close
కాలుష్య భారతం!

కాలుష్య భారతం!

గుర్తుందా... చిన్నపుడు ఏడూ ఎనిమిదయ్యేసరికి వేడివేడిగా అన్నం తినేసి ఆరుబయట మంచం మీద నడుంవాల్చి ఆకాశం వైపు చూస్తుంటే వాకిట్లో పూసిన సన్నజాజి పూలు కూడా తెల్లబోయేంత తెల్లని మెరుపుతో చందమామా... ఆ చుట్టూ లెక్కపెట్టినకొద్దీ తరగని నక్షత్రాలూ ఎంత ప్రకాశవంతంగా కనిపించేవో... ఇప్పుడు నాలుగంతస్తుల డాబా మీదికెక్కి చూసినా ఆ వెలుగు కనిపించట్లేదు. తారలు అక్కడక్కడా చీమల్లా అగుపిస్తున్నాయి.

ఎందుకిలా... అప్పటికీ ఇప్పటికీ చందమామ సైజు తగ్గిందా... లేదు. తారల లెక్క తప్పిందా అంటే అదీ కాదు. పోనీ వాటి కాంతి సన్నగిల్లిందా... అస్సలు కాదు. మరేమైందీ అంటే... మన కళ్లకే కాలుష్యపు పొర కమ్మేసింది. చంద్రుడే మసకబారేంత వాయు కాలుష్యం మన చుట్టూ చేరిపోయింది. దిల్లీతో మొదలు పెడితే భారత్‌లోని గల్లీ గల్లీ వరకూ విస్తరించిన ఆ మహమ్మారి కడుపులోని బిడ్డల్ని కూడా వదలకుండా ప్రాణాలు తోడేస్తోంది.
 

కాలుష్య రాజధాని

మీకు తెలుసా... ఈ నవంబరులో పసి పిల్లల దగ్గర్నుంచి వృద్ధులూ చివరకు ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్నవారితో సహా దిల్లీలోని ప్రతి ఒక్కరూ తమ ప్రమేయం లేకుండా రోజుకి 44 సిగరెట్లు తాగాల్సొచ్చిందని... అదీ గాలి రూపంలో. గతనెల మొదటి వారంలో రాజధాని నగరాన్ని పొగలా కమ్మేసిన కాలుష్యం ప్రమాద హెచ్చరికల్ని దాటి ఎక్కడికో వెళ్లిపోయింది. వాయు కాలుష్యాన్ని పీఎమ్‌(పర్టిక్యులేట్‌ మ్యాటర్‌)2.5, పీఎమ్‌10లలో కొలుస్తారు. పీల్చే గాలిలో వెంట్రుక మందం కన్నా 25 నుంచి 100 శాతం చిన్నగా ఉండే కాలుష్య రేణువులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిపే సూచీ పీఎమ్‌ 2.5. దీనికన్నా కాస్త పెద్దగా ఉండేవే పీఎమ్‌10 రేణువులు. వాతావరణంలో సాధారణంగా పీఎమ్‌2.5 క్యూబిక్‌ మీటరుకు 60మైక్రోగ్రాములు ఉంటే సమస్య లేనట్లు. అది మూడువందలకు చేరితే ప్రమాద హెచ్చరికలు జారీ అయినట్లే. కానీ దిల్లీలో నవంబర్‌లో పీఎమ్‌2.5 ఏకంగా వెయ్యికి చేరిపోయింది. బర్క్‌లీ ఎర్త్‌ సైన్స్‌ పరిశోధన సంస్థ ప్రకారం ఆ గాలిని పీల్చితే రోజుకి 44 సిగరెట్లు తాగినట్లేనట. అంటే క్యాన్సర్‌ను రెండు చేతులతో ఒంట్లోకి ఆహ్వానించినట్లేగా. అందుకే, వూపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందంటూ వైద్యులు గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారు. ప్రజలు ఛాతీ నొప్పి అంటూ ఆసుపత్రులకు పరుగులు తీశారు. గాల్లో పేరుకుపోయిన దుమ్ము వూపిరితిత్తుల్లోకి చేరి వూపిరాడకుండా చేసింది. దానికితోడు కురుస్తున్న మంచు కాలుష్య రేణువులను ఎటూ కదలనివ్వలేదు. కమ్మేసిన ఆ కాలుష్యపు పొగ రోడ్లమీద ప్రమాదాలకు దారితీస్తే ఇళ్లలో కూర్చున్నవారు సైతం కళ్ల మంటలూ దగ్గూ గొంతు మంట లాంటి అనారోగ్య సమస్యలతో సతమతమయ్యారు. రైళ్లు ఆగిపోయాయి. పాఠశాలలు మూతపడ్డాయి. మామూలుగానే దిల్లీలో కాలుష్యం సాధారణం కన్నా పదిరెట్లు ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఇప్పటికే ఎంతోమంది తల్లులు నెలలు నిండని పిల్లలకు జన్మనిస్తున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. ఆస్థమా లాంటి శ్వాస సంబంధిత వ్యాధులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. స్వచ్ఛతలేని రాజధాని నగర గాలిని పీల్చడం వల్ల అక్కడి పిల్లల్లో సగం మంది (దాదాపు 22లక్షల మంది) వూపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారట. ఇక, గతనెల 40 రెట్లు పెరిగిపోయిన అక్కడి కాలుష్యం ముందుముందు ఇంకెన్ని సమస్యలకు దారితీస్తుందో.

