close

అది రాక్షసబల్లుల ఆవాసం..!

ఆస్ట్రేలియా... అనగానే అందరికీ గుర్తొచ్చేవి మెల్‌బోర్న్‌, సిడ్నీ, కాన్బెర్రా, కెయిర్న్స్‌... వంటి నగరాలే. కానీ అది అత్యంత పురాతనమైన ఖండం. సుమారు పదికోట్ల సంవత్సరాలనాటి ఆనవాళ్లని అక్కడ స్పష్టంగా చూడొచ్చు. ముఖ్యంగా క్వీన్స్‌ల్యాండ్‌ ప్రాంతం రాక్షస బల్లుల స్థావరం’ అంటూ ఆయా విశేషాల గురించి చెప్పుకొస్తున్నారు గుంటూరుకు చెందిన డాక్టర్‌ గొంది మాధురి.

పర్యటనలో భాగంగా మెల్‌బోర్న్‌ చేరుకున్నాం. యారా నదికి రెండువైపులా నిర్మించిన ఈ నగర అందాలను చూస్తూ గంటలు క్షణాల్లా గడిపేయొచ్చు అనిపించింది. ఎలాగో అక్కడి నుంచి కదిలి, ప్రభుత్వ కార్యాలయాలూ బ్యాంకులూ కొలువుదీరిన బహళ అంతస్తుల భవనాలన్నీ చూశాం. సకల హంగులతో లక్షమందికి పైగా వీక్షించేలా నిర్మించిన క్రికెట్‌ స్టేడియం ఆ ఆట పట్ల వాళ్ల అభిమానానికి నిదర్శనంలా తోచింది. మెల్‌బోర్న్‌ వీధులన్నీ పచ్చని చెట్లూ పూలమొక్కలతో కనువిందు చేస్తాయి. భిన్న సంస్కృతుల సమాహారమైన ఈ నగరంలో నేరాలు దాదాపు ఉండవు. వంద సంవత్సరాల క్రితమే భూగర్భంలో మెట్రోరైళ్లు ప్రయాణించేలా నిర్మించడం ఈ నగరానికున్న మరో ప్రత్యేకత. రైల్వే ప్లాట్‌ఫామ్‌లు అద్దాల్లా మెరుస్తున్నాయి. అవన్నీ చూశాక నగరానికి సమీపంలోనే ఉన్న ఫిలిప్స్‌ దీవికి వెళ్లాం. సముద్రంలో కట్టిన వంతెనమీద కారులో ప్రయాణించి ఆ దీవికి చేరుకోవడం వింతైన అనుభూతిని కలిగించింది. అక్కడే సముద్రజీవుల పరిశోధక కేంద్రం ఉంది. అది చూశాక దానికి కాస్త దూరంలోని పెంగ్విన్‌ పెరేడ్‌కు బయలుదేరాం. అక్కడి గైడ్‌ బైనాక్యులర్స్‌ ఇచ్చి పెంగ్విన్లను చూపిస్తూ వాటి జీవనవిధానం, అక్కడ జరుగుతున్న పరిశోధనల గురించీ వివరించారు. తరవాత పసిఫిక్‌ మహా సముద్ర తీరంలోని 12 ఎపాజల్స్‌గా పేరొందిన సున్నపురాళ్ల దగ్గరకు వెళ్లాం. కొన్ని లక్షల సంవత్సరాలనుంచీ సాగర
కెరటాలూ గాలుల తాకిడికి గురయిన పర్వతాలూ సముద్రంలో ముక్కలుగా ఉన్నాయి. వాటిని చూస్తే ఎంతటి బండరాళ్లయినా నీటి తాకిడికి తలవంచాల్సిందే కదా అనిపించింది.

