close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కోట్లు సంపాదిస్తున్నారు..!

కోట్లు సంపాదిస్తున్నారు..!

లక్షల్లో అనుచరులుంటారు... లీడర్లు కాదు. కోట్లలో సంపాదిస్తారు... వ్యాపారవేత్తలూ కాదు. బిజీబిజీగా విమానాల్లో తిరిగేస్తుంటారు... అలాగని కంపెనీల సీఈవోలూ కాదు. భాషల హద్దులూ దేశాల సరిహద్దులూ వారికి లేవు. అన్నిదేశాల్లోనూ అభిమానులు వారి సొంతం. తమకిష్టమైన పనే చేస్తారు... కాకపోతే కాస్త డిఫరెంట్‌గా. అందుకే వారి నోట తమ బ్రాండ్‌ పేరు వినిపిస్తే చాలు లక్షలు సమర్పించుకోడానికి సిద్ధంగా ఉంటున్నాయి వ్యాపార సంస్థలు. సోషల్‌మీడియాను స్మార్ట్‌గా వాడుకుంటూ కూల్‌గా కోట్లు సంపాదిస్తున్న మిలీనియల్‌ కిడ్స్‌ వీరంతా.
‘ఇరవైనాలుగ్గంటలూ ఆ ఫోనుతోనే. సెలవుల్లోనైనా కాసేపు అమ్మకు సాయం చేద్దామని ఉండదు...’ టీనేజ్‌ పిల్లలున్న ఇళ్లలో తరచూ విన్పించే మాటే ఇది. ‘ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా పిల్లల్ని స్మార్ట్‌ ఫోన్‌ తెరలకు బందీలను
చేసేస్తున్నాయి. వాళ్లు టైమ్‌ వేస్ట్‌ చేస్తూ ఎందుకూ పనికిరాకుండా పోతున్నారు...’ ఇది పెద్దల వెర్షన్‌.
మరి పిల్లలేమంటున్నారు..?వారు మాటలు కాదు, చేతల్లోనే చెబుతున్నారు. ఏం చదవాలన్న టెన్షన్‌ లేదు. ఎంట్రన్స్‌ పరీక్షల ఆందోళన లేదు. కాలేజీలో సీటు వస్తుందో రాదోనన్న బెంగ అంతకన్నా లేదు. చేతిలో ఉన్న ఫోనుతోనే చమత్కారాలు చేసేస్తున్నారు. టీనేజీలోనే సత్తా చాటుతున్నారు. రెండు పదులు నిండేసరికి సెలెబ్రిటీలైపోతున్నారు. ఇంటర్నెట్‌ సెన్సేషన్స్‌గా తోటివారిని తమ చుట్టూ తిప్పుకుంటున్నారు. అదెలా సాధ్యమైందీ అంటే... అభిరుచినే సంపాదనా మార్గంగా మలచుకోవడం ద్వారా... అందుకు సోషల్‌ మీడియానే వారధిగా ఎంచుకోవడం ద్వారా!


ఆ కబుర్లకోసం...

