close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
షడ్రుచుల తెలుగు!

షడ్రుచుల తెలుగు!

అడ్డాలనాడు బిడ్డలే గాని గడ్డాలనాడు కాదని మాతృభాషలన్నీ మౌనంగా రోదిస్తున్న రోజులివి. ‘తోటలో వదంతి పుట్టింది పూలన్నీ వాడిపోయాయని... పూలు అదృశ్యమయ్యాయిరా ఫలాలై తిరిగి రావడానికి’ అన్న సినారె ఆశే శ్వాసగా సాగుతున్న భాషాభిమానుల ఆర్తికి ప్రపంచ తెలుగు మహాసభలు చలువ పందిళ్లు వేస్తున్నాయి. ఆంగ్లభాషతో కొంగుముడి వేసుకొని కొండెక్కి కూర్చున్న తెలుగు బిడ్డల్ని ‘చందమామ రావే - జాబిల్లి రావే’ అంటూ ఆప్తగీతం ఆహ్వానిస్తోంది. తెలుగింటి సాహితీ వంటశాలలో నలభీమ పాకాలను మించి చవులూరించే, జ్ఞప్తికొస్తే చాలు మళ్ళీ రుచి చూడాలనిపించే- కావ్యాల నుంచి కవితల దాకా, జ్ఞానపథం నుంచి జానపదం దాకా, పంచరత్నాల నుంచి యక్షగానాల దాకా వైవిధ్య ప్రక్రియలు ఎన్నని! శతాబ్దాల ఆ ఘుమఘుమల నుంచి కొన్ని మేలిమి ‘పదా’ర్థాలను రుచి చూద్దాం, రండి!
 

‘నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకొనే అందమైన ఆడపిల్లలు’ అన్నారు బాలగంగాధర తిలక్‌. అవును... అక్షరాలు చాలా అందమైనవి! ఎంత అందమైనవి కాకుంటే మహాకవి శ్రీశ్రీ ‘...అందని అందానివిగా, నీకై బతుకే ఒక తపమై...’ అని జీవితకాలం నిరీక్షిస్తాడు...  నిరంతరం ఆరాధిస్తాడు... నిత్యం ఉపాసిస్తాడు!

‘నేనంతా పిడికెడు మట్టే కావచ్చు కానీ కలం ఎత్తితే- ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది...’ అన్నారు గుంటూరు శేషేంద్రశర్మ. అవును... అక్షరాలకు పొగరుంటుంది! పొగరే లేకుంటే ‘ఏనుగునెక్కినాము ధరణీశులుమొక్కగ నిక్కినాము’ అనడం తిరుపతి వేంకటకవులకు ఎలా చెల్లుబాటు అవుతుంది? పొగరే లేకుంటే, పిల్లలమర్రి పినవీరభద్రుడు ‘వాణి నారాణి!’ అనగలిగేవాడా? విశ్వనాథ ‘అలఘుస్వాదు రసావతార ధిషణాహంకార సంభారదోహల బ్రాహ్మీమయ మూర్తి’ అయ్యేవారా?

ఖలీల్‌ జిబ్రాన్‌ ‘ది ప్రొఫెట్‌’ (ప్రవక్త)ను ‘జీవనగీతి’గా అనువదిస్తూ- ‘అక్షరరూపం దాల్చిన ఒకే ఒక్క సిరాచుక్క- లక్ష మెదళ్లకు కదలిక’ అన్నారు ప్రజాకవి కాళోజీ. అదీ అక్షరం సత్తా! అక్షరం అన్నం పెడుతుంది... అమ్మలా వెన్ను తడుతుంది. కొండంత ధైర్యాన్నిస్తుంది. దుఃఖంలో ఓదారుస్తుంది. మనుగడలో దారి చూపిస్తుంది. వెలుగుల్లోకి నడిపిస్తుంది.

