close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఓడిపోకు నేస్తం 

- యం.డి.సలీమున్నీసా

‘‘నిన్న సాయంత్రం రాఘవన్నయ్య వాళ్ళింటికి వెళ్ళివచ్చినప్పటి నుంచీ మీరు అదోలా ఉన్నారు ఎందుకండీ... అన్నయ్య ఆరోగ్యం బాగోలేదా ఏం?’’ పరధ్యానంగా ఉన్న భర్తను అడిగింది శారద. 
‘‘అలాంటిదేమీ లేదు శారదా’’ ముక్తసరిగా సమాధానమిచ్చాడు సత్యమూర్తి. 
సత్యమూర్తి, రాఘవరావులిద్దరూ గవర్నమెంట్‌ టీచర్లుగా పనిచేసి రిటైరయ్యారు. ఉద్యోగ నిమిత్తం పరిచయమైన స్నేహం ఎంతలా బలపడిందంటే పదవీ విరమణ చేసేనాటికి ఇద్దరూ ఒకర్నొకరు తమ ఇంట్లోని మనుషులకన్నా ఎక్కువగా గౌరవించుకునేవాళ్ళు. వీళ్ళిద్దరి స్నేహం గురించి ఇటు సత్యమూర్తి భార్య శారదకూ, అటు రాఘవరావు భార్య సంధ్యకూ బాగా అవగాహన ఉండటంతో వాళ్ళిద్దరు సైతం మంచి స్నేహితులైపోయారు. ఇద్దరి ఇళ్ళూ కొంచెం దగ్గరలోనే ఉండటంతో రిటైరైన తరవాత కూడా ఒకరింటికి ఒకరు వెళ్ళి కుటుంబ యోగక్షేమాలూ సాధకబాధకాలూ చర్చించుకునేవాళ్ళు. 
అలా ఓరోజు సాయంత్రం తన ప్రాణమిత్రుడు రాఘవరావు వాళ్ళింటికి వెళ్ళివచ్చినప్పటి నుంచీ ఏదో ఆలోచనలో మునిగిపోయిన భర్తను గమనించి కంగారుపడింది శారద. అదే విషయాన్ని మరోసారి అడిగిన శారదతో ‘‘ఏంలేదు శారదా, రాఘవ తన ఆస్తిని విజయ్‌ పేరు మీద రాసేయబోతున్నాడట. నిన్న ఆ విషయం చెప్పినప్పటి నుంచీ చాలా బాధగా భయంగా ఉంది’’ మెల్లగా అసలు విషయం చెప్పాడు. 
‘‘రాస్తున్నది కొడుకు పేరు మీదేగా! దానికి ఏదో మీ ఫ్రెండ్‌ ఆస్తంతా పరాయివారికి రాసిచ్చేస్తున్నట్లు మీరు అంతలా ఫీలైపోతున్నారేంటి?’’ 
‘‘కొడుకు పరాయివాడు కాకున్నా కోడలు పరాయిపిల్లే కదా శారదా! మనం మన ఇంటిని కొడుకు పేరుమీదే కదా రాసింది. ఇల్లు తన భర్త పేరు మీదకు వచ్చేసినప్పటి నుంచీ మన కోడలి ప్రవర్తన ఎలా మారిపోయిందో, మనల్ని ఎంత హీనంగా చూస్తోందో నువ్వు రోజూ చూస్తూనే ఉన్నావు కదా. రాఘవకు కూడా ఆ పరిస్థితి ఎక్కడ వస్తుందోనని నా భయం.’’

 

సత్యమూర్తి మాటలు అప్పుడే అటుగా వచ్చిన కోడలు లహరి చెవిలోపడటం, ఆమె ఒక చూపు కోపంగా మామగారి వైపు చూసి గదిలోకెళ్ళిపోవటం చూసి కంగారుపడిపోయింది శారద. 
‘‘ఏదో మనకు ఇలా అయిందని అందరికీ అలానే జరుగుతుందేమిటి? మీరిలా మాట్లాడటం కోడలు వినేసిందని భయంగా ఉందండీ.’’ 
