close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మనసున మనసై...

‘పెళ్లంటే నూరేళ్ల పంట’ అన్నారు పెద్దలు. ‘కాదు నూరేళ్ల వంట’ అని వనితలూ ‘కాదు కాదు నూరేళ్ల తంటా’ అని పురుషులూ అంటుంటారు. నవ్వుకోడానికేం... ఎన్నైనా అనుకోవచ్చు. కానీ ‘చూసేవారికి కన్నులపంట’లా జీవించగలిగితే... స్వర్గానికి చిరునామా ఆ ఇల్లే అనిపిస్తుంది!

అందాల రాకుమారిని భయంకరమైన ఓ రాక్షసుడు ఎత్తుకుపోతాడు. అడవిలోని బంగళాలో బంధిస్తాడు. ధీరుడైన ఓ యువరాజు తెల్లని గుర్రమెక్కి వచ్చి రాక్షసుడిని చంపేస్తాడు. రాకుమారిని తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత వారిద్దరూ చిరకాలం చిలకాగోరింకల్లా సంతోషంగా జీవిస్తారు. చిన్నప్పుడు మనం చదువుకున్న కథలన్నీ దాదాపు ఇలాగే ముగుస్తాయి.
కానీ సంసారమన్నాక మనకు సవాలక్ష సమస్యలుంటాయి. కథలో రాకుమారి సంసారం లాగా ఎప్పటికీ సంతోషంగా జీవించడం సాధ్యమా?
సాధ్యమేనంటున్నారు పరిశోధకులు. భార్యాభర్తలిద్దరూ కాస్త వయసును మర్చిపోయి, మనసుపెట్టి వ్యవహరిస్తే చాలంట. ఆ ఇల్లు సంతోషానికి కేరాఫ్‌ అడ్రస్‌ అవుతుందట. అందుకు ఏం చేయాలో వివిధ రంగాల నిపుణులు చేపట్టిన పలు అధ్యయనాల సారాన్ని విశ్లేషించి చెప్పిన సలహాలివి!

మనసు విప్పండి!
మనిషి జీవితంలో అన్ని బంధాల్లోకీ వివాహబంధానిదే ప్రథమ స్థానం. భాగస్వామిదే తొలిప్రాధాన్యం. పిల్లలు పెద్దవాళ్లై వాళ్ల దారిన వాళ్లు వెళ్లిపోతారు. చివరికి మిగిలేది మళ్లీ ఇద్దరే. అప్పుడు ఒకరికొకరు అపరిచితుల్లా మిగలకూడదనుకుంటే మొదటి నుంచీ అనుబంధాన్ని పెంచి పోషించుకోవాలి. ఉద్యోగాలూ పిల్లలూ పెద్దల బాధ్యతలూ... జీవితంలో నాలుగు పదులు నిండేసరికల్లా క్షణం తీరికలేని పరిస్థితి వస్తుంది. అయినా కాసేపు భార్యాభర్తలిద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటే ఒత్తిళ్లన్నీ పరార్‌! మాట్లాడుకోవడమంటే స్వీట్‌ నథింగ్సే కానక్కర్లేదు. సంగీతం ఆమెకిష్టం. రాత్రి భోజనాలయ్యాక తీరిగ్గా టీవీ ముందు కూర్చునే బదులు వంటింట్లోనో పడకగదిలోనో పనిచేసుకుంటున్న ఆమె దగ్గర కూర్చుని కొత్త పాటలు విన్పిస్తూ కాసేపు కబుర్లు చెబితే, పెళ్లైన కొత్తలో చూసిన సినిమాలూ, విన్న పాటలూ గుర్తుచేసుకుంటే... ఎంత హాయిగా ఉంటుంది. ఆ కబుర్లే నెమ్మదిగా కుటుంబవిషయాలమీదికీ మళ్లుతాయి. చర్చించుకుని నిర్ణయాలు తీసుకోవడానికి అంతకన్నా మంచి సమయం ఏముంటుంది. రోజూ కాసేపు మనసు విప్పి మాట్లాడుకునే ఇంట్లో అపోహలకూ అభిప్రాయభేదాలకూ తావే ఉండదు.