‘అక్షరమ్ము వలయు కుక్షి జీవులకు అక్షరమ్ము జిహ్వకు ఇక్షురసము అక్షరమ్ము తన్ను రక్షించుగావున అక్షరమ్ము లోక రక్షితమ్ము’ అన్నమాట అక్షరసత్యం! ‘శ్రీవాణీ గిరిజాః’ అంటూ ఆదికవి నన్నయభట్టు ఏ శుభవేళ కావ్య రచనకు శ్రీకారం చుట్టాడోగాని, ఆనాటినుంచీ మన అక్షరాలు ‘శ్రీ’ అనే అక్షరంలోని ఇంపుసొంపులనూ ఆ ఒంపులనూ ఒయ్యారాన్నీ సోయగాన్నీ తమలో పొదువుకున్నాయి. శ్రీ అంటే సంపద, విద్య, శక్తి. లక్ష్మి, సరస్వతి, పార్వతులకు అది సంకేతం. అక్షరంతో ఆ మూడూ సిద్ధించడం అందుకే. ఆ మూడింటా అక్షరం గొప్ప దన్నుగా నిలుస్తుంది. వెన్ను కాస్తుంది.

నందనవనం
తెలుగు తోట ఒక నందనవనం. ఇందులో జానపదాలు విరిశాయి... ప్రబంధాలు మెరిశాయి... వేల ప్రక్రియలు కురిశాయి. వీటిలో దేని పరిమళం దానిదే. కాలక్రమంగా పూలరంగులు మారుతున్నాయి. పరిమళాలు మారుతున్నాయి. అయినా తెలుగుతోట అనునిత్యం సురభిళమవుతూనే ఉంది.

సాహిత్యసుందరి భారీ ఆభరణాలనూ అలంకారాలనూ విడిచిపెట్టింది... నాజూకుతనాన్ని అలవరచుకొంది. అయినా ఈమె అందం ఈమెదే! బృహత్కావ్యాలు సన్నబడి చిన్న కవితలయ్యాయి. ఉద్గ్రంథాలు చిక్కి ఎక్కాల పుస్తకాలయ్యాయి. అయినా ‘చక్కనమ్మ చిక్కినా అందమే’! అందుకే ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ! మా కన్నతల్లికి మంగళారతులు!’ (శంకరంబాడి సుందరాచారి)

కన్నతల్లిని ఎందుకు ప్రేమించాలన్న సందేహం బిడ్డకు రాదు. బిడ్డను ఎందుకు హత్తుకోవాలన్న ప్రశ్న తల్లికి రాదు. అదీ తెలుగుభాషకూ మనకూ గల అనుబంధం. తెలుగు- వరాల తెలుగు, సుస్వరాల తెలుగు, నవరసాల తెలుగు.

‘ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించునప్డు విన్పించుభాష’ అన్నారు విశ్వనాథ సత్యనారాయణ. నిజమే! దానికీ కారణం ఉంది. ఆంగ్లంలో హెచ్‌ అనే అక్షరం తప్ప గొంతు చీల్చుకునివచ్చే మరో అక్షరం లేదు. మిగిలినవన్నీ నాలుక చివర్నించీ, పెదాల మీంచి వస్తాయి. తెలుగు అక్షరాలకు- నాభి, కంఠం, దవడలు, దంతాలు, నాసిక... ఇలా ఎన్నో ఆధారపీఠాలు, మాతృస్థానాలు. ఇన్ని పక్కవాయిద్యాలతో కూడిన అద్భుతగాత్రం చక్కని సంగీత కచేరీ కాకుండా ఎలా ఉంటుంది?

‘పలుకుబళ్ళన్నియు పరమతత్వార్థ బోధకములై ఒప్పు అందాలభాష’- ఎందుకంటే మనది మహర్షుల ఒరవడి... మమతలగుడి... మమకారం మూర్తీభవించిన అమ్మఒడి. ఆ గుండె తడిలోంచి పొంగివచ్చే ప్రతిమాటా మంత్రమే! తెలుగు అక్షరాలు బీజాక్షరాలు. ‘బహుజన్మ కృత పుణ్యపరిపాకమున చేసి ఆంధ్రభాషను మాటలాడుచుండు’ జాతి మనది.

‘అరకులోయల గాలికొండ హైదరాబాద్‌ గోలకొండ, కలసికట్టెను తెలుగుతల్లి కంఠసీమను పూలదండ’ అన్నారు బాపురెడ్డి. అందుకే తెలుగుతల్లి గళసీమ బతుకమ్మలా ధనుర్మాసపు గొబ్బిళ్లలా రంగురంగులతో కన్నులపండువుగా తోస్తుంది.