దిల్లీకి పొగపెట్టినవి ఇవే...

దిల్లీలో కాలుష్యానికి ప్రధాన కారణాల్లో ఒకటి అక్కడ రోడ్లమీద అలుపు లేకుండా తిరిగే వాహనాలే. గత పదిహేనేళ్లలో రాజధానిలో వాహనాల సంఖ్య రెట్టింపయింది. వాహనాల తర్వాత హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాల్లో రైతులు తగలబెడుతున్న వరిగడ్డే దిల్లీ కాలుష్యానికి పెద్ద సమస్య. మనదగ్గర వరిపంట నూర్చిన తర్వాత గడ్డిని పశువులకు మేతగా వేస్తాం. కానీ ఆ రాష్ట్రాల్లో పశువులకు ఎక్కువగా గోధుమగడ్డిని వేస్తారు. అందుకే, రెండో పంట గోధుమ వెయ్యడానికి లక్షల టన్నుల గడ్డినీ వరిదుబ్బుల్నీ అక్కడికక్కడే తగలబెట్టేస్తారు. ఇక, శీతాకాలం ప్రారంభంలో ఆ రెండు రాష్ట్రాల నుంచీ గాలి దిల్లీవైపు వీయడంతో పొలాల్లో మంటల నుంచి వచ్చే పొగ దిల్లీ ప్రజల ఆరోగ్యానికి పొగపెడుతోంది. నిజానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గడ్డి తగలబెట్టకూడదని నిబంధనలు విధించాయి. కానీ పొలాల్లోని గడ్డిని మరో చోటికి తరలించడానికి రూ.రెండూ మూడూ వేల వరకూ ఖర్చవుతుందన్న కారణంతో రైతులు మంటపెట్టేస్తున్నారు. రాజధాని నగరంలో జనాభా పెరగడమూ వ్యాపార సంబంధిత భవనాలను పెద్ద స్థాయిలో కట్టడమూ పరిశ్రమలు విడుదల చేసే విషపూరిత వాయువులూ పేరుకుపోతున్న చెత్త... దిల్లీ కాలుష్యానికి ఇతర కారణాలు. మామూలుగా అయితే అక్కడ దీపావళి రోజున పేల్చే టపాసులు కూడా తీవ్రస్థాయిలో కాలుష్యాన్ని పెంచుతున్నాయి. అదృష్టవశాత్తూ ఈ ఏడాది వాటిని నిషేధించారు కాబట్టి సరిపోయింది. లేకపోతే పరిస్థితి ఇంకెలా ఉండేదో.

విచిత్రం ఏంటంటే... దేశ రాజధాని కాబట్టి దిల్లీ గురించి అందరికీ తెలుస్తోంది కానీ మన దేశంలో ఇలాంటి కాలుష్య నగరాలు ఇంకెన్నో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే దిల్లీని మించినవీ ఉన్నాయి.

