close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మీకూ ఉండాలో ‘ఇమేజ్‌’!

మీకూ ఉండాలో ‘ఇమేజ్‌’!

నిండు రంగు కోటు, మెడలో రంగు రంగుల స్కార్ఫ్‌... కిరణ్‌ మజుందార్‌షా ఎంచుకున్న వృత్తిలాగే వస్త్రధారణా విభిన్నమే. చక్కటి సూటూ సిల్క్‌ టైలతో రతన్‌టాటాని చూడగానే బాధ్యతాయుతమైన పారిశ్రామికవేత్త అన్న భావం కలిగి తీరుతుంది. తెల్లని బెంగాల్‌ కాటన్‌ చీరా భుజానికో సంచీతో ఆవేశానికీ నిరాడంబరత్వానికి ప్రతీకగా కన్పిస్తారు మమతా బెనర్జీ. చేతుల్లేని కోటుతో మోదీ, చీర మీద కోటు వేసుకునే సుష్మా... ఇలా తలచుకోగానే గుర్తొచ్చే ప్రత్యేక ఇమేజ్‌ వారి సొంతం! మరి మీకూ ఉందా ఓ ఇమేజ్‌?  

దువైపోయింది. కాలేజ్‌ టాపర్‌గా పట్టా చేతికొచ్చింది. ఉద్యోగ వేట మొదలయింది. మూడు నెలలు... ఆరు నెలలైనా ఫలితం లేదు. యావరేజ్‌ మార్కులతో పాసైనవారు ఉద్యోగాల్లో చేరిపోయారు. కానీ కాలేజీ టాపర్‌కి ఉద్యోగం రాలేదు! తల వంచుకుని తన పనేదో తాను చూసుకోవడం తప్ప మరో విషయం పట్టని తనకే ఇలా ఎందుకవుతోందో అతనికి తెలియడం లేదు. ఇంటర్వ్యూకి వెళ్తోంటే కాళ్లు వణుకుతున్నాయి. మాట తడబడుతోంది. కంగారులో ఒకటడిగితే ఇంకొకటి చెబుతున్నాడు. అందుకే వెళ్లిన ప్రతిచోటా ‘సారీ, బెటర్‌ లక్‌ నెక్ట్స్‌ టైమ్‌...’ అంటున్నారు. ఆందోళనగా మొదలై కుంగుబాటుకి దారితీస్తున్న పరిస్థితి.
‘పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ క్లాసులకు వెళ్లు’ ‘స్పోకెన్‌ ఇంగ్లిష్‌ నేర్చుకో...’ ‘సైకియాట్రిస్టు అప్పాయింట్‌మెంట్‌ తీసుకోమంటావా?’
‘ఇమేజ్‌ కన్సల్టెంట్‌ని కలవకపోయావా?’... స్నేహితుల సలహాలు. కాలేజీ టాపర్‌కి ఈ సలహాల అవసరం ఎందుకొచ్చిందంటే... ఉద్యోగానికి చదువొక్కటే సరిపోదు కాబట్టి. ఉద్యోగం చిన్నదైనా పెద్దదైనా- దేని అవసరాలు దానికుంటాయి. వాటన్నిటినీ మించి ఆత్మవిశ్వాసం ప్రతి మనిషికీ కావాలి. అది మనిషిని చూడగానే కన్పించాలి. అందుకే సర్టిఫికెట్లలో ఎన్ని డిస్టింక్షన్లు ఉన్నా మనకంటూ ఓ ప్రత్యేక ‘ఇమేజ్‌’ కూడా సంపాదించుకోవాలి. అది ఉంటేనే ఉద్యోగానికి సర్వసన్నద్ధత ఉన్నట్లంటున్నారు నిపుణులు.
ఏమిటీ ‘ఇమేజ్‌’!