‘తేనెకన్న మధురంరా తెలుగు, ఆ తెలుగుదనం మా కంటికి వెలుగు’ అన్నారు ఆరుద్ర. ‘అన్యభాషలు నేర్చి ఆంధ్రమ్మురాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా’ అని మందలించారు ప్రజాకవి కాళోజీ. ‘తెలుగు పులుగు చేరలేని దేశం లేదు. తెలుగు వెలుగు దూరలేని కోశం లేదు’ అని తేల్చిచెప్పారు దాశరథి.

‘ప్రాచ్యదేశాంధ్ర శ్రీమహాభారతమ్ము భవ్యతెలగాణ శ్రీమహాభాగవతము మహిత రాయలసీమ రామాయణమ్ము ఘనత్రివేణీ సమాగమ ఆకారం’గా దర్శించారు
వానమామలై వరదాచార్యులు.

షడ్రసోపేతం
తెలుగు ఉగాది పచ్చడి ఆరు రుచుల కలయిక. తెలుగు భాషా అంతే. అది షడ్రసోపేతం! లేతమామిడి వగరు, చింతపండు పులుపు, వేపపూత చేదు, పచ్చిమిర్చి కారం... అలవోకగా తగిలినప్పుడే చెరకు మరీ తీపెక్కుతుంది. పల్చని మజ్జిగ తేటలో కొత్తిమీరతోపాటు కాసింత ఉప్పురవ్వ జోడిస్తేనే కమ్మదనం పెరుగుతుంది. మిరియాల ఘాటు కారణంగా జున్ను మరింత మధురంగా తోస్తుంది. ‘జుంటి తేనెకన్న జున్నుకన్న’ తెలుగుభాష మరెంతో తీయనిది- అనడానికి, తెలుగుకు ఎన్నో రుచులు జతపడటం ముఖ్య కారణం! పదార్థాల రుచులు నాలుక్కి
తెలుస్తాయి. భాషలోని రుచులు గుండె తలుపులు తెరుస్తాయి.

గండుకోయిల కూసిందంటే గుండె పులకరిస్తుంది. దాని గొంతుకు ఆ తీపి ఎలా వచ్చిందో పోతన చెప్పాడు. ‘లలితరసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల’ను భాగవతంలో వర్ణించాడు. లేత మావిచిగుళ్లు కసరుగా ఉంటాయి. ‘వగరు’గా ఉంటాయి. వాటివల్లే కోయిల పాటకు తీపి కలుగుతోంది. కనుక అన్ని రుచులూ ఆహ్వానించదగినవే, ఆస్వాదించదగినవే! పులుపూ అలాంటిదే. ‘ఆత్మశుద్ధిలేని ఆచారమది ఏల భాండశుద్ధిలేని పాకం ఏల? చిత్తశుద్ధిలేని శివపూజలేలరా?’ (యోగి వేమన), ‘ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి అన్యుల మనముల్‌ నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడె ధన్యుడు సుమతీ’ (బద్దెనకవి) వంటి హితోక్తులను ఆలకించినప్పుడు మనలో చాలామందికి ‘పుల్ల’ చింతకాయ కొరికిన భావన వస్తే రావచ్చు. భుజాలు తడుముకోవలసిన అవసరం ఏర్పడవచ్చు. కాని అదే సత్యం అయినప్పుడు చేసేదేముంది- కళ్లు చిట్లించడం తప్ప! పప్పులో ‘ఉప్పు’ తక్కువైతే చప్పగా ఉంటుంది. మరి ఎక్కువైతే? అదెలా ఉంటుందో తెలియాలంటే ‘కుమార సంభవ ప్రమాదమెరుగని అనవరత రతి- మన సమాజం ద్రుతగతి’ అన్న కాళోజీ మాటల్లోని అంతరార్థం తెలియాలి. ‘అతి సర్వత్ర వర్జయేత్‌’ అన్న పెద్దల సూచనలోని మర్మం గ్రహించాలి. ‘రెండు కళ్లనుంచి చూపులు సూదుల్లా వచ్చి మాంసపు ముద్దలపై విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి’ అని జయప్రభ పేర్కొన్న సందర్భాల్లో జీవితం ఉప్పు కషాయంగా అనిపిస్తుంది. ‘మల్లెపువ్వుల్లోనూ పోపు వాసనలే’ ఆవరిస్తే కవయిత్రి విమల చెప్పినట్లు ‘ఈ వంటింటిని తగలెయ్య’ అని అనిపించి తీరుతుంది. ‘స్త్రీకి హృదయం ఉంది దానికి అనుభవం ఇవ్వాలి’ అని చెలం చెప్పేదాకా గ్రహించని పురుషుడితో స్త్రీ జీవితం ఉప్పు కషాయమే!

