close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చలికాలం వచ్చేసింది...

చలికాలం వచ్చేసింది... 

శీతవేళ రానీయకు శిశిరానికి చోటీయకు
ఎదలోపల పూలకారు ఏనాటికి పోనీయకు...
అంటారు ఓ గేయంలో భావకవి దేవులపల్లి.
రుతువులు మనం రమ్మంటే వచ్చేవీ పొమ్మంటే పోయేవీ కావు.
వాటి కాలమానం ప్రకారం అవి వచ్చేస్తాయి.
అలాగే చలికాలమూ వచ్చేసింది.
మనం చేయగలిగిందల్లా వేడి వేడి కాఫీ టీలతో స్వాగతం చెప్పేయడమే.
వెచ్చగా దుప్పటి కప్పుకుని మూడంకెను ఎంజాయ్‌ చేయడమే.
కాకపోతే కవి చెప్పినట్లు శీతవేళని గదిలోకే కానీ మదిలోనికి రానీయకూడదు.
అప్పుడే ఆరోగ్యమూ చలికాలానికే ప్రత్యేకమైన ఆనందాలూ సొంతమవుతాయి.

‘చలి తిరిగింది...’ పొద్దున్నే బాల్కనీ లోకి వెళ్లి రివ్వున దూసుకొచ్చిన చలిగాలికి గబుక్కున తలుపు వేసేస్తూ అంది అమ్మ.

‘అవును... రాత్రి ఆఫీసునుంచి వస్తుంటే చాలా చల్లగా అన్పించింది. ఇక రోజూ స్వెటర్‌ తీసుకెళ్లాలనుకున్నా...’ అన్నారు నాన్న.

‘పొద్దున డాబా మీదకెళ్లాను. చుట్టూ పొగమంచు. పక్క బిల్డింగ్‌ కూడా సరిగా కన్పించలేదు తెలుసా...’ ఆశ్చర్యంగా చెప్పింది చెల్లి.

‘ఈ మాత్రం చలికే అలా అంటారేంటి? అక్కడ అమెరికాలో వర్షం కురిసినట్టుగా కుప్పలుగా మంచు కురుస్తుంది. పారలతో ఎత్తి పోస్తే కానీ గడప దాటి రోడ్డుమీదికి వెళ్లలేం...’ అన్నాడు ఐదేళ్లుగా అమెరికాలో ఉన్న అబ్బాయి.

నిజమే. భౌగోళిక పరిస్థితుల వల్ల వారి చలికాలం అలా... మన చలికాలం ఇలా ఉంటాయి.

కార్తికమాసమూ చలికాలమూ కూడబలుక్కుని వస్తాయి మనకి. దీపావళి అలా వెళ్లిందో లేదో పొద్దున్నే ఓ గంట పొగమంచు పలకరిస్తుంది. తలుపు తెరిస్తే ఎక్కడ ఇంట్లోకి వచ్చేస్తుందో అన్నట్లుగా దట్టంగా ముసురుకుంటుంది. సూర్యుడి లేలేత కిరణాలు కాస్త వెచ్చబడేసరికి మంచు మబ్బులు పరార్‌. కాసేపటికే మళ్లీ పైనుంచి ఎండ చురుక్కుమంటుంది. మధ్యాహ్నం మండుటెండ మామూలే. మళ్లీ రాత్రి ఏడయేసరికి నేనున్నానంటూ చలిగాలి రివ్వున వీస్తుంది. ఇక చలికాలం కన్నా ముందు వూళ్లల్లో ప్రత్యక్షమయ్యేది వూలు దుస్తులు అమ్మే కశ్మీరీలూ నేపాలీలూ. అచ్చంగా స్వెటర్లూ, మఫ్లర్లూ, రగ్గులూ అమ్మే రంగురంగుల దుకాణాలను వరసగా చూడగానే మనకు చలికాలం ఫీల్‌ వచ్చేస్తుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే వాతావరణం కన్పిస్తోంది. అందుకే చల్లని ఈ చలికాలం మన నిత్యజీవితంపై చూపే ప్రభావం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూద్దాం.

