోనో సింగపూర్‌లోనో ఏర్పాటు చేసుకునేవి కూడా. ‘రివర్స్‌ ఇన్నొవేషన్‌’లో భాగమైన ‘రివర్స్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌’ మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. అమెరికా టు... జైపూర్‌, హైదరాబాద్‌, బెంగుళూరు- ఇలానే ఉంటున్నాయి విదేశీ స్టార్టప్స్‌ కలలు. బుర్రనిండా ఐడియాలతో నేరుగా భారత్‌లో దిగిపోతున్న విదేశీ యువకుల సంఖ్య బాగా పెరుగుతోంది. తక్కువ పెట్టుబడి, సువిశాలమైన మార్కెట్‌, అంతంతమాత్రం పోటీ...వాళ్లను భలేగా ఆకర్షిస్తున్నాయి. అమెరికా యువకుడు బెర్ట్రెండ్‌ ముల్లర్‌ ...ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ఓసారి జైపూర్‌ వచ్చాడు. తనకి మెక్సికన్‌ రుచులంటే ప్రాణం. అంత పెద్ద నగరంలో ఒక్క మెక్సికన్‌ రెస్టరెంట్‌ కూడా లేకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది. ఆ ఆకలి చురుకులోంచే ఓ ఐడియా మెరిసింది. అప్పటి నుంచీ ‘పెడితే గిడితే భారత్‌లో ఓ రెస్టరెంట్‌ పెట్టాలి..’ అని నిర్ణయించుకున్నాడు. చదువైపోగానే బెంగుళూరులో రుచుల వ్యాపారం ప్రారంభించాడు. మరో అమెరికన్‌ యువకుడు సీన్‌ బ్లాగ్స్‌విట్‌ చాలా కాలం క్రితం మైక్రోసాఫ్ట్‌ ప్రాజెక్టులో భాగంగా ఈ గడ్డ మీద కాలుపెట్టాడు. ఎక్కడికెళ్లినా స్థానిక మార్కెట్‌ను పరిశీలించడం అతడి అలవాటు. కార్పెంటర్లూ, డ్రైవర్లూ, ఆయాలూ తదితర కిందిస్థాయి ఉద్యోగాల్లో...కొలువులకూ ఉద్యోగార్థులకూ మధ్య పెద్ద అగాథం ఉండటాన్ని గమనించాడు. ఫలానా చోట అవకాశాలు ఉంటాయని వాళ్లకు తెలియదు, ఫలానా చోట నైపుణ్యం ఉన్న సిబ్బంది దొరుకుతారని వీళ్లకూ తెలియదు. ఆ కొరత తీర్చడానికి బాబాజాబ్‌.కామ్‌ను స్థాపించాడు. ఫ్రాన్స్‌ నుంచి వచ్చిన అలెగ్జాండర్‌ తాజాగా ఓవర్‌కార్ట్‌ పేరుతో ఆన్‌లైన్‌ దుకాణాన్ని తెరిచాడు. కార్‌ షేరింగ్‌ సంస్థ జూమ్‌కార్‌ వ్యవస్థాపకులు గ్రెగ్‌ మోరెన్‌, డేవిడ్‌ బాక్‌ కూడా ఐడియాల బ్రీఫ్‌ కేస్‌ పట్టుకుని అమెరికా నుంచి వచ్చినవారే. ఈ ఎండల్ని భరిస్తూ, ఈ దుమ్మును పీలుస్తూ ...భారతీయ మార్కెట్లో ఉనికి చాటుకుంటున్నవారే. ‘అదేదో మీ దేశాల్లోనే చేయవచ్చుగా?’ అంటే...అమెరికాలోనో, ఫ్రాన్స్‌లోనో అయితే... మేం ఏం చేయాలనుకున్నా...ఆ వ్యాపారాన్ని ఇంతకుముందే ఎవరో ఒకరు ప్రారంభించి ఉంటారు. వాళ్లంతా ఇప్పటికే నిలదొక్కుకుని ఉంటారు. అలాంటి సంస్థలతో పోటీపడటం కష్టం. అదే భారత్‌లో అయితే...బోలెడన్ని అవకాశాలు, బోలెడంతమంది కొత్త కొనుగోలుదారులు. అవే మమ్మల్ని సంపన్న దేశాల నుంచి మూడో ప్రపంచ దేశాల వైపు నడిపిస్తున్నాయి’ అంటుందా మిత్రద్వయం.

మూడు డబ్బాలు!

