close
సామాన్యుడి ఘోష 

- వలివేటి నాగచంద్రావతి

 

‘‘అమ్మా, నేను ఆఫీసుకి వెళ్ళొస్తా’’ షూ లేసు బిగించి ముడేసుకుంటూ లోపలి గదిలోకి వినిపించేట్టు కొంచెం గట్టిగా చెప్పాను. 
అమ్మ తొంగి కూడా చూడలేదు. సరళ మాత్రం వచ్చింది కాఫీ కప్పుతో. అది నాకందించి ‘‘మీ అమ్మగారి కోపమింకా తగ్గలేదు’’ అంది నాకే వినిపించేలాగ- కాస్త విసుగు కూడా మిళాయించి. 
‘అమ్మ కోపం ఎందుకో నాకు తెలుసు. కానీ, ఆవిణ్ణి సముదాయించి ప్రసన్నురాలిని చేసుకోవటం ఇప్పట్లో నాకు తలకుమించిన పని’ నిట్టూర్చి లేచాను. 
బైకు డ్రైవ్‌ చేస్తున్నానన్నమాటేగానీ ఆలోచనలన్నీ అమ్మ చుట్టూనే. 
రెండు రోజులయింది దసరా వెళ్ళి. పండక్కి మా చెల్లెళ్ళు ముగ్గురినీ పిలవమంది అమ్మ. ఆహ్వానించాను. వచ్చారు. అందరికీ బట్టలు తియ్యాలంది. పెద్ద చెల్లి లక్ష్మికి ఇద్దరు పిల్లలు. రెండో చెల్లెలు పార్వతికి ఒక కొడుకు. మూడో చెల్లెలు సరస్వతికి కొత్తగా పెళ్ళయింది. అందరికీ బట్టలంటే నాక్కాస్త బరువే. అయినా కాదనలేదు, ఉన్నంతలో మాతో సమానంగా కొనబోయాను. 
అక్కడొచ్చింది తంటా. అమ్మ అలా కాదన్నది. పెద్దల్లుళ్ళమాట ఎలా ఉన్నా కొత్తల్లుడికి సూటు కుట్టించాలంది. 
ఇంకేదయినా ప్రజంటేషన్‌ కూడా ఇస్తే మరీ మంచిదంది. ముగ్గురు కూతుళ్ళకీ పట్టుచీరలు కొనాలంది. 
ఎలా? వీళ్ళందరూ వస్తున్నారని సరళ రాసిచ్చిన సరుకుల లిస్టుతోనే నా పర్సు బరువు తగ్గింది. అవికాక పాలకీ, పూలకీ, అందరూ కలిసిన సందర్భంలో సినిమాలూ, షికార్ల ప్రోగ్రాములకీ కొంత అమౌంట్‌ పక్కకి తీసిపెట్టడం తప్పదు కదా. మరి మిగతా నెలంతా ఎలా గడుస్తుందో 
నేను చూసుకోవద్దూ... 
‘అర్థంచేసుకోమ్మా...’ అని అమ్మని అర్థించాను. 
అమ్మ మొహం ముడుచుకుంది. పండగా, పండగకొచ్చిన చెల్లెళ్ళూ వెళ్ళిపోయినా ఆ ముడతలు విడలేదు. 
అమ్మ నా దగ్గరకొచ్చి అయిదారు నెలలే అయింది. అప్పటివరకూ మా సొంత ఊర్లోనే ఉండేది. నాలుగెకరాల మాగాణీ, నాలుగు గేదెల పాడీ, ఒక ఆవూ, దిట్టమైన పెంకుటిల్లూ ఉండేవి మాకొకప్పుడక్కడ. 
పెద్ద చెల్లికి నాన్న ఉండగానే పెళ్ళి చేశారు- గొప్ప సంబంధం అంటూ రెండెకరాలు అమ్మి. రెండో చెల్లి పార్వతిది ప్రేమ వివాహం. మా ఊరే. స్కూలు టీచరతను. తాడూ బొంగరం లేనివాడికి పిల్లనివ్వనంటూ అమ్మ భీష్మించుకుంది. చెల్లాయికీ అంతే పట్టుదల. నాన్న మరణించి అప్పటికింకా ఏడాది దాటలేదు. నేనే పెద్దరికం చూపించాల్సి వచ్చింది. 
‘అతనికి లేకపోతేనేం, మనకున్నదిగా అమ్మా’ అన్నాను. మిగతా రెండెకరాలూ పార్వతి పేరన రాసేందుకు అమ్మను ఒప్పించాను. 
ఆఖరి చెల్లి పెళ్ళప్పుడు ఇల్లు కూడా అమ్మక తప్పలేదు. అమ్మ బాధపడింది. ‘నీకేం మిగల్చలేదురా నాన్నా’ అంటూ. 
నవ్వి ‘నువ్వున్నావుగా అమ్మా’ అన్నాను. 
సరస్వతి కాపురానికి వెళ్ళిపోయాక ‘గేదెలూ, ఆవూ ఉన్నాయ్‌... వాటిని చూసుకుంటూ ఇక్కడే ఉంటానురా’ అంది అమ్మ. పట్నవాసం సోకు అంటని ఆ పల్లెటూరినీ, పూలమీంచీ పైరుమీంచీ అలలుగా వచ్చి ఒంటిని మెత్తగా తడిమే ఆ పరిమళాల పిల్లతెమ్మెరలనీ వదల్లేక. 
బలవంతాన తీసుకు వచ్చేశాను మా దగ్గరికి. వచ్చిందన్నమాటేగానీ అమ్మ ఈ సిటీ వాతావరణంలో ఇమడలేకపోతోంది. ఇక్కడి అలవాట్లకీ పద్ధతులకీ అలవాటుపడలేకపోతోంది. 
‘‘తూర్పు తెల్లబడకుండా ఇంటి ముంగిట్లో ముగ్గేసుకోవాలి. జాము పొద్దెక్కాకనా చీపురు పట్టుకు వస్తావ్‌?’’ అని గద్దించిందట సరోజినిని. మా అపార్ట్‌మెంట్స్‌ అన్నిటికీ ఆ మహారాణే కేర్‌టేకర్‌. ఆవిడ ఏం చేసినా ఎలా చేసినా ఊరుకోవాల్సిందే. ఇన్నాళ్ళకి ఆమెగారిని నిలదీసే మనిషయింది మా అమ్మ. 