అందంగా మొదలై...
అటు ఉత్తరాదికీ ఇటు దక్షిణాదికీ మధ్యన వారధిలా ఉంటాయి తెలుగు రాష్ట్రాలు. అందుకే ఉత్తరాది నుంచి వీచే శీతల పవనాల ప్రభావం వల్ల మనకు ఉన్నంత చలి ఇతర దక్షిణాది రాష్ట్రాలకు ఉండదు. కాకపోతే ఉత్తరాదిన ఉన్నంత తీవ్రత ఇక్కడ ఉండదు కాబట్టి మన చలికాలాలు అందంగానూ ఆహ్లాదంగానూ ఉంటాయి. కశ్మీరీల్లా నిప్పులకుంపటిని నిత్యం వెంటపెట్టుకుని తిరిగే అవసరం మనకు లేదు. కొండల మీద మంచు చరియలు విరిగి పడతాయన్న భయమూ లేదు. విశాఖ జిల్లాలోని లంబసింగి లాంటి ఒకటి రెండు చోట్ల తప్ప 8 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు మనకు అరుదు. అవి కూడా వాతావరణ శాఖ పేర్కొనే శీతలపవనాలు(కోల్డ్‌వేవ్‌) వీచిన కొద్ది రోజులు మాత్రమే. సాధారణంగా 9-18 డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు దోబూచులాడుతున్నప్పుడు చలిగాలులు మంచు తెరలు కౌగలించుకున్నట్లుగా శరీరాన్ని మృదువుగా తాకుతాయి. అంతలోనే గజగజ వణికిస్తాయి. పగలూ రాత్రి ఉష్ణోగ్రతల మధ్య తేడా ఎక్కువగా ఉండడం వల్ల మనకు చలి అనుభూతి ఎక్కువ. అందుకే చల్లచల్లగా కూల్‌ కూల్‌గా అన్నట్లు కనీస ఉష్ణోగ్రత 18 డిగ్రీలకు పడితే చాలు స్వెటర్లు బయటకు వచ్చేస్తాయి. మరో రెండు మూడు డిగ్రీలు తగ్గితే గజగజ వణకడమే. మెల్లగా అది పది డిగ్రీలకు కానీ పడిందంటే చలి శిఖర స్థాయికి వెళ్లిపోయినట్లే లెక్క. వీధుల్లో ఎక్కడ చూసినా చలిమంటలు కన్పిస్తాయి. ఇళ్లల్లోనూ రూమ్‌ హీటర్ల వాడకం పెరుగుతుంది. నిజానికి వృద్ధులకూ పిల్లలకూ తప్ప చలికాలం ఇతరులకు మరీ అంత ఇబ్బంది కలిగించదు. వాన కురిసినట్లుగా ఇక్కడ మంచు కురవదు కాబట్టి నిత్యజీవితానికి పెద్దగా ఆటంకం లేకుండానే మురిపిస్తుంది.

మనసుకు శీతవేళ
ఎండలూ వానలూ భౌతికంగా ఇబ్బంది కలిగిస్తాయి. కానీ చలికాలం అలా కాదు... ఇది పొగమంచులా మనసులోకీ దూరేస్తుంది. మనసులో ఏమూలో ఒకలాంటి దిగులు గూడుకట్టుకుని నెమ్మదిగా మనసంతా ఆక్రమించేసుకోవాలని ప్రయత్నిస్తూ నీరసపరిచేస్తుంటుంది. పాశ్చాత్యులు ‘వింటర్‌ బ్లూస్‌’గా పిలిచే ఈ మూడ్‌ని శాస్త్ర పరిభాషలో ‘సీజనల్‌ ఎఫెక్టివ్‌ డిజార్డర్‌- శాడ్‌’ అంటారు.

