close

జీవిత చదరంగం

జ్యోతి సుంకరణం

‘‘అమ్మమ్మా ..అమ్మమ్మా’’ అంటూ వీధిలోంచే  గట్టిగా పిలుస్తూ, రొప్పుతూ, వస్తున్న మనవరాలు అపర్ణని చూసి ‘కాలేజీకి టైమ్‌ అయిపోతోందంటూ, ఎంత బతిమాలినా ఓ ముద్దయినా తినకుండా హడావుడిగా బయలుదేరిన పిల్ల... ఇలా వెళ్ళి అలా వచ్చేసిందేవిటీ’ అని మనసులో అనుకుంటూ, చేతిలోని పనిని వదిలేసి కంగారుగా తనకి ఎదురెళుతూ ‘‘ఏవయ్యిందే?’’ అని అడిగింది అన్నపూర్ణ.
లోపలికి వస్తూనే వీపుకి ఉన్న బ్యాగుని, ఓ మూలకి పడేసి ‘‘అమ్మమ్మా... మనం రోజూ క్యారేజీలు ఇచ్చే ఆ వీధి చివరి అపార్టుమెంట్‌లో ఏమైందో తెలుసా..?’’ అంటూ రొప్పుతూ చెప్పుకొచ్చింది అపర్ణ.
మనవరాలు చెప్పిందంతా విన్న అన్నపూర్ణ ‘‘అయ్యో... రామచంద్రా ఎంత పనయ్యింది’’ అంటూ వాపోతూ ‘‘పాపం ఆవిడకి ఎవరైనా ఉన్నారా?’’ అని అడిగింది.

‘‘ఎవ్వరూ లేరట అమ్మమ్మా, ఎవరైనా ఉంటే ఇలా ఎందుకు చేసేది. అన్నీ తనే అనుకున్న భర్త మోసం చేసి ఇలా నడిరోడ్డున పడెయ్యడంతో- ఇద్దరు చిన్న పిల్లలతో ఏం చెయ్యాలో తెలియక, అలాంటి నిర్ణయం తీసుకుంది. సమయానికెవరో పక్కవాళ్ళు చూసి హాస్పిటల్‌లో చేర్చడంతో ప్రమాదం తప్పిందట’’ ఇంకా ఒగరుస్తూనే చెప్పింది అపర్ణ.
‘‘పోనీలే ప్రమాదం తప్పింది గదా ఆ దేవుడి దయవలన’’ అంటూ ఎదురుగా గోడకి ఉన్న దేవుడి ఫొటోకి దండం పెట్టుకుంటున్న అన్నపూర్ణమ్మ చేతుల్ని రెంటినీ తీసుకుని,
‘‘ఇక మీదట ఆవిడ ఎలాంటి క్షణికావేశానికీ లోను కాకుండా ఉండేలా, సాటి మనుషులుగా మనమేమీ చెయ్యలేమా అమ్మమ్మా...’’ అంటూ ఆవిడ కళ్ళలోకి చూసింది అపర్ణ. 

* * *

‘‘అమ్మా... నీ సంగతి తెలిసినప్పటి నుండి నా మనవరాలు రోజూ మధన పడుతూనే ఉంది. ఎలాగైనా నీ మనసు మళ్లించి, నీకు మంచి చెయ్యాలనే తపనైతే ఉంది కానీ... అదెలాగో, ఏంటో నీకు చెప్పేటంతటి వయసుగానీ, అనుభవంకానీ దానికి లేవు, నిన్ను
నా దగ్గరికి తీసుకువస్తే, నీ మనసేమైనా తేలిక పడుతుందేమోనని దాని అభిప్రాయం. అందుకోసం నీ దగ్గరికి రోజూ వచ్చి కాస్త ఎక్కువగానే విసిగించి ఉంటుంది. ఏదో చిన్న పిల్ల చెప్పిందని కొట్టి పారెయ్యకుండా ఇక్కడి కొచ్చావ్‌, చాలా సంతోషమమ్మా, ఇంతకీ నీ పేరేవిటీ?’’ అని అడిగింది అన్నపూర్ణమ్మ, పిల్లల్ని తీసుకుని అపర్ణతోపాటు వచ్చిన ఆ స్త్రీని. ఆ పరిసరాలను చూస్తూ, ఆ ఇంటి పరిస్థితిని అంచనా వేస్తూ అన్యమనస్కంగానే చెప్పింది తన పేరు ‘‘శారద’’ అని. ‘‘అవునా... చక్కటి పేరు, పేరుకి తగ్గట్లే సరస్వతి కళ ఉట్టిపడుతోంది.