భయపడుతున్న భార్యతో ‘‘భయం ఎందుకు శారదా, నేనేమైనా లేనిది చెప్పానా? సరేలే, ముందు భోజనం వడ్డించు, బాగా ఆకలేస్తోంది’’ పీటమీద కూర్చుంటూ చెప్పాడు. 
భార్య వడ్డించిన భోజనంలో కూర చూసి ‘‘రాత్రి కూర మిగిలి ఉంటే తేకూడదూ’’ మెల్లగా అన్నాడు. 
‘‘అమ్మా లహరీ, రాత్రి చేసిన మాంసం కూర ఏమైనా ఉందా ఫ్రిజ్‌లో?’’ వంటింట్లో ఉన్న కోడలి దగ్గరికి వచ్చి అడిగింది శారద. 
‘‘ఎందుకుండదూ, మనం నవాబులం కదా, మాంసం కూరకు లోటేముంది.’’ 
వెటకారంగా అంటున్న కోడలి మాటలకు నొచ్చుకుంటూ ‘‘మధ్యలో వాళ్ళెందుకులే తల్లీ, ఏదో మీ మామగారికి ఆ బీట్‌రూట్‌ కూర రుచించక నిన్నటి మాంసం కూర ఏమైనా మిగిలి ఉందేమో అడగమంటే అడిగాను. లేకపోతే పోనీలేమ్మా’’ అంది. 
‘‘ముక్కలేనిదే ముద్ద దిగదంటా ఏంటి ముసలాయనకు’’ ఇందాక చెవినబడ్డ మామగారి మాటలను గుర్తుకు తెచ్చుకుంటూ కోపమంతా కక్కింది అత్తగారి ముందు. 
అప్పటివరకూ తన తల్లికీ నానమ్మకూ మధ్య జరిగిన సంభాషణ వింటున్న ఇంటర్‌ చదువుతున్న లహరి కూతురు హిమాలయ ‘‘అమ్మా, తాతయ్యకు బీట్‌రూట్‌ కూరంటే ఇష్టం ఉండదు కదా... మళ్ళీ ఎందుకు ఆయనకు అదే కూర వేశావ్‌? నానమ్మా నువ్వేం వర్రీకాకు. డాడీ రాగానే మాంసం తెప్పించి నేనే వండుతాగా ‘మటన్‌ కోఫ్తా కర్రీ’, భలే ఉంటుందనుకో’’ ఉత్సాహంగా అంటున్న కూతురితో- 
‘‘ఎందుకు తెప్పించవూ, మీ నాన్న ఏ మహారాజుకు మనవడిగానో, ఏ జమీందారుకు కొడుకుగానో పుట్టలా - మిమ్మల్నందరినీ ముప్పొద్దులా మాంసం కూరతో మేపడానికి’’ విసురుగా అనేసి వెళుతున్న తల్లివైపు నిశ్చేష్టురాలై చూస్తూండిపోయింది హిమాలయ. 
‘‘ఏం శారదా, కూర లేదా’’ భర్త కేకకు ‘‘వస్తున్నా’’ అంటూ పరుగున అక్కడి నుంచి కదిలింది శారద, కోడలి విసుర్లకు వచ్చిన కన్నీళ్ళు తుడుచుకుంటూ. 
‘‘ఏంటీ అలా ఉన్నావ్‌, కోడలేమైనా అందా?’’ తన ముఖాన్ని చూస్తూ అడుగుతున్న సత్యమూర్తితో- 
‘‘అబ్బే అదేం లేదండీ, కూర లేదంట’’ అంది. 
‘‘లేకుంటే పోనీలే శారదా, నువ్వేం బాధపడకు. నేను ఎలాగోలా తినేస్తాను, అలవాటేగా’’ భర్త మాటలకు ఉబికివస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అక్కడి నుంచి పెరట్లోకి వెళ్ళిపోయింది. 