‘రివర్స్‌ ఇన్నొవేషన్‌’ అన్న మాటను సృష్టించిన విజయ్‌ గోవిందరాజన్‌ తాజా పుస్తకం పేరు... ‘ద త్రీ బాక్స్‌ సొల్యూషన్‌’. కలకాలం నిలబడాలనుకున్న ఏ సంస్థ అయినా వర్తమానాన్నీ భవిష్యత్తునూ అందుకు అనుగుణంగా ఎలా తీర్చిదిద్దుకోవాలో, గతానికి ఏ మేరకు విలువ ఇవ్వాలో ఇందులో వివరించారు.


బాక్స్‌ 1 : వర్తమానం - మేనేజ్‌ ద ప్రెజెంట్‌. గతాన్ని తలుచుకుంటూనో భవిష్యత్తును వూహించుకుంటూనో వర్తమానాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. వర్తమానంలో జీవించండి. వర్తమానాన్ని ఆస్వాదించండి. వర్తమానాన్ని సద్వినియోగం చేసుకోండి. రేపటి విజేతగా నిలవాలనుకోవడం మంచి ఆలోచనే. కానీ వర్తమానంలోనూ మీదే అగ్రస్థానం కావాలి. పర్ఫార్మ్‌ వైల్‌ యు ట్రాన్స్‌ఫామ్‌ ... మారాక మాత్రమే అద్భుతాలు చేయడం కాదు, మారకముందూ మారుతున్న దశలోనూ కూడా అద్భుతాలు చేస్తూనే ఉండాలి.

బాక్స్‌ 2: గతం - ఫర్గెట్‌ ద పాస్ట్‌. గతకాలం ఎంత గొప్పదైనా కానివ్వండి. గతంలో బోలెడన్ని విజయాలు సాధించి ఉండవచ్చు, చాలానే అనుభవం సంపాదించి ఉండవచ్చు. వైఫల్య పాఠాలూ నేర్చుకుని ఉండవచ్చు. అయినా సరే, గతాన్ని పూర్తిగా విస్మరించండి. గతం బుర్రలో ఉన్నంత కాలం కొత్త ఆలోచనలు రావు. ఎంత కొత్తగా ఆలోచించినా...గతం తాలూకు జ్ఞాపకాలూ అనుభవాలూ ప్రభావం చూపే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి, సున్నా నుంచి మొదలుపెట్టు. నీకేమీ తెలియదనుకునే ప్రారంభించు. దీన్నే ‘క్లీన్‌ స్లేట్‌ అప్రోచ్‌’ అంటారు.

బాక్స్‌ 3: భవిష్యత్తు - క్రియేట్‌ ద ఫ్యూచర్‌. భవిష్యత్తుకు ఓ రూపం లేదు. నువ్వు ఎలా సృష్టించుకుంటే అలా ఉంటుంది. ఉజ్వలంగా ఉంటుందనుకుంటే ఉజ్వలంగానే కనిపిస్తుంది. పరమ దరిద్రంగా ఉంటుందనుకుంటే దరిద్రంగానే కనిపిస్తుంది. నీ భవిష్యత్తు సృష్టికర్తవు నువ్వే. రేపటి టెక్నాలజీని అందిపుచ్చుకో. రేపటి మార్కెట్‌ గురించి ఆలోచించు. రేపటి సవాళ్లను దృష్టిలో పెట్టుకో.

‘రివర్స్‌’ పాఠాలు...
ఈ అంతర్జాతీయ పరిణామం మనకు చాలా పాఠాలే నేర్పుతోంది. మార్పు ఇచ్చే తీర్పును గౌరవించడం అన్నది రివర్స్‌ ఇన్నొవేషన్‌లో ప్రధాన సూత్రం. లేకపోతే... అమెరికా దిగ్గజాలు బంగ్లాదేశ్‌ ప్రజల ఆలోచనల్నో, భారతీయ కొనుగోలుదారుల అభిరుచుల్నో గౌరవించాల్సిన అవసరం ఏం ఉంటుంది? అహానికి వెళ్లి...మార్పును ఆమోదించకపోతే ...మరెవరో వచ్చి ఆపని చేస్తారు, మార్కెట్‌ మీద ఆధిపత్యం సంపాదించేస్తారు. కాలాన్ని తేలిగ్గా తీసుకుంటే కాలగర్భంలో కలసి పోవాల్సిందే. ‘డాక్టర్లు, ఇంజినీర్లు, విద్యార్థులు, ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తలు...మీరు ఎవరైనా కావచ్చు. మీదైన రంగంలో ఎవరూ ఎంగిలి చేయని ఆలోచనల్ని సృష్టించండి, ఎవరూ కాలుపెట్టని కీకారణ్యం వైపు మీ దారిని నిర్మించుకోండి’ అంటుంది రివర్స్‌ ఇన్నొవేషన్‌. కొండంత ఉత్సాహంతో కొత్తకొత్త ఐడియాలతో రంగంలోకి దిగే యువ ఎంట్రప్రెన్యూర్స్‌లో యాభైశాతం మంది ఏడాది తిరిగేలోపే దుకాణం కట్టేస్తారు. మరో ఏడాదికి ఇంకో పదిశాతం పడిపోతుంది. చివరికి మిగిలేది ఏ ఐదుశాతం మందో. ఐడియాలో మెరుపు ఉన్నా...దాన్నో వ్యాపారంగా మలుచుకునే సత్తా లేకపోవడం వల్లే ఈ వైఫల్యం. ఫలానా వ్యాపారంలో ఎవరో లాభాలు గడిస్తున్నారని తెలియగానే, ఓ పదిమంది ఆ పరిసరాల్లో మూగిపోతారు. ఫలానా ఐడియా ఏంజిల్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుందని పత్రికల్లో రాగానే...ఆ మూసలోనే వెళ్లడానికి ఓ వందమంది వరుస కడతారు. ఆ మంద మనస్తత్వమే వద్దంటుంది రివర్స్‌ ఇన్నొవేషన్‌. అవకాశాల్ని వెతుక్కోవడం ఒక మార్గం. అవకాశాల్ని సృష్టించుకోవడం రెండో మార్గం. రెండోదార్లోనే వెళ్లమంటుంది. ఇప్పటి దాకా మార్కెట్‌ స్పృశించని కోణాలూ, వినియోగదారులకు పెద్దగా గాలమేయని వ్యాపారాలూ చాలా ఉన్నాయి, వీలైతే ఆ కోణంలోంచి ఆలోచించమని సలహా ఇస్తుంది.