దేశమంతా కాలుష్యమే

‘రోజూ వ్యాయామం చేస్తాడు. స్వీట్లూ నూనె పదార్థాలు కూడా ఎక్కువ తినడు. మందూ సిగరెట్ల మాటే ఎత్తడు... మరి ఇంత చిన్న వయసులోనే హార్ట్‌ఎటాక్‌ ఎలా వచ్చింది...’ అప్పుడప్పుడూ మనం కూడా ఇలాంటివి వింటూనే ఉంటాం. నిజమే, చెడు అలవాట్లు లేనివారిని సైతం ప్రాణాంతక వ్యాధులు ఎందుకు కబళిస్తున్నాయి... దానికీ కారణం వాయు కాలుష్యమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2017 పరిశోధనల ప్రకారం భూమ్మీద అత్యధిక కాలుష్యం ఉన్న తొలి 20 నగరాల్లో పది భారత్‌లోనే ఉన్నాయి. గాల్లో కాలుష్య కారకాలు ఎక్కువగా ఉన్న మూడువేల నగరాల్లో ఇరాన్‌లోని జబల్‌ మొదటిస్థానంలో ఉండగా మనదేశంలోని గ్వాలియర్‌, అలహాబాద్‌ నగరాలు రెండూ మూడూ స్థానాలకెక్కాయి. తొలి ఇరవైలో పట్నా, రాయ్‌పూర్‌, దిల్లీ, లూధియానా, కాన్పూర్‌, ఖన్నా, ఫిరోజాబాద్‌, లఖ్‌నవూ నగరాలు చోటు సంపాదించాయి. ఈ కాలుష్యమే ఏటా లక్షలమంది భారతీయుల ఉసురుతీస్తోంది. నిజానికి భూమిని వేడెక్కించే గ్రీన్‌ హౌస్‌ వాయువుల విడుదలలో పక్కదేశం చైనా, పెద్దన్న అమెరికాలవే మొదటి రెండు స్థానాలు. ఆ తర్వాత మనం ఉన్నాం. కానీ వాయుకాలుష్యం వల్ల అత్యధికంగా నష్టపోతున్నది మాత్రం మనమే. అందుకే, ఒక్క 2015లోనే కలుషిత గాలి కారణంగా హృద్రోగాలూ వూపిరితిత్తుల క్యాన్సర్‌, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చి మనదేశంలో 25 లక్షల మంది ప్రాణాలొదిలారు. ప్రపంచంలోనే ఇది అత్యధికం. గుండెలనిండా గాలి పీల్చిన ప్రతిసారీ కాస్త కాలుష్యమూ లోపలికి చేరుతోంది మరి!

ఎందుకిలా...

ఈ పాపం ఎవరిది... అంటే నూటికి నూరు శాతం మనకు మనం చేసుకున్నదే. పనికిరానిదేదైనా ముందూ వెనకా ఆలోచించకుండా అగ్నికి ఆహుతి చేసే మన అలవాటే ప్రాణాధారమైన ప్రాణవాయువుని సైతం విషపూరితం చేసేస్తోంది. భారత్‌ కాలుష్య కాసారంగా మారిపోవడానికి ప్రధాన కారణం అదే. ఆకులూ పువ్వులూ పుల్లలూ మిగిలిపోయిన అన్నం కూరలూ పశువుల పేడా కాగితాలూ కవర్లూ ప్లాస్టిక్‌ డబ్బాలూ... అదీ ఇదీ అన్న తేడా లేకుండా అన్నిటినీ కలగలిపి చెత్తలో పడేస్తాం. అవన్నీ వీధి చివరకూ ఆ తర్వాత డంప్‌ యార్డుకీ వెళ్తాయి. అక్కడ వాటిని తగలబెడతారు. అన్నిరకాల చెత్తలూ కలగలిసిన ఆ పొగ అతిసన్నగా ఉండే పీఎమ్‌2.5 రేణువులతో పాటు, కార్బన్‌ మోనాక్సైడ్‌, కార్బన్‌ డయాక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌, సల్ఫర్‌ ఆక్సైడ్‌, క్రోమియం, మెర్క్యురీ...లాంటి విషవాయువులతో గాలిని గరళంగా మార్చేస్తోంది. భారత్‌లో 60శాతం ప్రజలు వంటకోసం వాడే కట్టెలూ పిడకలూ ఇంటి పరిసరాల్లోనూ ఇలాంటి పరిస్థితినే సృష్టిస్తున్నాయి. వందశాతం భారతీయ కుటుంబాలు గ్యాస్‌స్టవ్‌లు ఉపయోగించే అవకాశం వస్తే రాత్రికి రాత్రే మూడోవంతు కాలుష్యాన్ని నివారించొచ్చన్నది ఓ నివేదిక. ఇక, హరియాణా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌... లాంటి రాష్ట్రాల్లో రైతులు వరిపంటల్ని తగలబెడుతూ ఉత్తరాది రాష్ట్రాలను మరింత కాలుష్యపూరితం చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా బొగ్గును ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటైన మనదేశంలో విద్యుదుత్పత్తికి ఎక్కువగా దానిమీదే ఆధారపడటం కూడా వాయు కాలుష్యానికి ప్రధాన సమస్య అయి కూర్చుంది.

