close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆరోగ్యానికి ఫిట్‌నెస్‌... అందం బోనస్‌!

ఆరోగ్యానికి ఫిట్‌నెస్‌... అందం బోనస్‌!

కొత్త అలవాటు చేసుకోవాలన్నా పాత అలవాటు వదిలించుకోవాలన్నా, మొత్తంగా జీవనశైలినే సరికొత్తగా మార్చుకోవాలన్నా 21/90 నియమం గురించి చెప్తుంటారు నిపుణులు. 21 రోజులు క్రమం తప్పకుండా చేస్తే ఏ పనైనా అలవాటుగా మారిపోతుందనీ అలాగే 90 రోజులు కొనసాగించామంటే ఆ అలవాటు జీవనశైలిలో భాగమైపోతుందనీ దీని అర్థం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే చాలామంది వ్యాయామం కొనసాగించడానికి ఆ నియమాన్ని తు.చ. తప్పక ఫాలో అయిపోతున్నారు కాబట్టి.‘బాబు పుట్టాక పెరిగిన బరువు మూడేళ్లైనా తగ్గలేదు’
‘అంతా బాగానే ఉంటుంది. ఈ చేతులే లావుగా కన్పిస్తాయి. అందుకే స్లీవ్‌లెస్‌ వేసుకునే ధైర్యం చేయలేకపోతున్నా’
‘కొంచెం పొట్ట తగ్గితే చాలు... ఏ డ్రెస్‌ వేసుకున్నా బాగుంటుంది కదా’
‘పట్టుమని నాలుగడుగులు వేస్తే ఆయాసమొచ్చేస్తోంది. నడక అలవాటు లేకేనంటావా’?
‘షుగర్‌ పెరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా వాకింగ్‌ చేయాలట...’
‘కంప్యూటరు ముందు పనిలో పడితే ఎన్ని గంటలైనా లేవను. దాంతో మోకాళ్లు పట్టేస్తున్నాయి’
‘ఏ సమస్య గురించి ఆస్పత్రికెళ్లినా ముందు బరువు తగ్గమంటారు. నాకూ తగ్గాలనే ఉంది కానీ ఎలా?’
ఆఫీసుల్లో నలుగురు కలిసినప్పుడు విన్పించే మాటలే ఇవన్నీ. అందరి సమస్యకీ ఒకటే పరిష్కారం.  అదే వ్యాయామం. వ్యాయామం అనగానే జిమ్‌కెళ్లి బరువులెత్తాలని కంగారు పడిపోనక్కరలేదు. ఇప్పుడు ఎవరి సమస్యకి తగిన వ్యాయామం వారికుంది.
ఫిట్‌నెస్‌ రంగంలో ఇప్పుడెన్నో మార్పులొచ్చాయి. రొటీన్‌గా వన్‌ టూ త్రీ... అంటూ చేతులూ కాళ్లూ చాపుతూ చేసే వ్యాయామాలకు కాలం చెల్లింది. వ్యాయామమే ఇప్పుడో ఆకర్షణీయమైన వ్యాపకమైంది. జిమ్‌లో సౌకర్యాలూ పరికరాలూ ఆధునికతను సంతరించుకోగా సంగీతమూ నృత్యమూ వ్యాయామానికి అదనపు హంగులద్దాయి. దాంతో ఇప్పుడు ‘జిమ్‌’ అనగానే వ్యాయామ ప్రియుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. నిపుణులైన శిక్షకులూ పెరిగారు. ఆకృతి కోసమే కాదు, ఇప్పుడు వ్యాయామం... ఆరోగ్యం కోసం, సంపూర్ణ ఆనందం కోసం. అందుకు తగినట్లే కొత్త కొత్త వ్యాయామ పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఒక్కరి అవసరాలనూ తీరుస్తున్నాయి. అవేమిటో ఓసారి చూసేద్దామా!

జుంబారే... ఆ జుంబరే...
