close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆపదలో ఉన్నారా... ఆదుకుంటారు రండి!

చిన్న అవయవలోపం ఉన్న వారే పనులు చేయడానికి ఇబ్బందులు పడతారు. మరి, ఓ కాలో చెయ్యో లేకపోతే... పనులు చేయడానికి కష్టమవడమే కాదు... కుటుంబ పోషణా భారమే. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ఆ అధికారులూ ఉద్యోగులూ... దివ్యాంగులకు కృత్రిమ అవయవాల్ని అమర్చుతూ ట్రైసికిళ్లను అందజేస్తూ సేవాభావాన్ని చాటుతున్నారు.

జీవితంలో స్థిరపడటానికి వారు ఎన్నో ఒడుదొడుకుల్ని ఎదుర్కొన్నారు. కష్టపడి చదివి ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం వద్ద ఉన్న హెవీ వాటర్‌ ప్లాంట్‌(భారజల కేంద్రం)లో కొలువులు పొందారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆ ప్లాంట్‌ అధికారులూ ఉద్యోగులూ పేదల్ని ఆదుకోవడానికి సామాజిక సేవా కార్యక్రమాల్ని చేపట్టాలని నిర్ణయించుకున్నారు. 2009లో అప్పటి ఆ కేంద్రం చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌(సీజీఎం) ఎం.వేణుగోపాల్‌తో ఉద్యోగులు తమ ఆలోచనను పంచుకున్నారు. ఆయన అంగీకరించడంతో అదే సంవత్సరం సెప్టెంబరు 9న గౌతమీ స్ఫూర్తి ఫౌండేషన్‌ను స్థాపించి సేవా కార్యక్రమాలకు బీజం వేశారు. అప్పటి నుంచీ ఈ కేంద్రంలోని అధికారులూ ఉద్యోగులూ ప్రతి నెలా ఇరవై అయిదు వేల నుంచి అరవై వేల రూపాయల వరకూ పోగు చేస్తూ ఆ డబ్బును దివ్యాంగులూ, పేదల సేవకు వెచ్చిస్తున్నారు.

కృత్రిమ అవయవాలూ... ట్రైసికిళ్లూ...
ప్రతి రోజూ వారు ఇంటి నుంచి భారజల కేంద్రానికి వెళ్లే దారిలో భిక్షాటన చేసే దివ్యాంగులను చూస్తూ చలించిపోయేవారు. కాళ్లూ చేతులూ లేని వారి దుర్భర జీవితాలు ఆ అధికారుల్నీ ఉద్యోగుల్నీ కదిలించాయి. అలాంటి వారికి కృత్రిమ అవయవాల్ని అమర్చితే ఏదో ఒక పని చేసుకుంటూ తమ కుటుంబాల్ని పోషించుకోగలుగుతారని భావించారు. సుమారు అయిదు వేల నుంచి పదిహేను వేల వరకు విలువైన కృత్రిమ అవయవాల్ని సొంతంగా కొనుగోలు చేసి అమర్చుకోవడం దివ్యాంగులకు ఆర్థికంగా భారంతో కూడుకుంది. దీంతో, వీటిని తామే అందిస్తే వారి కుటుంబాల్ని నిలబెట్టిన వారమవుతామన్న నిర్ణయానికి వచ్చారు.
ఈ విషయాన్ని తమ కేంద్రం సీజీఎంకు చెప్పి దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ కాళ్లూ చేతులూ అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇలా అప్పటి నుంచీ ఇప్పటి వరకూ వారు సుమారు ఆరు వందల యాభై మందికి వైద్యుల సహాయంతో కృత్రిమ అవయవాల్ని అమర్చారు. వీటి కోసం యాభై లక్షలకు పైగానే వెచ్చించారు. నడవలేని వారికీ చెవిటి వారికీ మరో అయిదు లక్షల విలువైన ట్రైసికిళ్లనూ శ్రవణ యంత్రాలనూ అందించారు.

వృత్తి విద్య శిక్షణ
దివ్యాంగులు సమాజంలో నిరాదరణకు లోనవుతుంటారు. వైకల్యం కారణంగా ఎలాంటి ఉపాధీ దొరకదు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ఆ కేంద్రం అధికారులూ ఉద్యోగులూ... దివ్యాంగులు జీవితంలో నిలదొక్కుకునేలా వృత్తివిద్యలో శిక్షణ ఇవ్వాలని భావించారు. శిక్షణ కోసం ప్రత్యేకంగా పదిహేను లక్షల నిధిని కేటాయించారు. ఈ డబ్బుతో వారికి వివిధ అంశాల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇలా గౌతమీ స్ఫూర్తి ఫౌండేషన్‌ ద్వారా శిక్షణ తీసుకున్న వారితోపాటు కృత్రిమ అవయవాలూ శ్రవణ యంత్రాలూ పొందిన వారంతా స్వయం ఉపాధి పనులు చేస్తూ తమ కుటుంబాల్ని పోషించుకుంటున్నారు.

వృద్ధులకు అండ... విద్యార్థులకు చేయూత
హెవీ వాటర్‌ ప్లాంట్‌లోని అధికారులూ ఉద్యోగులూ వికలాంగులకు వెన్నుదన్నుగా నిలవడమే కాదు... వృద్ధులూ పేద విద్యార్థులకూ తమ వంతు సహాయం చేస్తున్నారు. అశ్వాపురం, భద్రాచలంలో ఇతరుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న వృద్ధాశ్రమాలకు పదహారు లక్షల వరకూ అందించారు. ఆశ్రమాల్లోని వృద్ధులకు అవసరమైన వసతుల్ని సమకూర్చుతున్నారు. అశ్వాపురం చుట్టుపక్కల గ్రామాల పేద విద్యార్థుల చదువుల కోసం సుమారు పదిహేను లక్షలు అందజేశారు. ప్రతిభగల కొందరు పేద విద్యార్థుల్ని దత్తత తీసుకుని చదివిస్తున్నారు. రెండు వేల మంది పేదలకు కంటి శస్త్రచికిత్సలు చేయించి వారికి చూపును ప్రసాదించారు. పేదలు వ్యాధులబారిన పడ్డారనీ, చికిత్సలూ మందులకూ డబ్బులు లేవనీ తెలిస్తే చాలు... వారి వద్దకు వెళ్లి అవసరమైన ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇలా కోటికిపైగా విలువైన సేవా కార్యక్రమాల్ని చేపట్టి ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తున్న గౌతమీ స్ఫూర్తి ఫౌండేషన్‌ సభ్యుల్ని అభినందించకుండా ఉండగలమా..! 

- సిద్ధిరాం ప్రభుప్రసాద్‌, ఈనాడు, ఖమ్మం

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.