* మితిమీరిన వాహనాలూ గాలిని కలుషితం చేసేస్తున్నాయి. ఒకప్పుడు జనం బస్సులూ రైళ్ల సౌకర్యాలు లేవని బాధపడేవారు. ఇప్పుడున్నా ఉపయోగించుకోవడం తగ్గిపోయింది. డబ్బుండాలి కానీ ఇంట్లో నలుగురుంటే నలుగురికీ ప్రత్యేకంగా బైక్‌లూ కార్లూ గేటు ముందు ఉంటున్నాయి. దిల్లీ కాలుష్యాన్నే తీసుకుంటే దాన్లో ఇరవై శాతం వాటా వాహనాలదే. అవి విడుదలచేసే హైడ్రోకార్బన్లూ, కార్బన్‌ మోనాక్సైడ్‌, సల్ఫర్‌డయాక్సైడ్‌... లాంటివి మనిషి ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నాయి.

* పరిశ్రమలూ ఇటుకల బట్టీలూ డీజిల్‌ జనరేటర్లూ రోడ్లమీద ఎగసిపడే దుమ్మూ... ఇలాంటి మరెన్నో వాయు కాలుష్యానికి ఆజ్యం పోస్తున్నాయి.

* నగర జనాభా పెరగడమూ పీల్చే గాలిని తీవ్రంగా కలుషితం చేస్తోంది.

ఆరోగ్యానికి హానికరం

కన్న బిడ్డలకు చిన్న గాయమైనా తట్టుకోలేం. కానీ మనందరం తెలిసీ తెలియక చేస్తున్న పర్యావరణ కాలుష్యం... మనకే కాదు, కడుపులో ఉండగానే మన పిల్లలకూ కీడు చేస్తోంది. ఆధునిక వైద్య సదుపాయాలు లేని రోజుల్లో శిశు మరణాలుండేవంటే మనం ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ప్రపంచం ఇంత అభివృద్ధి చెందుతున్న రోజుల్లోనూ పురిట్లోనే బిడ్డల్ని కోల్పోయి తల్లులు గర్భశోకాన్ని అనుభవిస్తున్నారు. ఒక్క 2015లోనే వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా 90లక్షల గర్భస్థ శిశువుల ప్రాణాలను బలితీసుకుంది. ఇక, ఎన్నో కోట్లమంది గర్భిణులు తక్కువ బరువున్న, నెలలు నిండని పిల్లలకు జన్మనిస్తున్నారు. భారత్‌లో ఇప్పటికే ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లో ఇరవై శాతం పురుడుపోసుకుంటున్నది మన నేల మీదే. బిడ్డ తొమ్మిదినెలలు కడుపులో పెరగకపోవడం వల్ల ఆ ప్రభావం జన్యువుల మీదా పడుతోంది. దీనివల్ల పిల్లల్లో శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక ఎదుగుదలా దెబ్బతింటోంది.

* వాయుకాలుష్యం వూపిరితిత్తుల సామర్థ్యాన్నీ దెబ్బతీస్తుంది. ధూమపానం అలవాటు లేని కొందరు భారతీయుల మీద జరిపిన ఓ పరిశోధన సారాంశం ఏంటంటే... ఐరోపా దేశాల వారితో పోల్చితే భారత్‌లో వూపిరితిత్తుల పనితీరు ముప్ఫైశాతం తక్కువగా ఉందట.

