close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బ్రహ్మాండనాయకుడి... బర్డ్‌ ఆసుపత్రి!

బ్రహ్మాండనాయకుడి... బర్డ్‌ ఆసుపత్రి!

చచ్చుబడిన కాళ్లకు కొత్త చైతన్యం వస్తుంది. బిర్రబిగుసుకుపోయిన చేతుల్లో కదలిక మొదలవుతుంది. తెగిపోయిన భుజం బలంగా అతుక్కుంటుంది. తిరుపతిలోని ‘బర్డ్‌’ ఆసుపత్రి, మూడు దశాబ్దాల కాలంలో లక్షకుపైగా శస్త్ర చికిత్సలు చేసింది. భవరోగ వైద్యుడు శ్రీనివాసుడి కటాక్షం, అనుభవ సంపన్నుడు డాక్టర్‌ గుడారు జగదీశ్‌ అంకితభావం...బర్డ్‌ విజయ రహస్యాలు. ఇక్కడ... వైద్యం ఉచితం, మానవతాస్పర్శ అమూల్యం!
తిరుమల, ఆనంద నిలయం...
‘కౌసల్యా సుప్రజారామ
పూర్వాసంధ్యా ప్రవర్తతే..’
బ్రాహ్మీ ముహూర్తంలో, బంగారు వాకిలి ముందు వేదపండితులు వేంకటేశ్వర సుప్రభాతాన్ని ఆలపించే సమయానికి...
తిరుపతి, బర్డ్‌ ఆసుపత్రి ఆవరణలో...
‘అడుగడుగు దండాలవాడా! వైకల్యంతో అడుగు ముందుకేయలేక పోతున్నా. కనికరించు తండ్రీ!’ - ఓ రోగి ఆవేదన. ‘ఆపదమొక్కులవాడా! ప్రమాదంలో గాయాల పాలు అయ్యాను. రెండుచేతులూ పైకెత్తి గోవిందా..అనలేని నిస్సహాయుడిని. ఆదుకో ప్రభూ!’ - ఓ బాధితుడి ప్రార్థన. ‘వేంకటకృష్ణా! బిడ్డ బుడిబుడి అడుగులు చూసి యశోదమ్మలా మురిసిపోవాలనుకున్నా. కానీ, పసివాడికి పుట్టుకతోనే వైకల్యం. అమ్మతనాన్ని అడిగితే కదల్లేని బొమ్మనిచ్చావేమిటి? విధిరాత మార్చు బ్రహ్మపితా!’ - ఓ తల్లి వేడుకోలు. ‘లావొక్కింతయు లేదు...’ అని శరణువేడిన గజేంద్రుడిని కరుణించి కటాక్షించిన స్వామి, ‘చక్రహస్తుని ప్రకటించు చదువే చదువు..’ అని నిర్మలభక్తితో ప్రస్తుతించిన ప్రహ్లాదుడిని లాలించి పాలించిన పురుషోత్తముడు - సామాన్య భక్తులకు మాత్రం సాయం అందించకుండా ఉంటాడా? ఆ గరుడవాహనుడు...‘బర్డ్‌’ వైద్యశాల ద్వారా భక్తకోటికి భరోసా ఇస్తున్నాడు. శ్రీ బాలాజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సర్జరీ, రిహాబిలిటేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ ఫర్‌ ది డిజేబుల్డ్‌కు...‘బర్డ్‌’ సంక్షిప్తరూపం. ఏ జాతీయ వైద్య విజ్ఞాన సంస్థకూ తక్కువకాని సాధన సంపత్తి ఉందిక్కడ. వైద్యనిపుణులైతే...తమదైన విభాగంలో దిగ్గజాలే!

