close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జెట్‌ నడిపే డాక్టర్ని..!

డాక్టర్‌ కొడిదిని వి.విజయ్‌... తెలుగువారే కానీ మనదేశంలో ఆయనకి సంబంధించిన విశేషాలన్నీ మొదట ఆంగ్ల పత్రికల్లోనే వచ్చాయి. వాట్సాప్‌లో హల్‌చల్‌ చేశాయి. వాటి సారాంశం... అమెరికాలో ప్రముఖ హృద్రోగ నిపుణుడైన డాక్టర్‌ విజయ్‌, కరోనా నేపథ్యంలో పైలట్‌గా మారి బోయింగ్‌ జెట్‌ విమానాలని నడుపుతూ వివిధ దేశాల నుంచి అమెరికాకి అత్యావశ్యక వస్తువులని తెచ్చిస్తున్నాడు... ఆయన్ని పలకరిస్తే ఓ తెలుగు వైద్యుడి సాహసభరితమైన జీవనయానం కళ్లకు కడుతుంది. ఆ ప్రస్థానం ఆయన మాటల్లోనే...
 నేను న్యూయార్క్‌ నగరంలో క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న రోజులవి. ఇండియాలో ఎంబీబీఎస్‌ చదివి ఎమ్మెస్‌ చేద్దామని అమెరికా వెళ్లాను. అక్కడ నా ఖర్చుల కోసం ఉదయంవేళ ట్రెయినింగ్‌కి వెళ్లి రాత్రుళ్లు ట్యాక్సీలు నడిపేవాణ్ణి. ఎమ్మెస్‌లో చేరాలంటే ఈసీఎఫ్‌ఎంజీ అనే పరీక్ష రాయాలి. దానికి నాలుగువందల డాలర్లు కట్టాలి. అందుకు నాలుగురోజులే గడువుంది. ట్యాక్సీ ద్వారా అప్పటికీ 150 డాలర్లు కూడబెట్టగలిగాను. మరో 250 డాలర్లు సంపాదించాలి. ఏదో అద్భుతం జరిగితే తప్ప... ఎంత శ్రమించినా క్యాబ్‌ ద్వారా రోజుకి 40 డాలర్లకంటే వచ్చే అవకాశం లేదు. దాంతో ఎలాగూ ఈసారి పరీక్ష రాయడం సాధ్యం కాదు అనుకుంటూనే ఆ రోజు క్యాబ్‌ డ్రైవర్‌గా డ్యూటీకి వెళ్లాను. మనసులో ఎన్నో ఆందోళనలు. ‘ఈసారి నేను ఈసీఎఫ్‌ఎంజీ పరీక్ష మిస్‌ అయితే ఆరునెలలు ఆగాలి! ఎవరి ఆసరా లేకుండా, ఏ కాలేజీలోనూ సీటు రాకుండా ఆరునెలలు అమెరికాలో గడపడం చాలా కష్టం. ఏం చేయాలిరా... భగవంతుడా!’ అనుకుంటూ వెళుతుంటే ఓ వ్యక్తి నా ట్యాక్సీలో ఎక్కి ఓ ఏరియా పేరు చెప్పి వెళ్లమన్నాడు. మరి కాసేపట్లో అతను చెప్పిన ప్రాంతం వస్తుందనగా సిగ్నల్‌ పడితే ఆగాను. అంతే... అదే అదనుగా గబుక్కున కారు డోరు తెరిచి పరుగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. అంటే, నాకివ్వాల్సిన కిరాయి ఇవ్వకుండా పారిపోయాడు! న్యూయార్క్‌లో ఇది మామూలే. ‘అసలే ఉపాధి వెతుక్కుంటూ వచ్చినవాళ్లం... వాళ్లతో మనమేం దెబ్బలాడతాం!’ అని ఉసూరుమంటూ నేను ఉండిపోతే ఒకావిడ హడావుడిగా వచ్చి ‘ఎయిర్‌పోర్టుకు వెళ్లాలి... పద!’ అంది. ఆమె ఆఫ్రికా-అమెరికన్‌ ఇంగ్లిషు ఉచ్చారణ నాకు సరిగ్గా అర్థంకాకపోయినా... ఎనిమిది గంటల ఫ్లైట్‌ పట్టుకునే హడావుడిలో ఉందని మాత్రం అర్థమైంది. అప్పుడేమో సమయం 7.20. అక్కడికి వెళ్లడానికి కనీసం నలభై నిమిషాలవుతుంది. ఉన్న సమయం చాలా తక్కువ. ‘మేడమ్‌... వీలున్నంత వరకూ ప్రయత్నిస్తాను!’ అని చెప్పి కారుని స్టార్ట్‌ చేశాను. మధ్యమధ్యలో ‘అయ్యో... నీకు ఇంగ్లిషు అర్థంకాదా!’ అంటూ ఆమె విసుక్కుంటున్నా భరిస్తూ, న్యూయార్క్‌ ట్రాఫిక్‌ని ఒడుపుగా తప్పించుకుంటూ వెళుతున్నాను. ఓ రకంగా నా జీవితంలో కీలకమైన ప్రయాణాల్లో అదీ ఒకటి. దాని గురించి చెప్పేముందు నేను అసలు అమెరికా దాకా ఎలా వెళ్లానో చెబుతాను...

