close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
హరివిల్లు విరిసింది చామంతిలో!

ఎర్రని గులాబీలూ తెల్లని లిల్లీలూ పచ్చని చామంతులూ నీలి డిసెంబరాలూ... ఇలా ఒక్కో పువ్వూ ఒక్కో రంగుతో సుపరిచితం. కానీ ఈమధ్య పూలల్లో రంగుల హద్దులు చెరిగిపోయాయి. ఇదీ అదీ అని లేకుండా వేనవేల రంగుల్లో పూసేలా చేస్తున్నారు హార్టీకల్చరిస్టులు. అందులో భాగమే ఈ రంగుల చామంతులు... సుందర పూబంతులు..!‘

బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే’ అన్నాడో కవి. ఆ సంగతేమోగానీ, ఇప్పుడు బఠాణీ, క్రాంట్‌బరీ... వంటి పూలతో జతకట్టి సరికొత్త రంగుల్లో విచ్చుకుంటోంది చామంతి పువ్వు. అవునుమరి, పూల రంగుల్లోగానీ కట్‌ఫ్లవర్స్‌ మార్కెట్లోగానీ గులాబీల తరవాతి స్థానం చామంతులదే. అందుకే ఎన్నేళ్లో శ్రమించి నీలి గులాబీలను సృష్టించినట్లే నీలి చామంతుల్నీ పుట్టించేశారు శాస్త్రవేత్తలు. పూలకాడలకు రంగుల్ని ఎక్కిస్తూ సప్తవర్ణాల్లోనూ విరిసేలా చేస్తున్నారు. అమెరికాలో వ్యాపారం కోసం పెంచే పూలలో చామంతిదే ప్రథమస్థానం. అక్కడదే ‘క్వీన్‌ ఆఫ్‌ ఫాల్‌ ఫ్లవర్స్‌’. 
నీలి నీలి చామంతీ..! 
చామంతి అనగానే చిట్టి చామంతి, ముద్ద చామంతి, గడ్డి చామంతి, రేక చామంతి... ఇలా ఏవో కొన్ని రకాలే గుర్తొస్తాయి మనకి. రంగుల గురించి ఆలోచిస్తే పసుపూ తెలుపూ మహాఅయితే ఎరుపూ స్ఫురిస్తాయి. కానీ చామంతులది చాలా పెద్ద కుటుంబం. జాతులే వందలకొద్దీ ఉన్నాయి. ఇక రంగులదేముందీ... గులాబీ, నారింజ, ఊదా, కనకాంబరం, బర్గండీ, ఆకుపచ్చ, లావెండర్‌, పీచ్‌... ఇలా రకరకాల రంగులూ షేడ్‌లూ ఉన్నాయి. వాటిల్లో సహజంగానే పుట్టుకొచ్చినవి కొన్నయితే, గ్రాఫ్టింగ్‌ ద్వారా సృష్టించినవి మరికొన్ని. ఇప్పుడు కొత్తగా వాటికి నీలివర్ణమూ తోడయింది. 
అయితే నీలిచామంతి ఏ ఒక్క రోజో పుట్టింది కాదు, జపాన్‌కు చెందిన నేషనల్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ ఫుడ్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌కు చెందిన నిపుణుల పదమూడేళ్ల శ్రమ ఫలితం అది. సూక్ష్మక్రిమి ద్వారా బఠాణీ, క్రాంట్‌బరీ మొక్కల డీఎన్‌ఏని తెల్లచామంతిలో ప్రవేశపెట్టి మరీ సృష్టించారు. అందులోని జన్యు శాతాన్ని బట్టి అవి రకరకాల నీలిఛాయల్లో పుష్పిస్తాయి. సృష్టిలో ఇన్ని రంగులు ఉండగా నీలిరంగుమీద ఎందుకంత మోజూ అంటే- అందులోని ఆంథోసైనిన్‌లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. దాంతో ఈ రంగు పూలని కేవలం అందంకోసమే కాదు, ఫుడ్‌కలర్స్‌లోనూ వాడుకోవచ్చు. గులాబీలానే చామంతి కూడా తినే పువ్వే మరి. దీనికి తోడు రంగుల్లో గులాబీ తరవాత ఎక్కువమంది ఇష్టపడేది నీలివర్ణాన్నేనట. కానీ పూలల్లో నీలిరంగు అరుదైనది. అందుకే ఈ రంగు పూలమీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు నిపుణులు.

