close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెల్ల ఎలుక కనిపిస్తే అదృష్టమే!

‘రాజస్థాన్‌ అనగానే చాలామంది జైపూర్‌, ఉదయ్‌పూర్‌, జోధ్‌పూర్‌, చిత్తోడ్‌ఘడ్‌... వంటివన్నీ చూసి సమయాభావంతో బీకానేర్‌ను వదిలేస్తుంటారు. కానీ విలాసవంతమైన హోటళ్లకీ డెస్టినేషన్‌ వెడ్డింగులకీ హనీమూన్‌ విహారానికీ అందమైన సరస్సులకీ ప్రత్యేక  ఆలయాలకీ ఒంటెల సఫారీకీ చిరునామాగా మారిన బీకానేర్‌  రాజస్థాన్‌కే మణిహారం లాంటిది’ అంటూ అక్కడి విశేషాల గురించి వివరిస్తున్నారురాజమండ్రికి చెందిన కె.రామ్మోహన్‌రావు.

 

రాజస్థాన్‌లో పర్యటించడానికి ఫిబ్రవరి, అక్టోబర్‌, నవంబరు నెలలు బాగుంటాయి. మిగిలిన నెలల్లో చలీ వేడీ ఎక్కువే. బీకానేర్‌ను ఆనుకునే థార్‌ ఎడారి ఉంటుంది. దీనికి తూర్పుదిశలో పాకిస్థాన్‌ సరిహద్దు, వాయవ్య దిశలో ఆరావళీ పర్వతాలూ ఉన్నాయి. రావ్‌ బీకాజీ అనే మహారాజు దీన్ని నిర్మించారు కాబట్టే ఈ నగరానికి బీకానేర్‌ అనే పేరు వచ్చిందట. బీకానేర్‌ మిఠాయిలకి ఎంతో ప్రసిద్ధి. తొంభై ఏళ్ల క్రితం గంగా కాలువ, ముప్ఫై ఏళ్ల క్రితం నిర్మించిన ఇందిరా కాలువలు ఈ ప్రాంతపు నీటి అవసరాలను తీర్చడంతో ఇది వేగంగా అభివృద్ధి చెందింది.  ముందుగా జునాఘడ్‌ కోటకి వెళ్లాం. కోటలోపల గంగామహల్‌, ఫూల్‌మహల్‌, కరణ్‌మహల్‌, విక్రంమహల్‌, బాదల్‌మహల్‌, హవా మహల్‌... ఇలా చాలా ఉన్నాయి. ఆ రోజుల్లో బీకానేర్‌ను పాలించిన మహారాజు గంగా సింగ్‌ అనేక దేశాల్లో పర్యటించడంతో ఆయన అభిరుచి మేరకు కోటలోని కట్టడాలను దేశ, విదేశీ శిల్పకళా శైలిలో నిర్మించారు. కోటలోపల రాజస్థాన్‌ సంస్కృతిని ప్రతిబింబించే కళాఖండాలతో కూడిన ప్రాచీన మ్యూజియం ఉంది. వాటిలో చెప్పుకోదగ్గవి కాంగ్రా సూక్ష్మ చిత్ర కళాఖండాలు. శత్రువుల దురాక్రమణకు గురికానందువల్లనేమో ఈ కోటలో ఎటుచూసినా అద్భుతమైన కళాఖండాలే. తలుపులూ గోడలూ సీలింగూ అన్నీ అద్భుతమైన చిత్రాలతోనూ శిల్పాలతోనూ బంగారు లేదా వెండి నగిషీలతోనూ అలంకరించారు. కోటను చూశాక ఇక్కడకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న లాల్‌ఘడ్‌ ప్యాలెస్‌కి వెళ్లాం. మహారాజా గంగాసింగ్‌ ఇష్టంగా నిర్మించిన ఈ కోట, ఇప్పుడు గొప్ప హెరిటేజ్‌ హోటల్‌గా మారింది. విశాలమైన ఆవరణలో పచ్చని మైదానాలూ పూలతోటల మధ్యలో ఎర్రని ఇసుక రాతితో నిర్మించిన ఈ కట్టడం చూడగానే ఆకర్షిస్తుంది. అందుకే ఇది అనేక బాలీవుడ్‌ సినిమాల్లో కనిపిస్తుంది. లోపల ఉన్న మ్యూజియంలో రాజవంశీకులు వాడిన వస్తువులనూ ఫొటోలనూ చూడొచ్చు.

