close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఏ పనికైనా... ఓ డ్రోన్‌!

లక్ష్యాన్ని గురిపెట్టి ఛేదించడానికి సైన్యం కోసం తయారుచేసిన పరికరం... ఊహించని రీతిలో  నిత్యజీవితాల్లోకి వచ్చేసింది. శత్రు స్థావరాలపై నిఘా పెడుతోంది... పెళ్లిళ్లలో ఫొటోలు తీస్తోంది. వ్యవ‘సాయానికీ’ నేనున్నానంటోంది. వ్యాపారానికీ సై అంటోంది. సరకు రవాణాకే కాదు ప్రజారవాణాకీ దాని సేవలు అందుకోవడమే మార్గమని నాసా కూడా సర్టిఫికెట్‌ ఇచ్చేసింది మరి! అదే... డ్రోన్‌!
 

డోర్‌ డెలివరీ నేటి మాట. డ్రోన్‌ డెలివరీ రేపటి బాట. అమెజాన్‌లో ఆర్డరైనా, అమ్మ చేసిన ఆవకాయైనా డ్రోన్‌లతోనే తెప్పించుకోవచ్చు. అర్జెంటుగా విమానాశ్రయానికి వెళ్లాలా? ఓ డ్రోన్‌ ట్యాక్సీని బుక్‌ చేసుకుంటే ట్రాఫిక్‌ జామ్‌ల భయమే ఉండదు. అంతే కాదు, కాలికి మట్టి అంటకుండా గట్టు మీద కూర్చుని పొలంలో మందులు చల్లేయొచ్చు. పేలతాయన్న భయంలేకుండా మందుపాతరలనూ బాంబులనూ తొలగించొచ్చు. ట్రెకింగ్‌కి వెళ్లి తప్పిపోయారా...  పర్వాలేదు కాసేపట్లో కనిపెట్టేయొచ్చు. 360 డిగ్రీల్లో పెళ్లీ ఇతర వేడుకల ఫొటోలు తీయించుకోవచ్చు.
అల్లర్లూ, ఆందోళనలూ జరుగుతున్నప్పుడు ఉద్రిక్త పరిస్థితులకు దారితీయకుండా పర్యవేక్షించవచ్చు. ఇలాంటి ఇంకెన్నో పనులు... కుర్చీలోంచి కదలకుండా చేసేయొచ్చు. ఈ పనులన్నిటినీ డ్రోన్లు చేసేస్తాయి..!

ఏమిటీ డ్రోన్లు? ఎలా పనిచేస్తాయి?
‘డ్రోన్‌’ అనే ఆంగ్ల పదానికి అర్థం మంద్రంగా ఝంకారం చేసే మగ తేనెటీగ. ఈ పరికరాలు కూడా అలా చిన్నగా శబ్దం చేస్తూ ఎగురుతాయి కాబట్టి వీటిని సాధారణ భాషలో డ్రోన్లు అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పైలట్‌లేని బుల్లి విమానాలు. వీటి పనితీరును ‘అన్‌మ్యాన్డ్‌ ఏరియల్‌ సిస్టమ్‌’ అంటారు. అంటే మనిషి లేకుండా గాలిలో ఎగిరే వ్యవస్థ. ఇందులో పౌరసమాజ ఉపయోగాలకు వాడే వాటిని యూఏవీలనీ(అన్‌మ్యాన్డ్‌ ఏరియల్‌ వెహికిల్‌), మిలిటరీ ప్రయోజనాలకు వాడేవాటిని యూఏసీవీలనీ(అన్‌మ్యాన్డ్‌ ఏరియల్‌ కాంబాట్‌ వెహికిల్‌) అంటారు. పిల్లలు కారు బొమ్మలను రిమోట్‌తో నడిపి ఆడుకుంటుంటారు కదా. అచ్చం అలాగే డ్రోన్‌ని కూడా రిమోట్‌ సహాయంతో గాలిలో ఎగరేయవచ్చు. జీపీఎస్‌ కంట్రోల్‌తో ఎంచుకున్న పరిధిలో తిరిగేలా చేయవచ్చు. ఏదైనా అడ్డం వస్తే ఆగి పక్కకు తప్పుకొని వెళ్తాయి కాబట్టి ఢీకొంటాయన్న భయం లేదు. ఎగరడానికి వీలుగా హెలికాప్టర్‌కున్నట్లు రోటార్లుంటాయి.
రకరకాల సైజుల్లో, భిన్నమైన సామర్థ్యాలతో ఇవి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్నాయి.

