close
ఆ సినిమా చాలా నేర్పింది!

తెలుగులో ఒక్క స్టార్‌ హీరోతో పనిచేసే ఛాన్స్ వచ్చినా చాలనుకుంటారు చాలామంది హీరోయిన్లు. అలాంటిది వరసగా ఎన్టీఆర్‌, మహేష్‌బాబు, ప్రభాస్‌... ఇలా ముగ్గురు సూపర్‌స్టార్లతో నటించే అవకాశం కొట్టేసింది పూజా హెగ్డే. ఏడాది మొదట్లోనే రామ్‌చరణ్‌ పక్కన జిగేల్‌ రాణిగా డాన్స్‌తో ఇరగదీసేసింది కూడా. అయితే ఇవేవీ ఆమెకు అంత సులభంగా దక్కిన అవకాశాలు కాదు. అందుకోసం ఎన్నో ఎత్తుపల్లాల్ని చూసింది. వాటి గురించి చెబుతోందిలా... 

 

 

నేను పుట్టి పెరిగింది ముంబయిలోనే. కుటుంబంలో అందరూ బాగా చదువుకున్నవాళ్లే. నాన్న మంజునాథ్‌ లాయర్‌. అమ్మ లత... జెనెటిక్స్‌, ఇమ్యునాలజీ రంగంలో పనిచేస్తున్నారు. అన్నయ్య రిషబ్‌ డాక్టర్‌. నేను మాత్రం వాళ్లకి భిన్నం. మా చిన్నపుడు అమ్మానాన్నా ఉదయం తొమ్మిది గంటలకు పనిమీద వెళ్తే ఇంటికి వచ్చేసరికి రాత్రి తొమ్మిదీ, పదీ అయ్యేది. అన్నయ్యా, నేనే ఇంట్లో ఉండేవాళ్లం. మా మధ్య చాలా ఫైటింగులు జరిగేవి. అప్పుడు నేను చాలా బిడియంగా ఉండేదాన్ని. వాడికి దూకుడు ఎక్కువ. అన్నయ్య మొదట్నుంచీ డాక్టర్‌ అవుతానని చెప్పేవాడు. ‘అంత కచ్చితంగా ఎలా చెబుతున్నాడబ్బా’ అనిపించేది. నేనైతే ఫలానా కెరీర్‌లో ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు. మొదటిసారి సినిమా సెట్‌లో అడుగుపెట్టినపుడు మాత్రం ‘నేను ఉండాల్సింది ఇక్కడే’ అనిపించింది. 
సినిమాల్లోకి ఇలా... 
డిగ్రీ చదువుతున్న సమయంలో కాలేజీలో జరిగిన ఒక యూత్‌ ఫెస్ట్‌లో మిస్‌ ఇండియా పోటీల నిర్వాహక సంస్థ ప్రతినిధి నన్ను చూసి ‘అందాల పోటీలవైపు వెళ్లొచ్చుగా’ అన్నారు. ఆయన ఊరకే చెప్పి ఉండరు కదా అనిపించింది. అందాల పోటీల కోసం బెంగళూరు వచ్చి ప్రసాద్‌ బిడప దగ్గర శిక్షణ తీసుకున్నాను. మా పూర్వీకులది కర్ణాటకలోని ఉడిపి ప్రాంతం. నాకు కన్నడ కూడా బాగా వచ్చు. అందుకే కుటుంబానికి దూరంగా బెంగళూరులో ఉన్నప్పటికీ సొంతూరులో ఉన్నట్టే అనిపించింది. చిన్నప్పుడు టామ్‌బాయ్‌లా ఉండేదాన్ని. ఎక్కువగా స్నీకర్స్‌ వేసుకుని తిరిగేదాన్ని. మోడలింగ్‌కి ముందు హీల్స్‌ ఎప్పుడూ వేసుకోనేలేదు. ఇప్పటికీ హీల్స్‌ వేసుకుని నడవడం నాకు ఓ పెద్ద అఛీవ్‌మెంట్‌లా అనిపిస్తుంది. 2010లో ‘మిస్‌ యూనివర్స్‌ ఇండియా’గా ఎంపికయ్యాను. తర్వాత కొన్ని ప్రకటనలు చేశాను. 2012లో జీవాతో తమిళంలో ‘ముగమూడి’(మాస్క్‌)సినిమా చేశాను. తెలుగులో నా మొదటి సినిమా ‘ఒక లైలా కోసం’.‘ముకుంద’ రెండోది. తర్వాత సినిమా హిందీలో వచ్చిన ‘మొహెంజొదారో’. దర్శకుడు అశుతోష్‌  నన్ను ఓ యాడ్‌లో చూసి అవకాశం ఇచ్చారు. 
‘మొహెంజొదారో’ పాఠాలు... 
‘మొహెంజొదారో’ అనుభవం నాకు చాలా పాఠాలు నేర్పింది. ఆ సినిమాకి చాలా పెద్దవాళ్లు పనిచేశారు. వాళ్ల పనితీరుని గమనిస్తూ చాలా నేర్చుకున్నాను. ఆ సినిమా చేసినపుడు రెండేళ్లు మరే సినిమాలోనూ చేయనని అంగీకరించాను. దాంతో చాలా పెద్ద దర్శకుల సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. కానీ అది హిట్‌ అవ్వలేదు. ఒక సినిమా కోసం ఎంత చేయాలో అప్పుడే తెలుసుకున్నాను. ఏ పనిచేసినా పూర్తి అంకితభావంతో చేయాలనీ, ఫలితం గురించి ఆలోచించకూడదనీ అనుభవమైంది. 