మా అమ్మానాన్నలది చిత్తూరు జిల్లా మదనపల్లె. మా అమ్మ సుహాసినీదేవి 1960ల్లోనే నాగ్‌పూర్‌ లేడీ అమృతాబాయి డాగా కాలేజీలో ఛైల్డ్‌సైకాలజీ చదువుకుని... తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా చేసేది. నాన్న వెంకటరమణ ఐఐటీ బొంబాయిలో ఓషనోగ్రఫీ ఇంజినీరింగ్‌ చదివి తిరుపతి ఎస్వీ ఇంజినీరింగ్‌ కాలేజీలో ప్రొఫెసర్‌గా ఉండేవారు. నన్నూ ఎస్వీ విశ్వవిద్యాలయ క్యాంపస్‌ స్కూల్లోనే చేర్చారు. తిరుపతికి విమానాలు మొదలైన కొత్త అది. మా క్లాస్‌రూమ్‌ కిటికీ నుంచి తొలిసారి విమానాన్ని చూసినప్పుడు అందరితోపాటూ కేరింతలు కొట్టడంతోనే ఊరుకోకుండా... దాన్నెవరు నడుపుతారు? అంత ‘చిన్న’ దాన్లో మనుషులెలా పడతారు?’ అంటూ అందర్నీ విసిగించేవాణ్ణట. మూడో తరగతిలో మమ్మల్ని రేణిగుంట విమానాశ్రయానికి ఎక్స్‌కర్షన్‌కి తీసుకెళ్లి విమానం ఎక్కించినప్పుడు, ఆ ఎక్స్‌కర్షన్‌కి సంబంధించిన వ్యాసరచన పోటీలు పెడితే నేనే ఫస్ట్‌ వచ్చాను. నేను పైలట్‌ని కావాలనే కోరికకి అప్పుడే బీజం పడింది. ఎనిమిదో తరగతిదాకా నా కలలు దాని చుట్టే కట్టుకున్నానుకానీ... పైలట్‌ కావాలంటే ఏవియేషన్‌ ఇంజినీరింగ్‌ చదవాలనీ, అది చదవాలంటే లెక్కలు బాగా రావాలనీ అప్పట్లో అనుకునేవాళ్లం. నాకేమో లెక్కలు సరిగా రావు. దాంతో తొమ్మిదో తరగతి నుంచి పైలట్‌ ఆలోచనల్ని వదిలి మా మేనమామల్లాగా వైద్యవృత్తివైపు వెళ్లాలనుకున్నాను. ఇంటర్‌ ముగించి తిరుపతి ఎస్వీ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చదివాను. ఎంబీబీఎస్‌ చదువుతున్నప్పుడే హృద్రోగ
నిపుణుణ్ణి కావాలనే లక్ష్యం బలపడింది. అది నెరవేరాలంటే అమెరికాకి వెళ్లడం తప్పనిసరి. అప్పటికే అమెరికాలో మా దగ్గరి బంధువులున్నారు కానీ... నాకు వాళ్ల సాయం తీసుకోవడం ఇష్టంలేదు. ఎంబీబీఎస్‌ చదివించాక కూడా ఇంకా అమ్మానాన్నలపైన ఆధారపడటం తప్పనిపించింది. దాంతో నేను ఓ ‘క్లాసికల్‌ ఇమ్మిగ్రెంట్‌’గా... అంటే కట్టుబట్టల్తో, కాసిన్ని డబ్బుల్తో అమెరికాలో స్థిరపడ్డ తొలితరం భారతీయుల్లాగా అడుగుపెట్టాలనుకున్నాను. అప్పట్లో అమ్మానాన్నలు వెస్టిండీస్‌ యూనివర్సిటీలో లెక్చరర్‌లుగా పనిచేస్తుండటంతో నేను ‘హౌస్‌ సర్జన్‌’గా పని చేశాను. అక్కడ నాకొచ్చిన నాలుగువందల డాలర్ల స్టైపెండ్‌తోనే న్యూయార్క్‌కి వచ్చాను. నిరుపేదలుండే బ్రాక్స్‌ సెక్షన్‌లో తలదాచు కుంటూ ట్యాక్సీ నడపడం మొదలుపెట్టాను.

