close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్లాస్టిక్‌ రోడ్డు... సత్తా చూడు!

చెన్నైలో ఒక రోడ్డు పేరు జంబులింగం రోడ్‌. ఆ రోడ్డు వేసి పదిహేనేళ్లు దాటింది. ఈ మధ్యకాలంలో ఎన్నో వర్షాలే కాదు, వరదలూ వచ్చాయి. మండు వేసవులూ వెళ్లాయి. కానీ ఆ రోడ్డు చెక్కు చెదరలేదు. లక్షలు పెట్టి కొత్త రోడ్డు వేస్తే ఒక్క వానాకాలానికే గుంతలు పడిపోవడం, ప్రయాణంలో నరకం చూపించడం మనకు అనుభవమే. ఆ రోడ్డు అలా కాకపోవడానికి కారణం... అది ప్లాస్టిక్‌ రోడ్డు కావడమే!

టన్నులకొద్దీ తయారవుతున్న ప్లాస్టిక్‌ చెత్తను పర్యావరణానికి హాని కలగకుండా ఉపయోగించడంలో మనదేశమూ ప్రత్యేకత నిలుపుకుంటోంది. గత ఏడాదే లక్ష కిలోమీటర్ల ప్లాస్టిక్‌ రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రపంచ ఆర్థికవేదిక ప్రశంసలూ అందుకుంది. ప్లాస్టిక్‌ చెత్తని రోడ్డు నిర్మాణానికి ఉపయోగించవచ్చని తెలుసుకుని దాదాపు రెండు దశాబ్దాలైనా ఆచరణలో దాని ఫలితాలు కన్పించడం మొదలెట్టింది మాత్రం గత నాలుగైదేళ్లుగానే. ఉపయోగించిన చోట మంచి ఫలితాలు కన్పించడం, రోడ్డు నిర్మాణంలో తప్పనిసరిగా ప్లాస్టిక్‌ చెత్తను వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ప్లాస్టిక్‌ రోడ్ల నిర్మాణం ఊపందుకుంది. ఇప్పటివరకూ డజనుకుపైగా రాష్ట్రాలు ప్లాస్టిక్‌ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాయి.

రెండు రకాలుగానూ లాభమే!
ప్లాస్టిక్‌ రోడ్లు చాలాకాలం మన్నుతాయి. రెట్టింపు భారాన్ని మోస్తాయి. నీటి తాకిడిని తారు కన్నా ప్లాస్టిక్‌ రోడ్డు బాగా తట్టుకుంటుంది. పైగా ఈ రోడ్లమీద నీరు నిలవడమూ తక్కువే. దాంతో గుంతలు పడవు. రోడ్డు ప్రమాదాల వల్ల సంభవించే మరణాల్లో పదోవంతు గుంతలవల్లే జరుగుతున్నాయని అంచనా. ప్లాస్టిక్‌ రోడ్ల వల్ల ఆ మరణాలను నివారించినట్లవుతుంది. మనదేశంలో వినియోగిస్తున్న ప్లాస్టిక్‌లో సగానికి కాస్త పైగా మాత్రమే రీసైకిల్‌ అవుతోంది. మిగతాదంతా చెత్తలో కలిసి తగలబడుతోంది. నీటివనరుల్లో చేరి కలుషితం చేస్తోంది. ఈ సమస్యలన్నిటివల్లా ప్రజల ఆరోగ్యమూ పర్యావరణమూ కూడా దెబ్బతింటున్నాయి. అలాంటి ప్లాస్టిక్‌ చెత్తలో ఎక్కువ శాతం ఉండేది ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ కవర్లే. వాటిని ఇలా రోడ్డు నిర్మాణంలో ఉపయోగిస్తే అటు చెత్త సమస్యా తీరుతుంది. ఇటు నాణ్యమైన రోడ్డూ ఏర్పడుతుంది. పైగా తారు వాడకం తగ్గుతుంది కాబట్టి ఆమేరకు కర్బన కాలుష్యాన్నీ తగ్గించినట్లే. ఈ రోడ్లకి నిర్వహణ ఖర్చు కూడా నామమాత్రమే!

