close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సీఎం మెచ్చిన శ్రీమంతుడు

తెలివితేటలకు మంచి ఆలోచన, అలుపెరగని శ్రమ తోడైతే ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదగొచ్చు. బోలెడు డబ్బు, ఆస్తులూ సమకూర్చుకోవచ్చు. కానీ మనతోపాటు మన చుట్టూ ఉన్నవాళ్లూ ఎదిగేలా చేయగలగడమే అసలైన ఎదుగుదల అంటారు పెద్దలు. అందుకే కాబోలు పుట్టి, పదహారేళ్లు పెరిగిన సొంతూరును ఎప్పుడో విడిచి వెళ్లిపోయినా, ఆ ఊరి ప్రజల బాగుకోసం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారు కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత కామిడి నర్సింహారెడ్డి. కోట్లు వెచ్చించి గ్రామస్థుల అవసరాలు తీర్చుతూ, వారి ముఖాలపై చిరునవ్వై మెరుస్తున్నారు.

‘‘చేసింది చెప్పుకోవడం నాకు ఇష్టముండదు. ఎందుకంటే సాయం చేయడమనేది నలుగురికి చెప్పుకోవాల్సిన విషయం కాదు... తోటివారి పట్ల మన బాధ్యత. అందుకే నా సంపాదన ప్రారంభమైనప్పటి నుంచే అవసరమున్న వారికి చేయూతనందిస్తున్నా’’ అంటారు కామిడి నర్సింహారెడ్డి. ఆయన స్థాపించిన కేఎన్‌ఆర్‌ సంస్థ వివిధ రాష్ట్రాల్లో బైపాస్‌లూ, ఎక్స్‌ప్రెస్‌ వేలూ, టోల్‌ రోడ్లూ నిర్మిస్తుంటుంది. ఆ పనుల్లో భాగంగా ఆయా ప్రాంతాలకు వెళ్లినప్పుడు స్థానిక గ్రామాల్లో సమస్యలూ, అవసరాలూ తెలుసుకుని సాయపడేవారు నర్సింహారెడ్డి. తాను అందుబాటులో లేకపోయినా ఉద్యోగుల్లో ఎవరో ఒకరికి ఆ పని అప్పగించేవారు. అయిదేళ్ల నుంచి తమ సొంతూరు దమ్మన్నపేటను బాగు చేస్తూ స్థానికులకు తోడుగా ఉంటున్నారు. దీన్ని గమనించిన ప్రభుత్వ అధికారులు పల్లెప్రగతి రెండో విడతను దమ్మన్నపేట లోనే ప్రారంభించారు. అలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి నర్సింహారెడ్డి గురించి తెలిసి అసెంబ్లీలో ప్రస్తావించారు. తర్వాత ఆయన గురించీ, సేవా కార్యక్రమాల గురించీ నలుగురికీ తెలిసింది.

నర్సింహారెడ్డిది వరంగల్‌ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలంలోని దమ్మన్నపేట గ్రామం. 800 కుటుంబాలుండే ఆ ఊళ్లో వారిదో మధ్యతరగతి కుటుంబం. అమ్మానాన్నలు వ్యవసాయదారులు. ఇద్దరు ఆడపిల్లల తర్వాత పుట్టడంతో ఆయన్ని చాలా గారాబంగానే పెంచారు. బాగా చదివించాలనీ అనుకున్నారు. అయితే ఊళ్లో సరైన రోడ్లుకానీ, మంచి బడి కానీ ఉండేవి కావు. దాంతో చాలామంది గ్రామ పాఠశాలలో ఉన్నంత వరకూ.. అంటే నాలుగో తరగతితో చదువు ఆపేసేవారు. నర్సింహారెడ్డి మాత్రం అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రెడ్డిపాలేనికి నడుచుకుంటూ వెళ్లి చదువుకునేవారు. అలా కష్టపడి స్కూలు చదువు పూర్తి చేశాక పీయూసీ కోసం వరంగల్‌ వెళ్లిపోయారు. ఆ తర్వాత అక్కడే బీఏలో చేరారు. కారణాంతరాలతో డిగ్రీ మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఆ సమయంలో నర్సింహారెడ్డికి ఓ కాంట్రాక్టరు పరిచయమయ్యారు. ఆయనను చూసి నర్సింహారెడ్డికీ ఆ పని మీద ఆసక్తి కలిగింది. తానూ సివిల్‌ కాంట్రాక్టులు తీసుకుని రోడ్లూ, కల్వర్టులూ, చిన్న చిన్న వంతెనలూ కట్టించడం మొదలుపెట్టారు. కాంట్రాక్టు వర్కులంటే అమ్మానాన్నలు కాస్త భయపడ్డారు. కానీ, నర్సింహారెడ్డి మాత్రం వారిని ఒప్పించి పని చేసుకుంటూ వెళ్లిపోయారు. ధైర్యంగా ఒక్కో అడుగూ ముందుకేస్తూ ఒక్కరే అన్ని పనులూ చూసుకుంటూ ఆరేళ్లు కష్టపడ్డారు. ఆ తర్వాత క్రమంగా ఉద్యోగుల్ని చేర్చుకోవడం మొదలుపెట్టారు. కొన్నాళ్లు వరంగల్‌లో కాంట్రాక్టులు చేశాక సంస్థను విస్తరించాలనే ఉద్దేశంతో హైదరాబాదు వచ్చేశారు.