ఈ రుగ్మత కొందరిని చలికాలంలో ఎక్కువగా వేధిస్తుంది. కుంగుబాటుకు లోను చేస్తుంది. దాంతో వారు చీకటి గదిలో ఒంటరిగా ఉండాలనుకుంటారు. ఆకలీ నిద్రా ఎక్కువ. దాంతో బరువూ పెరుగుతారు. రోజువారీ పనుల పట్ల అనాసక్తీ మందకొడితనం వీరిని వేధిస్తాయి. వ్యక్తుల్ని బట్టి లక్షణాల్లో కొద్దిగా తేడా ఉన్నా ఆలోచనలు స్థిరంగా లేక స్తబ్దుగా ఉంటున్నారంటే వారు ‘శాడ్‌’ బాధితులే. చలికాలంలోనే వారీ సమస్య ఎందుకు ఎదుర్కొంటారంటే... మన శరీరంలోని జీవగడియారం సక్రమంగా పనిచేయడానికి సహజమైన వెలుతురూ ఒక కారణం. వెలుతురులో ఉన్నప్పుడు కంటిలోని రెటీనా గ్రహించే కాంతిని లెక్కించడమూ ఈ జీవగడియారం విధుల్లో ఒకటి. నాడీవ్యవస్థ ద్వారా ఈ కాంతి సమాచారం పీనియల్‌ గ్రంథికి చేరుతుంది. అక్కడ మెలటోనిన్‌ హార్మోన్‌ ఎక్కువగా ఉత్పత్తై నిద్రమత్తునీ నిరాసక్తతనీ కలిగిస్తుంది. అదే శాడ్‌కి కారణం. కన్ను ఎక్కువ కాంతిని గ్రహిస్తే మెలటోనిన్‌ తక్కువ ఉత్పత్తవుతుంది. మరో పక్క సహజమైన వెలుతురు తగినంత లభించనప్పుడు మనసును ఉత్తేజంగా ఉంచే సెరెటోనిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గుతుంది. అందుకే ‘శాడ్‌’ సమస్యకు ‘లైట్‌ థెరపీ’ అంటే కాంతి చికిత్సే పరిష్కారమంటున్నారు నిపుణులు. సహజమైన వెలుతురులో ఎక్కువ సమయం గడిపితే కుంగుబాటును వదిలించుకోవచ్చు. బాధితులను ఒంటరిగా వదలకుండా ఇతరులతో కలిసిమెలిసి పనులు చేసుకునేలా కుటుంబసభ్యులు ప్రోత్సహిస్తే ‘శాడ్‌’ ప్రభావం నుంచి త్వరగానే బయటపడతారని వైద్యులు చెబుతున్నారు. జీవిత భాగస్వామితో కలిసి కాపురం చేస్తున్నవారిలో ఈ తరహా కుంగుబాటు అరుదు. సాధారణంగా అవివాహిత, విడిపోయిన, భాగస్వామికి దూరమైన ఒంటరి వ్యక్తుల్లో ఈ సమస్య ఎక్కువగా కన్పిస్తుందంటున్నాయి అధ్యయనాలు. సంగీతం, నృత్యం లాంటి నచ్చిన వ్యాపకాన్ని ఎంచుకుని సాధన చేయడమూ నిత్యం వ్యాయామం చేయడమూ ఉత్సాహాన్ని పెంచి వింటర్‌ బ్లూస్‌ని దూరంగా ఉంచుతుందని నిపుణుల సలహా. ఎంతటి చలికాలమైనా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎదలోపలి పూలకారుని ఎప్పటికీ కాపాడుకోవచ్చు!

సినిమాల్లోనూ చలి గిలిగిలి!
చలిగా ఉన్నప్పుడు ఎక్కువ మంది చూడడానికి ఇష్టపడేది రొమాంటిక్‌ సినిమాలనేనట. విదేశాల్లో అయితే అచ్చంగా చలికాలం నేపథ్యంతో ‘ద థింగ్‌’, ‘వైటవుటü’, ‘ద డే ఆఫ్టర్‌ టుమారో’ ‘ద కాలనీ’, ‘అలైవ్‌’, ‘ఫ్రోజెన్‌’ లాంటి చాలా సినిమాలే వచ్చాయి. నిజజీవిత ఘటన ఆధారంగా డిస్నీ సంస్థ తీసిన ‘ఫ్రోజెన్‌’ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన టాప్‌ టెన్‌ సినిమాల్లో ఒకటైంది. నాయికా నాయకుల మధ్య రొమాంటిక్‌ సన్నివేశాలు కల్పించాలనుకున్నప్పుడు మన దర్శక నిర్మాతలు కూడా చలినే ఓ సాకుగా ఎంచుకుంటున్నారు. తెరపై చూస్తున్నా గిలిగింతలు పెట్టే చలి గురించి బోలెడు పాటలు రాసేసి ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు సినీ కవులు. ‘ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి... తీవెలపై వూగుతూ... పూవులపై తూగుతూ... ప్రకృతినెల్ల హాయిగా... తీయగా... మాయగా...’ అంటూ సాగే పాట శ్రోతల్నీ పరవశంలో ముంచుతుంది.

‘చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది...’

‘చలిగా ఉందన్నాడే... దుప్పట్లో దూరాడే...’

‘చలి చలిగా అల్లింది... గిలిగిలిగా గిల్లింది...’

‘చలిగాలి చూద్దూ... తెగ తుంటరీ...’

... లాంటి యువతరం పాటలన్నీ వినేవారినీ రొమాంటిక్‌ మూడ్‌లోకి తీసుకెళ్లిపోతాయి.

అలాగని అచ్చంగా రొమాంటిక్‌ ఫీల్‌కోసమే చలికాలాన్ని వాడలేదు వారు. ‘తెలిమంచు కరిగిందీ తలుపు తీయనా ప్రభూ’ అన్న పాటలో భక్తి రసం పొంగిపొరలుతుంది.