నీ మొహంలో’’ అంటూ మురిపెంగా బుగ్గలను పుణికింది అన్నపూర్ణ. ఏదో తెలియని స్వచ్ఛత, ప్రశాంతత కలిగిన ఆవిడ మొహంలోకి ఒకసారి చూసింది శారద. పెళ్ళైన ఇన్ని సంవత్సరాలూ ‘దేభ్యపు మొహందానా’ అనే ట్యాగ్‌ని భర్త ద్వారా తగిలించుకుని తిరుగుతున్న తన మొహంలో సరస్వతి కళను గుర్తించిన ఆ పెద్దావిడ మీద వెంటనే గౌరవ భావాలు కలిగాయి శారదకి. తనకు తెలీకుండానే అన్నపూర్ణమ్మ మాటలను ఆసక్తిగా ఆలకించడం మొదలుపెట్టింది.
 

‘‘చూడమ్మా నువ్వు ఎందుకు తొందరపడ్డావని నేనడగను, నీకొచ్చిన కష్టం ఏంటని కూడా నేనడగను, నువ్వు భరించలేనిదేదో అయ్యే ఉంటుంది. నీ వయసులో నేనూ ఎన్నో కష్టాలు పడ్డదాన్నే. అయితే జీవితాన్నితప్ప నేనేమీ చదువుకోలేదు, అదే నాకు
అన్నీ నేర్పింది. బోలెడంత చదువుకున్న ఈ కాలందానివి నీకు నేను చెప్పగలిగిందేముంటుంది. ఏదో అలా కాస్త నా జీవితం గురించి చెప్పుకొస్తాను విను’’ అంటూ కూరలను ముందేసుకుని కత్తిపీటతో తరుగుతూ మొదలుపెట్టింది అన్నపూర్ణ. ‘‘లోకం దృష్టిలో నేను ఓ దురదృష్టవంతురాల్ని- నిజానికి పుడుతూనే దురదృష్టవంతురాలిని ఏమీ కాదు. మా అమ్మానాన్నలకి, లేక లేక పుట్టిన ఏకైక సంతానాన్నట నేను. నన్ను చూసుకుని మురిసిపోయేవారు. ఎక్కడ కందిపోతానో అనే భయంతో బడికి కూడా పంపేవారు కాదు. అయితే సరిగ్గా ఆడపిల్లకి ఏ వయసులో తల్లి అవసరమో... నాకా వయసులో తల్లిని తీసుకుపోయాడా భగవంతుడు. తల్లి కోసం బెంగ పెట్టుకున్న నన్నెలా ఓదార్చాలో... అంత పెద్ద ఇంటినీ పాడినీ పంటనూ ఒంటరిగా ఎలా నెట్టుకు రావాలో తెలియని మా నాన్నగారు, అందరి సలహా మేరకు ఇష్టంలేకున్నా మరో పెళ్లి చేసుకున్నారు. ఆవిడ ఆదరణలో నేను మా అమ్మను కాస్త మర్చిపోయి ఆనందంగా ఉండగలిగాను. ఇంకో పెళ్లి చేసుకుని తప్పు చేశానేమోననే భావనతో ఉన్న మా నాన్నగారికి నన్నలా చూడటంతో బెంగ తీరింది. హాయిగా ఆనందంగా గడిచిపోతున్నాయి రోజులు అనుకుంటుండగా- ఉన్నట్టుండి- నా సవతి తల్లి నన్ను దూరంపెట్టడం మొదలుపెట్టింది, ఆవిడ దగ్గర చేరిక బాగా అలవాటైన నేను చనువుగా దగ్గరకు వెళ్ళబోతే, ఛీ కొట్టి దూరంగా పొమ్మనేది. ఆవిడ ఎందుకలా ప్రవర్తిస్తుందో మొదట్లో తెలీలేదు, ఉన్న ఒక్క ఆడపిల్లను నేను, నాకు పెళ్లి చేసి పంపించేస్తే, హాయిగా ఈ ఆస్తిని అనుభవించవచ్చు అనుకుందట. తీరా ఆ ఆస్తి అంతా మా అమ్మదనీ అంతా నాకే చెందుతుందనీ తెలియడంతో ఆవిడ అసలు రూపం బైటపడింది. నాన్న ఉన్నప్పుడొకలా,
