close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లీటరు మంచినీళ్ల బాటిల్‌ ధర రూ.600..!

‘చుట్టూ ఎత్తైన కొండలూ, వాటి మధ్యలో నీలి సరస్సులూ; పచ్చని మైదానాలూ, జాలువారే జలపాతాలూ; పచ్చిక కప్పిన ఇళ్లూ, చీకటిలేని రాత్రులూ; రద్దీ లేని రోడ్లూ, నవ్వుతూ పలకరించే జనమూ... కనిపిస్తే అది కచ్చితంగా నార్వే దేశమే అవుతుంది’ అంటున్నారు ఆ దేశాన్ని చుట్టొచ్చిన దుబాయ్‌ నివాసి వేమూరి రాజేష్‌.

సంతోషంగా జీవించే దేశాల్లో తొలి స్థానం పొందిన నార్వే దేశాన్ని చూడాలన్న ఆసక్తితో పోలండ్‌కి వెళ్లి, అక్కడి నుంచి స్నేహితులతో కలిసి పోజ్‌నాన్‌ పట్టణం నుంచి నార్వేకి బయలుదేరాం. ఓస్లోకి వంద కిలోమీటర్ల దూరంలోని సాండిఫ్‌జోర్డ్‌ అనే పట్టణంలోని టార్ప్‌ ఎయిర్‌పోర్టులో దిగాం. అంతర్జాతీయ విమానాశ్రయాలమీద ఒత్తిడి తగ్గించేందుకు యూరప్‌లోని ద్వితీయశ్రేణి నగరాల్లో విమానాశ్రయాలు అభివృద్ధి చేశారు. దాంతో అక్కడ విమాన చార్జీలు చాలా తక్కువ. 
ఎయిర్‌పోర్టు నుంచే కారు అద్దెకు తీసుకున్నాం. ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెంటీగ్రేడు ఉంది. సన్నగా వర్షం పడుతోంది. దారిలో పెట్రోల్‌ కోసం బంక్‌ దగ్గర ఆగాం. పెట్రోల్‌ ధర 16.50 క్రోనాలు చూపిస్తోంది. నార్వే కరెన్సీ క్రోనాకి మన కరెన్సీలో రూ.8.50. అంటే పెట్రోల్‌ ధర లీటరు రూ.140. ఐరోపా దేశాల్లో అత్యధికంగా ఆయిల్‌ నిల్వలు ఉన్న దేశం నార్వే. సగటున సంవత్సరానికి 88 మిలియన్‌ టన్నుల ఆయిల్‌ని ఉత్పత్తి చేస్తుంది. అయినా పెట్రోల్‌ ధర అంత ఉండటం ఆశ్చర్యం కలిగించింది. పైగా ఒక్కో ఊర్లో ఒక్కో బంక్‌లో ఒక్కో ధర... అదీ గంటగంటకీ మారిపోతుంటుంది. తరవాత సాండిఫ్‌ జోర్డ్‌ నుంచి నేరుగా బెర్గెన్‌ నగరానికి బయలుదేరాం.

అందమైన ప్రయాణం! 
ఓస్లో నుంచి బెర్గెన్‌ వెళ్లే రైలు ప్రయాణం, ప్రపంచంలోని అందమైన ప్రయాణాల్లో నాలుగోది. పర్వతాలూ లోయల మధ్య సాగే ఈ ప్రయాణం, సందర్శకులకి కనువిందు చేస్తుంటుంది. రోడ్డులో వెళ్లినా అలాగే ఉంటుందని చెప్పడంతో కారులోనే వెళ్లాం. సాండిఫ్‌జోర్డ్‌ నుంచి బెర్గెన్‌ 500 కిలోమీటర్లు. చిన్న చిన్న పల్లెటూర్లూ, అక్కడక్కడా విసిరేసినట్లున్న ఇళ్లూ, ఒంపులు తిరిగిన రోడ్లూ, వాటికి అటూఇటూ పచ్చని కొండలూ, ఆ మధ్యలోంచి జాలువారే సన్నని జలపాతాలూ లోయలూ, సరస్సులూ... చూసుకుంటూ నయనానందకరంగా సాగింది ప్రయాణం. రెప్ప వేస్తే ఏ అందాన్ని మిస్‌ అవుతామో అనేంతగా ప్రకృతి అందాల విందు చేసింది. 
నార్వేలో తప్పక చూడాల్సినవి ఫీయోర్డ్‌లు. అంటే చుట్టూ ఎత్తైన కొండలూ మధ్యలో ప్రవహించే సరస్సులనే ఫీయోర్డ్‌లు అంటారు. దేశంలో ఎక్కడ ప్రయాణిస్తున్నా రోడ్డుకి పక్కనే ఇవి కనిపిస్తాయి. పర్వతప్రాంతాల్లో ఘనీభవించిన మంచు కరుగుతూ నీరుగా మారి, కొండల మధ్యలోని సరస్సుల్లో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీరు ఎంత స్వచ్ఛంగా ఉందంటే ఎన్నో అడుగుల లోతున ఉన్న భూమి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. నీళ్లు కూడా ఎంతో రుచిగా ఉన్నాయి. దాంతో మధ్యమధ్యలో కారు ఆపి మా దగ్గర ఉన్న బాటిల్స్‌లో నీరు పట్టుకుని అవే తాగాం.