‘మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో జీవించలేని పనికిరాని చదువులెందుకు...’ అంటారు ‘ఆత్మబంధువు’ సినిమాలోని ఓ పాటలో. ఇక్కడ మంచుని పారదర్శకతకీ మంచితనానికీ నిదర్శనంగా చూపుతారు కవి.

మనకూ ఉంది కశ్మీరం!
చలికాలం ప్రకృతి సోయగాలను చూడాలంటే ఒకప్పుడు సిమ్లానో కశ్మీరమో వెళ్లేవారు. ఆంధ్రాకశ్మీరం లంబసింగి ఉండగా అంత దూరం వెళ్లక్కరలేదిప్పుడు. ఆంధ్రప్రదేశ్‌లో అరకు లోయ, తెలంగాణలో ఆదిలాబాద్‌ పరిసర ప్రాంతాలు అద్భుతమైన శీతాకాలం అందాలకు చిరునామాలు. అరకులోని లంబసింగి చుట్టుపక్కల గ్రామాలు ఇప్పటికే పర్యటక ప్రాంతాలయ్యాయి. రాష్ట్రంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఈ ప్రాంతం విశాఖపట్నానికి 100కి.మీ. దూరంలో ఉంది. నవంబరు తొలి వారంలోనే అక్కడ ఉష్ణోగ్రత 9 డిగ్రీలకు పడిపోయింది. డిసెంబరు మొదటివారానికల్లా అది ఒకటి రెండు డిగ్రీలకు తగ్గుతుందని అంచనా. ఓ దశలో సున్నా డిగ్రీలకూ చేరి వణికిస్తుంది. దట్టంగా కమ్ముకుంటున్న పొగమంచు ఉదయం పది గంటలైనా తగ్గదు. పట్టణ రణగొణధ్వనులకు దూరంగా ప్రకృతి ఒడిలో పచ్చని కొండల మధ్య ప్రశాంత వాతావరణం లంబసింగి ప్రత్యేకత. దక్షిణ భారతంలో సముద్ర మట్టానికి దాదాపు వెయ్యి మీటర్ల ఎత్తున, ఎక్కువగా మంచుకురిసే ఏకైక ప్రాంతం ఇదే. దక్షిణాదిన ఇంకా హిల్‌ స్టేషన్లు ఉన్నాయి కానీ అక్కడ ఉష్ణోగ్రతలు పది డిగ్రీలకు తగ్గవు. దాంతో పలు రాష్ట్రాలనుంచి ట్రెక్కింగ్‌, క్యాంపింగ్‌ చేయడానికి ఔత్సాహికులు ఇక్కడికి వస్తుంటారు. జంటలు హాయిగా చేతిలో చేయి వేసి నడుస్తూ ‘మంచు కురిసే వేళలో...’ అంటూ యుగళగీతాలు పాడుకోవచ్చు. నాణ్యమైన ఉత్పత్తులకు పేరొందిన ఇక్కడి కాఫీ, మిరియాల తోటలు ఎగుమతులకే కాదు అందమైన ప్రకృతి దృశ్యాలకూ ఆనవాళ్లు. ఇక్కడి వాతావరణం ఆపిల్‌ పంట పండించడానికి కూడా అనువుగా ఉంటుందని ఈ మధ్యే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాకేంద్రం ప్రకటించింది. అంటే భవిష్యత్తులో ఆపిల్‌ తోటలు కూడా చూడవచ్చన్నమాట. ప్రస్తుతానికి అక్కడ మకాం చేయడానికి అతిథి గృహాల్లాంటివి లేవు కాబట్టి పర్యటకులు విశాఖపట్నం నుంచి వెళ్లి చూసి వస్తున్నారు.

తెలంగాణలోనూ పచ్చని కొండలూ జలపాతాలతో వర్షాకాలంలో కనువిందు చేసిన వికారాబాద్‌లోని అనంతగిరి, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ పరిసర కొండ ప్రాంతాలు చలికాలంలో మంచు కురుస్తూ ఆహ్లాదంగా ఉంటాయి. ఇక్కడి కొండల్లో ట్రెక్కింగ్‌ ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతోంది.

