close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ గుడిలో దళితులే పూజారులు!

దళితులు హిందూ దేవాలయాల్లోకి రాకుండా ఇప్పటికీ చాలా చోట్ల ఆంక్షలున్నాయి. పశ్చిమ గోదావరిజిల్లాలోని ఉప్పులూరు చెన్నకేశవ ఆలయంలో మాత్రం పదకొండు తరాలుగా దళితులే అర్చనలు చేస్తూ సామాజిక సమానత్వానికి ప్రతీకగా నిలుస్తున్నారు. అదెలా సాధ్యమైందంటే...

ఉండి నియోజకవర్గంలోని ఉప్పులూరులోని చెన్నకేశవ ఆలయంలో సామాజిక చైతన్యం వెల్లివిరియడానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. పల్నాటి యుద్ధంలో కీలక పాత్ర పోషించిన బ్రహ్మనాయుడు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చిన రామానుజాచార్యుల స్ఫూర్తితో సంస్కరణశీలిగా మారతాడు. కులమతాలకు అతీతంగా సమాజంలో సమభావాన్ని పెంపొందించాలని యోచిస్తాడు. అందుకు చాపకూడు పేరుతో అన్ని కులాల వారికీ సహపంక్తి భోజనాలు పెట్టేవాడు. ఈ కార్యక్రమాల్లో బ్రహ్మనాయుడి అనుచరుడైన కన్నమదాసు(దళితవర్గానికి చెందినవాడు) చురుగ్గా పాల్గొనేవాడు. ఈ క్రమంలో అతని గుణగణాలకు ముగ్ధుడైన బ్రహ్మనాయుడు మాచర్ల, మార్కాపురంలోని చెన్నకేశవస్వామి ఆలయాల అర్చకత్వ బాధ్యతలను కన్నమదాసుకి అప్పగించాడు. అనంతరం కన్నమదాసు వారసుడు అయిన తిరువీధి నారాయణదాసు ఆ బాధ్యతల్ని తీసుకున్నాడు. అయితే పల్నాటి యుద్ధం కారణంగా వలసబాట పట్టిన నారాయణదాసు చెన్నకేశవ స్వామి విగ్రహంతో సహా సింహాచలం చేరుకుంటాడు. అక్కడే కొన్నాళ్లు ఆశ్రయం పొంది మళ్లీ పల్నాడుకు తిరుగు ప్రయాణమవుతాడు. మార్గమధ్యలో ఉప్పులూరులోని ఓ చెట్టు కింద స్వామివారి విగ్రహాన్ని ఉంచి... చుట్టుపక్కల గ్రామాల్లో ఆయవారానికి వెళతాడు. పనులన్నీ ముగించుకుని తిరిగొచ్చాక విగ్రహాన్ని భుజానికెత్తుకొనే ప్రయత్నం చేస్తే అది ఏ మాత్రం కదలదు.  ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతమంది సాయం తీసుకున్నా నారాయణదాసు విగ్రహాన్ని భుజానికెత్తుకోవడంలో విఫలమవుతాడు. అప్పుడు అర్థమవుతుంది అదంతా స్వామివారి మహత్యమని. అలా 1280 ప్రాంతంలో చెన్నకేశవస్వామి ఉప్పులూరులో శ్రీలక్ష్మీ చూడికుడుత్త నాచ్చియార్‌ ఆండాళ్‌ సమేతంగా స్వయంభూగా వెలిశారనీ, తరవాత నారాయణదాసు కూడా ఆ గ్రామంలోనే స్థిరపడి స్వామిని సేవించడం మొదలుపెట్టాడనీ చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 1335లో కందాల కృష్ణమాచార్యులు అనే ఆయన ఆలయం నిర్మించగా, జుజూరి సంస్థానాధీశులు రాజా జూపల్లి రాగన్న ఆలయాన్ని విస్తరించాడు. కొన్నాళ్లకి శనివారపుపేట సంస్థానాధీశులు రాజ ధర్మ అప్పారావు బహుదూర్‌ ప్రస్తుత ఆలయాన్ని నిర్మించి పంచ లోహా మిశ్రమ ఉత్సవ విగ్రహాల్ని ప్రతిష్ఠించాడు.