ఒకప్పుడు ‘ఇమేజ్‌’ అన్న పదాన్ని సినిమా వారి గురించి మాట్లాడుకునేటప్పుడే వాడేవారు. కానీ ఇప్పుడలా కాదు. ఈ బ్రాండెడ్‌ యుగంలో వస్తువులకి లాగే ప్రతి మనిషికీ ఒక ఇమేజ్‌ కావాలి. ఉదాహరణకి మీరో సూపర్‌ మార్కెట్‌కి వెళ్తారు. అక్కడ టూత్‌ పేస్ట్‌ నుంచి తేనె దాకా, కర్చీఫ్‌ నుంచి కందిపప్పు దాకా ఒక్కో వస్తువూ పలు బ్రాండ్ల పేర్లతో కన్పిస్తుంది. వాటిల్లోనుంచి మనకు నమ్మకమున్న బ్రాండ్‌ ఉత్పత్తినే ఎంచుకుంటాం. క్లోజప్‌ టూత్‌పేస్టే ఎందుకూ అంటే- మిగతా టూత్‌ పేస్టుల్లో లేనిదీ అందులో ఉన్నదీ ఏదో మనకు నచ్చింది కాబట్టే కొంటున్నాం. అదే సిద్ధాంతం మనుషులకూ వర్తిస్తుంది. ఏటా కొన్ని వేల మంది డిగ్రీనో, ఇంజినీరింగో మరొకటో చదివి పట్టా పుచ్చుకుని బయటకు వస్తున్నారు. అందరికీ ఫేస్‌బుక్‌లో, లింక్డ్‌ఇన్‌లో, ట్విటర్లో ఖాతాలుంటాయి. సినిమాలూ, క్రికెట్టూ... అందరివీ అవే హాబీలు. ఈ అందరిలో మనమూ ఒకరైతే ఏమిటి ప్రయోజనం? వస్తువు ప్రాధాన్యం వినియోగం వరకే. కానీ బ్రాండ్‌ ప్రాధాన్యం మనసుతో ముడిపడుతుంది. అందుకే నిద్రలో లేపి అడిగినా మనం వాడే బ్రాండ్ల పేర్లు చెప్పేస్తాం. అలాగే సంస్థల్లో, వ్యాపారాల్లో ఏవైనా నైపుణ్యాల ప్రస్తావన వచ్చినప్పుడు మన పేరు గుర్తొస్తేనే... మనకో ఇమేజ్‌ ఉన్నట్లు. గుంపులో గోవిందయ్యలకు ఇమేజ్‌ ఉండదు. ‘జనమందరిలో మనమెవరంటే తెలిసుండాలి... ఒక విలువుండాలి.
ఘనచరితలు గల కొందరిలో మన పేరుండాలి... ఒక ప్లేసుండాలి’ అని పాడుకున్న రంగీలా పాట గుర్తులేదూ. మరి అలాంటి గుర్తింపు ఎలా వస్తుంది? అది ఒక్కసారిగా రాదు, ఒక్క లక్షణంతో రాదు. అందుకు కొన్ని నేర్చుకోవాలి, కొంత కష్టపడాలి.
రూపం కన్నా గుణం ముఖ్యమే. అలాగని రూపాన్ని నిర్లక్ష్యం చేయనక్కర్లేదు. ఎందుకంటే మనిషిని చూడగానే కన్పించే రూపమే ఈ రోజుల్లో గుణగణాల్ని కూడా తెలిపేస్తోంది. మనిషి రూపమూ ధరించే దుస్తులూ మాట్లాడే విధానమూ నడక తీరూ బాడీ లాంగ్వేజ్‌ అన్నీ కలిసి అతడి గురించి ఎదుటివారిలో ఓ ఇమేజ్‌ని ఏర్పరుస్తాయి. ఉన్నత విద్యార్హతలూ ప్రవర్తనా ఆ ఇమేజ్‌ని మరింత పెంచుతాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య తొలి పరిచయంతో ఈ ఇమేజ్‌ ఏర్పడే క్రమం ఆసక్తికరం.
తొలిచూపు తోరణమే!