ఉదయాన్నే ఆ ఆవరణ ముందు నిలబడితే చాలు...వైకల్యంలోని నరకం కళ్లారా కనిపిస్తుంది. ఓ కాలు సహజంగానే ఉంటుంది, మరొకటి మాత్రం...పెద్దగీత పక్కన చిన్నగీతలా - కృతకంగా. ఓ చేతిని ఏ యంత్ర రాకాసో నిర్దాక్షిణ్యంగా మింగేసి ఉంటుంది, మిగిలిన ఒక్కటీ - బిక్కుబిక్కుమంటున్నట్టు. టకటకమని శబ్దం చేసే వూతకర్రలు...పోలియో రాకాసిని పొలిమేర దాకా తరిమేశామని గొప్పలు చెప్పుకునే పాలకుల్ని ఉలిక్కిపడేలా చేస్తాయి. వెన్నెముక నిటారుగా లేని వ్యధాభరిత జీవితాలు కొన్నీ, వంకర టింకర రూపాల శాపాలు కొన్నీ.

బర్డ్‌...
ఏ రోగినీ నిరాశపరచదు.
ఏ రుగ్మతకూ పరిష్కారం లేదని చెప్పదు. ఆ ఆవరణలో కాలుపెట్టగానే సగం స్వస్థత చేకూరినట్టే. అక్కడ, తెల్లకార్డుతోనే జరిగిపోయే శస్త్రచికిత్సల్ని చూసి...కార్పొరేట్‌ వైద్యం తెల్లమొహం వేయాల్సిందే. మంచికి మారుపేరైన ధన్వంతరీ స్వరూపాల్ని దర్శించుకుని...పర్సులు చూశాకే, పల్సు పట్టుకునే వ్యాపార వైద్యులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందే. అక్కడ, రోగి నారాయణుడితో సమానం. అరల్లోని ఔషధాలకు ప్రసాదమంత మహత్తు. ఆపరేషన్‌ థియేటర్‌లో జరిగే ప్రతి శస్త్రచికిత్సా శుక్రవారపు అభిషేకమంత భక్తిపూర్వకం. ఆదివరాహక్షేత్రంలో...ఆదినారాయణుడి సేవలో, బ్రహ్మ నేతృత్వంలోని ముక్కోటి దేవతలూ పాల్గొంటారన్నది ఐతిహ్యం. బర్డ్‌ వైద్యశాలలో... రోగనారాయణుల సేవలో డాక్టర్‌ జగదీశ్‌ గుడారు నాయకత్వాన నిపుణుల బృందం తరిస్తోందన్నది అక్షరసత్యం.

డాక్టర్‌ జగదీశ్‌ ...
బర్డ్‌ ఆసుపత్రి డైరెక్టరు.
వేవేల విన్నపాల సుప్రభాతంతో శ్రీనివాసుడి ముల్లోక పాలన మొదలైనట్టు...తెల్లవారుజామున ఏ నాలుగున్నరకో - ప్రమాద బాధితుల ఏడుపులతో, రోగపీడితుల మూలుగులతో ఆయన దినచర్య ప్రారంభం అవుతుంది. మళ్లీ ఇంటికి ఏ రాత్రికో, రోగులంతా ప్రశాంతంగా నిద్రపోయాకే. జగదీశ్‌కు ఆసుపత్రే ప్రపంచం. పండగపబ్బాలైనా ఇక్కడే. రోజుకు పాతిక సర్జరీలు సునాయాసంగా చేస్తారాయన. మూడు దశాబ్దాల బర్డ్‌ ప్రస్థానంలో...రెండు దశాబ్దాల ప్రయాణం ఆయన నేతృత్వంలోనే!

దేవుడిచ్చిన అవకాశం

మా వూళ్లొ ఓ డాక్టరుగారు ఉండేవారు. ఎవరికి ఒంట్లో నలతగా ఉన్నా, ఆయన దగ్గరికే వెళ్లేవారు. ఎంత నిస్పృహలో ఉన్న రోగికైనా, డాక్టరుగారు నాడిపట్టుకోగానే ఎక్కడలేని ధైర్యం వచ్చేది. పేదల దగ్గర పైసా కూడా తీసుకునేవారు కాదు. తనే మందులు ఇచ్చేవారు. ఆరోగ్యం కుదుటపడ్డాక, ఆ నిరుపేదలు కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పేవారు. ఆ దృశ్యాల్ని చూస్తున్నప్పుడే...వైద్య వృత్తిలోని గొప్పదనం తెలిసింది. నేనూ డాక్టరు కావాలని నిర్ణయించుకున్నా. 