భిన్నత్వంలో ఏకత్వం
కొన్ని జంటలకు అభిరుచులు ఎంతగా కలిసిపోతాయంటే జిగ్‌సా పజిల్‌లో ముక్కల్లా పర్‌ఫెక్ట్‌గా ఒకరిలో ఒకరు ఒదిగిపోతారు. కొన్ని జంటలు మాత్రం భిన్నమైన అభిరుచులతో విరుద్ధమైన స్వభావాలతో ఉంటారు. అయితే అన్యోన్యంగా ఉండడానికి ఇవేవీ అడ్డుకావంటారు నిపుణులు. ఒకరి అభిరుచులను మరొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగితే ఇద్దరిమధ్యా స్నేహబంధం బలపడుతుంది. ఒకరికి యాక్షన్‌ సినిమాలంటే ఇష్టం. మరొకరికి రొమాంటిక్‌ ప్రేమ కథలంటే ఇష్టం. ఇద్దరూ విడివిడిగా స్నేహితులతో తమకు నచ్చిన సినిమాలు చూసినా అప్పుడప్పుడూ భాగస్వామితో కలిసి వారికి నచ్చిన సినిమా చూడవచ్చు. ఇలాంటి చిన్న చిన్న సర్దుబాట్లతో ఒకరికొకరు మానసికంగా దగ్గరవుతారు. బంధంలో పరిణతి వస్తుంది. పైగా ఇరువురి వ్యక్తిత్వాల్లో, అభిరుచుల్లో ఉన్న భిన్నత్వం వల్ల జీవితం వారికి నిత్యం కొత్తగానే ఉంటుందట.

నోరారా ఓ ప్రశంస!
థ్యాంక్స్‌, సారీ... బయటివాళ్లకి తేలిగ్గా చెప్పేస్తాం. భాగస్వామి దగ్గరకి వచ్చేసరికి? ఇంట్లోవాళ్లకి కూడా ఫార్మల్‌గా థ్యాంక్స్‌ చెప్పాలా... అనుకుంటారు చాలామంది. అలా చెప్పడం కృతకంగా ఉంటుందంటారు. ఆ అభిప్రాయం తప్పంటున్నారు మానసిక నిపుణులు. తన ఆఫీసుకు టైమవుతున్నా ఆమెను బస్టాండులో దించివెళ్లినప్పుడు చిరునవ్వుతో చేతి మీద చెయ్యి వేసి థ్యాంక్స్‌ చెబితే రోజూ అడగకపోయినా దించివెళతారు. బెండకాయ వేపుడు నాకన్నా మావారే బాగా చేస్తారని ఆమె మనసారా మెచ్చుకుంటుంది. ఇస్త్రీ ఆమె చేసినట్లు తనకు రాదని ఆయన ఒప్పుకుంటాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇలా ప్రశంసించుకోవడం వల్ల వారి మధ్య అనుబంధం బలపడుతుంది. ఏ విషయంలోనైనా అభిప్రాయభేదాలు వచ్చినా సామరస్యంగా పరిష్కరించుకునే సానుకూల ధోరణి అలవడుతుంది. పైగా ప్రశంసించే భాగస్వామితో శృంగారాన్ని మనస్ఫూర్తిగా ఆనందించగలుగుతారనీ అదే చీటికీ మాటికీ చిరాకుపడే భాగస్వామితో శృంగారానికి స్త్రీలు విముఖత చూపిస్తారనీ ఓ తాజా అధ్యయనం వెల్లడిస్తోంది.