జాగ్రత... జాగ్రత..!
పెదవులూ చర్మమూ పొడిబారడం... పాదాలు పగలడం... గోళ్లు పెళుసుబారి చిట్లడం... ఇవన్నీ చలికాలం వచ్చేసిందని శరీరం చేసే సూచనలు. చర్మం నల్లబడుతుంది. ముఖం కాంతిహీనంగా మారుతుంది. గాలిలో తేమ తగ్గడం వల్లే ఈ మార్పులన్నీ. ఇంట్లో నానమ్మో అమ్మమ్మో ఉంటే ఆ మార్పుల్ని త్వరగా పసిగడతారు. ఒంటికి కొబ్బరినూనె రాసుకోమనీ పెదవులకు నెయ్యి రాసుకోమనీ సున్నిపిండితో స్నానం చేయమనీ చెప్తుంటారు. అమ్మాయిలు మాత్రం గ్లిజరిన్‌ సబ్బులంటారు. లిప్‌బామ్‌లూ మాయిశ్చరైజర్లూ వేజలిన్‌ బాటిళ్లూ ఖాళీ చేసేస్తుంటారు. మన చలికి చాలావరకూ ఇంట్లో తయారుచేసుకునే చిట్కాలు సరిపోతాయి. ఏవి వాడినా సమస్యకు సరైన పరిష్కారం లభించడం ముఖ్యం. చిన్న సమస్యలేనని నిర్లక్ష్యం చేస్తే నొప్పి పెట్టి పెద్ద సమస్యలకు దారితీస్తాయి. వయసుని బట్టీ చర్మం తీరును బట్టీ కాస్మెటిక్స్‌ ఎంపిక ఉండాలి. సాధారణ చర్మం కాకుండా ఏదైనా సమస్య ఉందనుకున్నవాళ్లు నిపుణుల సలహా తీసుకోవచ్చు. ఉదయమే కొబ్బరి నూనె మర్దనా చేసుకుని సున్నిపిండితో స్నానం చేస్తే చర్మం పొడిబారదు. చాలా మంది చేసే పొరపాటు చలిగా ఉందని వేడి వేడి నీళ్లతో స్నానం చేయడం. అది చర్మానికి మరింత హాని చేస్తుందంటారు నిపుణలు. ఏ కాలమైనా గోరు వెచ్చని నీటితో స్నానమే ఆరోగ్యానికి మంచిది. పండ్లతో వేసే రకరకాల ఫేస్‌ప్యాకులు ఈ కాలంలో ముఖచర్మానికి కాంతినిస్తాయి. ఇక, నవ్వు ముఖ కండరాలకు మంచి వ్యాయామం. కళ్లకిందా పెదాల పక్కనా ఏర్పడిన గీతలు మాయమై ముఖం మెరుస్తుంది. దుస్తులతో రకరకాల ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్స్‌ స్వయంగా రూపొందించుకోవడానికి అనువైన సీజన్‌ కూడా ఇదే. పొడవాటి కోట్లూ, హుడీలూ, స్కార్ఫులూ, పోలోనెక్‌ టాప్సూ, ష్రగ్స్‌ లాంటి అందుబాటులో ఉన్న దుస్తులతో, లేయరింగ్‌ తరహా డ్రెసింగ్‌తో కాలేజీ అమ్మాయిలూ అబ్బాయిలూ కూడా ఉత్సాహంగా మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ ప్రయోగాలు చేయవచ్చు. తమదైన స్టైల్‌ స్టేట్‌మెంట్‌ తయారుచేసుకోవచ్చు. ఎవరో చేశారనీ చెప్పారనీ కాకుండా శరీరానికి సౌకర్యంగా ఉండే దుస్తుల్నే ధరించాలి.