కడప జిల్లా, పుల్లంపేట మండలంలోని టి.కమ్మపల్లి మా వూరు. నాన్న గుడారు లక్ష్మయ్యనాయుడు, అమ్మ లీలావతమ్మ. వ్యవసాయమే మాకు ఆధారం. నాన్న పొలం పనులు చూసుకునేవారు. అమ్మ ఆయనకి చేదోడుగా ఉండేది. మేం బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని అమ్మానాన్నాల కోరిక. మాదేమో కుగ్రామం. నన్నూ చెల్లినీ (తనిప్పుడు డల్లాస్‌లో ఉంటోంది) చదివించడానికి, ప్రాణంలాంటి వ్యవసాయాన్ని వదిలిపెట్టుకున్నారు నాన్న. మా కోసమే కుటుంబం తిరుపతికి వచ్చేసింది. మున్సిపల్‌ హైస్కూల్లో పదో తరగతి దాకా చదువుకున్నా. ఆతర్వాత, వేంకటేశ్వర జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ పూర్తయింది. మంచి మార్కులు రావడంతో...కాకినాడలోని రంగరాయ మెడికల్‌ కాలేజీలో సీటొచ్చింది. మెడిసిన్‌ అంటే మాటలు కాదు. చాలా ఖర్చవుతుంది. మా కుటుంబానికి అది శక్తికి మించిన భారమే. అదే మాట నాన్నతో అన్నాను. ‘నిన్ను పెద్ద డాక్టరుగా చూడాలన్నది నా కల. డబ్బు గురించి ఆలోచించొద్దు’ అని ధైర్యం చెప్పారు. కరవులొచ్చినా కష్టాలొచ్చినా పట్టించుకోకుండా, చాలా పట్టుదలగా చదివించారు. అంతే పట్టుదలతో నేనూ చదువుకున్నా. 

మెడిసిన్‌లో ఉండగా ఓ ప్రమాదం జరిగింది. ఓరోజు, కాయలు కోయడానికి మామిడి చెట్టెక్కి...కాలుజారి పడిపోయాను. కాలికి బాగా దెబ్బ తగిలింది. నెలరోజులు మంచం మీది నుంచి కదల్లేదు. దీంతో, ఆ ఏడాది పరీక్షలు రాయలేదు. అప్పటిదాకా పడిన శ్రమంతా వృథా. ఓ మంచి ఎముకల వైద్యుడు అందుబాటులో 