* వాయు కాలుష్యం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులే కాదు, హార్ట్‌ఎటాక్‌, క్యాన్సర్లు, మధుమేహం, తలనొప్పి, దగ్గు, తల తిప్పడంలాంటి రోగాలు ఒంట్లో గూడుకట్టుకోవడం మొదలుపెడతాయి.

* పూర్వం మనవాళ్లు పుస్తకాలే లేకుండా కంఠతా పట్టి చదివేవారు. కానీ ఇప్పుడు ఒకటికి పదిసార్లు పుస్తకాల్లో ఎక్కించినా గంటల తరబడి చదివినా మర్చిపోతున్నాం. ఆల్జీమర్స్‌ రోగులూ పెరుగుతున్నారు. చెడు గాలి మతిమరపుతోపాటు, డిప్రెషన్‌, ఒత్తిడి... లాంటి లైఫ్‌స్టైల్‌ వ్యాధులనూ తెచ్చిపెడుతోంది మరి.

* గాల్లో ఆక్సిజన్‌ స్థాయులు తగ్గిపోవడం వల్ల భావి తరాలవారు శారీరకంగా నిస్సత్తువగా మారడంతోపాటు మానసిక వికలాంగులయ్యే అవకాశం పెరుగుతుందని ఇప్పటికే పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

* దీర్ఘకాలం కలుషిత గాలిని పీల్చేవారి జీవిత కాలంలో కొన్నేళ్లు తగ్గిపోతాయట. దిల్లీ గాల్లో కాలుష్యం ఉండాల్సిన స్థాయిలో ఉంటే అక్కడి ప్రజల సగటు ఆయుఃప్రమాణం ఆరేళ్లు పెరుగుతుందన్నది ఓ పరిశోధన.

మరికొన్ని...

ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం వాయు కాలుష్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏటా రూ. 14.5 లక్షల కోట్ల నష్టాన్ని మిగుల్చుతోంది.
* భూమి వేడెక్కడానికి ప్రధాన కారణం వాయు కాలుష్యమే.

* కలుషిత గాలి కారణంగా ఆమ్ల వర్షాలు పడే అవకాశం కూడా పెరుగుతుంది. దీనివల్ల పంటలకీ పచ్చని చెట్లకే కాదు, వారసత్వ సంపదకూ నష్టమే.

* బయటి కాలుష్యం కన్నా ఇంటి లోపల విడుదలయ్యే కాలుష్యం ఎక్కువ మరణాలకు దారితీస్తోంది.

* ట్రాఫిక్‌లో గంటల తరబడి వేచి చూసేవారికి హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశం ఎక్కువట. ఎందుకంటే మన చుట్టూ ఉండే వాహనాలు విడుదలచేసే కాలుష్యాన్ని చాలా దగ్గరగా పీల్చుతుంటాం.

* నాసా లెక్కల ప్రకారం అణు విద్యుత్తు తయారీ పెరగడం వల్ల 1971 నుంచి 2009 మధ్య 18 లక్షల మరణాలు తగ్గాయి. విద్యుదుత్పత్తికి బొగ్గు వాడకం తగ్గడమే దీనిక్కారణం.

* ప్రపంచవ్యాప్తంగా బొగ్గు వినియోగం, సిమెంటు ఉత్పత్తి వల్ల వస్తున్న కాలుష్యం- మొత్తం కాలుష్య ఉద్గారాల్లో 70శాతం.

* 2016 లాన్సెట్‌ రిపోర్టు ప్రకారం భారత్‌లో ఒక్కో రాష్ట్రంలో వాయు కాలుష్యం కారణంగా వచ్చే రోగాలూ ఇతర అనారోగ్య సమస్యలు 17శాతం పెరిగాయి.

* మనదేశంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు హరియాణా, దిల్లీ, పంజాబ్‌, బిహార్‌, రాజస్థాన్‌, పశ్చిమ్‌బంగా, ఉత్తర ప్రదేశ్‌లు.

* అతితక్కువ వాయు కాలుష్యం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌తోపాటు, జార్ఖండ్‌, మహారాష్ట్ర, ఒడిశాలున్నాయి.