ప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ పక్కింటి అల్లరిపిల్లలా గలగలా మాట్లాడే 22 ఏళ్ల సేజల్‌ కుమార్‌ని చూసి టీనేజర్లు అసూయపడతారు. మరో పక్క ‘స్టైల్‌ ఆన్‌ ఎ బడ్జెట్‌’ పేరుతో తక్కువ బడ్జెట్‌లో స్టైల్‌గా ఎలా కన్పించవచ్చో ఆమె వీడియోలో చెప్తుంటే కళ్లప్పగించి చూస్తారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు లక్షలమందికి పైగా ఫాలోవర్లున్న ఈ అమ్మాయి యూట్యూబ్‌ ఛానల్‌కి ఆరు లక్షల మంది సబ్‌స్క్రైబర్లున్నారు. స్టైలింగ్‌ నుంచి గైనిక్‌ సమస్యల వరకూ సేజల్‌ చెప్పే కబుర్లూ ఇచ్చే సలహాలూ వినడానికి ఎంతో ఇష్టపడతారు అభిమానులు. కాలేజీలో చేరేటప్పటికే స్వతంత్ర ఆలోచనలతో ఉన్న సేజల్‌ సోషల్‌ మీడియా ఆనుపానులను అధ్యయనం చేసింది. ‘ద క్లోతింగ్‌ ఎడిట్‌’ పేరుతో బ్లాగునీ యూట్యూబ్‌ ఛానల్‌నీ మొదలెట్టింది. సెలెబ్రిటీలు ధరించే దుస్తులూ నగల స్ఫూర్తితో తక్కువ ఖర్చుతో అలాంటి లుక్‌ తేవడమెలాగో సేజల్‌ తన వీడియోల్లో చెబుతుంది. తోటి పిల్లలంతా కాలేజీ అయ్యాక సినిమాలకూ షికార్లకూ తిరుగుతుంటే సేజల్‌ మాత్రం సీరియస్‌గా తన వీడియోలకు అవసరమైన సమాచారాన్ని సేకరించేది. పూర్తిస్థాయి యూట్యూబర్‌గా అటు ఛానల్‌ నిర్వహిస్తూనే ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. సేజల్‌ పాటలు పాడుతుంది. నృత్యం చేస్తుంది. యూట్యూబ్‌ షార్ట్‌ మూవీస్‌లో నటించింది. తన గురించి చెప్పమంటే కూల్‌డ్రింక్స్‌ తాగని, జంక్‌ఫుడ్‌ తినని విచిత్రమైన అమ్మాయిని అంటుంది నవ్వుతూ. అవన్నీ సరే, ఇంతకీ ఎంత సంపాదిస్తున్నావు అని అడిగితే మాత్రం సూటిగా చెప్పకుండా దేశాలన్నీ తన సొంత సంపాదనతోనే తిరిగేస్తున్నానంటుంది. యూట్యూబర్లు తమ ఛానల్‌ని గూగుల్‌ యాడ్‌సెన్స్‌తో లింక్‌ చేస్తారు. దాంతో వ్యూసూ సబ్‌స్క్రైబర్లూ పెరిగేకొద్దీ ఛానల్‌ ప్రకటనకర్తలను ఆకర్షిస్తుంది. ఆ ప్రకటనల ద్వారానే యూట్యూబర్లకు ఆదాయం వస్తుంది. ఛానల్‌లో క్రమం తప్పకుండా ప్రమాణాలు తగ్గకుండా కంటెంట్‌ అప్‌లోడ్‌ చేస్తే దానికి తగ్గట్టుగానే ఆదాయమూ వస్తుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అత్యధిక ఆదాయం వస్తున్నది యూట్యూబ్‌తోనేననీ నెల తిరిగేసరికి ఎంత లేదన్నా సేజల్‌ లక్షల్లోనే సంపాదిస్తుందనీ అంటారు అభిమానులు.


టు బాలీవుడ్‌ వయా ఇన్‌స్టా

రాధికా సేథ్‌ జీవితాన్ని ఓ మలుపు తిప్పింది ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా. లఖ్‌నవూలో పుట్టి దిల్లీలో చదివిన రాధిక బాలీవుడ్‌లో ప్రవేశానికి ఆ ఖాతానే ఎంట్రీపాస్‌గా మార్చుకునే ప్రయత్నంలో ఉంది. కాలేజీలో చేరిన తర్వాత రోజూ సెల్ఫీలు తీసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడం హాబీగా చేసుకుంది. రకరకాల హావభావాలు ప్రదర్శిస్తూ ఆమె పెట్టే ఫొటోలకు తెగ లైక్‌లు వస్తోంటే మురిసిపోయేది. అప్పటివరకూ ఆమె మామూలు టీనేజరే. కానీ ఆమె ఇన్‌స్టా అకౌంట్‌ని అనుసరించేవారి సంఖ్య ఏకంగా లక్షల్లోకి చేరడంతో ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది. అలా అయ్యే అవకాశం ఉందని అప్పటివరకూ రాధికకూ తెలియదు. పలు కంపెనీలూ బ్రాండ్ల నుంచి ఆమెకు ఆఫర్లు వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో 5వేల మంది ఫాలోవర్స్‌ దాటిన వారి మీద బ్రాండ్ల చూపు పడుతుంది. 10వేల మంది ఫాలో అవుతున్నారంటే వారిని ‘ఇన్‌ఫ్లుయెన్సర్‌’ (వినియోగదారులమీద ప్రభావం చూపేవారిగా)గా పరిగణిస్తాయి. తమ బ్రాండ్‌ని ప్రమోట్‌ చేసుకోడానికి వారు పోస్ట్‌చేసే ఒక్కో ఫొటోకీ కొంత మొత్తం డబ్బు చెల్లిస్తాయి. లక్ష మంది ఫాలోవర్స్‌ ఉన్నవారు ఎంత లేదన్నా ఒక్కో పోస్టుకీ రూ.3 లక్షలకు పైగా సంపాదించవచ్చు. రాధికకి ఆరు లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఆమె పెట్టే ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో ఆ బ్రాండ్‌ పేరు కనపడితే చాలు. ఇంకేముంది, రోజుకో కొత్త డ్రస్‌ వేసుకుని పోజిస్తూ అది ఏ కంపెనీదో చెప్తూ చిన్న వీడియో పోస్ట్‌ చేయడం... అదే ఆమె ఉద్యోగమైంది. రాధిక ఫొటోలు చూసి మరో పక్కనుంచీ మోడలింగ్‌ అవకాశాలూ వెదుక్కుంటూ వచ్చాయి. ఇప్పుడిక ముంబయి యూనివర్శిటీలో చదువుకుంటూనే బాలీవుడ్‌ పిలుపు కోసం వేచి చూస్తోందీ చిన్నది.