పచ్చిక ఇళ్లు..! 
వెళ్లే దార్లో మాకు బాగా ఆసక్తి కలిగించిన అంశం ఇళ్ల పైకప్పుమీద ఉన్న గడ్డి మేటలు. స్కాండినేవియన్‌ దేశాల్లో చలి చాలా ఎక్కువ. అందునా గ్రామీణ ప్రాంతాల్లో కొండలపైన నిర్మించే ఇళ్లలో ఇంకా ఎక్కువ. దాంతో ఇంటి కప్పు పైన గడ్డి పరచడం ద్వారా చలిని నియంత్రించే పద్ధతిని 19వ శతాబ్దం నుంచీ అనుసరిస్తున్నారు. దీన్నే సోడ్‌ రూఫ్‌ అంటారు. ఒక చదరపు మీటరుకి 250 కిలోల చొప్పున గడ్డిని పరుస్తారు. ఇంటిపై కప్పులన్నీ ఈ బరువుని తట్టుకునే విధంగా నిర్మిస్తారు. మేం ప్రయాణించినంత మేరా ఇదే తరహా ఇళ్లు ఉన్నాయి. 
దారిలో వోరింగ్‌ ఫోస్సేన్‌ జలపాతం దగ్గర ఆగాం. సందర్శకులకోసం జలపాతం దగ్గర ఎత్తైన ప్లాట్‌ఫామ్‌ని నిర్మించారు. నార్వేలో తిండి ఖర్చు ఎక్కువ. అరలీటరు వాటర్‌బాటిల్‌ మన కరెన్సీలో రూ.300. ఏమాత్రం కలుషితం కాని సరస్సులు ఉన్నా అంత ధర ఉండటం ఆశ్చర్యం కలిగించింది. అయితే ప్లాస్టిక్‌ వాడకం తగ్గించడం కోసం ఆ దేశం భారీగా విధించిన పన్నుల ప్రభావమే ఇందుకు కారణమట. నీళ్లతోబాటు ప్లాస్టిక్‌ డబ్బాల్లో అమ్మే శీతల పానీయాల ధరలూ అలాగే ఉన్నాయి. పైగా పర్యావరణ పరిరక్షణకోసం నార్వే ప్లాస్టిక్‌ నియంత్రించేందుకు ప్లాస్టిక్‌ బాటిల్‌ డిపాజిట్‌ స్కీమ్‌ను చేపట్టింది. ఖాళీ ప్లాస్టిక్‌ డబ్బాల్ని రీసైక్లింగ్‌కోసం సంబంధిత సెంటర్లో ఇస్తే బాటిల్‌ సైజుని బట్టి ధర చెల్లిస్తారు. దాంతో మేం కూడా మొదట కొన్న బాటిళ్లలోనే ఎక్కడికక్కడ నీళ్లు నింపుకున్నాం.