లేనప్పుడొకలా ప్రవర్తించేది. భరించలేక ఒకరోజు నాన్నకి చెప్పాను. ఇంక అంతే... నాన్నగారి ఆగ్రహావేశాలను పట్టలేకపోయాము. నా సవతి తల్లిని కొట్టినంత పని చేశారు. ఆ ఆవేశం తట్టుకోలేక అనారోగ్యానికి కూడా గురయ్యారు. అది చూసి నాకు ఆయనేమవుతారోనని భయం వేసింది. ఇక మీదట ఏమి జరిగినా ఆయనకు చెప్పి ఆరోగ్యం పాడు చెయ్యకూడదని నిర్ణయించేసుకున్నాను. ఇది గ్రహించిన నా సవతి తల్లి పెచ్చుమీరిపోయింది. ఏమీ చెయ్యలేకా ఎవ్వరికీ చెప్పుకోలేకా అలా గదిలో ఒంటరిగా నా తల్లి ఫొటోను చూసుకుంటూ ఏడ్చుకుంటూ ఉండిపోయేదాన్ని. అలా ఏడుస్తున్న నన్ను చూసి పైలోకాన ఉన్న మా అమ్మ గుండె తరుక్కుపోయి, మా నాన్న మనసుకి చేరవేసిందో లేక ఆయనకే తట టిందో ఏమోగానీ, గాలించి గాలించి నాకు అన్నివిధాలా తగిన జోడీ, అందగాడూ, యోగ్యుడైన ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసి ఇల్లరికం తీసుకొచ్చేశారు. అతని సాహచర్యంలో నా సవతి తల్లి పెట్టిన ఒత్తిడులన్నీ ఇట్టే మర్చిపోయాను. చిలకా గోరింకల్లా తిరిగే మమ్మల్ని చూసి నా సవతి తల్లి కళ్ళల్లో నిప్పుల్ని పోసుకుంది. అసూయతో అవకాశం దొరికినప్పుడల్లా మా ఆయన చెవిలో నామీద ఏవో చెప్పి విషాలు నూరిపోసేది. మొదట్లో పట్టించుకోనట్లున్నా, రానురానూ నన్ను అనుమానించడం, సాధించడం చేసేవాడు. ఆ విషయాలేమీ మా నాన్నకు తెలియకుండా జాగ్రత్త పడి, పిల్లలు పుడితే తనే మారతాడులే అని సరిపెట్టుకున్నా.  
అదీ అయ్యింది, తొలిచూలులో ఆడపిల్ల పుట్టింది. మహాలక్ష్మిలా ఉన్న దాన్నిచూసి మా అమ్మే నా కడుపున పుట్టిందనుకుని ఎంతో మురిసిపోయాను. మిగిలిన బాధలన్నిటినీ మర్చిపోయాను. అయితే, ఆ సంతోషం ఎన్నాళ్ళో నిలవనివ్వలేదు దేవుడు.
ఆడుకుంటూ, ఆడుకుంటూ ఒక రోజు మెట్ల మీంచి పడిపోవడంతో తలకి గట్టి దెబ్బ తగిలి చాలారోజులు కోమాలోకి వెళ్లి, ఎలాగో బతికి బైట పడింది ఆ పాప. ప్రాణాలైతే దక్కాయి కానీ, మెదడుకి తగిలిన దెబ్బ వలన ఇక మీదట శాశ్వతంగా మానసిక ఎదుగుదల ఉండదు అని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. నెత్తీ నోరు బాదుకుని ఏడ్చాను. కొద్దిరోజులకే మనసుని గట్టి చేసుకుని నా అదృష్టమింతే, మరో బిడ్డను కనకుండా, ఈ పాపని కంటికి రెప్పలాగా జీవితాంతం చూసుకుంటే చాలు, ఎలాగూ ఆస్తిపాస్తులకు లోటు లేదు అని ధైర్యం తెచ్చుకున్నాను. అయితే ఆ ధైర్యం కూడా ఎన్నాళ్ళో నిలవలేదు.