ఆ తర్వాత నుంచి సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. కొన్నిసార్లు సినిమా మంచి హిట్‌ అవుతుందన్న ఉద్దేశంతో చేస్తాం. కానీ ఫలితం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. అందుకే సినిమా అంగీకరించే ముందు అది చేస్తున్నపుడు సెట్స్‌లో ఎంజాయ్‌ చేయగలనా లేదా అని చూస్తాను. సినిమా హిట్‌ అయితే ఆ ఆనందం వారం, పదిరోజులపాటు ఉంటుంది. కానీ షూటింగ్‌ కొన్ని నెలలు ఉంటుంది. హిట్‌, ఫ్లాప్‌తో సంబంధంలేకుండా అన్నాళ్లూ పనిని ఎంజాయ్‌ చేయగలగాలి. అందుకే సినిమాలో ఎంత గొప్పవాళ్లు ఉన్నప్పటికీ కథ నాకు నచ్చితేనే చేస్తాను. తెలుగులో ఓ టాప్‌ హీరోతో సినిమా ఛాన్స్‌ వచ్చింది. కానీ కథ నచ్చక వదులుకున్నాను. కొద్దిరోజుల తర్వాత అదే హీరోతో ఇంకా మంచి కథ రావడంతో ఒప్పుకున్నాను. 
15 నిమిషాలు ఏడ్చేస్తాను 
ఏదైనా అనుకోని ఇబ్బంది, కష్టం వచ్చినపుడు ఓ పదిహేను నిమిషాలు కూర్చొని ఏడ్చేస్తాను. దీన్ని నేను అభిమానించే వ్యక్తుల్లో ఒకరైన ఓప్రా విన్‌ఫ్రే నుంచి నేర్చుకున్నాను. అక్కడ ఏడ్వడం ముఖ్యం కాదు, ఆ పదిహేను నిమిషాలతో ఆ కష్టంవల్ల కలిగిన నెగెటివ్‌ థాట్స్‌ అన్నీ పోయి మళ్లీ సాధారణ వ్యక్తులం అవుతాం. సినిమా కుటుంబ నేపథ్యం లేకుండా సినిమాల్లోకి వచ్చిన నేను... మొదటి సినిమా ఫ్లాప్‌ అయినపుడు చాలా బాధపడ్డాను. మళ్లీ   కష్టపడ్డాను. నా కష్టాన్ని గుర్తించినవాళ్లు పిలిచి అవకాశాలు ఇచ్చారు. నేను బాధలో ఉన్న ఆ రోజుల్లోనే నాకు ఈ 15 నిమిషాల టెక్నిక్‌ తెలిసింది. ఆ తర్వాత జీవితంలో చాలా మార్పు వచ్చింది. 
అభిమానులూ... ధన్యవాదాలు! 
‘మొహెంజొదారో’ తర్వాత నాకు తెలుగులోనే ‘దువ్వాడ జగన్నాథం’లో ఛాన్స్‌ వచ్చింది. తర్వాత ‘రంగస్థలం’, ‘సాక్ష్యం’ సినిమాలు చేశాను. ఆపైన ‘అరవింద సమేత’. ఈ సినిమా చేస్తున్న ఆరేడు నెలలూ చాలా స్మూత్‌గా గడిచిపోయాయి. డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ చాలా ప్రశాంతంగా పనిచేసుకునే మనిషి. కాబట్టి సెట్‌లో అనవసరమైన ఒత్తిడేమీ ఉండదు. నాకు అరవింద క్యారెక్టర్‌ గురించి చాలా సుదీర్ఘంగా వివరించి అందులోకి సులభంగా వెళ్లేలా చేశారాయన. తారక్‌ లాంటి హీరో ఉండటంవల్ల కూడా పని వాతావరణం బావుంటుంది. వర్క్‌ తప్ప మిగతా విషయాలు తనకి అవసరంలేదు. ఈ సినిమాలో కొత్తగా ఏమైనా చేయాలనుకుని నేనే డబ్బింగ్‌ చెబుతానని త్రివిక్రమ్‌ గారిని అడిగాను. ఆయన నా వాయిస్‌ టెస్ట్‌ చేసి బాగుందనుకున్నాకే నాచేత డబ్బింగ్‌ చెప్పించారు. నటించినవాళ్లే డబ్బింగ్‌ చెప్పినపుడు ప్రతి ఎమోషన్‌ 100 శాతం కనిపిస్తుంది, వినిపిస్తుంది.  నేను నటించిన ప్రతి సినిమానీ ఆదరించారు తెలుగు అభిమానులు. వారికోసం ఇంకా మంచి సినిమాలు చేయాలనిపిస్తుంది. ఒక సినిమాకి అయిదారు నెలలు కష్టపడి పనిచేస్తుంటాం. ఆ సమయంలో ఆ క్యారెక్టర్‌తో బాగా కనెక్ట్‌ అవుతాం. కానీ రంగస్థలంలో ‘జిగేల్‌ రాణి’గా కనిపించింది అయిదు నిమిషాలే. అందుకే దాన్నో ఛాలెంజ్‌గా తీసుకున్నాను. అందులో నా డాన్స్‌, ఎక్స్‌ప్రెషన్స్‌ బాగా నచ్చడంతో దానికి మంచి పేరు వచ్చింది. 
ఆ పాటను అంత బాగా చేయడానికి నాకు డాన్స్‌ అన్నా, సంగీతమన్నా ఇష్టం ఉండటమే కారణం. పదేళ్లపుడు భరతనాట్యం నేర్చుకున్నాను. ఉదయం లేచింది మొదలు నిద్రపోయే వరకూ సంగీతం వింటూనే ఉంటాను. తెలుగులో ప్రస్తుతం మహేష్‌బాబుతో ‘మహర్షి’లోనూ, ప్రభాస్‌తో ఒక సినిమాలోనూ నటిస్తున్నాను. 

