close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ధ్యానం చేస్తే లాభాలెన్నో!

ధ్యానం చేయడంవల్ల ఆందోళనతోబాటు శారీరక నొప్పులూ తగ్గుతాయనీ భావోద్వేగపరమైన తెలివితేటలు పెరుగుతాయనీ చెబుతున్నారు శాన్‌ఫ్రాన్సిస్కోకి చెందిన సెంటర్‌ ఫర్‌ వెల్‌నెస్‌ అండ్‌ అచీవ్‌మెంట్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ అనే సంస్థకు చెందిన నిపుణులు. అయితే ధ్యాన ప్రక్రియలో చాలానే రకాలు ఉన్నాయి. వాటిల్లో ట్రాన్సెండెంటల్‌ ధ్యానం(ఏదో ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తూ ధ్యానం చేయడం) వల్ల ఈ రకమైన ఉపయోగాలు ఎక్కువగా ఉంటాయి అంటున్నారు.
దీనివల్ల విద్యార్థుల్లో ప్రతిభ పెరగడంతోబాటు హింసాత్మక ప్రవృత్తి తగ్గుతుందట. అంతేకాదు, ఒత్తిడితో సతమతమయ్యే ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గి భావోద్వేగాలు అదుపులో ఉంటాయని తేలింది. ఇందుకోసం వీళ్లు ఒత్తిడితో ఇబ్బందిపడుతున్న ఉపాధ్యాయుల్ని ఎంపిక చేసి వాళ్లను రెండు వర్గాలుగా విభజించారట. వాళ్లలోని ఓ వర్గంతో ప్రతిరోజూ ఓ గంటపాటు వరసగా నాలుగు నెలలు ఈ రకమైన ధ్యానం చేయించగా- చేయని వర్గంతో పోలిస్తే, చేసిన వాళ్లలో ఒత్తిడి తగ్గడంతోబాటు భావోద్వేగాలకు సంబంధించిన తెలివితేటలు పెరిగినట్లు గుర్తించారట.


ఇవి తింటున్నారా?

దీర్ఘకాలం జీవించే జపాన్‌, సింగపూర్‌ వాసుల్ని పరిశీలించిన అంతర్జాతీయ పోషక నిపుణులు అందుకు కారణమైన కొన్ని సూపర్‌ ఫుడ్స్‌ గురించి వివరిస్తున్నారు...
సోయాబీన్స్‌: ఫైటో ఈస్ట్రోజెన్‌ రకానికి చెందిన ఐసోఫ్లేవోన్స్‌ వీటిల్లో పుష్కలం. ఇవి క్యాన్సర్లనీ, సూక్ష్మజీవుల్నీ, మంటనీ తగ్గిస్తాయి. దాంతో వృద్ధాప్యఛాయలు ఆలస్యమవు తాయి. వీటివల్ల రొమ్ముక్యాన్సర్‌ వచ్చే అవకాశం తక్కువ.
క్యారెట్లు: బీటాకెరోటిన్‌ అనే కెరోటినాయిడ్‌ ఇందులో పుష్కలంగా ఉండటంతో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఇదే శరీరంలో విటమిన్‌-ఎగా మారుతుంది. ఇది వయసుతోబాటు వచ్చే కంటికండరాల క్షీణతని రాకుండా చేస్తుంది.
క్యాబేజీ, బ్రకోలీ, కాలీఫ్లవర్‌, ముల్లంగి: క్రూసిఫెరె కుటుంబానికి చెందిన ఈ రకం కూరగాయల్లో పోషకాలశాతం ఎక్కువ. సి, ఇ, కె, ఫోలేట్‌ విటమిన్లూ పొటాషియం, కాల్షియం, సెలీనియం ఖనిజాలూ, కెరోటినాయిడ్లూ వీటిల్లో పుష్కలం. ఇవన్నీ రోగనిరోధకశక్తిని పెంచుతాయి. వీటిల్లోని గ్లూకోసినోలేట్స్‌ ఒత్తిడినీ మంటనీ క్యాన్సర్లనీ నిరోధిస్తాయి, వృద్ధాప్యంలో ఆలోచనాశక్తి తగ్గకుండా చేస్తాయి, గుండె ఆరోగ్యానికీ తోడ్పడతాయి. పీచు కొవ్వుల్ని శోషించుకోవడంతోబాటు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది, ఊబకాయాన్నీ రానివ్వదు.
సిట్రస్‌ పండ్లు: నిమ్మ, నారింజ, కమలా... వంటి పండ్లలోని విటమిన్‌-సికి ఇన్ఫెక్షన్లని అడ్డుకునే శక్తి ఉంది. దీంతోపాటు వీటిల్లో అనేక రకాల చక్కెరలు, పీచు, పొటాషియం, ఫోలేట్‌, కాల్షియం, థైమీన్‌, నియాసిన్‌, విటమిన్‌-బి6, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, కాపర్‌, రిబోఫ్లేవిన్‌, పాంటోథెనిక్‌ ఆమ్లం... వంటి పోషకాలూ ఇతర కెరోటినాయిడ్లూ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చు అంటున్నారు.