రూపీ కౌర్‌... రూటే వేరు!

యువతి నెలసరి మరకల దుస్తులతో పడుకుని ఉన్న ఫొటో కొన్నాళ్ల క్రితం సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. ‘ఆ పరిస్థితిలో ఓ అమ్మాయిని చూస్తే నేనైతే ఏం చేస్తాను...’ అంటూ చాలా మంది రకరకాలుగా వ్యాఖ్యలు రాశారు. ఆ ఫొటో పెట్టింది రూపీ కౌర్‌. పదేళ్ల క్రితమే నెలసరి గురించి ‘ఫొటో వ్యాసం’తో సంచలనం సృష్టించింది. ఈరోజుల్లో కవిత్వమూ సాహిత్యమూ చదివే పిల్లలున్నారా అని సందేహించేవారికి సమాధానం ఈ పాతికేళ్ల యువతి. ఇప్పటికే తన కవితలతో రెండు పుస్తకాలు ప్రచురించడమే కాదు, వాటిని రికార్డు స్థాయిలో అమ్ముకుంది కూడా. పంజాబ్‌లో పుట్టిన రూపీ నాలుగేళ్ల వయసులో తల్లిదండ్రులతో కెనడా వెళ్లింది. కొత్త దేశంలో ఆ చిన్నారిని భాష ఇబ్బంది పెట్టింది. అందుకని ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే బొమ్మలేసి చూపించేది. అలా స్నేహితులను సంపాదించుకుంది. క్రమంగా ఇంగ్లిష్‌ నేర్చుకుంది. కవిత్వం రాసి దానికి తగినట్లుగా బొమ్మలు కూడా వేసి స్నేహితులకు బహుమతులుగా ఇచ్చేది. ఒకసారి ఆమె ఇచ్చిన కవితను ఎవరో సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. దానికి బోలెడన్ని ప్రశంసలు రావడంతో రూపీ తన కవితలతో సొంతంగా వెబ్‌సైట్‌ పెట్టుకుంది. కవితల కోసమే రూపీ ఇన్‌స్టాగ్రామ్‌ ఎకౌంట్‌ని 25 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఆమె మొదటి పుస్తకం ‘మిల్క్‌ అండ్‌ హనీ’ 25 లక్షల కాపీలు అమ్ముడుపోయి న్యూయార్క్‌ టైమ్స్‌ బెస్ట్‌ సెల్లర్స్‌ లిస్టులో 77 వారాలు నిలిచింది. తనకిష్టమైన కవితలు రాసుకుంటూ సోషల్‌మీడియా వారధిగా వాటికి ప్రచారాన్నీ డబ్బునీ కూడా తెచ్చుకుంటూ ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 జాబితాలో చోటు పొందిన ఈ యువతిని టీనేజర్లు ‘ఇన్‌స్టాపొయెట్‌’ అంటారు.


మాస్‌ కామెడీ... మస్తు సంపాదన

ద్దెనిమిదేళ్ల అజేయ్‌ నాగర్‌ తన సొంత సంపాదనతో రెండు ఫార్చ్యూనర్‌ కార్లు కొనుక్కున్నాడు. ‘క్యారిమినాటి’ పేరుతో అజేయ్‌ నిర్వహించే యూట్యూబ్‌ కామెడీ ఛానల్‌కి 30 లక్షల మంది సబ్‌స్క్రైబర్లున్నారు మరి. అజేయ్‌ నిజానికి పదకొండేళ్ల వయసులోనే ‘స్టీల్‌దఫియర్స్‌’ పేరుతో  వీడియోగేమ్స్‌, ట్యుటోరియల్స్‌తో ఓ ఛానల్‌ పెట్టాడు. కానీ దానికి అంతగా ఆదరణ రాకపోవడంతో కామెడీలోకి దిగాడు. యూట్యూబ్‌లో కామెడీ ఛానల్స్‌ చాలానే ఉన్నాయి. వాళ్లంతా సరదాగా నవ్విస్తే అజేయ్‌ ఏడ్పించి నవ్వించే రకం. తోటి కమెడియన్స్‌ని అవమానిస్తూ వ్యంగ్యంగా జోకులేస్తూ ఉంటాయి అతని కార్యక్రమాలు. భాష కూడా రోడ్ల మీద కుర్రాళ్లు మాట్లాడుకుంటున్నట్లు పూర్తి మాస్‌ ధోరణిలో ఉంటుంది. విచిత్రమైన గొంతుతో నోరంతా సాగదీసి అజేయ్‌ మాట్లాడే పద్ధతిని టీనేజర్లే ఎక్కువగా ఎంజాయ్‌ చేస్తారట. తనకు తోచింది రికార్డు చేసి అప్‌లోడ్‌ చేస్తాడు తప్ప దానికి ఎలాంటి స్పందన వస్తోందీ, విమర్శిస్తున్నారా, ప్రశంసిస్తున్నారా... ఏదీ పట్టించుకోడు అజేయ్‌. యూట్యూబర్లు ఇతర మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటారు. అజేయ్‌కి ఫేస్‌బుక్‌లోనూ చాలామంది అభిమానులున్నా తన ఛానల్‌ అప్‌డేట్స్‌ ట్విటర్‌లోనే పోస్ట్‌ చేస్తాడు. పేరు కన్నా డబ్బే ముఖ్యమనే అజేయ్‌ తాను లక్షలు సంపాదిస్తున్నా అమ్మానాన్నలు సంతోషంగా లేరనీ డిగ్రీ పూర్తిచేయమంటున్నారనీ దిగులుగా చెప్తాడు. అభిమానులు మాత్రం అతని సంపాదన కోట్లలోకి చేరి వుంటుందని లెక్కలు కడుతున్నారు.


టీనేజర్లు మెచ్చే మోడల్‌

మోడల్‌గా, స్టైలిస్టుగా పేరు తెచ్చుకున్న కృత్తికా ఖురానా ఫ్యాషన్‌ బ్లాగర్‌గా మొదలుపెట్టి ఇన్‌స్టాతో పేరు తెచ్చుకుని ఫ్యాషన్‌ డిజైనర్‌గా సొంతంగా ఆన్‌లైన్‌ స్టోర్‌ పెట్టుకునే స్థాయికి ఎదిగింది. ఆమె తెలివితేటలు తప్ప రూపాయి పెట్టుబడి లేదు. ‘దట్‌బోహోగర్ల్‌’ అన్నది కృత్తికా లైఫ్‌స్టైల్‌ బ్లాగ్‌. ట్రెండ్స్‌కి తగినట్లుగా రకరకాల దుస్తుల్లో చక్కగా తయారై ఫొటోలు తీసుకుని బ్లాగులో పెట్టేది. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి విశేషాలనూ ఫొటోలతో సహా ఆకట్టుకునేలా రాసేది. దానికి మంచి ఫాలోయింగ్‌ వచ్చింది. వివిధ బ్రాండ్లను ఎండార్స్‌ చేసే అవకాశాలు వెదుక్కుంటూ వచ్చాయి. అలా సంపాదిస్తూనే ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి తన పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌నీ ప్రారంభించింది. కృత్తికాకి తన కలలను నిజం చేసుకోడానికి అవసరమైన ప్రేరణనూ ప్రోత్సాహాన్నీ బ్లాగ్‌ ఇస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో లైకులు సంపాదననూ తెచ్చిపెట్టాయి. కాస్త బొద్దుగా ఉండే ఈ 24 ఏళ్ల పంజాబీ ముద్దుగుమ్మ మోడలింగ్‌ చేయడానికి జీరో సైజ్‌ అక్కర్లేదంటుంది. ఎలా ఉన్నా ఎవరికి వారు తమ శరీరాన్ని ప్రేమించాలని పాఠాలు చెబుతుంది. స్ట్రెచ్‌ మార్క్స్‌ కన్పించేలా తన ఫొటోలు పెట్టి మరీ బొద్దు ముద్దేనంటూ బుజ్జగిస్తుంది. అందుకే అమ్మాయిలు కృత్తికాని ఇష్టపడతారు. కృత్తికా ఇప్పుడు మోడలింగ్‌ అవకాశాలను అందిపుచ్చుకుంటూనే చెల్లెలు దీక్షతో కలిసి ‘హైప్‌ షాప్‌’ పేరుతో ఆన్‌లైన్‌లో దుస్తుల్నీ నగల్నీ విక్రయిస్తోంది. 