చిన్న చిన్న తుళ్లింత
జీవితం రొటీన్‌గా ఉంటే ఎవరికీ నచ్చదు. చిన్న చిన్న సరదాలూ తుళ్లింతలే బంధంలో ఉత్తేజాన్ని నింపుతాయి. అందుకని అప్పుడప్పుడూ గతంలోకి వెళ్లాలి. పెళ్లైన కొత్తలో చేసిన చిలిపి పనులు గుర్తుచేసుకోవాలి. హనీమూన్‌ నుంచి వచ్చాక ఆఫీసు అడ్రసుకు ఆమె రాసిన ప్రేమలేఖ ఇప్పటికీ అతని బ్రీఫ్‌కేసులో అడుగున భద్రంగా ఉంటుంది. అలాంటి పని మళ్లీ ఓసారి చేస్తే..! ఆయన మూడ్‌ గురించో, చేసిన పని గురించో ప్రశంసిస్తూ ఒక చిన్న నోట్‌ రాసి పాకెట్‌లో పెడితే, కవ్విస్తూ ఓ రొమాంటిక్‌ ఈ మెయిల్‌ ఇస్తే... అది చదివి ఆయన పెదవుల మీద విరిసే చిన్న చిరునవ్వు... ప్రేమ బంధానికి ఎరువవుతుంది. ప్రేమగా ఉత్తరాలు రాసుకోడానికి రచయితలే కానక్కర్లేదు. ప్రేమ ఊసులే ఉండనక్కర్లేదు. ఆయన ఇచ్చిన ఓ సలహా ఆఫీసులో తనకెంత బాగా ఉపయోగపడిందో వివరిస్తూ చివరగా ఒక్క థ్యాంక్స్‌ చెప్పినా- ఆయనకు ఏనుగెక్కినంత ఆనందం. అంత ఆనందాన్ని పంచి మరోసారి మనసు దోచుకున్న ప్రియమైన ఇల్లాలికి ఇంటికి వచ్చేటప్పుడు ఏమీ తేకుండా ఉంటారా?

కాఫీ కబుర్లు
పొద్దున్నే లేచి కలిసి కాఫీ తాగేటప్పుడు ఆరోజు ఇంట్లోనూ ఆఫీసులోనూ చేయాల్సిన ముఖ్యమైన పనుల గురించి ఒకరిని ఒకరు ప్రశ్నించుకోవచ్చు. ఆమెకు కొత్త క్లయింట్‌తో ఇంటర్వ్యూ ఉండవచ్చు. ఆయన ఆఫీసులో ఆడిటింగ్‌ ఉండవచ్చు. ఆ పనులు ఎలా జరుగుతాయోనని మనసులో ఇద్దరికీ కాస్త ఆందోళనగానే ఉంటుంది. దాని గురించి భాగస్వామితో రెండు నిమిషాలు మాట్లాడితే టెన్షన్‌ తగ్గి రిలాక్స్‌డ్‌గా ఉంటారు. సలహాలే ఇవ్వక్కర్లేదు. విన్నా చాలు, తనకి అండగా ఓ మనిషి ఉన్నారన్న భావన ఇరువురికీ ఆత్మస్థైర్యాన్నిస్తుంది. ఉద్యోగం గురించే కాదు, పిల్లల స్కూల్లో పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌ ఉన్నా, ఇంటికెవరైనా బంధువులు వస్తున్నా, ఆస్పత్రో మరో చోటికో వెళ్లాల్సిన పని ఉన్నా... ఒకసారి భాగస్వామితో దాని గురించి మాట్లాడితే మనసుకి స్థిమితంగా ఉంటుంది.