‘‘ఫలానా టైముకే రావాలీ అని రూలు పెడితే నాక్కుదరదమ్మా. నిమిషాల ప్రకారం పనిచేసే వాళ్ళనే చూసుకోండి’’ మండిపడిపోతూ తేల్చేసిందట అది. సరళ గోలపెట్టింది నా దగ్గర రహస్యంగా. 
ఇదివరలో రెండుమూడు రోజులుండి వెళ్ళిపోయేది అమ్మ. ఇలాంటివి రిమార్క్‌ చేసేది కాదు. బహుశా పర్మినెంటు మెంబరయిన దగ్గర్నుంచే ఇవన్నీ దృష్టిలో పడుతున్నట్టున్నాయి. 
‘‘ఉండటానికి ఇన్ని వాటాలున్నాయ్‌. అంతా తలుపులు బిడాయించుకుని లోపలే మగ్గిపోతారుగానీ ఒక్కరూ బయటికొచ్చి మాటామంతీ ఆడుకోరేం’’ అంటుంది 
విడ్డూరంగా- బుగ్గన వేలేసుకుని. ఒక్కో ఫ్లాటూ ఒక్కో వాటా అమ్మ దృష్టికి. 
అవును, ఇది అపార్ట్‌మెంట్‌ సంస్కృతి. తలుపులు తెరుచుకునుంచుకోరు. గలగల మాట్లాడరు. అది నాగరీకం కాదు. 
అమ్మకది అర్థంకాదు. 
‘‘ఏం ఊర్రా ఇదీ వల్లకాడూ- పొద్దున్నే గుడికెళ్ళి దణ్ణం పెట్టుకు వద్దామంటే లిఫ్టులో నాలుగంతస్తులు దిగాలి. వందనోటు ఆటోవాడికి సమర్పించుకుని గంటంబావు ప్రయాణం చేసి మైలున్నర దూరం పోవాలి. ఆ ప్రయాస తలుచుకుంటే ఇంటి దగ్గరే దైవదర్శనం అయిపోతోంది నాకు’’ అంటోంది మొన్న శనివారంనాడు. 
పిచ్చి అమ్మ. నాలుగు బారలున్న మా పల్లెటూరా ఇది- వీధిచివర రామాలయం, చెరువు గట్టున వెంకన్న గుడీ ఉండటానికి. ఇది నగరం. అయిష్టంగా ఉన్నా ఇలాంటి ఇబ్బందులూ, ఇక్కట్లూ తప్పవమ్మా- అని అమ్మ నొచ్చుకోకుండా చెప్పడం చేతకావట్లేదు నాకు. 
సరే. బయట విషయాల మాట అటుంచితే ఇంట్లో కూడా అమ్మకి నచ్చనివెన్నో. 
నేను బెడ్‌కాఫీ తాగటం నచ్చదు. రాత్రిళ్ళు సరళ నైటీ వేసుకోవటం నచ్చదు. 
మా పింకీ జుట్టు బాబ్‌ చేయించుకుని టైట్స్‌ వేసుకోవటం నచ్చదు. మా బాబీ ఇంట్లో ఉన్నంతసేపూ చెవుల్లో స్పీకర్లు పెట్టుకుని ఊగుతుండటం నచ్చదు. 
కాలంతోపాటు మారాలి. ఇలాంటివన్నీ సాధారణమమ్మా అని చెప్పి ఒప్పించగలనన్న నమ్మకం లేదు. ఆవిడకు నచ్చనివన్నీ మార్చగల సాహసమూ లేదు నాకు. 
ముఖ్యంగా నా ఆర్థిక స్థితి అత్తెసరులా ఉన్నదంటే అపనమ్మకం అమ్మకి. 
‘దగ్గర దగ్గర ఎనభైవేలు తెచ్చుకుంటున్నానంటున్నావ్‌. ఇంటికొచ్చిన ఆడపడుచుకి పదివేలు పెట్టి పట్టుచీర కొనిపెట్టలేవా’ అన్నది అమ్మ వాదన. 
అమ్మ అనుమానం తీర్చాలంటే ఒకటే దారి. ఈ నెల శాలరీ తెచ్చి అమ్మ చేతుల్లో పెట్టడమే. నిర్ణయానికొచ్చేశాను. 
ఆఫీసు దగ్గరపడింది.