ఇంటినే కాదు ఊరిని కూడా..!
కేఎన్‌ఆర్‌ నెమ్మదిగా పరిచయాలు పెంచుకుంటూ పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకోవడం మొదలుపెట్టారు. క్రమంగా జాతీయ స్థాయిలో టెండర్లు వేయడం ప్రారంభించారు. అలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు మరో పన్నెండు రాష్ట్రాలూ, బంగ్లాదేశ్‌లలో పనిచేస్తూ పాన్‌ ఇండియా సంస్థగా కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ను తీర్చిదిద్దారు. ప్రస్తుతం వీరి సంస్థలో నేరుగా ఆరువేల మందికి, పరోక్షంగా మరో నాలుగు వేల మందికి ఉపాధి లభిస్తోంది. వాళ్లలో దమ్మన్నపేట, ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్లు దాదాపు 600 మందికి పైనే ఉన్నారు. డ్రైవర్లూ, ఆపరేటర్ల నుంచి ఇంజినీర్ల వరకూ- రెండు తరాల వారు పనిచేస్తున్నారు. ‘‘ఇప్పటికీ ఉద్యోగం కోసం ఎవరు వచ్చినా కాదనకుండా తీసుకుంటా. ఎందుకంటే మా ఊరంటే నాకెంతో ప్రేమ’’ అంటారు నర్సింహారెడ్డి. అయితే, పనుల ఒత్తిడి వల్ల సొంతూరుకు వెళ్లడమే తగ్గిపోయిందని బాధపడుతూ తాతముత్తాతల కాలం నాటి తమ ఇల్లు శిథిలావస్థకు చేరిందని తెలిసి 2014లో ఒకసారి కుటుంబంతో కలిసి చూడ్డానికెళ్లారు. పాడుబడిన ఇంటిని చూసి ఆయన గుండె కలుక్కుమంది. తన బాల్య స్మృతులను నిలబెట్టుకునేలా అక్కడే ఓ భవంతిని నిర్మించుకున్నారు. ఆ గృహ ప్రవేశానికి బంధువులు, గ్రామస్థులందర్నీ పిలిచారు. అప్పుడే ఒక్కొక్కరుగా వచ్చి సమస్యలు చెప్పడం మొదలుపెట్టారు. నీటి ఎద్దడి, రోడ్లు లేక బస్సు సౌకర్యం లేకపోవడం, వర్షాకాలం వస్తే పొంగిపొర్లే వాగు, పాడుబడిపోయిన స్కూలు బిల్డింగు, ఎండిపోయిన చెరువు... ఇవన్నీ తెలిశాక తమ ఇంటితోపాటు ఊరినీ బాగు చేసుకోవాలనిపించింది. అప్పట్నుంచీ ఊరికి కష్టమొస్తే తనకు కష్టమొచ్చినట్టు భావించి అండగా నిలుస్తున్నారు నర్సింహారెడ్డి.

