close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జనం మారకుంటే...జల సంక్షోభమే!

జనం మారకుంటే...జల సంక్షోభమే!

నీళ్లు - మనుషుల సమూహమైన సమాజం - ప్రభుత్వం... దేశానికి మూడూ మూడు స్తంభాలు. నీళ్లు లేకపోతే మనిషిలో అభద్రత నెలకొంటుంది. దీంతో సమాజంలో అశాంతి రాజ్య మేలుతుంది. ఫలితంగా ప్రభుత్వ పాలన స్తంభించిపోతుంది. నీటిని పొదుపుగా వాడుకోవడం పౌరుల కర్తవ్యం. ప్రకృతిని జాగ్రత్తగా పరిరక్షించుకోవడం సమాజం బాధ్యత. వనరుల పట్ల ఒకింత ముందుచూపు పాలకుల ప్రాథమిక విధి. ఈ ముక్కోణంలో ఏకాస్త సమతౌల్యం దెబ్బతిన్నా - జల యుద్ధమే, జన సంక్షోభమే!

నిన్నటి పోరాటాలు - పశువుల కోసం!
అలనాటి సమాజంలో...ఆర్థిక వ్యవస్థ మొత్తం ఆలమందల చుట్టూ తిరిగేది. పశువులే ప్రధాన మారకాలు. గోవుల కోసం ఆదిమ తెగల మధ్య భీకరమైన తగువులు నడిచేవి. ఒక ఎకరం విలువ...వంద గిత్తలు, తులం బంగారం ధర...పది పాడి ఆవులు -ఇలా ఉండేవి లెక్కలు. పశుపతులే లక్ష్మీపతులు.
వజ్రవైఢూర్యాల కోసం!
కోహినూర్‌ చుట్టే చరిత్రంతా చక్కర్లు కొట్టిన రోజులున్నాయి. బంగారు నాణాల కోసం బీభత్సమైన యుద్ధాలు జరిగిన సాక్ష్యాలున్నాయి.
శిథిల హంపీ నగరం నుంచి అమూల్య సంపదల్ని తరలిస్తుంటే, ఆ భారాన్ని మోయలేక మదగజాలు సైతం కుప్పకూలిపోయేవట. ఆనాటి వ్యవస్థలో వజ్రవైఢూర్యాలున్న రాజ్యమే అత్యంత శక్తిమంతం.
ఇంధనం కోసం!
పెట్రో పెత్తనమే పరమ లక్ష్యంగా అంతర్జాతీయ రాజకీయాలు నడిచిన ఉదంతాలు అనేకం. ఇంధన వనరుల మీద ఆధిపత్యం సాధిస్తే, ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకున్నట్టే. ఇంధనమే అసలు సిసలు ధనం.

రేపటి పోరు -
నిస్సందేహంగా...నీటి కోసమే.ఆ పోరాటం...ప్రజలకూ ప్రజలకూ మధ్య కావచ్చు, ప్రజలకూ ప్రభుత్వాలకూ మధ్య కావచ్చు. జల వనరుల చుట్టూ జన రక్తం ప్రవహించే రోజు, గుక్కెడు నీళ్ల కోసం గొంతులు తెగ నరుక్కునే దుర్దినం...కనుచూపు మేరలో కనిపిస్తోంది. ఇప్పటికే ఆ విపరిణామాలు ఒక్కొక్కటిగా జరిగిపోతున్నాయి. యెమెన్‌ పీకలోతు జల సంక్షోభంలో కూరుకుపోయింది. అక్కడ, నీటి కోసం జరిగే ఘర్షణల్లో ఏటా నాలుగువేలమంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ నిరుపేద అరబ్‌ దేశంలో...నీటి చుక్క కోసం నిత్యపోరాటాలు అతి సాధారణం. బిందెడు నీళ్లు పట్టుకోడానికి ఇరవైనాలుగు గంటల సేపు వరుసలో నిలబడాలి. అయినా గొంతు తడుస్తుందన్న భరోసా లేదు. ఏ నిమిషంలో అయినా ట్యాంకరు ఖాళీ అయిపోవచ్చు. ఆ నిస్పృహ లోంచి దోపిడీ దొంగల్ని తలపించే నీటి ముఠాలు పుట్టుకొచ్చాయి.