పరిష్కార మార్గాలు

ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అతివేగం ప్రమాదకరం... అంటూ మనకు హాని కలిగించే వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటాం. మరి, అతి ప్రమాదకరమైన వాయు కాలుష్యాన్ని మాత్రం గాలికొదిలేస్తే ఎలా... చేయీ చేయీ కలుపుదాం. చేతనైనంత వరకూ తగ్గిద్దాం!

* వాయు కాలుష్యాన్ని తగ్గించే అతి సులభమైన మార్గం పచ్చదనమే. అందుకోసం అడవుల్ని కాపాడుకోవడమే కాదు, ఇంటి చుట్టూ వీలైనన్ని ఎక్కువ మొక్కలు పెంచాలి. వంద కోట్ల మంది తలో పది మొక్కలూ పెంచినా వెయ్యి కోట్ల చెట్లవుతాయి. మనల్నీ మనదేశాన్నీ పదికాలాల పాటు పచ్చగా బతికేలా చేస్తాయి.

* ఇళ్లనుంచి విడుదలయ్యే కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రధాన ప్రత్యామ్నాయం కట్టెల పొయ్యి వాడకాన్ని తగ్గించడమే. కిటికీలూ తలుపుల నుంచి గాలి ధారాళంగా లోపలికీ బయటికీ వెళ్లేలా చూసుకుంటే ఇంటి కాలుష్యం వల్ల వచ్చే శ్వాస సంబంధిత వ్యాధుల్ని తగ్గించుకోవచ్చు.

* చాలామంది వీధి చివర ఉన్న దుకాణానికెళ్లడానిక్కూడా బైక్‌ తీసేస్తారు. దానికి బదులు సరదాగా నడుచుకుంటూనో సైకిల్‌ మీదో వెళ్తే కాలుష్యాన్ని కొంతలో కొంత తగ్గించడంతో పాటు వ్యాయామమూ అవుతుంది. వీలైనంత వరకూ ఆఫీసులకు దగ్గరగా ఇళ్లు తీసుకుని ఉండడం మేలు. కుదరదనుకుంటే ఇద్దరు ముగ్గురు కలిసి ఒకే కార్లో వెళ్లొచ్చు. బస్సులూ రైళ్లను ఉపయోగించుకుంటే ఇంకా మంచిది.

* ట్రాఫిక్‌ సిగ్నళ్లలో పావుగంట సిగ్నల్‌ పడినా కొంతమందికి మోటారు వాహనాల ఇంజిన్‌ ఆపే అలవాటుండదు. కానీ అలా ఆపడం వల్ల కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు, ఇంధనమూ ఆదా అవుతుంది.

* ప్రభుత్వాలూ ప్రజలూ విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి.

* ఫ్యాన్లూ లైట్లతో పాటు ఇంట్లోని ఎలక్ట్రానిక్‌ వస్తువులతో పని పూర్తవగానే కట్టేయడం మంచి పద్ధతి. ఎంత విద్యుత్తును ఆదా చేస్తే వాతావరణ కాలుష్యం అంత తగ్గుతుంది. ఒక్క విద్యుత్తు వృథా కారణంగానే ప్రపంచవ్యాప్తంగా యాభైమెట్రిక్‌ టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ గాల్లోకి విడుదలవుతోంది. మరోవైపు ఏసీలూ ఫ్రిజ్జులూ కూలర్లూ విడుదల చేసే క్లోరోఫ్లోరో కార్బన్లు ఓజోన్‌ పొరకు చిల్లు పెడుతున్నాయి. విద్యుత్తుని తక్కువ ఉపయోగించుకునే పరికరాలూ యంత్రాలను కొనడం కూడా మంచి ప్రత్యామ్నాయం.

* దీపావళి అంటే దీపాల పండుగ. కానీ రాను రానూ ఆ అర్థం మారిపోతోంది. ఇంటి ముందు పెట్టే దీపాలు తగ్గుతున్నాయి... గాల్లో పేలే టపాసులు పెరుగుతున్నాయి. ఒక్క టపాసుని పేల్చితే వచ్చే పొగ అయిదువందల సిగరెట్లకు సమానం అన్నది పుణె పరిశోధకుల మాట. అందుకే, పండుగల్ని పాత పద్ధతుల్లో సంప్రదాయంగా జరుపుకోవడం మేలు.

చైనా నుంచి ఏం నేర్చుకోవాలి..?