ఈ పదాలు వినగానే ‘క్షణక్షణం’ సినిమాలో పాట గుర్తొచ్చిందా? ఇంకేం, పాట పాడుతూ కాలు కూడా కదపండి మరి. వ్యాయామాల్లో ఒకటిగా ఈ మధ్య ఫిట్‌నెస్‌ ప్రియుల మదిని దోచుకుంటున్న నృత్య వ్యాయామం జుంబా. కొలంబియాకి చెందిన కొరియోగ్రాఫర్‌ అల్బర్టో బీటో పెరెజ్‌ దీన్ని రూపొందించాడు. లాటిన్‌ అమెరికన్‌ సంగీతం నేపథ్యంగా చేసే ఈ వ్యాయామాన్ని తప్పనిసరిగా శిక్షణ పొందిన ట్రైనర్‌ దగ్గరే నేర్చుకుని చేయాలి. సల్సా, ఫ్లమెంకో, బెల్లీ డ్యాన్స్‌, హిప్‌హాప్‌... నృత్యాల నుంచి రకరకాల స్టెప్‌లను తీసుకుని దానికి ఏరోబిక్‌ ఎక్సర్‌సైజులు జోడించి డిజైన్‌ చేసిన వ్యాయామం ఇది. ఇప్పుడిది మనదేశంలో ఎంత ప్రజాదరణ పొందిందంటే పలువురు శిక్షకులు బాలీవుడ్‌ బాణీల నేపథ్యంలో జుంబా వ్యాయామం చేయిస్తున్నారు. వ్యాయామం కోసం జిమ్‌ కెళ్తున్నవారిలో 60 శాతం ఇప్పుడు జుంబానే ఇష్టపడుతున్నారట.
అక్షరాలతో... బొక్వా
తాజాగా ప్రపంచ దేశాలన్నిటా వేగంగా వ్యాప్తి చెందుతూ జుంబా స్థానాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తోంది బొక్వా. మంద్రంగా సంగీతం విన్పిస్తుండగా అందరూ కలిసి లయబద్ధంగా కదులుతూ ఆంగ్ల అక్షరాలనూ అంకెలనూ తమ పాదాలతో నేల మీద గీస్తూ కార్డియో వ్యాయామాలు చేస్తుంటే చూసేవారిక్కూడా వాళ్లతో చేరిపోవాలన్న ఊపు వస్తుంది. ఒకటీ రెండూ అంటూ స్టెప్స్‌ లెక్కపెట్టుకోనక్కర్లేదు. బీట్‌కి తగినట్లుగా అక్షరం ఆకృతి వచ్చేలా అడుగులేసుకుంటూ వెళ్లడమే. ఆంగ్ల అక్షరాలూ అంకెలూ తెలిస్తే చాలు- చిన్నా పెద్దా ఆడా మగా అందరూ బొక్వా వ్యాయామం నేర్చుకుని చేసేయవచ్చు. రిథమ్‌ను ఆస్వాదించే పాటలు విన్పిస్తే చాలు కాలు కదిలించకుండా ఉండలేని విధంగా ఈ నృత్యం ఒక వ్యసనంగా మారిపోతోందనీ ఎంతో ఉత్తేజాన్నిస్తోందనీ అంటున్నారు బొక్వా ప్రేమికులు. గ్రూపుగా చేసే వ్యాయామం కాబట్టి స్నేహితుల్ని పెంచుకోడానికీ ఇది తోడ్పడుతోందట. అంతర్జాతీయ ఫిట్‌నెస్‌ ఎక్స్‌పర్ట్‌ పాల్‌ మావి దీన్ని రూపొందించారు.అమ్మాయిలకు బెల్లీ డ్యాన్స్‌
పొందికైన ఆకృతి కోసం వ్యాయామం చేయాలనుకునే అమ్మాయిల ఎంపిక బెల్లీ డ్యాన్స్‌. ఎన్ని కొత్త డ్యాన్సులొచ్చినా దీని ప్రత్యేకత దీనిదేనంటున్నారు నిపుణులు. సొగసైన కదలికలతో సాగే ఈ నృత్యం శరీరానికి పూర్తి వ్యాయామాన్నిస్తుంది. ముఖ్యంగా స్త్రీలలో త్వరగా కొవ్వు పేరుకునే పొట్ట, తొడ భాగాలకు మంచి వ్యాయామమిది. ఆయా భాగాల్లో కొవ్వును కరిగించేయడమే కాక కండరాలను పటిష్ఠపరిచి చక్కటి ఆకృతినిస్తుంది. ఇది కూడా సంప్రదాయ నృత్యం నుంచి కొన్ని కదలికలను తీసుకుని రూపొందించిన వ్యాయామమే. ఈజిప్టుకి చెందిన అరబిక్‌ నృత్యాన్నీ ఆఫ్రో-బ్రెజిలియన్‌ నేపథ్యానికి చెందిన సాంబా నృత్యాన్నీ జోడించగా రూపొందిందే బెల్లీ డాన్స్‌ వ్యాయామం. శరీరభాగాలన్నీ తేలిగ్గా కదలడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది.ఏరియల్‌ యోగా తీరే వేరు!