ఉద్యమాల్ని ఉద్ధృతం చేయడానికైనా, హింసను ఉసిగొల్పడానికైనా నీటిని మించిన ఆయుధం లేదు. ఎందుకంటే...నీరు - అతి సున్నిత అంశం, అత్యంత విలువైన సంపద కూడా. నీటి మీద ఆధిపత్యం సాధిస్తే...పంచభూతాల పైనా పట్టు బిగించినట్టే. హరియాణాలో జాట్లు...రిజర్వేషన్ల కోసం పోరాటాన్ని తీవ్రతరం చేసినప్పుడు...రైళ్లను నిలిపేశారు. రోడ్లను దిగ్బంధం చేశారు. పాలన వ్యవస్థను అతలాకుతలం చేశారు. అయినా సర్కారు దిగిరాలేదు. దిల్లీ మహానగరానికి తాగునీటిని అందించే జలవనరులన్నీ దాదాపుగా హరియాణాలోనే ఉన్నాయి.

దిల్లీ గొంతెండితే, భారత్‌ గుండె మండినట్టే. ఆ వ్యూహంతోనే ఉద్యమకారులు జలాశయాల్ని ఆధీనంలోకి తెచ్చుకున్నారు.

అంతే, కేంద్ర సర్కారుకు కునుకుపట్టలేదు. వెంటనే సైన్యాన్ని దింపింది. జలవనరుల కోసం రక్షణ బలగాల్ని రంగంలో దించడం ఇదే మొదటిసారి. కానీ, ఇదే చివరిసారి కాకపోవచ్చు. ఉద్యమకారులనే ఏమిటి... తీవ్రవాద శక్తులు కూడా జలసంపదనే లక్ష్యం చేసుకుంటున్నాయి. ఏ అంతరిక్ష కేంద్రానికో కల్పించినట్టూ, ఏ పార్లమెంటు భవనం చుట్టో మోహరించినట్టూ - బావులూ, చెరువులూ, రిజర్వాయర్ల దగ్గర బలగాల్ని కేంద్రీకరించాల్సిన రోజులు దగ్గర్లోనే ఉన్నాయేమో. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లాగా, వాటర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌...అవసరమైనా కావచ్చు.

పల్లానికి పారిపోయే నీరు, ఎండకు ఆవిరైపోయే నీరు, వర్షానికి టపటపా రాలిపడే నీరు...వ్యవస్థను ఇంతగా ప్రభావితం చేయడానికి కారణం ఏమిటి? అంటే - ఈ సంక్షోభంలో మనిషే తొలి ముద్దాయి. అడ్డూ అదుపూ లేకుండా అడవుల్ని నరికాడు, వెనకాముందూ చూడకుండా భూగర్భాన్ని తోడేశాడు. న్యాయాన్యాయాలు ఆలోచించకుండా జీవనదుల్ని మురికి కూపాలు చేశాడు. దీంతో, భూమి కడుపు ఎండిపోయింది.ప్రకృతి కడుపు మండిపోయింది.

జలం..మనం!
మనసు...జలపాతాన్ని చూడగానే కేరింతలు కొడుతుంది, సముద్రం ఒడ్డున నిలబడగానే గంభీరంగా మారుతుంది, పిల్లకాలువ పక్కనుంచి వెళ్తుంటే పసితనాన్ని గుర్తుచేస్తుంది. వానలుపడి వంకలుపారితే...ఎగిరి గంతెయ్యాలన్నంత ఆనందం! చెరువెండిపోతే గుండె తరుక్కుపోతుంది. ఖాళీ బిందె ఎదురైతే అపశకునంగా తోస్తుంది. నిజానికి, మనిషి కూడా ఓ నడిచే నీటి బిందే! ఒంట్లో అరవైశాతం నీళ్లేగా! అందుకే కాబోలు, నీటిచుక్క కనిపించకపోతే బిక్కచచ్చిపోతాడు. అతడు తెలుగువాడు కావచ్చూ, బ్రెజిల్‌ పౌరుడూ కావచ్చు.