పాప పరిస్థితిని చూసి, నా భర్త మనసు కరిగి తన ప్రవర్తనను మార్చుకుని మనిషిగా మారతాడేమోనని ఆశపడ్డ నా ఆశలను అడియాసలు చేస్తూ, చెప్పుడు మాటలని వినడమే కాదు, నేను పాప పనులతో తీరిక లేకుండా ఉంటే, అడ్డమైన వ్యసనాలనీ ఒంట పట్టించుకుని, దొరికినంత డబ్బూ దస్కంతో ఒకరోజు చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి పారిపోయాడు. ఒకపక్క పాప అలాగ... ఇంకో పక్క భర్త ఇలాగ, ఏడ్చుకుంటున్న నన్ను చూసి మా నాన్నగారు కుంగిపోయి మంచానపడ్డారు. ఆ బాధల్లో మేముంటే, నెమ్మదిగా ఇంట్లో విలువైన వాటిని ఒక్కోటీ వాళ్ళ తమ్ముడింటికి చేరవేసేసి, ఇక ఏమీ మిగల్లేదన్న సమయాన... మా నాన్నగారు, తనని రాచి రంపాన పెడుతున్నారని అరిచి గొడవ చేసి ఇంట్లోంచి వెళ్లిపోయింది నా సవతి తల్లి. అసలే కుంగిపోయిన మా నాన్న ఈ నిందతో అసలు లేవలేకపోయారు. ఇటు పాపనూ అటు నాన్ననూ చూసుకోడంలో దేనిమీదా శ్రద్ధ పెట్టలేకపోయాను. వీళ్ళిద్దరి మందులకీ తిండీ తిప్పలకీ మిగిలిన ఇంటినీ పొలాన్నీ కూడా అమ్మేసి, రోడ్డున పడ్డాను. నా కష్టాలని చూడలేని మా నాన్నగారు కాలం చేశారు. ఒంటరిగా చేతిలో మతిలేని బిడ్డతో మిగిలాన్నేను. చేతిలో చిల్లిగవ్వ లేదు, చదువు లేదు, ఏం చెయ్యాలి... అసలు ఏం చేయగలనో కూడా తెలీదు. ఓడలు బళ్ళూ బళ్ళు ఓడలూ అవడమంటే ఏంటో తెలిసొచ్చింది నాకు. నా కూతురి ఆకలి ఏడ్పులు నన్ను రాత్రింబవళ్ళూ వెంటాడేవి. ఏదోలాగా నా బిడ్డ ఆకలి తీర్చాలన్న మొండి ధైర్యం వచ్చింది. ఇంక భేషజాలనూ బిడియాలనూ పక్కన పెట్టేశాను. చుట్టుపక్కల ఇళ్ళల్లో వంటపనికి వెళ్ళాను.
 