కోపమా... కాస్త ఆగుమా!
భాగస్వామి చేసే కొన్ని పనులు చిరాకు తెప్పిస్తాయి. తడి తువ్వాలు మంచం మీద కనపడగానే ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా అని అరిచి గొడవపడితే ప్రయోజనం శూన్యం. తెలివైన ఇల్లాలు అప్పటికి మనసు మళ్లించుకుని చికాకును తరిమేస్తుంది.
ఏ సాయంత్రమో కూర్చుని కబుర్లు చెప్పుకొంటున్నప్పుడు ‘ఓ చిన్న విషయం’ అంటూ నచ్చజెప్పే ధోరణిలో తనకు ఇబ్బంది కలిగిస్తున్న అలవాట్ల గురించి చెబుతుంది. అది ఫిర్యాదులా ఉండదు. తనకు కలుగుతున్న అసౌకర్యాన్నీ లేదా ఆ పని వల్ల వస్తువులకు జరిగే నష్టాన్నీ... వివరిస్తుంది. శ్రోత వెంటనే అంగీకరిస్తాడు. ఇంకెప్పుడూ అలా చేయనని మాటిచ్చేస్తాడు. అలవాటు ప్రకారం మర్నాడు చేసినా, చిరునవ్వుతో ఓసారి గుర్తుచేస్తే చాలు వెంటనే తప్పు దిద్దుకుంటాడు.

మర్యాద... మర్యాద
‘పొద్దున్న వంట నేను చేశాను కదా, సాయంత్రం మీరు చేయండి. వాషింగ్‌ మెషీన్‌ నేను వేశాను. తీసి ఆరేయడం మీ వంతు...’ పనులు పంచుకోవడం బాగానే ఉంటుంది కానీ ఇలా చెప్పడమే నచ్చదు చాలామందికి. అదే ‘కాస్త ఈ పని
చేసిపెడుదురూ’ అని ప్రేమగా అడిగితే ఏ పని అయినా చేసిపెట్టేస్తారట. స్నేహితుల మధ్య ఉన్నప్పుడు భార్య మీద సరదాగా జోకులు వేస్తుంటారు కొందరు. అది ఆమెలో ఆత్మన్యూనతకి దారితీస్తుంది. స్త్రీలైనా పురుషులైనా పదిమందిలో ఉన్నప్పుడు కూడా భాగస్వామిని గౌరవించడం, గర్వంగా ఇతరులకు పరిచయం చేయడం... వారి మధ్య ప్రేమను రెట్టింపు చేస్తుంది.

మారిపోనక్కర్లేదు
పెళ్లికి ముందూ పెళ్లైన కొత్తలోనూ భాగస్వామిని సంతోషంగా ఉంచడానికి ఇద్దరూ కూడా ఎన్నో పనులు చేస్తారు. ఆకర్షణీయంగా ముస్తాబవుతారు. ఎదుటివారికి నచ్చే విషయాలు మాట్లాడతారు. ముద్దూముచ్చట్లతో మురిపిస్తారు. పెళ్లయిన కొంతకాలానికి అవన్నీ మాయమై పోతే... జీవితం నిస్తేజంగా మారుతుంది. సంతోషంగా జీవించాలనుకునేవారు అలా కానివ్వరు. వారు ఎప్పటిలాగే ఆకృతి మీదా అందం మీదా శ్రద్ధ తీసుకుంటారు. అది కేవలం అందం మీద మోజుతో కాదు. భాగస్వామికి నచ్చేలా ఉండడం వారికి ఇష్టం. ఒకరి అభిరుచులకు అనుగుణంగా మరొకరు అలా శ్రద్ధ తీసుకోవడం కూడా ఇద్దరిలోనూ ప్రేమను పెంచుతుంది.

ఆనందం... ఆరోగ్యం!

దాంపత్యజీవితం ఆనందంగా గడిపేవారి జోలికి రావడానికి అనారోగ్యాలు కూడా భయపడతాయంటున్నారు పరిశోధకులు.
* సంతృప్తికరమైన వైవాహిక జీవితం గడిపేవారు దీర్ఘాయుష్మంతులవుతారట.
* గుండెజబ్బులు, మధుమేహం లాంటివి వచ్చే అవకాశాలు తగ్గుతాయి. 
* సహచరి ప్రేమ పురుషుల్లో దుడుకుస్వభావాన్ని తగ్గించి, జీవితం పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించేలా చేస్తుందట.
* తరచూ శృంగారంలో పాల్గొనేవారిలో ‘ఇమ్యునోగ్లోబ్యులిన్‌ ఎ’ అనే యాంటిబాడీ ఎక్కువగా ఉత్పత్తై వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. దాంతో వారు సాధారణ అనారోగ్యాలనుంచి త్వరగా కోలుకుంటారు. అంతేకాదు ఇది స్త్రీపురుషులిద్దరినీ కొన్ని రకాల క్యాన్సర్ల బారినుంచి కూడా కాపాడుతుందట.
* మానసికంగా కుంగుబాటుకు లోనయ్యే అవకాశం చాలావరకు తగ్గిపోతుంది.
* వ్యసనాలూ దురలవాట్లూ తగ్గుతాయి.