నీటి అవసరం తీర్చి...
గ్రామస్థుల ఇబ్బందులు విన్నాక- ముందుగా వారికి అత్యవసరమైన తాగునీరు అందించాలనుకున్నారు కేఎన్‌ఆర్‌. ఊరి చివర లోతుగా ఓ పెద్ద బావి తవ్వించి గ్రామం లోపలకి పైపు లైన్లు వేయించారు. ఆ బావికి చుట్టూ ఇంకుడు గుంతలు తీయించారు. దాంతో నీటి నిల్వలు పెరిగి ఆ బావి వేసవిలో సైతం ప్రజల అవసరాలు తీరుస్తోంది. అలానే దమ్మన్నపేట నుంచి ఆ పక్కనే ఉన్న జగ్గిపేట వరకూ నాలుగు కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు వేయించి, మధ్యలో అడ్డంకిగా ఉన్న వాగుపై వంతెన నిర్మించారు. గుడిని బాగు చేయించారు. శ్మశానం కోసం పదెకరాల స్థలం కొనిచ్చారు. అలానే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఇబ్బంది పడుతుంటే కొన్ని అదనపు గదులూ, మరుగుదొడ్లూ, సాంస్కృతిక కార్యక్రమాలకు ఓ వేదికా కట్టించారు. పిల్లలకు స్వచ్ఛమైన నీరు అందించాలని పాఠశాల ఆవరణలోనే బోరుబావి తవ్వించి ఆర్వో వాటర్‌ ప్లాంటు పెట్టించారు. ప్రతిభ ఉండీ చదువుకునే స్తోమత లేని విద్యార్థుల్ని గుర్తించి కాలేజీ, హాస్టల్‌ ఫీజులు కట్టి విద్యలో ప్రోత్సహిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలకు కూడా రోడ్లు వేయించారు. దీంతో దమ్మన్నపేట వాసుల రవాణా కష్టాలు తీరాయి.


కేఎన్‌ఆర్‌ సంస్థ అభివృద్ధిలో నరసింహారెడ్డి కుమారుడు జలంధర్‌రెడ్డిది కీలకపాత్ర. కర్ణాటక, బిహార్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా లాంటి పన్నెండు రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్‌లో కూడా సివిల్‌ వర్కులు చేశారు. ప్రస్తుతం కొన్నిచోట్ల పనులు నడుస్తున్నాయి. 2018లో ఈ సంస్థ ఫాస్టెస్ట్‌ గ్రోయింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ విభాగంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకుంది. కేఎన్‌ఆర్‌ వయసు 75 ఏళ్లు. ఇప్పటికీ రోజూ పొద్దున్నే ఆరుగంటలకే సైట్‌కి వెళ్లి పని చూసుకుని మళ్లీ పది గంటలకి ఆఫీసుకి వెళ్తారు. ఏసీ గదుల్లో నాలుగ్గోడల మధ్య దొరకని సంతృప్తి మండుటెండలో పనిప్రదేశంలో దొరుకుతుందని, అదే తనను ఉత్సాహంగా ఉంచుతుందంటారు.


ఆరోగ్యానికి అభయం
ఈ క్రమంలోనే మండల కేంద్రమైన వర్ధన్నపేట ప్రాథమిక ఆసుపత్రిలో పరికరాల కొరత, గదులు, ప్రహరీ, రోగులతోపాటు వచ్చేవాళ్లకి వసతి లేకపోవడం తదితర సమస్యల గురించి నర్సింహారెడ్డికి తెలిసింది. దాన్ని ఎలాగైనా బాగు చేసి మండల ప్రజలకు మంచి వైద్యం అందేలా చూడాలని ఆపరేషన్‌ థియేటర్‌, పోస్ట్‌ ఆపరేషన్‌ వార్డు, వైద్యులకు ఓపీ గదులూ, రోగులతోపాటు వచ్చేవారికి వసతీ, ఇతర సౌకర్యాల కోసం తన వంతుగా కోటిన్నర రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి అందించారు. అలాగే, ఊళ్లోని అంగన్‌వాడీ కేంద్రంలో ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి మందులు సమకూర్చి, ఇరవైనాలుగ్గంటలూ ఓ అంబులెన్స్‌, డ్రైవర్‌ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు కొంతకాలంగా వర్షాలు సరిగా పడకపోవడంతో చెరువు నిండక రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్క ఊరునుంచి నీరు తెప్పించి చెరువును నింపితే ఏటా రెండు పంటలు పండి రైతుల కష్టాలు తీరతాయి, కూలీలకు చేతి నిండా పని దొరుకుతుంది. నర్సింహారెడ్డి ప్రస్తుతం ఆ పనిమీదే ఉన్నారు.

‘‘మా ఊరి సమస్యలు చాలా వరకూ తీరాయనే అనుకుంటున్నా. భవిష్యత్తులో ఇంకే అవసరం వచ్చినా తీర్చడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పటి వరకూ ఊరి కోసం రూ.పాతిక కోట్లకుపైగా ఖర్చు పెట్టగలిగానంటే... అది నా అదృష్టం. నాకు ఆ శక్తి ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నా’’ అని వినమ్రంగా చెబుతారు నర్సింహారెడ్డి. అమ్మలాంటి పల్లెకు అన్నీ తానే అయ్యి కంటికి రెప్పలా చూసుకుంటున్న కేఎన్‌ఆర్‌.. అసలు సిసలు శ్రీమంతుడంటే ఎవరు కాదనగలరు!

జి.పాండురంగశర్మ, ఈనాడు, వరంగల్లు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.