కాకరకాయ కూర అనేసరికి చాలామంది ముఖం అదోలా పెడతారు. ‘చేదు’గా చూస్తారు. కానీ కాకరకాయ చేదును ఇష్టపడేవాళ్లు లోకంలో కొల్లలు. లేకుంటే కృష్ణశాస్త్రి ‘నాకు కన్నీటి సరుల దొంతరలు గలవు నితాంత దుఃఖంపు నిధులు గలవు’ అనగలిగేవారా... ‘ఏడిచి ఎన్నాళ్లయినదోయి’ అని బెంగపెట్టుకొనేవారా! ‘నిత్యము నాకు కష్టముల నీయెవె దేవకి నందనా!’ అని కుంతీదేవి కృష్ణుణ్ని అడిగింది. ఫలితంగా నిరంతరం ఆయనను స్మరించే స్థిరబుద్ధి ఏర్పడుతుందని ఆమె ఆలోచన. ఆమె మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహిస్తే- ‘బతుకులోని చేదు’ను సానుకూల దృక్పథంతో పరికించడం అలవడుతుంది. మొత్తం తీపే అయితే మొహం మొత్తదూ?

మమకారపు నుడికారం
తెలుగు రుచుల్లో దాదాపుగా అన్నింటా కారం ఒక్కలాగే ఉంటుంది. కాని తెలుగుభాషలో కారాలు రకరకాలు! తిరస్కారం, ధిక్కారం, ప్రతీకారం, ఛీత్కారం... అబ్బో ఎన్నో ఎన్నెన్నో! ఇవన్నీ కాక, తెలుగు పాఠకులను అలరించేందుకు మమకారం, చమత్కారం మన భాషా సాహిత్యాల్లోంచి తొంగిచూస్తాయి.

‘నన్ను కన్నతండ్రి నా పాలి దైవమ’ అంటూ అదితి వామనుణ్ని లాలించింది. కన్న కొడుకును ‘కన్నతండ్రీ’ అని పిలవడం మమకారపు నుడికారం. తెలుగు భాషకు మాత్రమే దక్కిన వరం! తెలంగాణ నేల మీది మమకారాన్ని దాశరథి ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ మహోన్నతంగా ప్రకటించారు. గోదావరిపై గౌరవాన్ని ప్రతిబింబిస్తూ నన్నయ్య ‘దక్షిణ గంగనా దద్దయు నొప్పిన గోదావరియు’ అంటూ జేజేలు పలికాడు.