 

 

అందం-ఆరోగ్యం 
మొదట్నుంచీ సన్నగానే ఉండేదాన్ని.  వ్యాయామాలు అవసరంలేదనుకునేదాన్ని. కానీ వ్యాయామాలంటే సన్నగా అవ్వడానికి కాదు, ఫిట్‌గా ఉండటానికని సినిమాల్లోకి వచ్చాక అర్థమైంది. మొదట్లో ముందుకు వంగి నా కాలివేళ్లను కూడా టచ్‌ చేయలేకపోయేదాన్ని. లాభంలేదని వ్యాయామాన్ని హాబీగా మార్చుకున్నాను. ఇప్పుడు ఒక్కరోజు జిమ్‌ చేయకపోయినా ఏదో కోల్పోయిన ఫీలింగ్‌ ఉంటుంది. రోజూ ఒకేలాంటి వ్యాయామాలు కాకుండా కొత్తకొత్తవి చేస్తా. దానివల్ల బోర్‌కొట్టకుండా ఉంటుంది. పైలేట్స్‌, 
క్యాలిస్తెనిక్స్‌, కిక్‌ బాక్సింగ్‌, క్రాస్‌ ఫిట్‌, ఏరియల్‌ సిల్క్‌... ఎప్పటికప్పుడు ఇలా కొత్తవి ట్రైచేస్తుంటా. ఈ వ్యాయామాల్లో ఒక్కోదాంతో ఒక్కో లాభం ఉంది. కొన్ని ఫిట్‌నెస్‌ని పెంచేవైతే మరికొన్ని ఫ్లెక్సిబిలిటీని ఇస్తాయి. నేను బాగా తింటాను. నోరు కట్టుకుని ఉండటం నచ్చదు. వ్యాయామానికి కేటాయించినంత సమయాన్ని ఇవ్వలేను కానీ అందం కోసం చిన్న చిన్న నియమాలు పాటిస్తాను. ఎంత ఆలస్యమైనా నిద్రకు ముందు నా మేకప్‌ మొత్తం తీసేస్తాను. నీళ్లు ఎక్కువగా తాగుతాను. షూటింగ్‌ నుంచి వచ్చాక ఒంటికి కొబ్బరినూనె రాసుకుని కాసేపు మర్దనా చేసుకుని స్నానం చేస్తాను. దానివల్ల మురికి పోయి, చర్మానికి మంచి నిగారింపు వస్తుంది. 

