close

రైతు అవుతున్నాడు రాజు!

ఈమధ్య కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు నగదు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. కానీ రైతుకు కావాల్సింది పెట్టుబడి మాత్రమే కాదు, కష్టానికి తగిన ఫలితం... అంటే గిట్టుబాటు ధర, తమ ఉత్పత్తుల్ని 100 శాతం కొనుగోలు చేస్తారన్న ధీమా. ఈ కోణంలో రైతుకు అండగా నిలుస్తోంది తెలుగు కుర్రాడు ప్రారంభించిన వేకూల్‌ ఫుడ్స్‌.

అమెరికాలో డిగ్రీ చేసొచ్చిన సంజయ్‌ దాసరి చెన్నైలో రెస్టరెంట్‌ పెట్టాలనుకున్నాడు. అందుకు ఏమేం అవసరమో వాటిగురించి తెలుసుకునే ప్రయత్నంలో కూరగాయల మార్కెట్‌కి వెళ్లాడు. కానీ శుభ్రత పరంగా అక్కడ పరిస్థితి ఘోరంగా ఉంది. చుట్టుపక్కల చాలావరకూ కూరగాయలూ, పండ్లూ కుళ్లి పడున్నాయి. ఒక దుకాణానికి వెళ్లి ‘ఈ సరుకు ఎక్కణ్నుంచి తెచ్చార’ని అడిగితే, ‘మీకు సరుకు నచ్చితే కొనండి, లేకుంటే వెళ్లండి’ అన్నాడట దుకాణం యజమాని. అది మొదలు ఆ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లమీద అధ్యయనం మొదలుపెట్టాడు సంజయ్‌. వాటిని పరిష్కరిస్తే అటు రైతుకీ, ఇటు వినియోగదారుడికీ లాభం చేకూరుతుందని అర్థమైంది. నిజానికి పాతికేళ్ల సంజయ్‌కి వ్యవసాయం పూర్తిగా కొత్త రంగం. అతడు పుట్టింది అమెరికాలో,  పెరిగింది భారతదేశంలో అయినా నగరాలనే తప్ప పల్లెటూళ్లని చూసిందిలేదు. తండ్రి వినోద్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సంస్థ సీఈఓ, తల్లి సరిత డాక్టర్‌. సంజయ్‌ ఆలోచనకు వాళ్ల ప్రోత్సాహమూ లభించింది. అదే సమయంలో మార్కెటింగ్‌ రంగంలో అనుభవం ఉన్న కార్తీక్‌ జయరామన్‌ ఇతడికి తోడయ్యాడు.

