close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అభిమానమే ఓ బ్రాండ్‌

ఆ పేర్లు చెప్పగానే మైదానాలు చప్పట్లతో మార్మోగిపోతాయి. సినిమా థియేటర్లు ఈలలతో హోరెత్తుతాయి.
ఆ అభిమానాన్ని ఇప్పుడు మైదానాలూ, థియేటర్లు దాటి ఫ్యాషన్‌ విభాగంలోకీ విస్తరిస్తున్నారు చాలామంది సెలెబ్రిటీలు. అదెలానో మీరే చూడండి.
ప్రస్తుతం దేశంలో అతిపెద్ద బ్రాండ్‌ విలువ ఉన్న ఆటగాడు ఎవరంటే, తడుముకోకుండా వచ్చే పేరు... విరాట్‌ కోహ్లి. అతడి బ్రాండ్‌ విలువ రూ.150కోట్లకు పైనే. ఎం.ఆర్‌.ఎఫ్‌, బూస్ట్‌, ఉబర్‌ ఇలా చాలా బ్రాండ్‌లకు ప్రచారకర్తగా ఉన్నాడు విరాట్‌. అంతేకాదు, తనే ఓ బ్రాండ్‌ని కూడా తెచ్చాడు. కోహ్లి జెర్సీ నంబరు 18. అదే పేరుతో ప్యూమా సంస్థతో కలిసి ‘వన్‌ 8’ బ్రాండ్‌ని గతేడాది తీసుకొచ్చాడు. ఈ బ్రాండ్‌ పేరుతో స్పోర్ట్స్‌ వేర్‌, క్యాజువల్స్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. ‘ఎక్కువగా స్పోర్ట్స్‌ దుస్తుల్లో ఉండటానికే ఇష్టపడతాను. వీటిలోనూ ఫ్యాషన్‌ ఉండాలనేది నా అభిలాష. అందుకే ‘వన్‌ 8’ బ్రాండ్‌ తెచ్చాను’ అంటాడు విరాట్‌. మరో దుస్తుల తయారీ బ్రాండ్‌ ‘రాన్‌’కీ కోహ్లి బ్రాండ్‌ అంబాసిడర్‌.

ధోనీ సెవెన్‌...
ధోనీ అనగానే జెర్సీ నంబర్‌ సెవెన్‌ గుర్తొస్తుంది చాలామందికి. అందుకేనేమో ‘సెవెన్‌’ పేరుతోనే బ్రాండ్‌ని ప్రారంభించాడు. ఈ బ్రాండ్‌లో స్పోర్ట్స్‌వేర్‌, క్యాజువల్‌వేర్‌ని మార్కెట్‌ చేస్తున్నాడు. ఈ బ్రాండ్‌ దుస్తుల్లో షూస్‌, టీషర్టులూ, ట్రాక్‌ప్యాంట్స్‌, జాకెట్స్‌ ఉంటాయి. అంతేకాదు, ధోనీ కెప్టెన్‌గా ఉన్న చెన్నై సూపర్‌ కింగ్‌్్స అభిమానుల కోసం ప్రత్యేకంగా కొన్ని ఉత్పత్తుల్ని తెచ్చాడు. ‘రితి’ గ్రూప్‌ ఈ ఉత్పత్తుల్ని మార్కెట్‌ చేస్తోంది. బ్రాండ్‌కి కేవలం ప్రచారకర్తగా ఉండటమే కాదు, డిజైనింగ్‌ అంశాల్లోనూ సలహాలు ఇస్తుంటాడట ధోనీ. ‘ఫిట్‌నెస్‌ అంటే కేవలం క్రీడాకారులకే కాదు, అందరికీ ఉండాలి. అందుకే ప్రధానంగా ఫిట్‌నెస్‌కి సంబంధించిన ఉత్పత్తుల్ని తెస్తున్నాం’ అంటాడు ధోనీ.