చైనా జనాభా మనకన్నా ఎక్కువ. పైగా పారిశ్రామికాభివృద్ధిలోనూ ఆ దేశం ఎన్నో రెట్లు ముందుంది. అందుకే, అక్కడి నగరాల్లోనూ కాలుష్యం ఎక్కువే. కానీ ప్రభుత్వం చేపడుతున్న దిద్దుబాటు చర్యల వల్ల ఆ దేశం కాలుష్యాన్ని ఎన్నో రెట్లు తగ్గించగలుగుతోంది. 2010 నుంచి 2015 మధ్యలో గాల్లో కాలుష్య రేణువుల శాతం భారత్‌లో 13శాతం పెరిగితే చైనాలో 17 శాతం తగ్గడమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. నిజానికి 2008లో బీజింగ్‌ ఒలింపిక్స్‌ జరిగే సమయానికి ఆ నగరంలోని గాల్లో కాలుష్య రేణువులు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ఆ కారణంగా అంతర్జాతీయంగా విమర్శలూ వెల్లువెత్తాయి. దిల్లీ నగరంలానే బీజింగ్‌లోనూ చలికాలంలో కాలుష్యం తీవ్రత బాగా పెరిగిపోతుంది. దాంతో వేలమంది పసిగుడ్లు నెలలు నిండకముందే పుట్టి ప్రాణాలు కోల్పోయేవారు. అందుకే, కాలుష్యం మీద యుద్ధం ప్రకటించింది ఆ దేశం. విషపూరిత రసాయనాలనూ వాయువుల్నీ వెదజల్లే పరిశ్రమల మీద ఉక్కుపాదం మోపేలా చట్టాలను తిరగరాసింది. అలాంటి పరిశ్రమల మీద పన్నుల్ని విపరీతంగా పెంచేసింది. కాలుష్య కారకాలూ గ్రీన్‌హౌస్‌ వాయువులకూ ప్రధాన కారణమైన బొగ్గు వినియోగాన్ని గణనీయంగా తగ్గించింది. కొన్ని నెలల కిందటే బొగ్గుతో విద్యుత్తుని ఉత్పత్తి చేసే వంద ఫ్యాక్టరీలను మూయించేసింది. ముందు ముందు ప్రధాన నగరాల్లో బొగ్గు ఆధారిత ఫ్యాక్టరీలను పూర్తిగా మూసేయాలన్నది వారి ఆలోచన. పవనశక్తి, సౌరశక్తి ఉత్పత్తిని పెంచింది. వాహనాలకోసం తక్కువ కాలుష్యాన్ని విడుదల చేసే ఇంధనాన్ని ఉత్పత్తి చెయ్యడంతో పాటు, కార్ల కొనుగోళ్లమీదా నిబంధనలు విధించింది. బీజింగ్‌లో ఒక వ్యక్తి ఒక కారుకి మించి కొనడానికి వీల్లేదు. ఒక్క బీజింగ్‌ నగరంలోనే హానికారక పొగను విడుదలచేసే మూడు లక్షల పాత వాహనాలకు చరమగీతం పాడింది ప్రభుత్వం. అమెరికా, ఐరోపా దేశాల్లో మాదిరిగా తక్కువ కార్బన్‌డయాక్సైడ్‌ విడుదల చేసే వాహనాలకే అనుమతివ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ కార్లూ వాహనాలను రోడ్లమీదికి తెచ్చే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. విచిత్రం ఏంటంటే... భారత్‌ 2030 కల్లా ఎలక్ట్రిక్‌ కార్ల వినియోగాన్ని పెంచాలని ఆలోచిస్తోంది. 2016 గ్రీన్‌పీస్‌ సంస్థ నివేదికల ప్రకారం చైనాలోని 900 నగరాల్లో కలిపి 1500 గాలి స్వచ్ఛత మానిటరింగ్‌ స్టేషన్లు ఉంటే భారత్‌లో కేవలం 23 నగరాల్లో 39 స్టేషన్లు ఉన్నాయి.

భారత్‌ పరిస్థితి...