తొలి చూపు తోరణమాయే... కల్యాణకారణమాయే... అంటూ వేటూరి ఓ సినిమా పాటలో  ప్రాసకోసం రాసినా తొలిచూపుకి చాలానే సీనుందని ప్రేమికులే కాదు సైకాలజిస్టులూ అంటున్నారు. అది నిజంగానే ఎదుటివ్యక్తి గురించిన సమాచారానికి స్వాగత తోరణమేనట. ఒక్క ప్రేమలోనే కాదు, ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు మొదటిసారి చూసినప్పుడు ఏర్పడే అభిప్రాయం వారి మధ్య ఏర్పడబోయే బంధంలో కీలక పాత్ర పోషిస్తుందని మనస్తత్వ శాస్త్రం చెబుతోంది. అలా తొలిసారి చూసినప్పుడు ఒకే సమయంలో ఎదుటి వ్యక్తికి సంబంధించిన చాలా అంశాలను మెదడు గమనించి వాటిని క్రోడీకరించి ఒక అభిప్రాయం ఏర్పరుస్తుందట. దాన్నే ఫస్ట్‌ ఇంప్రెషన్‌ అంటున్నారు. రంగూ రూపూ భాషా యాసా శరీర కదలికలూ నడక తీరూ... ఇలాంటివన్నీ ఒక్కక్షణంలో చూసి ఏర్పర్చుకునే అభిప్రాయం కాబట్టి ఫస్ట్‌ ఇంప్రెషన్‌కి చాలా ప్రాధాన్యముంటుందనీ, అందుకనే ‘ఫస్ట్‌ ఇంప్రెషన్‌ ఈజ్‌ ద బెస్ట్‌ ఇంప్రెషన్‌’ అన్న మాట వచ్చిందనీ నిపుణులు అంటున్నారు. పరీక్ష తప్పితే బెటర్‌మెంట్‌ రాయొచ్చేమో కానీ ఈ ఫస్ట్‌ ఇంప్రెషన్‌లో విఫలమైతే మాత్రం రెండో అవకాశం ఉండదు. ఎవరైనా సరే మరో వ్యక్తి గురించి తొలి అభిప్రాయం ఏర్పరచుకోవడానికి ఏడు సెకన్లు చాలంటారు సైకాలజిస్టులు. అంతకూడా అక్కర్లేదు సెకన్లో పదో వంతు చాలంటున్నారు ఆధునిక పరిశోధకులు. పైగా ఎదుటి వ్యక్తి ఎంత నిజాయతీగా ప్రవర్తిస్తే అవతలివారిలోనూ అంతే నిజాయతీ గల అభిప్రాయం ఏర్పడుతుందట. మిగతా సందర్భాల్లో ఈ తొలి అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశంఉన్నా ఉద్యోగానికి ఇంటర్వ్యూ విషయంలో మాత్రం ఫస్ట్‌ ఇంప్రెషన్‌ది చాలా పెద్ద పాత్ర అంటున్నారు నిపుణులు.

చూస్తే చాలు...
ఆవులిస్తే పేగులు లెక్కపెట్టగలడు... అనేవారు పెద్దలు విపరీతమైన తెలివితేటలు గలవాళ్లని చూసి. ఆ పని కూడా అక్కర్లేదు, మనిషిని అలా ఓ చూపు చూసి అతనేమిటో అంచనా వేయగలం అంటున్నారు ఈ తరం నిపుణులు. ఒక వ్యక్తి మాట్లాడకుండా తన మానాన తాను కూర్చుని ఉంటే చాలు... అతడిని చూసి- అంతర్ముఖుడా కాదా, భావోద్వేగపరంగా ఏమాత్రం స్థిరత్వం ఉందీ, ఏపాటి ఆత్మస్థైర్యం ఉందీ లాంటి విషయాలన్నీ అంచనా వేయొచ్చట. పైగా అలా అంచనా వేయగల సామర్థ్యం మహిళల్లో ఎక్కువట. అందుకే చాలా ఇంటర్వ్యూ బోర్డుల్లో తప్పనిసరిగా ఒక మహిళా సభ్యురాలు ఉండేలా చూసుకుంటాయట సంస్థలు.