స్పర్శ చికిత్స
భార్యాభర్తల మధ్య స్పర్శ కూడా చికిత్సలాగా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందే కాదు, పొద్దున్న లేవగానే కూడా... ఒక ఐదు నిమిషాలు ఒకరి కౌగిలిలో ఒకరు కాసేపు ఒదిగిపోతే... మనసు సేదతీరుతుంది. మాటలక్కర్లేదు. స్పర్శ చాలు. కొంతమంది పిల్లల ముందూ, ఇతర కుటుంబ సభ్యుల ముందు భాగస్వామి దరిదాపుల్లోకి కూడా రారు. ముద్దో, కౌగిలో అయితే పడకగదిలోనే కానీ ప్రేమగా భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి తీసుకోవడానికీ చేతిలో చెయ్యేసి నీకు నేనున్నానన్న ధైర్యం చెప్పడానికీ ఎందరిలో ఉన్నా ఇబ్బంది పడనక్కరలేదు. అలాంటి చర్యల వల్ల ఇద్దరిలోనూ ఏ విధమైన ఆందోళన ఉన్నా తగ్గి ప్రశాంతంగా దినచర్యలో లీనమవగలుగుతారు.

అప్పుడప్పుడూ... సోలోగా
ఎప్పుడూ ఇద్దరూ జంట పక్షుల్లా డ్యూయెట్లు పాడుకుంటూ కలిసి తిరగడం బాగానే ఉంటుంది కానీ అప్పుడప్పుడూ ఇద్దరూ విడివిడిగా తమ హాబీలపై దృష్టిపెట్టడం మంచిదని నిపుణుల సలహా. ఒంటరిగా ఉన్నప్పుడు తమ గురించి ఆలోచించుకోవడానికీ కొత్త విషయాలు తెలుసుకోవడానికీ స్వయంగా ఎదగడానికీ అవకాశం లభిస్తుంది. ఆమె పెళ్లికి ముందు తాను నేర్చుకున్న సంగీతాన్నో నృత్యాన్నో కొనసాగిస్తుంది. తన ప్రదర్శన ఉన్నప్పుడు ఆయన్ని తీసుకెళ్తుంది. అలాగే ఆయన ఫ్రెండ్స్‌తో బ్యాడ్మింటన్‌ ఆట కొనసాగిస్తాడు. ఆయనకు నచ్చిన పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌కి ఆమె కూడా వెళ్తుంది. వెళ్లడమే కాదు, ఆ విషయాల గురించి ఆసక్తిగా తెలుసుకోవడమూ ఇద్దరూ తమ స్నేహితులను భాగస్వామికి పరిచయం చేయడమూ...
ఈ చర్యలన్నీ ఇద్దరిలోనూ పరస్పరగౌరవాన్నీ ఆత్మవిశ్వాసాన్నీ పెంచుతాయి.