‘మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి ఒకటే, ఛండాలుడుండేటి సరిభూమి ఒకటే’ అని అన్నమాచార్యులు తెగించి చాటడం ఆనాటికి సంఘధిక్కారం! ‘నేనింకా నిషిద్ధ మానవుణ్నే’ అని ప్రముఖ కవి ఎండ్లూరి సుధాకర్‌ ఆవేదన చెందడానికి కారణమైన ‘నాల్గు పడగల హైందవ నాగరాజు’ బుసబుసలను ఖండిస్తూ- మహాకవి జాషువా ‘గవ్వకు సాటిరాని పలుగాకుల మూకలు అసూయ చేత నన్ను ఎన్విధి దూరినకా నను వరించిన శారద లేచిపోవునే? గంట మూనెదన్‌ రవ్వలు రాల్చెద గరగరల్‌ పచరించెద ఆంధ్రవాణికిన్‌’ అంటూ ధీమాగా గర్జించారు. ‘ఈ మనుజేశ్వరాధములకు’ నా కావ్యాన్ని అంకితం ఇవ్వనుగాక ఇవ్వనని పోతన తేల్చి చెప్పడం అలనాటికి రాజధిక్కారం! రాజులిచ్చే విలువైన కానుకలను వలదంటూ ‘సత్కవుల్‌ హాలికులైన నేమి నిజదార సుతోదర(భార్యాపిల్లల) పోషణార్థమై’ అని ఆనాడే పిలుపివ్వడం తిరస్కారం. ఆసుపత్రిలో అరాచకాలను ఎత్తిచూపుతూ బి.కృష్ణమూర్తి ‘నేను రాను కొడకో సర్కారు దవాఖానకు’ అనడమూ అంతే! ‘రాజుల్‌ మత్తులు వారి సేవ నరకప్రాయము’ అంటూ రాజాస్థానాల్లో బతికిన ధూర్జటికవి ప్రకటించడం- ఛీత్కారం. ‘ఛీ! లజ్జింపరు గాక మాదృశ కవుల్‌
శ్రీకాళహస్తీశ్వరా’ అని ఆ తరహా కవులను సైతం చీదరించుకొన్నాడు ధూర్జటి. ‘నిధి చాల సుఖమా!’ అని ప్రశ్నించిన త్యాగరాజ స్వామిదీ అదే దారి!

‘సుడిగొని రామపాదములు సోకిన ధూళి వహించి రాయి ఏర్పడనొక కాంత అయ్యెనట... నీ కాలిదుమ్ము సోకితే రాళ్లు ఆడాళ్లయిపోతున్నారు. ఇప్పుడు నా పడవకేం గతిపడుతుందో’ అని గుహుడి నోట మొల్లమాంబ పలికించింది సొగసైన చమత్కారం! ‘బండెనక బండికట్టి పదహారు బళ్లుకట్టి ఏ బండ్లెపోతావ్‌ కొడకా నైజాము సర్కరోడ’ అని బండి యాదగిరి ఆరా తీశారు. దేనికంటే- ‘గోలకొండ ఖిల్లా కింద నీ గోరీకడ్తం కొడకో’ అని గర్జించడానికి! అది ప్రతీకారం! ‘కొండలు పగిలేసినం బండలనే పిండినం మా నెత్తురు కంకరగా ప్రాజెక్టులు కట్టినం శ్రమ ఎవడిదిరో సిరి ఎవడిదిరో’ అని చెరబండ రాజు నిలదీశారు. అది హుంకారం. ‘సిందూరం రక్తచందనం బంధూకం సంధ్యారాగం పులిచంపిన లేడి నెత్తురూ ఎగరేసిన ఎర్రని జెండా రుద్రాలిక నయన జ్వాలిక కలకత్తా కాళిక నాలిక కావాలోయ్‌ నవకవనానికి’ అంటూ మహాకవి శ్రీశ్రీ చేసిన మార్గనిర్దేశం లోకానికి చేసింది మహోపకారం!

మనోహరం... జానపదం
లబ్జుగా ‘తల్లోపూలు కొనిస్త సేతులకు బందర్‌ గాజులేయిస్త... ఈ ఊళ్లో కాని ఎవుత్తి కట్టనసుమంటి ఉప్పాడ చెమ్కీ బుటా మల్లీమొగ్గల తెల్లకోక... ఇగో... ఈ మారెల్లి పట్కొస్తనే’ అని తనకు తెలిసిన భాషలో పెనిమిటి మాటిస్తుంటే- ఎంతో తీపిగా, ప్రాణానికి మరెంతో కుశాలుగా అనిపిస్తుందన్నారు చెరువు సత్యనారాయణశాస్త్రి. నాయుడు కూడా ఆ మాదిరిగా చెప్పాడనే ‘గాలికైనా తాను కవుగిలి ఈనన్నాడు’ అని తెగ మురిసిపోయింది నండూరి సుబ్బారావుగారి ఎంకి! బతుకులో తీపి క్షణాలవి. ‘అతని మాట రవంత విన్న చాలు కన్నులలోని వసంతాలు విరియు, నాయిక నిలువెల్ల చొక్కిపోవు’ అన్నారు పెన్నేటి పాటలో విద్వాన్‌ విశ్వం. అమాయక జానపద స్త్రీల అపురూప ఆంతర్యాలను ఆవిష్కరించిన ఇలాంటి సన్నివేశాలు తెలుగు సాహిత్యంలో సువాసనలు విరజిమ్మాయి. భాషను మనోహరంగా తీర్చిదిద్దాయి. పసిడి ఆభరణాలకు దీటైన రంగురంగుల పూసల దండలతో తెలుగుతల్లి కంఠసీమను
శోభాయమానం చేశాయి.