ఎవరైనా వాడవచ్చా?
డ్రోన్లను ఎవరైనా వాడొచ్చు. అందుకు ప్రత్యేకనైపుణ్యాలేమీ అక్కర్లేదు. కొద్దిపాటి శిక్షణ చాలు. విమానాలూ, హెలికాప్టర్లూ, గ్లైడర్లతో పోలిస్తే ఇవి చాలా చౌక. పైగా అత్యంత ఆధునిక సాంకేతికత ఉంటుంది. ఎన్నో రకాల పనులకు ఉపయోగపడతాయి. అమెరికాలో పిల్లలు డ్రోన్లతో రకరకాల పనులు చేయడాన్ని హాబీగా నేర్చుకుంటున్నారు. డ్రోన్‌లను ఎగరేయడంలో పోటీలూ పడుతుంటారు. క్రిస్మస్‌ సమయంలో డ్రోన్లను ఎక్కువగా కొంటున్నారట అక్కడ. ప్రపంచంలో ప్రైవేటు డ్రోన్ల వాడకం కూడా అక్కడే ఎక్కువ. అయితే ఏ దేశంలోనైనా సరే డ్రోన్‌ కొనుక్కోగానే పౌరవిమానయాన శాఖ వద్ద నమోదు చేయించాలి. ఏ ప్రయోజనం కోసం కొన్నదీ, దాని సామర్థ్యాలేమిటీ, ఏ ప్రాంతంలో వినియోగించబోతున్నారూ... అన్న వివరాలు తెలపాలి. వీటి వాడకం విషయంలో ప్రభుత్వం పెట్టిన నియమాలను ఉల్లంఘించకుండా పనిచేసుకోవాలి.

అసలు వీటిని ఎందుకు, ఎలా తయారుచేశారు?
డ్రోన్స్‌ని మొదట సైన్యం కోసమే తయారుచేశారు. వందేళ్ల క్రితమే ఇవి వాడుకలోకి వచ్చాయి. గాల్లో ఎగురుతున్న వాహనాన్ని గురి చూసి నేలకూల్చడం ఎలాగో నేర్చుకోడానికి బ్రిటిష్‌ నౌకాదళ సిబ్బంది వీటిని ఉపయోగించేవారు. తర్వాత వాటికి కెమెరాలను బిగించి వియత్నాం యుద్ధంలో శత్రువుల కదలికలను కనిపెట్టడానికి వాడారు. ఇప్పుడైతే మిలిటరీ డ్రోన్లు ఏకంగా క్షిపణులనే మోసుకెళ్తున్నాయి. భవిష్యత్తులో అన్ని దేశాల్లోనూ వాయుసేన బడ్జెట్‌లో సగం బడ్జెట్‌ డ్రోన్లదే అవుతుందట. 2001 సెప్టెంబరు 11 దాడుల తర్వాత అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ డ్రోన్ల వాడకాన్ని బాగా పెంచింది. శత్రు స్థావరాలపై నిరంతరం నిఘా పెట్టడానికీ, సరిహద్దుల వద్ద సమాచారాన్ని చిత్రీకరించి ఇంటెలిజెన్స్‌ విభాగానికి అందించడానికీ వీటిని ఎక్కువగా వాడుతున్నారు. ఈ పనులు చేయడానికి మనిషి నడిపే విమానాన్ని వాడితే, పొరపాటున అది శత్రుదేశానికి పట్టుబడే ప్రమాదం ఉంది. అప్పుడు దౌత్యపరంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అదే డ్రోన్లు పట్టుబడినా వాటిని ప్రయోగించిన దేశం తాలూకు సమాచారం ఏమీ ఉండదు కాబట్టి నష్టం లేదు. మన దేశంలోనూ డీఆర్‌డీవో రక్షణశాఖకు అవసరమయ్యే డ్రోన్లను తయారుచేస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్‌నుంచి దిగుమతి చేసుకున్న వందలాది డ్రోన్లను మన సైన్యం ఉపయోగిస్తోంది.