అరటిగెలే నైవేద్యం...
అలా పదకొండు తరాలుగా కన్నమదాసు వారసులు వంశ పారంపర్యంగా వేద, ద్రావిడ, సంస్కృత భాషల్లో మంత్రోచ్ఛరణలూ, తిరుపూజ, యాజ్ఞిక హోమాలు, శాస్త్రీయ పరిజ్ఞానంతో పాటు స్వామి వారి కల్యాణోత్సవాల నిర్వహణ తదితర పూజా విధానాలు నేర్చుకుని చెన్నకేశవుడి సేవలో తరిస్తున్నారు. ప్రస్తుతం తొమ్మిది కుటుంబాల వారున్నారక్కడ. వీరంతా పలు ఉద్యోగాలు చేస్తూనే నెలకొకరు చొప్పున అర్చన చేస్తుంటారు. ధనుర్మాసం, వైశాఖంలో మాత్రం అందరూ కలిసి స్వామివారికి సేవచేస్తారు. స్వామికి చెందిన నలభై ఎకరాల్లోని పాతిక ఎకరాల్లో వీరు సాగు చేసుకుంటారు. మిగతా పదిహేను ఎకరాల్లోని ఆదాయాన్ని ఆలయం అభివృద్ధికి కేటాయిస్తున్నారు. అందుకే ఆ ఆలయంలో హుండీలుండవు. కానుకలు స్వీకరించరు. ఏడాదంతా పూజలూ, హోమాలూ, అభిషేకాదులు నిర్వహిస్తారు. ధనుర్మాసంలో ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఉదయం, సాయంత్రం గ్రామ సేవ నిర్వహిస్తారు. సుప్రభాత సేవతోపాటు తిరుప్పల్లాణ్డు, తిరుపళ్లియొళుచ్చి, తిరుపావై నిర్వహిస్తారు. వైశాఖ మాసం శుద్ధ చవితి నుంచి బహుళ పాడ్యమి వరకూ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతాయి. వైశాఖశుద్ధపౌర్ణమి నాడు స్వామివారి రథయాత్రను కన్నులపండువగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల్లో నివాసముంటున్న గ్రామస్థులు సైతం హాజరవుతారు. స్వామి వారికి ఎంతో ఇష్టమైన అరటిగెలను నైవేద్యంగా సమర్పించడం అక్కడ ఆనవాయితీ. ఎవరైనా మొక్కుకున్నా అరటిగెలనే చెల్లించి మొక్కుతీర్చుకుంటారు. ఈ ఊళ్లో ప్రతి ఇంట్లోనూ మగపిల్లలకు ‘కేశవ’ అనేపేరును పెట్టుకుంటారు. చుట్టుపక్కల కోలమూరు, యండగండి, పాందువ్వ, పాములపర్రు, ఉండి, ఉణుదుర్రు, ఆరేడు, కలిగొట్ల, మైప, ఎస్‌.కొండేపాడు, కేశవరం, గరగపర్రు, గణపవరం తదితర గ్రామాల్లోనూ ఈ పద్ధతినే కొనసాగిస్తున్నారు.

- నారాయణరావు గొట్టేటి, న్యూస్‌టుడే, ఉండి, పశ్చిమగోదావరి జిల్లా

 


మెట్టెలు ఎందుకు పెట్టుకోవాలి?

పెళ్లైన మహిళలు మంగళసూత్రం, గాజులతోపాటు మెట్టెల్నీ ఐదో తనానికి చిహ్నంగా భావించి కాలి రెండో వేలికి ధరిస్తారు. నిజానికి ఇది సెంటిమెంటు కావచ్చుగానీ దీని వెనక ఆరోగ్య రహస్యమూ దాగుందని పరిశోధనలు చెబుతున్నాయి. అదేంటంటే...మన చేతుల్లోనూ పాదాల్లోనూ శరీరంలోని అన్ని అవయవాలకూ సంబంధించిన నాడీ కేంద్రాలు ఉంటాయి. అంటే నాడీ వ్యవస్థ కొనలు ఆ భాగాల్లో ఉన్నాయని అర్థం. ఆ కొనల్ని ప్రేరేపిస్తే వాటికి సంబంధించిన అవయవాలు చక్కగా పనిచేస్తాయి. గర్భాశయానికి సంబంధించిన నరాలు కాలి బొటనవేలు పక్కనున్న వేలులో ముగుస్తాయి. అయితే వేలు మొదలూ చివర్లో తప్ప మధ్య భాగం నేలకి తగలదు. ముఖ్యంగా ఆ భాగంలో ఒత్తిడి ఉంటేనే నరాలు ప్రేరేపితమై గర్భాశయం పనితీరును మెరుగుపరుస్తాయి. తద్వారా గర్భధారణ, నెలసర్లూ, ప్రసవం అన్నీ సక్రమంగా ఉంటాయి. మరి ప్రత్యుత్పత్తి వ్యవస్థపై బాగా పనిచేస్తుంది కదాని ప్రతిరోజూ ఆ వేళ్లని నొక్కుకోవడం కష్టం. చాలామంది అశ్రద్ధ వహిస్తారు. అలాకాకుండా ఆరోగ్యంగా ఉండటానికే వేలి మధ్యలో గుంటలా ఉండేచోట మెట్టెలు పెట్టుకోమంటారు. నడిచిన ప్రతిసారీ ఆ మెట్టెలు నేలకి నొక్కుకుని గర్భాశయంపై ప్రభావం చూపిస్తాయి. అందుకే పూర్వికులు వీటిని సౌభాగ్యంతో ముడిపెట్టి వివాహితలకు అతి ముఖ్యమైన ఆభరణంగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు.

8 డిసెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.