ఎలా వేస్తారు!
ప్లాస్టిక్‌తో రోడ్డు అంటే అచ్చంగా ప్లాస్టిక్‌ వాడరు. అన్ని రకాల ప్లాస్టిక్కూ కూడా వాడరు. పాల కవర్లూ క్యారీబ్యాగులూ లాంటివీ; ఫోమ్‌, పీవీసీలతో తయారైనవాటినీ తీసుకుంటారు. వాటిని దుమ్మూధూళీ లేకుండా శుభ్రం చేస్తారు. మిషన్లతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి రోడ్డు వేసే బిట్యుమెన్‌ మిశ్రమంలో కలుపుతారు. రోడ్డుకు వాడే తారు నాణ్యతను బట్టి దాని స్థానంలో 10 నుంచి 30 శాతం వరకూ ప్లాస్టిక్‌ని తీసుకుంటారు. తారూ ప్లాస్టిక్కూ రెండూ పెట్రోలియం ఉత్పత్తులే కాబట్టి తేలిగ్గానే కలిసిపోతాయి. ఇందుకోసం ప్రత్యేక యంత్రాలు కూడా అక్కర్లేదు. ప్లాస్టిక్‌ వాడడం వల్ల కిలోమీటరు రోడ్డు నిర్మాణంలో 60 నుంచి 70వేల రూపాయల దాకా ఆదా అవుతుందంటారు ‘ప్లాస్టిక్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరొందిన రాజగోపాలన్‌ వాసుదేవన్‌. ప్లాస్టిక్‌ని ఇలా వాడవచ్చని కనిపెట్టింది తమిళనాడుకు చెందిన ఈ రసాయన శాస్త్ర ప్రొఫెసరే. అందుకే ఆయన ఆవిష్కరణని అమల్లో పెట్టడంలో చెన్నై నగరం ముందు నిలుస్తోంది. ప్లాస్టిక్‌తో ప్రయోగాత్మకంగా వేసిన తొలి రహదారి జంబులింగం రోడ్‌. ఇప్పటికీ అది చెక్కుచెదరలేదు. దాంతో చెన్నైలోని ప్రధాన మార్గాలైన ఎన్‌ఎస్‌సి బోస్‌ రోడ్‌, హాల్స్‌ రోడ్‌, ఎతిరాజ్‌ సాలై లాంటి చోట్ల రోడ్లకు ప్లాస్టిక్‌ని వాడారు.

ఆ స్ఫూర్తితో...
గ్రామాలకు వేసే కొత్త రోడ్లకే కాక నగరాల్లో ఇప్పటికే ఉన్న రోడ్లకూ ప్లాస్టిక్‌ని వాడుతున్నారు ఇప్పుడు. చెన్నై స్ఫూర్తితో ఇండోర్‌ నగరం నూరుశాతం ప్లాస్టిక్‌ని రీసైకిల్‌చేసి గత రెండేళ్లలో 45 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణంలో ఉపయోగించింది. వెయ్యి కిలోల ప్లాస్టిక్‌ చెత్తని రోడ్డు నిర్మాణంలో వినియోగించినప్పుడల్లా రూ.2,500 మిగులుతున్నట్లు ఇండోర్‌ అధికారులు లెక్కలు వేశారు. మహారాష్ట్రలోని పుణె నగరం కూడా గత మూడేళ్లుగా రోడ్డు నిర్మాణంలో ప్లాస్టిక్‌ చెత్తను ఉపయోగిస్తోంది. రెండేళ్లుగా వానాకాలంలో రోడ్లకు మరమ్మతులు తగ్గి సూరత్‌ నగరం హాయిగా ఊపిరి పీల్చుకోవడానికి కారణం రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్‌ వాడకం మొదలెట్టడమే. దాదాపు 16 కి.మీ.ల రోడ్ల మీద ప్లాస్టిక్‌ మిశ్రమంతో పైన అదనపు కోటింగ్‌ వేయడం వల్ల ఎక్కడా బీటలు వారడం కానీ గుంతలు పడడం కానీ జరగలేదు.
ఒక కిలోమీటరు రోడ్డు వేయడానికి టన్ను ప్లాస్టిక్‌ వాడొచ్చు. అంటే దాదాపు 10 లక్షల క్యారీబ్యాగులు. ఒకసారి వాడి పారేసే బ్యాగుల్ని ఇలా రోడ్డు వేయడానికి వాడడం వల్ల ఆ మేరకు భూమికి ప్లాస్టిక్‌ భారం తగ్గించొచ్చు. ఈ స్ఫూర్తిని అన్ని రాష్ట్రాలూ అందిపుచ్చుకుంటే నగరాల్లో చెత్తా తగ్గుతుంది, రోడ్లూ బాగుపడతాయి... ఏమంటారు?

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.