*  *  *

‘‘నాకెందుకురా ఈ బెడద. ఇప్పటిదాకా ఈ లెక్కలూ డొక్కలూ చూసిచూసి విసిగిపోయాను’’ అంది అమ్మ. కానీ, లోలోపల అధికారం తన చేతికందినందుకు సంతోషించి ఉంటుందనే నా నమ్మకం. 
సరళ మొహం చిన్నబుచ్చుకున్నట్టున్నా బయటపడలేదు. 
మర్నాటినుంచీ పరమోత్సాహంగా తనకి అప్పగించిన బాధ్యతల్ని నిర్వహించేటందుకు నడుం బిగించింది అమ్మ. సరళనడిగి ఫస్టు రాగానే ఇవ్వవలసిన వాళ్ళ లిస్టు తయారుచేసేసింది. 
రెంటూ, కరెంటూ, మెయిన్‌టెనెన్సూ, పనిమనిషీ, నెట్టూ, కేబులూ, పిల్లల ప్యాకెట్‌మనీ, టర్మ్‌ఫీజులూ, పాలూ పేపరూ... ఇలాంటివాళ్ళకి డబ్బు లెక్కచూసి ఇచ్చేసింది. 
‘‘చూడు. ఇంకా ఎంత డబ్బు మిగిలిందో!’’ పద్దు పుస్తకంతో నా దగ్గరకొచ్చింది అమ్మ మొహం విప్పార్చుకుని. 
‘‘అప్పుడే అయిందా ఏం... ఇంకా నెలకు సరిపడా సరుకులు తెప్పించాలి. కూరలూ, గ్యాసూ, మినరల్‌ వాటరూ, నెలంతా పైఖర్చులూ ఎన్నున్నాయ్‌’’ దీర్ఘం తీసింది సరళ. 
‘‘నా స్కూటీ పెట్రోలుకి?’’ అంది పింకీ. 
‘‘నాగ్గూడా’’ బాబీ తోడొచ్చాడు. 
‘‘నాకూనూ’’ నన్ను దృష్టిలో ఉంచుకుంటుందో లేదో... నా భయం నాది. 
‘‘అందరికీ అన్నిటికీ ఇస్తాను. అయినా మిగులుస్తాను చూడండి’’ ధీమాగా అని, ‘‘చూడు సరళా, ఈ నెల రెండు నూనె ప్యాకెట్లు ఎక్కువ తెప్పించు. అలాగే నెయ్యి కూడా ఓ అరకిలో... స్వీటూ హాటూ చేసి డబ్బాలో పోస్తాను. నాలుగురోజులు పిల్లలు నములుతారు. ఏమిటో- ముప్ఫై రోజులకంటూ లెక్కేసుకుని బొటాబొటీగా తెచ్చుకోవటం, కొలతల ప్రకారం తినటం. నాకు మీ తరహా వింతగా ఉంటోంది స్మీ’’ అంది అమ్మ- ఇది కోడలి మీద విసురు. 
సరళ పొదుపు అమ్మకసలు గిట్టదు. అందరూ వచ్చినప్పుడు అన్నానికి నెల్లూరు మొలకొలుకులు తెప్పించలేదనీ, పాలు ఇరవై రూపాయల ప్యాకెట్లు తెప్పించిందనీ, చక్రపొంగలిలో నెయ్యి శాతం తగ్గించిందనీ కినుక. 
తనలాగా బడ్జెట్‌ ప్రకారం ఖర్చు పెట్టకపోతే వచ్చే కష్టనష్టాలేమిటో పెదవి విప్పి చెప్పలేదు సరళ. కిమ్మనకుండా ఊరుకుంది.
ఏదేమయితేనేం, డైటింగ్‌లూ నియమాలూ పక్కన పెట్టేసి అమ్మ చేసినవన్నీ హాయిగా సుష్టుగా లొట్టలేసుకుంటూ ఆరగించేశామందరం- ఓ రెండు నెలలు. మా పనిమనిషిని కూడా ఉత్త చేతుల్తో వెళ్ళనీయలేదు అమ్మ ఏరోజూ. 
‘‘పాలకీ, కిరాణాకీ, ఈనెల రెట్టింపు ఖర్చయింది’’ సరళొకసారి గొణిగినా పట్టించుకోలేదెవ్వరం. పిల్లలకి ఆటవిడుపుగా ఉంటుందని అమ్మ అంటే- ఓసారి సినిమాకీ, ఓసారి పిక్‌నిక్‌కీ కూడా జాలీగా వెళ్ళొచ్చాం. 
అంత ధూమ్‌ధామ్‌గా ఖర్చు చేసినా నెల చివరన మిగిలాయంటూ ఓ రెండువేలు నా చేతికిచ్చింది అమ్మ. 
శుభం!

 