‘చందమామ రావె జాబిల్లి రావె’ అంటూ అన్నమయ్య ఆలపించింది ఏడుకొండలవాడి కోసం! ఏళ్లకేళ్లుగా ఎన్నో తరాలుగా తల్లులు వకుళమాతలై యశోదలై తమ బిడ్డలను దేవదూతల్లా చూసుకుంటూ అన్నమయ్యతో గొంతుకలపడం ఈ భాషకే ఇక్షురసాభిషేకం. ఇలా, హత్తుకునే అమ్మలను, ఆరాధించే తనయులను చూసి ‘సంతోషింపగదమ్మ ఆంధ్రజననీ’ అని అర్థించారు రాయప్రోలు.

‘తెలుగువారల తేట మాటల, తెలుగువారల తేనెపాటల తెలుగువారల మధురగీతల తెలియచెప్పర తెలుగుబిడ్డ!’ అన్న త్రిపురనేని సూచనను మనమంతా తూచా తప్పకుండా పాటిస్తే మన తెలుగుతల్లి కంట ఆనంద బాష్పాలు రాలవూ... మన జన్మలు ధన్యంకావూ... ‘ఇతర క్షోణిని లక్షలిచ్చినను గానీ’ పుట్టనే పుట్టను, ఈ మంగళక్షితిపైనే మళ్లీ పుడతానని మధునా పంతులవారిలా మనకూ అనిపించదూ!

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కలగవలసిన ఉత్తేజం అచ్చంగా అదే! మనం ఎంతటి వాళ్లమో మనకు తెలియాలి. ‘నిరుడు కురిసిన హిమసమూహాలు’ తిరిగి వర్షించాలి. భాషను సుసంపన్నం చేయాలి. ‘కవితగా గానముగ చిత్రకళగ నాట్యకళయుగా ప్రతియింట సాక్షాత్కరించి ఆంధ్రరాష్ట్రంబు మన భాషను అలవరించి ఎదుగుగావుత సంతత అభ్యుదయ మహిమ’ అని ఆకాంక్షించారు పుట్టపర్తి నారాయణాచార్యులు. ‘తన్ను సేవించిన తాపత్రయములూడ్చి ధన్యుల చేసెడి తల్లి ఎవరు?’ అని ప్రశ్నించారు బులుసు వేంకటేశ్వర్లు. ‘పంచెకట్టుటయందు ప్రపంచాన మొనగాడు’ అంటూ వేషధారణ ప్రత్యేకతను గుర్తుచేశారు ఆచార్య సి.నారాయణరెడ్డి. తెలుగువాడికీ తెలుగుభాషకూ వివిధకోణాల్లో కైమోడ్పులివి. అక్షర నీరాజనాలివి. ‘జయమహాంధ్ర జనయిత్రీ జయజయ ప్రియతమ భారత ధాత్రిపుత్రి శుభధాత్రీ శ్రీరస్తు శుభమస్తు శాంతిరస్తు అని దీవించు’ అని ప్రార్థించారు దేవులపల్లి కృష్ణశాస్త్రి.

ఈ పరిమళాలన్నీ తీరిగ్గా ఆస్వాదించారు కాబట్టే సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణ దేవరాయలు, అంతకుముందే శ్రీనాథుడు ‘దేశభాషలందు తెలుగులెస్స!’ అని స్పష్టంగా ప్రకటించారు. మనమంతా తెలుగువాళ్ళం... అజంత అజరామర భాషకు అచ్చమైన వారసులం... అమ్మభాషే మనకు బలం... ఆ బలంతోనే అందరినీ గెలవగలం!

