close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాయకత్వం వ్యక్తిలోనే ఉంటుంది!

టీసీఎస్‌... టాటా గ్రూప్‌తోపాటు, దేశ ఐటీ రంగానికీ ప్రతిష్ఠాత్మకమైన కంపెనీ.  దాదాపు రూ.8లక్షల కోట్ల మార్కెట్‌ విలువను అందుకున్న ఈ సంస్థకు ఎండీ, సీఈఓ రాజేష్‌ గోపీనాథన్‌. గతేడాది ఫిబ్రవరిలో ఈ బాధ్యతలు తీసుకున్న 46ఏళ్ల రాజేష్‌ కంపెనీని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. చిన్న వయసులోనే అంత పెద్ద బాధ్యతలు చేపడుతున్న రాజేష్‌ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు...

అదే మలుపు...

కేరళలోని తిరుచ్చూరు రాజేష్‌ సొంతూరు. రైల్వే ఉద్యోగి అయిన తండ్రి గోపీనాథన్‌ లఖ్‌నవూలో పనిచేయడంతో రాజేష్‌ ఇంటర్మీడియెట్‌ వరకూ అక్కడే చదువుకున్నాడు. ఆపైన తమిళనాడులోని తిరుచ్చి ఎన్‌ఐటీ(టీసీఎస్‌ మాజీ సీఈఓ 
ఎన్‌.చంద్రశేఖరన్‌ చదివిందీ ఇక్కడే) నుంచి ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌్్స ఇంజినీరింగ్‌, ఐఐఎమ్‌-అహ్మదాబాద్‌ నుంచి ఎంబీఏ చేశారు. 1996లో ‘టాటా స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌ గ్రూప్‌’లో చేరి, గ్రూపులోని వివిధ కంపెనీల్లో పనిచేశాక 1999లో టీసీఎస్‌కి వచ్చారు. 2001లో టీసీఎస్‌లో పూర్తిస్థాయి ఉద్యోగిగా మారారు. అదే తనకి టర్నింగ్‌ పాయింట్‌ అంటారు. 

చంద్ర శిష్యరికం...

‘చంద్ర... ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచిస్తారు. ఏ విషయంలోనూ ఎవర్నీ వేలెత్తిచూపరు. ఆయన బృందంలోని మేమంతా అదే తరహా పని విధానాన్ని అలవాటు చేసుకున్నాం. లక్ష్యాల్ని చేరుకోవడంలో బృందంలో అందరికంటే తనే ఎక్కువ బాధ్యత తీసుకుంటారు. అది బృంద సభ్యులు మరింత కష్టపడి పనిచేసేలా చేస్తుంది’ అంటారు రాజేష్‌. టాటా గ్రూప్‌ ఛైర్మన్‌గా చంద్ర ఇప్పుడు చాలా బిజీ. అయినా కూడా రాజేష్‌ మాట్లాడాలనుకుంటున్నట్టు చెబితే వెంటనే స్పందిస్తారట.

పిల్లలతో బిజీ...

రాజేష్‌ ఉండేది ముంబయిలో. ఆయన శ్రీమతి లక్ష్మి ఆర్కిటెక్ట్‌. ఐఐటీ బాంబేలో పీహెచ్‌డీ చేస్తున్నారు. వీరికి ఓ అమ్మాయి, ఓ అబ్బాయి. ‘పిల్లలతో రోజూ ఉదయాన్నే ఎక్కువ టైమ్‌ గడపడానికి చూస్తాను. సీఈఓ అయ్యాక మొదటి ఏడాది ప్రయాణాలతో బిజీ అయిపోయాను. దాంతో కుటుంబానికి తగినంత టైమ్‌ కేటాయించలేకపోయాను. ఇప్పుడు ప్రయాణాలు తగ్గాయి. వాళ్లకీ టైమ్‌ ఇవ్వగలుగుతున్నాను’ అని చెప్పే రాజేష్‌ ఆరోగ్యం కోసం వాకింగ్‌ చేస్తానంటారు. 
ఆటవిడుపుకోసం పుస్తకాలు చదువుతారు, సినిమాలు చూస్తారు.

