close

ఈ డ్రైవర్లు...పేదలకు ఆప్తులు!

కారూ ఆటో డ్రైవర్లు... పట్టణాలూ నగరాల్లో మనల్ని గమ్యస్థానాలకు చేరుస్తారని తెలుసు. కానీ కొందరు డ్రైవర్లు జీవనోపాధి కోసం వాహనాల్ని నడుపుతూనే పేదలకు ఆపన్నహస్తం అందిస్తున్నారు. నిరుపేదలు ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు... మేమున్నామంటూ వారికి సాయం చేస్తున్నారు.

ఆపదలో ఉన్నవారికి ఉచిత రవాణా

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్‌ హనీఫ్‌ది పేద కుటుంబం. ఎనభై ఏళ్ల ఈ వృద్ధుడు గత యాభై సంవత్సరాలుగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దీని ద్వారా వచ్చే ఆదాయం మాట ఎలా ఉన్నా ఆపదలో ఉన్నవారికి తోచిన సాయం చేస్తేనే జీవితంలో సంతృప్తి ఉంటుందని భావించాడు. ఇదే ఉద్దేశంతో హనీఫ్‌ గత కొన్నేళ్లుగా క్షతగాత్రుల్నీ గర్భిణుల్నీ బాలింతల్నీ వృద్ధుల్నీ బంజారాహిల్స్‌ సమీపంలోని ఆస్పత్రులకు ఉచితంగా తీసుకెళ్తున్నాడు. ఆపదలో ఉన్నవారు ఫోన్‌ చేస్తే పగలూ రాత్రీ అన్న తేడాలేకుండా వెంటనే వచ్చి ఆస్పత్రులకు తీసుకెళ్తానంటూ ఆటోపై ఫోన్‌ నంబర్‌ను రాయించాడు. ఆపదలో ఉన్న వారూ, వారి బంధువులూ ఎప్పుడు ఫోన్‌ చేసినా వృద్ధాప్యాన్నీ లెక్కచేయకుండా స్పందిస్తూ వెంటనే ఆస్పత్రులకు తీసుకెళ్తున్న హనీఫ్‌... స్థానికుల మన్ననలు అందుకుంటున్నాడు.


ఫేస్‌బుక్‌తో కోటిన్నర సేకరణ

కేరళలోని మళప్పురం జిల్లా పులిక్కలోడి గ్రామానికి చెందిన సుశాంత్‌ ఆటో డ్రైవర్‌. పేదరికం కారణంగా ఇంటర్‌ విద్యను అర్ధంతరంగా వదిలేసి తండ్రి సూచన మేరకు ఆటో తోలుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఖాళీ సమయంలో ఫేస్‌బుక్‌లో తనకు నచ్చిన వీడియోలు, అంశాల్ని షేర్‌ చేస్తుండేవాడు. ఇదిలా ఉండగా అదే ప్రాంతంలోని ఎడక్కరకు చెందిన మునీర్‌ అనే వ్యక్తి ఓ ప్రమాదంలో కాళ్లను కోల్పోయాడు. అప్పడాల్ని విక్రయించగా వచ్చే ఆదాయమే మునీర్‌ కుటుంబానికి ఆధారం. విషయం తెలుసుకున్న సుశాంత్‌... అతడి దీనస్థితిని సెల్‌ఫోన్‌లో రికార్డ్‌ చేసి, ఆదుకోవాలంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టాడు. దాతలు తమ విరాళాల్ని మునీర్‌ ఖాతాకే పంపాలంటూ అకౌంట్‌ నంబర్‌నూ అందులో పేర్కొన్నాడు. కొన్ని రోజులకే దాతలు స్పందించి ఖాతాలోకి రెండు లక్షల వరకూ పంపారు. ఆ డబ్బుతో శస్త్రచికిత్స చేయించుకున్న మునీర్‌ మళ్లీ అప్పడాల్ని విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించడానికి సిద్ధమవుతున్నాడు. పేద కుటుంబానికి చెందిన హరీశ్‌ అనే యువకుడు పక్షవాతంతో మంచం పట్టాడు. ఆయన స్థితినీ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు సుశాంత్‌. దాతలు లక్ష రూపాయలకుపైగా పంపగా ఆ డబ్బుతో హరీశ్‌ చికిత్స చేయించుకున్నాడు. ఎడప్పల్‌కు చెందిన ఓ చిన్నారికి అరుదైన వ్యాధి సోకింది. చికిత్స చేయించే స్థోమత ఆ చిన్నారి కుటుంబ సభ్యులకు లేదు. వారి నిస్సహాయతను వివరిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడంతో స్పందించిన దాతలు పదమూడు లక్షలు అందించారు. ఓ పేద యువతి పెళ్లి కోసం రెండు లక్షలు, కిడ్నీ బాధితుడి కోసం లక్షన్నర, క్యాన్సర్‌ బాధితుడి కోసం లక్ష... ఇలా సుశాంత్‌ ఇప్పటి వరకూ ఫేస్‌బుక్‌ ద్వారా సుమారు కోటిన్నర రూపాయలు సేకరించి బాధితులకు అందించాడు.