నాకు తెలిసిన పని అదొక్కటే. మొదట్లో కష్టమనిపించినా రానురాను అలవాటు పడిపోయాను. నా కష్టార్జితం నాకు ఎంతో తృప్తినీ ఆత్మవిశ్వాసాన్నీ ఇచ్చేది. అలాగే రోజులు గడిచిపోయాయి. నా కూతురికి కాస్త వయసు వచ్చింది. దాన్ని ఎక్కడా ఒక్క క్షణం ఒంటరిగా వదలడానికి లేదు, అలా నాతో తిప్పుకునే దాన్ని. అయితే దాని పిచ్చి చేష్టలు ఎవరూ భరించేవారు కారు, కూతుర్ని తీసుకొచ్చేట్లయితే పనిలోకి రావద్దని మొహంమీదే చెప్పేసేవారు. పనులకి వెళ్ళకపోతే ఇల్లు గడిచేదెలాగా? సరిగ్గా అటువంటి సమయంలో, తాను చేసిన తప్పులకు ఎంతో పశ్చాత్తాపపడుతూ నన్ను వెతుక్కుంటూ వచ్చింది నా సవతి తల్లి. ఎంతైనా తల్లి తర్వాత తల్లి లాంటిది, వెళ్ళిపొమ్మని చెప్పలేక ఇంట్లో పెట్టుకున్నాను, నిజంగానే మనిషి అయ్యింది. నన్ను వంటలకి ధైర్యంగా వెళ్ళమని చెప్పి, నా కూతుర్ని నేనొచ్చేదాకా కంటికి రెప్పలా చూసుకునేది.
 

కొన్ని ఏళ్ళు ఆలోచించుకోనక్కర్లేకపోయింది. ఆ తర్వాత విషజ్వరం వచ్చి ఆవిడ చనిపోయింది. అప్పుడు మళ్ళీ నాలో బెంగ మొదలయింది- రేపటి నుండి ఎలాగా అని. కానీ ఇన్నాళ్లూ రోజులు గడిచిపోలేదా, అలాగే ఏదో మార్గం దేవుడే చూపిస్తాడనే ఒక ఆశ, మొండి ధైర్యం నాలో ఉండేవి. నాలోని ఆశకు ప్రాణంపోస్తూ మా జీవితాల్లోకి రవిని పంపించాడు దేవుడు. నా చిన్ననాటి స్నేహితురాలి కొడుకు రవి. ఏవో కారణాల వలన కుటుంబానికి దూరమై ఏకాకిగా ఉన్న నా స్నేహితురాలికి, మా నాన్నగారే ఆ రోజుల్లో అండగా నిలిచారు. ఏనాడో చేసిన ఆ మేలుని గుర్తుపెట్టుకుని తను చనిపోతూ- ‘ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నామంటే దానికి ఆ కుటుంబమే కారణమనీ వాళ్ళకి మనం జీవితాంతం రుణపడి ఉండాలనీ వెళ్లి చేయూతగా ఉండమనీ ఇదే తన చివరి కోరిక అని చెప్పిందనీ మీకు ఇష్టమైతే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని, జీవితాంతం తోడు నీడగా ఉంటాననీ’ చెప్పాడు రవి. దేవుడిమీద భారం వేసి, అన్యమనస్కంగానే వివాహం జరిపించాను. రాను రాను రవి మంచితనం, చూపించే ఆదరాభిమానాలూ చూసి మనసు తేలిక పరచుకున్నాను. అటువంటి మానసిక పరిపక్వతలేని పిల్లను పెళ్ళి చేసుకుని ఇల్లాలిని చేసుకోవడమేకాదు, తల్లిని కూడా చెయ్యడంతో రవి మీద విపరీతమైన ప్రేమా వాత్సల్యం పెరిగాయి నాలో. ఇద్దరినీ చూసుకుంటూ మురిసిపోయాను. అప్పటివరకూ జీవితంలో ఎదురైన బాధలన్నిటినీ మర్చిపోయి రవి మీద పూర్తి భరోసాతో, నా కూతురి బాధ్యతలను కూడా ధైర్యంగా అప్పచెప్పేసి,  జీవితంలో మొదటిసారి ‘జీవించడం’ మొదలుపెట్టాను.
 