ఉంటే...త్వరగా కోలుకునేవాడినేమో అనిపించింది. అలా, అనుకోకుండా ఆర్థోపెడిక్‌ సర్జరీ మీద ఆసక్తి పెరిగింది. ఎంబీబీఎస్‌ పూర్తికాగానే తిరుపతిలోని వేంకటేశ్వర రామ్‌నారాయణ్‌ రుయా ప్రభుత్వాసుపత్రిలో హౌస్‌సర్జన్‌ పూర్తి చేశాను. పెద్ద చదువులకు వెళ్లాలన్న కోరిక ఉన్నా, ఆర్థిక పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో మెడికల్‌ ఆఫీసరుగా చేరాను. ఆతర్వాత, తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి బదిలీ చేశారు. చాలా సంతృప్తినిచ్చిన బాధ్యత అది. కొండమీద పనిచేస్తున్న కార్మికులు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా, పరిగెత్తుకుని వచ్చేవారు. దర్శనానికి వచ్చే భక్తులకు అశ్విని వైద్యశాలే ఆధారం. ఓరోజు ఒంగోలు నుంచి ఓ కుటుంబం వచ్చింది. అందులో ఓ కుర్రాడు అకస్మాత్తుగా అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. వూరుగాని వూరు. తెలిసినవాళ్లూ లేరు. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటివరకూ కళ్లముందు తిరిగిన బిడ్డ ... ఉలుకూపలుకూ లేకుండా పడిపోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పరీక్షలు చేయించాను. ట్యూబర్‌ క్యులోసిస్‌ అని తేలింది. వెన్నెముకలో ఉన్న టీబీ మెదడుకు చేరింది. తీవ్రమైన సమస్యే. నా వంతు ప్రయత్నం చేశాను. మూడోరోజు నాటికి లేచికూర్చున్నాడు. ఆ కుటుంబ సభ్యుల ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ‘శ్రీనివాసుడే మీ రూపంలో వచ్చి బిడ్డను బతికించాడు’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు.డాక్టర్‌ వాగ్రోసోడ్‌గారు బర్డ్‌ తొలి డైరెక్టరు. చాలా గొప్ప వ్యక్తి. ‘వైద్యుడికి సేవాభావం ఒక్కటే సరిపోదు, నైపుణ్యమూ అవసరం’ అనేవారు. ఆయన ప్రోత్సాహంతోనే మణిపాల్‌ వెళ్లి ఆర్థోపెడిక్స్‌లో పీజీ చేశాను. మా ఆవిడ నిర్మలాదేవికి కూడా అక్కడే పీజీలో సీటొచ్చింది. 

అలా నేను ‘ఆర్థో’, ఆమె ‘గైనకాలజీ’ పూర్తిచేశాం. మాకు ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరూ డాక్టర్లే.
నా జీవితంలో తారసపడిన ప్రతి వైద్య నిపుణుడూ నాకు గురువుతో సమానమే. ఆ ప్రకారం, వూళ్లొని పేదల డాక్టరే నా తొలి గురువు. రుయాలో పనిచేస్తున్నప్పుడు, జనరల్‌ సర్జన్‌ వసంతరావుగారు నా మార్గదర్శి. డాక్టరంటే ఆయనలా ఉండాలనిపించేది. ఏ చేయి తిరిగిన వైద్యుడైనా, రోగి శరీరాన్ని కోయాలంటే కనీసం ఇరవై నిమిషాలు పడుతుంది. వసంతరావుగారు క్షణాల్లో కోసేసేవారు. అదీ చాలా కచ్చితంగా. ఆ మెలకువలు నాకూ నేర్పించారు. ఆ నైపుణ్యం ఇప్పుడు ఉపయోగపడుతోంది. కాబట్టే, రోజుకు పాతిక ముప్ఫై ఆపరేషన్లు అయినా సునాయాసంగా చేయగలుగుతున్నా. మణిపాల్‌లో వర్గీస్‌ చాకో అనే వైద్యుడు సమయ పాలనలో నాకు ఆదర్శం. డాక్టర్‌ బెంజిమెన్‌ జోసెఫ్‌ ఏ కాస్త ఖాళీ దొరికినా వైద్యానికి సంబంధించిన పుస్తకాలు బయటికి తీసేవారు. వైద్యుడికి సమకాలీన పరిశోధనల మీద అవగాహన ఉండాలని చెప్పేవారు. డాక్టర్‌ భాస్కరానందకుమార్‌ రోగుల్ని చాలా ప్రేమగా పలకరించేవారు. వైద్యుడి ఆత్మీయ స్పర్శతోనే సగం రోగం నయమైపోతుందని అనేవారు.. నా అభిప్రాయమూ అదే. 1992లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా బర్డ్‌తో నా అనుబంధం మొదలైంది. డైరెక్టరు హోదాలో ఇంత మందికి సేవ చేసే అవకాశం లభించడం స్వామి కటాక్షమే. డైరెక్టరుగా బాధ్యతలు స్వీకరించిన రోజు... నా జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. మిగతా వైద్యశాలలు వేరు, స్వామివారి ఆసుపత్రి వేరు. రోగులు కొండంత విశ్వాసంతో వస్తారు. వైద్యశాస్త్ర పరిధి విశాలమైంది. అందులోనూ ఆర్థోపెడిక్స్‌ చాలా లోతైన అంశం. ఏ రోగీ తన సమస్య పరిష్కారం కాలేదన్న అసంతృప్తితో తిరిగి వెళ్లకూడదు. ఆ ఆలోచనతోనే జర్మనీ, యూకే, ఇటలీ, స్విట్జర్లాండ్‌... ప్రపంచమంతా చుట్టేసి ప్రత్యేక కోర్సులు చేశాను, ఎక్కడ అంతర్జాతీయ సదస్సు జరిగినా తప్పక హాజరవుతాను.

