close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొసమ్మ 

- కొరుపోలు గోవిందరావు

 

ఈ రోజు చాలా సంతోషంగా అనిపించసాగింది ఆఫీసు నుండి ఇంటికి వస్తూంటే. 
ఇన్ని రోజులుగా నాకు ప్రసాదరావుపైన ఇంత ద్వేషం ఉందనే విషయం నాకు ఈరోజే అర్థమయింది... నా మనసులో చెలరేగుతున్న ఆనంద తరంగాలను చూస్తూంటే. 
ప్రసాదరావు నాతోపాటే ఆఫీసులో జాయిన్‌ అయినా నేను చూస్తూండగా ఎదిగిపోయాడు. డైరెక్టర్స్‌ బోర్డులో మెంబర్సు అందరూ అతగాడిని పొగడని సందర్భమంటూ ఉండేదికాదు. 
నాతోపాటే జాయిన్‌ అయి నాపై అధికారిగా ఎదిగినందువల్లనేమో ప్రసాదరావు పైన నాకు ముందుగా ఈర్ష్య మొదలైంది. ఆ తరవాత అతను తరచూ నా పనులకు వంక పెడుతూండటంతో ఆ ఈర్ష్య కాస్తా ద్వేషంగా మారిపోయింది. 
కాలం అన్ని సందర్భాలలోనూ ఒకరికే అనుకూలంగా ఉండదు కదా! ఈమధ్యన ప్రసాదరావుకు అప్పగించిన ప్రాజెక్టు ఒకటి, కంపెనీకి కష్టాలను తీసుకొచ్చింది. దాంతో అతనిపైన ఎంక్వయిరీ కమిటీని వేశారు. 
సహజంగా నిజాయతీపరుడినైన నన్ను ఆ కమిటీకి కన్వీనర్‌గా వేశారు. 
ఇన్ని రోజులుగా నేను పడుతున్న యాతనకు ఒక పరిష్కార మార్గం దొరికినట్లనిపించింది. 
నిజానికి ప్రాజెక్టు సత్ఫలితాలివ్వకపోవడానికి ప్రసాదరావు ప్రయత్న లోపమేమీ లేకపోయినా నేను అతని చేతకానితనాన్ని నిరూపించదలుచుకున్నాను- అదీ పకడ్బందీగా. 
ఈరోజు ఫైనల్‌ రిపోర్టు తయారుచేశాను. 
ఫైనల్‌ రిపోర్ట్‌ చూశాక నా తెలివితేటలను చూసి నాకే ఆశ్చర్యమేసింది. 
ఈ దెబ్బతో ప్రసాదరావు పైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం ఖాయం. అతడిని ఉద్యోగంలోంచి కూడా తీసేయొచ్చు. 
ఇన్ని రోజులుగా నేను ప్రసాదరావు కారణంగా అనుభవిస్తున్న వేదనకు ఇది చక్కని ముగింపులా అనిపించింది.

* * * * * * * * * *

ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయిదున్నరయింది. మా ఆవిడతో మాట్లాడుకుంటూ టీ తాగుతుంటే ఫోన్‌ రింగయింది. 
చూస్తే ఊరినుండి మా నాన్న. 
ఆ సమయంలో నాన్న ఫోన్‌ చేయడం అరుదు. సాధారణంగా పడుకునేముందు ఫోన్‌ చేస్తాడు... పొలం పనులన్నీ అయిపోయి ఆయన తీరికగా ఉండేది అప్పుడే కాబట్టి. 
టైమ్‌ కాని టైమ్‌లో నాన్న నుండి ఫోన్‌రావడంతో మనసు కీడును శంకించింది. 
‘‘ఆఁ నాన్నా చెప్పండి’’ అన్నాను ఫోన్‌లో. 
‘‘ఏరా, కోడలూ పిల్లలూ కులాసాయేనా?’’ అన్నాడు నాన్న. 
‘‘ఆ... కులాసాయేగానీ మీరెలా ఉన్నారు... అమ్మ బాగుందా?’’ అని అడిగాను మాటల్లోని ఆదుర్దా కనపడకుండా. 
‘‘అమ్మకేం బ్రహ్మాండంగా ఉంది. కానీ...’’ అంటూ ఆగిపోయాడు. 
‘‘ఏంటి నాన్నా, ఏమయింది?’’ అని అడిగాను. 
‘‘ఏం లేదురా, కొసమ్మకి ఆరోగ్యం బాగాలేదు. ఇవాళో రేపో అన్నట్టుగా ఉంది పరిస్థితి’’ అన్నాడు. 
మనసంతా చేదెక్కినట్లనిపించింది. 