పట్టులాంటి జుట్టు కోసం...

కొందరి జుట్టు బిర్రబిగుసుకుని గడ్డిలా అయిపోతుంది. చలికాలంలో మరీనూ. అలాంటివాళ్లు కొన్ని చిట్కాల ద్వారా తమ శిరోజాలను మృదువుగా మెరిసేలా చేసుకోవచ్చు.
* పావుకప్పు బాదం నూనెలో ఓ గుడ్డుసొన వేసి బాగా గిలకొట్టి తలకి బాగా పట్టించి ముప్పావుగంట తరవాత గోరువెచ్చని నీటితో షాంపూ చేయాలి. ఇలా వారానికోసారి చేయడంవల్ల బాదంలోని సహజ నూనెలూ గుడ్డులోని ప్రొటీన్లూ దెబ్బతిన్న శిరోజాలని మృదువుగా మారుస్తాయి.
* బాగా పండిన అరటిపండులో రెండు టీస్పూన్ల తేనె, ముప్పావు కప్పు కొబ్బరినూనె వేసి బాగా కలిపి పేస్టులా చేసి దీన్ని జుట్టుకి పట్టించి 20 నిమిషాలాగి షాంపూ చేయాలి.
* రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున నిమ్మరసం, తేనె తీసుకుని బాగా కలపాలి. అందులోనే ఓ కప్పు నీళ్లు కూడా పోసి బాగా కలిపి జుట్టుకి పట్టించి పది నిమిషాల తరవాత
కడిగేయాలి. ఇలా రెండు వారాలకోసారి చేయడంవల్ల మంచి ఫలితం ఉంటుంది. గోరువెచ్చని కొబ్బరిపాలు లేదా అలోవెరా గుజ్జు వంటివి పట్టించి అరగంట తరవాత తలస్నానం చేసినా మంచిదేనట.


ఆస్ప్రిన్‌... సూపర్‌..!

కేవలం తలనొప్పికోసం వాడే ఆస్ప్రిన్‌, గుండెజబ్బుల్నీ పక్షవాతాన్నీ కూడా నిరోధిస్తుందన్నది తెలిసిందే. అయితే ఇప్పుడు ఇది క్యాన్సర్‌ రోగులకీ మందే అంటున్నారు. అదెలా అంటే- క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా దీన్ని తక్కువ మోతాదులో ఇవ్వడం వల్ల ఆ కణాలు శరీరమంతా వ్యాపించకుండా ఉంటాయని చెబుతున్నారు కార్డిఫ్‌ విశ్వవిద్యాలయ నిపుణులు. ఇందుకోసం క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా ఆస్ప్రిన్‌ వాడిన రోగుల్లో వ్యాధి తీవ్రత తగ్గి, జీవించే అవకాశాలు ఎక్కువగా ఉంటే, దీన్ని ఇవ్వని వాళ్లలో ఆ అవకాశాలు తక్కువని తేలింది. ఈ డ్రగ్‌ను కాస్త ఎక్కువగా తీసుకున్న రోగులు ఎక్కువకాలం జీవించినట్లూ గుర్తించారు. అంటే క్యాన్సర్‌ కణాలు శరీరమంతా వ్యాపించకుండా ఉండటంలో ఈ మందు కీలకపాత్ర వహిస్తుందని తెలుస్తుంది. ఇందుకోసం వీళ్లు అనేక రకాల క్యాన్సర్‌ రోగుల్ని పరిశీలించగా- అన్ని క్యాన్సర్ల చికిత్సలోనూ ఇది బాగా పనిచేస్తుందని గుర్తించారు. ఇంకా ఇది అండాశయ, కాలేయ క్యాన్సర్లనీ అడ్డుకుంటుందట.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.