నాహం కర్తా హరిః కర్తా...చిటికెనవేలు పట్టుకుని నడిపించేదీ ఆయనే, చేయి పట్టుకుని శస్త్రచికిత్సలు చేయించేదీ ఆయనే. అవార్డులకూ ప్రచారాలకూ దూరంగా...నా పని నేను చేసుకుపోడానికి కారణం ఆ శరణాగతే! (బర్డ్‌ ఫోన్‌: 0877- 2264619)

ఎన్టీఆర్‌ మానసపుత్రిక
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తిరుపతిని కలియుగ వైకుంఠమనే విశ్వసించారు. శ్రీమహావిష్ణువు నిజనివాసంలో...కష్టాలకూ కన్నీళ్లకూ తావు ఉండకూడదని భావించారు. కానీ వాస్తవాలు వేరు. చేతులూ కాళ్లూ వంకర్లు పోయిన పసివాళ్లూ, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన నిర్భాగ్యులూ, కీళ్ల సమస్యలతో నరకాన్ని అనుభవిస్తున్న రోగపీడితులూ...కళ్లముందు కనిపిస్తుంటే తల్లడిల్లిపోయారు. అలాంటివారి కోసం ప్రత్యేకంగా ఓ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అలా, 1985లో తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనంలో బర్డ్‌ ఆసుపత్రి ఏర్పాటైంది. ప్రారంభ సమయానికి యాభై పడకలు కూడా లేవు. పోలియో వికలాంగులూ, తిరుమల యాత్రకు వచ్చి ఏ ప్రమాదానికో గురైనవారూ, తితిదే ఉద్యోగులూ తొలిరోజుల్లో వైద్యానికి వచ్చేవారు. మొదటి ఏడాది నూటయాభై శస్త్ర చికిత్సలు జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా తనవంతుగా ఆ వైద్యశాలను ప్రోత్సహించింది. దేశవ్యాప్తంగా చికిత్సా శిబిరాలు ఏర్పాటు చేయించింది. ఉచిత పోలియో శస్త్రచికిత్సలు జరిపించింది. వైద్యుల చిత్తశుద్ధి గురించీ వైద్య సేవల నాణ్యత గురించీ...ఆనోటా ఈనోటా విని గంపెడాశతో వచ్చే రోగుల సంఖ్య క్రమంగా పెరిగింది. దీంతో ఆవరణ ఇరుకైపోయింది. 1995లో శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (స్విమ్స్‌)కు దగ్గరగా ఇరవై ఎకరాల సువిశాల ఆవరణలో ఏడు ఆపరేషన్‌ థిµయేటర్లూ, అత్యాధునిక ఫిజియోథెరపీ కేంద్రం, కృత్రిమ అవయవాల ఏర్పాటు కేంద్రం...ఇలా సకల సదుపాయాలతో నూతన భవనాన్ని నిర్మించారు. అవసరాలు పెరిగేకొద్దీ భవంతినీ సౌకర్యాల్నీ విస్తరిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బర్డ్‌లో 300 పడకలున్నాయి, 250మంది సిబ్బంది ఉన్నారు. ఎనిమిదిమంది నిష్ణాతులైన ఆర్థోపెడిక్‌ వైద్యులు సేవల్ని అందిస్తున్నారు. రోజూ ఎనిమిది వందల నుంచి వేయిమంది దాకా...అవుట్‌ పేషెంట్లు వస్తున్నారు. ఆ రద్దీని తట్టుకోడానికి, తాజాగా మరో ఓపీ విభాగాన్ని నిర్మిస్తున్నారు. అందులోనూ యాభై పడకల ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌, పరీక్షశాల, ఎక్స్‌రే యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచే కాదు.. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక...తదితర ప్రాంతాల నుంచీ రోగులు వస్తుంటారు. మూడు దశాబ్దాల్లో దాదాపు పది లక్షలమంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. లక్ష శస్త్రచికిత్సలు జరిగాయి. తొలుత తితిదే బర్డ్‌ కోసం ఏటా...ఐదు కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించేది, ఇప్పుడా మొత్తం పాతిక కోట్లకు చేరింది. మరో అరవై కోట్ల రూపాయల దాకా, భక్తుల విరాళాలు ఉన్నాయి. వీటిపై వచ్చే వడ్డీని ఆసుపత్రి అభివృద్ధికే వినియోగిస్తారు. ముందుచూపుతో, బర్డ్‌ను ట్రస్ట్‌ ఆసుపత్రిగా మార్చారు. దీనివల్ల దాతలకు ఆదాయపన్ను మినహాయింపు లభిస్తుంది. మానవుడిలో మాధవుడిని దర్శించుకోడానికి ఇదో మహత్తర అవకాశం.