- ఎర్రాప్రగడ రామకృష్ణ, రాజమండ్రి

ఎవరు రాశారు?

 తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధి పొందిన పదపల్లవాలలో ఇవి కొన్ని. వీటిని ఎవరు రాశారో చప్పున చెప్పండి చూద్దాం.
1. ‘‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు నా ఇచ్ఛయేగాక నాకేటి వెఱపు’’
2. ‘‘కప్పివుంచితే కవిత్వం విప్పి చెబితే విమర్శ’’
3. ‘‘ఉదయం కానేకాదు అనుకోవడం నిరాశ ఉదయించి అట్లానే వుండాలనుకోవడం దురాశ’’
4. ‘‘గత కాలము మేలు వచ్చుకాలముకంటెన్‌’’
5. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు’’
6. ‘‘రాజే కింకరుడగు కింకరుడే రాజగు’’
7. ‘‘వలపెరుంగక బ్రతికి కులికి మురిసేకన్న వలచి విఫలమ్మొంది విలపింపమేలురా’’
8. ‘‘నిఖిలలోకమెట్లు నిర్ణయించినగాని తిరుగులేదు విశ్వనరుడ నేను’’
9. ‘‘అత్తవారిచ్చిన అంటుమామిడితోట నీవు కోరగ వ్రాసి ఇచ్చినాను’’
10. ‘‘గాయపడిన కవి గుండెల్లో వ్రాయబడని కావ్యాలెన్నో’’
11. ‘‘ప్రజకు రక్షలేదు పత్రికలేనిచో’’
12. ‘‘బావా, ఎప్పుడు వచ్చితీవు’’
13. ‘‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి’’
14. ‘‘మాకొద్దీ తెల్ల దొరతనము’’
15. ‘‘పరమేశా గంగ విడుము పార్వతి చాలున్‌’’
16. ‘‘ఇందు గలడందు లేడని సందేహము వలదు... ఎందెందు వెదకిచూచిన అందందే గలడు’’
17. ‘‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’’
18. ‘‘తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు’’
19. ‘‘చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి లేచొస్తాను మరుజన్మకు మాటిస్తావా ఈ క్షణమే మరణిస్తాను’’
20. ‘‘రావోయి బంగారి మావా నీతోటి రాహస్యమొకటున్నదోయీ’’
21. ‘‘వనిత తనంత తా వలచివచ్చిన చుల్కన కాదె యేరికిన్‌’’
22. ‘‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేగదా?’’
23. ‘‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’’
24. ‘‘రాజుల్‌ మత్తులు, వారిసేవ నరకప్రాయంబు......’’
25. ‘‘ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు......’’
26. ‘‘భూమినాదియనిన భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు’’
27. ‘‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’’
28. ‘‘పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా’’
29. ‘‘నువ్వు ఎక్కదలచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు’’
30. ‘‘తల్లి ఒక్కతె మనకు తెలుగోడా సవతిబిడ్డల పోరు మనకేలా’’
31. ‘‘వీరగంధము తెచ్చినారము, వీరుడెవ్వడొ తెల్పుడీ’’
32. ‘‘మాదీ స్వతంత్రదేశం మాదీ స్వతంత్ర జాతి’’
33. ‘‘ఉప్పొంగిపోయింది గోదావరీ తాను తెప్పున్న ఎగిసింది గోదావరీ’’
34. ‘‘కూర్చుండ మా యింట కురిచీలు లేవు’’
35. ‘‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా నడుమ దొర ఏందిరో వాని దూకుడేందిరో’’
36. ‘‘తను శవమై - ఒకరికి వశమై తనువు పుండై - ఒకరికి పండై ఎప్పుడూ ఎడారై - ఎందరికో ఒయాసిస్సై’’
37. ‘‘మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోంది’’
38. ‘‘నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదై వుంది నా పేరు’’
39. ‘‘నా దేశాన్ని గూర్చి పాడలేను నీ ఆదేశాన్ని మన్నించలేను
40. ‘‘ఎక్కువ కులజుడైన హీనకులజుడైన నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు’’
41. ‘‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాససంత్రస్తులై’’
42. ‘‘అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ’’
43. ‘‘క్రిష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ
44. ‘‘వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి అయినా, గిన్నెలన్నిటిపైనా మా నాన్న పేరే’’
45. ‘‘గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండనీదురా కూసింతసేపు’’
46. ‘‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు’’
47. ‘‘చెరువులో దూకనా చెరువయ్యిపోదునా ఉరిపోసుకొందునా ఉరితాడు అవుదునా’’
48. ‘ఎంత చక్కనిదోయి ఈ తెలుగుతోట! ఎంత పరిమళమోయి ఈ తోటపూలు!’
49. నాగేటి చాల్లల్ల నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ
50. ‘‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీవు ఎరుగవురా’’