ఇలా కొద్ది క్షణాల్లో... చూడగానే మన గురించి ఎదుటివాళ్లు మంచి అభిప్రాయం ఏర్పర్చుకోవాలంటే ఎంత పర్‌ఫెక్ట్‌గా కనపడాలి? అందుకే ఇమేజ్‌ కన్సల్టెంట్‌లకు అంత డిమాండు. సినిమా తారలూ, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలూ, రాజకీయనాయకులూ తమకోసం ప్రత్యేకంగా ఇమేజ్‌ కన్సల్టెంట్‌లను నియమించుకుంటుంటారు. వాళ్లు అనుక్షణం వెంటవుండి వ్యక్తిత్వాన్నీ, వృత్తిపరమైన అవసరాల్నీ పరిశీలించి వాటికి తగినట్లుగా తమ కస్టమర్ల ‘ఇమేజ్‌’ని తీర్చిదిద్దుతారు. ఎలాంటి దుస్తులు ధరించాలన్న దగ్గర్నుంచీ ఎవరిని ఎలా పలకరించాలీ, ఎలాంటి హావభావాలు ప్రకటించాలీ, బాడీ లాంగ్వేజ్‌ ఎలా ఉండాలీ, పార్టీల్లో ఎలా మసలుకోవాలీ... ఇలాంటివెన్నో నేర్పిస్తారు. ఇప్పుడు అన్ని ఉద్యోగాల విషయంలోనూ ఇమేజ్‌ ప్రధానపాత్ర పోషిస్తోంది. ఎవరైనా మన గురించి తొలిచూపులోనే మంచి అభిప్రాయం ఏర్పరచుకోవాలంటే అందుకు అవసరమైన ‘విన్నింగ్‌ ఇమేజ్‌’ని ముందుగా సంపాదించుకోవాల్సిందే. అందుకే ఇమేజ్‌ కన్సల్టెన్సీ అనేది ఈ తరానికి చెందిన కొత్త వృత్తిగా ఆదరణ పొందుతోంది.

ఆ ‘ఇమేజ్‌’ సంపాదించాలంటే...
కట్టూబొట్టూతో మొదలుపెట్టి వీనుల విందుగా మాట్లాడడం వరకూ ప్రతి అడుగూ ఆచితూచి వేస్తేనే ఎవరికి వారు తమదైన ‘ఇమేజ్‌’ని సృష్టించుకోగలుగుతారు. అందుకు నిపుణులు చెప్తున్న కొన్ని సూచనలు...
* దుస్తులు సౌకర్యంగా, హుందాగా ఉండాలి. కొట్టొచ్చినట్లు కన్పించకూడదు కానీ అందరిలో ప్రత్యేకంగా కన్పించాలి. వాతావరణానికీ సందర్భానికీ ముఖ్యంగా ధరించినవారి ఆకృతికీ నప్పాలి. వీటితో పాటు వ్యక్తిగత అభిరుచిని ప్రతిబింబించే ఒక యాక్సెసరీని వస్త్రధారణలో భాగం చేసుకుంటే అది మీ ట్రేడ్‌మార్కులా నిలిచిపోతుంది.
* నిటారుగా నిలబడడం, నడవడం, సరైన పద్ధతిలో కరచాలనం చేయడం ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి. కొత్తవారికి మన దేహభాష చాలా విషయాలు చెప్పేస్తుంది. చేతులు కట్టుకోవడమూ కుర్చీలో వంగిపోయి కూర్చోవడమూ ఎదుటివారి పట్ల అనాసక్తిని తెలుపుతాయి. చేత్తో ముఖాన్ని రుద్దుకోవడమూ టేబుల్‌ మీద దరువేయడమూ ఇతరుల మీద పడిపోయినంత దగ్గరగా నిలబడడమూ లాంటివి... చేయకూడని పనులు.
* మాట్లాడుతున్నప్పుడు గొంతు భయంతో వణకకూడదు. గొణిగినట్లుగానో, అరిచినట్లుగానో చెప్పకూడదు. హడావుడిగానో, అతినిదానంగానో మాట్లాడకూడదు. స్పష్టంగా సూటిగా మాట్లాడాలి.