*  *  *

‘‘ఇదేమిటి, ఇంత తగ్గిందేం?’’ అడిగింది అమ్మ. మరుసటి నెల జీతమందిస్తున్నప్పుడు. 
‘‘అదే చెప్పబోతున్నానమ్మా. మొన్న పండక్కి చెల్లాయిలందరూ వస్తున్నారని ఫెస్టివల్‌ అడ్వాన్స్‌ తీసుకున్నా. అంతకుముందు సరస్వతి పెళ్ళికి చేతిఖర్చులకి కావాలన్నావని ఆఫీసులో లోన్‌ పెట్టి నీకు తీసుకొచ్చి ఇచ్చానా యాభైవేలు, అది ఇంకా తీరలేదు. ఆ రెంటికీ వాయిదాలు జీతంలో కట్‌ అయిపోతే మిగిలింది ఇదే. ఈ రెండు నెలలబట్టీ ఖర్చులకి చాలదేమోనని లోన్‌కి కట్టకుండా ఆపాను. ఇంకెంతా- నాలుగు నెలలు అంతే! తీరిపోతుంది’’ అమ్మకి అర్థమయ్యేట్టుగా సంజాయిషీ ఇచ్చాను. 
అమ్మ కాస్త నిరుత్సాహపడ్డట్టే ఉంది. ‘‘ఫరవాలేదు, ఫరవాలేదు... సరిపోతుందిలే’’ అన్నదే కానీ ఆ తరవాత అలా సరిపెట్టడానికి డబ్బు వాడకాన్ని ఎన్నివిధాల కట్టడి చేసిందో! పాలూ నెయ్యీ కొలతలు యథాప్రకారానికొచ్చేసినయ్‌. ఇంకాస్త తగ్గినాయేమో కూడా. ఇప్పటివరకూ నిండుగా 
కళకళలాడిన ఫ్రిజ్‌ వెలితి వెలితిగా బిక్కమొహం వేసినట్టుంటోంది. నిండా నూనె దీపాలతో పూల తోరణాలతో వెలిగిపోయే దేవుడి గది కూడా ఎకానమీ నేర్చుకుంది. 
అలవాటుపడ్డ ప్రాణాలు కదూ... పిల్లలు డబ్బాలు వెతుక్కుంటుంటే చూడలేకగావును- మరమరాలు వేయించి డబ్బాలో పోసిందట. నానేసిన సెనగలో పెసలో సాతాళించి పెడుతూ, కొవ్వు పట్టకుండా శరీరానికి అవెంత మంచివో ఆరోగ్య పాఠాలు చెబుతోందట. ‘మరీ అంత ప్యాకెట్‌మనీనా!?’ అని కోప్పడి రెండొందలు తక్కువిచ్చిందట బాబీకి. వాడు నా దగ్గరకొచ్చి ఒకటే గుణుపు. 
‘చచ్చీచెడీ చేయంగల విన్నపాలనీ’ ఎలాగయితేనేం నెల చివరకొచ్చింది. ‘ఇంక నాలుగు రోజులే’ తనలోతాను తెరిపినపడ్డట్టనుకుంటోంది అమ్మ. పాపం- తన హయాంలో ఇలా రోజులు లెక్కపెట్టుకునేటంత ఒత్తిడి ఎప్పుడూ పడి ఉండదు. 
కానీ, అనుకున్నది అనుకున్నట్టుగా జరగటంలో విశేషమేముంది? 
కాలేజీ నుంచి వస్తుండగా బాబీ బైకుకి యాక్సిడెంటు. కాలికీ చేతికీ ఫ్రాక్చర్లు. 
హాస్పిటల్లో జాయిన్‌ చేశాం. ఆపరేషన్‌కి పాతికవేలు కౌంటర్లో కట్టి రమ్మన్నది నర్సు. 