డ్రోన్‌తో ఫొటోలు ఎలా తీస్తారు?
ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ రంగాల్లో డ్రోన్లను విస్తృతంగా వాడుతున్నారు. విహంగ వీక్షణం అంటామే... దాన్ని ఈ డ్రోన్లు చేసి చూపిస్తాయి. పైనుంచీ ఫొటోలు తీయాలంటే ఇప్పటివరకూ హెలికాప్టర్లను వాడేవారు. అందులో ఖర్చూ రిస్కూ రెండూ ఎక్కువే. అదే డ్రోన్‌ వినియోగిస్తే నాణ్యమైన ఫొటోలు, వీడియోలు హెచ్‌డీ నాణ్యతతో, త్రీడైమెన్షన్‌లో... ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. పైనుంచీ తీసే ఫొటోల్లో తలలే కదా కనపడతాయి, పెళ్లి వేడుకలో వధూవరుల క్లోజప్‌ షాట్స్‌ డ్రోన్లు ఎలా తీయగలుగుతాయన్నది చాలామందికి వచ్చే సందేహం. డ్రోన్‌కి అమర్చే కెమెరాని బట్టి ఫొటోల నాణ్యత ఉంటుంది. డ్రోన్‌ తిరుగుతూ రకరకాల కోణాల్లో ఫొటోలు తీస్తుంది. పైగా డ్రోన్‌కి అనుసంధానం చేసిన కంప్యూటర్‌ ద్వారానో, స్మార్ట్‌ ఫోను ద్వారానో ఫొటోగ్రాఫర్‌ తనకు అవసరమైనట్లుగా డ్రోన్‌నీ, కెమెరా లెన్స్‌నీ తిప్పుతూ చక్కని కోణాల్లో మంచి ఫొటోలు వచ్చేలా చూడగలడు. వీడియో రికార్డు చేయడమే కాదు, డ్రోన్‌ని శాటిలైట్‌కి అనుసంధానం చేసి లైవ్‌ స్ట్రీమింగ్‌ కూడా చేయవచ్చు. అంటే ఒకచోట జరిగే వేడుకను అదే సమయంలో మరో చోట ఉన్నవారు ప్రత్యక్ష ప్రసారంలా చూడొచ్చు. ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలకు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనూ డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. చాలావరకూ వెడ్డింగ్‌ ప్లానర్లూ, వీడియోగ్రాఫర్లూ డ్రోన్లను అద్దెకిచ్చే సంస్థలతో ఒప్పందం
కుదుర్చుకుని తదనుగుణంగా పెళ్లి ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నారు.

పొలం పనులకు డ్రోన్‌ ఎలా ఉపయోగపడుతుంది?
వ్యవసాయ రంగంలో డ్రోన్లను చైనా, జపాన్‌ రైతులు ఎక్కువగా వాడుతున్నారు. క్రిమిసంహారక మందుల్నీ, రసాయన ఎరువుల్నీ డ్రోన్లతో చల్లవచ్చు. రైతులే వాటిని చల్లాలంటే రసాయనాల ప్రభావం తమ మీద పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. డ్రోన్‌తో ఆ సమస్య ఉండదు. కాసేపట్లోనే పొలమంతా మందు చల్లేస్తుంది. రైతు దూరంగా గట్టుమీద కూర్చుని రిమోట్‌తో దాన్ని నడిపించొచ్చు. అలాగే పెద్ద పెద్ద తోటలు ఉన్నవాళ్లు స్వయంగా తోటంతా తిరిగి పర్యవేక్షించడానికీ పంటల పరిస్థితిని అంచనా వేయడానికీ చాలా సమయం పడుతుంది. అదే డ్రోన్‌ని వినియోగిస్తే కాసేపట్లో తోటను అన్ని కోణాల్లో వీడియో తీసుకొస్తుంది. కంప్యూటర్లో ఆ వీడియో చూస్తూ రైతులు పంట పరిస్థితిని అంచనా వేసి తాము చేయాల్సిన పనులను నిర్ణయించుకోవచ్చు. రైతులు చేయలేని పనుల్ని కూడా డ్రోన్లు చేస్తాయి. మట్టి నాణ్యతను విశ్లేషిస్తాయి. వాతావరణం పంటలకు అనుకూలంగా ఉన్నదీ లేనిదీ చెప్తాయి. చుట్టుపక్కల పొంచి ఉన్న చీడపీడల సమాచారాన్నిస్తాయి. పంట దిగుబడి అంచనా వేస్తాయి. వ్యవసాయంలో అడుగడుగునా ఉపయోగపడేలా డ్రోన్లను తయారుచేస్తున్నారు. పెద్ద పెద్ద డైరీ ఫారాల్లోనూ పర్యవేక్షణకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. మెరిల్‌ లించ్‌ అంచనా ప్రకారం భవిష్యత్తులో 80 శాతం డ్రోన్ల అమ్మకాలు వ్యవసాయ రంగానికి సంబంధించే ఉంటాయట.

