close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చార్‌కోల్‌ మాస్క్‌ మంచిదే కానీ...

 

ముఖం నిగారింపుకోసం రకరకాల మాస్క్‌లు వేయడం తెలిసిందే. అందులోభాగంగా ఇటీవల చార్‌కోల్‌ ఫేస్‌ మాస్క్‌లూ వచ్చాయి. అవి మంచివేేగానీ అవి వేసినప్పుడు కొన్ని జాగ్రత్తలూ తప్పనిసరి అంటున్నారు వైద్యనిపుణులు. చార్‌కోల్‌ మాస్క్‌తో ముఖంమీద ఉండే మొటిమల మచ్చలూ, బ్లాక్‌హెడ్స్‌, బ్యాక్టీరియా... వంటివన్నీ తొలగిపోతాయన్నది నిజమే. ఎందుకంటే వీటిల్లో వాడే యాక్టివేటెడ్‌ చార్‌కోల్‌ మామూలు బొగ్గు కాదు. దీన్ని కొబ్బరిచిప్పలు, రంపుపుపొట్టు, బొగ్గు... వంటి వాటిని అధిక ఉష్ణోగ్రత దగ్గర ప్రాసెసింగ్‌ చేసి ఎక్కువ రంధ్రాలు కలిగి ఉండే సన్నని పొడిలా తయారుచేస్తారు. ఇలా చేసిన ఈ బొగ్గుపొడికి ముఖంమీద పేరుకున్న దుమ్మూధూళీ, మృతకణాలూ, మలినాలూ, బ్లాక్‌హెడ్సూ... ఇలా అన్నింటినీ బంధించి, తొలగించే లక్షణం ఉంటుంది. అదేసమయంలో చర్మ రంధ్రాలను బాగా తెరచుకునేలా చేయడంతోబాటు చర్మ రక్షణకు తోడ్పడే సహజ నూనెల్నీ తొలగిస్తుంది. కాబట్టి దీన్ని మరీ ఎక్కువగా వాడకూడదు. మాస్క్‌ తీసిన తరవాత కూడా వెంటనే రోజువారీ వాడే సబ్బులూ లోషన్లూ కాకుండా మాయిశ్చరైజరూ చాలా మైల్డ్‌ క్లెన్సర్లూ మాత్రమే  వాడాలి. లేదంటే చర్మం పొడిబారిపోతుంది. జాగ్రత్త.


పిండిపదార్థాలూ తినండి

 

ఈమధ్య ఎవరిని చూసినా కార్బొహైడ్రేట్లు అంటేనే క్యాలరీలని భయపడుతున్నారు. దాంతో వాటిని చాలావరకూ తీసుకోవడం తగ్గించేస్తున్నారు. కానీ కార్బొహైడ్రేట్లు పుష్కలంగా ఉండే పండ్లూ కూరగాయలూ ముడిధాన్యాలూ సరిపడా తినాలనీ వీటివల్ల బరువు పెరగకపోగా తగ్గుతారనీ ఇన్సులిన్‌ పనితీరు కూడా సరిగ్గా ఉంటుందనీ అమెరికాకి చెందిన ఫిజీషియన్స్‌ కమిటీ ఫర్‌ రెస్పాన్సిబుల్‌ మెడిసిన్‌కి చెందిన నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం వీళ్లు కొందరు వ్యక్తుల్ని ఎంపిక చేసి, అందులో కొందరికి పన్నెండు వారాలపాటు ఎలాంటి జంతుఉత్పత్తులూ లేని ఆహారాన్ని అందించారట. అదేసమయంలో కార్బొహైడ్రేట్లను మాత్రం రోజువారీకన్నా కాస్త ఎక్కువగానే ఇచ్చారట. మరో వర్గం వారు మాత్రం ఎప్పటిలానే కార్బొహైడ్రేట్లు తక్కువగా తింటూ ఇతరత్రా జంతు ఉత్పత్తులతో కూడిన ఆహారాన్ని తీసుకున్నారట. మూడు నెలల తరవాత వాళ్ల బరువుని పరిశీలించగా- రెండోవర్గం వాళ్లతో పోలిస్తే కార్బొహైడ్రేట్లు పుష్కలంగా తీసుకున్న మొదటివాళ్లే బరువు తగ్గినట్లు తేలింది. పండ్లూ కూరగాయలూ ముడిధాన్యాల్లో ఉండే అధిక పీచూ సంక్లిష్ట పిండిపదార్థాలే ఇందుకు కారణం అని తేలింది. ఇవి సెరటోనిన్‌ హార్మోన్‌ ఉత్పత్తిని పెంచి డిప్రెషన్‌, ఒత్తిడి... వంటి మానసిక సమస్యల్నీ నిరోధిస్తాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ శాతాన్ని తగ్గించి హృద్రోగాలు రాకుండా చేస్తాయి. జీర్ణశక్తిని పెంచి, మలబద్ధకం రాకుండా చూస్తాయి. కాబట్టి పిండిపదార్థాలని చూసి భయపడకండి, వాటిని ఏ రూపంలో తింటున్నాం అన్నదే గమనించుకోండి అంటున్నారు నిపుణులు. 