అమ్మ గుండె గుభేలుమన్నట్టుంది ‘‘ఎలారా?’’ అంది కలవరపడిపోతూ. 
‘‘గాభరా పడకమ్మా, నేనెలాగో సర్దుబాటు చేస్తాన్లే’’ అన్నాను భరోసాగా అమ్మ వెన్ను మీద చెయ్యి వేసి. 
అలా నేను అనగానే చప్పున మారిపోయిన అమ్మ చూపులో కదలాడిన భావమేమై ఉంటుంది? ‘తనకి తెలీకుండా దాచిపెట్టుకున్న ముల్లె ఏదో ఉన్నదని కాదు కదా’ చివుక్కుమంది నాకు. 
అదృష్టవశాత్తూ నేను ఫోన్‌ చేయగానే మూర్తి ఆసుపత్రికి వచ్చాడు. మమ్మల్ని పరామర్శించి ‘‘నిన్న చిట్‌ పాడటం మంచిదయింది. నువ్వడగగానే ఇవ్వగలిగాను’’ అని నా చేతికి డబ్బందించాడు. అమ్మ చూస్తూనే ఉంది. 
అమ్మ సందేహం నివృత్తయి ఉండాలి బహుశా. ‘‘సమయానికి దేవుడిలా ఆదుకున్నావు నాయనా’’ నేను చెప్పాల్సిన కృతజ్ఞతలు తనే చెప్పింది కళ్ళు చెమ్మగిల్లుతుంటే. 
ఆపరేషన్‌ ముగిసింది. అంతవరకూ పడిన ఆత్రుతా, ఆందోళనా ఉపశమించి ఊపిరిపీల్చుకున్నాం. 
స్థిమితంగా ఆసుపత్రి క్యాంటీన్‌లో కాఫీ తాగుతున్నప్పుడు ‘‘మీ స్నేహితుడికి ఈ చేబదులు ఒక్కమాటుగా తీర్చక్కరలేదుగా’’ అనడిగింది మా ఆర్థికమంత్రి. 
అమ్మకేసి సాలోచనగా చూశాను. ‘‘అతనూ నాబోటివాడేనమ్మా. డెబ్భై ఎనభైవేలు తెచ్చుకుంటున్నామని పేరు. కానీ కటింగులు పోనూ చేతికొచ్చేది ఎంతని..? నువ్వు చెబుతూ ఉంటావే... ఎంత చెట్టుకు అంత గాలని. ఈ సిటీ జీవితమెంత ఖరీదైనదో చూస్తూనే ఉన్నావుగా. రోజురోజుకీ నిచ్చెనెక్కుతున్న ధరలు, ఎదిగే పిల్లలతోపాటూ పెరుగుతున్న ఖర్చులు, వీటికితోడు సౌఖ్యాలకి అలవాటుపడినందుకో, సాటివారితో సమానంగా ఉండాలనే తాపత్రయంతోనో కష్టంగా ఉన్నా తప్పించుకోలేని ఖర్చులు కొన్ని... వీటితో నెల చివరకు రాకుండానే ఫస్టు తారీకు కోసం ఎదురుచూపులు... అదీ మా పరిస్థితి. మరిక ఎంత ప్రాణ స్నేహితుడికయినా చేబదులు ఇవ్వగల తాహతు సాధ్యమా చెప్పు. పాపం- ఏ ముఖ్యమైన అవసరం తీర్చుకోవటానికో ఏడాదిపాటు నెలనెలా జమ చేసుకుంటున్నాడతను. నేనలా కొద్దికొద్దిగా ఎప్పటికో తీర్చుతానంటే ఉపకారం చేసి ఇబ్బందిలోపడినట్టవదూ- ఉహూ, తొందరగానే తీర్చెయ్యాలతనికి... తప్పదు’’ దీర్ఘంగా, నిర్వికారంగా వివరించానమ్మకి. 