హోమ్‌ డెలివరీకీ వాడుకోవచ్చా?
తప్పకుండా ఉపయోగించవచ్చు. మనదేశంలోనూ అందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అమెజాన్‌ ఎంతోకాలంగా దీనిపై పరిశోధన చేస్తోంది. గత ఏడాది డిసెంబరులో ఇంగ్లాండ్‌లో, ఈ ఏడాది మార్చిలో అమెరికాలో విజయవంతంగా ప్రదర్శించింది కూడా. ఇంగ్లాండ్‌లోని గ్రామీణ ప్రాంతాలకు సరుకుల్ని డ్రోన్‌ డెలివరీ చేస్తోంది. అయితే రద్దీగా ఉండే నగరాల్లో డ్రోన్ల రాకపోకలను నియంత్రించే విషయంలో అమెరికా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించలేదు. దాంతో అమెరికన్‌ డ్రోన్‌ కంపెనీలు ఇతర దేశాల్లో వాణిజ్య సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయి. న్యూజిలాండ్‌లో పిజ్జా డెలివరీ చేస్తున్నారు. ఆఫ్రికా ఖండంలో రోడ్డు మార్గంలో చేరుకోవడానికి చాలా సమయం పట్టే మారుమూల గ్రామాలకు మందులూ నిత్యావసరాల సరఫరాకు డ్రోన్లను వాడుతున్నారు.

డ్రోన్లతో ఇంకా ఏమేం చేయొచ్చు?
చాలా పనులు చేయొచ్చు. ఇటీవల స్థానిక ఎన్నికల పర్యవేక్షణకు యూపీ తదితర రాష్ట్రాలు డ్రోన్లను వాడాయి. భద్రతా ఏర్పాట్లు చూసే పోలీసులకు డ్రోన్లు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇంజినీరింగ్‌ పనులు చేసే డ్రోన్లూ ఉన్నాయి. రైల్వేలైనునీ ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వేలనీ నిత్యం అణువణువూ పరీక్షించాలి. అందుకు చాలామంది సిబ్బంది అవసరమవుతారు. ఆ పనిని ఇప్పుడు పలుచోట్ల డ్రోన్లతో చేస్తున్నారు. డ్రోన్‌ తీసుకునివచ్చిన వీడియోను చూసి నేరుగా అవసరమైనచోటికే వెళ్లి సత్వరం మరమ్మతులు చేపట్టడం తేలికవుతోంది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెద్ద పెద్ద భవంతులూ కాలనీలూ కడుతున్నప్పుడు పర్యవేక్షణకి డ్రోన్లు వాడుతున్నారు. వారం వారం పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రగతిని సమీక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి డ్రోన్‌ తీసిన వీడియోలనే చూస్తున్నారు. అత్యంత నాణ్యమైన కెమెరాలు బిగించిన డ్రోన్లతో త్రీడీ మ్యాపింగ్‌ చేపడుతున్నారు. పురావస్తు శాఖలో, గనుల్లో ప్రతిచోటా డ్రోన్ల అవసరం ఉంటోంది. ఇంకా వరదలూ భూకంపాలూ లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తక్కువ సమయంలో పరిస్థితులను అంచనా వేసి సహాయచర్యలు చేపట్టడానికి డ్రోన్‌ని మించిన సాధనం మరొకటి లేదు. ఉప్పునీటిలో తడిసినా పాడవకుండా పనిచేసే స్ల్పాష్‌ డ్రోన్‌3 లాంటి చేపలు పట్టే డ్రోన్లూ ఉన్నాయి.