ప్రాచీన కాలంలోనూ...

‘రివర్స్‌ ఇన్నొవేషన్‌’ ఇప్పటిది కాదు. వందల సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. భావదారిద్య్రం కారణంగానో, పాలకుల దృష్టిదోషం ఫలితంగానో మధ్యలో హఠాత్తుగా ఆగిపోయిందంతే. పాప పుణ్యాల ప్రస్తావన లేకుండా, స్వర్గనరకాల కథలు చెప్పకుండా...మనసే కేంద్రంగా నిర్మించిన ఓ గొప్ప మతం బౌద్ధం. నీ కోరికలే నీ శత్రువులు అంటూ మనసును జయించే మర్మాన్ని బోధించాడు గౌతముడు. భారతదేశంలో జరిగిన ఆ ఆధ్యాత్మిక ఆవిష్కరణ ప్రపంచమంతా పాకిపోయింది. అజ్ఞాత భారతీయ శాస్త్రవేత్త ఆవిష్కరించిన సున్నా గొప్పదనమూ అలాంటిదే. అమెరికా సహా ప్రపంచాన్నంతా పద్మాసనంలో కూర్చోబెడుతున్న పతంజలి యోగా కూడా ప్రాచీన ‘రివర్స్‌ ఇన్నొవేషన్‌’కు తిరుగులేని సాక్ష్యమే. చరకుడు, శశ్రుతుడూ మొదలైన వైద్యాచార్యుల కృషి ఫలితమైన ఆయుర్వేదమూ, ప్రపంచానికి తొలిసారిగా ప్రేమసూత్రాలు అందించిన వాత్సా్యయన కామసూత్రమూ కూడా సాంస్కృతికంగా సుసంపన్నదేశమైన భారత్‌ నుంచి ఆర్థికంగా సంపన్నమైన అమెరికా లాంటి దేశాలకు వెళ్లినవే. యూకేలో అపార ఆదరణ ఉన్న చికెన్‌ టిక్కా మసాలా... భారతీయుల సగర్వ సమర్పణే.

డోంట్‌ వేస్ట్‌ ఎ గుడ్‌ క్రైసిస్‌...సంక్షోభాల్లోనూ ఓ అవకాశాన్ని చూడటమే విజేత లక్షణం. జాన్‌డీర్‌ నష్టాలకు భయపడిపోయి భారతీయ వ్యాపారాన్ని అటకెక్కించి ఉంటే... ఈ విజయం సాధ్యమయ్యేది కాదు. విన్‌-విన్‌ ఆఫర్‌...రివర్స్‌ ఇన్నొవేషన్‌ను ఓ సృజనాత్మక యుద్ధమని అనుకుంటే, ఇందులో తయారీదారులూ కొనుగోలుదారులూ - రెండు పక్షాలని భావిస్తే - అంతిమ విజేతలు ఏ ఒక్కరో కాదు ... ఇద్దరూ! తయారీదారుడు ఆ అపారమైన మార్కెట్‌ నుంచి లాభపడతాడు. కొనుగోలుదారుడు తక్కువ ధరలో నాణ్యమైన ఉత్పత్తినీ టెక్నాలజీనీ సొంతం చేసుకోవడం ద్వారా ప్రయోజనం పొందుతాడు. గెలువూ గెలవనివ్వూ - ఆలోచనా ధోరణి విజయానికి తొలి అడుగు. జీయీ సంగతే తీసుకోండి. ఆ సంస్థ పదివేల డాలర్లు విలువ చేసే ఈసీజీ యంత్రాన్ని ఐదొందల డాలర్లకే తయారు చేయడం ద్వారా...భారతీయ మార్కెట్‌లో నిలదొక్కుకుంది. ఆ ఆవిష్కరణ ఫలాలు దాదాపు 120 దేశాలకు అందాయి. దీనివల్ల లక్షలమంది ఆరోగ్యం మెరుగుపడింది. ఓ సంస్థా నిలబడగలిగింది.

విద్యార్థులు కెరీర్‌ ఎంపికలోనూ ‘రివర్స్‌ ఇన్నొవేషన్‌’ ఆలోచనా విధానాన్ని అనుసరించవచ్చు. సాధారణంగా ఒకట్రెండు కోర్సుల మీదే విద్యార్థుల దృష్టంతా ఉంటుంది. నిజమే, వర్తమానంలో వాటికే ఆదరణ. కానీ, భవిష్యత్తు కోణంలోంచి చూస్తే ప్రాథమ్యాలు మరోలా ఉంటాయి. నేటికి పనికొస్తూనే, రేపటిని శాసించబోయే రంగాల్ని ఎంచుకోవడం వివేకవంతుల లక్షణం. ఏ వ్యాపారమైనా ఖాతాదారుడి మీదే దృష్టిపెట్టమని చెబుతుంది. కానీ రివర్స్‌ ఇన్నొవేషన్‌ ఖాతాదారుడు కానివాడిని కూడా శ్రద్ధగా గమనించమని సూచిస్తుంది.ఎందుకంటే... వర్తమానంలో ఖాతాదారుడిని సంతృప్తిపరచాలి. భవిష్యత్తులో ఖాతాదారుడు కానివాడిని ఖాతాదారుడిని చేసుకోవాలి. అంటే, వర్తమానంలో ఉంటూనే భవిష్యత్తును అంచనా వేయాలన్నమాట.

***

రివర్స్‌ ఇన్నొవేషన్‌ ఫార్ములాను ప్రజా పాలనకూ అన్వయించుకోవచ్చు. భారతదేశంలో ఏ ఎన్నికల్లోనూ ఓటింగ్‌శాతం అరవైకి మించడం లేదు. మిగిలిన నలభైశాతం ప్రజల్ని పోలింగ్‌ బూత్‌ దాకా రప్పించడానికి ఏం చేయాలి? అన్న ప్రశ్నకు రివర్స్‌ ఇన్నొవేషన్‌లో పరిష్కారం దొరుకుతుందేమో చూడాలి. మున్సిపల్‌ కౌన్సెలర్ల నుంచి కేంద్ర మంత్రుల దాకా... అంతర్జాతీయ అధ్యయనాలంటూ విదేశాలకు వెళ్తుంటారు, కోట్లకు కోట్లు ఖర్చు చేస్తుంటారు. అలాంటి ఆర్భాటపు యాత్రల వల్ల ఉపయోగం లేదు. సమస్యను బట్టి పరిష్కారం ఉంటుంది. దేశాన్ని బట్టి ఆ పరిష్కారం మారుతూ ఉంటుంది. సింగపూర్‌లో అద్భుతంగా అనిపించిన పరిష్కారం మనకు పనికిరాకపోవచ్చు. రివర్స్‌ ఇన్నొవేషన్‌ చెబుతున్నదీ అదే. రైతుల ఆత్మహత్యల మీద ఏర్పాటు చేసే కమిటీలో కడుపునిండిన యూనివర్సిటీ ప్రొఫెసర్లూ, సేద్యమంటే తెలియని ఐఏఎస్‌లూ మాత్రమే ఎందుకుండాలి, ఆరుగాలం కష్టపడినా నష్టాలు తప్పని రైతన్నకో, ఆత్మహత్య చేసుకున్న రైతన్న కూతురికో కొడుకుకో ఎందుకు స్థానం కల్పించకూడదు? ...సంప్రదాయ విధానానికి పూర్తి వ్యతిరేకమైన ఆలోచన ఇది. రివర్స్‌ ఇన్నొవేషన్‌ ప్రాథమికంగా ‘మైండ్‌సెట్‌’కు సంబంధించిన వ్యవహారం. దాన్నుంచి వ్యక్తులైనా, సమాజమైనా ప్రయోజనం పొందాలంటే..ముందు ఆలోచనా ధోరణిని మార్చుకోవాలి.
కష్టమే... కానీ, అసాధ్యం కాదు!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న