వాసన పసిగడతారా?

 

కొందరు ఎంత దూరంగా ఉన్నా ఎలాంటి వాసనల్ని అయినా గుర్తించడంతోబాటు అది ఎటువైపు నుంచి వస్తుందీ అన్న విషయాన్ని కూడా పట్టేస్తారు. దీనికి కారణం ఏమై ఉంటుందీ అన్న విషయాన్ని పరిశీలించగా- పరిసరాల్ని బాగా గుర్తుపెట్టుకునేవాళ్లకు వాసన పసిగట్టే శక్తి కూడా ఎక్కువని చెబుతున్నారు డగ్లస్‌ మెంటల్‌ హెల్త్‌ యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్‌ నిపుణులు. ఇందుకోసం వీళ్లు కొందరు యువతీయువకుల్ని ఎంపికచేసి- వాళ్లను  ఓ నగరంలోని అన్ని వీధుల్నీ తిప్పి, ఆయా వీధుల్లోని లాండ్‌మార్క్‌లూ దారుల గురించి ప్రశ్నించారట. తరవాత వాళ్లనే తులసి, స్ట్రాబెర్రీ, దాల్చినచెక్క... వంటి 40 రకాల వాసనల్ని గుర్తించమని అడిగారట. ఆపై ఆ రెండు పరీక్షల్నీ సమీక్షించగా దారుల్ని గుర్తుంచుకోగలిన వాళ్లే ఎక్కువ వాసనల్నీ పసిగట్టారట. వాళ్ల ఎమ్మారై స్కాన్‌లను పరిశీలించగా- వాసనల్ని పసిగట్టే మెదడుభాగం దెబ్బతిన్నవాళ్లలో పరిసరాలను గుర్తుంచుకునే జ్ఞాపకశక్తీ లోపించినట్లు గుర్తించారు. దీన్నిబట్టి ఈ రెండింటికీ కారణం ఒకే మెదడు భాగమని వివరిస్తున్నారు.


టూకీగా...

అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలకే స్నేహితులు ఎక్కువ. ఎంత కొత్త వాతావరణంలో అయినా అబ్బాయిలు ఇట్టే కలిసిపోతారు. త్వరగా స్నేహం చేసుకుంటారు అంటున్నారు కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ పరిశోధకులు.

* చిన్నవయసులో పిల్లలు అబద్ధం చెప్పడం నేర్చుకుంటే వాళ్లలో తెలివితేటలు ఎక్కువని అర్థం చేసుకోవాలి అంటున్నారు టొరంటో విశ్వవిద్యాలయ నిపుణులు. ఎందుకంటే తెలిసీ తెలియని వయసులో చెబుతున్న అబద్ధం వాళ్ల మెదడు చురుకుదనానికి చిహ్నమని తేలిందట..

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.