close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హాయ్‌రే హాయ్‌... జాంపండురోయ్‌..!

‘మా పెరటి జామచెట్టు పళ్లన్నీ కుశలం అడిగె...’ అన్నాడో సినీకవి. అక్కడ సందర్భం వేరే కావచ్చుగాక... కానీ నిజంగానే జామచెట్టు ఇంట్లో ఉంటే ఆ ఇంటివాళ్లను కుశలమేనా అని అడగాల్సిన పనే లేదు అన్నది సంప్రదాయ, ఆధునిక వైద్యుల ప్రవచనం. అవునుమరి, అపరిమితమైన పోషకాలతో నిండిన జాంపండ్లను తింటే అటు ఆరోగ్యం... ఇటు అందం... రెండూ ఏకకాలంలో సొంతమవుతాయి. అందుకే ‘హాయ్‌రే హాయ్‌...జాంపండురోయ్‌...’ అంటున్నారంతా..!

జామచెట్టు పెరట్లో ఉంటే బోలెడు కాలక్షేపం. ఏ కాయ దోరగా పండిందో చూస్తూ కోసేవాళ్లు కొందరైతే, ఏకంగా చెట్టెక్కి చిలక్కొట్టిన కాయను వెతికి పట్టుకుని తినేవాళ్లు ఇంకొందరు. మొత్తమ్మీద పిల్లాపెద్దా అందరికీ జామచెట్టు బిల్లు కట్టకుండానే రెడీమేడ్‌ స్నాక్‌ను అందించే గ్రీన్‌ హోటల్‌ అన్నమాట. అయితే కాయలకోసం చెట్టెక్కే పని లేకుండా కుండీల్లో కాసే పొట్టి రకాలూ వస్తున్నాయి. మనకు తెలిసిన తెలుపూ ఎరుపూ రకాలే కాకుండా జామలో సహజంగానే అనేక రకాలు ఉన్నాయి. దీనికితోడు నచ్చిన రుచుల్ని సంకరీకరించడంతో ఇవి భిన్న సైజుల్లోనూ విభిన్న రుచుల్లోనూ పండుతున్నాయి. ఎన్ని రకాలున్నా మన దగ్గర పండించేవాటిలో ఆపిల్‌జామ, సర్దార్‌, అలహాబాద్‌ సఫేదా, కోహిర్‌ సఫేదా, లలిత్‌, చిట్టిదార్‌, హరీజా, అర్క మృదుల, కేజీ జామ, థాయ్‌ జామ.. వంటివి ముఖ్యమైనవి. అందులోనూ అలహాబాద్‌లో పండే సఫేదా రకానికీ, మెదక్‌జిల్లాలోని కోహిర్‌ ఊళ్లో పండే సఫేదా జాంపండ్ల రుచికీ మరేవీ సాటి రావట. శతాబ్దాల నుంచీ పండిస్తోన్న కోహిర్‌ రకంలో గింజలు తక్కువ, గుజ్జు ఎక్కువ. దాంతో వృద్ధులూ సులభంగా తినొచ్చు. అందుకే ఇవి దేశవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి. మీడియం సైజులో లేత గులాబీరంగు గుజ్జుతో ఉండే ఆపిల్‌జామ, పసుపురంగు తొక్కతో తెల్లని గుజ్జుతో ఉండే సర్దార్‌ జామ రకాలు మధురమైన రుచితో నోరూరిస్తే, మెత్తని గింజలతో ఉండే చిట్టిదార్‌ రకం వృద్ధుల్నీ జామకాయ తినేలా చేస్తుంది. ఇక, బిహార్‌లో పండించే హప్షి రకం పలుచని తొక్కతో ఎర్రని గుజ్జుతో ఉంటే, గులాబీ రంగులోని సెబియా ఆపిల్‌నే తలపిస్తుంది. గులాబీరంగు గుజ్జుతో పెద్ద సైజులోనూ కాసే అలహాబాద్‌ సుర్ఖా జామ తియ్యగానూ సువాసననీ కలిగి ఉంటుంది. సీడ్‌లెస్‌ జామ రకాలకు మాత్రం సహరాన్‌పూర్‌, నాగపుర్‌లు పెట్టింది పేరు.

దేశవిదేశాల్లో..!
జామ అనగానే మన సొంతంలా అనిపిస్తుంది కానీ అనేక పండ్లూ కూరగాయల మాదిరిగానే ఇది కూడా దక్షిణ అమెరికా నుంచే వచ్చింది. అందుకే జామ రకాలు అక్కడే ఎక్కువ. కానీ వాళ్లు దీన్ని నేరుగా తినకుండా సాస్‌లూ జామ్‌లూ జెల్లీలూ డెజర్ట్‌లూ పాన్‌కేకులూ మఫిన్లూ కేకుల తయారీలో వాడుతుంటారు. పైకి గట్టిగా ఉన్నా లోపల జ్యూసీగా ఉండే ఎర్రని స్ట్రాబెర్రీ గోవా, పసుపురంగులోని లెమన్‌ గోవా, కోలాకృతిలోని పైనాపిల్‌ గోవా, బెర్రీ సైజులో ఎరుపూ నలుపూ రంగుల్లో పండే చిలియన్‌ గోవా, పసుపురంగు తొక్కతో తెల్లని గుజ్జుతో ఉండే మెక్సికన్‌ క్రీమ్‌, కెరోటినాయిడ్లూ ఆంథోసైనిన్లూ పుష్కలంగా ఉండే పర్పుల్‌ ఫారెస్ట్‌, పియర్స్‌ ఆకారంలో ఎరుపు రంగులో ఉండే మలేషియన్‌ గోవా... ఇలా అనేక రకాలను విదేశాల్లో పండిస్తుంటారు. తియ్యని వాసనతో పుల్లని రుచితో ఉండే గుయాబా రకం నారింజరంగులో ఆకర్షణీయంగా ఉంటుంది, ఏడాది పొడవునా కాస్తుంది. గోబిరోబా అనే మరో రకం కూడా నారింజ రంగులోనే ఉంటుంది కానీ కనీకనిపించని గింజలతో తియ్యగా జ్యూసీగా ఉండే ఈ పండ్లను బ్రెజీలియన్లు సంప్రదాయ వైద్యంలోనూ వంటల్లోనూ వాడుతుంటారు. ఈ రకంలో కార్బోహైడ్రేట్లూ ప్రొటీన్లూ విటమిన్లూ ఖనిజాలూ యాంటీఆక్సిడెంట్లూ అన్నీ పుష్కలమే.