ఈమధ్య బ్రెజిల్‌లోని ఓ పట్టణంలో....వర్షాల్లేక జలవనరులు నిండుకున్నాయి. దీంతో మున్సిపల్‌ అధికారులు నీటి సరఫరాలో కోతలు విధించారు. నిన్నమొన్నటిదాకా నల్లా విప్పితే చాలు, పుష్కలంగా నీళ్లొచ్చేవి. ఇప్పుడేమో, కనాకష్టంగా వారానికి రెండ్రోజులు వదుల్తున్నారు. ఆ మార్పును జనం జీర్ణించుకోలేకపోయారు. భవిష్యత్తు ఇంకెంత భయంకరంగా ఉంటుందో అని బెంగపెట్టుకున్నారు. అందరినీ అభద్రత ఆవరించింది. రేపటి అవసరాల కోసం, పెద్దపెద్ద డ్రమ్ముల్లో నీళ్లు నిల్వ చేసుకున్నారు. అయినా ఆశ తీరలేదు. పెరట్లో గోతులు తవ్వుకుని, అక్కడా దాచుకోవడం మొదలుపెట్టారు. దీంతో కొరత మరింత తీవ్రమైంది. గోతుల్లోని నీటిచుట్టూ దోమలు చేరిపోయాయి. డెంగ్యూ ప్రబలింది. ఒకవైపు అనారోగ్యాలూ మరోవైపు నీటి సమస్యలూ. జనంలోనూ అసహనం మొదలైంది. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సి వచ్చింది. పరిస్థితి ఏ కాస్త అదుపు తప్పినా అంతర్యుద్ధమే.

కొన్నాళ్ల క్రితం, దిల్లీలోని రెండు వీధుల మధ్య సరిహద్దు గొడవ మొదలైంది. కుళాయి తమ ప్రాంతంలో ఉంది కాబట్టి, ఆ నీళ్లన్నీ తమకే చెందుతాయని ఓ వర్గం ప్రకటించుకుంది. రెండో ప్రాంతం ఆ బెదిరింపుల్ని పట్టించుకోలేదు. నిజానికి, అవతలి వీధిలో ఒక్క కుళాయి కూడా లేదు. ఎన్ని తగాదాలున్నా, ఎంత అవమానించినా తెల్లవారుజామున బిందెపట్టుకుని ఇటువైపు రావాల్సిందే. సమస్య చినికిచినికి గాలివానగా మారింది. ఆ సమయంలోనే, నల్లా దగ్గర ఓ వృద్ధుడు శవమై కనిపించాడు. పక్కనే, మనిషిలో నిండుకున్న మానవత్వాన్ని వెక్కిరిస్తున్నట్టు... ఖాళీ బిందె! నాగపూర్‌లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. అక్కడ, వేళాపాళా లేకుండా నీళ్లు వదుల్తారు. నగల దుకాణంలో పనిచేసే ఓ యువకుడు ఆ సమయానికి ఉద్యోగానికి వెళ్లాడు. తీరా ఇంటికొచ్చాక, కాలకృత్యాలు తీర్చుకోడానిక్కూడా నీళ్లు లేవు. ఆ సమయంలో నిద్రలేపడం ఎందుకని అనుకున్నాడో ఏమో...అడక్కుండానే పక్కింటివాళ్ల డ్రమ్ము లోంచి బిందెడు నీళ్లు తీసుకున్నాడు. ఆ విషయం వాళ్లకు తెలిసింది. ‘నీటి దొంగ’ అంటూ దెప్పిపొడిచారు. ఆ వాదులాట కాస్తా తగాదాగా మారింది. కత్తులు దూసుకున్నారు. ప్రాణాలు తీసుకున్నారు. మిగతా విషయాల్లో వాళ్లంతా మామూలు మనుషులే. మంచిచెడులు చర్చించుకుంటారు, పాపపుణ్యాలు తర్కించుకుంటారు. నీటి కరవు ముంచుకొస్తోందన్న అభద్రతే వాళ్లలోని రాక్షసుడిని నిద్రలేపింది. ఆ నిస్పృహ ఎంతోకాలం కొనసాగడానికి వీల్లేదు.

మనోజాడ్యాలు...
జల సంఘర్షణల వెనుక అభద్రతలూ అనిశ్చితులే కాదు, అనేక మానసిక కోణాలున్నాయి. ఆధునిక జీవితమే ఒత్తిళ్ల మయం. అనుబంధాల ఒత్తిళ్లూ, ఆర్థిక ఒత్తిళ్లూ, వృత్తి ఉద్యోగాల ఒత్తిళ్లూ...ఆ జాబితాలో ‘నీటి ఒత్తిడి’ అదనంగా చేరింది. కొన్నిసార్లు, ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకోడానికి కూడా చుక్క నీళ్లుండవు. నల్లాల దగ్గరికి పరుగెత్తాలి, ట్యాంకర్ల చుట్టూ గుమిగూడాలి. అదృష్టం బావుంటే బిందె నిండుతుంది. కాలం కలసిరాకపోతే కాళ్లీడ్చుకుంటూ వెనక్కి రావాల్సిందే. స్నానాలూ, వంటలూ, ఫలహారాలూ ...ఆ కొద్ది సమయంలోనే పనులన్నీ ముగించుకుని ఆఫీసులకు పరుగులు తీయాలి. క్షణం ఆలస్యమైనా గైర్హాజరే. ‘నల్లాలో నీళ్లు రాలేదు కాబట్టి, ఆఫీసుకు ఆలస్యమైంది’ అని చెబితే ఏ బాసూ ఒప్పుకోడు. ఏ అర్ధరాత్రో, అపరాత్రో వచ్చే కుళాయి నీళ్ల కారణంగా...కంటినిండా కునుకు కరవవుతుంది. నిద్రలేమి అనేకానేక శారీరక, మానసిక సమస్యలకు మూలం. డిప్రెషన్‌కూ దారితీస్తుంది. డిప్రెషన్‌ ఆత్మహత్య ఆలోచనల్ని ప్రేరేపిస్తుంది. 

ఆరోగ్య సంక్షోభం...
నీటికీ అనారోగ్యానికీ ప్రత్యక్ష సంబంధం ఉంది. నీటి కొరత పెరిగేకొద్దీ అనారోగ్యాలు పెరుగుతాయి. శరీరానికి తగినన్ని నీళ్లు అందకపోతే నిస్సత్తువ ఆవహిస్తుంది. ఒంట్లో నీరు తగ్గిన క్రమంలోనే కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. అధిక కొలెస్ట్రాల్‌ అంటే, గుండెకు అధిక ప్రమాదమే. శరీర వ్యవస్థలో నీటి పరిమాణం తగ్గిపోతే రక్తం చిక్కబడిపోతుంది. ఫలితంగా ప్రవాహానికి అడ్డంకులు మొదలవుతాయి. రక్తపోటు సమస్యకు మూలం ఇదే. నీటి కొరతతో మూత్రపిండాల పనితీరూ దెబ్బతింటుంది. నిర్జలీకరణ ప్రభావం జీర్ణ వ్యవస్థ మీద పడుతుంది. దీనివల్ల వచ్చే మలబద్ధకం సకల రోగాలకూ నెలవు. చర్మసమస్యలూ, మోకాళ్ల నొప్పులూ, వూబకాయం...ఒంట్లో నీటి కొరత వల్ల కూడా ఉత్పన్నం అవుతాయి. ఇవి చాలవన్నట్టు, కలుషిత జాలాల విష ప్రభావాలు. ఆసుపత్రుల్లోని మొత్తం రోగుల్లో... నీటి సమస్యల వల్ల రుగŒ్మతల పాలైనవారు అరవైశాతానికి పైగా ఉంటారని అంచనా.

అంతర్జాతీయ వివాదాలూ... మనకు సరిహద్దు దేశాలతో జల వివాదాలు ఉన్నాయి. వాటాల విషయంలో తరచూ గొడవలూ జరుగుతుంటాయి. ఒక్క భారత్‌ అనే కాదు...దాదాపు 145 దేశాలకు సంబంధించి 263 సరిహద్దు జలవనరులు ఉన్నాయి. అందులో ఇరవై ఒక్క నదులు, ఐదూ అంత కంటే ఎక్కువ దేశాల్లో ప్రవహిస్తున్నాయి. 2030 నాటికి, ప్రపంచ వ్యాప్తంగా మనిషికి అందుబాటులో ఉన్న జల వనరుల్లో నలభైశాతం దాకా అడుగంటి పోతాయని అంచనా.ఆ రోజే వస్తే సరిహద్దుల దగ్గర పరిస్థితి మరింత సున్నితంగా మారుతుంది. యుద్ధాలకు దారితీసినా తీయవచ్చు.