ఇన్ని పనులు చేయగలవంటే చాలా ఖరీదేమో?
చేసే పనిని బట్టి డ్రోన్ల ఖరీదు ఉంటుంది. వేలతో మొదలు పెట్టి లక్షల వరకూ ఖరీదు చేసే రకరకాల డ్రోన్లు ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉన్నాయి. హాబీగా వాడుకోవడానికి వెయ్యి రూపాయలకే చిన్న డ్రోన్లు లభిస్తున్నాయి. ఫొటోగ్రఫీకి వాడే డ్రోన్లు ఐదారు వేలతో మొదలుపెట్టి లక్షల్లో ఖరీదు చేసేవీ ఉన్నాయి. వీటిల్లోనూ వ్యక్తిగత వినియోగానికీ, వ్యాపార అవసరాలకీ వేర్వేరుగా లభిస్తున్నాయి. సైన్యం కోసం వాడే డ్రోన్ల ఖరీదు ఎక్కువ.

భవిష్యత్తులో ఇవి ఇంకా ఏమేం చేయనున్నాయి?
భవిష్యత్తులో డ్రోన్లు ఇంకా చాలా పనులు చేయనున్నాయి. గోల్డ్‌మన్‌శాక్స్‌ నివేదిక ప్రకారం 2020కల్లా డ్రోన్ల మార్కెట్‌ పదివేల కోట్ల రూపాయలకు చేరుతుందనీ కార్పొరేట్‌ రంగానికి నిత్యజీవితంలో ఇది తప్పనిసరి అంశమవుతుందనీ విశ్లేషకుల అంచనా. డ్రోన్ల హార్డ్‌వేర్‌ కూడా బాగా అభివృద్ధి చెందనుంది. బ్యాటరీ సామర్థ్యమూ, బరువు మోసే శక్తీ మరిన్ని రెట్లు పెరుగుతాయి. డ్రోన్ల వాడకం పెరగడం గమనించిన పశ్చిమ్‌ బంగా ప్రభుత్వం తమ రాష్ట్రాన్ని డ్రోన్‌ తయారీ హబ్‌గా మార్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది. వ్యక్తిగత కంప్యూటర్లలాగా భవిష్యత్తులో ప్రతి ఇంటికీ ఓ డ్రోన్‌ ఉండే అవకాశమూ ఉందని టెక్నాలజీ ప్రియులు జోస్యం చెబుతున్నారు. ఏ ఫైలో, లంచ్‌ బాక్సో ఇంట్లో మర్చిపోయి ఆఫీసుకు వెళ్లిపోయినా పర్వాలేదిక. ఫోనులో ఒక్కమాట చెబితే డ్రోన్‌ తెచ్చిపెడుతుంది. కొందరు ఔత్సాహిక ఆర్కిటెక్టులు డ్రోన్‌పోర్టుల నమూనాలనూ రూపొందించేశారు. డ్రోన్ల సంఖ్య పెరిగితే వాటిని నిలిపేందుకూ ఓ చోటు కావాలి కదా మరి! ప్రతి పనికీ ఓ డ్రోన్‌... ఇప్పటి పరిస్థితి అయితే 2020 కల్లా మల్టీటాస్కింగ్‌ డ్రోన్లని మార్కెట్లోకి తెచ్చేందుకూ
ప్రయత్నాలు జరుగుతున్నాయి.

                  *  

గయానా ఒక చిన్న దేశం. అందులో 80శాతం అడవులే. జనాభా 8 లక్షలు కూడా ఉండదు. వారు కూడా చిన్న చిన్న తెగలుగా అడవుల్లో వేర్వేరుచోట్ల ఉంటారు. ఎక్కడో జార్జ్‌టౌన్‌లో ఉంటుంది ప్రభుత్వం. ఈ పరిస్థితులు స్మగ్లర్లకు కలిసొచ్చాయి. అటవీ సంపదను కొల్లగొట్టడం మొదలెట్టారు. స్మగ్లర్ల శక్తిసామర్థ్యాల ముందు స్థానికులు నిస్సహాయులైపోయారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే వాళ్లూ పట్టించుకోలేదు. అలాగని దేశసంపదను కొల్లగొడుతుంటే చూస్తూ చూస్తూ ఊరుకోలేకపోయింది వాపిచాన్‌ అనే ఓ తెగ. వారిలో చదువుకున్నవారు యూట్యూబ్‌లో చూసి ఓ డ్రోన్‌ని తయారుచేశారు. దాంతో కొన్ని రోజులపాటు స్మగ్లర్ల కార్యకలాపాలను చిత్రించారు. ఆ వీడియోలను తీసుకెళ్లి నేరుగా దేశాధ్యక్షుడి ముందు పెట్టారు. దాంతో ప్రభుత్వ యంత్రాంగమంతా ఆగమేఘాల మీద కదిలింది. అదీ డ్రోన్‌ పవర్‌!

ఇవీ మార్గదర్శకాలు!

డ్రోన్ల వినియోగానికి సంబంధించి భారత ప్రభుత్వం కొత్తగా రూపొందించిన మార్గదర్శకాలివి.
1. మనదేశంలో డ్రోన్లు ఐదు రకాలు. అవి నానో, మైక్రో, మిని, స్మాల్‌, లార్జ్‌. అన్నిటికన్నా పెద్ద డ్రోన్ల బరువు గరిష్ఠంగా 150 కిలోల వరకూ ఉండవచ్చు.
2. నానో డ్రోన్ల(250గ్రాములకు తక్కువ)ను ఉపయోగించడానికి భద్రతా అనుమతులేవీ అక్కర్లేదు. 250 గ్రాములనుంచి 2కిలోల వరకూ ఉండే మైక్రో డ్రోన్లకు రెండు రోజుల్లో అనుమతులు ఇస్తారు.
3. ఫొటోగ్రఫీ, వైద్యపరమైన ఉపయోగాలూ, ప్రకటనల చిత్రీకరణా (యాడ్‌ ఫిల్మ్స్‌) లాంటి పనుల కోసం డ్రోన్లను ఉపయోగించుకోవచ్చు. వస్తువుల హోం డెలివరీకి ఈ కామర్స్‌ సంస్థలూ, ఆహార పదార్థాల డెలివరీకి రెస్టరెంట్లూ కూడా డ్రోన్లను వాడవచ్చు.
4. కొన్ని ప్రత్యేక ప్రాంతాలను ‘నో డ్రోన్‌ జోన్లు’గా గుర్తించారు. అంతర్జాతీయ సరిహద్దులూ, విమానాశ్రయాలూ, చట్టసభలూ, న్యాయస్థానాలూ, రాష్ట్రపతి భవన్‌ లాంటి కీలక ప్రాంతాల చుట్టుపక్కల ప్రైవేటు డ్రోన్లను తిరగనీయరు. రాజకీయ, రక్షణ వ్యవహారాలకు చెందిన ముఖ్య కార్యాలయాల చుట్టూ 500మీ. పరిధిలో డ్రోన్లను అనుమతించరు. అలాగే జాతీయ ఉద్యానవనాలూ, వన్యమృగ అభయారణ్యాలూ ఉన్నచోట డ్రోన్‌ వాడాలన్నా పర్యావరణశాఖ అనుమతి పొందాలి.
5. నానో డ్రోన్లు తప్ప మిగిలిన డ్రోన్లన్నిటికీ వివిధ విభాగాలనుంచి అనుమతి తప్పనిసరి. డ్రోన్‌ తిరిగే మార్గం వాయుసేన అధికారులకు తెలిసి ఉండడం అవసరం కాబట్టి వారి అనుమతి పొందకుండా డ్రోన్లను వాడకూడదు.
6. రెండు కిలోల కన్నా తక్కువ బరువుండి 200 మీటర్ల పరిధిలోనే తిరిగే డ్రోన్లయితే ఎలాంటి అనుమతులూ అక్కర్లేదు. అయితే పౌరవిమానయాన శాఖ వద్ద నమోదు మాత్రం చేయించాలి.
7. డ్రోన్ల వాడకంలో కచ్చితమైన ప్రైవసీ ప్రొటెక్షన్‌ చట్టాలను తేనుంది ప్రభుత్వం. డ్రోన్లను ఆపరేట్‌ చేసేవాళ్లు అనుమతి లేకుండా ఇతరులకు సంబంధించిన కార్యక్రమాల ఆడియో, వీడియో రికార్డు చేయకూడదు. ఒకసారి అనుమతి పొందాక డ్రోన్‌ ప్రయాణించే మార్గాన్ని మార్చకూడదు. ప్రస్తుతానికి డ్రోన్ల వినియోగానికి అవరోధాలు లేకుండా ఈ నియమాలను రూపొందించారు. కొన్నాళ్లు పరిశీలించాక ప్రభుత్వం వీటికి తుది రూపం ఇస్తుంది.