పెరట్లో చల్లనిగాలి ఆమె శరీరాన్ని తాకుతున్నా, కోడలి మాటలను తల్చుకుంటుంటే మనసు మాత్రం భగ్గుమంటూ ఉంది. ‘నీ భర్త జమీందారు కొడుకు కాకపోయినా, ఓ బికారి కొడుకు మాత్రం కాదు. నీ భర్త ఓ మంచి ఉద్యోగంలో ఉండి, నిన్నింతమాత్రం సుఖపెడ్తున్నాడూ, నీకు ఏ లోటూ రాకుండా చూసుకుంటున్నాడూ అంటే అది నీ మామగారి చలవే. నువ్వుంటున్న ఇల్లు సైతం నీ మామగారి రెక్కల కష్టం. రాత్రింబవళ్ళూ ఆయన పడిన కష్టానికి 
ఫలితం మీరనుభవిస్తున్న సుఖం’ అని అనాలని నోటి వరకూ వచ్చిందిగానీ మాటకు మాటిస్తే తన కోడలి సాధింపులు ఎక్కువవుతాయని భయపడి ఊరుకుంది. ‘తమని ఈరోజు లహరి ఎంత మాటన్నది. తామేమన్నా వాళ్ళ అమ్మగారింటి నుంచి తెచ్చిన సొమ్ము తింటున్నారా. నెలనెలా పెన్షన్‌ రాగానే కొడుకు చేతిలో పెడ్తున్నారే. ఆయనకు వచ్చే పెన్షన్‌ డబ్బులు తీసుకుంటూ కూడా తామేదో ఊరికే తింటున్నట్లు నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది’ అనుకుంటుంటే కళ్ళనిండా నీటిపొర కమ్మేసింది శారదకు. ఒక్కగానొక్క కొడుకు కావడంతో వినోద్‌ను అల్లారుముద్దుగా పెంచారు శారదా, సత్యమూర్తి. చదువు పూర్తికావటం, 
బ్యాంకులో ఉద్యోగం రావటంతోటే తమ స్థాయికి తగిన సంబంధం చూసి కొడుకు పెళ్ళి జరిపించేశారు. 
కోడలు లహరి పెళ్ళైన కొత్తలో అత్తామామల్ని బాగానే గౌరవించేది. పనిచేయబోతున్న శారదను ‘అత్తయ్యగారూ, మీరెందుకండీ చెయ్యటం, నేను చేస్తాను కదా’ అంటూ సున్నితంగా వారించేది. ‘మామయ్యగారూ, మీకేం కావాలి’ అంటూ సత్యమూర్తికి కావాల్సినవి అమర్చిపెట్టేది. కొన్నాళ్ళు బాగానే ఉన్నా, తరవాత తరవాత తనలో ఎంతో మార్పు వచ్చింది. 

 

సత్యమూర్తి పదవీ విరమణ చేసిన తరవాత వచ్చిన డబ్బుతో ఇల్లు కట్టించి కొడుకు పేరు మీద రాయబోతుంటే శారద భర్తతో ‘ఏమండీ, ఇల్లు వినోద్‌ పేరు మీద రాస్తున్నారా- మీ పేరు మీద ఉంచుకోరా?’ అని అడగటం, దానికి సత్యమూర్తి ‘ఎందుకు శారదా, మనకున్నది వాడొక్కడేగా. మన తర్వాత ఎలాగూ తనకేగా ఈ ఇల్లు. అంతమాత్రానికి ఇప్పుడు నా పేరు మీద రాయటం, నేను పోయాక వాడిపేరు మీద మార్చటం ఎందుకూ... రిజిస్ట్రేషన్‌ ఖర్చులు దండగ. ఒకేసారి వాడి పేరుమీద రాసేస్తే పోలా’ అంటూ తన మాటను తీసిపారేసి కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించటం చకచకా జరిగిపోయాయి. 
కానీ, ఆరోజు భర్తతో తను అన్న ఆ మాటలే తన జీవితానికి గ్రహపాటుగా మారతాయని మరుసటిరోజుగానీ తెలియలేదు. 
ఆ రోజు ఉదయం నుంచీ తను మాట్లాడితేనే చిటపటలాడుతోంది లహరి. ‘ఏంటమ్మా లహరీ, కోపంగా ఉన్నావ్‌?’ 
అని అడుగుదామా వద్దా అని సందేహిస్తూనే అడిగింది. ‘అవునండీ అత్తయ్యగారూ, నాకు కోపమే. మీకు భయంలాగే నాకు కోపమెక్కువే’ విసురుగా అంటున్న కోడలి మాటలు అర్థంకాక ‘నాకు భయమేంటీ?’ అయోమయంగా అడిగింది. 