క్యూట్‌ లుక్స్‌... స్వీట్‌ వాయిస్‌

రవై రెండేళ్ల ఈ చిన్నది గంటన్నర కచేరీ చేస్తే రూ.4.5 లక్షలు తీసుకుంటుంది. రానుపోను విమాన ఛార్జీలూ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో బస, ఆమెతో పాటు వచ్చే వాద్యబృందం ఏడుగురి ప్రయాణ, భోజన, వసతి ఖర్చులూ కూడా నిర్వాహకులే పెట్టుకోవాలి. అయినా సరే ఈ క్యూట్‌, స్వీట్‌ లిటిల్‌ సింగర్‌ అంటే యూత్‌కి ఎంత క్రేజో. అందుకే షిర్లీ సేఠియా విమానంలో కాలు స్టేజీ మీద, స్టేజి మీద కాలు విమానంలో పెడుతూ అమెరికా, బ్రిటన్‌, న్యూజిలాండ్‌, ఇండియాల మధ్య తెగ తిరిగేస్తోంది. ఇండియాలో పుట్టి న్యూజిలాండ్‌లో పెరిగిన షిర్లీకి హిందీ పాటలంటే ఇష్టం. చదువుకుంటూ, పార్ట్‌ టైమ్‌ రేడియో జాకీగా పనిచేస్తూనే పాటలు పాడి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసేది. ఇన్ని పనులతో బిజీబిజీగా ఉన్న షిర్లీకి  టీ సిరీస్‌ వాళ్ల పోటీ గురించి తెలిసింది. సరదాగా ఓ పాట పాడి పంపించింది. వేలాది మంది పంపిన పాటల్లో ఆమె పాటనే నిర్వాహకులు మెచ్చారు. ఏ మాత్రం సీరియస్‌నెస్‌ లేకుండా నైట్‌ డ్రెస్‌ వేసుకుంటూ ఆమె పాట పాడిన తీరు అభిమానులకు ఎంత నచ్చిందంటే ‘పైజామా పాప్‌స్టార్‌’ అని పిలుస్తారామెను. పోటీలో విజయం ఆమెను ఒక్కసారిగా సెలబ్రిటీని చేసింది. ఆమె యూట్యూబ్‌ ఛానల్‌ సబ్‌స్క్రైబర్లు ఆరున్నర లక్షలు దాటారు. ఆతిఫ్‌ అస్లాం లాంటి ప్రముఖ గాయకులతో కలిసి సింగిల్స్‌ పాడే అవకాశం ఆమెను వెదుక్కుంటూ వచ్చిందంటే షిర్లీకి ఎంత పేరొచ్చిందో ఊహించవచ్చు. భవిష్యత్తులో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించనున్న గాయని షిర్లీనేనంటూ ఫోర్బ్స్‌ సైతం రాసేసింది. ‘పొట్టిదాన్నే కానీ నా కలలు మాత్రం చాలా గట్టివి’ అని తన గురించి సోషల్‌ మీడియాలో రాసుకుంటుంది సొంత సంపాదనతోనే కోటీశ్వరురాలైన ఈ ఇంటర్నెట్‌ సెన్సేషన్‌.


యూట్యూబ్‌ బిలియనీర్‌!