‘‘కానీ, ఒక్కమాటుగా తీర్చటమంటే మాటలా!’’ అమ్మ కలవరపడటం తెలుస్తూనే ఉంది. 
‘‘ఏం చేయాలో నేను ఆలోచించాలే అమ్మా. ఈ నెల్లో ఇంకో పాతికవేలు ఇన్సూరెన్స్‌ కూడా కట్టాల్సి ఉంది. 
మా ఆఫీసులోనే ఫైనాన్స్‌ చేసేవాళ్ళున్నారులే. మొత్తంగా వాళ్ళ దగ్గర తీసుకుంటాను. ఇంట్రెస్ట్‌ కాస్త ఎక్కువేననుకో, తప్పదు’’ అన్నాను. 
‘‘వడ్డీకా?’’ తుళ్ళిపడింది అమ్మ. 
‘‘ప్రతిదానికీ ఎందుకమ్మా అంత హడలిపోతావ్‌. అవును వడ్డీకే, ఏమవుతుంది? రెండు నెలల్లో ఆఫీసులో పాత లోన్‌లు తీరిపోతాయి. మళ్ళీ లోన్‌ తీసుకుని ఇక్కడ కట్టేస్తాను, అంతే! కాకపోతే అప్పటివరకూ ఇంటి ఖర్చులు అదుపులో ఉంచుకోవాలంతే.’’ 
నీరసమొచ్చేసినట్టుగా ఉంది అమ్మకి. ‘‘కెరటాల్లా ఒకటి తరవాత ఒకటిగా అనుకోని ఖర్చులు వచ్చిపడుతూనే ఉన్నాయిగా. అవి ఆగేదెప్పుడు, నువ్వు ఊపిరి పీల్చుకునేదెప్పుడు?’’ దిగులుగా అంది అమ్మ. 
ఓ అర్థంలేని నవ్వు నవ్వాను నేను.