* ఆలోచనలకన్నా వాటిని తెలిపే పదాలకి ప్రాధాన్యం ఎక్కువ. అందుకని వాటిని ఆచితూచి వాడాలి. భాషమీద దృష్టిపెట్టాలి. కాసేపు మాట్లాడేసరికి ఏకవచనంలోకి దిగిపోకూడదు.
* ఎదుటివ్యక్తిని చూస్తూ మాట్లాడాలి. ఒక బృందాన్ని ఉద్దేశించి ప్రెజెంటేషన్‌ ఇస్తున్నప్పుడు అందరినీ చూడాలి.
* ఎలాంటివారితోనైనా అప్పటికప్పుడు పరిచయం చేసుకుని మెప్పించేలా మాట్లాడగలగడం అనుభవంతో వస్తుంది. అప్పటివరకూ కాస్త హోంవర్కు చేసి వెళ్లడం అవసరం. వ్యాపారానికి లోను కోసం బ్యాంకు మేనేజరుతో మాట్లాడాలి, టీచరు ఉద్యోగానికి డిమాన్‌స్ట్రేషన్‌ క్లాస్‌ తీసుకోవాలి, ఓ తల్లిగా పాప చదువుకి సంబంధించి క్లాసు టీచరుతో మాట్లాడాలి... ఆత్మవిశ్వాసమూ సమర్థతా నిజాయతీ గొంతులో విన్పించాల్సిన సందర్భాలెన్నో మనకు ఎదురవుతాయి. కాబట్టి ఆ పరిస్థితులను అంచనా వేసుకుని తగిన విధంగా సన్నద్ధమవాలి.

* నాయకత్వ లక్షణాలు అలవరచుకోవాలి. చుట్టుపక్కల జరిగే సంఘటనలను గమనించడం, అవసరమైనప్పుడు సహాయమందించడానికి ముందడుగు వేయడం నాయకుల లక్షణం. నాయకులకే ఓ ఇమేజ్‌ ఉంటుంది.
* ఒక ముఖ్యమైన పని మీద ఎవరినైనా కలుస్తున్నప్పుడు ఫోను పక్కన పెట్టేయండి. అప్పుడే పూర్తి ఏకాగ్రతతో ఎదుటి వ్యక్తితో మాట్లాడడం సాధ్యమవుతుంది.
* మంచి శ్రోతగా ఉండాలి. ఎదుటివారు చెప్తున్నది జాగ్రత్తగా వినాలి. అర్థం చేసుకుని సందేహాలుంటేనే ప్రశ్నలు వేయాలి. అడుగడుగునా అడ్డు తగులుతూ అసందర్భంగా మాట్లాడకూడదు.
* ఫాలో అప్‌ ఉండాలి. ఏ పని మీద ఎవరిని కలిసినా పనైపోగానే మర్చిపోకూడదు. ఇద్దరి మధ్యా సంభాషణలో దొర్లిన ఏ అంశానికి సంబంధించి అయినా అదనపు సమాచారం లభిస్తే మెయిల్‌లో పంపించవచ్చు. అలాంటి అవసరాలేమీ లేకపోయినా ‘మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీతో మాట్లాడడం వల్ల కొత్త విషయాలు తెలుసుకోగలిగాను’ లాంటి మాటలతో ఒక థ్యాంక్‌యూ నోట్‌ పంపించొచ్చు. ఇలాంటి ఫాలోఅప్‌ వల్ల ఫస్ట్‌ ఇంప్రెషన్‌ని మెరుగుపర్చుకునే అవకాశాలు పెరుగుతాయని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ వారి అధ్యయనంలో తేలింది.
కొనసాగాలి!