అన్నీ అపోహలే... చదువు పెరిగేకొద్దీ వివేకం పెరుగుతుందని అనుకుంటాం, పర్యావరణ స్పృహ అధికం అవుతుందని భావిస్తాం. కానీ ఇదేదీ నిజం కాదని కోల్‌కతాలో జరిగిన ఓ అధ్యయనం నిరూపిస్తోంది. చదువుతో పాటూ వివేకం పెరిగినా, పెరగకపోయినా ఆదాయం మాత్రం పెరుగుతుంది. ఆ ఆదాయంతో...నీళ్లు కొనుక్కోగల స్తోమత కూడా పెరుగుతుంది. అందుకే, ఓమోస్తరుగా చదువుకున్న వారితో పోలిస్తే ఉన్నత విద్యావంతుల ఇళ్లలోనే నీటి వృథా ఎక్కువని అధ్యయనం నిరూపించింది. ఇంట్లో మగాళ్లకంటే మహిళలే నీటిని ఎక్కువగా వృథా చేస్తారన్నది కూడా అపోహే.పురుషుడితో పోలిస్తే నీటి విషయంలో ఆమే పొదుపరి అని ఆ అధ్యయన సారాంశం. కోల్‌కతా నగరంలోని స్త్రీపురుషులతో విడివిడిగా ‘వాటర్‌ డైరీ’లు రాయించడం ద్వారా...నిర్ధరించారీ విషయాన్ని.

జలహింస ఇటీవల, మహారాష్ట్రలోని లాతూర్‌లో దాదాపు నూటయాభై ప్రభుత్వ-ప్రైవేటు ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. రోగుల ప్రాణాలు పోతున్నా ఏమీ చేయలేని పరిస్థితి. కారణం... నీటి కొరత! తగినన్ని నీళ్లు లేకపోతే శస్త్రచికిత్సలు అసాధ్యం. దీంతో వైద్యులు చేతులెత్తేశారు.ఆపరేషన్‌ థియేటర్లకు తాళాలేసి వెళ్లిపోయారు. అదే సమయంలో, ఓ మహిళ...ట్యాంకరు నీళ్ల కోసం వరుసలో నిలబడి...వడదెబ్బకు ప్రాణాలు విడిచింది. ఆ సంగతి తెలిసి ఆమె తల్లి కూడా కుప్పకూలిపోయింది. భూమి మీదున్న ప్రతి ఐదుగురిలో ఒకరు ఇప్పటికే జల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. 2025 నాటికి ప్రతి ముగ్గురిలో ఇద్దరు నీటి కరవు పీడితులే.

అక్షరాలా నీళ్లే కారణం! అక్షరాస్యతకూ నీటికీ ప్రత్యక్ష సంబంధం ఉంది. వెనుకబడిన ప్రాంతాల్లో పిల్లలు బడిమానేయడానికి అనేకానేక కారణాలు ఉండవచ్చు. అందులో ప్రధానమైంది నీటి కొరతే. చత్తీస్‌గఢ్‌లోని మడియాకచర్‌ గ్రామంలో చాలాకాలం క్రితమే ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేశారు. చక్కని భవనం కూడా నిర్మించారు. కానీ, పిల్లల హాజరీ అంతంతమాత్రమే! దీనికి రెండు కారణాలు...ఆ వూళ్లొ తీవ్రమైన నీటి కొరత ఉంది. చిన్నారులంతా బడి మానేసి ఎక్కడో ఉన్న వూటబావికెళ్లి నీళ్లు తెచ్చేవారు. బడి ఆవరణలో టాయిలెట్‌ ఉన్నా, నీటి సౌకర్యం లేకపోవడంతో...చుట్టూ దుర్గంధం! దీని వల్ల కూడా పిల్లలు అటువైపు తొంగి చూసేవారు కాదు. హాజరు ఎలా పెంచాలా అని బుర్రలు బద్ధలుకొట్టుకుంటున్నప్పుడు...ఉపాధ్యాయులకు ఓ ఆలోచన వచ్చింది. పాఠశాల డాబా మీద .. వర్షపునీటి నిల్వ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ ఏడాది వానలు బాగా కురవడంతో...బోలెడన్ని నీళ్లు సమకూరాయి. వాటినే శుద్ధిచేసి తాగునీటి అవసరాలకు ఉపయోగించారు. టాయిలెట్‌కూ కొన్ని మళ్లించారు. బడి పిల్లలు ఇంటికెళ్తూ, ఓ బిందె నీళ్లు పట్టుకెళ్లే వెసులుబాటు కూడా కల్పించారు. ఇంకేముంది, పాఠశాల కళకళలాడుతోంది.

ఆర్థిక సమస్యగా...
కార్పొరేట్‌ శక్తులు ప్రకృతిలో పుష్కలంగా లభించాల్సిన నీటిని అచ్చమైన అంగడి సరుకును చేస్తున్నాయి. సీసాల్లో బంధించి వెలకడుతున్నాయి. అంతర్జాతీయ నీటి వ్యాపారుల నుంచి స్థానిక ‘ట్యాంకర్‌ మాఫియా’ దాకా...ఎవరికి వారు సామాన్యుడి సంపాదనను జలగలా పిండేసుకునేవారే. రాజ్యాంగం మనిషికి జీవించే హక్కునిచ్చింది. జీవించాలంటే నీళ్లు కావాలి. అంటే, నీటి హక్కు కూడా జీవించే హక్కులో భాగమే. ప్రభుత్వాలు ఆ బాధ్యత నుంచి తప్పించుకోలేవు, ప్రైవేటు సంస్థలకు నీటి సరఫరా బాధ్యత అప్పగించి చేతులు దులుపుకోలేవు. అలాంటి కుతంత్రాల్ని జనం అనేక సందర్భాల్లో తిప్పికొట్టారు, అవసరమైతే తిరగబడ్డారు. పదిహేనేళ్ల క్రితమే బొలీవియాలో ప్రజలంతా ఏకమై అంతర్యుద్ధానికి తెరలేపారు. ఒకపక్క, బహుళజాతి సంస్థల కనుసన్నల్లో మెలిగే ప్రభుత్వం. మరోపక్క, నీటి కరవు ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలు. నీటి సరఫరా వ్యవస్థను పెట్టుబడిదారుల చేతిలో పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ జనం వీధుల్లోకి వచ్చారు. ఉద్యమాలు చేశారు. అంతిమ విజయం ప్రజలదే అయ్యింది. మహారాష్ట్రలోని ఓ మున్సిపాలిటీ వాళ్లూ ఇలాంటి అనాలోచిత నిర్ణయమే తీసుకున్నారు. ఆ తర్వాత, జనాగ్రహానికి తోక ముడిచారు.

వాడుకోడానికి ట్యాంకర్లు వేయించుకోవాలి. తాగడానికి సీసాల్లో కొనుక్కోవాలి. ఇంటికి క్యాన్లు తెప్పించుకోవాలి. ఇదంతా సామాన్యుడి మీద అదనపు భారమే. నీటి వ్యాపారం చిన్నదేం కాదు, వేల కోట్ల సామ్రాజ్యం. ఆ మార్కెట్‌ ఏటా నలభై నుంచి యాభైశాతం చొప్పున పెరుగుతోంది కూడా. సీసాలకెక్కుతున్న నీళ్లు...సామాన్యుల కోసం భూమితల్లి తన స్తన్యంలో భద్రంగా దాచిపెట్టుకున్నవే. హైదరాబాద్‌ లాంటి మహానగరాల్లో కనాకష్టంగా పదీపదిహేను వేల జీతం అందుకునే సామాన్య ఉద్యోగి...నీటి అవసరాల కోసమే నెలకు రెండు నుంచి రెండున్నరవేల రూపాయల దాకా ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ బరువు అతడిని ‘ఆర్థిక ఒత్తిడి’కి గురిచేస్తోంది. అదే మొత్తాన్ని ఏ భవిష్యనిధికో మళ్లిస్తే మలిసంధ్యలో చింతలుండవు, ఏ పిల్లల చదువులకో వెచ్చిస్తే చిన్నారుల జీవితాలు బాగుపడతాయి. ఇక్కడ నయాపైసా ఉపయోగం లేదు. ఆర్థిక వేత్తలు ‘వాటర్‌ పావర్టీ’ అన్న మాటను తరచూ ఉపయోగిస్తుంటారు. ఆ నిర్వచనం ప్రకారం.. ఎన్ని సౌకర్యాలున్నా తగినన్ని నీళ్లు లేకపోతే ఆ ప్రాంత ప్రజలు పేదరికంతో బాధపడుతున్నట్టే, అది జల దారిద్య్రం!