ఆ రోజు రాత్రి ఆ ఆఫ్రికా-అమెరికన్‌ మహిళని ట్యాక్సీలో ఎయిర్‌పోర్టులో దిగబెట్టేందుకు వెళుతున్నాను. చాలా వేగంగా, కానీ ఒడుపుగా ఇరవై ఐదు నిమిషాల్లోనే గమ్యం చేరిస్తే... ఆమె నమ్మలేకపోయింది. ‘ఇన్‌క్రెడిబుల్‌! ఓ విమాన పైలట్‌లా కారు నడిపావు!’ అంటూ నా చేతికి వంద డాలర్లిచ్చింది. అందులో నుంచి నేను తీసుకోవాల్సింది ఇరవై డాలర్లే. చిల్లర ఇవ్వబోతే ‘ఉంచుకో. చూస్తుంటే స్టూడెంట్‌లా ఉన్నావ్‌.ఆల్‌ ది బెస్ట్‌!’ అంటూ చకచకా వెళ్లిపోయింది. అలా నాక్కావాల్సిన 250 డాలర్లలో వంద ముక్కూ మొహం తెలియని ఆమె ఒక్కతే ఇచ్చింది! మిగతా డబ్బుల్ని మరో మూడురోజుల్లో సంపాదించి ఈసీఎఫ్‌ఎంజీ పరీక్షకి హాజరయ్యాను. హృద్రోగ నిపుణుడిగా నా ప్రయాణానికి అదే తొలి అడుగు!

ఫస్ట్‌... ఫస్ట్‌!
న్యూయార్క్‌లోని మౌంట్‌ సినై-స్కూల్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌లో ఎమ్మెస్‌-జనరల్‌ సర్జన్‌ కోర్సులో చేరాను. రెండేళ్లు పూర్తిచేశాక దక్షిణాఫ్రికా మెడికల్‌ యూనివర్సిటీలో ఓపెన్‌ హార్ట్‌ సర్జరీపైన ఫెలోషిప్‌ సాధించాను. అక్కడ ప్రపంచంలో తొలిసారి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసిన డాక్టర్‌ క్రిస్టియన్‌ బెర్నార్డ్‌తో కలిసి పనిచేశాను. ఆ ట్రెయినింగ్‌ ముగియగానే మళ్లీ అమెరికా వచ్చి చిన్నారుల గుండె శస్త్రచికిత్సపైనా, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీపైనా, గుండె మార్పిడిపైనా... వరసగా మూడు పీజీలు చేసి న్యూయార్క్‌లోని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరాను. సాధారణంగా గుండె ఆపరేషన్‌లు చేస్తున్నంతసేపూ దాన్ని ఆపేస్తుంటారు. అలా కాకుండా గుండెకొట్టుకుంటూ ఉండగానే ఆపరేషన్‌ చేయడం అరుదు. అదీ, రెండోసారి గుండె ఆపరేషన్‌ చేయించుకుంటున్నవాళ్లకి ఇలా చేయడం... కత్తిమీద సాము. ఆ సాముని న్యూయార్క్‌లో తొలిసారి విజయవంతంగా నేనే నిర్వహించాను. ఆ విషయం తెలిసి ప్రపంచ ప్రఖ్యాత హృద్రోగ నిపుణుడు డాక్టర్‌ డెంటాన్‌ క్లూనీ(దివంగత ఎన్టీ రామారావుకి శస్త్రచికిత్స చేసి అప్పట్లో తెలుగువాళ్లకీ బాగా
పరిచయమయ్యారు) నన్ను ప్రత్యేకంగా కలిసి అభినందించారు. అంతేకాదు, న్యూయార్క్‌లోని లాస్‌ ఐల్యాండ్‌లోనూ తొలిసారి కృత్రిమ గుండె ఆపరేషన్‌ నేనే చేశాను. వీటన్నింటితోపాటూ వైద్యరంగంలో బైపాస్‌ సర్జరీకి సంబంధించిన వివిధ కొత్త పద్ధతుల ఆవిష్కరణలతో ఆరు పేటెంట్‌లు సాధించాను. ముఖ్యంగా రక్తమార్పిడి అవసరం లేకుండా- ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేసే కొత్త విధానాన్ని కనిపెట్టాను. పదేళ్లు ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ ఆసుపత్రిలో పనిచేశాక... నేను ఎమ్మెస్‌ చేసిన మౌంట్‌ సినై ఆసుపత్రిలో ప్రధాన హృద్రోగ నిపుణుడిగా పనిచేయడం మొదలుపెట్టాను.