రోజుకి రూ.కోటి
2015లో ప్రారంభించిన తమ సంస్థకు ‘వేకూల్‌ ఫుడ్స్‌’గా పేరు పెట్టారు సంజయ్‌, జయరామన్‌. మొదట వీళ్లు ‘సన్నీబీ’ పేరుతో చెన్నైలో రిటైల్‌ దుకాణాల్ని ప్రారంభించి సేంద్రియ కూరగాయలూ, పండ్లూ అందించేవారు. ఆ సమయంలో రైతులతో ప్రయాణం చేశాక ఆ మార్కెట్‌ విస్తృతిని అర్థం చేసుకున్నారు. తర్వాతనుంచి బియ్యం, గోధుమలూ ఇతర ఉత్పత్తుల్నీ రైతుల నుంచి సేకరించి సూపర్‌ మార్కెట్లూ, హోటళ్లూ, కిరాణా దుకాణాలూ, కేటరింగ్‌ సంస్థలకు సరఫరా చేయడం మొదలుపెట్టారు. దీన్లో భాగంగా సంస్థ ప్రతినిధులు రైతుల దగ్గరకు వెళ్లి కావాల్సిన ఉత్పత్తుల గురించి ముందే చెబుతారు. ప్రతి వెయ్యిమంది రైతులకీ ఒకరు చొప్పున కంపెనీ ప్రతినిధిని నియమించి సాగుతీరుని
పర్యవేక్షించేలా చూస్తారు. విద్యావంతులైన స్థానిక రైతులనే ప్రతినిధులుగా నియమిస్తారు. రైతులు పండించిన ఉత్పత్తుల్ని 100 శాతం కొనుగోలు చేస్తారు. సాధారణంగా సరుకు మార్కెట్‌కి చేరే సమయంలో 20-30 శాతం వృధా ఉంటుంది. కానీ వీరు మాత్రం ఎలాంటి వృధా లేకుండా 12గంటల్లో వినియోగదారులకు వాటిని చేరవేస్తారు. తద్వారా ఆహార వృధాని కూడా తగ్గించగలుగుతున్నారు. వేకూల్‌ ప్రస్తుతం చెన్నై, బెంగళూరు, కోయంబత్తూరు, సేలం, హైదరాబాద్‌లలో 5000 సంస్థలకు సేవలు అందిస్తోంది. దక్షిణాది రైతులనుంచి ప్రధానంగా ఉత్పత్తుల్ని సేకరిస్తున్నా... నాసిక్‌ నుంచి ఉల్లి, ఆగ్రా నుంచి బంగాళాదుంపలూ, కశ్మీర్‌ నుంచి ఆపిల్‌... ఇలా ఉత్తరాదినుంచీ సరుకుల్ని కొంటారు. దేశవ్యాప్తంగా 35వేల మంది రైతుల నుంచి నెలకు రూ.30 కోట్లు విలువచేసే 200 టన్నుల సరుకుల్ని కొంటున్నారు. తమ రాకతో రైతుల నికర లాభం 25 శాతం పెరిగిందనీ, దాన్ని  100 శాతానికి పెంచాలనేది తమ లక్ష్యమనీ చెబుతాడు సంజయ్‌. వెయ్యి మంది ఉద్యోగులున్న ఈ కంపెనీ ఇప్పటివరకూ రూ.160కోట్ల పెట్టుబడుల్ని సేకరించింది.

రైతుల్లో మార్పు...
ఇదివరకు రైతులు తమకున్న మొత్తం పొలంలో టమాటా, బెండ, వంకాయ, క్యాబేజీ, మిరప... ఇలా ఒకే పంటని సాగుచేసేవారు. వేకూల్‌ తమతో పనిచేస్తున్న రైతులు చిన్న కమతాల్లోనూ భిన్నమైన పంటలు సాగుచేసేలా మార్పుతెచ్చింది. ఫలితంగా ఒకే ప్రాంతంలో ఒకే రకం పంట దిగుబడి ఎక్కువ కాకుండా, ఏడాది పొడుగునా ఆదాయం అందేలా చేస్తోంది. తమ దగ్గరున్న గణాంకాలతో ఏ సీజన్లో ఏయే రకాల పంటలకు డిమాండ్‌ ఉంటుందో రైతులకు ముందే సమాచారాన్ని ఇవ్వడంతో రైతులు లాభపడుతున్నారు. అంతేకాదు, పొలంలో విత్తనం నాటిన నుంచి వినియోగదారుణ్ని చేరేంతవరకూ ప్రతి దశలోనూ సమాచారాన్ని సేకరించి పెడుతున్నారు. ‘రైతులకు ఇదివరకు తమ పంట మార్కెట్‌కి వెళ్తుందా అన్న భయం ఉండేది. కానీ వేకూల్‌ ప్రతినిధులు నేరుగా రైతుల దగ్గరకే వెళ్లి ఉత్పత్తుల్ని కొని తెస్తారు. 24 గంటల్లో పంటకు సంబంధించిన డబ్బు వారి ఖాతాలో చేరిపోతుంది’ అని చెబుతారు జయరామన్‌. వ్యవసాయ రంగానికి అనుబంధంగా పనిచేయడంవల్ల ఇక్కడ కూడా మానవ వనరుల కొరతను ఎదుర్కొంటున్నారు. ‘నైన్‌ టూ ఫైవ్‌’
ఉద్యోగంలా కాకుండా 24 గంటలూ ఏదో ఒక దశలో పని జరుగుతుండటంవల్ల పర్యవేక్షణ సవాలుగా ఉంటోందనీ, సాంకేతికత సాయంతో దీన్ని అధిగమిస్తున్నామనీ చెబుతాడు సంజయ్‌. రైతులకూ, వినియోగదారులకూ సమకూరుతున్న లాభమే తమని ఉత్సాహపరుస్తోందని చెబుతుందీ మిత్ర ద్వయం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.