 

*  *  *

‘‘అమ్మా, జీతమిదిగో’’ అన్నాను 
కవరందించబోతూ. ‘‘వద్దురా’’ అంది అమ్మ. 
‘‘ఓపలేని బరువిది. అర్భకురాల్ని, నేను మోయలేను. ఆటుపోట్లకి తలవంచి తలయెత్తే సమర్థత మీదే. తెలివితక్కువగా మిమ్మల్నేమయినా అని ఉంటే మనసులో పెట్టుకోకండిరా’’ అంది అమ్మ - మా ఇద్దర్నీ చూస్తూ మొహమాటంగా. 
అలా మాట్లాడవద్దన్నట్లుగా అమ్మ నోటికి చెయ్యి అడ్డుపెట్టాను.

*  *  *

ఇది జరిగిన రెండు నెలలకి అర్ధరాత్రివేళ దాహమైతే లేచి ఫ్రిజ్‌ దగ్గరికి వెళ్ళబోతూ ఆగాను. దేవుడి గది ముందర సన్నని వెలుతురులో గోడకి ఆనుకుని ఏడుస్తోంది అమ్మ. 
ప్రాణం నీరైపోతోంటే వెళ్ళి అమ్మ పక్కన చతికిలబడి భుజం మీద చెయ్యి వేశాను. ‘‘ఏమయిందమ్మా?’’ నల్లమబ్బుకి చల్లగాలి మెల్లగా సోకింది. కన్నీళ్ళు పడి తడిసిన అమ్మ చెక్కిళ్ళ ముడతలు దీపం వెలుతురులో దీనంగా మెరిశాయి. 
‘‘పార్వతి ఏడుస్తోందిరా.’’ 
‘‘పార్వతా!?’’ అన్నాను అయోమయంగా. 
‘‘మధ్యాహ్నం ఫోన్‌ చేసిందట పార్వతి. పిల్లవాడికి గుండెలో రంధ్రముందన్నారట డాక్టర్లు. లక్షల్లో ఖర్చు. అంత డబ్బు కూడ్చలేకపోతున్నామమ్మా అని ఏడ్చిందిరా’’ వెక్కుతోంది అమ్మ. 
కాసేపు మాటలు రానట్టుండిపోయాను. ‘‘ఇప్పటిదాకా నాకెందుకు చెప్పలేదు. 
నేనంత దూరమనిపించానా అమ్మా’’ అన్నాను బాధగా. 
అమ్మ మాట్లాడలేదు. తల వాల్చుకుంది. 
‘‘నామీద కోపమా?’’ అమ్మకి మరింత దగ్గరగా జరిగాను. ‘‘పట్టుచీరంటే కొననన్నానుగానీ, తోబుట్టువుని ఆపదలో ఆదుకోనంత స్వార్థపరుణ్ణనుకున్నావా అమ్మా!’’ 
‘‘ఉహు, అసలే అప్పుల్లో ఉన్నావు. ఎలా సాయపడగలవనీ...’’ 
‘‘తల తాకట్టు పెడతాను, ఇక దాని గురించి మరిచిపో. రేపే పార్వతి దగ్గరకి వెళతాను, సరేనా’’ అన్నాను. 
అమ్మ మొహంలో నామీద పూర్ణ విశ్వాసం తొణికిసలాడింది. కళ్ళల్లో నీళ్ళు తళతళలాడుతుండగా నా తలను హృదయపూర్వకంగా గుండెకు హత్తుకుంది. 
‘ఇంత గొప్ప సంపద నాకుండగా, నాకింకేం కావాలి. ఏ రుణాలు నన్ను బాధించగలవు?’ పులకించిపోతూ అనుకున్నాను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.