వైకల్య చికిత్సలకు సంబంధించి బర్డ్‌ ఓ విజ్ఞాన సర్వస్వమే! ఇక్కడ జరగని అత్యాధునిక వైద్యమంటూ లేదు. 1998లో, ఆంధ్రప్రదేశ్‌లోనే తొలి కీళ్లమార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. మోకాళ్ల నొప్పితో విలవిల్లాడే వారికి ఆర్థ్రోస్కోపీ శస్త్రచికిత్సలు సిద్ధం. ఎముకలు జారిపోయినా, విరిగిపోయినా చక్కగా అతికించేందుకు ఫ్రాన్స్‌ నుంచి తెప్పించిన పరికరాలు ఉండనే ఉన్నాయి. తీవ్ర ప్రమాదాల్లో ముక్కలైపోయిన ఎముకల్ని కూడా, తేడా తెలియనంత నైపుణ్యంగా అతికించగలరు ఇక్కడి నిపుణులు. రష్యా నుంచీ కొంత టెక్నాలజీని దిగుమతి చేసుకున్నారు. స్విట్జర్లాండ్‌ సాయంతో అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం..పుట్టుకతోనే ఉన్న పొట్టికాళ్లను సరిచేయడానికి పనికొస్తోంది. అమెరికా యంత్రాలతో తుంటికీళ్లూ మోకాళ్లూ మారుస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పోలియో రోగుల్లో సగానికి సగంమంది భారతీయులే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. అందులో చాలావరకూ నిరుపేదలే. బతుకే బరువైన జీవితాలు, వేలకువేలు పోసి వైద్యం ఎక్కడి నుంచి చేయించుకుంటారు? చక్కని చికిత్స అందితే, అందులో చాలామంది మళ్లీ మామూలు మనుషులు అవుతారు. ఆ ప్రయత్నంలోనే ఇప్పటిదాకా పంజాబ్‌, యూపీ, పాండిచ్చేరి, రాజస్థాన్‌, జార్ఖండ్‌, తమిళనాడు, పశ్చిమ బంగా, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో... కొన్ని వందల పోలియో శిబిరాలు నిర్వహించింది బర్డ్‌. అలా, దాదాపు లక్షమందికి పరీక్షలు చేశారు. ఇరవైవేలమందికి శస్త్ర చికిత్సలు జరిపారు. ‘కోల్‌కతాలో శిబిరం నిర్వహించినప్పుడు ..మదర్‌ థెరిసా మా కార్యక్రమానికి వచ్చారు. మరింతమంది వికలాంగులకు సేవలు అందించు బిడ్డా! అని ఆశీర్వదించారు. ఆ స్పర్శతో నా జీవితం ధన్యమైంది’ అని తన్మయంగా చెబుతారు జగదీశ్‌.

