close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వెదురిల్లు.. పొదరిల్లు!

దేనికైనా ఎంత ఖర్చు పెట్టామన్నది కాదు... ఎంత విభిన్నంగా ఉందన్నదే పాయింట్‌. ఫేస్‌బుక్‌లోనూ యూట్యూబుల్లోనే కాదు, నిజజీవితంలోనూ వాటికే బోలెడన్ని లైకులూ వ్యూస్‌. అందుకే, చిత్తూరులో ఓ వ్యక్తి  నిర్మించుకున్న ఈ వెదురింటికి ఎందరో అభిమానులైపోయారు. భిన్నంగా అందంగా ఉండటంతోపాటు దీన్లో అన్ని  సౌకర్యాలూ ఉన్నాయి మరి! 
ఈ రోజుల్లో ఇళ్లంటే కాంక్రీటుతో నిర్మించిన డాబాలే అన్నట్లైపోయింది పరిస్థితి. ఖర్చు ఎక్కువైనా అప్పులవుతున్నా మధ్యతరగతి, పేద కుటుంబాలు కూడా ఆవైపే అడుగులేస్తున్నాయి. చిత్తూరు జిల్లాలోని మదనపల్లెకు చెందిన ఉదయ్‌మోహన్‌కి మాత్రం మూడు గదుల ఇంటికి లక్షలకు లక్షలు ఖర్చుపెట్టడం నచ్చలేదు. ఆ డబ్బుని మిగిల్చితే తాను నిర్వహించే ‘వెలుగు’ మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాలకోసం వినియోగించొచ్చు అనుకున్నాడు. అదే సమయంలో తక్కువ ఖర్చుతో నిర్మించినా ఇల్లు చూడచక్కగా వినూత్నంగా ఉండాలని కోరుకున్నాడు. ఆ ఆలోచనకు ప్రతిరూపమే ఈ వెదురిల్లు. 

 

 

అన్నింటా వెదురే... 
పైకి చూస్తే ఇదో పూరిల్లు. కానీ లోపలికి అడుగుపెడితే వెదురుతో అల్లుకున్న చూడచక్కని పొదరిల్లు కళ్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. ఎటు చూసినా నలభై అడుగుల వ్యాసార్ధంతో ఉండే ఈ చుట్టింట్లో పెద్ద హాలూ వంటగదీ పడక గదీ అందులోనే బాత్‌రూమ్‌ కూడా ఉంటాయి. అంతేనా పైన మరో అంతస్తునీ అక్కడకు వెళ్లేందుకు మెట్లనూ కూడా ఏర్పాటుచేశారు. ఇక, ఇక్కడ గోడలతో పాటు ఇంట్లో ఉన్న సోఫాలు, కుర్చీలు, టీవీ స్టాండు, పైకి ఎక్కడానికి మెట్లు... అన్నీ వెదురుతో తయారు చేసినవే. ఇంటి పైకప్పు నిర్మాణానికీ పూర్తిగా వెదురు కొయ్యలనే వాడారు. పైకప్పు బయటివైపున స్థానికంగా లభించే బోదను పరిచారు. ఇలా... అంతటా వెదురు కర్రలను వరుసగా పేర్చి రూపొందించడం వల్ల ఈ ఇల్లూ ఇంట్లోని ఫర్నిచర్‌ చూడ్డానికి అటు వినూత్నంగానూ ఇటు అందంగా కూడా ఉన్నాయి. ‘మామూలుగా ఆధునిక సదుపాయాలతో మూడుగదుల ఇంటిని నిర్మించుకోవాలంటే కనీసం రూ.7 నుంచి రూ.10 లక్షల వరకూ ఖర్చవుతుంది. సిమెంటూ ఇటుకలూ ఇనుప కడ్డీలూ టైల్సూ గోడలకు రంగులూ... అన్నీ సిద్ధం చేసుకున్నా ఇప్పుడు ఇసుక దొరకడం కూడా కష్టంగా మారింది. కానీ సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఇంట్లో ఉండే అన్ని సదుపాయాలతో నిర్మించిన మా వెదురు ఇంటికి అయిన ఖర్చు లక్షాఇరవైవేల రూపాయలే. వెదురుకర్రలు స్థానికంగా లభించడంతో దానికి ఖర్చేం కాలేదు. ఇల్లు కట్టి మూడేళ్లు అయినా చెక్కు చెదరలేదు.

 

వేసవిలో బయటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటినా ఈ ఇంట్లో మాత్రం ఎంతో చల్లగా ఉంటోంది. పైగా చుట్టింటికి వాస్తు కూడా వర్తించదు. నిప్పు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు, దీనికి మించిన నిర్మాణం మరోటి లేదు’ అంటారు ఉదయ్‌ మోహన్‌. ఇంత ప్రత్యేకంగా ఉంది కాబట్టే  కలెక్టర్లూ ఐపీఎస్‌ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులూ దగ్గర్లోని రిషివ్యాలీ పాఠశాల విద్యార్థులు కూడా ఈ పొదరింటిని సందర్శించేందుకు వస్తున్నారు.

- కరిముల్లా షేక్‌, ఈనాడు డిజిటల్‌, చిత్తూరు 
ఫొటోలు: ఎస్‌. సుబ్రమణ్యం

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.