ఇప్పటికీ 24 గంటల విద్యుత్తుని అన్ని పట్టణాలూ పల్లెలకు సరఫరా చెయ్యలేకపోతున్నాయి మన ప్రభుత్వాలు. కోట్లమంది యువతకు ఉద్యోగాలను కల్పించడమూ ఇక్కడ సమస్యే. ఈ కారణాల వల్ల బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలను భారత్‌ మూసెయ్యడం అసాధ్యం. కానీ కాలుష్య నివారణ చట్టాలను కఠినంగా అమలు చేసి, వాతావరణంలోకి రసాయనాలను విడుదలచేసే పరిశ్రమల పనిపట్టొచ్చు. కరెంటుతో నడిచే మెట్రో రైళ్లు కాలుష్యాన్ని బాగా తగ్గిస్తాయి. ప్రభుత్వాలు ఆ వైపు మరింతగా దృష్టి సారించొచ్చు. మనిషికి ఒక్క కారే అన్న నిబంధన విధించి డబ్బున్న వాళ్లు కార్లమీద కార్లను కొనకుండా ఆపొచ్చు. నగరాల్లో ఎక్కువ కాలుష్యాన్ని విడుదల చేసే వాహనాలు తిరక్కుండా కట్టడి చెయ్యొచ్చు. సౌర విద్యుదుత్పత్తిని పెంచొచ్చు. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రకృతి ఇచ్చిన అతిగొప్ప వరమిది. స్వీడన్‌ తమ అవసరాలకు కావల్సిన కరెంటును చెత్త నుంచే తయారుచేసుకుంటోంది. తమ దేశంలో ఇళ్లనుంచి పోగయ్యే ఒక్కశాతం చెత్త కూడా వృథాగా పోదు అన్నది అక్కడి ప్రభుత్వం మాట. ఆశ్చర్యం ఏంటంటే... స్థానికంగా నివాసప్రాంతాలన్నిటికీ మూడొందల మీటర్ల దూరంలో రీసైక్లింగ్‌ సెంటర్లు ఉంటాయి. ప్రజలు ప్లాస్టిక్‌, కాగితాలు, ఆహార వ్యర్థాలను ఇళ్లలోనే వేరుచేసి ఆ సెంటర్లలో ఇస్తారు. మన ప్రభుత్వాలూ చెత్తను తగలబెట్టకుండా రీసైకిల్‌ చేసే వైపు మొగ్గుచూపితే బాగుంటుంది. రాజకీయాలను పక్కనపెట్టి ప్రభుత్వాలు కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడకపోతే ముందు ముందు రాజకీయాలు చేసేందుకు మనుషులే మిగలకుండా పోయే ప్రమాదం ఉంది.

అనగనగా... ఒకప్పటి మనిషి. ఎండ తగలకుండా వానకు తడవకుండా చలికి వణక్కుండా ఉండేందుకు ఓ గూడూ తినడానికి సరిపడా పంట పండించుకోవడానికి కాస్తంత నేలా ఉంటే చాలనుకునేవాడు. అందుకే, ఏ మొక్క వేసినా విరగపండేంత సారవంతంగా ఉండేది నేల. అడవులు విస్తారంగా ఉండి వర్షాలు కురిపించేవి. నదులు జీవ నదులై పారేవి. గాలి ప్రాణవాయువుని పుష్కలంగా నింపుకుని వీచేది. అన్నీ కలిసి ఔషధంలా మనిషి నూరేళ్లూ హాయిగా బతికేందుకు తోడుగా ఉండేవి. కానీ రానురానూ మనిషిలో ఆశ పెరిగింది. తరతరాలూ తిన్నా తరగనంత సంపాదించాలన్నంత ఆరాటంలో పడిపోయాడు. చివరకు బంగారు కోడిగుడ్డు కథలోలా దురాశాపరుడిగా మారి ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నాడు. అవును, కోడి రోజుకు ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది. అది నియమం. ప్రకృతిలోని నేలా నీరూ గాలీ అడవులూ అన్నిటికీ ఆ నియమమే వర్తిస్తుంది. కాదని అవసరానికి మించి ముందుకెళ్తే అనర్థమే. ఇప్పటికైనా కళ్లు తెరుద్దాం. మన పిల్లలకు ఆస్తులూ అంతస్తులకన్నా పీల్చుకునేందుకు స్వచ్ఛమైన ప్రాణవాయువును ఇవ్వడం ముఖ్యమని గుర్తిద్దాం.

- మధులత యార్లగడ్డ

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.