రేపటి కోసం...
ఒకప్పుడు అత్యధిక వర్షపాతానికి నెలవైన చిరపుంజి నేడు బీడుభూమిగా మారిపోయింది. ఆ అభావం పూర్తిగా మనిషి స్వయంకృతమే. జనం యథేచ్ఛగా చెట్లు కొట్టేశారు. అడవుల్ని నాశనం చేశారు. చిరపుంజి అనే ఏమిటి...నీటి కరవు నెలకొన్న చాలా ప్రాంతాలు...మనిషి స్వార్థానికి సాక్ష్యాలే. ఇన్ని కరవుల తర్వాత కూడా, ఇంత విధ్వంసం జరిగాక కూడా....భూమ్మీద ఎంతోకొంత నీరు ఉంది. మనిషి తన అవసరాల మేరకే తోడుకోగలిగితే, ఆ జలనిధి తూకమేసినట్టు సరిపోతుంది. కానీ, అవసరానికి మించి...పదిహేడు రెట్లు అధికంగా, భూగర్భాన్ని పిండుకుంటున్నాడు. నేటి నీటి కరవులైనా, రేపటి నీటి యుద్ధాలైనా ఆ దోపిడి ఆనవాళ్లే. అన్నిటికంటే ముందు, మనిషి తన కక్కుర్తిని వదిలేసుకోవాలి. ఆస్తిపాస్తుల విషయంలో...నా పిల్లలూ, ఆ పిల్లల పిల్లలూ అంటూ ఏడుతరాల కోసం ఆబగా పోగేస్తాడే? నీటి విషయంలో మాత్రం అంత సంకుచిత దృష్టా? వందేళ్ల తర్వాతో, నూటయాభై ఏళ్ల తర్వాతో...తన మునిమనవడో, మునిమునిమనవడో గొంతెండి చచ్చిపోయే పరిస్థితి వస్తే...ఆ భవనాలూ, ఆ కరెన్సీ కట్టలూ, ఆ నగానట్రా - ఏవీ కాపాడలేవన్న నిజాన్ని ఎందుకు తెలుసుకోడూ? ఈరోజు ఓ బిందెడు నీళ్లు ఆదా చేయగలిగితే, అవే గుక్కెడు అమృతమై రేపటి తరాల్ని బతికిస్తాయి. అసలు సిసలు ఆస్తులు భవంతులో బంగారమో కాదు...అచ్చంగా నీళ్లే! అనగనగా కథలో ఓ పండు ముసలి భవిష్యత్తు తరాల కోసం మామిడి మొక్కను నాటినట్టు...మనిషీ జలవనరుల్ని భద్రపరచాలి.

ఖజానాలోని ప్రతి రూపాయికీ బాధ్యత వహించినట్టే...భూమిలోని ప్రతి నీటి బొట్టుకూ సర్కారువారే సంరక్షకుల్లా వ్యవహరించాలి. ‘నీటి ఆడిట్‌’ ద్వారా ప్రాజెక్టుల్లోని నీరు...ప్రతి ఎకరాకూ ఎంత పరిమాణంలో చేరుతోందో...లెక్కగట్టే పద్ధతి ఉండాలి. పారిశ్రామిక రంగానికి అప్పనంగా అప్పజెపుతున్న నీటికి, ఆయా సంస్థల యాజమాన్యాలే బాధ్యత వహించేలా చూడాలి. ఖర్చుపెట్టిన ప్రతి చుక్క నీటికీ...ఓ మొక్క నాటేలా ఒత్తిడి చేయాలి. అత్యాధునిక టెక్నాలజీ ద్వారా అవే నీటిని తిరిగి వాడుకునేలా ప్రోత్సహించాలి. రసాయనాలతో నదుల్ని కలుషితం చేసే పరిశ్రమలకు తాళాలు వేయాలి. విద్యుత్తు రంగంలో ఉన్నట్టే... తాగునీటిలో, సాగునీటిలో కూడా సరఫరా లోపాలున్నాయి. పాతికశాతం దాకా జలసంపద వృథాగా పోతోంది. కాలువలూ, పైపులైన్ల మరమ్మతు ద్వారా ఆ నష్టాన్ని నివారిస్తే...ఎంతోకొంత మంచి జరుగుతుంది. ఇవన్నీ పాలకుల వైపు నుంచి జరగాల్సిన పనులు.