‘భయంతోటే కదా, మీ కొడుకు పేరుమీద ఇల్లు రాయటం మీకు ఇష్టం లేకుండాపోయింది. ఏదో మామయ్యగారు ఒప్పుకోలేదు కాబట్టి సరిపోయింది కానీ, మీరైతే మీ కొడుకు పేరుమీద రాయనిచ్చేవారా?’ అంది లహరి. నివ్వెరపోతున్న శారదతో ‘ఏంటీ అలా చూస్తున్నారు... మీ మాటల్ని వినేశాననేగా! వినబట్టే కదా కొడుకు మీద తమరికి ఉన్న ప్రేమ తెలిసివచ్చింది.’ 
కోడలి విసురుకి ‘నా మాటల్ని నువ్వు అపార్థం చేసుకున్నావ్‌ లహరీ. నేనేదో మాట వరసకు అన్నాను కానీ, నా కొడుకు మీద నాకు నమ్మకం, ప్రేమా లేక కాదు’ శారద గొంతు బాధగా ఉంది. 
‘అవునవును... ‘ఏ గాలికా తెర’ అన్నట్లు ఏ సమయానికి ఆ మాటలు మాట్లాడవచ్చు. నాలుక ఎలాగైనా తిరుగుతుంది కదా!’ 
వ్యంగ్యంగా మాట్లాడిన లహరి మాటలకు మనసంతా బాధతో నిండిపోయింది శారదకు. కన్నతల్లినై ఉండి వినోద్‌కు తనేదో అన్యాయం చేయబోయినట్లు ఫీలైపోతుందే తప్ప, ఎంత మొత్తుకున్నా తన మాటల్ని వినిపించుకోవటం లేదు లహరి. కళ్ళనీళ్ళ పర్యంతమవుతున్న భార్యను చూసి సత్యమూర్తి ‘‘అరె పిచ్చిమొద్దూ, ఎందుకు అలా బాధపడుతున్నావ్‌. ఎంతైనా కోడలు కదా... అత్తగారిని ‘కూరలో కరివేపాకు’లా తీసిపారేయటానికి తనకు ఒక సాకు దొరికింది. నీకు ‘తోడేలు-మేకపిల్ల’ కథ గుర్తు లేదా? మేకపిల్లను ఎలాగైనా చంపి, దాన్ని హాయిగా తినాలని ముందే డిసైడ్‌ చేసుకున్న తోడేలు... దాన్ని చంపడానికి సాకులు వెదికినట్లు, మనల్ని దూరంగా ఉంచడానికి నిర్ణయించుకుని ఉన్న నీ కోడలికి సాకు దొరికింది. అంతే ఇంకేం లేదు. నువ్వేం బాధపడకు, నేనున్నాగా’’ ప్రేమగా ఓదార్చాడు. భర్త మాటలు ఎంతమాత్రం సత్యదూరం కావని తొందర్లోనే అర్థమైంది శారదకు. 
మొదట్లో తనపైనే ఉన్న విసుర్లు రానురాను సత్యమూర్తికి కూడా మొదలయ్యాయి. సహించలేక తను వినోద్‌కు చెప్పడం, వాడు లహరిని మందలించడంతో, వినోద్‌ ఇంట్లోలేని సమయంలో తమ మీద సాధింపులు మరింత పెంచింది లహరి. ‘ఇల్లు ఎలాగూ తన చేతికి వచ్చేసింది, ఇక వీరితో ఏం అవసరం, వీళ్ళను ఎలా వదిలించుకోవాలి’ అన్నట్లుగానే ఉంటోంది తన ప్రవర్తన. 
ముందుముందు ఇంకా ఎలా ఉంటుందో... కోడలి గురించి ఆలోచిస్తున్న శారద ‘‘శారదా, నేను రాఘవ వాళ్ళింటికి వెళ్తున్నాను, తలుపేసుకో’’ అన్న భర్త మాటలకు తేరుకుని ‘‘అలాగే కానీ, మీరేం అన్నయ్యగారిని భయపెట్టేయకండి. మనకిలా అయిందని అందరికీ అలాగే జరుగుతుందని లేదు కదా’’ మరోసారి అదే మాటను భర్తకు చెప్పి తలుపేసుకుంది. 