‘‘ఏమయింది?’’ అన్నాను ఆదుర్దాగా. 
‘‘ఏముంది, వయసు మీదపడింది కదా... పైగా మూడోసారి హార్ట్‌ అటాక్‌ రావడం... 
ఏం లాభంలేదని ఇంటికి పంపేశారు డాక్టర్లు. అన్నీ మంచంమీదే జరుగుతున్నాయి. పదేపదే 
నీ పేరు కలవరిస్తోంది’’ అన్నాడు. 
మరుసటిరోజు లీవు కావాలని మెసేజ్‌ పెట్టేసి ఉన్నపళంగా ఊరికి బయలుదేరాను. 
బస్సు బయలుదేరేసరికి రాత్రి తొమ్మిదిన్నరయింది. కండక్టర్‌ వచ్చి టికెట్‌ కన్‌ఫామ్‌ చేసుకున్నాక సీటులో ఒదిగి కళ్ళు మూసుకున్నాను. 
కొసమ్మ రూపం కళ్ళముందర మెదిలింది. 
కొసమ్మ నాకు అమ్మలాంటిది. నాకేకాదు, మా ఊళ్ళో ఉండే చాలామంది పిల్లలకు అమ్మనే. దేవుడిచ్చిన అమ్మ. 
చామనఛాయ శరీరం, నుదుటిపైన తెల్లని విభూది, గుండ్రని చందమామ లాంటి మొహం. ఆ మొహంపైన ఎనలేని ప్రశాంతత, ఎప్పుడూ చెరగని చిరునవ్వు. 
కొసమ్మ మొహం గుర్తుకురాగానే అసంకల్పితంగా రమణమ్మ రూపం కూడా కళ్ళముందర కదలాడింది. 
వెలుగుని అంటుకునే నీడ ఉన్నట్లు... మంచిని ఆనుకునే చెడు ఉన్నట్లు... కొసమ్మను ఆనుకునే రమణమ్మ ఉంటుంది. కొసమ్మ మూర్తీభవించిన మానవత్వం అయితే, రమణమ్మ అమూర్తంగా గోచరించే దానవత్వం. 
ఇతరులను ప్రేమించడం ఎలాగో కొసమ్మ నేర్పితే, ద్వేషించడం ఎలాగో రమణమ్మ నేర్పేది. 
ఆలోచనలు నా ప్రమేయం లేకుండానే గతంలోకి జారిపోయాయి. 
కొసమ్మ... అసలు పేరేంటో మాకెవరికీ తెలీదు. ఊరికి కొసన ఉంది కాబట్టి పిల్లలందరం ‘కొసమ్మ’ అని పిలుస్తాం. దాంతో ఆ పేరే స్థిరపడిపోయింది. ఒంటరిగా ఉంటుంది. ఆమెది ఏ ప్రాంతమో కూడా తెలీదు. ఆమె భర్తది మాత్రం ఇదే ఊరు. అతను మహారాష్ట్రకు వలసవెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు తెచ్చుకున్న భార్య కొసమ్మ. 
తిరిగివచ్చిన కొద్ది రోజులకే అతను ఒక ప్రమాదంలో చనిపోవడంతో అప్పటికీ సంతానంలేని కొసమ్మ అప్పటినుండీ ఒంటరిగానే ఉంటోంది. ఆమె మహారాష్ట్ర నుండి వచ్చిందన్న ఒక్క విషయం తప్ప ఆమె గురించిన మరే వివరాలూ ఎవరికీ తెలియవు. 
కొసమ్మ ఇంటిపక్కనే రమణమ్మ ఇల్లూ ఉంటుంది. కొసమ్మ, రమణమ్మ తోటికోడళ్ళు. 
రమణమ్మ కుటుంబం ఏనాడూ కొసమ్మను తమ కుటుంబసభ్యురాలిగా చూడలేదు. 
రమణమ్మ భర్త కూడా చనిపోయినా అప్పటికే ఆమెకు ఇద్దరు కొడుకులు. కాలక్రమంలో వాళ్ళిద్దరూ పట్టణానికి వలసవెళ్ళి అక్కడే స్థిరపడిపోయారు. 
మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు ఆ రోజుల్లో ఇంటర్‌ వరకూ చదివినా వ్యవసాయాన్నే వృత్తిగా ఎంచుకున్నారు. 
నాన్న వేకువజామునే లేచి పొలానికి వెళ్ళిపోతారు. అమ్మ నన్ను స్కూల్‌కి పంపిన తరవాత వంట చేసుకుని మా ఇంటి తాళాలు కొసమ్మకిచ్చి పొలం పనికెళ్ళేది. 