నిపుణుల సలహాలూ సూచనలూ తీసుకుని ఒక ఇమేజ్‌ ఏర్పరచుకుంటే సరిపోదు. దాన్ని నిర్వహించుకోవడమూ మన బాధ్యతే. దాన్నే ఇమేజ్‌ మేనేజ్‌మెంట్‌ అంటారు. మన ఇమేజ్‌ ప్రభావం మనమీదా, ఇతరుల మీదా, మన లక్ష్యాల సాధన మీదా ఏ విధంగా ఉందో ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ అది గాడి తప్పకుండా చూసుకోవాలన్నమాట. అలా మనం సృష్టించుకున్న ఇమేజ్‌కి భంగం కలిగే పనులు చేయకూడదు. వృత్తి ఉద్యోగాల్లోనే కాదు, మానవ సంబంధాల్లో, సంఘజీవనంలో... అడుగడుగునా ఇమేజ్‌కి ఓ విలువుంది. అందుకే మీదైన ఇమేజ్‌ ఏర్పడడానికి అవసరమైన అంశాలన్నిటినీ ఒక్కొక్కటిగా నేర్చుకుని విన్నింగ్‌ ఇమేజ్‌ రూపొందించుకుంటే ఏ రంగంలో ఉన్నా విజేతలు మీరే!

*   *   *   *

గదిలోనుంచి బయటకు వచ్చేటప్పుడు ఫ్యానూ లైటూ తీసేయాలని తెలీదా, హాల్లో ఎవరూ లేనప్పుడు టీవీ ఆఫ్‌ చేయమని కూడా చెప్పాలా... అంటూ తండ్రి చెప్పే జాగ్రత్తలు వినీ వినీ విసిగిపోయిన ఓ యువకుడు ఉద్యోగం సంపాదిస్తే ఇల్లొదిలి వెళ్లి స్వేచ్ఛగా జీవించొచ్చు అనుకున్నాడు. ఓ ఆఫీసునుంచి ఇంటర్వ్యూకి పిలుపొచ్చింది. ఉత్సాహంగా బయల్దేరాడు. గేటు తీసుకుని లోపలికి వెళ్లాడు. భవనం ఆవరణలో మొక్కలకి పైపుతో నీళ్లు పెడుతూ వాచ్‌మన్‌ ఎటో వెళ్లినట్లున్నాడు. నీళ్లు వృథాగా పోతున్నాయి. గబుక్కున వెళ్లి తన దుస్తులు తడవకుండా పైపుని జాగ్రత్తగా మొక్కల్లోకి పెట్టాడు. లోపలికి వెళ్తే రెండు రూముల నిండా అభ్యర్థులు కూర్చుని ఉన్నారు. తనూ ఓ కుర్చీలో కూర్చున్నాడు. కాసేపటికి ఒక గది ఖాళీ అయింది. కానీ అక్కడ లైట్లన్నీ వెలుగుతున్నాయి. ఫ్యాన్లు తిరుగుతున్నాయి. కుర్చీలో కూర్చున్నవాడల్లా లేచి వెళ్లి లైట్లూ ఫ్యాన్లూ ఆఫ్‌ చేశాడు. ఇంతలో అతడికి పిలుపొచ్చింది. ఇంటర్వ్యూ గదిలోకి వెళ్లబోతుండగా డోర్‌మ్యాట్‌ కాస్త దూరంగా పడివుండడం కన్పించింది. దాన్ని గుమ్మం ముందు సరిగా వేసి లోపలికి వెళ్లాడు. అక్కడ కంపెనీ ఎండీ ఒక్కడే ఉన్నాడు. వెళ్లగానే ‘యు ఆర్‌ సెలెక్టెడ్‌’ అంటూ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు. ‘అదేమిటి అసలు ఇంటర్వ్యూ చేయకుండా...’ అయోమయంగా అడిగిన యువకుడికి ఆయన తన పక్కనున్న సీసీటీవీ ఫుటేజ్‌ చూపించాడు. యువకుడు లోపలికి వస్తున్నప్పటినుంచి చేసిందంతా అందులో రికార్డయింది. ‘మాకు కావలసింది ఇలా బాధ్యతగా పనిచేసే మనిషి’ చెప్పాడాయన. అప్పుడర్థమైంది యువకుడికి- తాను అనుకున్న తండ్రి చాదస్తమే తనకి బాధ్యతాయుతమైన వ్యక్తి అన్న ఇమేజ్‌నీ ఉద్యోగాన్నీ కూడా తెచ్చిపెట్టిందని.