చర్చలే ముద్దు
సంసారం అన్నాక ఎన్నో బంధాలూ బాధ్యతలూ. ఇద్దరు వ్యక్తులు కలిసి కాపురం చేస్తున్నప్పుడు అభిప్రాయభేదాలు రాకుండా ఉండవు. తాము అనుకుంటున్నట్లుగానే జరిగితే బాగుంటుందని ఇద్దరికీ ఉంటుంది. మనసులో ఉన్న అభిప్రాయం చెప్పడం వేరు. జరిగి తీరాలని శాసించడం వేరు... ఎవరికి వారు తమ వాదనే గెలవాలన్న అహంకారం ప్రదర్శిస్తే చినికి చినికి గాలివానవుతుంది. సర్దిచెప్పడానికి మూడోవారి ప్రమేయం అవసరమవుతుంది. అందుకే తెలివైన దంపతులు వాదనజోలికి వెళ్లరు. ఆవేశానికి తావివ్వరు. ఒకరి ఆధిపత్యం అసలుండదు. స్నేహపూరిత వాతావరణంలో సామరస్యంగా చర్చిస్తారు. మంచీ చెడూ విశ్లేషించుకుని తగిన నిర్ణయం తీసుకుంటారు. అది ఉమ్మడి నిర్ణయమే అవుతుంది. ఎవరో ఒకరిదే పైచేయి కాదు. భార్యాభర్తలిద్దరి మధ్యా అలాంటి స్నేహం ఉన్నన్నాళ్లూ వారి బంధానికి ఎలాంటి ఢోకా లేదంటున్నారు నిపుణులు.

ఆ సమయం ప్రత్యేకం
అనుబంధానికీ ఆరోగ్యానికీ శృంగారం చాలా అవసరం. అందుకే ఆ సమయం వృథా కాకూడదు. అర్ధరాత్రి వరకూ టీవీ చూడడమూ సోషల్‌ మీడియాలో స్నేహితులతో ముచ్చట్లు పెట్టడమూ ఆదర్శదాంపత్యానికి తగవు. పడక గదిలోకి వెళ్లాక నువ్వు, నేను తప్ప మరో మాట ఉండకూడదు. అప్పుడప్పుడూ చెప్పకుండా సెలవు పెట్టి ఒకరినొకరు సర్‌ప్రైజ్‌ చేయడం, ఒకోసారి ముందుగానే ప్రణాళిక వేసుకుని ఒకరినొకరు ఊరించుకుంటూ ఉత్సాహపరుచుకుంటూ కలిసి గడిపే సమయాన్ని ఎంజాయ్‌ చేయడం వయసును మరిపిస్తుంది. జీవితం పట్ల ప్రేమను పెంచుతుంది. ఉద్యోగస్తులైన భార్యాభర్తలు మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఆఫీసు పనినీ ఒత్తిళ్లనూ ఇంటిలోనికి రానీయకూడదు. ముఖ్యంగా పడకగదిలోకి. అది ప్రణయసామ్రాజ్యం మాత్రమే. అక్కడ ఫైళ్లకు ప్రవేశం లేదు. రాజకీయ చర్చలకు అంతకన్నా తావు లేదు. ఇద్దరూ కలిసి ఓ రొమాంటిక్‌ సినిమా
చూడడానికే మాత్రమే మంచం మీదికి ల్యాప్‌టాప్‌ తెచ్చుకోవాలి.

అలవాట్ల ప్రభావం!

కొన్ని అలవాట్లూ పద్ధతులూ కూడా భాగస్వాముల మధ్య ప్రేమపై ప్రభావం చూపుతాయంటోంది ఇటీవల వెలువడిన ఓ అధ్యయనం.
* రాత్రిళ్లు ప్రశాంతంగా మంచి నిద్రపోయే పురుషులు భార్యను బాగా చూసుకుంటారట. కనీసం ఏడుగంటల నాణ్యమైన నిద్ర ఉంటే మనసుకు తగిన విశ్రాంతి లభించి భావోద్వేగాలను చక్కగా నియంత్రించుకోగలుగుతారట.
* భాగస్వామి మీద చీటికీ మాటికీ విసుక్కుంటూ అన్ని విషయాలూ మర్చిపోతున్నారా? అయితే ఆ తప్పూ అలవాట్లదే. ఆలస్యంగా నిద్రపోవడం, రోజంతా ఏ విషయంలోనూ కచ్చితమైన వేళాపాళా పాటించకపోవడం లాంటి అలవాట్లు దాంపత్యజీవితంపై తీవ్రప్రభావం చూపుతాయట. ఈ పద్ధతుల వల్ల భాగస్వాముల్లో మానసిక ఆందోళన ఎక్కువవుతుందట.
* జంటగా కలిసి వాకింగ్‌కి వెళ్లేవాళ్లలో, వ్యాయామమూ యోగాలాంటివి చేసేవాళ్లలో సమస్యలను 
సానుకూలంగా ఎదుర్కొనే స్వభావం, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతున్నాయట.