సిడ్నీ నగరంలో..!
సిడ్నీలో ముందుగా నగరానికి ఆయువుపట్టులాంటి జాక్సన్‌హార్బర్‌ చూడ్డానికి వెళ్లాం. ఇక్కడ దేశవిదేశాల ఫుడ్‌ అవుట్‌లెట్స్‌ చాలానే ఉన్నాయి. తరవాత పక్కనే ఉన్న వైల్డ్‌లైఫ్‌ వరల్డ్‌ మ్యూజియంలో ఆస్ట్రేలియాలో కనిపించే జంతువులూ పక్షులతోబాటు వేల సంఖ్యలో ఉన్న సీతాకోకచిలుకల్నీ చూశాం. అటునుంచి అటే సిడ్నీ టవర్‌కు చేరుకున్నాం. 309 మీటర్ల ఎత్తున్న ఈ టవర్‌లోని డబుల్‌ డెక్కర్‌ లిఫ్ట్‌ ఎక్కి పైభాగంలోని అబ్జర్వేషన్‌ ఏరియాకి వెళ్లాం. అక్కడ ఉన్న బైనాక్యులర్స్‌ నుంచి చూస్తే ఆకాశంలోంచి నగరాన్ని చూస్తున్నట్లే అనిపించింది. ఈ టవర్‌ మీద సుమారు లక్షన్నర లీటర్లకు పైగా నీళ్లు పట్టే ట్యాంకు కట్టారట. కాబట్టి ఎంత పెద్ద తుపాను గాలుల్నయినా తట్టుకుని నిలబడుతుందనీ ప్రపంచంలోకెల్లా సురక్షిత భవనమనీ చెబుతారు. తరవాత నేరుగా హార్బర్‌ బ్రిడ్జికి వెళ్లాం. స్టీలుతో నిర్మించిన ఈ వంతెన వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యాకోచిస్తూ సంకోచిస్తుంటుందట. దీని పైకి ఎక్కాలంటే ప్రత్యేక దుస్తులు ధరించి సురక్షిత బెల్ట్‌ సాయంతో ఎక్కాలి. తరవాత నగరానికే ప్రతీకగా చెప్పే ఓపెరా హౌస్‌కి వెళ్లాం. హార్బర్‌ వంతెన, ఓపెరా హౌస్‌ల దగ్గరే కొత్త సంవత్సర వేడుకలు జరుగుతాయి. తరవాత టొరంగ జూ, వైల్డ్‌ లైఫ్‌ సిడ్నీ, బాండీ బీచ్‌... వంటివన్నీ చూసి క్వీన్స్‌ల్యాండ్‌కు బయలుదేరాం. సన్‌షైన్‌ స్టేట్‌గా పిలిచే క్వీన్స్‌ల్యాండ్‌నే డైనోసార్‌ ట్రయల్‌ అంటారు. ఎయిర్‌పోర్టులో దిగి కారులో హ్యూండేన్‌కు చేరుకున్నాం. వెళ్లగానే ముందుగా హ్యూండేన్‌, వింటన్‌, రిచ్‌మండ్‌ అనే మూడు ప్రదేశాల్లో ఉండే డైనోసార్‌ స్టాంపీడ్‌, ఆస్ట్రేలియన్‌ ఏజ్‌ ఆఫ్‌ డైనోసార్స్‌, ఫ్లిండర్స్‌ డిస్కవరీ సెంటర్‌, క్రోనోసారస్‌ కార్నర్‌ అనే నాలుగు ప్రదేశాల్లోని డైనోసార్ల ఆనవాళ్లకు సంబంధించినవన్నీ చూడ్డానికి డైనోపాస్‌ తీసుకున్నాం. ఈ ఒక్క టిక్కెట్టుతోనే అవన్నీ చూడొచ్చు. తొలిగా హ్యూండేన్‌కి 216 కి.మీ. దూరంలోని వింటన్‌ ప్రాంతానికి బయలుదేరాం. దారిలో కార్‌పీల్డ్‌ అనే పురాతన కాలంనాటి జనరల్‌ స్టోర్‌ దగ్గరకు వెళ్లాం. అందులో పూర్వ కాలంలో సరకుల్ని అమ్మే పద్ధతుల్నీ వాటికి సంబంధించిన వస్తువుల్నీ ప్రదర్శిస్తున్నారు. అక్కడి నుంచి మరో రెండు గంటలపాటు ప్రయాణించి క్వీన్స్‌ల్యాండ్‌బరో హైవే మీద ఉన్న వింటన్‌కు చేరుకున్నాం.

డైనోసార్‌ రాజధాని!
వింటన్‌ను ఆస్ట్రేలియా డైనోసార్‌ రాజధాని అంటారు. ఈ ఊరి విస్తీర్ణం 54 వేల చదరపు కి.మీ.కాగా జనాభా 1600 లోపే. ముందుగా వాల్డజింగ్‌ మెటిల్డా సెంటర్‌కు వెళ్లాం. ఇది ఓ టూరిస్టు పార్కు. ఇక్కడ స్థానికుల సంస్కృతీ సంప్రదాయాలూ ఆస్ట్రేలియా జాతీయగీతానికి సంబంధించిన విషయాలన్నీ డిజిటల్‌ టెక్నాలజీ రూపంలో ప్రదర్శిస్తున్నారు. అది చూసి జుందారోడ్డులో లార్క్‌ క్వారీ కన్సర్వేటివ్‌ పార్కులో డైనోసార్‌ స్టాంపీడ్‌ పేరుతో కట్టిన జాతీయ కట్టడం చూడ్డానికి వెళ్లాం. పది కోట్ల సంవత్సరాల క్రితం నేటి క్వీన్స్‌ల్యాండ్‌లోని చాలా ప్రాంతాలు సముద్రంతో నిండి ఉండేవి. కొద్దిభాగంలోనే నేల ఉండేదట. దానిమీద మాత్రమే రాక్షసబల్లులు నివసించేవట. అప్పట్లో గోండ్వానా అనే పెద్ద ఖండంలో ఆస్ట్రేలియా భాగంగానూ అసాధారణ జీవులు సంచరించే ప్రాంతంగానూ ఉండేదట. అయితే ఓసారి రెండు చిన్న కాళ్లతో ఉన్న డైనోసార్లూ కోడిపిల్ల సైజులోని మాంసాహారి సీలురోసార్లూ వీటికన్నా కొంచెం పెద్దవైన ఆర్నితోపాడ్‌ డైనోసార్లూ ఓ చెరువుగట్టున నీళ్లు తాగడానికి గుంపుగా వెళ్లాయట. అప్పుడు ఓ పెద్ద డైనోసార్‌ వాటికి అడ్డుగా రావడంతో భయపడిన చిన్న డైనోసార్లు అటూ ఇటూ పరిగెత్తి, దూరంగా ఉన్న నీటి ప్రవాహం దగ్గరకు చేరుకున్నాయన్న విషయాన్ని అక్కడ దొరికిన 3,300 పైచిలుకు కాలిముద్రల ద్వారా గుర్తించారు. ఆ విషయాన్ని అక్కడ బొమ్మల రూపంలో ప్రదర్శించిన విధానం చూస్తుంటే కాలచక్రం గిర్రున కోట్ల సంవత్సరాలు వెనక్కి తిరిగినట్లే అనిపించింది. అక్కడ సేకరించిన కాలిముద్రల్లో కొన్నింటిని భద్రపరిచి రాతియుగంనాటి జ్ఞాపకాల్ని మన కళ్లముందు ఉంచారు.

 

పురాతన చెట్లు!
ఆపై ఆస్ట్రేలియన్‌ ఏజ్‌ ఆఫ్‌ డైనోసార్స్‌ మ్యూజియానికి వెళ్లాం. ఇక్కడ డైనోసార్‌ శిలాజాలు చాలానే ఉన్నాయి. వాటిని సేకరించి, తయారుచేసే ప్రయోగశాల ఉంది. ల్యాబొరేటరీ టూర్‌లో భాగంగా నిజమైన డైనోసార్‌ శిలాజాల్ని తాకడం వింతైన అనుభూతిని కలిగించింది. 450 కోట్ల సంవత్సరాల క్రితం ఆకాశం నుంచి రాలిపడ్డ మెటియొరైట్‌ కూడా ఉందక్కడ. తరవాత క్రెటీషియస్‌ ఉద్యానవనంలో 700 ఏళ్లనాటి సైకస్‌ చెట్లను చూశాం. రాక్షసబల్లుల కాలంలో ఎక్కువగా ఉండే ఈ చెట్లనే జామియా పామ్స్‌ అంటారు. తరవాత వింటన్‌లోనే ఉన్న ఆర్నోస్‌ గోడ చూడ్డానికి వెళ్లాం. దీన్ని టైపురైటరూ పడవ భాగాలూ మోటారు బైకు భాగాలూ వంటి వాటితో కట్టారు. తరవాత మ్యూజికల్‌ ఫెన్స్‌ దగ్గరకు వెళ్లాం. ప్రపంచంలోనే మొదటి సంగీత కంచె ఇది. ఇనుప పరికరాలతోనూ కర్రలతోనూ కట్టిన దీన్ని శృతితో వాయించవచ్చు. అక్కడే ఉన్న డైమంటిన హెరిటేజ్‌ ట్రక్‌ అండ్‌ మెషినరీ మ్యూజియంలో పాత ట్రక్కులూ పొగ ఇంజిన్లూ కార్లూ చూశాం.

హారన్‌ మోగించరు!
తరవాత టౌన్స్విల్లేకు 376 కి.మీ దూరంలోని హ్యూండేన్‌కు బయలుదేరాం. కారులో ప్రయాణిస్తుంటే ప్రకృతిలో విహరించినట్లే అనిపించింది. పోలీసులూ ట్రాఫిక్‌ సిగ్నల్సూ లేకున్నా కార్లు హారన్‌ మోగించకుండా వెళ్లడం చూస్తే ముచ్చటేసింది. నగరాల్లో కూడా హారన్‌ మోగించరట. ఇక్కడి ఫ్లిండర్స్‌ డిస్కవరీ సెంటర్‌లో అతిపెద్ద ముటాబురాసారస్‌ అస్థిపంజరం ఉంది. ఇది ఈ ప్రాంతంలో సంచరించేదట. నీటిపాములూ ఆల్చిప్పలూ గవ్వలూ చేపలూ... ఇలా చాలా రకాలు ఉన్నాయక్కడ. ఇక్కడే స్థానికంగా దొరికే ఓపల్‌ రత్నాలనూ ప్రదర్శిస్తుంటారు. ముందుగా దరఖాస్తు చేసుకుంటే మనం సిబ్బంది సాయంతో శిలాజాలనూ రత్నాలనూ వెతకొచ్చు. తరవాత ప్రపంచంలోనే రెండో పురాతన గాలిమరగా పేరొందిన ఫెడరేషన్‌ రోటుండ చూడ్డానికి వెళ్లాం. ఈ మరతో నేటికీ నీటిని తోడటం చూసి ఆశ్చర్యపోయాం. ఫ్లిండర్స్‌ నది పక్కగా ఏర్పాటుచేసిన ఎకో వాక్‌లో భాగంగా రకరకాల పూలమొక్కల్నీ శిల్పాల్నీ చూశాక గోర్జి నేషనల్‌ పార్కుకి బయలుదేరాం. ఈ దారిలో ఎన్నో ఆవులూ అడవి జంతువులూ కంగారూలూ కనిపించాయి. ఈ ప్రాంతాన్ని లిటిల్‌ గ్రాండ్‌ కేన్యన్‌గా పిలుస్తారు. ఇక్కడ మూడు రకాల తెగల స్థానికులు జీవిస్తున్నారట. ఇక్కడే కురవోంగాలూ చిలుకలూ నల్లబాతులూ వలాబీలూ... ఇలా రకరకాల పక్షులు నివసిస్తుంటాయి. చివరగా రిచ్‌మండ్‌లోని నీటి శిలాజాల మ్యూజియంలో పదికోట్లనాటి క్రోనోసారస్‌ కార్నర్‌ అనే నీటి డైనోసార్‌ శిలాజాలు చూశాం. భవిష్యత్తులోకి చూసే సిడ్నీ వంటి నగరాలనీ కోట్ల సంవత్సరాలనాటి జీవుల్నీ కళ్లకు కట్టిన ఆస్ట్రేలియా పర్యటన ఇచ్చిన సంతృప్తితో వెనుతిరిగాం.

 

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.