పిజ్జా డ్రోన్‌ డెలివరీ!

విదేశాల్లో ఇప్పటికే వివిధ రంగాల్లో డ్రోన్లను విపరీతంగా వినియోగిస్తున్నారు.
* న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో డొమినోస్‌ పిజ్జా గత ఏడాది నవంబరులో వినియోగదారులకు డ్రోన్‌ ద్వారా డోర్‌ డెలివరీ చేసి ప్రపంచంలో తొలి కమర్షియల్‌ డ్రోన్‌ డెలివరీ చేసిన రికార్డు సొంతం చేసుకుంది. అమెరికాకు చెందిన ఫ్లిర్టీ డ్రోన్‌ కంపెనీతో కలిసి ఇన్నాళ్లూ ప్రయోగాత్మకంగా కొనసాగించిన డొమినోస్‌ త్వరలోనే రెగ్యులర్‌ సర్వీస్‌ ప్రారంభించబోతోంది.
* స్విట్జర్లాండ్‌లోని లుగానో నగరంలో మ్యాటర్నెట్‌ అనే సంస్థ ఆస్పత్రులూ ల్యాబ్‌లను అనుసంధానం చేస్తూ మందుల్నీ, వైద్య పరీక్షల నివేదికలనూ డ్రోన్లతో అరగంటలో చేరవేస్తోంది. శాన్‌ఫ్రాన్సిస్కోకి చెందిన జిప్‌లైన్‌ రువాండాలోని ఆస్పత్రులకు డ్రోన్ల ద్వారానే అత్యవసర మందుల్ని సరఫరా చేస్తోంది.
* 181 కిలోల బరువు మోస్తూ 8 గంటలపాటు నిరంతరాయంగా ఎగరగల డ్రోన్‌ని తయారుచేశారు రష్యా పరిశోధకులు. అంత బరువు మోస్తూ కూడా ఉన్నచోట నుంచి నిలువుగా గాలి లోకి ఎగరగల, దిగగల ఈ డ్రోన్‌ని రవాణా, వ్యవసాయమూ, వైద్యరంగాల్లో ఉపయోగించనున్నారు.
* చైనాలో ఇటీవలే ఓ గ్రామ రైతులు 30 డ్రోన్లను కొనుక్కున్నారు. తక్కువ బరువుతో దూసుకెళ్తూ నాలుగు నాజిల్స్‌తో క్రిమిసంహారక మందుని స్ప్రే చేయగల ఈ డ్రోన్‌ ఒక్కోటీ 3,800పౌండ్లు. అంటే మన రూపాయల్లో 3 లక్షలపైనే. రైతు గట్టుమీద కూర్చుని రిమోట్‌తో ఈ డ్రోన్‌ని ఆపరేట్‌ చేస్తాడు.
* డ్రోన్‌ తయారీ టెక్నాలజీలో ముందున్న అమెరికా పలు దేశాలకు వీటిని సరఫరా చేస్తోంది. అయితే గ్లోబల్‌ మార్కెట్‌ని అందిపుచ్చుకుని ఎప్పుడెప్పుడు అమెరికా ఆధిపత్యానికి తెరదించుదామా అని ఎదురుచూస్తున్న చైనా ఇటీవల దుబాయ్‌ ఎయిర్‌షోలో పలు కొత్త మోడళ్లలో డ్రోన్లను ప్రదర్శించింది. పనితీరులో అమెరికా డ్రోన్లకు ఏమాత్రం తీసిపోకపోయినా చైనా డ్రోన్ల ధర అమెరికాతో పోలిస్తే తక్కువే.
* అమెరికాలో 15 నెలల్లోనే దాదాపు 8 లక్షల డ్రోన్లను నమోదుచేసుకున్నట్లు గత మార్చిలో అక్కడి విమానయాన శాఖ అధికారులు ప్రకటించారు. అక్కడి రక్షణ శాఖా, సీఐఏ, అంతర్గత భద్రతా శాఖలు రెండు దశాబ్దాలుగా ఆయుధాలను మోసుకెళ్లేలా ప్రత్యేకంగా తయారుచేయించుకున్న డ్రోన్లను వినియోగిస్తున్నాయి. ఈ డ్రోన్లు చూడడానికి ఎఫ్‌ 16 ఫైటర్‌ జెట్‌ సైజులో ఉన్నా బరువు మాత్రం చాలా తక్కువ. వీటి ఖర్చు ఏటా రూ.6.2 కోట్లట.
* ఆస్ట్రేలియా బీచ్‌లలో మనుషులపై సొరచేపల దాడులను అరికట్టడానికి కృత్రిమ మేధతో పనిచేసే డ్రోన్లను రంగంలోకి దింపింది ప్రభుత్వం. ఇవి సొరచేపల కదలికలను కనిపెట్టి మనుషులను హెచ్చరిస్తాయి. వారు సురక్షిత ప్రాంతానికి చేరుకునేవరకూ సొరచేపలను దారిమళ్లిస్తాయి.