రాత్రి తొమ్మిదికీ సూర్యుడు! 
నార్వే రోడ్లమీద అత్యధిక వేగం 90 కిలోమీటర్లు. కానీ సగటున 60కి మించి నడపలేం. రోడ్ల ఒంపులూ వంతెనలూ, కొండలని తొలుచుకుంటూ నిర్మించిన టన్నెల్సే ఇందుకు కారణం. ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్‌ ఈ దారిలోనే ఉంది. దాని పొడవు 24 కిలోమీటర్లు. ఆ దారిలో అన్నీ ఆపిల్‌ తోటలే. మధ్యలో ఆగుతూ కాయలు కోసుకుంటూ పది గంటలకి బెర్గెన్‌ నగరానికి చేరుకున్నాం. అప్పటికి ఇంకా వెలుతురు ఉంది. నార్వేలో పగటివేళలు ఎక్కువ. రాత్రి 9 గంటలకీ సూర్యుడు ఉంటాడు. దాంతో రాత్రి సమయం తక్కువ. ఆ రాత్రికి బ్రాడ్‌ల్యాండ్‌ క్యాంపు విల్లాలో బస చేశాం. బెర్గెన్‌ నగరాన్ని సిటీ ఆఫ్‌ సెవెన్‌ మౌంటెయిన్స్‌ అంటారు. ఈ నగరం చుట్టూ ఏడు పర్వతాలు ఉండటం వల్ల దీనికాపేరు వచ్చింది.మర్నాడు నగరంలోకెల్లా ఎత్తైన ఫ్లోయేన్‌ అనే కొండమీదకి వెళ్లాం. అక్కడి నుంచి చూస్తే నగరం మొత్తం ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. నార్వే పెట్రోల్‌ ఉత్పత్తిలోనే కాదు, చేపల ఎగుమతిలోనూ ఐరోపా దేశాల్లో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇష్టపడే సాల్మన్‌ చేపలు ఇక్కడినుంచే ఎగుమతి అవుతాయి. అందుకే బెర్గెన్‌ పోర్టు ఎప్పుడూ బిజీగా ఉంటుంది. నార్వేలోని అతిపెద్ద ఫీయోర్డ్‌లు కూడా ఈ నగరంలోనే ఉన్నాయి. సరస్సుల్లో ప్రయాణానికి ఫెర్రీలు ఉన్నాయి. ఇవీ పెద్ద ఓడల్లానే ఉంటాయి. అందులోకి కారుతో సహా ఎక్కి, అవతలి ఒడ్డుకి చేరగానే కారు డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లొచ్చు. బెర్గెన్‌ నుంచి స్టావెంగర్‌ మధ్యలో చాలాచోట్ల ఈ ఫెర్రీల్లోనే వెళ్లాలి. కొండలూ సరస్సులతో నిండిన నార్వేలో అన్ని ప్రాంతాలకీ రోడ్లు వేయడం సాధ్యం కాదు. దాంతో కొంతమేర రోడ్డు మార్గంలో ప్రయాణించాక దానికి చేరువనే ఉన్న సరస్సులోని ఫెర్రీమీద ప్రయాణించి మళ్లీ రోడ్డు మార్గంలోకి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే ఆ ఫెర్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూశాం. అది రానే వచ్చింది. మూడంతస్తుల్లో ఉన్న ఆ ఫెర్రీలో వందకార్లు పైగానే పడతాయి. పార్కింగ్‌ చేసి, డెక్‌ పైకి చేరుకుని ఆ కాసేపూ బాగా ఎంజాయ్‌ చేశాం.