వేడి సూపు ఎంతో మేలు!
చలిగా ఉందని వేడి వేడిగా గంటకో టీ తాగేస్తూ రోడ్డు పక్కన పకోడీలూ మిర్చీ బజ్జీలూ లాగించేస్తే లేని సమస్యలు కొనితెచ్చుకున్నట్లే. చలికాలం తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. టీలూ కాఫీలూ తగ్గించుకుని వాటి బదులు కూరగాయల సూపూ, చికెన్‌ సూపూ తాగవచ్చు. టీ తాగేవారు పాలతో చేసే టీ బదులు తులసీ పుదీనా లాంటి ఆకులు వాడి తయారుచేసే హెర్బల్‌ టీలు తాగవచ్చు. అందులో చిన్న అల్లం ముక్క వేసుకుంటే మరీ మంచిది. ఉష్ణోగ్రతతో పాటే మన దేహంలో శక్తి నిల్వలు కూడా తగ్గిపోతాయి. కాబట్టి వాటిని పూడ్చుకునే ప్రయత్నం చేయాలి. ఎండిన పండ్లూ, బాదం పిస్తా అక్రోట్‌ లాంటి గింజల్లోని పప్పులూ రోజూ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. అల్లం వెల్లుల్లీ దాల్చిన చెక్కా మెంతులూ మిరియాలూ ఇంగువా జీలకర్రా లాంటివి రక్తప్రసారాన్ని మెరుగుపరుస్తాయి. జలుబూ దగ్గూ రాకుండా చూస్తాయి. ఈ కాలంలో లభించే పండ్లను తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలం జీర్ణశక్తి మందగిస్తుంది. మలబద్ధకమూ కొందరిని ఇబ్బంది పెడుతుంది. రాత్రి భోజనంలో చారు తప్పనిసరి చేసుకోవాలి. ఆహారంలో తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. వేడి పదార్థాలనే తినాలి. వేడి అన్నంలో నెయ్యికి తోడు నల్లకారం, కరివేపాకు కారం, వెల్లుల్లి కారం లాంటివి వేసి పెడితే పిల్లలకు నోటికీ కడుపుకీ కూడా బాగుంటుంది. ఆకలి పుడుతుంది. గోధుమ, మొక్కజొన్న లాంటివాటితో జావలు కూడా ఈ కాలానికి మంచి పోషకాహారం. తరచూ ద్రవాహారం తీసుకుంటూ ఉంటే చర్మం పొడిబారడం తగ్గుతుంది. మంచి ఆహారమూ చాలినంత విశ్రాంతీ... చలికాలాన్ని ఆనందించడానికి ఇంతకన్నా ఏంకావాలి? అందుకేనేమో పెద్దలంటారు... అన్నీ అమరితే చలికాలం అంత హాయి మరొకటుండదని.

* * * 

త్వరగా చీకటిపడడం వల్లనేమో, చలికాలంలో బయట తిరిగేదానికన్నా ఇంట్లో గడిపే సమయం అధికం. వూసుపోని మనసుకు వూహలెక్కువ కదా. ‘గుర్తుకొస్తున్నాయీ’ అనుకుంటూ గతంలోకి తొంగిచూస్తే... ఒకటా రెండా, ఎన్నెన్ని జ్ఞాపలకాలనీ!

చిన్నప్పుడు సంక్రాంతికి అమ్మమ్మవాళ్ల వూరెళ్లి చలిమంటలో చేయి కాల్చుకోవడం...

నాన్న ఇద్దరికీ ఒకే రంగు స్వెటర్‌ కొన్నప్పుడు చేసిన గొడవ... ఏది ఎవరిదో తెలియడానికి పేరులోని పొడి అక్షరాలను అమ్మ డిజైనులా కుట్టడం...

పదో తరగతిలో తెలుగు మాస్టారి ‘శీతాకాలం’ పాఠానికి అబ్బాయిల గుసగుసలూ, అమ్మాయిల రుసరుసలూ వెరసి హెడ్‌మాస్టారి పంచాయతీ...

ఇంటర్‌లో తొలిసారి కాలేజీ ఎగ్గొట్టి సినిమాకెళ్లి స్వెటర్‌ కారణంగా అన్నయ్యకు దొరికిపోయిన వైనం...

డిగ్రీలో ఫుల్‌ హ్యాండ్స్‌ షర్టుల మీద స్లీవ్‌లెస్‌ స్వెటర్‌తో స్టైల్‌ స్టేట్‌మెంటూ...

‘ఏయ్‌... బ్లూ స్వెటర్‌!’ పీజీలో ప్రియురాలి తొలి పిలుపు...

బీరువా సర్దుతూ అమ్మ, హనీమూన్‌ సమయంలో నాన్న కొనిచ్చిన శాలువాను అట్టడుగు అరలో నుంచి పైకిలాగి చూపిస్తే దాన్ని వాళ్ళిద్దరి మీదా కప్పి పాటలు పాడుతూ చేసిన అల్లరీ...

మనసు పుస్తకం మీద చలికాలం చేసిన నులివెచ్చని సంతకాలే కదూ ఇవన్నీ..!

అసలు చలి అంటే అదీ..!