పేదల కోసం దుస్తుల బ్యాంక్‌

పశ్చిమ బంగ రాష్ట్రం జల్పైగురి జిల్లా డిందిమా గ్రామానికి చెందిన సాజూ తాలుక్దర్‌ది పేద కుటుంబం. తండ్రి గొడుగులూ టార్చిలైట్లూ రిపేర్‌ చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. పాఠశాల యూనిఫాంను కుట్టించడానికి తండ్రి దగ్గర డబ్బులు ఉండేవి కావు. యూనిఫాం లేని కారణంగా అయిదో తరగతిలోనే చదువుకు స్వస్తిచెప్పిన తాలూక్దర్‌... తండ్రితోపాటే పనులు చేస్తుండే వాడు. కొన్ని సంవత్సరాలకు తండ్రి మరణించిన తరవాత డ్రైవింగ్‌ నేర్చుకుని వ్యాన్‌ డ్రైవర్‌గా జీవితం ప్రారంభించాడు. అయినా... పేదరికం కారణంగా సరైన దుస్తుల్ని వేసుకోలేకపోయానన్న బాధ మనసుని ఎప్పుడూ తొలిచేస్తుండేది. తనలాగే పేదలు దుస్తులు లేక ఇబ్బందులు పడకూడదనీ, పిల్లలు చదువుకు దూరం కాకూడదనీ అనుకున్నాడు. దీంతో 2008లో డిందిమా ప్రాంతానికి చెందిన టీ గార్డెన్స్‌, సిలిగురి ప్రాంతంలోని బస్టాండ్‌, రైల్వేస్టేషన్ల వద్ద ఉండే పేదలకు పాత దుస్తుల్ని అందించడం మొదలుపెట్టాడు. ఓ వైపు డ్రైవర్‌గా కొనసాగుతూ మరోవైపు పాత దుస్తుల్ని సేకరిస్తుండేవాడు. కొన్నాళ్ల తరవాత వీటి సేకరణ ఇబ్బందిగా మారింది. ఈ విషయాన్ని తన స్నేహితుడు, ఓ ధాబా యజమాని అయిన ప్రదీప్‌గుప్తాకు చెప్పాడు. అనంతరం ఆయన అందించిన సెల్‌ఫోన్‌తో ఫేస్‌బుక్‌ను వాడేవిధానాన్ని తెలుసుకుని... పేదలకు దుస్తుల్ని అందజేయాలంటూ పోస్ట్‌లు పెడుతున్నాడు. అప్పటి నుంచీ దాతలు స్పందిస్తూ అతడి చిరునామాకు దుస్తుల్ని పంపిస్తున్నారు. ఇలా వచ్చిన వాటితో డిందిమా, సిలిగురి ప్రాంతాల్లో క్లాత్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేశాడు. పేదలు ఇక్కడికి వచ్చి తమకు నచ్చిన దుస్తుల్ని తీసుకెళ్తున్నారు. సాజూ తాలుక్దర్‌ ప్రతి వారం ఈ బ్యాంక్‌ ద్వారా మూడు వేలకుపైగా దుస్తుల్ని పేదలకు అందిస్తున్నాడు.

8 డిసెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.