‘ఆనంద’ చామంతి! 
చామంతులమీద ప్రపంచ ప్రజలందరి ఇష్టం ఒక ఎత్తయితే, జపాన్‌ వాసుల ఇష్టం మరో ఎత్తు. ఇది వాళ్ల రాచపుష్పం, జాతీయపుష్పం కూడా. పైగా చలికాలంలో విచ్చుకునే చామంతుల్ని ఏడాది చివరి కుసుమాలుగానూ అద్భుత అందాలుగానూ భావిస్తూ పెరట్లోనూ ఉద్యానవనాల్లోనూ కళాత్మకంగా పెంచి ఆనందిస్తారు జపనీయులు. మన హరికథ, బుర్రకథల మాదిరిగా చామంతుల్ని బొమ్మల రూపంలో పెంచి ప్రదర్శించే హీరాకట అనే కళను ఇప్పటికీ అక్కడ ఏటా ప్రదర్శిస్తుంటారు. ప్రాచీన చైనాలో చు-సియాన్‌ పేరుతో చామంతుల నగరం కూడా ఉండేదట. నిజానికి చైనా నుంచి నాలుగో శతాబ్దంలో పరిచయమైన చామంతి అందానికి మురిసిన నాటి జపాన్‌ చక్రవర్తి, దాన్ని అధికార చిహ్నంగా ప్రకటించాడట. అప్పటినుంచీ దీన్ని జపనీస్‌ భాషలో ‘కీకూ’గా పిలుస్తూ ఆనంద పుష్పంగా భావిస్తూ జాతీయ చామంతి దినోత్సవాన్నీ జరుపుకుంటున్నారట రాజసింహాసనంమీదా కీకూ బొమ్మ కనిపిస్తుంది. అందుకే జపాన్‌ రాజవంశాన్ని క్రిసాంథÇమమ్‌ త్రోన్‌గా పిలుస్తారు. గ్రీకులో క్రిసా అంటే బంగారు వర్ణమనీ, ఆంథÇమమ్‌ అంటే పువ్వు అనీ అర్థం. నిజానికి క్రీ.పూ. 15వ శతాబ్దం నుంచీ చైనాలో పెంచుతున్న ఈ సువర్ణ పుష్పం, ఐరోపావాసులకి పరిచయమైంది మాత్రం 17వ శతాబ్దంలోనేనట. కానీ చాలా వేగంగా ప్రపంచమంతా అల్లుకుపోయి, వందల రంగుల్లో విచ్చుకుంటోంది. 
అర్థవంతమైన చామంతి! 
నవంబరు బర్త్‌ ఫ్లవర్‌ అయిన చామంతిని ఆశావాదానికీ ఆనందానికీ ఆయుఃప్రమాణానికీ సంకేతంగా భావిస్తారు. దీర్ఘకాలంపాటు జీవించమనీ అదృష్టం కలగాలనీ చైనీయులు చామంతుల్ని అందిస్తే, విక్టోరియన్లు స్నేహబంధాన్ని అల్లుకునేందుకూ ఇస్తారట. బౌద్ధులు శక్తిమంతమైన యాంగ్‌ ఎనర్జీకోసం చామంతుల్ని సమర్పిస్తారు. ముద్దుపేరు మమ్స్‌ అన్న కారణంతో మదర్స్‌డేకి చామంతుల బొకేల్ని ఇస్తారు ఆస్ట్రేలియన్లు. ఆస్ట్రియా, బెల్జియం వాసులకి మాత్రం చామంతి ఓ జ్ఞాపకాల దొంతర. దూరమైన తమ ప్రియతములకు చామంతుల పుష్పాంజలి ఘటిస్తారట. అంతేకాదు, ప్రేమకి సంకేతంగా ఎర్ర చామంతుల్నీ, నిజాయితీకి తెల్లనివీ, అనారోగ్యం నుంచి త్వరగా కోలుకొమ్మని ఊదా రంగువీ, దుఃఖానికి గుర్తుగా పసుపు చామంతుల్నీ ఇచ్చిపుచ్చుకుంటారట.