నీటి కొరతను సమస్యగానో సంక్షోభంగానో భావించి ...వణికిపోవడమో, ఒత్తిడికి గురికావడమో ఒక కోణం, నిరాశావాద దృక్పథం. దాన్నో సవాలుగా తీసుకుని పరిష్కారాన్ని కనుగొనడం మరో కోణం, వివేకవంతుల లక్షణం. గుక్కెడు నీళ్లు కూడా లేని పల్లెలూ, పిడికెడు పంటలు కూడా పండని నేలలూ...మనిషి చొరవతో కళకళలాడుతున్న ఉదంతాలు అనేకం. నీటి సమస్య అనగానే, వీధి కుళాయి దగ్గర బిందెలతో బాదుకునే మహిళల చిత్రమే కనిపిస్తుంది. కాదుకాదు...మహిళలంటే సమష్ఠిశక్తికి సంకేతమని చాటుతున్నారు ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ నారీమణులు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్య అంటే, అచ్చంగా మహిళల సమస్యే. స్నానాల నుంచి వంట దాకా...అన్ని అవసరాలూ తీర్చాల్సిన బాధ్యత ఆమెదే. రోజూ ఆ పల్లెపడుచులు నీటి కోసం ఎనిమిది మైళ్లు వెళ్లాల్సి వచ్చేది. ఓరోజు, బడలిక తీర్చుకోడానికి, బిందెలు పక్కన దించి...చెట్టు నీడన కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు ‘ఎన్నాళ్లీ కష్టాలు?’ అన్న చర్చ వచ్చింది. పరిష్కారం వైపుగా ఆలోచించారు. ‘జల్‌ సహేలీ’ పేరుతో ఓ సంఘాన్ని ప్రారంభించారు. అధికారుల వెంటబడి గొట్టపుబావి మంజూరు చేయించుకున్నారు. భర్తల చెవుల్లో జోరీగలై...చెరువు మరమ్మతుకు పురమాయించారు. ఆ సంఘం అనేక గ్రామాలకు విస్తరించింది. సమావేశాలకు వెళ్తున్నప్పుడు నీలం రంగు చీరకట్టుకోవాలన్నది ‘జల్‌ సహేలీ’ నియమం. నీలం ... నీటికి ప్రతీక, జలవిజయానికి సంకేతం.

***

తగువు తీర్చిపెట్టమని ఇద్దరు అన్నదమ్ములు మర్యాద రామన్న ఇంటికెళ్లారు. కాళ్లు కడుక్కుని లోపలికి రమ్మంటూ రామన్న చెరో నిండుబిందె చూపించాడు. అన్న...ఆ నీళ్లన్నీ గబగబా కాళ్ల మీద కుమ్మరించుకుని లోపలికి వెళ్లాడు. తమ్ముడు...అందులోంచి కాసిన్ని నీళ్లు తీసుకుని పాదాల్ని తడుపుకున్నాడు. ఆ నీటి బిందెను జాగ్రత్తగా పక్కన పెట్టి లోపలికి వెళ్లాడు. ‘పెద్దవాడు దుబారా మనిషనీ చిన్నవాడు పొదుపరి అనీ నీటివాడకాన్ని బట్టే అర్థం అవుతోంది. కాబట్టే, పెద్దవాడు ఆస్తులన్నీ కరిగించుకున్నాడు, చిన్నవాడేమో జాగ్రత్తగా ఖర్చుపెట్టుకుని మరింత సంపద పోగేసుకున్నాడు. తమ్ముడి ఎదుగుదలకు ఓర్వలేకే, ఆస్తులు సమానంగా పంచలేదంటూ అన్న పంచాయతీ పెట్టాడు. తమ్ముడి బిందెలో నీళ్లు ఉన్నట్టే, తమ్ముడి వైపున న్యాయం ఉంది’ అని తీర్పు ఇచ్చాడు రామన్న.

మనిషి ఆశను తీర్చగలిగేంత స్తోమత ప్రకృతికి ఉంది. మనిషి దురాశను సంతృప్తిపరిచేంత సంపద ...సృష్టిలోని ఏ శక్తికీ లేదు. దురాశను వీడితే, నిరాశా వీడుతుంది. వాస్తవం బోధపడుతుంది. జలాన్ని ఓ అవసరంగా, ఓ వనరుగా చూడ్డం మానేస్తాడు. దీంతో, మనసు చుట్టూ ముసురుకున్న ఒత్తిడి తగ్గుతుంది. ప్రకృతి ప్రసాదంగా, జీవశక్తిగా గౌరవించడం ప్రారంభిస్తాడు. ప్రేమ ఉన్న చోట ‘కరవు’కు స్థానం ఉండదు.
నీరు నిండుకోదు...నోరు ఎండిపోదు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.