ఇంచుమించు నా స్నేహితులందరి తల్లిదండ్రులూ ఇలానే చేసేవారు. 
మేము లంచ్‌అవర్‌లో కొసమ్మ దగ్గర నుండి మా ఇళ్ళ తాళాలు తీసుకుని, భోజనం చేసి తిరిగి స్కూల్‌కి వెళ్ళేటప్పడు మరలా కొసమ్మకిచ్చి స్కూల్‌కి వెళ్ళిపోయేవాళ్ళం. 
మేము స్కూలుకి వెళ్ళిరావాలంటే రమణమ్మ, కొసమ్మల ఇంటి ముందరనుండి వెళ్ళి రావాలి. 
స్కూల్‌కి వెళ్ళేటప్పుడు రమణమ్మ ఇంటి పెరట్లోనున్న పూలపైన పిల్లలు చెయ్యేస్తే గయ్యాళిలా మీదపడిపోయేది. కొసమ్మ మాత్రం అప్పటికే కోసి ఉంచిన పూలతో ఆ పిల్లలజడలను అలంకరించేది. 
ఖాళీ సమయంలో మేమంతా కొసమ్మ ఇంటి ముందరున్న ఖాళీ స్థలంలో ఆటలాడుకుంటూంటే మా కేరింతలు చూసి కొసమ్మ మురిసిపోయేది. 
రమణమ్మ మాత్రం మేకలమందలా ఆ అరుపులూ కేకలూ ఏంటని మమ్మల్ని తిట్టిపోసేది. 
ఆటలు ఆడిఆడి అలసిపోయిన పిల్లలు మంచినీళ్ళ కోసం వాళ్ళ బావిలో నీళ్ళు తోడుకుని తాగుతుంటే- ‘‘నీ వల్లనే ఊరి మంద అంతా నా ఇంటి బావికొచ్చేది. పిల్లాజల్లా లేనిదానవు నీకేం- మురికివాసన, దోమలతో చస్తున్నాం మేం’’ అంటూ కొసమ్మను తిట్టడమే కాకుండా బావికెళ్ళే దారిని మూయించి వేసింది. 
కొసమ్మ నడవలేకున్నప్పటికీ ఊరి చివర్నున్న బావి నుండి నీళ్ళు తెచ్చి పిల్లలకు ఇచ్చేది. 
భర్తా, పిల్లలూలేని కొసమ్మ తన ఆస్తిని పరాయి పిల్లల కోసం ఖర్చు చేసేస్తుందంటూ ఊరిపెద్దల దగ్గర పంచాయితీ పెట్టిన రమణమ్మ ‘‘ఆస్తినైతే నువ్వు అనుభవించుకానీ దుబారా చేశావో చూస్తూ ఊరుకోవటానికి అది నీ బాబుగారి ఆస్తి కాదు. నీ తదనంతరం ఆ ఆస్తి నా పిల్లలకు మాత్రమే చెందుద్ది’’ అంటూ హెచ్చరించింది. 
ఆ మాటలకు కొసమ్మ కుంగిపోయింది. 
మామూలు మనిషి అవటానికి కొసమ్మకు చాలా కాలం పట్టేసింది. 
మేము ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలు సంపాదించిన తరవాత కొసమ్మను మా ఇళ్ళల్లోనే ఉంచుకుని కన్నతల్లికంటే మిన్నగా చూసుకోవాలనుకున్నా... కొసమ్మ మాత్రం ‘‘మీరైతే పెద్దవాళ్ళైపోయారు కానీ, మీ తరవాత తరం 
లేకపోలేదు కదా!? మీలాగే వాళ్ళను కూడా చూసుకోవాలి’’ అంటూ సున్నితంగా మా ఆహ్వానాన్ని తిరస్కరించి అక్కడే ఉండిపోయింది. 
కొసమ్మ మా దగ్గరే ఉండివుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో! 
పరిపరివిధాలా కొసమ్మ కోసం ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్న నేను కండక్టర్‌ తట్టి లేపడంతో కళ్ళు తెరిచాను. 
మా ఊరి బస్టాండ్‌లో ఆగి ఉంది బస్సు. 
టైమ్‌ చూస్తే ఉదయం ఆరున్నర. 
మా అమ్మానాన్నలు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండిపోయినా, నా ఆలనా పాలనా చూస్తూ నేనీ స్థితిలో ఉండటానికి కారకురాలైన కొసమ్మను చూడాలన్న ఆరాటం నన్ను నిలువనీయలేదు. 