బర్డ్‌ ముందు నుంచీ రోగులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తోంది. మొదట్లో సహాయకులు గుప్పెడు అన్నం కోసం నానా ఇబ్బందులు పడేవారు. నిలువనీడలేక అనేక కష్టాలు అనుభవించేవారు. ‘నిజమే, సహాయకుల పరిస్థితి ఏమిటి? అన్న ఆలోచన నన్ను కలవరపెట్టింది. వెంటవచ్చే వారికి కూడా వసతి కల్పించాలనీ, భోజనం ఇవ్వాలనీ నిర్ణయించాం. బంధువులు బయట తిప్పలు పడుతుంటే, రోగి మాత్రం ప్రశాంతంగా ఎలా ఉంటాడు? మనసు స్థిమితంగా లేకపోతే, చికిత్స ఒంటికి అంటదు. త్వరగా కోలుకోలేడు’ అంటారు జగదీశ్‌. బర్డ్‌ క్రమంగా తన పరిధిని విస్తరించుకుంటోంది. సంస్థకు అనుబంధంగా, పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలలో నిర్మించిన వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సర్జరీ, రిసెర్చ్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌ ఫర్‌ ది డిజేబుల్డ్‌ (వీఐఆర్‌ఆర్‌డీ)... చుట్టుపక్కల ప్రాంతాల్లోని నిరుపేద వికలాంగులకు సేవలు అందిస్తోంది.

ఎన్నో జీవితాలు...
ఆ పసివాడి పేరు పుష్య చైతన్య. వయసు ఆరేళ్లు. పుట్టుకతోనే రెండుకాళ్లూ వంకర్లు తిరిగాయి. తల్లిగర్భంలో ఉన్నప్పుడే సమస్యను గుర్తించారు. పుట్టిన మూడోరోజు నుంచి చికిత్స మొదలుపెట్టారు. ఏడాది వయసులోనే శస్త్రచికిత్స చేశారు. అయినా ఫలితం కనిపించలేదు. ఆ పసివాడి తల్లి సరిత డీఎస్పీగా పనిచేస్తున్నారు. తన పరిధిలో ఎంతమంది నిపుణుల్ని సంప్రదించాలో అంతమందినీ సంప్రదించారు. దాదాపుగా ఆశలు వదులుకుంటున్న సమయంలో... ద్వారకా తిరుమల కేంద్రాన్ని ప్రారంభించడానికి తితిదే ముహూర్తం నిర్ణయించింది. ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విచ్చేశారు. డీఎస్పీ హోదాలో విధులు నిర్వర్తించడానికి సరిత అక్కడికి వెళ్లారు. డాక్టర్‌ జగదీశ్‌ గురించి ఆమెకు ఎవరో చెప్పారు. ఎందుకో, ఆ వైద్యుడు తన బిడ్డను మామూలు మనిషిని చేయగలడన్న నమ్మకం కుదిరింది. చైతన్య వైద్య చరిత్రను ఆయన ముందు ఉంచారు. తొలి అవుట్‌-పేషెంట్‌గా ఆ పసివాడి పేరే నమోదు చేశారాయన. ఆతర్వాత తిరుపతికి తీసుకొచ్చి శస్త్రచికిత్స నిర్వహించారు. సమస్య చాలా వరకూ పరిష్కారమైంది. త్వరలోనే, ఆ పసివాడు లేచి తిరగబోతున్నాడు. అమ్మ సరిత ఆనందానికైతే అవధుల్లేవు. ‘చూస్తూ ఉండండి, నా బిడ్డ చకచకా మోకాలి మెట్లు ఎక్కేస్తాడు’ అని మురిసిపోతారామె.