దీపికా... ఆల్‌ అబౌట్‌ యు
మరో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకునే కూడా ఓ ప్రత్యేక బ్రాండ్‌తో ఫ్యాషన్‌ రంగంలో తనదైన ముద్రవేస్తోంది. ఫ్రెంచ్‌ కంపెనీ కార్లిన్‌తో కలిసి ‘ఆల్‌ అబౌట్‌ యు’ బ్రాండ్‌ దుస్తుల్ని తెచ్చింది దీపికా. 18-35 మధ్య వయసు మహిళలకోసం ఈ  బ్రాండ్‌ తెచ్చినట్టు చెబుతుందామె. ఈ బ్రాండ్‌ దుస్తుల్లో సంప్రదాయ, పాశ్చాత్య రకాలు ఉంటాయి. ‘మన వ్యక్తిత్వానికి అద్దంపట్టే దుస్తుల్లో స్టైల్‌తోపాటు కంఫర్ట్‌ కూడా ఉండాలి’ అని చెప్పే దీపికా, ఆల్‌ అబౌట్‌ యులో అవి కచ్చితంగా ఉంటాయంటోంది.

విజయ్‌... రౌడీ
విజయ్‌ దేవరకొండ.... నటనలోనే కాదు, ఓ అపెరల్‌ బ్రాండ్‌ని తేవడంలోనూ ట్రెండ్‌ సెటర్‌. తన అభిమానులకు ఒక బ్రాండ్‌ను తెచ్చిన మొదటి తెలుగు హీరో. అతడు తెచ్చిన బ్రాండ్‌ పేరు ‘రౌడీ’  ‘తన లక్ష్యం కోసం ఎలాంటి అడ్డంకుల్ని అయినా ఛేదించుకునివెళ్లేవాడే ఈ రౌడీ’ అని పేరు వెనక అర్థాన్నీ చెప్పాడు. ఈ బ్రాండ్‌ దుస్తులు ‘రౌడీ’ ఆప్‌లో మాత్రమే దొరుకుతాయి. రౌడీ బ్రాండ్‌ టీషర్టులూ, కుర్తాలూ, ప్యాంటులూ, స్టేట్‌మెంట్‌ షర్ట్‌లూ, బాంబర్లూ ఉంటాయి. రౌడీ బ్రాండ్‌ లుంగీలు కూడా ఉన్నాయండోయ్‌.. గీతగోవిందం ఆడియో వేడుకకి విజయ్‌ కట్టుకొచ్చిన గళ్ల లుంగీ ఆ బ్రాండ్‌దే.

అనుష్క... నుష్‌!
ఓ పక్క నటిగా, మరోపక్క నిర్మాతగా కెరీర్‌లో రాణిస్తున్న అనుష్క శర్మ... గతేడాది ‘నుష్‌’ బ్రాండ్‌తో అమ్మాయిలకు ప్రత్యేకమైన దుస్తుల్ని మార్కెట్‌లోకి తెచ్చింది. నుష్‌... అనుష్కాకు ఉన్న ముద్దుపేర్లలో ఒకటి. దాన్నే తన బ్రాండ్‌కీ పెట్టుకుంది. ‘నుష్‌’ బ్రాండ్‌లో వచ్చే ప్రతి వెరైటీలోనూ తన అభిరుచి కూడా కనిపిస్తుందని చెబుతోంది. ‘కెరీర్‌ ప్రారంభంలో ఆడిషన్స్‌కి వెళ్లేటపుడు మంచి బట్టలకోసం చాలా దుకాణాల్లో వెతికేదాన్ని. డ్రెస్‌ నచ్చితే ధర అందుబాటులో ఉండేది కాదు. ధర నచ్చితే డ్రెస్‌ నచ్చేది కాదు. ఒక్కోసారి రోజంతా వెతికినా ఒక్క డ్రెస్‌ కూడా కొనలేకపోయేవాళ్లం. నా పేరుతో ఒక బ్రాండ్‌ తెస్తానని అప్పుడు ఊహించనేలేదు’ అంటోంది అనుష్క.

వీరే కాదు, హృతిక్‌ రోషన్‌ (హెచ్‌ఆర్‌ఎక్స్‌), సచిన్‌ తెందూల్కర్‌(ట్రూ బ్లూ) సోనమ్‌ కపూర్‌(రిసోన్‌)... ఇలా చాలామంది తమవైన బ్రాండ్‌లు తెస్తూ అభిమానుల్ని ఫ్యాషన్‌ పరంగానూ అలరిస్తున్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.