కొసమ్మ దగ్గర ఎంత నేర్చుకున్నా తరగని పాఠాలెన్నో మిగిలే ఉంటాయి. ఆమె మాకు ఏదీ నేర్పాలని చూడదు. కానీ, మనకు తెలియకుండానే నేర్చేసుకుంటాం. ఆమె జీవనశైలి మాకు ఎంత నేర్చుకున్నా తరగని పాఠ్య పుస్తకం. 
ఇంటికి వెళ్ళకుండా సరాసరి కొసమ్మ దగ్గరకు వెళ్ళాను. ఎలా తెలిసిందో కానీ మా స్నేహితులంతా ఆమె ఇంటిముందర గుమిగూడి ఉన్నారు. నిజానికి ఈ వయసులో కొసమ్మ ఏ అవసరానికీ ఎవరి దగ్గరా చేయి చాపకుండా ఉండాలని ప్రతినెలా మేమంతా కలిసి ఆమెకు డబ్బు అందజేస్తూంటాం. 
నేను వెళ్ళేసరికి దాదాపు అపస్మారక స్థితిలో ఉంది కొసమ్మ. నా పిలుపు వినగానే బలవంతంగా కళ్ళు తెరిచింది. 
నన్ను చూడగానే ఆమె కళ్ళల్లో ఒక రకమైన తృప్తి. దగ్గరగా రమ్మని పిలిచింది. 
బలవంతంగా కొద్దిసేపు క్షేమసమాచారాలడిగి... ‘‘రమణమ్మ...’’ అంటూ ఏదో చెప్పబోయింది. 
‘‘ఆమె గురించి ఇప్పుడెందుకు కొసమ్మా’’ అన్నాను చిరాగ్గా. 
‘‘కాదురా...రమణమ్మ నిజానికి చాలా మంచిది...’’ అని నా కళ్ళల్లోకి సూటిగా చూసింది. 
నేను ఆశ్చర్యపోయాను. కొత్త విషయం వింటున్నట్టుగా అనిపించి ప్రశ్నార్థకంగా చూశాను. 
మాట్లాడే శక్తి లేనప్పటికీ మధ్యమధ్య దమ్ము తీసుకుంటూ మాటలు కూడపలుకుతూ ఒక్కో మాటా చెప్పసాగింది. 
‘‘రమణమ్మ మిమ్మల్ని తన దగ్గరకు రానీయకపోవటానికి కారణం తెలుసా?’’ అంది. 
ఎందుకన్నట్లుగా చూశాను.

 

‘‘నేను మొగుడూ పిల్లలూ లేని ఏకాకిని. మీలోనే ప్రపంచాన్ని చూసుకుంటూ బతుకుతున్నాను కదా! తను మిమ్మల్ని అస్తమానూ విసుక్కుంటూ, తిడుతూ ఉంటే మీరు నాకు మరింత దగ్గరవుతారనీ, మీవల్ల నా ఒంటరితనం దూరమవుతుందనీ అట్లా చేసిందంతే’’ అంది నీరసంగా. 
‘‘ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నావ్‌?’’ అని అడిగాను. 
‘‘రమణమ్మ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కొడుకులిద్దరూ వాళ్ళదారి వాళ్ళు చూసుకుని వదిలేయడంతో కనీసం తినడానికి తిండి కూడా లేక, మందులకూ డబ్బుల్లేక బతికున్న శవంలా మంచంపైనే బతుకు వెళ్ళదీస్తోంది. ఇకనుండి ఆమెనూ నాలాగే చూసుకోండి’’ అంది రెండు చేతులూ జోడిస్తూ. 
కొసమ్మ అలా ప్రాధేయపడటం చాలా కష్టంగా అనిపించింది. ఆ సమయంలో రమణమ్మపైన గౌరవం, ప్రేమా పుట్టుకొచ్చింది.
ఇది చెప్పడానికే ఇంకా ఉన్నాననుకుందో ఏమో తరవాత రెండు గంటల్లో ఈ లోకాన్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయింది కొసమ్మ. 
అంత్యక్రియలు పూర్తయ్యాక రమణమ్మ ఇంటికి వెళ్ళాను. 
ముడతలుపడిన శరీరంతో చిక్కి శల్యమైపోయి మంచంపైన జీవచ్ఛవంలా పడివున్న రమణమ్మను చూడగానే జాలేసింది. ఒకప్పటి గయ్యాళి రమణమ్మ ఈమేనా అనిపించింది. 
నన్ను చూడగానే కష్టమ్మీద లేచి కూర్చుంది. ఆమె మొహంలో ఎన్నెన్నో ప్రశ్నలు. 