యోగా అంటే కింద ఓ చాపేసుకుని కూర్చుని చేసే రకరకాల ఆసనాలే మనకు తెలుసు. కానీ అందులోనూ చాలా రకాలున్నాయి. ముఖ్యంగా ఫిట్‌నెస్‌ అభిమానులను అలరించే రకాలకైతే లెక్కేలేదు. ఇప్పటి నవతరం మరికొన్ని కొత్తరకాలను ఆవిష్కరిస్తోంది. లేటెస్ట్‌ ట్రెండ్‌ ఏరియల్‌ యోగాదే. పేదలు ఇళ్లల్లో చీరనే ఉయ్యాలగా కట్టి పసి పిల్లల్ని పడుకోబెడతారు కదా. అలా చీరలాంటి ఉయ్యాలనే పైనుంచి వేలాడదీసి దాన్ని ఆసరాగా చేసుకుని రకరకాల యోగాసనాలు వేస్తున్నారు. దాన్నే ఏరియల్‌ యోగా అంటున్నారు. శరీరానికి పూర్తి వ్యాయామాన్నిచ్చే ఈ యోగాలో మామూలు ఆసనాలతో పాటు నృత్యం, ఆక్రోబాటిక్స్‌కి చెందిన కొన్ని భంగిమలనూ కలిపారు. ఓ స్తంభం ఆసరాగా చేసే పోల్‌ యోగా కూడా ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతోంది. భారతదేశంలో ఎక్కువ మంది ఎంచుకుంటున్న వ్యాయామంగా యోగా ప్రథమ స్థానంలో నిలుస్తోందంటున్నారు నిపుణులు. వయసుతో నిమిత్తం లేకుండా అన్ని వయసుల వారూ చేయగలగడమూ, తక్కువ ఖర్చుతోనూ లేదా చాలా చోట్ల ఉచితంగానూ అందుబాటులో ఉండడమే అందుకు కారణం. యోగాలో కూడా శ్వాస వ్యాయామాలూ శరీరంలోని అన్ని అవయవాలూ తేలిగ్గా కదిలించడానికి వీలయ్యే ఆసనాలూ పెద్దవయసువారిని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. మానసిక ఒత్తిడి నుంచి విముక్తి పొందడానికీ చాలామంది యోగాని ఎంచుకుంటున్నారట.టబాటా... చాలా కష్టమట!
