close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అతివలు... ఆదుకుంటున్నారు!

మహిళలకు తమ పిల్లల్ని లాలిస్తూ అల్లారుముద్దుగా పెంచడమే కాదు...  సమాజంలోని పేదల్ని సొంతవారిగా ఆదరించడమూ తెలుసు. ఇంటి వాతావరణాన్ని చక్కగా ఉంచడమే కాదు... పర్యావరణాన్ని కాపాడటానికి మొక్కల్ని నాటడమూ తెలుసు. అలా ‘ఎదుటి వారు బాగుంటేనే తామూ బాగున్నట్టు’ అన్న భావనతో కొందరు వనితలు సామాజిక సేవాకార్యక్రమాల్లో భాగమవుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.


పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా...

ఎంబీఏ పూర్తి చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కాకినాడకు చెందిన శీమకుర్తి సురేఖకు అక్కడి ఓ ప్రముఖ సంస్థలో అయిదంకెల జీతంతో కూడిన ఉద్యోగం. ప్లాస్టిక్‌ వినియోగం, పచ్చదనం కరవవడంతో పర్యావరణానికి హాని కలుగుతోందంటూ పత్రికల్లోనూ టీవీల్లోనూ వచ్చే వార్తలు ఆమెను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. దీంతో కుటుంబ సభ్యులతో చర్చించి పర్యావరణ పరిరక్షణకు తనవంతు సాయం చేయాలని అనుకున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసి 2010, ఆగస్టులో ‘ధరిత్రి రక్షిత సమితి’ని ఏర్పాటు చేశారు సురేఖ. ఇందులో కొందరిని సభ్యులుగా చేర్చుకుని కాకినాడ ప్రాంతంలో మొక్కల్ని నాటుతున్నారు. ఇప్పటి వరకూ ఈ సమితి ఆధ్వర్యంలో లక్షకుపైగా మొక్కలు నాటారు. వాటికి ట్రీగార్డ్స్‌ను ఏర్పాటు చేసి రక్షణ బాధ్యతల్నీ చూసుకుంటున్నారు ధరిత్రి రక్షిత సమితి సభ్యులు. మరోవైపు ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలంటూ పట్టణంలో 60 వేల దాకా కాటన్‌ సంచులను పంపిణీ చేశారు. ఏటా వినాయక చవితి సందర్భంగా పట్టణంలో మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను అందజేస్తున్నారు. ఇలా సుమారు పదిహేను వేల మట్టి ప్రతిమల్ని అందించారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలనీ, మొక్కల్ని విరివిగా నాటాలనీ ప్రజల్లో చైతన్యం పెంపొందిస్తున్నారు సురేఖ.


పేదల చదువుకు బాటలు

ఉపాధిని వెతుక్కుంటూ దేశ రాజధాని దిల్లీకి వేలాది ప్రజలు వలస వస్తుంటారు. వారంతా కూలీలుగా, కార్మికులుగా పనిచేస్తుంటే వారి పిల్లలు మాత్రం వీధుల్లో అడుక్కుంటూ తిరుగుతుండటం అక్కడే ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న రిచా ప్రశాంత్‌ను ఆందోళనకు గురిచేసింది. వారిని ప్రయోజకులుగా మార్చాలన్న సంకల్పంతో 2009లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ‘సునయ్‌ ఫౌండేషన్‌’ను నెలకొల్పారు రిచా. ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అక్కడి వసంత్‌కుంజ్‌ దగ్గర ఓ పాఠశాలను ఏర్పాటుచేసి వలస కూలీలూ, కార్మికుల పిల్లలకు చదువు చెబుతున్నారు. కొన్నేళ్లక్రితం కోల్‌కతా, బిహార్‌లోని వైశాలి ప్రాంతంలోనూ ఇలాంటి పిల్లల కోసం పాఠశాలల్ని ఏర్పాటు చేశారు. ఉద్యోగ సమయంలో తాను దాచుకున్న డబ్బుతోపాటు కొందరు దాతల సహకారంతో వారికి మధ్యాహ్నం పాఠశాలల దగ్గరే భోజన సదుపాయం కల్పిస్తున్న రిచా... ఇప్పటి దాకా సుమారు పది వేల మంది పిల్లలను చేరదీసి వారికి   అక్షరాలు నేర్పించారు. అందులో అయిదు వందలకుపైగా విద్యార్థుల్ని ఇతర పాఠశాలల్లో చేర్పించి వారి ఉన్నత చదువులకు బాటలు వేస్తున్నారు. అంతేకాకుండా వెయ్యి మందికిపైగా పేదలకు బ్లాంకెట్లూ, పదిహేను వందల మంది విద్యార్థులకు యూనిఫామ్‌, పుస్తకాలూ అందించి ఔదార్యం చాటారు.


దివ్యాంగులకు భరోసా

విజయవాడకు చెందిన చిగురుపాటి విమలది సాధారణ కుటుంబం. ఆమెకు ఇద్దరు పిల్లలు. రోజూ మాదిరిగానే కాలేజీకి వెళ్లిన తన ఇరవై ఏళ్ల కొడుకు సుదీక్షణ్‌ 2006లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ సంఘటన విమలను ఎంతో కుంగదీసింది. తన కొడుకులాంటి పరిస్థితి ఇతరులకు రాకూడదనీ, రోడ్డు ప్రమాదాలబారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యువతకు అవగాహన కల్పించాలనీ  నిర్ణయించుకున్నారు విమల. దీని కోసం 2007లో ‘సుదీక్షణ్‌ ఫౌండేషన్‌’ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచీ ఈ ఫౌండేషన్‌ ద్వారా రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూనే ప్రమాదాల్లో అవయవాల్ని కోల్పోయిన పేదలకు కృత్రిమ అవయవాల్ని అమర్చే ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఇప్పటి దాకా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు ఐదు వేల మందికి కృత్రిమ అవయవాల్ని అమర్చారు. వీటిని అమర్చడానికి రూ.6 కోట్ల వరకు ఖర్చు చేశారు. అదేవిధంగా   పుట్టుకతో వైకల్యమున్న వారికీ, వెన్నెముక సమస్యతో నడవలేని వారికీ రూ.30 లక్షల విలువైన 600 ట్రైసికిళ్లను అందించారు. విలువైన కృత్రిమ అవయవాల్ని అమర్చుకునే ఆర్థిక స్తోమత పేద దివ్యాంగులకు ఉండదనీ, దీన్ని దృష్టిలో ఉంచుకునే అమెరికాలో ఉంటున్న కూతురు శ్రీముఖి, అల్లుడు రంజిత్‌కుమార్‌, స్నేహితుల సహకారంతో సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాననీ అంటారు విమల. 


- మణికాంత్‌, ఈజేఎస్‌, హైదరాబాద్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.