జాంపండు... పోషకాలు మెండు!
సాధారణంగానే జామలో పీచు, విటమిన్‌-ఎ, విటమిన్‌-సి, ఫోలిక్‌ ఆమ్లాల శాతం ఎక్కువ. పొటాషియం, కాపర్‌, మాంగనీస్‌... వంటి ఖనిజాలూ పుష్కలమే. కమలాపండుతో పోలిస్తే జాంపండులో సి- విటమిన్‌ నాలుగురెట్లు ఎక్కువ. స్ట్రాబెర్రీ జామలో అయితే సాధారణ జామకన్నా 25 శాతం ఎక్కువ. మిగిలిన పండ్లతో పోలిస్తే కాల్షియం, ఐరన్‌లు కూడా జామలోనే ఎక్కువ. యాంటీఆక్సిడెంట్లలోకెల్లా కీలకమైన పాలీఫినాల్స్‌ కూడా జామలోనే అధికం. అందుకే జామ అనేక వ్యాధుల నివారణలో మందుగా పనిచేస్తుంది. డయేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్‌... వంటి వ్యాధుల్నీ నివారించే గుణం ఉందనీ, పచ్చికాయల రసం జలుబూ దగ్గుల్నీ నివారిస్తుందనీ చెబుతారు సంప్రదాయ వైద్యులు. జాంపండు మలబద్ధకానికి మంచి మందు. ఇందులోని పిండిపదార్థాలు నెమ్మదిగా జీర్ణమవుతాయి. అందుకే ఈ పండు తింటే ఆకలి త్వరగా వేయదు. తద్వారా బరువు తగ్గడానికీ దోహదపడుతుంది. జామలోని పీచు కొలెస్ట్రాల్‌నీ తగ్గిస్తుంది అంటున్నారు పరిశోధకులు. జామలోని పాలీఫినాల్స్‌కి క్యాన్సర్‌ కణాల్ని అడ్డుకునే శక్తి ఉందట. అందుకే రోజూ ఓ దోర జాంపండు తింటే డయాబెటిస్‌, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌... వంటి మరెన్నో వ్యాధులు రాకుండానూ నివారించుకోవచ్చు. అలాగే శరీరంలో సోడియం, పొటాషియంల సమన్వయాన్ని పెంచడం ద్వారా బీపీనీ తగ్గిస్తుంది జామ. విటమిన్‌-ఎ సైతం ఎక్కువగా ఉండే జాంపండు కంటి ఆరోగ్యానికీ మేలే. ఫోలిక్‌ ఆమ్లం కూడా సమృద్ధిగా ఉండటంతో గర్భిణీల్నీ జామకాయ తినమని చెబుతుంటారు. ఇక జామ ఆకు చిగుళ్ల వ్యాధుల్నీ పంటినొప్పుల్నీ నివారిస్తుంది. ఇందులోని ఆస్ట్రింజెంట్ల వల్ల రోజూ జామకాయ తినేవాళ్లలో చర్మం ఆరోగ్యంగా మెరుస్తుంటుంది. ముడతల్ని నివారించడం ద్వారా వృద్ధాప్య లక్షణాల్నీ నెమ్మదింపజేస్తుంది. విటమిన్‌-కె కూడా పుష్కలంగా ఉండే ఈ పండు, కళ్ల కింది వలయాల్నీ మెటిమల్నీ కూడా నివారిస్తుంది. అందుకేమరి, దోరకాయో పండో... నచ్చిన జామ రకాన్ని దైనందిన ఆహారంలో భాగంగా చేసుకుంటోన్నవాళ్ల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. దాంతో కాస్తోకూస్తో చౌకగా దొరికే జామ సైతం ‘ప్రియ’మైన పండుగా మారిపోయింది.

 

 

చిలక్కొట్టిన పండే తీపెందుకు?

‘చిలక్కొట్టిన జాంపండు...’ అంటూ చిలక్కొట్టిన పండ్లనే కోసుకుని తినడం తెలిసిందే. కానీ చిలుకలు కొరికితే పండ్లు తియ్యగా ఉండవు. తియ్యగా ఉన్న పండ్లనే చిలుకలు కొడతాయి. అదెలా అంటే- పండ్ల చెట్లన్నీ ఆక్సిన్లూ, జిబ్బరిలిన్లూ, సైటోకైనిన్లూ, ఇథిలీన్‌, అబ్‌సిసిక్‌ ఆమ్లం... అనే ఐదు రకాల పదార్థాలను విడుదల చేస్తుంటాయి. వాటిల్లో ఒక రకమైన వాసన కలిగి ఉండే ఇథిలీన్‌ పండ్లను త్వరగా పక్వానికి వచ్చేలా చేస్తుంది. పండ్లచెట్లమీదే ఉండే చిలుకలు ఈ వాసన కనిపెట్టి పక్వానికి రాబోతున్న ఆ పండును తింటాయి. దాని పొట్టకి కొంచెమే చాలు కాబట్టి మిగిలినది వదిలేస్తుంది. అందుకే ఆ పండు తియ్యగా ఉంటుందన్నమాట.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.