 

కర్ణిమాత ఆలయం! 
ఆ తరవాత మేం కర్ణిమాత మందిరానికి వెళ్లాం. ఎలుకల ఆలయంగా పేరొందిన ఆ గుడిని చూడ్డానికి దేశంలోని నలుమూలలనుంచే కాదు, విదేశీ యాత్రికులూ వస్తుంటారు. అంతేకాదు, అక్కడి ఎలుకలను దర్శనం చేసుకున్నందుకు తమ జన్మ ధన్యమైందని పొంగిపోతూ ఉంటారు. పర్యటకులుగా వచ్చేవారి సంఖ్య కూడా ఎక్కువే. ఆ గుడిలో పాతికవేలకు పైగా నల్ల ఎలుకలూ, కొన్ని తెల్ల ఎలుకలూ ఉంటాయి. అక్కడివాళ్ల దృష్టిలో అవన్నీ దేవతలే. వాళ్ల పూర్వికులు ఎలుకలుగా పునర్జన్మ ఎత్తారని అక్కడి ప్రజల నమ్మకం. కర్ణిమాతను ఎంతగా పూజిస్తారో వాటినీ అంతే భక్తితో పూజిస్తారు. దీనికి సంబంధించిన ఓ కథ ప్రాచుర్యంలో ఉంది.కర్ణిమాత సవతి తమ్ముడు లక్ష్మణ్‌ కపిల్‌ సరోవర్‌లో మంచినీళ్లు తాగుతూ ప్రమాదవశాత్తూ నీటిలో పడి మరణించగా- అతని ప్రాణాలను పట్టుకుపోతున్న యముడిని మాత అడ్డుకుందనీ తమ్ముడిని తిరిగి బతికించమని కోరిందనీ యముడు ఒప్పుకోకపోతే తన కోరిక తీరేవరకూ భీష్మించుకుని కూర్చుందనీ చివరకు ఒప్పుకోక తప్పలేదనీ అయితే లక్ష్మణ్‌తోబాటు అప్పటికే మరణించి ఉన్న మాత పుత్రులు కూడా ఎలుకల రూపంలో పునర్జన్మ ఎత్తేటట్లు యముడు వరమిచ్చాడనీ మందిరంలోని శిష్యులు చెబుతున్నారు. ఆ కథనే పుస్తకం రూపంలోనూ ఆలయగోడలపైన చిత్రాల్లోనూ ప్రదర్శిస్తున్నారు. ఆలయంలోని ఎలుకలవల్ల చిన్న పిల్లలకు ఎలాంటి హానీ ఉండదనీ వాటివల్ల ఏ జబ్బులూ రావనీ అక్కడివాళ్లు నమ్ముతారు. అక్కడ ఎలుకల ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియని రహస్యంగా చెబుతారు. వేలకొద్దీ ఎలుకలన్నీ ఒకే పరిమాణంలో ఉండటం, వాటిలో ఎలుక పిల్లలు కనిపించకపోవడం ఇందుకు సాక్ష్యం అంటారు స్థానికులు. గర్భగుడిలో పెట్టిన ప్రసాదాన్ని ఎలుకలు ముట్టిన తరవాతనే భక్తులకు పంచుతారు. ఆలయమంతా ఎలుకలే. ఎక్కడ మా కాళ్లకింద పడి నలిగి చచ్చిపోతాయోనని భయపడుతూ గుడిని చుట్టి వచ్చాం. పొరబాటున ఎవరి కాలి కిందనైనా ఎలుకపడి చనిపోతే వాళ్లు వెండి ఎలుకను గుడికి అందజేయాలి. పాతరోజుల్లో అయితే బంగారు ఎలుకను పరిహారంగా ఇవ్వాల్సివచ్చేదట. మేం వెళ్లినరోజే ఓ కుటుంబం పరిహారం చెల్లించింది. ఎవరికైనా తెల్ల ఎలుక కనిపిస్తే వాళ్లకు అదృష్టం కలిసి వస్తుందనే నమ్మకం ఉందక్కడ. అదృష్టవశాత్తూ మాకో తెల్ల ఎలుక కనిపించింది.

 

 

ఒంటెల మ్యూజియం! 
బీకానేర్‌కు కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నేషనల్‌ రిసెర్చ్‌ ఫర్‌ క్యామెల్‌ అనే సంస్థ ఉంది. ఇక్కడ నాలుగు జాతులకు చెందిన నాలుగు వందల ఒంటెలు ఉన్నాయి. ఇందులో ఒంటెల బ్రీడింగ్‌ ఫామ్‌, మ్యూజియం, హస్తకళల విభాగం, మిల్క్‌ పార్లర్‌, రిసెర్చ్‌ సెంటర్‌ వంటి విభాగాలు ఉన్నాయి. దీన్ని చూడ్డానికి మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ అనుమతిస్తారు. వందలకొద్దీ ఒంటెల్ని చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. అరుదైన తెల్ల ఒంటె పిల్లలూ ఉన్నాయక్కడ. నాలుగైదు అడుగుల ఎత్తులో తెల్లని జూలుతో ఉన్న ఆ ఒంటె పిల్ల, పెద్ద కుక్కపిల్లలా ముద్దుగా ఉంది. క్యామెల్‌ రైడ్‌ కూడా ఉంది. అక్కడ ఉన్న ఒంటెల మ్యూజియంలో వాటి గురించిన అన్ని విషయాలనూ తెలుసుకోవచ్చు. ఒంటె చర్మంతో చేసిన బ్యాగులూ బెల్టులూ బొమ్మలూ కొనుక్కోవచ్చు. ఒంటె పన్నుతో చేసిన బొమ్మలున్న కీచెయిన్లూ ఒంటె ఎముకలతో చేసిన కళాఖండాలూ కూడా ఉన్నాయి. ఇవిగాక సావనీర్లూ శాలువాలూ దుస్తులూ చాలానే ఉన్నాయి. ప్రవేశద్వారం దగ్గర ఒంటెపాలతో చేసిన కాఫీ, టీ, లస్సీ, కుల్ఫీ, ఐస్‌క్రీమ్‌ దొరుకుతాయి. మన పాలతో పోలిస్తే అవి చాలా పలుచగా ఉన్నాయి. పాలల్లో కొబ్బరినీళ్లు కలిపిన రుచి అనిపించింది. కుల్ఫీ కూడా బాగుంది.