కాలం అలా సాగిపోతే లోకం నన్ను దురదృష్టవంతురాలని ఎందుకంటుందీ- కొంతమందిని దేవుడు కష్టాలు పడడం కోసమే సృష్టిస్తాడనుకుంటా. వాళ్ళు కష్టాలకి అలవాటుపడి కష్టపడడం మానేస్తే, తాత్కాలిక సుఖాలను కల్పించి, మళ్ళీ కష్టం విలువ తెలిసేటట్లు చేస్తుంటాడు. అదిగో దానిలో భాగంగానే ఏదో పని ఉండి బైటకు వెళ్లిన రవిని యాక్సిడెంట్‌ రూపంలో మృత్యువు కబళించేటట్లు చేసి నాకు కోలుకోలేని కష్టాన్ని కలిగించాడు. నవ్వుతూ వెళ్లిన రవి, నిర్జీవంగా చేరడం చూసి నోటమాట రాక చేష్టలుడిగి నేను అయోమయంగా అల్లుడి శవం ముందు కూర్చుని ఉంటే, ఇదేమీ పట్టని నా కూతురు ‘అమ్మా... ఆకలేస్తోంది అన్నం పెట్టవా’ అంటూ ఏడ్చింది. నా కూతురికి ఎలా చెప్తే అర్ధమవుతుందో, ఏం చెప్తే అర్ధమవుతుందో తెలియక భోరుమన్నాను... ‘చూడమ్మా, ఇటు చూడు... నీ భర్త రవి, ఇక తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడమ్మా’ అంటూ ఏడుస్తూ వివరించబోయాను. అదేమీ పట్టించుకోకుండా ‘ఆకలి... ఆకలి’ అంటూ తిరిగి నాకే అర్థమయ్యేలా సైగలతో చెప్పేందుకు ప్రయత్నిస్తున్న తనని చూసి - ఆకలీ, నిద్రా తప్ప ఏమీ తెలియని దానికి, ఏదో తెలియ చెప్పాలనుకోవడం.

నా పిచ్చితనం అని గ్రహించి, పొంగుకొచ్చే దుఃఖాన్ని గుండెలోనే దాచేసుకుని, కళ్ళు తుడుచుకుని లేచి వెళ్లి, కంచంలో అన్నం కూరా కలుపుకొచ్చి దానికి తినిపించి ఆ తర్వాతే నా అల్లుడికి దహన సంస్కారాలు జరిపించాను.

* * *

అయిదారేళ్ళయింది. జీవితంలో అన్నిటినీ సరిపెట్టుకున్నట్లుగా ఈ దుర్ఘటనని సరిపెట్టుకోలేకపోయాను. ఇంకా ఎన్నాళ్ళు దేవుడు నాతో వైకుంఠపాళీ ఆడతాడా అనిపించేసింది. ఒక్క మెట్టు పైకి ఎక్కించి వంద మెట్లు కిందకి లాగేస్తున్నాడు. కూతుర్ని చూసుకోవడమే కష్టమనుకుంటే, ఇప్పుడు మనవరాలు కూడా, ఒక పక్క వయసు మీద పడిపోతుండటంతో ‘నేను బతికి ఉన్నన్నాళ్లూ పర్వాలేదు, నా తర్వాత ఎలాగ?’ అన్న బెంగ పట్టుకుంది. వీటి అన్నిటి ఒత్తిడి కారణంగా తరచూ అనారోగ్యం.
 