అద్దెకి ఇళ్లు..! 
ఒడ్డుకు రాగానే కారు ప్రయాణం మళ్లీ మొదలు. ఆ దారిలో పచ్చిక మేస్తున్న గొర్రెలు ఎక్కువగా కనిపించాయి. గొర్రె తలతో చేసే స్మాలహోవ్‌ అనే వంటకాన్ని క్రిస్మస్‌కి ముందు తినడం నార్వే సంప్రదాయమట. ఆ తలని అదే ఆకారంలో ఉడికించి కూరగాయ ముక్కలతో కలిపి వడ్డిస్తారు. ఆ దారిలో ప్లాస్టిక్‌ షీట్లు చుట్టిన గడ్డిమోపులు కనిపించాయి. వాటిని మేత దొరకని ఎడారి దేశాలకు ఎగుమతి చేస్తారట. 
స్టావెంగర్‌లో చూడదగ్గ మరో ప్రదేశం పులిపిట్‌ రాక్‌. ఎత్తైన ఈ కొండమీద నుంచి కింద ఉన్న సరస్సుని చూడటం ఎంతో బాగుంది. ఆ రోజు మా బస మరియా అనే అతిథి ఇంట్లో. ఎక్కువమంది టూర్‌కి వెళ్లినప్పుడు హోటల్స్‌ కన్నా ఏదైనా అపార్ట్‌మెంట్‌ కానీ ఇల్లు కానీ బుక్‌ చేసుకోవడం ఉత్తమం. ఎయిర్‌బిఎన్‌బి (airbnb) అనే వెబ్‌సైటులో ఈ ఇళ్ల సమాచారం ఉంటుంది. కొంతమంది ఇళ్లను టూరిస్టులకు అద్దెకిస్తుంటారు. ఆ ఇంటిలో కిచెన్‌తోబాటు వంటకి అవసరమైన అన్ని సామాన్లనూ ఉంచుతారు. మనమే వండుకుని తినాలి. గూగుల్‌ మ్యాప్స్‌ ఆధారంగా మేము బుక్‌ చేసుకున్న ఇంటికి చేరుకున్నాం.  మేం వెళ్లేసరికే మాకోసం మరియా ఎదురుచూస్తోంది. మేం కారు పార్క్‌ చేసి, అండర్‌గ్రౌండ్‌లో ఉన్న డబుల్‌బెడ్‌రూమ్‌ ఇంటికి వెళ్లాం. మేం పోలాండ్‌ నుంచి వచ్చేటప్పుడే అవసరమైన వంటసామాను తెచ్చుకున్నాం. దాంతో వంట చేసుకుని, భోజనం చేసి పడుకున్నాం. మర్నాడు ఉదయాన్నే అల్పాహారం తినేసి, ఇల్లు ఖాళీ చేసేసి నగర సందర్శనకి బయలుదేరాం. ఆహారపదార్థాల ప్యాకింగ్‌కి వాడే క్యాన్ల తయారీకి పుట్టినిల్లు ఈ నగరమే. అందుకే దీన్ని క్యాన్స్‌ క్యాపిటల్‌ అంటారు. ముందుగా మేం స్వెర్‌డిఫ్‌జెల అనే స్మారక చిహ్నం 
దగ్గరకు వెళ్లాం. క్రీ.శ. 872వ సంవత్సరంలో హెరాల్డ్‌ అనే రాజు నార్వేలో ఉన్న చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ జయించి ఒకే పాలనలోకి తీసుకువచ్చాడు. దీనికి గుర్తుగా 33 అడుగుల పొడవున్న మూడు కత్తుల్ని ఒక రాతిపై గుచ్చి, దాన్ని నిర్మించారు. అక్కడి నుంచి నగర కూడలి రోగాలాండ్‌ కౌంటీకి బయలుదేరాం. ఇక్కడే స్టావెంగర్‌లో అత్యంత పురాతన క్యాథెడ్రల్‌ ఉంది. 1100 సంవత్సరంలో మొదలుపెట్టిన ఈ చర్చి నిర్మాణం పూర్తవ్వడానికి 50 సంవత్సరాలు పట్టిందట. దీనికి దగ్గర్లోనే దిల్లీకి సంబంధించిన ఇండియన్‌ రెస్టరెంట్‌ కూడా ఉంది. మనం పాత రోజుల్లో వాడిన నవ్వారు మంచాలు ఇక్కడ చాలా ఖరీదుకి అమ్ముతున్నారు. దానికి పక్కనే సముద్రం కూడా ఉండటంతో జనం బాగా ఉన్నారు. అక్కడి నుంచి రాజధాని నగరం ఓస్లో 450 కిలోమీటర్లు. ఆగకుండా వెళితే ఏడు గంటల ప్రయాణం. కానీ మేం ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫొటోలు తీసుకుంటూ వెళ్లాం. నగర కూడలిలోని రాయల్‌ ప్యాలెస్‌, పార్లమెంట్‌, నేషనల్‌ థియేటర్‌లను సందర్శించాం. అప్పటికి 9 గంటలు కావడంతో మెల్లగా చీకట్లు ముసురుకుంటున్నాయి. ఆ రాత్రికి సాన్దిఫ్‌ జోర్డ్‌లో ఉన్న మా విడిదికి వెళ్లిపోయి, మర్నాడు పోలాండ్‌కు చేరుకున్నాం.

 

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.