 

గజ్‌నేర్‌ ప్యాలెస్‌! 
బీకానేర్‌కి 32 కి.మీ. దూరంలో గజ్‌నేర్‌ ప్యాలెస్‌ ఒకప్పుడు రాజవంశీకుల విడిది. ఇప్పుడిది హెరిటేజ్‌ హోటల్‌గా మారిపోయింది. దీనికి ఆనుకునే గజ్‌నేర్‌ సరస్సూ అభయారణ్యమూ ఉన్నాయి. ఇది ఎర్రని ఇసుకరాతితో కట్టిన కట్టడమైనా అద్భుతంగా ఉంది. ఈ భవనం ముందు భాగంలో గోడలకు పెద్ద పెద్ద మెష్‌లు పెట్టి రంగుల పూలతీగల్ని వాటిమీదకి ఎక్కించేసరికి ఎంతో అందంగా కనిపించింది. ప్యాలెస్‌ లోపలకు వెళితే ఇది రాజస్థానేనా అనిపించింది. ఎందుకంటే లోపలన్నీ పచ్చనిచెట్లే. ఆకుపచ్చని ఆ చెట్ల మధ్య ఎర్రని కట్టడం ఎంతో బాగుంది. దీనికి పక్కనే సరోవరం, ఆ పక్కనే అభయారణ్యం ఉండటంతో కోటలో వాతావరణం చాలా చల్లగా ఉంది. అందుకే దీన్ని వేసవి విడిదిగా వాడుకునేవారట. ఆ చెట్ల మీద దాదాపు వంద రకాల పక్షులు నివాసం ఏర్పరచుకుంటాయట. వీటిల్లో ఎక్కువగా వలస పక్షులే. నెమళ్లు కూడా స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. భూతల స్వర్గంలా ఉన్న ఆ అందమైన ప్రాంతాన్ని చూస్తూ ప్యాలెస్‌లోకి అడుగుపెట్టాం. ఆ ప్యాలెస్‌నీ తోటనీ అక్కడ ఉన్న చిన్న గుడినీ చూశాక బోటు షికారుకి వెళ్లాం. సరోవరంలో విహరిస్తూ ప్యాలెస్‌ను చూడటం మంచి అనుభూతిని ఇచ్చింది. ఆ తరవాత అక్కడికి 20 కి.మీ. దూరంలోని కపిల్‌ సరోవర్‌కి వెళ్లాం. కొలాయత్‌ ప్రాంతంలో ఉన్న ఆ సరస్సు ఎంతో అందంగా ఉంది. తరవాత భాండసార్‌ జైన మందిరానికి వెళ్లాం. మూడు అంతస్తులున్న ఆ మందిరాన్ని 15వ శతాబ్దంలో నిర్మించారు.  దీని నిర్మాణానికి సున్నంలో నీటికి బదులు నలభై వేల కిలోల నెయ్యి వాడారట. ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా పరిరక్షణలో ఉన్న ఈ మందిరం కూడా ఎర్రని ఇసుక రాతి కట్టడమే అయినప్పటికీ స్తంభాలకీ కొన్ని గోడలకీ అందమైన శిల్పాలు చెక్కిన పసుపు రంగు ఇసుక రాతిని వాడారు. గుడిలో గోడలపైనా పై కప్పుపైనా చిత్రించిన అద్భుత చిత్రాలు చకితుల్ని చేస్తాయి. జైన తీర్థంకరుల జీవిత విశేషాలూ రాజస్థానీ ప్రజల జీవనవిధానం, రాజవంశీకుల చరిత్రను ప్రతిబింబించే చిత్రాలెన్నో ఉన్నాయక్కడ. బీకానేర్‌లో చూడదగ్గ మరో విశేషం ఇసుక తిన్నెల సఫారీ. ఒంటెల మీద ఎడారి మొత్తం చుట్టి రావచ్చు. సో... రాజస్థాన్‌ వెళితే బీకానేర్‌ను అస్సలు మిస్‌ కాకండి!

 

 

 

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.