close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
లైబ్రరీ కావాలా... లెటర్‌ రాయండి!

‘మీ పిల్లలు తెలివైనవారు కావాలంటే కథల పుస్తకాల్ని చదివించండి. విజ్ఞానవంతులు అవ్వాలంటే మరిన్ని కథల పుస్తకాల్ని చదివించండి’ అనేవారట ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌. కానీ, చాలా ప్రాంతాల్లో విద్యార్థులు చదవడానికి అసలు పుస్తకాలే ఉండవు. అందుకే ఐన్‌స్టీన్‌ మాటల్ని స్ఫూర్తిగా తీసుకోవడంతోపాటు విద్యార్థుల నుంచి వచ్చిన పోస్ట్‌కార్డుల ఆధారంగా ఓ సంస్థ గ్రామాల్లో గ్రంథాలయాల్ని ఏర్పాటు చేస్తోంది.
పాఠ్యాంశాలతోపాటు కథలూ, విజ్ఞానాన్ని పెంపొందించే ఇతర పుస్తకాలనూ చదవాలన్న ఆసక్తి చాలా మంది విద్యార్థులకు ఉంటుంది. కానీ అలాంటి పుస్తకాలు అందుబాటులో లేకపోవడం విద్యార్థులను అసంతృప్తికి లోనుచేస్తుంది. ఈ విషయాన్ని పోస్ట్‌కార్డుల ద్వారా తెలుసుకున్న మహారాష్ట్రలోని పుణెకు చెందిన ‘రూరల్‌ రిలేషన్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థ గ్రామాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తోంది. విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను పంపిణీ చేస్తోంది. గ్రామాల్లో నెలకొన్న సమస్యలూ, వాటికి పరిష్కార మార్గాలూ తెలుసుకోవడానికి పుణెకు చెందిన ప్రదీప్‌ లొఖండే అనే వ్యక్తి 1996లో ఈ సంస్థను ఏర్పాటు చేసి, ‘మీ ప్రాంతాల్లోని ప్రధాన సమస్యలూ, అందుబాటులో ఉన్న వనరుల గురించి పోస్ట్‌కార్డుల ద్వారా తెలియజేయండ’ంటూ ప్రజలకు పిలుపునిచ్చాడు. ఫలితంగా గ్రామ సమస్యలను వివరిస్తూ వివిధ రాష్ట్రాల ప్రజల నుంచి లక్షలాది పోస్ట్‌కార్డులు వచ్చాయి.

ఆలోచింపజేసిన పోస్ట్‌కార్డులు
తమ గ్రామంలో గ్రంథాలయం లేకపోవడంతో పుస్తకాలు చదవలేకపోతున్నామని చాలా మంది విద్యార్థులు ఈ సంస్థకు పోస్ట్‌కార్డులు రాశారు. ఈ పోస్ట్‌కార్డులే ప్రదీప్‌ లొఖండేను ఆలోచింపజేశాయి. దేశం ఇంత అభివృద్ధి చెందుతున్నా భావిభారత పౌరులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడానికి గ్రంథాలయాలు కరవవడం ఆందోళనకు గురిచేసింది. పిల్లలు తెలివైనవారుగా మారడానికి పుస్తకాల్ని చదివించాలన్న ఐన్‌స్టీన్‌ మాటలూ అప్పుడే జ్ఞాపకం వచ్చాయి. దీంతో కొన్ని ప్రముఖ సంస్థల్ని సంప్రదించి గ్రామాల్లో గ్రంథాలయాల ఆవశ్యకత గురించి వివరించాడు ప్రదీప్‌. వారు అంగీకరించడంతో ‘రూరల్‌ రిలేషన్స్‌’ తరఫున ‘జ్ఞాన్‌కీ’ కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాడు. ఆయా సంస్థల సహకారంతో ‘రూరల్‌ రిలేషన్స్‌’ ఇప్పటి వరకూ 4,800కు పైగా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల్ని ప్రారంభించి వాటికి అవసరమైన పుస్తకాల్నీ, సామగ్రినీ అందజేసింది. ఇప్పటికీ అందజేస్తూనే ఉంది. తమిళనాడు, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లోనూ గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని ఆ సంస్థ ప్రణాళిక రూపొందించుకుంది.

పుస్తకాల విలువ రూ.4.63 కోట్లు
విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆ సంస్థ ఏర్పాటు చేసిన గ్రంథాలయాలు మహారాష్ట్రలోని 4450 గ్రామాలూ, రాజస్థాన్‌లోని 140, కర్ణాటకలోని 67, తెలంగాణలోని 76, ఆంధ్రప్రదేశ్‌లోని 49, మధ్యప్రదేశ్‌లోని 21 గ్రామాల్లో సేవలందిస్తున్నాయి. వీటికి రూ.4.63 కోట్ల విలువైన 10.12 లక్షల పుస్తకాల్ని పంపిణీ చేసింది. ఇందులో భాగంగా తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోనూ, కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయాల్లోనూ ఈ గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతి పుస్తకానికీ రెండు పోస్ట్‌కార్డుల్ని జత చేస్తున్నారు. పుస్తకాన్ని చదివిన తరవాత తమ అభిప్రాయాన్ని తెలియజేయాలనీ, ఇంకా ఎలాంటి పుస్తకాలు అవసరమో వాటిలో రాసి పంపాలనీ విద్యార్థులకు సూచిస్తున్నారు. ఇలా విద్యార్థుల నుంచి ఆ సంస్థకు లక్షాడెబ్భై వేల పోస్ట్‌కార్డులు అందాయి.

పోలీస్‌ స్టేషన్లలోనూ...
చాలా మందికి ఇప్పటికీ హక్కులూ, చట్టాల గురించి తెలియక నష్టపోతున్నారు. దీంతో పౌరులకు వాటిపైన అవగాహన కల్పించడానికి పోలీస్‌ స్టేషన్లలోనూ గ్రంథాలయాలను ప్రారంభిస్తున్నారు. తెలంగాణలోని ఎల్బీనగర్‌, ఉప్పల్‌, నాచారం, మల్కాజిగిరి, యాదగిరిగుట్ట, ఘట్‌కేసర్‌, భువనగిరి రూరల్‌, మోత్కూర్‌ పోలీస్‌స్టేషన్లతో కలిపి మొత్తం 40 పోలీస్‌స్టేషన్లలో ఇటీవల ‘జ్ఞాన్‌కీ’ గ్రంథాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చి ఒక్కో పోలీస్‌స్టేషన్‌కు రెండు వందల చొప్పున పుస్తకాలను అందించారు. పిల్ల్లలను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడానికి కథల పుస్తకాలను ఎక్కువగా చదివించాలన్న అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ తనకు ప్రేరణ అనీ, దేశవ్యాప్తంగా లక్ష ‘జ్ఞాన్‌కీ’ గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలన్నదే తమ సంస్థ ఆశయమనీ అంటున్నాడు ప్రదీప్‌ లొఖండే.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.