అదేమాట రాఘవ కూడా అంటాడు... ‘నీ కోడలలా ఉందని నా కోడలు కూడా అలాగే ప్రవర్తిస్తుందనేమిటీ’ అని. భార్య మాటలూ స్నేహితుడి మాటలూ పోల్చుకుంటూ మిత్రుడింటికి బయల్దేరాడు సత్యమూర్తి. క్రితంరోజు రాఘవతో తనకు జరిగిన సంభాషణ అతని కళ్ళముందు మెదిలింది.

* * * * * * * * * *

‘‘సత్యా, ఇంటిని తన పేరుమీద రాయమంటున్నాడ్రా నా సుపుత్రుడు.’’ 
మిత్రుని మాటకు పక్కన బాంబు పడ్డట్టుగా ఉలిక్కిపడి ‘‘ఏం, ఎందుకట... 
నీ పేరు మీద ఉంటే నిద్ర రావటంలేదంటా ఏంటి నీ కొడుక్కి’’ కోపంగా అన్నాడు సత్యమూర్తి. 
‘‘అసలు ఈ ఇంటిని అమ్మేసి వేరే దగ్గర కొత్త ఇల్లు కొనుక్కుందామన్నాడు. అమ్మడానికి నేనొప్పుకోలేదు. కనీసం తన పేరు మీదైనా రాసివ్వమన్నాడు’’ చెప్పాడు రాఘవ. 
‘‘అమ్మేసి వేరే దగ్గర కొనుక్కుంటే నువ్వు కట్టించిన ఇల్లు అని కాకుండా, నీ నామరూపాలు లేకుండా బాగుంటుంది కదా... మంచి ప్లానే. ఇంతకీ నువ్వేం డిసైడ్‌ చేసుకున్నావ్‌?’’ 
‘‘డిసైడ్‌ చేసుకోవడానికి ఏముంది సత్యా... ఆడపిల్లలకు ఇవ్వాల్సింది ఎప్పుడో ఇచ్చేసి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసేశాను. ఇక వాడి కోసమే కదా... ఈ ఇల్లు కట్టించింది. వాడు కోరుకున్నట్లే రాసిచ్చేద్దాం అనుకుంటున్నాను. వాడి పేరుమీద రాయక ఏం చేసుకుంటాను?’’ 
‘‘రాసిచ్చాక రేపు నీ కొడుకూ కోడలూ మిమ్మల్ని బాగా చూడకపోతే అప్పుడేం చేస్తావ్‌... కూతుళ్ళ దగ్గరకు వెళ్ళి ఉంటావా?’’ 
‘‘అంటే, మన దగ్గర ఆస్తి ఉంటేనే పిల్లలు మనల్ని బాగా చూస్తారనా నీ ఉద్దేశం’’ సూటిగా అడిగాడు రాఘవ. 
‘‘అలా అని కాదు, మన రేయింబవళ్ళ కష్టార్జితాన్నీ మన జీవితం ఉన్నంతవరకూ మన అధీనంలో ఉంచుకోకుండా వాళ్ళ సొత్తుగా ఇప్పుడే ఎందుకు అప్పగించాలీ అంటున్నాను.’’ 
‘‘ఎవరి సొత్తుగా? ఎవరి పేరుమీద ఉన్నా పోయేదేముంది? పిల్లల కోసమేగా మనం సంపాదించేది. అందరం కలిసేకదా ఉండేది. నా బిడ్డ మీద నాకు నమ్మకముంది. వాడు ఆనందంగా ఉంటే చాలు.’’ 
‘‘నమ్మకం వేరు, అనుభవం వేరు రాఘవా. నేనూ నమ్మకంతోటే నీ చెల్లెలు వారిస్తున్నా వినకుండా నా కష్టార్జితాన్ని నా కొడుకు పేరుమీద ఉంచాను. కానీ, ఇప్పుడు ఆ ఇంట్లోనే మమ్మల్ని ‘ఇష్టం ఉంటే ఉండండి, లేదంటే వెళ్ళండి’ అంటున్నారు. ‘ఇది మా ఇల్లు. ఇష్టం లేకుంటే వెళ్ళాల్సింది మీరు’ 
అని నేనంటే, దానికి నా కోడలు ఏం సమాధానమిచ్చిందో తెలుసా... ‘ఈ ఇల్లు నా భర్తదని కాగితాలు చూపిస్తున్నాయి. 