సరదాల సంసారం
సరదాలను పంచుకునేవారి జోలికి రావడానికి సమస్యలు కూడా భయపడతాయట. తమని కూడా వారు నవ్వుతూ తీసిపడేయగలరని. అవును, ఇద్దరూ రోజూ తమకు ఎదురయ్యే సరదా సన్నివేశాలను భాగస్వామితో పంచుకుంటూ ఉంటే ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చే సందర్భాలు తగ్గుతాయని ఓ సర్వే తేల్చింది. కాబట్టి ఇంట్లోనూ బయటా జరిగే సరదా సంఘటనలను చెప్పుకొని కాసేపు మనసారా నవ్వుకోవడం అలవాటైతే ఇక సంతోషం మీ వెంటే. జీవితం రొటీన్‌లో పడకుండా నిత్యనూతనంగా ఉండాలంటే సరదా పనులు ఇంకా చాలా చేయొచ్చు. కొత్త కళో, కొత్త వంటో నేర్చుకుని వాటిని ప్రదర్శించే క్రమంలో చేసే ప్రయోగాలు ఇంట్లో బోలెడన్ని సరదా సన్నివేశాలను సృష్టిస్తాయి.

సంతోషం ఇక్కడే... ఈ క్షణమే!
సంతోషం జీవితానికి గమ్యం కాదు, ప్రయాణమార్గం. వెనకటికో వ్యక్తి కన్యాకుమారిలో సూర్యోదయ సౌందర్యం చూడాలని పడుతూ లేస్తూ కొన్నాళ్లు ప్రయాణించి అక్కడికి చేరుకున్నాడు. అప్పటికి అక్కడ మబ్బులు పట్టి రోజుల తరబడి వాన. గమ్యాన్ని చేరుకున్నా ఆశించిన ఫలితం
దక్కలేదు. నిజానికి అతను ప్రయాణించిన మార్గమంతా కూడా ఎన్నో సుందరదృశ్యాలున్నాయి. కానీ అతడు గమ్యం మీద మాత్రమే దృష్టిపెట్టి వెళ్లడంతో వాటిని గమనించలేకపోయాడు. ఎప్పుడో వచ్చే గొప్ప ఆనందాలకోసం రోజూ అనుభవంలోకి వచ్చే చిన్న చిన్న సంతోషాలను త్యాగం చేయడంలో అర్థం లేదంటారు నిపుణులు. నిత్యజీవితంలోనుంచే సంతోషాన్ని వెదుక్కునేవారు సంతృప్తిగా ఆనందంగా జీవిస్తారట.

***

ఏ దేశంలోనైనా, భాషేదైనా, మతమేదైనా... పెళ్లి ప్రమాణాల అర్థం ఒకటే. భాగస్వామిని ప్రేమిస్తాననీ, గౌరవిస్తాననీ, కలిమిలోనూ కష్టాల్లోనూ తోడూ నీడగా నిలుస్తాననీ చెప్పడమే. ఆ ప్రమాణాలకు కట్టుబడి జీవనవిధానాన్ని ప్రణాళికాబద్ధంగా మలచుకుంటే... భార్యాభర్తలు పాలూతేనెలా కలిసిపోయి కాపురం చేస్తే... జీవితం అందమైన నందనవనమై గుబాళిస్తుంది. సంసారం ప్రేమ సుధాపూరమై నవజీవనసారమై సాగుతుంది. జీలకర్రా బెల్లం లాగా వారిది విడదీయరాని బంధమవుతుంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.