ఒకరోజు మంచం మీద లేవలేని స్థితిలో ఉన్నాన్నేను. ఆ నెల అంతా సరిగ్గా పనుల్లోకి వెళ్ళలేని కారణంగా ఇంట్లో వెచ్చాలన్నీ నిండుకున్నాయి. బిందెడు మంచినీళ్ళు తప్ప ఏమీ లేవు. మరోపక్క నా కూతురు ఆకలేస్తోందని ఒకటే అరుస్తూ ఏడుస్తోంది, ఏమీ చెయ్యలేని అసహాయత నాది. నాలోని ధైర్యం సన్నగిల్లుతోందేమోననే భయం మొదటిసారి కలిగింది. అప్పుడు ‘దేవుడా... నన్నెన్ని కష్టాలైనా పెట్టు భరిస్తాను, కానీ నన్నే అంటిపెట్టుకుని ఉన్న ఆ పసివాళ్ళకిద్దరికీ అన్యాయం చెయ్యకు’ అని వేడుకున్నాను. ఈలోగా ఏడుస్తున్న నా కూతురి ఏడుపులు ఆగిపోయాయి, ‘అమ్మో... కొంపతీసి ఆకలికి శోషొచ్చి కానీ పడిపోలేదు కదా’ ఆ ఊహతో నా గుండె దడదడ లాడింది. ఎలాగో కాలూ చెయ్యీ కూడదీసుకుని లేచి, దాని దగ్గరికి వెళ్లాను. అంతే!! అక్కడి దృశ్యం చూసి సంభ్రమాశ్చర్యాలతో నా నోటమాట రాలేదు. అక్కడ నా చిన్నారి మనవరాలు ఎప్పుడు వెళ్లి తెచ్చిందో ఏమో గుడిలోంచి ప్రసాదం తెచ్చి తన చిట్టి చేతులతో వాళ్ళ అమ్మకు తినిపిస్తోంది. ఆ కాస్త ప్రసాదం నా కూతురి ఆకలి తీర్చలేకపోవచ్చు, కానీ నాలో ఆశను ఆరిపోకుండా చేసింది.

‘భగవంతుడా... ఎప్పుడూ ఇలాగే నాలో ఆశాజ్యోతిని వెలిగిస్తుండవయ్యా’ అంటూ చేతులెత్తి దేవుడికి దండం పెట్టుకున్నాను. పక్కనే ఉన్న గుడిలోంచి శుభసూచకంగా గంటలు మోగాయి. అలా కొండెక్కిపోతాయేమో మా జీవితాలు అని భయపడేవేళ ఆ దేవుడు నా మనవరాలిని పంపించాడు. అప్పటిదాకా ఒంటరిగా పోరాడి పోరాడి అలసిపోయి ఇక నేలకు ఒరిగిపోతానేమో అనే సమయంలో నా మనవరాలి రూపంలో నాకు చేయూతనిచ్చి, నన్ను మళ్ళీ నిలబెట్టాడు. ఆస్తిపాస్తుల్ని కోల్పోయి, అయినవాళ్ళని దూరం చేసుకుని, ఒంటరినైన నన్ను లోకమంతా దురదృష్టవంతురాల్ని అనేది. కానీ నాకు జీవితం నేర్పిందేమిటంటే... ఏది ఉన్నా, ఏది లేకపోయినా, మనలో ఆశని కోల్పోనంత వరకూ మనం దురదృష్టవంతులం కాము. ఆ విధంగా నేనెప్పుడూ అదృష్టవంతురాలినే. అందువల్లనే ఇన్నేళ్ళల్లో ఎప్పుడు ఏ కష్టమొచ్చినా, అది గట్టెక్కి ఎలా బతకాలా అనే ఆలోచించేదాన్ని కానీ, ఎలా చావాలా అని ఒక్కసారి కూడా అనుకోలేదు. ‘ఇన్ని బాధలుపడుతూ నేనూ నా కూతురూ ఎందుకోసం బతకాలి, ఏం సాధించాలని’ అని ఒక్క క్షణం నేను ఆవేశపడి ఉంటే, ఈరోజు నేనిలా ఉండేదాన్ని కాను. ఈ రోజున చూడు నా మనవరాలి సాయంతో, అవసరమైన వారికి రోజూ వంటచేసి క్యారేజీలు సప్లై చెయ్యడమే కాకుండా, పచ్చళ్ళూ పిండివంటలూ కూడా చేసి, నేను నిలదొక్కుకోవడంతోపాటు నిస్సహాయులైన ఇద్దరు ఆడవాళ్ళకి కూడా అంతో ఇంతో సంపాయించుకుని, జీవితాల్ని నిలబెట్టుకోగలిగే అవకాశాన్ని ఇవ్వగలిగాను. ఇంకా నా మనవరాలికి చదువై మంచి ఉద్యోగం వస్తే, నా కూతురిలాంటి మనోవైకల్యం ఉన్న వాళ్ళకెవరికైనా చేతనైనంత సాయం చెయ్యాలనే నా ఆశ. ‘ఏవిటీ ముసలమ్మ, ఏవిటీ ధైర్యం, ఎంత కాలముంటుందనీ’ అనుకుంటున్నావా... ఆశ అంటూ బలంగా ఉంటే చాలమ్మా, నేను పోయాక కూడా అది బతికే ఉంటుంది. నేను నీకు చెప్పేది ఒక్కటే- ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశను కోల్పోకు, అది ఒక్కటీ ఉంటే చాలు ఈ కష్టాలూ కన్నీళ్ళూ తాత్కాలికమే. మనకొచ్చే కష్టాలు, బాధలూ అన్నీ మన చుట్టూ ఉండేవాళ్ళ వల్లనే అన్న భ్రమలో ఉంటాం. కానీ మన తలరాతలను ఆ దేవుడు ముందే రాసి మనల్ని ఏదో ఉద్దేశ్యంతోనే ఈ లోకానికి పంపిస్తాడు.
 