ఐషా అనే చిన్నారి తుంటికీలు లేకుండా పుట్టింది. దీంతో కుడికాలు పొట్టిగా ఉండేది. బుడిబుడి అడుగులేయాల్సిన వయసులో...అతికష్టంగా కదిలేది. కన్నతల్లి ఎన్నో వైద్యశాలలకు తీసుకెళ్లింది. ‘నా ప్రాణాల్ని పణంగా పెడతాను, బిడ్డను మామూలు మనిషిని చేయండి’ అని డాక్టర్లను బతిమాలింది. అంతా చేతులెత్తేశారు. చివరి ప్రయత్నంగా తిరుపతికి తీసుకొచ్చింది. ‘నీ ప్రాణాలు ఇవ్వాల్సిన పన్లేదు తల్లీ! ఒంట్లోని చిన్న ఎముక ముక్క ఇస్తే చాలు’ అని అడిగారు డాక్టర్‌ జగదీశ్‌. సంతోషంగా సరేనందామె. తల్లి శరీరం నుంచి ఎముక తీసుకుని తుంటికీలు అమర్చారు. ఇది చాలా అరుదైన శస్త్రచికిత్స. తొడ ఎముకను పొడిగించి... పొట్టిగా ఉన్న కుడికాలిని ఎడమకాలికి సమానం చేశారు. హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన మన్మీత్‌సింగ్‌ వయసు పద్దెనిమిది. బాల్యం నుంచీ కాలుపొట్టి. వయసుతో పాటు ఆత్మన్యూనతా పెరిగింది. ఎవరో చెబితే ఇంతదూరం వచ్చారు. జగదీశ్‌ నేతృత్వంలోని వైద్యబృందం సంక్లిష్టమైన ప్రక్రియ ద్వారా లోపాన్ని సరిచేసింది. తనిప్పుడు ఫుట్‌బాల్‌ ఆటగాడు.

ఒకటా రెండా...మూడు దశాబ్దాల్లో లక్షకుపైగా శస్త్రచికిత్సలు జరిగాయి, ఎన్నో జీవితాల్లో వెలుగులు నిండాయి. వంకరపోయిన చిన్నారి

పాదాలు తకధిమి తకధిమి అంటూ కాళియమర్దన నృత్యం చేస్తున్నాయి. కదలడానికే మొరాయించిన చేతులు ‘అదివో... అల్లదివో’ అంటూ ఏడుకొండల్ని చూపుతున్నాయి. మాజీ గవర్నర్‌ సుశీల్‌కుమార్‌షిండే బర్డ్‌ సందర్శకుల పుస్తకంలో రాసినట్టు...‘ఇక్కడ జరుగుతున్నది చికిత్సలో శస్త్రచికిత్సలో కాదు...మానవతా యజ్ఞం!’

* * *

డాక్టర్‌ జగదీశ్‌ ప్రతిభ ఓ అంతర్జాతీయ వైద్యసంస్థ దృష్టికి వెళ్లింది. తమ ప్రతినిధుల్ని డాలరు బేరానికి పంపింది. అత్యుత్తమ పారితోషికం ఇస్తామని ఆశపెట్టింది. జగదీశ్‌ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆ నియామక పత్రాన్ని చింపి చెత్తబుట్టలో పడేశారు.

‘వేంకటాద్రి సమం స్థానం
బ్రహ్మాండే నాస్తికించనః
వేంకటేశ సమోదేవో
నభూతో నభవిష్యతిః...’
తిరుమల లాంటి క్షేత్రం మరెక్కడా ఉండదంటారు. శ్రీనివాసుడి లాంటి దైవం లేనే లేడంటారు. జగదీశ్‌ దృష్టిలో బర్డ్‌ స్థానమూ అంత మహోన్నతమైందే.

- సి.వాసుదేవ, ఈనాడు, తిరుపతి
ఫొటోలు: రమేష్‌కుమార్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.