 

 

స్వేచ్ఛ తప్పిస్తే... 
నాకు సినిమాల్లో గాడ్‌ఫాదర్‌ అంటూ ఎవరూ లేరు. ఒక్కో మెట్టు ఎక్కుతూ, కొన్నిసార్లు కిందపడుతూ, లేస్తూ ఇక్కడివరకూ వచ్చాను. ఇప్పుడు వరస సినిమాలతో చాలా బిజీ. నేను ఇలా బిజీగా ఉండటాన్ని చాలా ఇష్టపడతాను. చేసే పనిని ప్రేమించేవాళ్లకి బిజీగా ఉండటం సమస్య కాదు. నేను నా పనిని బాగా ఎంజాయ్‌ చేస్తాను. క్యారెక్టర్‌లో ఇన్‌వాల్వ్‌ అయ్యాక పనిచేస్తున్నానన్న ఫీలింగే ఉండదు. బాలీవుడ్‌లో ప్రస్తుతం ‘హౌస్‌ఫుల్‌ 4’లో చేస్తున్నాను. ఇది పూర్తి కామెడీ సినిమా. ఇలాంటి సినిమా చేయడం ఇదే ఫస్ట్‌టైమ్‌. అక్షయ్‌కుమార్‌, రితేష్‌ దేశ్‌ముఖ్‌, బోమన్‌ ఇరానీ... ఇలా ఒకే సినిమాతో ఇంతమంది స్టార్లతో పనిచేసే ఛాన్స్‌ వచ్చింది. ఏడాదిగా ఇటు టాలీవుడ్‌లో అటు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నాను. ఒక సినిమా షూట్‌ పూర్తిచేసుకుని రాత్రంతా ప్రయాణించి వేరే సినిమా షూటింగ్‌కి వెళ్లిన రోజులు చాలా ఉన్నాయి. కెరీర్‌పరంగా అంతా బావుంది కానీ వ్యక్తిగత స్వేచ్ఛ తగ్గుతూ వస్తోంది. అదొక్కటే ఇబ్బంది!

ఫెదరర్‌ అభిమానిని...

హ్యారీపాటర్‌ నవలలూ, సినిమాలూ బాగా ఇష్టం. 
* సన్‌ గ్లాసెస్‌, ఫుడ్‌, ట్రావెల్‌... ఈ మూడూ నాకు అడిక్షన్‌. 
* నా వార్డ్‌రోబ్‌లో ఎక్కువగా నలుపు, తెలుపు టీషర్టులూ డెనిమ్‌ బాటమ్స్‌ ఉంటాయి. రకరకాలవి 50 జతల చెప్పులు ఉన్నాయి. 
* టెన్నిస్‌ నా అభిమాన క్రీడ. రోజర్‌ ఫెదరర్‌కి పెద్ద ఫ్యాన్‌ని. ఎనిమిదేళ్ల కిందట ఒరిజినల్‌ నైకీ రోజర్‌ ఫెదరర్‌ క్యాప్‌ కొన్నాను. అది ఎవరికీ ఇవ్వను. 
* పుస్తకాలు బాగా చదువుతాను. సరదాగా డాన్స్‌ చేయడం, పాటలు పాడటమూ ఇష్టమే. 
* ప్రతి సంవత్సరం ఒక కొత్త చోటుకి వెళ్తాను. నా వృత్తి కూడా అలాంటిదే కావడంతో ఇప్పుడది మరింత సులభంగా ఉంది. ఖాళీ దొరికితే టీవీలో ఇంగ్లిష్‌ సీరియళ్లు చూస్తుంటాను. 
* ముంబయిలో పుట్టి పెరగడంవల్ల హిందీ, ఇంగ్లిష్‌, మరాఠీ వచ్చు. కర్ణాటక నేపథ్యంవల్ల తుళు, కన్నడ వచ్చు. ఇప్పుడు తెలుగు కూడా బాగానే మాట్లాడేస్తున్నాను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.