అది మర్చిపోయి అప్పటికి ఆ కష్టాన్నో అపజయాన్నో తప్పించుకోడానికి చావుని కోరుకోవడమే కానీ, చచ్చి ఎవరి దగ్గరికి వెళతాం... ఆ దేవుడి దగ్గరికేగా. తన పని నెరవేరకపోతే ఆ దేవుడు ఊరుకుంటాడా... మరోజన్మను ఇచ్చి మళ్ళీ బతకడం నేర్చుకోమంటాడు. ఎవరి జీవితమూ వడ్డించిన విస్తరి కాదు, అందరికీ కష్టాలూ సుఖాలూ అన్నీ ఉంటాయి. కాకపోతే, కష్టమనుకుంటే సుఖం కూడా కష్టంలాగే ఉంటుంది.
 

సుఖమనుకుంటే కష్టం కూడా సుఖంలాగే ఉంటుంది. నీ భర్తో లేక నీ చుట్టూ ఉన్న సమాజమో పడేసిన భిక్షకాదు నీ జీవితం. వాళ్ళమీద అసహ్యమో కోపమో వస్తే నీ జీవితాన్ని అంతం చేసుకోవడానికి...
 

అది దేవుని ప్రసాదం. దాన్ని మనసారా ఆస్వాదించు. ఈ కాలం దానివి, చదువుకున్న దానివి, బియ్యంలో రాయి వస్తే దాన్ని మాత్రమే తీసి పారెయ్యాలిగానీ, మొత్తం బియ్యాన్నే కాదు కదమ్మా. ఈ జీవిత చదరంగంలో గెలుపోటములుండవు అనే విషయాన్ని బలంగా నమ్మితే, మనకి స్థితప్రజ్ఞత వస్తుంది. అది వచ్చిన రోజున భూత భవిష్యత్‌ వర్తమాన కాలాల్లోని ఈతి బాధలు మనకు కనపడవు. కేవలం ఆ దైవలీల మాత్రమే కనపడుతుంది’’ అంటూ కత్తిపీటను పక్కకుబెట్టి, తరిగిన కూరలని తీసుకుని పైకి లేచింది అన్నపూర్ణమ్మ.
ఆ మాటల్లో మంత్రమే ఉందో, మాయే ఉందో, సైకియాట్రిస్టుల కౌన్సిలింగులూ డాక్టర్ల మందులూ ఇవ్వని తేలిక భావమేదో మనసుకు కలుగుతుంటే, ఆమె వైపే చూస్తూ అలాగే కూర్చుండి పోయింది శారద.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.