                                                                                           - ద్వా.నా.శాస్త్రి

‘తెలుగు’ పండుగ చేసుకుందాం రండి! 

దికవి నుంచీ ఆధునిక కవులదాకా అక్షరసేద్యంతో తీయని తెలుగు పండించిన మహానుభావులు ఎందరో. వారందరికీ వందనాలు తెలుపుకుంటూ మాతృభాషామతల్లికి మరోమారు జేజేలు చెబుతూ ప్రపంచ తెలుగు మహాసభలకు ఆతిథ్యమిచ్చేందుకు భాగ్యనగరం మహదానందంగా ముస్తాబవుతోంది. ఈ నెల 15 నుంచి 19 వరకు నగరంలోనూ రాష్ట్రంలోనూ పలు వేదికలపై తెలుగు వీనుల విందు చేయనుంది. 1975లో మొట్టమొదటి తెలుగు మహాసభలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఆ సభల్లో రాయప్రోలు తన గేయాల్ని స్వయంగా పాడి వినిపించడం ఓ అద్భుత ఘట్టం. తెలుగు తల్లికి అక్షరాల మల్లెపూదండ వేసిన శంకరంబాడి సుందరాచారి, ఆ గీతాన్ని తన మధురస్వరంతో పాడిన టంగుటూరి సూర్యకుమారి, స్వరలక్ష్మిగా పేరొందిన ఎస్‌.వరలక్ష్మి, ఎమ్మెస్‌ రామారావు లాంటి వారంతా ఆనాటి సభలకు వెలుగుదివ్వెలయ్యారు. ఆ తర్వాత మలేసియా, మారిషస్‌లలో స్థిరపడిన ప్రవాసాంధ్రులు వరసగా 
సభలనునిర్వహించారు. వందలాదిగా తరలివెళ్లిన తెలుగువారికి ఆతిథ్యమిచ్చి తమ మూలాలను గౌరవించుకున్నారు. మాతృభాష పట్ల మమకారాన్ని చాటుకున్నారు. తిరిగి స్వరాష్ట్రంలో నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో జరిగాయి. ఐదేళ్ల క్రితం జరిగిన ఆ సభలకు అధిక సంఖ్యలో యువత హాజరవడం భాషాభిమానుల్లో భవిష్యత్తు పట్ల ఆశలు రేకెత్తించింది. ఇలాంటి సభలు భావితరాల్లో భాష పట్ల భావోద్వేగాల్ని నింపగలిగితే తెలుగు అజరామరమవుతుందని అందరూ భావించారు. తెలుగు రాష్ట్రాలు ఒకటికి రెండయ్యాక తొలిసారి జరుగుతున్న మహాసభలకు వేదికయ్యే భాగ్యం మళ్లీ భాగ్యనగరానికి దక్కింది. దేశదేశాల్లో నివసిస్తున్న తెలుగువారికి నవతెలంగాణా ఆహ్వానం పలుకుతోంది. భాష ద్వారా బంధాలను బలపరుచుకుందాం రమ్మంటోంది. దేశదేశాల్లోని తెలుగువారందరూ... ‘తెలుగుతల్లి తిరునాళ్లట పదండి పోదాం భాగ్యనగరికి ప్రపంచసభలు జరుగు చోటికి...’ అని రాగం తీస్తూ తరలిరావాల్సిన తరుణమిది. తెలుగుతల్లి బిడ్డలెవ్వరూ విస్మరించలేని వేడుక ఇది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.