ఆ కాగితాలు నా దగ్గర ఉన్నాయి’ అంది. ఇప్పుడేమంటావ్‌... కోర్టుకెళ్ళమంటావా?’’ 
‘‘అందరూ అలాగే ఉంటారని ఏముంది సత్యా?’’ 
‘‘ఒప్పుకుంటాను రాఘవా. కానీ ‘కీడెంచి మేలెంచమన్నారు’ మన పెద్దలు. ఇంట్లో అందరూ కలసి ఉండలేని అలాంటి పరిస్థితులే వస్తే బయటకెళ్ళి విడిగా జీవించడానికి మనకు ‘పెన్షన్‌’ అనే ఒక ఆధారమైనా ఉంది. అది కూడా లేనివాళ్ళు తమ రెక్కల కష్టం అంతా పిల్లలకు అప్పగించి వాళ్ళ చేతిలో దగాపడితే ఏ అనాథాశ్రమాలో లేదా అడుక్కుతినటమే కదా గతి. ఆస్తి కాస్తా పిల్లలు లాగేసుకుని, పట్టించుకోకుండా వదిలేస్తే, చివరి రోజుల్లో రోడ్లమీద అడుక్కుతింటున్న ఎంతమంది గురించి మనం పేపర్లలో చదవటం లేదూ. అందరూ ఉండి కూడా నిస్సహాయులుగా ఎంతమంది అనాథాశ్రమాల్లో చేరటం మనం చూడటం లేదూ! పిల్లలందరూ చెడ్డవారని నేననటం లేదు. అమ్మానాన్నలు ఏ ఆస్తులూ ఇవ్వలేకపోయినా వాళ్ళ స్వశక్తితో పైకెదిగి జన్మనిచ్చిన వారిని అపురూపంగా చూసుకుంటున్న ఆణిముత్యాలు ఎందరో ఉన్నారు. ముక్కూ మొహం తెలీని ఏ పరాయి ఇంటి నుంచో వచ్చి తమ అత్తామామల్ని కన్నకూతుళ్ళకంటే మిన్నగా చూసుకునే కోడళ్ళూ ఉన్నారు. కానీ, 
ఎవరి రాత ఎలా ఉందో చివరి వరకూ తెలీదు కదా’’ చెప్పటం ఆపి, తనవైపు చూసిన సత్యమూర్తితో- 
‘‘మరి నన్నేం చేయమంటావ్‌? ఇంటిని ఏ అనాథాశ్రమానికైనా రాసి మమ్మల్ని అందులో చేరిపొమ్మంటావా’’ ఆలోచిస్తూ అడిగాడు. 
‘‘అలా ఎందుకనుకుంటున్నావ్‌, నీకు ముగ్గురు బిడ్డలున్నారు. మీ ఇద్దరి కంఠంలో ప్రాణం ఉన్నంతవరకూ మిమ్మల్ని ఎవరు ప్రేమగా చూసుకుంటారో, వారికి ఆ ఇల్లు చెందేటట్లు వీలునామా రాయి. అది కూతురైనా కావచ్చు, కోడలైనా కావచ్చు. అంతలా ఎవరూ ఆదరించనినాడు నువ్వన్న విషయం గురించి ఆలోచించవచ్చు. బిడ్డలు తమ బాధ్యతను సక్రమంగా నెరవేరిస్తే వారి హక్కును కాలదన్నాల్సిన అవసరం మనకేముంది? 
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే- జీవితంలో మనం ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుని, ఎన్నో సమస్యల్ని తట్టుకుని ధైర్యంగా నిలబడ్డాం. కానీ జీవిత చరమాంకానికి వచ్చేసరికి బిడ్డల చేతిలో దగాపడి, ఓడిపోయినట్లుగా నిస్సహాయులుగా నిలబడటం ఎంతవరకూ సమంజసం? మరోసారి ఆలోచించు. ‘నాలాగా నువ్వూ ఓడిపోకు నేస్తం’ అంటున్నాను అంతే. తరవాత నీ ఇష్టం’’ అని అక్కడినుంచి లేచి వచ్చేశాడు సత్యమూర్తి.