మాత్రం చలికే మనం వణికిపోతున్నాం కానీ అసలు చలి అంటే ఏంటో తెలియాలంటే రష్యాలోని సైబీరియా ప్రాంతంలోని ఒమ్యాకాన్‌ గ్రామానికి వెళ్లాలి. ప్రస్తుతం భూమి మీద అంటార్కిటికా వెలుపల ప్రజలు నివసిస్తున్న అత్యంత చల్లని ప్రదేశం అదే. వాళ్లు భూమి మీద నివసిస్తున్నారనడం కన్నా మంచు మీద నివసిస్తున్నారంటే సరిపోతుంది. సంవత్సరంలో దాదాపు 9 నెలలు వారికి నేల కనపడదు మరి. అక్కడ ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలు కాదు, మైనస్‌ 37 నుంచి 50 డిగ్రీల మధ్య ఉంటుంది. ఇటీవల ఓసారి మైనస్‌ 71కి కూడా వెళ్లిందట. సున్నా డిగ్రీలకే నీరు గడ్డకట్టుకుపోతుంది కదా, మరి అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రతల్లో అక్కడి మనుషులు ఎలా బతుకుతున్నారు! ఒమ్యాకాన్‌ గ్రామంలో దాదాపు 500 మంది జీవిస్తున్నారు. ఎముకలు గడ్డకట్టే ఆ చలి వాతావరణానికి వాళ్లు తరతరాలుగా అలవాటుపడిపోయారు. చలిని తట్టుకోవడానికి వాళ్లు తరచూ వోడ్కా తాగుతారు. ఉష్ణోగ్రత -52 డిగ్రీలకన్నా ఎక్కువకు పడిపోతేనే వూళ్లొ ఉన్న బడికి సెలవులిస్తారు. జూన్‌, జులై, ఆగస్టు నెలల్లో మాత్రమే సున్నాకి పైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అప్పటిదాకా మూడు గంటలు ఉన్న పగటి సమయం ఒకేసారి 20 గంటలవరకూ పెరుగుతుంది. ఇప్పటివరకూ అక్కడ రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 18 డిగ్రీలు. అద్దం మీద ఉఫ్‌ అని గాలి వదిలి అది మసకబారితే ఆశ్చర్యపోవడం మన బాల్య జ్ఞాపకాల్లో ఒకటి. కానీ అక్కడ... ఒక్క క్షణం నోరు తెరిస్తే లాలాజలం గడ్డకట్టి సన్నని మంచు సూదుల్లా మారి నాలుకను గుచ్చేస్తుందట. పెన్నులు రాయవు. వాహనాలు నడవవు. నీళ్లు గడ్డకట్టడం వల్ల పైపులే పగిలిపోతుంటాయి. నీటిని సరఫరా చేయాలనుకున్నప్పుడు పైపుల్ని వేడిచేసుకుంటూ వెళ్తారు. మొబైల్‌ ఫోన్లు లేవు. ఎంతో అభివృద్ధి చెందిందనుకుంటున్న నేటి సాంకేతికత అసలేమాత్రం పనిచేయని ప్రాంతమది. ధ్రువప్రాంతాల్లో నివసించే జంతువుల ఉన్నితో తయారుచేసిన దుస్తులూ పాదరక్షలే ధరిస్తారు. రెయిన్‌డీర్‌, గుర్రం మాంసాలను తింటూ వాటి పాలు తాగి బతుకుతారు. బొగ్గు, కలప కాల్చడం ద్వారా వీరు ఇళ్లలో వేడి ఉండేలా చూసుకుంటారు. ఆహారం, ఇంధనాలను సరఫరా చేసే వాహనాల ఇంజిన్లు చలికి మొరాయించకుండా ప్రత్యేకంగా తయారుచేస్తారు. వీరి సగటు ఆయుర్దాయం కూడా మూడు పదులు దాటదు. చనిపోయిన వారిని సమాధి చేయడానికి ఒక్కోసారి ఏడాది పడుతుంది. నేలమీద గుట్టల్లా పేరుకుపోయిన మంచుకుప్పలను తవ్వాలంటే వేసవి రావాలి మరి. పూర్తి జాగ్రత్తలతో చల్లటి ప్రాంతాలను సందర్శించడం అలవాటున్న పర్యటకులు తప్ప ఇతరులెవరైనా ఆ ప్రాంతానికి వెళ్తే రెండో నిమిషం వరకూ బతకలేరట!

సైబీరియా తర్వాత అలాంటి మరో ప్రాంతం మన దేశంలోని కశ్మీర్‌లోనూ ఉంది. కార్గిల్‌ జిల్లాలో ఉన్న ‘ద్రాస్‌’ అనే ఈ పట్టణంలో దాదాపు 1200 మంది జీవిస్తున్నారు. ఇక్కడ శీతాకాలం మైనస్‌ 20-23 డిగ్రీల మధ్య ఉంటే వేసవిలో సగటు ఉష్ణోగ్రత 23 డిగ్రీలు ఉంటుంది. పర్వతారోహకులకు ట్రెక్కింగ్‌ బేస్‌గా ఈ ప్రాంతం పేరొందింది.