అలా ఆకాశం చేరువైంది...
1993లో నా ఎమ్మెస్‌ పూర్తయినప్పటి నుంచే పైలట్‌ శిక్షణకి వెళ్లడం మొదలుపెట్టాను. 2006 నుంచి రెగ్యులర్‌గా శిక్షణా, సాధనా ప్రారంభించాను. మొదట్లో ప్రయివేటు విమానాలకి ‘మెయింటెనెన్స్‌ ఇంజినీరుగా’ వెళ్లాను. వారంలో నాలుగురోజులు స్టెతస్కోపు పట్టుకుని వైద్యుడిగా ఉంటే... మిగతారోజులు స్పానర్‌లు చేతపట్టి మెకానిక్‌గా మారేవాణ్ణి. ఆ తర్వాతే పైలట్‌గా విమానాలెక్కాను. 2010 నుంచి నేను స్కై డైవింగ్‌ ఫ్లైట్‌లు నడపడం మొదలుపెట్టాను. ‘డైవర్స్‌’ని 13 వేల అడుగులపైకి తీసుకెళ్లి వదిలిపెట్టడం, అక్కడి నుంచి నేరుగా గిరికీలు కొడుతూ వాళ్లకంటే ముందు కిందకు దూసుకురావడం... పైలట్‌గా నాకు తిరుగులేని అనుభవాన్నిచ్చింది. ఆ తర్వాత యునైటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎలైట్‌ సర్వీస్‌ అనే విమానయాన సంస్థలో పైలట్‌గా చేరాను. ఇవన్నీ ఒక ఎత్తైతే 2018లో బోయింగ్‌ జంబో జెట్‌ విమానాల కోసం శిక్షణ తీసుకోవడం ఒక ఎత్తు. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలవి! ఒక్కసారే రెండువేల మంది ప్రయాణీకుల్నీ, 450 టన్నుల బరువునీ తీసుకెళ్లగల సత్తా వాటిది. నేను వాటి పైలట్‌గా శిక్షణ తీసుకుని ‘స్కై లీజ్‌ కార్గో’ సంస్థ కోసం పనిచేయడం ప్రారంభించాను. తొలిసారి అంతర్జాతీయ సరిహద్దులు దాటి జపాన్‌, చైనా, మలేషియాలకి వస్తువులు చేరవేయడం ప్రారంభించాను. సాధారణంగా నెలలో 18 రోజులు డాక్టర్‌గా మిగతా రోజులు పైలట్‌గా వెళుతుంటాను. హృద్రోగ నిపుణుడిగానూ, ఇటు పైలట్‌గానూ ఎంతోమంది ప్రాణాలతో సంబంధమున్న పనులు నావి. మరి ఆ రెండురంగాల వాళ్ల నుంచి అభ్యంతరాలు రాలేదా... అంటే వచ్చాయి! వాటన్నింటినీ రెండువృత్తుల్లోనూ నా నైపుణ్యంతో అధిగమించగలిగాను. కాకపోతే, వ్యక్తిగత జీవితంలో ఏ బాధ్యతలూ నేను తీసుకోలేకపోయాను. నాకంటూ ఓ కుటుంబం ఏర్పడితే వాళ్లకి అవసరమైనంత సమయం కేటాయించలేననే అభిప్రాయంతో  పెళ్ళి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయాను.