రవై మూడేళ్ల లోగన్‌పాల్‌ని ‘యూట్యూబ్‌ బిలియనీర్‌’ అంటారు. టీనేజ్‌ నుంచే సోషల్‌మీడియాని హాబీగా కొనసాగిస్తున్న పాల్‌ ఇంజినీరింగ్‌ చదువును మధ్యలో ఆపేసి సోషల్‌ మీడియా ఎంటర్‌టైనర్‌గానే కెరీర్‌ని తీర్చిదిద్దుకోవాలని నాలుగేళ్ల క్రితమే నిర్ణయించుకున్నాడు. మూడేళ్లు తిరిగేసరికల్లా వందకోట్ల సంపాదనపరుడయ్యాడు. గత ఏడాది ప్రపంచంలో యూట్యూబ్‌ ద్వారా ఎక్కువ మొత్తం సంపాదించిన వారిలో పాల్‌ది ఐదో స్థానం కాగా అతని తమ్ముడు జేక్‌ది ఏడో స్థానం. పదేళ్ల వయసులో తొలి యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించాడు పాల్‌. మరో పక్క ‘వైన్‌’ అనే మరో సోషల్‌ మీడియా వేదికనూ ఎక్కువగా ఉపయోగించేవాడు. దాంట్లో అతనికి మంచి ఫాలోయింగ్‌ వచ్చింది. టాప్‌ టెన్‌ ఇన్‌ఫ్లుయెన్షియల్‌ వ్యక్తుల్లో అతనొకడయ్యాడు. ఇంతలో వైన్‌ మూతపడింది. పాల్‌ కాలేజీలో చేరే సమయానికి యూట్యూబ్‌ ఛానల్‌ పాపులారిటీ పెరగడం మొదలెట్టింది. అందులోనే అతనికి మంచి భవిష్యత్తు కన్పించింది. అందుకే ఇంజినీరింగ్‌ కాలేజీకి బై చెప్పేశాడు. ఛానల్‌పైన దృష్టిపెట్టాడు. ఇప్పుడు పాల్‌ ‘ద అఫిషియల్‌ లోగన్‌ పాల్‌’ అనే యూట్యూబ్‌ ఛానల్‌లో షార్ట్‌ ఫిల్స్మ్‌, కామెడీ స్కెచెస్‌ అప్‌లోడ్‌ చేస్తుంటాడు. దానికి నాలుగు కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ‘లోగన్‌ పాల్‌ వ్లాగ్స్‌’(వీడియో బ్లాగ్‌ని వ్లాగ్‌ అంటారు) అనే మరో ఛానల్‌లో 15 నెలల పాటు ప్రతిరోజూ కొత్త పోస్ట్‌ పెడితే ఏకంగా 15 కోట్లకు పైగా ఫాలో అయ్యారు. ఇప్పుడిప్పుడే పాల్‌ బుల్లితెరమీదా, వెండితెర మీదా కూడా కన్పించడం మొదలెట్టాడు. పాటలూ పాడుతున్నాడు.


సోషల్‌ మీడియా రెండువైపులా పదునున్న కత్తి లాంటిది. ఊరికే కూర్చుని ఎవరేం పోస్ట్‌చేశారో చూస్తూ టైంపాస్‌ చేయడం, లేదూ దాన్ని మనకు అనుగుణంగా ఉపయోగించుకుని అద్భుతాలు చేయడం...  మొదటిది ఎవరైనా చేస్తారు. రెండో దానికే... చాలా కష్టపడాలి. సృజనాత్మకంగా, వైవిధ్యంగా ఆలోచించగలగాలి. ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టగల క్రమశిక్షణ ఉండాలి. ప్రమాణాలూ విలువల విషయంలో రాజీ పడకూడదు. అప్పుడే సోషల్‌ మీడియాలో మిమ్మల్ని అనుసరించేవారు పెరుగుతారు. మీకో గుర్తింపు తెస్తారు. ఆ గుర్తింపు మీ గౌరవాన్ని పెంచుతుంది. మీ నోట మా మాట... అంటూ బ్రాండ్లు వెంటపడతాయి. అప్పుడు సోషల్‌ మీడియా టైంపాస్‌ కాదు... టైమ్‌ పత్రిక పేర్కొనే ప్రముఖుల జాబితాలోనూ, ఫోర్బ్స్‌ సంపన్నుల లిస్టులోనూ చోటు సంపాదించి పెట్టగల ఆయుధమవుతుంది.
వీళ్లూ అలాగే కష్టపడ్డారు. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.