చలి... అంత పని చేస్తుందా!

చలి కన్పించదు కానీ మన శరీరం మీదా ఆలోచనల మీదా చాలా ప్రభావమే చూపుతుంది. దీని గురించి నిరంతరం పరిశోధకులు అధ్యయనాలు జరుపుతూనే ఉన్నారు. వారు చెప్తున్న ఆసక్తికరమైన అంశాలు కొన్ని...

* చలిగా ఉన్నప్పుడు వెచ్చని కౌగిలి హాయిగొలుపుతుందనీ భాగస్వామి సాహచర్యాన్ని కోరుకుంటారనీ అందరూ భావిస్తారు. కానీ నిజానికి ఆ సమయంలో కోరుకునేది మానసిక వెచ్చదనమేనట. చేతిలో చేయి వేసి నీకు నేనున్నానన్న హామీ ఇస్తే చాలు వారి మధ్య అనుబంధం బలపడుతుందంటోంది 2012లో జరిగిన ఓ అధ్యయనం. పైగా ఈ వెచ్చదనం ఒకరి పట్ల ఒకరికి నమ్మకాన్ని కలిగిస్తుందట.
* చలి వాతావరణంలో జీవిత భాగస్వాములిద్దరూ ఒకేచోట దూరదూరంగా ఉంటే వారి మధ్య అపనమ్మకం ఏర్పడే అవకాశం ఉంటుందట. ఎక్కువ మంది విడాకుల గురించి ఆలోచించేదీ చలికాలం చివర్లోనేనట.
* ప్రకృతి సైతం స్త్రీ పురుషుల కలయికకు ఈ కాలాన్ని వేదికగా చేసుకుందేమోననిపిస్తున్నాయి కొన్ని పరిశోధనలు. చలికాలం మాత్రమే అండోత్పత్తి సమయంలో మహిళలు ఎరుపు, గులాబీ రంగు దుస్తులు ధరిస్తున్నారట. అసంకల్పితంగానే జరుగుతున్న ఈ ప్రవర్తనకి కారణం ఆకర్షణీయంగా కనబడి భాగస్వామిని ఆకట్టుకుని తద్వారా సంతానోత్పత్తికి సహకరించడమేనని పరిశోధకులు భాష్యం చెబుతున్నారు.
* చలికాలంలో నెటిజెన్లు ఎక్కువగా శృంగారానికి సంబంధించిన సమాచారాన్ని వెదుకుతున్నారని గూగుల్‌ చెబుతోంది.
* మహిళల్లో మెనోపాజ్‌ ప్రక్రియ చలికాలంలో వేగంగా జరుగుతోందనీ ఆ తర్వాత స్థానం వేసవిదనీ అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
* స్త్రీ పురుషులు ఎంతగా సాన్నిహిత్యాన్ని కోరుకున్నా చలి ఎక్కువగా ఉన్న సమయంలో శృంగారాన్ని ఆస్వాదించలేరనీ అలాంటప్పుడు పాదాలను వెచ్చగా ఉంచే సాక్స్‌ ధరిస్తే ఫలితం ఉంటుందనీ పేర్కొంటున్నాయి కొన్ని పరిశోధనలు.
* చలికాలం వ్యక్తుల సృజన శక్తిని కాస్త తగ్గిస్తుందట. కళాకారులతో పాటు కార్పొరేట్‌ సంస్థల్లో సృజనాత్మకంగా ఆలోచించాల్సిన ఉద్యోగాల్లో ఉన్నవారినీ పరిశీలించిన ఓ అధ్యయనం ఈ విషయాన్ని నిర్ధారించింది.
* వాతావరణాన్ని బట్టి నేరస్తులను చూసే దృష్టీ మారుతుందని ఓ పరిశోధన పేర్కొంటోంది. చల్లని గదిలో కొందరినీ, సాధారణ ఉష్ణోగ్రత ఉన్న గదిలో కొందరినీ కూర్చోబెట్టి ఏం నేరం చేశారో చెప్పకుండా కొందరు ఖైదీలను చూపించారు. చల్లని గదిలో ఉన్నవారు ఖైదీలందరినీ కరడు గట్టిన నేరస్థుల్లా భావిస్తే వెచ్చని వాతావరణంలో ఉన్నవారు క్షణికావేశంలో నేరం చేసిన మామూలు వ్యక్తులుగా భావించారట.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.