ఇజుమి టబాటా అనే జపాను శాస్త్రవేత్త రూపొందించిన వ్యాయామ పద్ధతి ఇది. ఒకేసారి ఎక్కువ కెలొరీలు కరుగుతాయి. త్వరగా బరువు తగ్గాలనుకునేవారు ఎక్కువగా ఎంచుకుంటున్నారు ఈ పద్ధతిని. అయితే అది చేయగల సామర్థ్యం ఉండాలి సుమా. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. శరీరాన్ని చాలా కష్ట పెట్టే వ్యాయామాలతో చేసే ఇది కేవలం నాలుగు నిమిషాల వర్కవుట్‌. దాన్ని మళ్లీ 8 సెషన్లుగా విభజిస్తారు. ఒక్కో సెషన్‌ 20 సెకండ్లు. ఒక్కో సెషన్‌కి మధ్య పది సెకండ్లు  విరామం. 20 సెకండ్లపాటు వేగంగా వ్యాయామం చేయడం, పది సెకండ్లు విశ్రాంతి తీసుకుని మళ్లీ చేయడం... అలా నాలుగు నిమిషాలు చేసేసరికి వేలాడబడిపోతారు. అందుకే దీనిని హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్‌ ట్రైనింగ్‌ అని కూడా అంటారు. తక్కువ సమయంలో బరువు తగ్గాల్సినవారు అన్ని జాగ్రత్తలూ తీసుకుని శిక్షకుల పర్యవేక్షణలో ఈ వ్యాయామాన్ని చేయాలి.పరుగు వీరులు పెరుగుతున్నారు!
మారథాన్‌ల ట్రెండ్‌ ఇప్పుడు మన నగరాలన్నింట్లోనూ ఊపందుకుంది. రకరకాల అంశాలపైన అవగాహనకోసం చేసే మారథాన్‌లే కాక తాజా ఫిట్‌నెస్‌ ట్రెండ్‌గా కూడా ఇది ప్రజాదరణ పొందుతోంది. దీనికి ప్రత్యేకమైన ఖర్చుండదు. పరుగుకు అనువుగా వదులైన దుస్తులూ మంచి బూట్లూ ధరిస్తే చాలు. ఆరుబయట తాజా గాలి పీలుస్తూ పరుగు పెట్టవచ్చు. పైగా చాలా మంది కలిసి చేస్తారు కాబట్టి పరిచయాలూ పెరుగుతాయి. అందుకే మారథాన్‌ రన్నర్లు పెరుగుతున్నారు. పరుగు ప్రారంభించేటప్పుడు శిక్షకుల సలహాలు తీసుకోవాలి. మూడు కిలోమీటర్లతో మొదలుపెట్టి ఎలాంటి సమస్యలూ లేకుండా పరుగెట్టడం అలవాటయ్యాక 5, 10... ఇలా పెంచుకుంటూ పోవచ్చు. వ్యాయామం కింద దీన్ని పరిగణించేవారు వారానికి రెండు రోజులు రన్నింగ్‌ చేస్తుంటే కొందరు సీరియస్‌గా సాధన చేసి పోటీలకూ వెళ్తున్నారు. పింకథాన్‌ పేరుతో మహిళలకోసం ప్రత్యేక మారథాన్లూ నిర్వహిస్తున్నారు.పెద్దల కోసం ‘ఫంక్షనల్‌ ఫిట్‌నెస్‌’
నాలుగు పదులు నిండాయో లేదో అప్పుడే కీళ్ల నొప్పులు మొదలు. బస్సు ఎక్కుతుంటే మోకాళ్లు నొప్పి పెట్టేస్తున్నాయి. అటక మీదనుంచి ఏదో తీయబోతే భుజం పట్టేసింది... ఇలాంటి మాటలు ఇళ్లల్లో తరచూ వింటూనే ఉంటాం. ఇందుకు కారణం మన జీవనశైలే. ఉద్యోగాలు చేసేవాళ్లు గంటల తరబడి సీట్లలో కూర్చుంటారు. కొందరు గంటల తరబడి నిలబడి ఉద్యోగాలు చేస్తుంటారు. ఇక ఇళ్లల్లో ఉన్నవారు కూడా పనులు ముగించి టీవీ ముందు కూర్చుంటే గంటలు గడిచిపోతాయి. అందుకే కీళ్లూ, కండరాలూ ఎక్కడికక్కడ బిగుసుకుపోయి కదలాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది పెడుతుంటాయి. శరీరం బ్యాలన్స్‌ కోల్పోతుంటుంది. కండరాల మధ్య సమన్వయం దెబ్బతింటుంది. ఇలాంటి సమస్యల్ని అధిగమించేందుకు తోడ్పడేవే ఫంక్షనల్‌ ఫిట్‌నెస్‌ వ్యాయామాలు. ఒకే సెషన్‌లో వేర్వేరు రకాల వ్యాయామాలను చేయించడం ద్వారా రోజువారీ పనులు తేలిగ్గా చేసుకోడానికి శరీరం సహకరించేలా చేస్తారు.
నీళ్లలో... నొప్పుల్లేకుండా...
గాయాలూ కీళ్లకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు అందరిలా చురుగ్గా ఉండలేరు. అన్ని పనులూ చేసుకోలేరు. పరిమితమైన కదలికలే సాధ్యం కనుక వారు వ్యాయామానికి దూరంగా ఉంటారు. అలాంటి వారికి వరం ఆక్వా ఏరోబిక్స్‌. నడుం నొప్పితో సహా ఎలాంటి సమస్యలున్నవారైనా ఇవి చేయవచ్చు. నీళ్లలో నిలబడి డంబెల్స్‌తో, రకరకాల పరికరాలతో చేసేలా వీరికోసం పలు వ్యాయామాలు రూపొందించారు. క్రమం తప్పకుండా ఆక్వా ఏరోబిక్స్‌ చేస్తే శరీరాన్ని క్రమంగా పూర్తిగా అదుపులోకి తెచ్చుకోవచ్చు. ఇబ్బంది పడకుండా సాధారణ పనులన్నీ చేసుకోవచ్చు.
కొత్తగా కావాలా?
ఇవేవీ కాకుండా విభిన్నంగా ఏమన్నా చేయాలనుకుంటున్నారా? అయితే ఇవి మీకోసమే...
* ఫారెస్ట్‌ వాక్‌: స్వేచ్ఛగా తాజా గాలిని పీలుస్తూ అడవుల్లో చెట్ల మధ్య నడవడం ఎంతో హాయినిస్తుందంటున్నారు జపనీయులూ, నార్వేవాసులూ.
* ప్రామా: లైట్లూ, తాకే తెర లాంటి నేల, రకరకాల పరికరాలు అమర్చిన గోడలతో ప్రామా స్టూడియో ఓ మాయాబజారులా ఉంటుంది. 45 నిమిషాల సెషన్‌లో మొత్తం శరీరానికి అవసరమైన వర్కవుట్‌ చేయొచ్చు. వ్యాయామాలన్నీ ఉత్సాహభరితంగా సరదాగా ఉంటాయి.
* బూట్‌క్యాంప్‌: ఒకప్పుడు మిలిటరీ వాళ్లకోసం పెట్టిన ఈ క్యాంపులను ఇప్పుడు ఎక్కువగా క్రీడాకారుల కోసం నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్నవాళ్లెవరైనా చేరవచ్చు. భౌతిక, మానసిక ఫిట్‌నెస్‌ విషయంలోనే కాక టీమ్‌ వర్క్‌, ఒత్తిడిని ఎదుర్కొనడం లాంటి చాలా విషయాలు నేర్పిస్తారు.
* డ్యాన్స్‌ ద డిస్టెన్స్‌: మామూలుగా నడవకుండా నృత్యం చేస్తూ నడవడమన్న మాట. ఉదాహరణకు 5 కి.మీ. నడవాలనుకుంటే కిలోమీటరుకు ఒక రకం డ్యాన్స్‌ చొప్పున చేస్తూ వెళ్లాలి. మీ ఇష్టం, ఏ డ్యాన్స్‌ అయినా చేయొచ్చు.
* ప్లాగింగ్‌... రోడ్డుమీద పరుగెడుతూ దారిలో కన్పించిన చెత్తనంతా ఏరుతూ వెళ్లడమన్నమాట. అంటే ఇటు వ్యాయామమూ అటు స్వచ్ఛభారత్‌ ఒకేసారి అయిపోతాయి.