 * * * * * * * * *

రాఘవ ఇల్లు వచ్చేయడంతో ఆలోచనల నుంచి బయటికొచ్చాడు. 
‘‘రా సత్యా, నేనే నీ దగ్గరికి బయల్దేరదాం అనుకుంటున్నాను. ఇంతలో నువ్వే వచ్చావు. నీతో చెప్పుకుంటే నా గుండెబరువు కొంచెం తగ్గుతుంది.’’ ‘‘సంధ్యా, మీ మూర్తన్నయ్యకు కాఫీ తీసుకురా’’ భార్యను పిలిచాడు. 
‘‘ఏంటీ సంగతి?’’ కంగారుపడిపోయాడు సత్యమూర్తి. 
‘‘ఏం లేదు, అంత కంగారుపడాల్సిన అవసరం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే... నా కొడుకూ కోడలూ వాళ్ళ సామాను తీసుకుని ఇంట్లోనుంచి వేరుగా వెళ్ళిపోతున్నారోయ్‌.’’ 
‘‘ఏంటి రాఘవా నువ్వనేది.’’ 
‘‘అవును సత్యా, మేం బతికున్నంత వరకూ ఇల్లు మా పేరుమీదే ఉంటుంది. నేనూ మీ అమ్మా పోయిన తర్వాతే నీదయ్యేది- అని నా కొడుకుతో అన్నాను. అంతే, నా కొడుకూ కోడలూ కోపంతో మండిపడ్డారు. ‘మామీద అంత నమ్మకం లేనప్పుడు మేం ఇక్కడెందుకుంటాం’ అంటూ ఇల్లు ఖాళీ చేస్తున్నారు. హాయిగా వెళ్ళి ఆనందంగా జీవించండి- ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మా దగ్గరికి రండి అన్నాను.’’ 
నవ్వుతూనే అన్నా, కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగాయి రాఘవకు. 
‘‘ఏంట్రా రాఘవా ఇలా అయ్యింది. మనం స్కూల్లో ఎంతమంది పిల్లలకు ‘మాతృదేవోభవ’, ‘పితృదేవోభవ’, ‘ఆచార్యదేవోభవ’ అని బోధించాం. మరి, మన పిల్లలేంటి ఇలా...’’ బాధతో మాట పూర్తిచేయలేకపోయాడు. 
‘‘పోనీలేరా సత్యా, నువ్వేం బాధపడకు. ఎలా రాసిపెట్టి ఉంటే అలాగేగా జరిగేది. అయినా మనం పిల్లలు పుట్టినప్పటి నుంచీ వీళ్ళు పెద్దవాళ్ళయి మనల్ని సరిగ్గా చూస్తారో లేదో, ఎందుకు శ్రమపడి పెంచడం అని వదిలెయ్యం కదా. మనల్ని చూస్తారన్న నమ్మకం ఉన్నా లేకపోయినా, చూసినా చూడకపోయినా మన బాధ్యతల్ని ఆనందంగా పూర్తిచేసి వారికోసం మన జీవితం అంతా ధారపోస్తాం. మరి పిల్లలెందుకో వృద్ధాప్యంలో అమ్మా 
నాన్నలను జాగ్రత్తగా చూసుకోవాలనే తమ బాధ్యతను మరచిపోయి వాళ్ళకు దూరంగా జరిగిపోతారు. నా కొడుకే చూడు... 
మేం పోయిన తరవాత ఎలాగూ వాడిదే కదా ఈ ఇల్లు. దానికోసం అంత తొందరేంటో నాకర్థం కావట్లేదు. అయినా ఏదో ఒకరోజు వాడి తప్పు తెలుసుకుని తిరిగి నా దగ్గరకు వస్తాడన్న నమ్మకం నాకుంది’’ నిట్టూర్చాడు రాఘవ. 
‘భగవంతుడా, నా మిత్రుడి నమ్మకాన్ని వమ్ము కానీకు. నా నేస్తాన్ని ఓడిపోనీకు’ మనసులోనే ప్రార్థించాడు సత్యమూర్తి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.