వ్యవస్థ పనిచేస్తుంది

సీఈఓ కాబోతున్నట్టు రాజేష్‌కి కొద్దిరోజుల ముందే తెలిసిందట. అయినా బాధ్యతలు తీసుకోవడానికి తానేమీ భయపడలేదంటారు. ‘50 ఏళ్ల టీసీఎస్‌ చరిత్రలో నాలుగో సీఈఓని. అందరూ గ్రూప్‌నుంచి ఎంపికైనవాళ్లే. కంపెనీ పాలసీలు కొనసాగిస్తూనే, వాళ్ల ధోరణిలో పనిచేశారంతా. టీసీఎస్‌లో పైస్థాయి మేనేజ్‌మెంట్లో ఉండేవారెవరికైనా కంపెనీని నడపగలిగే సామర్థ్యం ఉంటుంది. దానికితోడు సంస్థలో నిర్ణయాలు ఏకపక్షంగా కాకుండా బృందంగా జరుగుతాయి. కాబట్టి నేను టెన్షన్‌ పడలేదు. నిజానికి సీఎఫ్‌ఓ కంటే కూడా సీఈఓ మీద ఒత్తిడి తక్కువ ఉన్నట్లనిపిస్తోంది’ అని చెబుతారు రాజేష్‌. ‘ద ఎఫెక్టివ్‌ ఎగ్జిక్యూటివ్‌’, ‘ఇన్వెంటెడ్‌ లైఫ్‌’ లాంటి మేనేజ్‌మెంట్‌ పుస్తకాలు చాలా చదివిన ఆయన ‘నాయకత్వం పుస్తకాల నుంచి చదివి నేర్చుకునేదికాదు, చాలావరకూ వ్యక్తిలోనే ఉంటుంది’ అంటారు.

భవిష్యత్తు ప్రణాళిక

ప్పటివరకూ టీసీఎస్‌ ఖాతాదారులు సంస్థ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి తమ వ్యాపార సేవలు అందించేవారు. ఇకముందు సాఫ్ట్‌వేర్‌ సేవలకే పరిమితం కాకుండా వారి ఉత్పత్తుల తయారీలోనూ భాగమయ్యేలా ప్రణాళికలు వేస్తున్నామంటారు రాజేష్‌. ‘భవిష్యత్తులో కార్ల తయారీలో సాంకేతికత పాత్ర మూడింట ఒక వంతు ఉంటుంది. ఆ సాంకేతికతను మేం అందించి ఖాతాదారుల ఉత్పత్తుల తయారీలో భాగమవుతాం. ఇప్పటికే ఫార్మా, వైద్య పరికరాల తయారీ, మీడియా, టెలికాం రంగాల్లో మేం ఆ విధంగా పనిచేస్తున్నాం’ అని తన భవిష్యత్తు ప్రణాళికను వివరిస్తారు రాజేష్‌.

మేనేజ్‌మెంట్‌వైపు...

టీసీఎస్‌లో మొదట సిలికాన్‌ వ్యాలీలో ఈ-బిజినెస్‌ వ్యవహారాల్ని చూసేవారు. 2005లో ఇండియాకి తిరిగొచ్చాక కంపెనీ ఆపరేషన్స్‌ విభాగంలో విధులు నిర్వర్తించేవారు. 2008లో కొత్తగా ‘బిజినెస్‌ ఫైనాన్స్‌’ అనే విభాగాన్ని ప్రారంభించి వైస్‌ ప్రెసిడెంట్‌ హోదాలో కంపెనీలోని అన్ని విభాగాల ఆర్థిక ప్రణాళికల్నీ చూసేవారు. 2013లో సీఎఫ్‌ఓగా బాధ్యతలు తీసుకున్నారు. 2017లో సీఈఓగా పదోన్నతి పొందారు రాజేష్‌.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.