ఔషధ చామంతి! 
చైనా, జపాన్‌లలో చామంతి టీ అనేక రోగాలకు మందు. అందుకే అక్కడ కిచెన్‌ గార్డెన్‌లో ప్రత్యేకంగా పెంచుకుంటారు. పసుపూ తెలుపూ చామంతిపూలను మరిగించగా వచ్చిన ఓ రకమైన పానీయాన్ని జుహువా చా పేరుతో ఇష్టంగా తాగుతారు చైనీయులు. ఇందులో ఎన్నో ఔషధాలు ఉంటాయనీ అనేక వ్యాధులకి మందులా పనిచేస్తుందనీ చెబుతారు. అలాగే ఛాతీలో నొప్పికీ బీపీ, మధుమేహం నియంత్రణకీ, తలనొప్పి, జ్వరం తగ్గడానికీ చామంతి మొలకల్నీ పూరేకుల్నీ పూర్వకాలం నుంచీ వాడుతున్నారు చైనీయులు. వేళ్లను మరిగించి తలనొప్పి నివారణకు కషాయంలా వాడతారు. ముఖ్యంగా క్రిసాంథమమ్‌ కొరొనేరియమ్‌ రకాన్ని తినే చామంతిగా చెబుతూ కొత్తిమీర, పుదీనా మాదిరిగా దాని లేత ఆకుల్ని వేపుళ్లూ, సూపులూ సలాడ్లలోనూ టీలోనూ వాడతారు. ఆయిస్టర్‌ ఆమ్లెట్‌లో ఇవి తప్పనిసరి. ఆధునిక నిపుణులూ చామంతి టీలో విటమిన్లూ ఖనిజాలూ అమైనో ఆమ్లాలూ పుష్కలంగా ఉన్నాయనీ అవి గుండె, చర్మం, నరాలు, ఎముక ఆరోగ్యాన్ని పెంచడంతోబాటు కంటిచూపునీ మెరుగుపరుస్తాయనీ రోగనిరోధకశక్తిని పెంచి దీర్ఘకాలిక వ్యాధుల్ని తగ్గిస్తాయనీ జీవక్రియని పెంచుతాయనీ అంటున్నారు. పైగా చామంతుల్ని ఇంట్లో పెంచితే కార్బన్‌డైఆక్సైడ్‌ తగ్గుతుంది. క్రిసాంథమమ్‌ సినారెరిఫోలియమ్‌ అనే మొక్క ఆకుల్లోని రసాయనాలవల్ల కీటకాలు రాకుండా ఉంటాయట. 
శరత్కాలపు వెన్నెలతో పోటీపడుతూ మొక్కనిండుగా విరిసే పెరడంతా మెరిసే చామంతుల్ని చూస్తే కళ్లకి ఆహ్లాదం... మనసుకి ఆనందం... అందుకే చలికాలంలో ఇళ్లతోబాటు అనేక దేశాల్లోని ఉద్యానవనాలన్నీ చామంతుల ప్రదర్శనలతో కళకళలాడుతూ సందర్శకుల్ని ఆకర్షిస్తాయి. అందులోనూ న్యూయార్క్‌ బొటానికల్‌ గార్డెన్స్‌లో రంగురంగుల్లో భిన్న ఆకారాల్లో విప్పారిన కళాత్మక చామంతుల్ని చూడ్డానికి రెండు కళ్లూ చాలవంటారు ఉద్యాన ప్రియులు. అక్కడికి వెళ్లలేకున్నా మనదైన పద్ధతిలో మనమూ పెంచేద్దామా..?

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు