close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎక్కడికెళ్లినా ముందు అవే వెతుకుతా!

విరాట్‌ కొహ్లీ ఫిట్‌నెస్‌లో మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అయ్యాక మైదానంలో చిరుతలా కదులుతున్నాడు. ‘పెటా పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌- 2019’గా ఎంపికైన విరాట్‌ తన ఆహారపుటలవాట్ల గురించి ఏం చెబుతున్నాడంటే...

వంటకాల రాజధాని

మాది పంజాబీ కుటుంబం. ఇంట్లో తిండికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. ‘ఈరోజు ఏంటి స్పెషల్‌’ అని  అమ్మని నాన్నా, అన్నయ్యా, నేనూ రోజూ అడుగుతుండేవాళ్లం. రాజ్మా చావల్‌, బటర్‌ చికెన్‌ తరచూ వండేవాళ్లు. దిల్లీ వంటకాలకీ రాజధాని. స్ట్రీట్‌ ఫుడ్‌ బాగా దొరుకుతుంది. ఫిరోజ్‌షా కోట్లా స్టేడియం దగ్గర్లో నిజామ్స్‌ హోటల్‌ ఉండేది. మ్యాచ్‌ ఆడి వెళ్తూ అక్కడ కాటీ రోల్స్‌ తింటే కానీ ఇంటికి వచ్చేవాణ్ని కాదు. ఎక్కడికి వెళ్లినా తినడానికి ఏ వంటకాలు దొరుకుతాయో చూసేవాణ్ని.

లండన్‌ బెస్ట్‌...

అంతర్జాతీయ నగరాల్లో లండన్‌లో ఫుడ్‌ బాగా దొరుకుతుంది. అక్కడ ప్రపంచంలోని వెరైటీలన్నీ దొరుకుతాయి. లండన్‌లో బయట తినడాన్ని ఒక సెలబ్రేషన్‌లా చూస్తారు. విదేశీ వంటకాల్లో నాకు జపనీస్‌ ఫుడ్‌ అంటే ఇష్టం. వెజిటేరియన్‌గా మారాక కొత్త కొత్త రుచుల్ని రుచి చూస్తున్నాను. అలా నాకు బాగా నచ్చింది మష్రూమ్‌ డిమ్‌సమ్‌.

దక్షిణాది టిఫిన్లు...

అనుష్క, నేనూ ముంబయిలో ఉంటున్నాం. ఇంట్లో మాకు కుక్‌ ఉన్నాడు. అతను అచ్చమైన ఇంటి భోజనాన్ని వండి పెడతాడు. అప్పుడప్పుడూ కొత్త రుచుల్నీ చూపిస్తాడు. సాధారణంగా టిఫిన్‌కి దక్షిణాది వంటకాలు ఇడ్లీ, దోశ లాంటివి ఉంటాయి. మధ్యాహ్నం కిచిడీ చేస్తాడు. దాంతో ఏదో ఒక పాలకూర వంటకం ఉంటుంది. రాత్రికి కూరగాయలూ, ఆకుకూరల్ని ఉడికించి చేసే వంటకాల్ని సిద్ధం చేస్తాడు. వాటితోపాటు సలాడ్స్‌ తీసుకుంటాను.

అదే ఫేవరెట్‌

రాజ్మా చావల్‌ ఎన్నిసార్లయినా తినాలనిపిస్తుంది. అమ్మ చేతి వంటల్లో అది నా ఫేవరెట్‌. ఛోలే భటూరే కూడా ఇష్టంగా తింటాను. కాకపోతే దీంట్లో క్యాలరీలు ఎక్కువ. చాలా రోజుల తర్వాత ఈ మధ్యనే అనుష్క, నేనూ ఛోలే భటూరే తిన్నాం. ఆరోజు సాయంత్రం జిమ్‌లో రోజూకంటే రెట్టింపు శ్రమపడి క్యాలరీలు కరిగించా. ఎప్పుడైనా ఏదైనా తినాలనిపిస్తే తింటాను. తర్వాత దానికి తగ్గట్టుగా వ్యాయామం చేస్తాను. కాకపోతే, రెండేళ్లుగా మితంగా తినడం అలవాటు చేసుకున్నాను.

నట్స్‌ ఉండాల్సిందే...

ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోకుండా పరిమితంగా రోజంతా ఏదో ఒకటి తింటూనే ఉంటాను. స్నాక్స్‌గా నట్స్‌ని తీసుకుంటాను, బ్లాక్‌ కాఫీ తాగుతాను. రోజులో నాలుగుసార్లు గ్రీన్‌టీ తాగుతాను. వెజ్‌ సూప్స్‌ తీసుకుంటాను. ఎక్కడికి వెళ్లినా నట్‌ బటర్స్‌నీ నాతోపాటు తీసుకెళ్లి బ్రెడ్‌తోపాటు తింటాను.

వ్యాయామం చేయాల్సిందే... 

జిమ్‌కెళ్లి వ్యాయామం చేయడం అలవాటుగా కాదు, జీవనశైలిలో భాగంగా ఉండాలి. మ్యాచ్‌ రోజున అరగంట నుంచి గంట...మ్యాచ్‌లేని రోజున రెండు మూడు గంటలు జిమ్‌లో ప్రాక్టీసు చేస్తాను.

ఇప్పుడు వెజిటేరియన్‌ని...

నాలుగేళ్ల కిందట ఫిట్‌నెస్‌ సమస్య వచ్చి వైద్యుణ్ని సంప్రదించాను. మాంసాహారం ఎక్కువ తినడంవల్ల జీర్ణవ్యవస్థలో సమస్య వచ్చి శరీరంలో కాల్షియం తగ్గిపోతోందనీ, ఆ ప్రభావం ఎముకలమీద పడుతోందనీ చెప్పారు. అప్పట్నుంచీ మాంసాహారం తగ్గిస్తూ వచ్చాను. రెండేళ్ల నుంచి పూర్తి వెజిటేరియన్‌గా మారిపోయాను. వెజిటేరియన్‌గా మారాక  ప్రశాంతంగా ఉంటున్నాను. ఇదివరకు ఎనిమిది గంటలు నిద్రపోయేవాణ్ని. ఇప్పుడు ఆరేడు గంటల నిద్ర సరిపోతోంది.

8 డిసెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.