రూ.లక్ష కోట్లు
2017లో మనదేశంలో ఫిట్‌నెస్‌ మార్కెట్‌ విలువ రూ.95వేల కోట్లు. ఈ ఏడాది అది లక్ష కోట్లు దాటనుంది. ఫిట్‌నెస్‌ మార్కెట్‌ ఏటా 22-30 శాతం మధ్య అభివృద్ధి చెందుతోందంటున్నారు సెలెబ్రిటీ ఫిట్‌నెస్‌ ఎక్స్‌పర్ట్‌ వినోద్‌ చన్నా. ఫిట్‌నెస్‌ ట్రెండ్స్‌ లాగే వినియోగదారుల్లోనూ మార్పు కన్పిస్తోందట. ఒకప్పుడు ఆడవాళ్లు ఫిట్‌నెస్‌వైపు చూడడం అరుదు. ఇప్పుడు వ్యాయామం చేస్తున్నవారిలో 40 శాతానికిపైగా మహిళలే ఉంటున్నారట. ఇక వ్యాయామాన్ని తప్పనిసరిగా ఎంచుకుంటున్నవారిలో అత్యధిక శాతం వృత్తినిపుణులే. ఆ తర్వాత విద్యార్థులూ వ్యాపారవేత్తలూ గృహిణులూ వస్తారు. బరువు తగ్గడానికి వ్యాయామం చేస్తున్నవారి శాతం 42 కాగా ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండడానికి వ్యాయామాన్ని ఎంచుకుంటున్నవారు 53 శాతం. ఒత్తిడి తగ్గడానికీ, సాధారణ దేహదారుఢ్యమూ శక్తి సామర్థ్యాలూ పెంచుకోడానికీ చాలామంది వ్యాయామాన్ని ఎంచుకుంటుంటే నిద్ర బాగా పట్టడానికి 16 శాతం వ్యాయామం చేస్తున్నారట.

*     *      *      *      *

ఒక చిన్న వీడియో. తెర మీద రెండు దృశ్యాలు కన్పిస్తూ ఉంటాయి. రెండిట్లోనూ ఏడుపదులు దాటిన తాతయ్యలే. ఓ తాత చక్కగా బూట్లేసుకుని సైక్లింగ్‌కి వెళతాడు. రెండో దాంట్లో తాతని ఆస్పత్రిలో పరీక్షల కోసం చక్రాల కుర్చీలో తిప్పుతుంటారు. మొదటి తాతయ్య మనవరాళ్లతో ఆడుకుంటాడు. టిప్‌టాప్‌గా టై కట్టుకుని తయారై పార్టీకి వెళతాడు. భార్యాభర్తలిద్దరూ పార్టీలో సరదాగా గడిపి వచ్చి హాయిగా పడుకుంటారు. రెండో దాంట్లో తాతకి గాలి పీల్చుకోడానికీ, ఆహారం తీసుకోడానికీ గొట్టాలు బిగించివుంటాయి. ఆయన అసహాయ స్థితి చూసి భార్య కుమిలిపోతుంటుంది.
సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన నిమిషం వ్యవధిగల ఈ వీడియోని కెనడాకి చెందిన హార్ట్‌ అండ్‌ స్ట్రోక్‌ ఫౌండేషన్‌ రూపొందించింది. ‘జీవితంలో చివరి దశాబ్దాన్ని ఎలా గడపాలనుకుంటున్నారు’ అని ప్రశ్నిస్తూ ‘క్రమం తప్పక వ్యాయామం చేస్తే ఇలా, చెయ్యకపోతే అలా’ అని హెచ్చరిస్తూ పరోక్షంగా వ్యాయామం ప్రాధాన్యాన్ని వివరిస్తుందీ వీడియో. మరి, మీరెలా గడపాలనుకుంటున్నారు..?


ప్రతి అడుగునూ లెక్కపెడుతుంది!