‘‘బిడ్డా! మిమ్మల్ని ఎంతగానో కష్టపెట్టిన నన్ను చూడటానికి వచ్చారా! ఎవరూ లేరనుకున్న కొసమ్మ పోయేటప్పుడు ఊరు ఊరంతా కదిలొచ్చింది. కన్నకొడుకులతో సహా నన్ను పట్టించుకునేవారే కరువయ్యారు. అయినా మీకు నేనేం చేశాను గనుక- నాపైన ప్రేమా అభిమానం ఉండటానికి’’ అంటూ బావురుమంది. 
మెల్లగా ఆమె చేతిని నా చేతుల్లోకి తీసుకుని ‘‘నాకు తెల్సమ్మా, అప్పుడు నువ్వెందుకలా ప్రవర్తించావో’’ అన్నాను. 
అర్థంకానట్టు చూసింది. 
‘‘నువ్వు అప్పుడు కొసమ్మ మేలుకోరే మాతో అలా ప్రవర్తించావని మాకు తెలుసు’’ అని కొసమ్మ చెప్పిందంతా ఆమెకు చెప్పాను. 
రమణమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. 
‘‘మీ కొసమ్మ అట్లా చెప్పిందా?’’ అంది. 
‘‘అవును. కొసమ్మ ఈ నిజాన్ని చెప్పిన తరవాత ఆగలేకపోయాం’’ అన్నాను. 
ఒక్కసారిగా రమణమ్మ కళ్ళనుండి కన్నీళ్ళ వర్షం. వెక్కివెక్కి ఏడవసాగింది. 
‘‘ఏమైంది పెద్దమ్మా?’’ అని అడిగాను. 
‘‘బాబూ, అది చెప్పిందంతా అబద్ధం. 
బతుకంతా దాన్ని కాల్చుకుతిన్నా... అదిమాత్రం పోతూపోతూ మీ దృష్టిలో నన్నో గొప్ప మనిషిని చేసి పోయింది. నా చివరి రోజుల్ని సుఖంగా గడిపేలా చూడమని మీకు చెప్పిన దేవత 
అది’’ అంటూ భోరున ఏడవసాగింది. 
అప్పటివరకూ ఏమాత్రం చేతకాకుండా నీరసంగా ఉండిపోయిన రమణమ్మకు అంతగా ఏడ్చే శక్తి ఎక్కడి నుండి వచ్చిందో అర్థంకాలేదు. 
పశ్చాత్తాపంతో విలవిల్లాడిపోతున్న రమణమ్మను దగ్గరకు తీసుకుని ‘‘ఊరుకో పెద్దమ్మా! మేము కూడా నీ కొడుకులమే. మాకు కొసమ్మ ఎంతో నువ్వూ అంతే’’ అన్నాను ఆప్యాయంగా. 
నా కళ్ళముందర కొసమ్మ రూపం కదలాడింది - ప్రపంచం మొత్తాన్నీ ఎలాంటి తేడాలూ లేకుండా కాపాడే అమ్మోరు తల్లిలా!
మర్నాడు బయలుదేరుతుంటే ఎండీగారి నుండి ఫోన్‌ వచ్చింది. ‘‘ఏమయింది మిస్టర్‌ శ్రీధర్‌, కాన్ఫిడెన్షియల్‌ రిపోర్ట్‌ ఇస్తానని సడెన్‌గా వెళ్ళిపోయావ్‌?’’ అని అడిగారు. 
‘‘సారీ సర్‌, మా పెద్దమ్మ చావుబతుకుల్లో ఉందంటే అర్జంటుగా ఊరికి రావాల్సి వచ్చింది. రేపు ఉదయానికల్లా ఫైల్‌ మీ ముందరుంటుంది’’ అన్నాను. 
‘‘ఇంతకూ ప్రసాదరావుపైన అలిగేషన్స్‌ ఏమయినా ప్రూవ్‌ అయ్యాయా’’ అని అడిగారు ఎండీగారు. 
‘‘లేదు సర్‌, ప్రసాదరావు ఈజ్‌ ఎ జంటిల్‌మేన్‌. ఆయన కావాలని ఏ తప్పూ చేయలేదు. అన్ని వివరాలతో రేపు ఫైల్‌ మీ ముందరుంటుంది’’ అన్నాను. 
ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. 
‘‘థాంక్యూ కొసమ్మా, పోతూపోతూ కూడా నాకో కొత్త పాఠాన్ని నేర్పావు’’ అనుకుంటూ ఆకాశంలోకి చూశాను. 
నన్ను దీవిస్తున్నట్లున్న కొసమ్మ రూపం కనిపించింది. 
కృతజ్ఞతతో నా కళ్ళు చెమ్మగిల్లాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.