దుబాయ్‌... రూటే వేరు!

 ధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో దుబాయ్‌ ముందుంటుంది. మరో దశాబ్దానికల్లా ప్రజారవాణాలో పాతిక శాతం అటానమస్‌ కార్లే ఉండాలని కలలు కంటున్నారు అక్కడి పాలకులు. ఈ నేపథ్యంలో డ్రోన్లను డ్రైవరు అవసరం లేని ట్యాక్సీలుగా వాడేందుకు అక్కడ రంగం సిద్ధమైంది. అబూదాబి - రాస్‌ అల్‌ఖైమా నగరాల మధ్య మార్గం ఎప్పుడూ చాలా రద్దీగా ఉంటుంది. మెట్రోతో కొంతవరకూ సమస్య తగ్గినా పూర్తిగా పరిష్కరించేందుకు ఆకాశమార్గాన్ని అన్వేషిస్తున్న అక్కడి ప్రభుత్వానికి డ్రోన్‌ ట్యాక్సీ మరో ప్రత్యామ్నాయంగా కన్పించింది. రెండు సీట్లున్న డ్రోన్‌ ట్యాక్సీని గత సెప్టెంబరు నుంచి ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. గంటకు 30 మైళ్ల వేగంతో అరగంట ప్రయాణించగల ఈ డ్రోన్‌ ప్రస్తుతం దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుంచి బుర్జ్‌ అల్‌ అరబ్‌కి టెస్ట్‌రైడ్స్‌ కొనసాగిస్తోంది. కొత్త సంవత్సరంలో దీన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నది ప్రభుత్వ ఆశయం.

ఆ ఐదు రంగాల్లో...

విష్యత్తులో డ్రోన్లు ముఖ్యంగా ఐదు రంగాల్లో కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు.
* క్లౌడ్‌ సీడింగ్‌ చేయడానికి అమెరికాలో డ్రోన్లను విజయవంతంగా వినియోగించారు. భవిష్యత్తులో కరవు ప్రాంతాల్లో వీటిని వాడి వర్షాలు కురిపించవచ్చు.
* అభయారణ్యాల్లో వేటగాళ్ల బారినుంచి జంతువుల సంరక్షణకు డ్రోన్లు బాగా ఉపయోగపడుతున్నాయి. ఆఫ్రికాలో పలుచోట్ల ఇప్పటికే వీటిని వాడుతున్నారు.
* అంబులెన్సులుగా డ్రోన్ల వాడకం గురించీ ప్రయోగాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అవి అందుబాటులోకి వస్తే ప్రమాదాల్లో ప్రాణనష్టం భారీగా తగ్గుతుంది.
* ఇంటర్నెట్‌ అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో డ్రోన్లే తాత్కాలిక, పోర్టబుల్‌ సర్వర్లుగా పనిచేస్తాయి.
* ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడూ, నదులూ కొండలూ దాటి వెళ్లి సహాయ చర్యలు చేపట్టాల్సి వచ్చినప్పుడూ డ్రోన్లే కీలకం కానున్నాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.