కొవిడ్‌ కోసం...
కరోనా ప్రపంచాన్ని ముంచెత్తినప్పుడు ముందు ఓ వైద్యుడిగానే స్పందించాన్నేను. రోజురోజుకీ పెరుగుతున్న కేసులతో ఆందోళన చెందకుండా నిబ్బరంగా సేవలు అందించడం మొదలుపెట్టాను... ఇంతలో అమెరికాలోని ఫెడరెల్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ(ఫెమా) దేశంలోని ప్రభుత్వ యంత్రాంగాన్నంతా తన చేతుల్లోకి తీసుకుంది. నన్ను బోయింగ్‌ జంబో జెట్‌ 747 పైలట్‌గా విధుల్లో చేరమంది. ప్రపంచవ్యాప్తంగా ఐదువేల మంది పైలట్‌లు ఉంటారనుకుంటే... వాళ్లలో జంబోజెట్‌ నడిపేవాళ్లు వందమంది కూడా ఉండరు. నాలాంటి వైద్యనిపుణులు ఒకరో ఇద్దరో ఉంటారు. అలాంటివాళ్లలో అమెరికాలో నేనొక్కణ్ణే. అందువల్లే పిలిచారు. అమెరికాలోని ఆసుపత్రులకు కావాల్సిన మాస్కులూ, వెంటిలేటర్‌ పరికరాలూ, అత్యవసర మందులూ వంటివాటిని చైనా, జపాన్‌, మలేషియాల నుంచి తీసుకురావడమే నా పని! అమెరికా నుంచి పన్నెండు గంటలు ప్రయాణించి చైనా చేరుకోవడం, అక్కడి నుంచి అవసరమైతే జపాన్‌ లేదా మలేషియా కూడా వెళ్లి మరో 12 గంటల ప్రయాణం తర్వాత అమెరికాకి చేరుకోవడం, ఆ తర్వాత విశ్రాంతి... దాదాపు మూడునెలలుగా ఇదే నా షెడ్యూల్‌. ఓ పైలట్‌గా ఒక్కసారైనా భారత భూభాగంమీద దిగాలన్న కల ఉంది నాకు. మలేషియాకి వెళ్తున్నప్పుడల్లా మన హిమాలయాలని ఆర్తిగా చూస్తుంటాను. ఈ మధ్యే మన భారతదేశం అమెరికాకి హైడ్రోక్లోరోక్విన్‌ సరఫరా చేయడం మొదలుపెట్టింది. ఆ మాత్రలు తేవడానికో లేక ఇక్కడ తయారవుతున్న పీపీఈ కిట్ల కోసమో ఏదో ఒకరోజు నా జంబోజెట్‌ విమానంతో మన దేశానికి రావాలనుంది. నాకు జన్మనిచ్చిన దేశం నుంచి జీవితాన్నిచ్చిన దేశానికి అలా పైలట్‌గా రాగలిగే రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను...!


ఈ టీకా వెనుక తెలుగువాడు!

మద్రాసు... అదేనండీ నేటి చెన్నై నగరం కొవిడ్‌-19తో సతమతమవుతోంది. దేశంలో మరే నగరంలోనూ లేనంతగా రెండోసారి లాక్‌డౌన్‌కి వెళ్లింది. కానీ ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన మశూచికి సంబంధించిన వ్యాక్సిన్‌ల విషయంలో ఈ నగరం అనుసరించిన పద్ధతులు దేశం మొత్తానికీ దారిచూపాయి... ప్రపంచ గుర్తింపునీ సాధించాయి. ఆ గుర్తింపు రావడంలో ఇద్దరు తెలుగువాళ్లు కీలక పాత్ర పోషించారు. వీరిలో మొదటివ్యక్తి ఉదయగిరి సింగడివాక్కం స్వామీ నాయక్‌. ఒకప్పటి ఈస్టిండియా కంపెనీ సైన్యానికి వైద్య సహాయకుడిగా ఉండేవాడాయన. 1805లో నాటి ప్రభుత్వం దక్షిణాదిలో మొదలుపెట్టిన తొలి టీకాల కార్యక్రమానికి సూపరింటెండెంట్‌గా ఆయన్ని నియమించింది. మశూచి వైరస్‌కి టీకా కనిపెట్టిన తొలినాళ్లవి. అప్పట్లో సూదులూ, చుక్కల మందులు లేవుకాబట్టి చేతిపైన చిన్నగా కోసి అందులో అంతగా తీవ్రతలేని వైరస్‌ని పెట్టేవారు. అదే మన తొలినాటి సమగ్ర వ్యాక్సిన్‌ కార్యక్రమం! దానికి నేతృత్వం వహించిన నాయక్‌ నాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని పల్లెపల్లెకీ వెళ్లి వ్యాక్సిన్‌ వేస్తుండేవాడు. ఇలా చేతిలో చిన్న చాకుతో, కోతపెట్టడానికి వచ్చే ఆయన్ని చూసి నాటి ప్రజలు క్షుద్రపూజారేమో అనుకునేవారట. వెళ్లినచోటల్లా ఆయనపైన దాడులు జరిగాయి... ఎన్నోసార్లు చావుతప్పి కన్నులొట్టపోయిన పరిస్థితులు ఎదురయ్యాయి. అయినా మడమ తిప్పలేదాయన. వ్యాక్సిన్‌ చేసే మంచిని ప్రచారం చేస్తూ తన పని తాను చేసుకుపోయేవాడు. క్రమంగా మశూచి వ్యాప్తి తగ్గుదల మొదలైంది. వ్యాక్సిన్‌లో కొత్త పద్ధతులు వచ్చాక ఒక్క దక్షిణాది నుంచే కాదు ప్రపంచం నుంచే తుడిచిపెట్టుకుపోయింది!


 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.