సంప్రదాయం ప్లస్‌ స్టైల్‌... దటీజ్‌ కలాం!

వ్యక్తిగత అభిరుచినీ సంప్రదాయాన్నీ కొనసాగిస్తూనే ప్రత్యేక ఇమేజ్‌ని ఎలా రూపొందించుకోవచ్చో చూపించారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం. మధ్యలో పాపిడి తీసి నున్నగా చెవుల మీదికి దువ్విన తెల్లని జులపాలు అడుగున వంకీలు తిరిగి చిరునవ్వుతో ఉండే కలాం ముఖానికి ఓ వింత అందాన్నిచ్చేవి. నిజానికి కలాం పూర్వీకులు వృత్తిరీత్యా సముద్ర ప్రయాణాలు ఎక్కువగా చేసేవారు. నెలల తరబడి సముద్రం మీదే ఉండడంతో వారి జుట్టు పొడవుగా పెరిగిపోయేది. కొన్నేళ్లకి అది కాస్తా వారి సంప్రదాయంగా మారిపోయింది. దాంతో కలాంకి కూడా చిన్నప్పటినుంచి జుట్టు పొడుగ్గా పెంచుకోవడం అలవాటైంది. శాస్త్రవేత్తగా పెద్ద ఉద్యోగం చేస్తున్నా ఆయన తమ సంప్రదాయాన్ని
కొనసాగించాలనుకున్నారు. అందుకే పొడవు తగ్గించకుండానే దానినో ప్రత్యేక హెయిర్‌స్టైల్‌గా మార్చుకున్నారు. కలాం రాష్ట్రపతి అయినప్పుడు ఆయన హెయిర్‌స్టైల్‌ గురించి ప్రత్యేకంగా రాయని పత్రికలు లేవు!

నూటికి తొంభైమందికి అవసరమేనట!

పెరుగుతున్న అవసరాలను అందిపుచ్చుకుంటూ ఇప్పటికే అమెరికాలాంటి దేశాల్లో కొన్ని వేల మంది ఇమేజ్‌ కన్సల్టెంటులుగా పనిచేస్తున్నారు. వివిధ విషయాల్లో వారికి సలహాలూ సూచనలూ ఇవ్వడమే కాక వారి కోసం స్వయంగా షాపింగ్‌ చేయడం, హోదాకీ అవసరానికీ తగినట్లుగా వారి వార్డ్‌రోబ్‌ని తీర్చిదిద్దడం లాంటివన్నీ చేసిపెడతారు. ఇప్పటికే అక్కడ లక్షల కోట్ల రూపాయల పరిశ్రమగా మారిన ఇమేజ్‌ ఇండస్ట్రీ చూపు ఇప్పుడు ‘యువభారతం’గా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న మన దేశం వైపు మళ్లింది. భారతీయ యువతలో నూటికి 90 మందికి ఇమేజ్‌ గురించిన స్పృహ లేదనీ చదువుల్లో రాణిస్తున్నవారు కూడా ఈ విషయంలో వెనకబడిపోతున్నారనీ అంటున్నారు నిపుణులు. యువత సంఖ్య పెరిగే కొద్దీ పోటీ సైతం పెరుగుతుందన్నది తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇమేజ్‌ మేనేజ్‌మెంట్‌, సాఫ్ట్‌స్కిల్స్‌ అన్నవి చర్చనీయాంశాలవుతున్నాయి. తమకంటూ ఒక ఇమేజ్‌ సృష్టించుకోవడంలోనే కాదు, ఇమేజ్‌ కన్సల్టెన్సీని ఒక వృత్తిగా చేపట్టేందుకూ ఇదే తగిన సమయం అంటున్నారు నిపుణులు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.