సాంకేతికత తోడుగా ఫిట్‌నెస్‌ రంగం ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. డాక్టరు నడవమన్నాడని- వీధి చివరికెళ్లి కూరగాయలు తెస్తాను, పిల్లవాడిని ట్యూషన్లో దింపి వస్తాను... అంటే కుదరదు. ఫిట్‌నెస్‌ స్మార్ట్‌ వాచ్‌ని చేతికి పెట్టుకుంటే చాలు రోజు మొత్తమ్మీద మీరు ఎన్ని అడుగులు వేసిందీ లెక్కపెట్టి చెప్పేస్తుంది. ఇదే కాకుండా ఫోన్‌లో పెట్టుకునే ఆప్స్‌, యాక్టివిటీ ట్రాకర్స్‌, హార్ట్‌రేట్‌ మానిటర్‌ లాంటివి కూడా ఉన్నాయి. ఎంతసేపు నడిచిందీ, ఎంతసేపు వ్యాయామం చేసిందీ, ఎన్ని కెలొరీలు కరిగిందీ... అన్నీ చెప్తాయివి. ఇటీవలే విడుదలైన ‘మోటివ్‌ రింగ్‌’ అయితే నాజూగ్గా వేలికి ఒదిగిపోయి పైన చెప్పిన సమాచారాన్నంతా ఇస్తుంది. ఆన్‌లైన్లోనూ ఫిట్‌నెస్‌ సేవలు అందుబాటులో ఉంటున్నాయిప్పుడు. ఎలా అంటారా... స్కైప్‌లో! ముంబయి, దిల్లీ, బెంగళూరులాంటి నగరాల్లో ఇలా స్కైప్‌ ద్వారా ట్రైనర్‌ సూచనలు అందుకుంటూ వ్యాయామాన్ని కొనసాగిస్తున్నారట  చాలామంది. కొంతమంది ఫిట్‌నెస్‌ శిక్షకులు తమ వినియోగదారులకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని చాట్‌బాట్‌ని కూడా వినియోగిస్తున్నారు. వ్యాయామం చేసేటప్పుడు వచ్చే ఎలాంటి సందేహాన్నైనా దీని ద్వారా శిక్షకుడిని అడిగి నిమిషాల్లో నివృత్తి చేసుకోవచ్చు.


ఇలాగైతే... మానరు!

రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలని కొత్త సంవత్సరం రోజున తీసుకున్న నిర్ణయాన్ని వారం తిరిగే సరికే పక్కనపెట్టేశారా? లేక రెండువారాలకే మొహం మొత్తేసిందా? అలా జరగకుండా చూడడానికీ కొన్ని పద్ధతులున్నాయి.
* వ్యాయామం చేసేటప్పుడు ధరించడానికి మంచి దుస్తులూ, బూట్లూ కొనుక్కోండి. వాటిని ధరించడం కోసమైనా వ్యాయామానికి వెళ్తారు.
* వ్యాయామం చేసేటప్పుడు తరచుగా ఓ సెల్ఫీ దిగి సోషల్‌ మీడియాలో ఫ్రెండ్స్‌తో షేర్‌ చేసుకుంటూ ఉండండి. ప్రోత్సహిస్తూ వాళ్లు చేసే కామెంట్స్‌ మీ ఉత్సాహాన్ని పెంచుతాయి.
* ఒంటరిగా కాకుండా స్నేహితులతోనో, జీవిత భాగస్వామితోనో కలిసి వ్యాయామం ప్లాన్‌ చేసుకోవాలి. కబుర్లు చెప్పుకుంటూ వెళ్లిరావచ్చు. విసుగనిపించదు. ఫిట్‌నెస్‌ గ్రూప్స్‌ ఇప్పటి ట్రెండ్‌. వాకర్లు, మారథానర్లు, ట్రెక్కర్లు, సైక్లిస్టులు... ఇలా రకరకాల గ్రూపులుగా ఏర్పడి కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారు.
* నెల రోజులు చేసినా ఫలితం కన్పించలేదని మానెయ్యాలనుకుంటున్నారా... అయితే ఒక్కసారి ఇంటర్నెట్‌లోకి వెళ్లి ఫిట్‌నెస్‌ గురించి ప్రముఖులు అన్న మాటలు (కోట్స్‌) చదవండి. తప్పకుండా ప్రేరణ లభిస్తుంది. ఏమో ఏడాది తిరిగేసరికి కొత్త కోట్స్‌ రాసి మీరే మరికొందరికి ప్రేరణ అవుతారేమో!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.